సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 694వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:

  1. మనస్ఫూర్తిగా నమ్మితే, నమ్మకాన్ని బాబా నిలబెడతారు
  2. బాబా దయ ఉంటే చాలు

మనస్ఫూర్తిగా నమ్మితే, నమ్మకాన్ని బాబా నిలబెడతారు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


సమస్త సాయిబంధువులకు నా వందనాలు. మేము కెనడాలో నివసిస్తున్నాము. నా పేరు సాయిశ్రీ. 2018 నుండి సాయి అనుభవాల ఇంగ్లీష్ బ్లాగుని చదవడం నాకు అలవాటుగా మారింది. ఎప్పుడైనా మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు ఆ బ్లాగ్ ఓపెన్ చేసి చదవడం, బాబా ఏదోరకంగా నా సమస్యకు సమాధానం ఇవ్వడం జరిగేవి. అలాగే 2022 చివరిలో ఒకరోజు ఆ బ్లాగ్ చదువుతున్నప్పుడు నాకు ఈ తెలుగు బ్లాగ్ గురించి తెలిసింది. వెంటనే మెయిల్ సబ్‌స్క్రిప్షన్ పెట్టుకున్నాను. ఆ తరువాత నుండి ప్రతిరోజూ సాయిభక్తుల అనుభవాలను చదవడం నా జీవితంలో ఒక భాగం అయిపోయింది.


నా జీవితంలో, 2000వ సంవత్సరంలో నాకు బాబా గురించి తెలిసింది. ఆ తరువాత 2006వ సంవత్సరంలో నేను బాబా గురించి తెలుసుకోవడం, ఆయనను నమ్మడం జరిగింది. అప్పటినుండి ఇప్పటివరకు బాబా నా జీవితంలో ఎన్నో అద్భుతమైన లీలలను ప్రసాదించారు. బాబా లేకపోతే ఈ జీవితం ఏమైపోయేదో! “బాబా! ఇలాగే మా జీవితం చివరి క్షణం వరకు నీ అనుగ్రహం మామీద ఉండేలా దీవించు తండ్రీ!”


బాబా నాకు ప్రసాదించిన అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకోవడం నాకు ఇదే మొదటిసారి. ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటినుండి నా ప్రతి అనుభవాన్ని ఒక్కొక్కటిగా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని బాబా నాకు అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాను. మాకున్న అతి పెద్ద సమస్య పరిష్కారమైతే ఆ అనుభవాన్నే మొదటి అనుభవంగా మీ అందరితో పంచుకోవాలని సెప్టెంబరు, 2020 నుండి ఎదురుచూస్తున్నాను. కానీ, ఎందుకనో బాబా దానిని అనుగ్రహించలేదు. బాబా ఆదేశం మరోలా ఉంది. బాబా నా మనస్సు మార్చి మీతో ముందుగా ఇప్పుడు చెప్పబోయే అనుభవాన్ని పంచుకునేలా చేశారు. ఆ చిత్రం ఏమిటో చూడండి.


2021, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి పడుకునే సమయానికి ఉన్నట్టుండి ఒక పనికోసం మావారు ల్యాప్‌టాప్ ఆన్ చేశారు. ఆన్ చేయడంతోనే ఒక్కసారిగా స్క్రీన్ అంతా ఒకరకంగా బ్లాంక్‌గా అయిపోయింది. ఇక ఎంతకీ ఆన్ అవలేదు. దాంతో అసలేమైందో చూద్దామని ల్యాప్‌టాప్‌ని టేబుల్ మీదనుండి తీయగానే దానిక్రింద నీళ్లు నిలిచివుండటం గమనించాము. నీళ్లు అక్కడికి ఎలా వచ్చాయో మాకు అర్థం కాలేదు. మాకు 5 సంవత్సరాల బాబు ఉన్నాడు. బాబుని అడిగితే, “ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడో నీళ్ళు పడిపోయాయి, టేబుల్ మీద ఉండే టిష్యూతో క్లీన్ చేశాన”ని చెప్పాడు. చిన్నబాబు అవడం వల్ల ల్యాప్‌టాప్ క్రిందికి నీళ్ళు వెళతాయని ఆలోచించలేకపోయాడు. అంతకుముందు రెండు రోజుల నుండి నేను కూడా ల్యాప్‌టాప్ ఆన్ చేయలేదు. అందుకని ఆ నీళ్ళు ఎప్పటినుండి అక్కడ ఉన్నాయో తెలియదు. ల్యాప్‌టాప్‌ ఓపెన్ చేసి చూస్తే నీళ్ళు లోపలకు వెళ్ళిపోయి ఉన్నాయి. చాలావరకు లోపల పార్టులలో నీళ్ళు ఉన్నాయి. మాకు గుండె ఆగినంత పనైంది. మాకు సంబంధించిన ప్రతీ ఒక్క ముఖ్యమైన డేటా, ఇంకా మా పెళ్ళయినప్పటినుండి మా జ్ఞాపకాలన్నీ అందులోనే ఉన్నాయి. హార్డ్‌డిస్క్‌లోకి కూడా నీళ్ళు వెళ్ళినట్లయితే ఆ డేటా, ఆ జ్ఞాపకాలు అన్నీ పోతాయేమోనని చాలా భయపడిపోయాము. నేను వెంటనే బాబా దగ్గరకెళ్ళి, “బాబా! ఎలాగైనా నీ దయతో ల్యాప్‌టాప్‌ ఆన్ అయ్యేలా చూడు తండ్రీ! మీ దయవల్ల ల్యాప్‌టాప్‌ ఆన్ అయితే, నా మనసు మార్చుకుని, నేను పట్టుబట్టి ఏ అనుభవమైతే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో మొదటగా పంచుకోవాలని అనుకుంటున్నానో దానికంటే ముందే ఈ అనుభవాన్ని పంచుకుంటాను” అని మనస్ఫూర్తిగా బాబాను వేడుకున్నాను. అద్భుతం! 5 నిమిషాల్లో మావారు ల్యాప్‌టాప్‌ పార్టులు తీసి తుడవడం, వాటిని డ్రయ్యర్‌తో డ్రై చేయటం, ల్యాప్‌టాప్‌ ఆన్ చేయడం, చిత్రంగా ల్యాప్‌టాప్‌ ఆన్ అవడం జరిగాయి. 10 రోజుల క్రితం మావారు ల్యాప్‌టాప్‌లో క్రొత్త 8 GB RAM వేశారు. అది మాత్రం నీళ్ళలో పూర్తిగా తడవడం వల్ల పాడయిపోయింది. ఇక పాత RAM తో ఎప్పటిలా ల్యాప్‌టాప్‌ రన్ అయింది. పెద్దమొత్తంలో నష్టం జరగకుండా, డేటా ఏమీ నష్టపోకుండా, ల్యాప్‌టాప్‌ పాడవకుండా, మా జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా బాబా అనుగ్రహించారు. “బాబా! శతకోటి వందనాలు తండ్రీ!”


రెండవ అనుభవం:


పై అనుభవం జరిగాక ఇంకో చిన్న అద్భుతం జరిగింది. నిజంగా మనం మనస్ఫూర్తిగా బాబా మీద భారం వేసి, ‘అన్నీ ఆయనే చూసుకుంటారు’ అని నమ్మితే మన నమ్మకాన్ని బాబా ఎలా నిలబెడతారో చూడండి. పైన జరిగినదంతా గమనిస్తున్న మా బాబు, “ల్యాప్‌టాప్‌ ఎలా ఆన్ అయింది?” అని నన్నడిగాడు. “ఇదంతా బాబానే చేశారు” అని చెప్పాను. అది విన్న మా బాబు పరిగెత్తుకుంటూ తన బొమ్మల కప్‌బోర్డ్ దగ్గరకెళ్ళి, అందులోనుండి దాదాపు రెండు నెలలుగా పనిచేయని తనకు ఇష్టమైన ‘వాయిస్ కమాండింగ్ కారు’ని బాబా వద్దకు తీసుకుని వెళ్ళి, “నా కారు కూడా రిపేర్ చేయి బాబా” అని చెప్పి ఆ కారుని బాబా దగ్గర పెట్టి వచ్చి పడుకున్నాడు. ఇదంతా చూస్తున్న మేము వాడు చేసిన పనికి నవ్వుకుని వాడిని ఏమీ అనలేక ఊరుకున్నాము. 


ఆ మరుసటిరోజు మా బాబు లేచి కారుని ఆన్ చేశాడు. అయితే ఎప్పటిలాగానే అది ఆన్ అవలేదు. అయితే మా బాబు, “బాబా దీనిని రిపేర్ చేయలేదు. బాబా దగ్గర దీనిని రిపేర్ చేయడానికి టూల్‌కిట్ లేదు కదా, నేను బాబాకి టూల్‌కిట్ ఇస్తాను” అని చెప్పి తన టూల్‌కిట్ తీసుకొచ్చి కారు దగ్గర పెట్టి, “ఇప్పుడు రిపేర్ చేయి బాబా” అని చెప్పి ఆ రోజంతా అలాగే వదిలేశాడు. మేము పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఈ విషయం తనే మర్చిపోతాడులే అనుకున్నాము. కానీ, మరుసటిరోజు లేవగానే మా బాబు తన కారును బాబా దగ్గర నుండి తెచ్చుకుని ఆన్ చేయగానే, ఆశ్చర్యకరంగా ఈ రెండు నెలలలో ఎప్పుడూ ఆన్ కాని కారు, దాని రిమోట్ ఎప్పటిలా లైట్లు వచ్చి ఆన్ అయ్యాయి. దాని వాయిస్ కంట్రోల్ కూడా చక్కగా పనిచేసి బాబు చెప్పినట్లు కారుని డ్రైవ్ చేసింది. దాంతో బాబు సంతోషంతో గెంతులేశాడు. బాబా చేసిన అద్భుతాన్ని చూసి మేము కూడా ఎంతో ఆశ్చర్యపోయాము. ఇంతటి ఆనందాన్ని ప్రసాదించిన బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


బాబా దయ ఉంటే చాలు


నా పేరు ప్రసన్నలక్ష్మి. నేను మన ప్రియమైన సాయికి భక్తురాలిని. నాకు బాబాపై పూర్తి నమ్మకం మరియు విశ్వాసం. ఎల్లప్పుడూ నేను బాబా ధ్యాసలో ఉంటాను. ఒకసారి నాకు సి-సెక్షన్ (సిజేరియన్) జరిగి బాబా అనుగ్రహంతో పాప పుట్టింది. ఆపరేషన్‌కి ముందు డాక్టర్ నా గర్భసంచీలో రెండు కణుతులు (ఫైబ్రాయిడ్స్) ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, ఆపరేషన్ సమయంలో బ్లీడింగ్ బాగా అవుతుందనీ, కాబట్టి బ్లడ్ కావాల్సి వస్తుందనీ అన్నారు. దాంతో మేము చాలా ఆందోళన చెందాము. కానీ బాబా దయవల్ల ఆపరేషన్ సమయంలో నాకు బ్లడ్ అవసరం లేకుండా పోయింది. బ్లడ్ అవసరం లేకుండా నన్ను కాపాడిన సాయిబాబాకి నా శతకోటి ధన్యవాదాలు. “ఇంత అద్భుతమైన లీలను నాకు ప్రసాదించినందుకు, నా అనుభవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ బాబా!”




9 comments:

  1. Om sai ram udi has power to cure diseases. Baba gave us that gift to human beings. Today we have vaccine. Udi is medicine to us we, must believe in udi

    ReplyDelete
  2. 🙏⚜️🌷🙏⚜️🌷🙏⚜️🌷🙏⚜️🌷🙏⚜️🌷
    సాయి పాదుకా మహిమ స్తోత్రం
    ------------------------------
    సదా నీంబ వృక్షాస్య మూలాధి వాసాత్
    సుధా స్రావినం తిక్త్య మప్యా ప్రీయంతం
    తరుమ్ కల్ప వృక్షధికం సాదయంతం
    నమామీస్వరం సద్గురుమ్ సాయినాథ మ్
    🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷🌟🌷

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba amma ki problem tondarga cure cheyi baba pleaseeee

    ReplyDelete
  6. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo