సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 672వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబాను తలచుకోగానే మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి
  2. బాబా నా భక్తికి గొప్ప ఫలాన్ని ఇచ్చారు

బాబాను తలచుకోగానే మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి


ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. గత కొన్ని నెలలుగా ఈ బ్లాగులోని సాయిలీలలను క్రమంతప్పకుండా చదివే భాగ్యాన్ని బాబా నాకు కల్పించారు. ఇందులో పంచుకుంటున్న సాయిభక్తుల అనుభవాలను ప్రేరణగా తీసుకుని నేనూ నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.


నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. ప్రతిక్షణమూ బాబా ఎన్నెన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు. వాటిలో కొన్ని:


మొదటి అనుభవం:


మా ఇంట్లో గత పదేళ్ళుగా వాడుతున్న గీజర్ కొన్నాళ్ళ క్రితం పాడయ్యింది. సంవత్సరానికోసారి దాని హీటింగ్ కాయిల్ చెడిపోవడం మామూలు విషయమే. ఎప్పటిలానే కంపెనీ టెక్నీషియన్ కాయిల్ మార్చాడు. అప్పటికి బాగానే ఉంది. కానీ ఓ నాలుగైదు రోజులకి మళ్ళీ నీళ్ళు వేడెక్కటం లేదు. టెక్నీషియన్ ఈసారి థర్మోస్టాట్, కటౌట్ మార్చాడు. వారంరోజుల తర్వాత గీజర్ మళ్ళీ పాడయ్యింది. ఈ పర్యాయం వైరేదో కాలిపోయిందని దాన్ని మార్చాడు. ఇప్పటికి ఆ గీజర్ రిపేర్ల కోసం దాదాపు 2000 రూపాయలు ఖర్చయ్యింది. ఖర్చు కంటే ముఖ్యం ఆ వస్తువు మీద అపనమ్మకం. ఎప్పుడు పని చేస్తుందో ఏమో అగమ్యగోచరం. గత పదేళ్ళలో ఇలా ఎప్పుడూ జరగలేదు. వైరు మార్చిన నాలుగు రోజులకే మళ్ళీ గీజర్ పాడైంది. ఎందుకిలా జరుగుతోందో అర్థం కావట్లేదు. “బాబా, ఏంటీ పరీక్ష? ఈ గీజర్ సమస్యను ఈసారైనా శాశ్వతంగా పరిష్కరించు తండ్రీ” అని మనసులోనే బాబాను ప్రార్థించాను. అదేరోజు సాయంత్రం గీజర్ ఉన్న బాత్రూంలో లైటు వెలుగుతూ వెలుగుతూనే ఆరిపోయింది. ఇక తప్పదని ఎలక్ట్రీషియన్ని పిలిచాము. అప్పుడు బయటపడింది, కరెంట్ ఒక ఫేజే వస్తోందని. ఆ తరువాత గీజర్ ఏ సమస్యా లేకుండా నడుస్తోంది. బాబాను తలచుకోగానే మన సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారమవుతాయి. ఇది చిన్న విషయమే అయినా ఆ సాయిదేవుని మీద మన నమ్మకాన్ని పెంచే మరో సందర్భం.


రెండవ అనుభవం:


ఈ అనుభవం మా అబ్బాయి పదోన్నతి గురించి. తను గత రెండు సంవత్సరాలుగా తన ఉద్యోగంలో ట్రైనింగులో ఉన్నాడు. ఈ సమయంలో తను పని చేస్తూనే అప్పుడప్పుడూ కంపెనీ నిర్వహించే పరీక్షలు వ్రాస్తూ ఉండాలి. అవేగాక ఆ ఉద్యోగానికి సంబంధించిన మరికొన్ని టెస్టులూ పాసవ్వాలి. అలాగే తను పనిచేసే చోట మేనేజర్లు కూడా తన పనికి మార్కులేస్తారు. పని చేస్తుండటం వల్ల మా అబ్బాయికి పరీక్షల ప్రిపరేషన్‌కి సమయం దొరికేది కాదు. పైన చెప్పిన వాటన్నిటినుండి 70 శాతం మార్కులు సాధిస్తే తనకు రెండు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి పదోన్నతి వస్తుంది. కొన్ని పరీక్షల్లో మార్కులు అప్పటిప్పుడే తెలిసేవి. మేనేజర్లు ఇచ్చేవి మాత్రం తెలియవు. అందుకని వాడు బాగా ఆందోళనపడుతూ ఉండేవాడు. అదీగాక కొద్ది నెలల క్రితమే వాడికి పెళ్ళి కూడా అయ్యింది. మా కోడలికి కూడా తన భర్త ఉద్యోగ విషయంలో ఆందోళనగా ఉండేది. ఈ పరిస్థితిలో మనందరికీ దిక్కు ఆ సాయిదేవుడే. ఆయన మీదే భారం వేశాము. జీవితంలో మొదటి ప్రమోషన్. రెండేళ్ళ కష్టానికి ఫలితం. తనమీద, తన పనిమీద, తన ప్రవర్తనమీద - మొత్తం జీవితంమీద నమ్మకం దృఢపడే సందర్భం. “ఎలాగైనా ఈ మెట్టెక్కిచ్చి తనమీద తనకు నమ్మకం పెరిగేలా చూడు సాయినాథా!” అని అందరం మనసారా సాయిదేవుడిని కోరుకున్నాం. మన తండ్రి ఎన్నడూ మనల్ని నిరాశపరచడు. సాయికృపతో మా అబ్బాయికి జీవితంలో మొదటి పదోన్నతి లభించింది. “ఎంతో సంతోషం సాయిబాబా. ఎల్లవేళలా అందర్నీ రక్షించు తండ్రీ!”  


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా నా భక్తికి గొప్ప ఫలాన్ని ఇచ్చారు

సాయిభక్తురాలు 'సాయి అర్చన' తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నేను సాయి కుమార్తెని. సాయి బిడ్డలందరికీ ఓం సాయిరామ్! నా పేరు సాయి అర్చన. నాకు సాయే సర్వం. సర్వదేవతా రూపాలను నేను నా సాయిగానే భావిస్తాను. "బాబా! ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి దేవా".

నేను రెండవసారి గర్భం దాల్చినప్పుడు చెక్-అప్ కోసం డాక్టరుని సంప్రదించాను. అప్పుడు డాక్టర్, "గతసారి మీకు గర్భస్రావం జరిగింది. దానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేయలేదు. ఈసారి కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది. బిడ్డ అంగవైకల్యంతోగానీ, మానసికవైకల్యంతోగానీ జన్మించవచ్చు" అని చెప్పారు. దాంతో నేను ఢిల్లీలోని పలువురు వైద్యులను సంప్రదించాను. అందరూ 'అబార్షన్ చేయించుకో'మనే చెప్పారు. చివరి ప్రయత్నంగా నేను బాబా భక్తురాలైన డాక్టర్ శ్వేతను సంప్రదించాను. ఆమె, “మన చేతుల్లో ఏమీలేదు. మనం సమస్యను బాబా దివ్య పాదకమలాల వద్ద విడిచిపెట్టి, మన ప్రయత్నం మనం చేద్దాం. అప్పుడు ఫలితం ఏమిటో చూద్దాం” అని చెప్పింది. అప్పటినుండి నేను కాన్పు వరకు ప్రశాంతంగా నిద్రపోలేదు. తొమ్మిది నెలలు బాబా స్మరణతోనే గడిచాయి.

నెలల నిండి కాన్పుకోసం నేను హాస్పిటల్‌కి వెళ్తుంటే, బాలాజీ రూపంలో నా బాబా చాలాసార్లు దర్శనం ఇచ్చారు. హాస్పిటల్ వెలుపల బాలాజీ భజన కూడా జరుగుతోంది. బాబా దయవల్ల నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. నేను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చాను. నేను మొదటిసారి నా కొడుకును చూసినప్పుడు, బాబా యేసుక్రీస్తు ఫోటో రూపంలో నా ముందు ఉన్నారు. తరువాత ఒక మహిళ, "నీవు పురిటినొప్పులు భరిస్తున్నంతసేపు నేను నిరంతరాయంగా బాబాను స్మరిస్తూ ఉన్నాన"ని చెప్పింది. నా కొడుకుకి మేము 'సాయి దర్శన్' అని పేరు పెట్టుకున్నాము. వాడికి ఇప్పుడు 9 సంవత్సరాలు. బాబా దయవల్ల తను పూర్తి ఆరోగ్యవంతుడు, మంచి మేధావి. తను బాల సాయిభక్తుడు. తను బాలల సాయిచరిత్ర పారాయణ చేస్తూ ఉంటాడు. చూశారా! బాబా నా భక్తికి గొప్ప ఫలాన్ని ఇచ్చారు. బాబా కీర్తిని కొనియాడటానికి పదాలు సరిపోవు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



7 comments:

  1. Very nice sai leela when I wake up in the morning I read these Baba's leelas.I enjoy my day with Babas blessings.Om Sai Ram

    ReplyDelete
  2. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sai ram baba neene namukuna thandri sahayam cheyi thandri rakshinchu thandri please sai sai sai sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo