- తల్లిలా, తండ్రిలా పనులన్నీ పూర్తైయ్యేలా అనుగ్రహించిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందే ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవల జరిగిన మరో అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. ఇటీవల ఈ కరోనా కారణంగా మాకు జీతాలు చాలా తక్కువగా ఇస్తున్నారు. కానీ మమ్మల్ని స్కూలుకి వచ్చి ఖచ్చితంగా రిపోర్టు చెయ్యాలని ప్రిన్సిపాల్ చెప్పారు. ఒకవైపు చూస్తే తక్కువ జీతం, ఇంకోవైపు చూస్తే ఇంట్లోవాళ్ళు ఈ కరోనా కారణంగా నన్ను బయటకు పంపడానికి కూడా సిద్ధంగా లేరు. దాంతో నేను చాలా సందిగ్ధంలో పడ్డాను. ఏం చేయాలో అర్థంకాక చివరికి బాబా సమాధానం తెలుసుకోవడానికి ‘స్కూలుకి వెళ్లనా, వద్దా’ అని బాబా ముందర చీటీలు వేశాను. బాబా ‘వెళ్లవద్దు’ అన్నారు. దాంతో నేను బాబా మాటకు కట్టుబడి స్కూలుకి వెళ్ళకుండా ఇంటినుంచే పనిచేయడం ప్రారంభించాను. దాంతో మా ప్రిన్సిపాల్ మీటింగ్ పెట్టి, నో వర్క్-నో పే ఆప్షన్ పెట్టి లెటర్ ఇచ్చేయండి అని చాలా కఠినంగా చెప్పింది. నాకు చాలా బాధకలిగి, ఏం చేయమంటారో చెప్పమని చీటీల ద్వారా బాబాను అడిగాను. ప్రిన్సిపాల్ అడిగినట్లే లెటర్ ఇవ్వమని బాబా నుండి సమాధానం వచ్చింది. దాంతో ఇక వేరే ఆలోచన లేకుండా లెటర్ రాసి ప్రిన్సిపాల్‌కి ఇచ్చేశాను. దాంతో ఆమె నన్ను స్కూలుకి రమ్మని బలవంతపెట్టడం మానేసింది. దీని కారణంగా నాకు ఇంటినుంచే వర్క్ చేసే అవకాశం దొరికింది.
ఇలా ఉండగా నేను తిరుపతిలోని యూనివర్శిటీకి వెళ్లి కొన్ని సర్టిఫికెట్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే మా తమ్ముడికి ఐ-సెట్ కౌన్సెలింగ్ కూడా అదే యూనివర్సిటీలో వచ్చింది. నేను యూనివర్సిటీలో సర్టిఫికెట్స్ తెచ్చుకోవటం కోసం ‘తిరుపతి వెళ్లనా, వద్దా’ అని అడుగుతూ బాబా ముందర చీటీలు వేశాను. బాబా నన్ను వెళ్లమన్నారు. “అలాగైతే తిరుమల కూడా వెళ్లనా బాబా?” అని అడిగాను. బాబా అక్కడికి కూడా వెళ్లమన్నారు. దాంతో నేను ఇంట్లోవాళ్లతో “నా సర్టిఫికెట్స్ కోసం, తమ్ముడి కౌన్సిలింగ్ కోసం ఇద్దరం కలిసి తిరుపతి వెళ్తున్నాము” అని చెప్పాను. కానీ మా తాతయ్య, “తిరుమల వెళ్లకండి. కేవలం మీ పని చూసుకొని తిరిగి వచ్చేయండి. అయినా తెలియని ప్రదేశం కదా, ఇద్దరే ఎలా వెళ్తారు?” అంటూ, తిరుపతిలో తనకు పరిచయమున్న వాళ్లింట్లోనే ఉండమని చెప్పారు. తాతయ్య మాటలకు అంగీకరించి నేను, మా తమ్ముడు కలిసి తిరుపతికి బయలుదేరాము. మేము అనుకున్న సమయనికంటే ముందుగానే తిరుపతికి చేరుకున్నాం. తాతయ్య చెప్పిన వాళ్లింటికి ముందే వెళ్లి వాళ్లని ఇబ్బందిపెట్టడం ఎందుకని భావించి, ఈలోపు బాబా దర్శనం చేసుకుందామనుకుని, తిరుపతిలో బాబా గుడి ఎక్కడుందా అని గూగుల్‌లో వెతికాను. మేమున్న చోటికి దగ్గరలోనే బాబా గుడి ఉన్నట్టు గూగుల్లో కనిపించింది. దాంతో మేమిద్దరం బాబా గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని సాయంత్రం ఆరతికి హాజరయ్యాము. నా తండ్రి ఇక్కడ కూడా నాకు తోడుగా ఉండడానికి వచ్చేశారని అనిపించి నాకు పట్టరాని సంతోషం వేసింది. ఆరతి అయిన తరువాత మా తాతయ్యకు తెలిసినవాళ్ళింటికి వెళ్ళాము. వాళ్ళింట్లో అడుగుపెట్టిన వెంటనే బాబా నాకు ఫొటో రూపంలో దర్శనమిచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ కుటుంబంలోని వారంతా సాయిబాబా భక్తులే. దాంతో బాబా నన్ను క్షేమంగా చూసుకుంటున్నారని నాకు చాలా సంతోషం వేసింది. వాళ్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.
ముందుగా మా తమ్ముడి కౌన్సెలింగ్ కోసం యూనివర్శిటీకి వెళ్లాం. అయితే అప్పటికి తన డిగ్రీ మార్క్స్ కార్డ్ రాలేదు. డిగ్రీలో ఒక సబ్జెక్ట్ రిజల్ట్ రాలేదు, మరో సబ్జెక్టు ప్రాక్టికల్‌లో తనకు ఆబ్సెంట్ వేసి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తనకు కౌన్సెలింగ్ జరగడం అసాధ్యం అని ఇంట్లో కూడా అందరూ అన్నారు. కౌన్సెలింగ్ మాత్రం ఉదయం తొమ్మిది గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటలకు అయిపోతుంది. నేను, మా తమ్ముడు కలిసి తన మార్క్స్ కార్డ్ కోసం యూనివర్శిటీలో చాలా తిరిగి చాలామందిని సహాయం చేయమని అడిగాము. కానీ వాళ్లు మమ్మల్ని గంటలు గంటలు వెయిట్ చేయిస్తూ, “ఇప్పుడు వస్తే మీకు మేము మార్క్స్ కార్డ్ ఎలా ఇస్తాం? మీరు ఇంతకుముందే రావాల్సింది. కౌన్సెలింగ్ జరుగుతున్న సమయంలో మార్క్స్ కార్డ్ కోసం వచ్చారా? ఇప్పుడు ఇవ్వడం కుదరదు” అని కఠినంగా సమాధానాలు ఇచ్చారు. సమయం చూస్తే పన్నెండు అవుతోంది. కానీ కనీసం మా తమ్ముడు ఆ రెండు సబ్జెక్టులలో పాసయ్యాడా లేదా అన్న విషయం కూడా తేలలేదు. దాంతో మా తమ్ముడు, “ఇక ఈ విషయం వదిలెయ్యి, నాకు కౌన్సెలింగ్ జరగదు. టైమ్ కూడా దాటిపోయింది. కనీసం మార్క్స్ కార్డ్ అయినా తీసుకెళ్దాం” అన్నాడు. ఆ మాట విని నాకు చాలా కోపం వచ్చింది. “ఎప్పుడూ ఇలా నెగిటివ్‌గానే మాట్లాడతావెందుకు? కాస్త వెయిట్ చేయి” అని చెప్పి నేను మళ్ళీ మార్క్స్ కార్డ్ కోసమని యూనివర్సిటీలోని అధికారుల వద్దకు వెళ్ళాను. వాళ్ళు రికార్డులు చెక్ చేసి, మా తమ్ముడు ఆ రెండు సబ్జెక్టుల్లోనూ పాసయ్యాడని చెప్పారు. కానీ మార్క్స్ కార్డ్ ఇవ్వాలంటే కాలేజీకి వెళ్లి లెటర్ తీసుకుని రావాలని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు అలా చెయ్యడానికి కుదరదు, ఎందుకంటే మా ఊరు తిరుపతికి చాలా దూరంలో ఉంటుంది. అందుచేత మేము మార్క్స్ కార్డ్ ఇప్పించమని వాళ్లను ఎంతో బ్రతిమిలాడాము. కానీ వాళ్లు చాలా మొండిగా కుదరదంటే కుదరదని చెప్పారు. తరువాత నేను బాబాతో, “ఏంటి బాబా ఇది? దయచేసి మాకు సహాయం చెయ్యండి” అని వేడుకున్నాను. తరువాత ఏదో రెకమెండేషన్ చెయ్యడం వల్ల వెంటనే మార్క్స్ కార్డ్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ మార్క్స్ కార్డ్ మాత్రం సాయంత్రం 3.30కి ఇస్తామని చెప్పారు. చేసేదిలేక మేమందుకు అంగీకరించాము. కానీ తనకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం లేదు. ఎందుకంటే మా తమ్ముడికి వచ్చిన ర్యాంకుకి 12 గంటలకే కౌన్సెలింగ్ అయిపోతుంది కాబట్టి.
ఇకపోతే నా సర్టిఫికెట్ కోసమని ఉదయం 11 గంటల నుంచి యూనివర్సిటీవారిని సంప్రదించడం ప్రారంభించాను. వాళ్లు “పోస్టు ద్వారా మీ సర్టిఫికెట్స్ మీకు పంపిస్తాము, ఇక్కడ ఇవ్వడానికి కుదరదు” అని చెప్పారు. “ఇక్కడ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది కదా, ఇక్కడే ఇవ్వండి” అని ఎంతో బ్రతిమిలాడాను. కానీ వాళ్లు, “కుదరదు, మీరు చలానా కట్టి వెళ్లండి” అని అన్నారు. బయటికి వచ్చిన తరువాత చలానా ఎక్కడ కట్టాలో, ఏమి చేయాలో తెలియక నేను వాళ్లకు ఫోన్ చేసి అడుగుతుంటే వాళ్ళు విసుక్కుని, “మీరు చలానా ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడికే రండి” అని చెప్పారు. అక్కడికి వెళ్లిన వెంటనే నా దగ్గరున్న సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని, “ఇక వెళ్ళండి, సాయంత్రం 4.30కి రండి” అని చెప్పారు. వాళ్ళు అలా అనడంతో నాకేమీ దిక్కుతోచలేదు. నా మార్క్స్ కార్డ్ రాలేదు, కనీసం మా తమ్ముడి కౌన్సెలింగ్ కూడా అవలేదు. దాంతో చాలా బాధగా అనిపించి, "బాబా! మీ అనుమతితోనే కదా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పరిస్థితులన్నీ ఇప్పుడు నువ్వే కదా చూసుకోవాలి? చూడు, అన్నీ మాకు ఎలా వ్యతిరేకంగా ఉన్నాయో" అని బాబాతో చెప్పుకుని బాధపడ్డాను. ఆ తరువాత కనీసం మా తమ్ముడి కౌన్సిలింగ్ సంగతైనా కనుక్కుందామనుకొని మా తమ్ముడితో, “నీ కౌన్సిలింగ్ గురించి మరోసారి వాళ్లను రిక్వెస్ట్ చేద్దాం పద” అని చెప్పి అక్కడికి వెళ్లాము. ఆశ్చర్యంగా వాళ్ళు, “సాయంత్రం వరకు కౌన్సెలింగ్ జరుగుతుంద”ని చెప్పారు. దాంతో నాకు సంతోషమేసింది. యూనివర్సిటీవాళ్లు సాయంత్రం 4.30కి మా తమ్ముడి మార్క్స్ కార్డ్ ఇచ్చారు. అది తీసుకుని తను కౌన్సెలింగ్‌కి వెళ్ళాడు. తన కౌన్సిలింగ్ పూర్తయింది. కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ లేదని చెప్పి మళ్లీ పెండింగ్ పెట్టారు. బాబా దయతో క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఒకే రోజులో అప్లై చేసుకున్న వెంటనే వచ్చేసింది. దాంతో తన కౌన్సెలింగ్ పూర్తయి తనకు ఒక మంచి కాలేజీలో సీటు వచ్చింది.
ఇక నా సర్టిఫికెట్స్ విషయానికి వస్తే, వాళ్లు నన్ను ఆరోజు సాయంత్రం 5 గంటల వరకు ఎదురుచూసేలా చేశారు. తర్వాత నన్ను పిలిచి, “మీ సర్టిఫికెట్స్ ఇక్కడే ఇచ్చేస్తున్నాం, తీసుకోండి” అంటూ నా సర్టిఫికెట్స్ నాకు ఇచ్చేశారు. నాకు చాలా సంతోషమేసింది. బాబా నన్ను చివరి నిమిషం వరకు పరీక్షించారు, కానీ చివరికి నా సర్టిఫికెట్స్ నాకు వచ్చేలా చేశారు. మా తమ్ముడి కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యింది. నిజం చెప్పాలంటే మా తమ్ముడికి ఐ-సెట్‌లో ర్యాంక్ రావడం కాదుకదా, కనీసం పాసవడం కూడా కష్టమే. ఎందుకంటే తను శ్రద్ధగా చదవలేదు. నిజానికి తనకు చదువు మీద అంత శ్రద్ధ లేదు కూడా. కనీసం డిగ్రీ మార్క్స్ కార్డ్ రావడం కూడా కష్టమే. కానీ బాబా ఎంతో దయతో మా తమ్ముడిని కూడా తన దగ్గరకు చేర్చుకుని తనకు మంచి కాలేజీలో సీటు వచ్చేలా చేశారు. మా తాతయ్య అంటూ ఉంటారు, “నీ తమ్ముడికి కౌన్సెలింగ్ జరగడానికి కారణం ఖచ్చితంగా నీ బాబానే! లేకపోతే తనకు కౌన్సెలింగ్ జరగడం అనేది అసాధ్యం” అని.
ఇక తిరుమల దర్శనానికి వస్తే.. ఇంట్లోవాళ్లు వద్దన్నప్పటికీ బాబా అనుమతించారు కనుక నేను ఖచ్చితంగా శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దాంతో నేను, మా తమ్ముడు కలిసి తిరుమల వెళ్లి ఎంతో ఆనందంగా శ్రీవారి దర్శనం చేసుకున్నాము. అది తెలిశాక ఇంట్లోవాళ్లు కూడా మమ్మల్ని ఏమీ అనలేదు. తిరుపతిలో మేమున్న ఇంట్లోవాళ్లతో కలిసి రెండుసార్లు బాబా గుడికి వెళ్లి ఆరతికి హాజరయ్యాను. బాబా నన్ను తిరుపతికి పంపించడమే కాకుండా అక్కడ నేను ఉండడానికి చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి తల్లిలా, తండ్రిలా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ముఖ్యంగా అక్కడ ఒక మంచి సాయికుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. నిజం చెప్పాలంటే, నేను స్కూల్లో లెటర్ ఇవ్వకుండా ఉంటే ఇంత ధైర్యం చేసి తిరుపతికి వచ్చి అంత సమయం వెచ్చించడానికి కుదిరేది కాదు. బాబా అనుమతితో స్కూల్లో లెటర్ ఇవ్వడం కారణంగానే తిరుపతిలో అన్నిరోజులు గడపగలిగాను. “బాబా! మీ మార్గం కనుక్కోవడం చాలా కష్టం తండ్రీ. మీ ప్రేమను మాటలలో వర్ణించలేము”. తిరుపతి వెళ్లి సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం లభిస్తే ఈ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మాటిచ్చాను. “బాబా! మీకు మాట ఇచ్చిన ప్రకారం నా అనుభవాన్ని పంచుకున్నాను! థాంక్యూ బాబా, లవ్ యు సో మచ్!”
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Om sai ram i liked this leela because you nerrted very nicely. You faced many troubles you loved your family very much. Sai also helped you. You are lucky dear. You have sai's blessings ����
ReplyDelete🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
ReplyDeleteఓం సాయిరాం!! ఓం సాయిరాం!!
!! ఓం మార్గబంధవే నమః!!
🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟
Om sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba amma arogyam tondarga cure cheyi thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete