సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 687వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో ఉద్యోగం
  2. కోరిక తీర్చిన ఆపద్బాంధవుడు శ్రీసాయి

బాబా అనుగ్రహంతో ఉద్యోగం


సాయి భక్తురాలు చందన తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


అందరికీ నమస్కారం. నా పేరు చందన. నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. 2019లో నేను బి.టెక్ ఉత్తీర్ణురాలినయ్యాను. చదువు పూర్తయ్యాక నాకు ఉద్యోగం చెయ్యాలని ఉండేది. కానీ మా నాన్నగారికి నన్ను దూరంగా పంపించడం ఇష్టం లేదు. అందుకే కొన్ని ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది. పోనీ ఇంట్లోనే ఉండి పోటీ పరీక్షలకి సిద్ధమవుదామంటే ప్రభుత్వ ఉద్యోగాల పట్ల నాకు ఆసక్తి ఉండేది కాదు. నాకు ప్రైవేట్ ఉద్యోగం చెయ్యాలని ఉండేది. ఈ విషయంలో మా నాన్నగారిని ఒప్పించాలని ఎంత ప్రయత్నించినా మా నాన్నగారు ఒప్పుకోలేదు. బయటివాళ్ళు, “చదువు అయిపోయింది, ఇప్పుడేమి చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా?” అంటూ నా పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చేవారు. వాళ్ళ మాటలకు నాకు చాలా కోపం, ఏడుపు వచ్చేవి. 


ఇదిలా ఉండగా, 2021, జనవరి ఒకటవ తారీఖున మా బంధువుల అమ్మాయి నాతో, “బాబా పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి” అని చెప్పింది. నాకు అప్పటినుండి బాబాపై ఇంకా నమ్మకం పెరిగింది. ఆ తరువాత మా సిస్టర్ నన్ను ఈ సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో జాయిన్ అవమని చెప్పి లింక్ షేర్ చేసింది. అప్పటినుండి నేను ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను, సాయిభక్తుల అనుభవాలను చదువుతూ ప్రతి గురువారం బాబా చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, “నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించు స్వామీ” అని కోరుకున్నాను. బాబా ఆశీస్సులతో అంతా ఒక మ్యాజిక్‌లా జరిగి కేవలం 3 రోజుల్లో నాకు ఉద్యోగావకాశం వచ్చింది. జనవరి 25న నేను ఉద్యోగంలో చేరాను. “బాబా! నాకు తోడుగా ఉంటూ, ఆఫీసులో వర్క్ నాకు నచ్చి నేను చక్కగా అడ్జస్ట్ అయ్యేలా అనుగ్రహించండి” అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆఫీసులో నాకు నచ్చిన రోల్ వచ్చింది. “థాంక్యూ సో మచ్ బాబా! మీరు నాకు చాలా సహాయం చేశారు. నాకు ఎప్పుడూ ఇలానే తోడుగా ఉండండి బాబా!”


కోరిక తీర్చిన ఆపద్బాంధవుడు శ్రీసాయి


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబా తనకి ప్రసాదించిన అనుభవాన్నిలా  పంచుకుంటున్నారు:


ఓం సాయిరాం! సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిరోజూ ఈ బ్లాగులో ప్రచురించే సాయిభక్తుల అనుభవాలను చదువుతూవుంటే ఒకలాంటి సంతోషం కలుగుతుంది. బాబా మాకు ఒక స్వంత ఇంటిని ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. మేము ఎప్పటినుంచో ఒక స్వంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము. మా అమ్మాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది. కనుక అక్కడే ఇల్లు తీసుకుంటే బాగుంటుందని భావించాము. కానీ ఎంత వెతికినా ఎక్కడా మంచి ఇల్లు దొరకలేదు. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరే మాకు స్వంత ఇంటిని చూసి పెట్టండి” అని వేడుకున్నాను. ఆ తర్వాత మావారికి తెలిసినవారి ద్వారా ఒక ఇల్లు చూడటానికి హైదరాబాదు వెళ్ళాము. ఆ ఇంటిని చూసి వచ్చాము. కానీ, ఆ ఇల్లు మా బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండటం వలన ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆ ఇంటిని మరోసారి చూడటానికి వెళ్ళాము. ఆ సమయంలో అక్కడికి ఒకావిడ వచ్చి, “మీరు ఈ ఇల్లు తీసుకుంటున్నారా?” అని అడిగింది. “ఈ ఇల్లు మా బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నాము” అని బదులిచ్చాను. అప్పుడామె, “ఇక్కడికి దగ్గరలో ఒక అపార్టుమెంటు ఉంది. అది మీ బడ్జెట్‌కు దగ్గరగా ఉంది, చూద్దురుగాని, రండి” అని మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళింది. మాకు ఆ అపార్టుమెంటు నచ్చింది. పైగా అది మా బడ్జెట్‌లోనే ఉంది. అంతేకాదు, ఆ అపార్టుమెంట్ పేరు సాయిబాలాజీ అపార్టుమెంట్. దాంతో మేము ఆ ఇంటిని కొనుక్కున్నాము. ఆయన పేరుండే అపార్టుమెంటులోనే ఇల్లు చూపించి మా కోరిక తీర్చిన ఆపద్బాంధవుడు శ్రీసాయి. “మాకు స్వంత ఇల్లు చూపిస్తే ఈ అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ ద్వారా పంచుకుంటాను” అని బాబాకు మాటిచ్చాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను.



8 comments:

  1. RamuJuly 21, 2020 at 6:52 AM
    🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏
    మధురం మధురం శ్రీ సాయి లీలామృతం
    సుమధురం సాయి దివ్య నామం!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  2. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  3. Om sai ram baba i am very happy today. We spend with grand kids very nicely, thank you baba. Please bless us

    ReplyDelete
  4. ఓం సాయిరాం
    అందరికి నమస్కారం
    బాబా అనుగ్రహం తో అందరు బాగుండాలి
    నా బంగారం తాకట్టు పెట్టాను అవసరానికి,తర్వాత అది తీసి అమ్మ కు ఇవ్వాలి.అదే సమయం లో ఆ బంగారం కి వడ్డీ కట్టలేని పరిస్థితి.వేలం వేస్తాము అని ఫోన్ చేశారు.ఎం చెయ్యాలో తోచలేదు. డబ్బు లేదు,నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అంత అడిగాను, ఎవ్వరు లేదు అన్నారు,అలాగే వారం రోజులు గడిచాయి,బాబా మీరే నాకు దారి చూపాలి అని వేడుకున్నను. చివరి గా వేరే వాళ్ళ దగ్గర ప్రయత్నం చేశాను,వాళ్ళు ఇస్తామన్నారు,నాకే ఆశ్చర్యం కలిగింది.బాబా నే నన్ను ఆదుకున్నారు.చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు బాబా.మీరు లేక పోతే నేను లేను.ఇలా బాబా నాకు చాలా విషయాల్లో సహాయం చేశారు.నన్ను ఆదుకున్నారు.ఓం సాయిరాం 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba rakshinchu thandri

    ReplyDelete
  6. Jai Sairam, sarvejana sukhinobavanthu

    ReplyDelete
  7. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo