సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 678వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. సాయి కృపతో సమస్యలు పరిష్కారం
  2. బాబా గైడెన్స్

సాయి కృపతో సమస్యలు పరిష్కారం


సాయిభక్తుడు రఘు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు రఘు. నేను ఎప్పటినుంచో సాయిభక్తుడిని. కానీ కొన్ని కారణాలవల్ల ఐదు సంవత్సరాలు బాబాకు దూరంగా ఉండిపోయాను. అయినా బాబా ప్రేమతో మళ్ళీ నన్ను అక్కున చేర్చుకున్నారు. బాబా నాకు చాలా అనుభవాలను ప్రసాదించారు. వాటిలో ఈమధ్యకాలంలో జరిగిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను.


మా నాన్నగారు సాయి పాదాలలో ఐక్యమైన తరువాత మా అమ్మ వేరే ఊరికి వెళ్లి ఒక అద్దె ఇంటిలో నివసించడం ప్రారంభించింది. ఒక్కోసారి మా దగ్గరకు వస్తుంటుంది. ఒకరోజు హఠాత్తుగా ఆ ఇంటి ఓనర్ వెంటనే ఇల్లు ఖాళీచేయమని చెప్పింది. హఠాత్తుగా అలా చెప్పటంతో మేము కంగారుపడ్డాము. ఈ కరోనా సమయంలో ఇంటికోసం వెతకాలంటే భయమేసింది. బాబాను ప్రార్థించి, "త్వరగా ఒక మంచి ఇల్లు అద్దెకు దొరికేలా అనుగ్రహించమ"ని వేడుకున్నాము. కానీ ఎక్కడా సురక్షితంగా ఉండే ఇల్లు దొరకలేదు. నేను బాబాకు నమస్కరించుకుని, “ఈ సమస్య పరిష్కారమై చక్కని ఇల్లు దొరికితే నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. బాబాను ప్రార్థించిన వెంటనే రోడ్డు ప్రక్కనే ఒక చక్కని ఇల్లు అద్దెకు లభించింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.


మరో అనుభవం:


ఒక స్థలం విషయంలో నేను అనుభవిస్తున్న సమస్యను బాబా ఏ విధంగా పరిష్కరించారో ఇప్పుడు మీతో పంచుకుంటాను. మా కుటుంబమంతా చింతలపూడి అనే ఊరిలో ఉండేవాళ్ళము. మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా పనిచేసి సర్వీసులో ఉన్నప్పుడే సాయి పాదాలలో ఐక్యమయ్యారు. డాడీ సేవింగ్స్‌తో వచ్చిన డబ్బులతో ఆ ఊరిలోనే 1000 గజాల స్థలం కొన్నాము. తరువాత మా ఉద్యోగరీత్యా మేము వేరే ఊరికి వెళ్ళాము. మేము కొన్న స్థలానికి ప్రక్కవాళ్ళు, ఆ ప్రక్కవాళ్ళు గొడవపడి కోర్టులో కేసులు వేసుకొన్నారు. ఆ గొడవతో మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ మా పేరు కూడా కోర్టు నోటీసులో చేర్చారు. అంతేకాకుండా, మా స్థలానికి సరిహద్దులు చెరిపేసి మా స్థలంలోని 100 గజాలను ఆక్రమించారు. మేము ‘ఇదేమి అన్యాయం?’ అని అడిగితే, సాక్ష్యం కోసం మిమ్మల్ని కలుపుకున్నాము అని చెప్పారు. దాంతో మేము కూడా కోర్టు నోటీసు ఇచ్చాము. కానీ కోర్టు కేసుని వాయిదా వేస్తూ ఉన్నది. ఈ సమస్యతో మేము మానసికంగా చాలా ఇబ్బందిపడ్డాము. నేను ప్రతినిత్యం ఈ సమస్యను పరిష్కరించమని బాబాను ప్రార్థించేవాడిని. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. కరోనా వల్ల మేము హైదరాబాదులోనే ఉండిపోయాము. బాబా ఇక్కడే తమ మహిమ చూపారు.


మాకు తెలిసినవాళ్ళు ఇల్లు కట్టుకుంటూ అందుకు అవసరమైన మట్టి తీసుకొచ్చి మా స్థలంలో పోశారు. అప్పుడు మేము మా స్థలం ఆక్రమించిన అతనికి ఫోన్ చేసి, “మేము మా స్థలాన్ని చదును చేయాలనుకుంటున్నాము. మీరు సరిహద్దులు దాటి మా స్థలాన్ని ఆక్రమించారు, మీరు వస్తే మనం మళ్ళీ సరిహద్దులు కొలుచుకుందాం” అని చెప్పాము. అందుకతను ఒప్పుకుని, "15 రోజుల తరువాత కొలుచుకుందామ"ని చెప్పాడు. నేను బాబాను ప్రార్థించి, "ఈ స్థలం సమస్య పరిష్కారమైతే ఆ అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవలన ఎటువంటి సమస్యలూ లేకుండా మా స్థలాన్ని కొలుచుకొని సరిహద్దులు నిర్ణయించుకున్నాము.


“బాబా! నా అనార్యోగం విషయంలో సహాయం చేసి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నా కూతురి ఆరోగ్యం విషయంలో కూడా మీ సహాయం కావాలి బాబా. తనకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఫుడ్ ఎలర్జీ వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తోంది. తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా! మా ఆరోగ్య సమస్యలు పరిష్కారమైన తర్వాత ఆ అనుభవాలను కూడా నా తోటి సాయిబంధువులతో పంచుకుంటాను. తొందరగా నా కోరికలు తీర్చు సాయిదేవా! నా అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు బాబా! తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించు తండ్రీ! అందరినీ రక్షించు బాబా! మీకు శతకోటి వందనాలు తండ్రీ!” బాబా ఆశీస్సులతో త్వరలోనే నా అనుభవంతో మరోసారి మీ ముందుకు వస్తాను.


ఓం సాయిరామ్!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా గైడెన్స్

సాయిభక్తుడు రిత్విక్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

'సాయి సాయి సాయి!'. నేను సాయి బిడ్డని. నాపేరు రిత్విక్ సాయి గజేంద్ర. ఈ వేసవిలో ఒకరోజు నేను మా ఇంట్లో ఉన్న ఎసి ఆన్ చేద్దామని చూస్తే రిమోట్ పని చేయలేదు. బ్యాటరీ మార్చి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంటికి ఎలక్ట్రీషియన్‌ను పిలవడానికి మేము సిద్ధంగా లేము. హఠాత్తుగా బాబా ప్రేరణతో నాకొక ఆలోచన వచ్చింది. మా ఇంటినుండి 4-5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ వద్దకి వెళ్ళాను. రోడ్డుకి అభిముఖంగా ఉన్న షాపులన్నీ మూసివేయబడి ఉన్నాయి. ఏమి చేద్దామా అని ఆలోచిస్తుండగా అకస్మాత్తుగా కాంప్లెక్స్ లోపలికి వెళ్లి చూడమని బాబా ప్రేరేపిస్తున్నట్లు అనిపించింది. అవును, నిజమే! నా లోపల ఉంటూ నన్ను నడిపించేది నాసాయి కాక మరెవరు?

నేను ఎప్పుడూ ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళలేదు. లోపల ఎక్కడ ఏ షాప్స్ ఉంటాయో నాకు తెలియదు. బాబా గైడ్ చేస్తున్నట్లు కాంప్లెక్స్ లోపల నడుస్తున్నాను. అంతలో ఒక చిన్న ఎలక్ట్రికల్ షాపు ముందు క్యాలెండర్ రూపంలో సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడైన బాబా దర్శనమిచ్చారు. అక్కడి నుండి బాబా ఆ షాపుకి వ్యతిరేక దిశలో ఉన్న షాపు వద్దకి నన్ను నడిపించారు. అక్కడ కేవలం ఆ రెండు షాపులు తెరవబడి ఉన్నాయి. ఆ షాపతను రిమోట్ కంట్రోల్ కి చిన్న రిపేర్ చేసి, త్వరలోనే కొత్త రిమోట్ తీసుకోమని చెప్పాడు. బాబా లీలలు ప్రత్యేకమైనవి. ఒకసారి ఆయన మార్గదర్శకత్వాన్ని పొందిన తర్వాత మీ మెదడును డస్ట్‌బిన్లో పడేసి, హృదయంలో కొలువై ఉన్న ఆయనకి శరణాగతి చెందడం నేర్చుకోండి. 

ఓం సాయిరాం.



7 comments:

  1. Every day sai make sai leela.we also have house at our netive place.we are trying to sell that property. with Baba Blessing's this work should be done.Om Sai Ram baba

    ReplyDelete
  2. 🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
    🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺🌟🌺

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  5. ఓం సాయిరాం

    ReplyDelete
  6. Om sai ram baba amma problem cure cheyi thandri

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo