సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 688వ భాగం.....




ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయిబిడ్డలకు ఏదైనా సాధ్యమే
  2. బాబా దయవలన నార్మల్ డెలివరీ

సాయిబిడ్డలకు ఏదైనా సాధ్యమే


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ఓం శ్రీసాయి సకలార్థప్రదాయ నమః


ఏది అర్థించినా సత్వరమే ప్రసాదించే సాయినాథుని దివ్యచరణాలకు నమస్కరిస్తూ, ఈమధ్య నా సాయితల్లి ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఈ అనుభవాలను మీతో పంచుకుంటానని బాబాకు మాట ఇచ్చాను. “కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బాబా. ఆ ఆలస్యానికి కారణం కూడా నీకు తెలుసు కదా! మా కుటుంబానికి నువ్వు ఇచ్చిన అతి పెద్ద ఆశీర్వాదంతో ఇన్ని రోజులు పంచుకోవటం వీలు కాలేదు. ఇప్పుడు పంచుకుంటాను”.


మొదటి అనుగ్రహం:


ఒక క్లిష్టసమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన చెల్లికి ఈమధ్య కొంచెం జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరమే అయినప్పటికీ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితుల దృష్ట్యా అందరం భయపడ్డాము. పైగా తనకు చిన్న బాబు కూడా ఉన్నాడు. చెల్లికి జ్వరం రావటంతో ముందుజాగ్రత్తగా వెంటనే ఆ బాబుని వాళ్ల నానమ్మ ఇంటికి పంపేశారు. నేను బాబాకు నమస్కరించుకుని, “చెల్లికి వెంటనే జ్వరం తగ్గిపోయి, తన బాబు త్వరగా తన దగ్గరకు వచ్చేలా అనుగ్రహించండి బాబా” అని మ్రొక్కుకున్నాను. బాబాను ప్రార్థించిన తరువాత బాబా ఆశీస్సులతో చెల్లికి మళ్ళీ ఇంక జ్వరం రాలేదు. మరో నాలుగు రోజుల్లో తన బాబు తన దగ్గరకు వచ్చేశాడు. “థాంక్యూ బాబా!” 


రెండవ అనుగ్రహం:


మా బంధువుల్లో ఒకరికి కరోనా వచ్చింది. రెండు మూడు రోజుల్లో తన భార్యకు కూడా కరోనా వచ్చేసింది. వాళ్ళకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ దంపతుల్లో భార్య ఆరోగ్యం బాగానే ఉన్నా, భర్తకు మాత్రం చాలా సీరియస్ అయింది. మెరుగైన చికిత్స కోసం తనను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంచారు. కానీ తనను పరీక్షించిన డాక్టర్లు తను కోలుకుంటాడన్న ఆశ లేదన్నారు. తనను బ్రతికించుకోవటానికి వాళ్లింట్లోవాళ్ళు తమ శక్తికి మించి ఖర్చు పెట్టారు. నాకు ఈ విషయం తెలిసి తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని బాబాకు మ్రొక్కుకుని సంకల్ప పారాయణ చేయించాను. బాబా ఆశీస్సులతో అతని ఆరోగ్యం మెరుగై త్వరలోనే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. హాస్పిటల్ వాళ్ళు కూడా తన ట్రీట్‌మెంట్‌కు అయిన మొత్తం బిల్లులో సగం కంటే తక్కువ తీసుకున్నారు. అంతా బాబా ఆశీర్వాదం. “థాంక్యూ బాబా!”


మూడవ అనుగ్రహం:


ఈమధ్యనే పుట్టిన నా మేనల్లుడికి బర్త్ సర్టిఫికెట్ తీసుకుందామని దానికోసం అప్లై చేశాము. హాస్పిటల్ వాళ్ళు బాబు పుట్టినతేదీని తప్పుగా ఇవ్వటంతో దాని ప్రకారమే బర్త్ సర్టిఫికెట్ వచ్చింది. తేదీ సరిచేయిద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ప్రతి ఒక్కరూ “తేదీ మార్చటం కుదరదు, ఇలాగే కంటిన్యూ అయిపోండి” అని సలహాలు ఇచ్చేవారు. సర్టిఫికెట్లో తేదీ సవరించాలంటే తమ పొరపాటు వల్ల తేదీ తప్పుగా వచ్చిందని హాస్పిటల్ వాళ్ళు లెటర్ ఇవ్వాలి. కానీ, దానివల్ల హాస్పిటల్‌కి చెడ్డపేరు వస్తుందని వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. పైగా, “కేవలం తేదీ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు?” అని కూడా అన్నారు. కానీ, మేము పట్టు వదల్లేదు. మాకు అలా తేదీ తప్పుగా ఉండటం ఇష్టం లేదు. తేదీని మార్పించడానికి మా తమ్ముడు చాలా ప్రయత్నాలు చేశాడు. రాజకీయనాయకులను కూడా సంప్రదించాడు. వాళ్ళు కూడా మార్చడం కుదరదని చెప్పారు. అసాధ్యాలను సుసాధ్యం చేసే బాబా ఉండగా అనవసరంగా వాళ్ళనీ వీళ్ళనీ అడిగాము. నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నువ్వే మాకు దిక్కు. నీ అనుగ్రహంతో తేదీ మార్పుతో బర్త్ సర్టిఫికెట్ వస్తే సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని పిలిచి చాలాసేపు ఏవేవో చెప్పి ఒప్పించాలని చూశారు. మేము న్యాయపరంగా వెళ్తామని చెప్పాము. వాళ్ళు చెప్పినదానికి మేము ఒప్పుకోవట్లేదని చివరికి తప్పనిసరై తాము తేదీ తప్పుగా ఇచ్చినట్టు లెటర్ రాసిచ్చారు. రెండు మూడు రోజుల తరువాత సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు మాకు కాల్ చేసి రమ్మన్నారు. మళ్ళీ ఏదో చెప్పి మమ్మల్ని ఒప్పించటానికి పిలుస్తున్నారేమోనని అనుకున్నాము. వాళ్ళను కలవటానికి మా తమ్ముడు వెళ్ళాడు. ఆశ్చర్యం! సరైన తేదీతో ఉన్న సర్టిఫికెట్‌ను వాళ్ళు మా తమ్ముడి చేతికి ఇచ్చారు. మేము ఎంత సంతోషించి ఉంటామో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. జరిగినదంతా తెలిసి ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోయారు, ‘ఎవ్వరికీ ఇలా జరగలేదు, పైగా ఇంత తక్కువ సమయంలో’ అని. ‘సాయిబిడ్డలకు ఏదైనా సాధ్యమే’ అని వాళ్ళకి తెలీదు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. సర్టిఫికెట్ మా చేతికి వచ్చింది గురువారంరోజున. ఇంతకంటే నిదర్శనం కావాలా అంతా నడిపింది నా బాబానే అని చెప్పడానికి. నిజానికి సర్టిఫికెట్ బుధవారమే రావాలట, కానీ అది ఇచ్చే ఆఫీసర్ ఆరోజు లీవులో ఉండటంతో మాకు సర్టిఫికెట్‌ను గురువారం ఇచ్చారు. నీటితో దీపాలు వెలిగించిన సాయి తన బిడ్డల జీవితాల్లోని చీకట్లను తొలగించే దీపాలు వెలిగించకుండా ఉంటారా!


సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!

శుభం భవతు!


బాబా దయవలన నార్మల్ డెలివరీ


పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి, నా తోటి సాయిభక్తులకు నా నమస్కారాలు. పిలిచిన వెంటనే పలికే దైవం బాబా. అడుగడుగునా బాబా మనల్ని కాపాడుతూ ఉంటారు. నా జీవితంలో ఎన్నోసార్లు బాబా నన్ను ఆదుకున్నారు. ఇక నా అనుభవంలోకి వస్తే... 


మా అక్క గర్భవతిగా ఉన్నప్పుడు, తనకున్న కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కాన్పు చాలా కష్టమవుతుందని డాక్టర్లు చెప్పారు. అది విని మేము చాలా కంగారుపడ్డాము. బాబానే మా అక్కను కాపాడగలరనే నమ్మకంతో నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! మా అక్కకి ఎటువంటి ప్రాణాపాయం కలుగకుండా డెలివరీ అయి, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండేలా అనుగ్రహించు తండ్రీ!” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. బాబా దయవలన మా అక్కకి నార్మల్ డెలివరీ అయింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహమే! “థాంక్యూ సో మచ్ బాబా!”



8 comments:

  1. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  2. What is sankalpa parayana. Your sai leelas are very nice. Today 2 experiences are very nice I liked it very much. Om sai baba������

    ReplyDelete
  3. సాయి బంధువులు అందరికి నా నమస్కారములు, నా గురించి చెప్పాలంటే నా జీవితంలో సాయి లేని ఏ విషయం కూడా లేదు. చదువు, ఉద్యోగం, పెళ్లి అలా అన్ని విషయాలలో సాయి తోడు ఉండి నడిపించారు. ముఖ్యంగా నా వివాహముకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ప్రేమ వివాహము అలాగే కులాంతర వివాహము కావున చాల సమస్యలు వచ్చాయి. కాని ఇద్దరుము సాయి భక్తులు అవటం వలన సాయి పై పూర్తి భారాన్ని వదిలిపెట్టి బాబా చెప్పిన శ్రద్దా, సబూరీ తో ఉండటం వలన సాయి మాకు విజయాన్ని అందించారు. మాకు బాబా పైగల నమ్మకం నిజం అయింది. మా పై బాబా దయ, కృప ఎల్లప్పుడు ఉండాలి అని అని ప్రార్థిస్తూ, బాబాకు ధన్యవాదాలు తెలుపుతూ, మరొక అనుభవంతో మళ్లీ కలుసుకుంటాను🙏🙏

    ReplyDelete
  4. 🙏🙏🙏Om srisairam Om srisairam Om srisairam thank you sister.

    ReplyDelete
  5. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH.. Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo