సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కుశాభావు



సాయిభక్తుడు కుశాభావు అలియాస్ కృష్ణాజీ కాశీనాథ్ జోషీ 1866వ సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి కాశీనాథ్ పద్మాకర్ జోషీ అహ్మద్‌నగర్ నుండి 70 మైళ్ల దూరంలో ఉన్న మీర్జాగాఁవ్‌లో ఒక గ్రామ వతనదారుగా ఉండేవాడు. అతనికి ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉండేవి. అతను ధనవంతుడు కాకపోయినప్పటికీ ఉన్నంతలో పేదలకు, రోగగ్రస్తులకు సహాయం చేస్తూ జీవితంలో ఎక్కువభాగం సామాజిక సేవాకార్యక్రమాలలో గడుపుతుండేవాడు.

కుశాభావు ఉపాధ్యాయ వృత్తికి అవసరమైన ప్రాథమిక విద్యనభ్యసించి నెలకి 5 లేదా 7 రూపాయల వేతనాన్ని అందుకుంటుండేవాడు. అంతేకాక, వంశపారంపర్యంగా వచ్చే గ్రామ పూజారి వృత్తికి అవసరమైన శిక్షణ కూడా పొందాడు. కానీ అతనికి ఉపాధ్యాయ వృత్తిలో గానీ, అర్చకత్వంలో గానీ ఆసక్తి లేదు. అతను భక్తి మార్గానికి తన జీవితాన్ని అంకితం చేయదలుచుకున్నాడు. అతను చిన్నవయసునుండే ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి కనబరుస్తుండేవాడు. పౌరాణిక గాథలు వినడంలో ఎంతో మక్కువ చూపేవాడు. గ్రామంలోని అన్ని మందిరాలను దర్శించడం, పవిత్ర గ్రంథాల పఠనం, పలు మంత్రజపాలు చేయడం వంటి వాటిలో నిమగ్నమై ఉండేవాడు. గ్రామంలో ఉన్న మారుతి మందిరానికి ప్రతిరోజూ వెళ్లి పూజ నిర్వహిస్తుండేవాడు. 

ఒకరోజు అలా వెళ్ళినప్పుడు ఆ మందిరం వద్ద పులిచర్మాన్ని ధరించి ఉన్న ఒక సాధువు కూర్చొని ఉండడం కుశాభావు చూశాడు. ఆ సాధువు చుట్టూ ఒక ప్రకాశవంతమైన కాంతి అతనికి కనిపించింది. కుశాభావు తన అలవాటు ప్రకారం మందిరం లోపలకి వెళ్లి మారుతికి పూజ ముగించిన తరువాత బయటకి వచ్చి ఆ సాధువుకి నమస్కరించాడు. ఆ సాధువు నామధేయం 'దత్తమహరాజ్' (వక్రతుండ మహరాజ్). వారు గొప్ప మహాత్ములు, సాత్వికులు. మహరాజ్ తన ప్రక్కన కూర్చోమని కుశాభావుకు సైగ చేయగా, అతనలాగే చేశాడు. అప్పుడు ఆ మహరాజ్ అతనికి కొన్ని ఆధ్యాత్మికపరమైన కథలను వినిపించాడు. ఆ మహరాజ్ ఆహారంగా వేరేదీ తీసుకోక, కేవలం పాలు మాత్రమే తీసుకొని జీవనం సాగిస్తుండేవాడు. అందుచేత మహరాజ్ ప్రతిరోజూ కుశాభావుకి కొంత ధనమిచ్చి, పాలు తెచ్చిపెట్టమని చెబుతుండేవాడు. కుశాభావు సంతోషంగా ఆ పని చేస్తుండేవాడు. ఒకరోజు కుశాభావు పాలు తెచ్చి మహరాజ్‌కిచ్చి, మిగిలిన చిల్లర మాత్రం ఇవ్వక తన వద్దే ఉంచుకున్నాడు. మరుసటిరోజు మహరాజ్ కుశాభావుని “ఆ చిల్లరతో ఏమి చేశావ"ని అడగగా కుశాభావు సౌమ్యంగా, "ఆ చిల్లరతో నేను పేడాలు కొనుక్కొని తిన్నాన”ని చెప్పాడు. మహరాజ్ అతన్ని చూసి నవ్వుతూ, “సమీపంలో ఉన్న ఆ చెట్టుని చూడు. అక్కడికి వెళ్ళు, నీకొక రాయి కనిపిస్తుంది. ఆ రాయి క్రింద ఒక కుండ వుంది. దానిని తెరచి అందులో ఉండేవి తిను” అని చెప్పాడు. మహరాజ్ చెప్పినట్లే కుశాభావు వెళ్లి చూడగా నిజంగానే అక్కడ నిండా పేడాలున్న ఒక కుండ కనిపించింది. కుశాభావు వాటిని తృప్తిగా తిని తిరిగి ఆ కుండని యథాస్థానంలో పెట్టి, మునుపటిలా రాయితో మూసేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ మహరాజ్ రూపంలో కుశాభావుకి గురువు లభించారు.

కుశాభావు దత్తమహరాజ్ శిక్షణలో యోగాసనాలు, ప్రాణాయామం, కుండలిని మేల్కొల్పడం మొదలైన విద్యలు నేర్చుకున్నాడు. కానీ యుక్తవయస్సులో ఉన్న అతనికి వాటితో తృప్తి కలుగలేదు. తన గురువుకి తెలిసిన మారణం, ఉచ్ఛాటనం, వశీకరణం మొదలైన విద్యలు నేర్పమని పట్టుబట్టాడు. అవి నేర్పడం గురువుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినప్పటికీ కుశాభావు బాగా ఒత్తిడి చేయడంతో అయిష్టంగానే వాటిని అతనికి నేర్పడానికి అంగీకరించాడు.

గురువు చెప్పినట్లు అందుకు అవసరమైన జపం, సాధన  కుశాభావు చేశాడు. అతను ఒక ఇనుప కడియాన్ని ధరించి మంత్రాలను నిర్ణీత సంఖ్యలో నిష్ఠగా జపించి కొద్దికాలంలోనే తాను ఆశించిన శక్తులను వశపరుచుకున్నాడు. ఒక మంత్రాన్ని ఉచ్ఛరించి పేడాలు వంటి మిఠాయిలను తన చేతుల్లోకి తెప్పించగలిగేవాడు. అయితే వాటిని అతను తినడంగానీ, అమ్మడంగానీ చేయకూడదు. కానీ ఇతరులను మెప్పించేందుకు, అబ్బురపరిచేందుకు వాటిని పంచిపెట్టవచ్చు. ఇవన్నీ అతను మంత్రోచ్ఛరణ ద్వారా చేసేవాడేగానీ యక్షిణి, కామిని మొదలైన దుష్టశక్తులను వశపరుచుకొనటం ద్వారా కాదు. ఇదేకాక, అతను ఇతురులు ప్రయోగించిన దుష్టశక్తులను నిర్వీర్యం చేయగలిగేవాడు. అది ప్రమాదంతో కూడుకున్నది. ఆ శక్తులను ఉపయోగించి ప్రాణహాని కూడా కలిగించవచ్చు. ఒక్కోసారి ఆ శక్తులను ప్రయోగించినవారికి కూడా భౌతికంగా హాని జరగవచ్చు.

22 ఏళ్ళ వయస్సుకే కుశాభావు ఆ మంత్రశక్తులపై పూర్తి పట్టు సాధించాడు. ఆ సమయంలో అతని గురువు సమాజానికి దూరంగా హిమాలయాలకు వెళ్లి, ఆమరణాంతం అక్కడే గడపాలని నిశ్చయించుకొని కుశాభావుని వెంట తీసుకొని బయలుదేరాడు. ఢిల్లీ చేరుకున్నాక ఆయన కుశాభావుకి తుది వీడ్కోలు చెప్పి, "మీరు వెళ్ళిపోయాక నేను ఏమి చేయాల"న్న అతని ప్రశ్నకు సమాధానంగా, "శిరిడీలో ఉన్న నా జ్యేష్ఠ సోదరుడు సాయిబాబా దగ్గరికి వెళ్లి వారు చెప్పినట్లు నడచుకో" అని చెప్పి వెళ్లిపోయారు. ఆ తరువాత కుశాభావుకి ఆయన మళ్ళీ కనిపించలేదు, వారి గురించి ఏ వివరాలూ తెలియలేదు.

చాలా సంవత్సరాల తరువాత, అంటే 1908లో కుశాభావు తన గురువు ఆదేశానుసారం శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. "ఇనుప కడియాన్ని పారవేసి, మంత్రప్రయోగం ద్వారా పేడాలు సృష్టించడం మాననిదే తమతో ఉండేందుకు అనుమతించమ"ని బాబా ఖరాఖండిగా చెప్పారు. ఖచ్చితమైన బాబా ఆదేశాన్ననుసరించి కుశాభావు తన ఇనుప కడియాన్ని విరిచి అవతల పారేసి, మంత్రప్రయోగం ద్వారా పేడాల వంటివి సృష్టించడం మానుకొని శిరిడీలో భిక్ష చేసి జీవనం సాగిస్తుండేవాడు. శిరిడీలో అతనికి ఉండటానికి నివాసం కూడా లేదు. బాబా అతనిని, "మశీదులో ఒక మూల కూర్చొని పగలంతా 'దాసబోధ' చదవమ"ని ఆజ్ఞాపించారు. అతనలాగే చేస్తుండేవాడు. రాత్రి ఎక్కడ చోటు దొరికితే అక్కడ నిద్రపోతుండేవాడు. అతనిలా చెప్పాడు: "బాబా నాకుగానీ, ఇతరులకుగానీ మంత్రోపదేశం వంటివి ఇవ్వలేదు. అప్పటికింకా బొంబాయి తదితర ప్రాంతాల నుండి భక్తులు బాబా దగ్గరకు వచ్చేవాళ్లు కాదు. అప్పుడప్పుడు శిరిడీ గ్రామస్థులు మాత్రమే వారి దగ్గరకు వచ్చి కడుపునొప్పి, జ్వరం మొదలైన సమస్యలకు ఉపశమనం కోరేవారు. బాబా మశీదులో నిరంతరం జ్వలించే ధునిలోని ఊదీని వారికి ఇస్తుండేవారు. ఆయన అందరినీ దక్షిణ అడిగేవారు కాదు. కొద్దిమంది వద్ద మాత్రమే 4, 5 పైసలు అడిగి తీసుకొని ధునికి అవసరమయ్యే కట్టెలు మొదలైన వాటికోసం వెచ్చించేవారు. బాబా దగ్గరకు వచ్చే గొప్పవారి విషయానికి వస్తే, నానాసాహెబ్ నిమోన్కర్‌ను తరచూ వారితో చూసేవాడిని. బాబా తమ సంభాషణలలో బ్రహ్మ, మాయ, వివేకం, మహావాక్య తత్వాలు, సాధన చతుష్టయం మొదలైన విషయాల గురించి ప్రస్తావించగా నేను వినలేదు. విశ్వాసంతో తమని ఆశ్రయించినవాళ్ళకి బాబా తమ అద్భుతశక్తులతో భగవంతునిపట్ల విశ్వాసాన్ని కలిగించేవారు. అలా ఆశ్రయించినవాళ్ళు తమ ఇష్టదేవతను ఉపాసించిన పిదప, వారి ఇష్టదైవం యొక్క సాక్షాత్కారాన్ని బాబా ప్రసాదించేవారు".

కుశాభావు పూర్తిగా మూడు సంవత్సరాలు బాబా సన్నిధిలో గడిపాడు. తరువాత అతని తండ్రి వచ్చి అతనిని తనతో తీసుకెళ్లాలనుకున్నాడు. కుశాభావు ఇంటికి వెళ్లేముందు బాబాను దర్శించాడు. అప్పుడు బాబా, "ఈసారి వచ్చేటప్పుడు ఇద్దరుగా రండి" అని అన్నారు. కొద్దిరోజుల తర్వాత కుశాభావు తన తండ్రితో కలిసి శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా గతంలో తాము చెప్పిన "ఇద్దరుగా రండి" అన్న మాటకు అర్థం - "పెళ్లి చేసుకొని భార్యతో రా" అని వివరించారు. దాంతో అతను శిరిడీ నుండి వెళ్లిన వెంటనే వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటికీ శిరిడీ వెళ్లి, బాబా దగ్గర ఉండడానికే అతను ఇష్టపడేవాడు. అందువలన ఒకసారి ఒంటరిగా శిరిడీ వెళ్లి చాలారోజులు అక్కడే ఉండిపోయాడు. అప్పుడు అతని భార్య వచ్చి అతనిని తనతో తీసుకెళ్ళింది. బాబా కృపవలన ఆ దంపతులకు పిల్లలు, మనవళ్లు ఉన్నారు.

అలా కుశాభావు తొమ్మిది సంవత్సరాల కాలంలో తరచూ శిరిడీ దర్శిస్తుండేవాడు. ఆ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒకసారి బాబా, “ఆ మూడుతలలవాణ్ణి చూడు" అని అతనితో అన్నారు. దాన్ని అతను గాణుగాపురం వెళ్లి దత్తాత్రేయుని దర్శించమన్న బాబా ఆదేశంగా భావించాడు. ఇక అప్పటినుండి అతను సంవత్సరానికి రెండుసార్లు, గురుపౌర్ణమికి ఒకసారి, మాఘపౌర్ణమికి ఒకసారి గాణుగాపురం వెళ్తుండేవాడు. ఇంకొకసారి బాబా మూడురోజులకి ఒక పారాయణ చొప్పున గురుచరిత్ర 108 పారాయణలు చేయమని ఆదేశించారు. బాబా ఆదేశానుసారం అతను 10, 11 నెలలు గాణుగాపురంలో ఉండి 108 పారాయణలు పూర్తి చేశాడు.

కుశాభావు చేత మంత్రశక్తులు ఉపయోగించడాన్ని నిషేధించిన బాబా దయతో అతనికి ఒక అద్భుతశక్తిని ప్రసాదించారు. అదెలా జరిగిందో చూడండి!

ఒక ఏకాదశినాడు కుశాభావు బాబా చెంత కూర్చొని ఉన్నాడు. అప్పుడు వారివురి మధ్య జరిగిన సంభాషణ:

బాబా: ”ఈరోజు నువ్వు ఏమి తింటావు?”
కుశాభావు: “ఏమీ తినను, ఈరోజు ఏకాదశి”
బాబా: "ఏకాదశి అంటే ఏమిటి?"
కుశాభావు: "ఉపవాసం ఉండే రోజు" 
బాబా: "ఉపవాసం అంటే ఏమిటి?"
కుశాభావు: "అది 'రోజా' వంటిది" (రంజాన్ మాసంలో ముస్లింలు పాటించే ఉపవాసాన్ని రోజా అంటారు) 
బాబా: "రోజా అంటే?"
కుశాభావు: కందమూలాలు తప్ప మరేమీ తినకుండా ఉండటం.

కందమూలాలు అంటే దుంపవేర్లు. మామూలుగా చిలగడదుంపలనే కందమూలాలని అంటారు. వాటినే ఏకాదశిరోజు తింటుంటారు. మరాఠీలో ఉల్లిగడ్డలను 'కాందా' అంటారు. 'కంద' - 'కాందా' పేర్లలో ఉన్న సారూప్యతను అవకాశంగా తీసుకొని బాబా కొన్ని ఉల్లిగడ్డలు కుశాభావుకిచ్చి తినమన్నారు. సనాతనులు ఏకాదశిరోజు ఉల్లి తినకూడదు. కానీ బాబా పట్టుబట్టడంతో వారి అభీష్టానికి వ్యతిరేకంగా నడచుకోవటం ఇష్టంలేని కుశాభావు, “మీరు తింటే నేనూ తింటాను” అని అన్నాడు. అప్పుడు బాబా కొన్ని ఉల్లిగడ్డలు తిన్నారు. తరువాత కుశాభావు కూడా కొన్ని ఉల్లిగడ్డలు తిన్నాడు. అంతలో కొంతమంది భక్తులు మశీదులోకి రాసాగారు. బాబా కుశాభావును ఆటపట్టించదలచి ఆ వచ్చిన భక్తులతో, “ఈ బాపనోణ్ని చూశారా! ఏకాదశిరోజు ఉల్లిగడ్డలు తింటున్నాడు” అన్నారు. కుశాభావు తనను తాను సమర్థించుకోదలచి, “బాబా తిన్నారు గనుక నేనూ తిన్నాను” అని అన్నాడు. వెంటనే బాబా, “నేను ఉల్లిగడ్డలు తినలేదు" అంటూ తిన్నది కక్కేశారు. దానిలో ఉల్లిగడ్డలసలు లేవు, కేవలం చిలగడదుంపలు మాత్రమే ఉన్నాయి. బాబా, "చూశారా! నేను తిన్నది ఉల్లిగడ్డలు కాదు, చిలగడదుంపలు!" అన్నారు. కుశాభావు, 'బాబా తన అద్భుతశక్తితో ఉల్లిపాయలను చిలగడదుంపలుగా మార్చేశార'ని ఆశ్చర్యపోతూనే, అదే తనకు గొప్ప అవకాశమని, బాబా కక్కినదానిని ప్రసాదంగా భావించి ఒక్క ఉదుటన దానిపైబడి నోటితో లాక్కొని తినేశాడు.  బాబా తిట్టి, కొట్టి, అవతలకి నెట్టి అతన్ని వారించాలని చూశారు. కానీ బాబా ఉచ్చిష్ఠాన్ని తినగలుగుతున్న మహదానందంలో ఉన్న అతను అవేమీ పట్టించుకోలేదు. 

'బాబా కొన్ని సందర్భాలలో ఎవరైనా ఒక భక్తునికి ముద్దుపెట్టి పంపేవారు. అదేమంత శుభకరమైనది కాదు. కానీ అక్కల్కోట మహరాజ్ వలె బాబా తిట్లు, దెబ్బలు శుభాన్ని, శ్రేయస్సుని కలగజేస్తాయ'న్నది అతని అభిప్రాయం. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను ఆశీస్సులుగా భావించాడు. బాబా కోపం నిజమో, నటనోగానీ మరుక్షణంలో వారి మనోవైఖరి మారిపోయి తమపై అతనికున్న అంచంచలమైన విశ్వాసానికి అభినందనాపూర్వకంగా ప్రేమతో అతని తలపై తమ హస్తాన్నుంచి ఆశీర్వదిస్తూ, "ఇకపై కేవలం నన్ను స్మరించి చేతులు చాచినంతనే నీ చేతుల నుండి సమృద్ధిగా ఊదీ రాలే సామర్ధ్యాన్ని కలిగి ఉంటావు" అని అన్నారు.

ఈ వివరాన్ని 1936లో కుశాభావు పూనాలో తన నివాసమందు మంచంపై కూర్చొని బి.వి.నరసింహస్వామికి తెలియజేస్తూ హఠాత్తుగా తన రెండు చేతులను కలిపి దోసిలిలా పట్టి పైకెత్తి తన ముఖానికి ముందుంచాడు. తరువాత రెండు కళ్ళు మూసుకొని బాబాను ధ్యానించాడు. ఒక నిమిషం తరువాత అతను, "ఇదిగో ఊదీ, మీ చేతులు పట్టండి" అంటూ తన దోసిలి గుండా ఊదీని ధారగా పోయసాగాడు. బి.వి.నరసింహస్వామి, అతనితోపాటు ఉన్న అవస్తే అతని దోసిలి క్రిందగా కాగితం పెట్టి కొన్ని ఔన్సుల ఊదీ సేకరించి పొట్లం కట్టి దాచుకున్నారు. ఈ విషయమై బి.వి.నరసింహస్వామి తాము రచించిన 'లైఫ్ ఆఫ్ సాయిబాబా'లో ఇలా వ్రాశారు: "శీతల వాతావరణంలో కుశాభావు చేతినుండి వచ్చిన ఊదీ అప్పుడే ధునిమాయి నుండి తీసిన ఊదీలా వెచ్చగా ఉంది".

కుశాభావు ఇలా చెప్పాడు, "అద్భుత వరం వల్ల లభించిన ఈ ఊదీని విశ్వాసంతో నా నుండి ప్రసాదం కోరే భక్తులకు పంచిపెడతాను. అది వారి బాధలను, పలురకాల దుష్ప్రభావాలను తొలగించేది. సంతానం లేని వారికి సంతానాన్ని కూడా ప్రసాదించేది. ఈ శక్తి ఒక్కసారిగా నాలో నిక్షిప్తమైంది. నేను చేతుల్లోకి ఊదీని సృష్టించడమనేది ఎలాంటి మంత్రాలు ఉచ్ఛరించడం వల్ల జరిగేది కాదు, కేవలం బాబాను స్మరించడం వల్లే సాధ్యమయింది. కానీ చేతుల్లోనికి పేడాలు, మిఠాయిలు తెప్పించడం మంత్రప్రయోగం వల్ల జరిగేది. నా చేతుల్లో ప్రత్యక్షమైన పేడాగాని, మిఠాయిగాని మరోచోట నుంచి తెప్పించబడేవి. అంటే ఒక చోట నుండి మరొక చోటికి బదిలీ చేయడం అన్నమాట. అందుకే బాబా దీనిని నిషేధించారు".

ఇకపోతే పేడాలు సృష్టించే పూర్వపు మంత్రవిద్య విషయంలో కుశాభావు బాబా విధించిన నిషేధాన్ని దాదాపు పాటించేవాడు. కానీ అప్పుడప్పుడు భక్తుల ప్రలోభానికి లోనై ఆ మంత్రశక్తులను ప్రయోగిస్తుండేవాడు. ఒకసారి శిరిడీలోనే పేడాలను సృష్టించాడు. దుష్టశక్తులను తిప్పికొట్టే మంత్రవిద్యను కూడా అతను ప్రయోగిస్తుండేవాడు. ఒకసారి రాజ్ మచికర్ మనవడిపై దుష్టప్రయోగమేదో జరిగింది. ఆ ప్రభావం వలన అతని శరీరంపై, గుడ్డలపై, పడకపై అకారణంగా మచ్చలు ఏర్పడేవి. అదొక రకమైన క్షుద్రశక్తి ప్రయోగం. దాన్ని త్రిప్పికొట్టే ప్రత్యేక మంత్రాలను కుశాభావు అభ్యసించి ఉన్నందువలన రాజ్ మచికర్ అతనికి కబురుపెట్టాడు. అతను వారింటికి వెళ్లి దుష్టప్రయోగాన్ని నిష్ఫలం చేసే మంత్రాలు చదివి, దత్తాత్రేయుని పూజ నిర్వహించి, ఆరతి ఇచ్చాడు. అంతటితో ఆ దుష్టశక్తి ప్రభావం పూర్తిగా నియత్రించబడింది.

ఒకసారి కుశాభావు శిరిడీ వెళ్లి బాబాను దర్శించినప్పుడు బాబా అతనితో, “నన్ను చూడటానికి శ్రమపడి ఇంతదూరం ఎందుకు వస్తావు? నేను అక్కడే ఉన్నాను!” అని, అతని స్వగ్రామమైన మిరాజ్‌గాఁవ్‌లో తామున్న ఒక నిర్దిష్ట ప్రదేశం గురించి వర్ణించి చెప్పారు. తరువాత కుశాభావు ఆ ప్రదేశానికి వెళ్లి ముళ్లపొదలు మొదలైనవన్నీ తొలగించి శుభ్రపరచగా అక్కడ అతనికొక సమాధి కనిపించింది. అది హజరత్ ఫకీర్ షా సమాధి. ఫకీర్ షా 200 సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేవారు. వారి సమాధి ఉండే స్థలం అప్పటి జాగీర్దారువారికి ఈనాముగా ఇచ్చారు. కుశాభావు ఆ స్థలాన్ని కొని ఆ సమాధిని పూజించసాగాడు. అతనికక్కడ బాబా దర్శనం అవుతుండేది. దాంతో అతను శ్రీరామనవమికి మాత్రమే శిరిడీ వెళ్తుండేవాడు. కుశాభావు ఇలా చెప్పాడు: "భక్తులలో నమ్మకం కలిగించేందుకు ఫకీర్ షా దర్శనమిస్తుండేవారు. చాతుర్మాసాలలో వారి దర్శనం లభించదుగానీ వారి మాటలు వినపడతాయి. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. వారి మాటల ద్వారా భక్తి, జ్ఞాన మార్గాలలో ప్రగతిని సాధించేదంటూ ఏమీ ఉండదు. వారు అప్పుడప్పుడు సాయిబాబా గురించి మాట్లాడేవారు. తామూ, సాయిబాబా ఒకే కూటమికి చెందినవారమని, వారితో తమకు సన్నిహిత బంధమున్నదని చెప్పేవారు. వారు శ్రీసాయిబాబా జీవించే ఉన్నారని చెప్పేవారు, కానీ ఏ రూపంలో ఉన్నది మాత్రమే తెలియజెప్పేవారు కాదు".

బాబా మార్గనిర్దేశంలో కుశాభావు ఆధ్యాత్మికంగా ఎంతో వృద్ధి పొందాడు, ఎన్నో సిద్ధులు సంపాదించాడు. వాటిని ధర్మబద్ధంగా మానవాళి సహాయార్థం ఉపయోగిస్తుండేవాడు. ‘బాబా ప్రచారం’ అన్న ధ్యేయంతో కుశాభావు ఒకచోట నుండి ఇంకోచోటికి తిరుగుతూ బాబా భజనలు, ఆరతులు చేస్తూ, బాబా ఊదీతో పలురకాల రోగాలను నయం చేస్తుండేవాడు. పూనాలోని ఒక సంపన్న కుటుంబంలో పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగంతో ఒకతను బాధపడుతుండేవాడు. కుశాభావు ఊదీతో అతనికి నయం చేశాడు. కుశాభావుకి చాలామంది శిష్యులు అయ్యారు. వారిలో ప్రథముడు వి.ఆర్.కులకర్ణి. పూణే నగరంలో ఎక్కువమంది శిష్యులున్నందున కుశాభావు తాను అక్కడే సమాధి చెందాలని తలచాడు. ఆ కారణంగానే అతను పూణేలో నివాసం ఏర్పరచుకున్నాడు. కుశాభావు యొక్క ఇష్టదైవం దత్తాత్రేయుడు. ప్రతి సంవత్సరం స్వగ్రామం వెళ్లి ఎంతో ఉత్సాహంగా దత్తజయంతి జరుపుతుండేవాడు. తన శిష్యులు దత్తాత్రేయుని, బాబాని ఆరాధించేలా అతను చూసుకునేవాడు.

1944, ఫిబ్రవరి 19, శనివారం, మాఘ బహుళ దశమి, మధ్యాహ్నం 12:00 గంటలకు కుశాభావు తుదిశ్వాస విడిచాడు. తన మరణానికి ముందు కులకర్ణి మరియు ఇతర శిష్యవర్గానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. పూణేలో పార్వతి పైథా అనే ప్రాంతంలోని శివాజీ గిరి పాదాల వద్ద ఒక ఇంటిలో కుశాభావు సమాధితో కూడుకున్న మందిరం ఉంది. మందిరంలో కుశాభావు సమాధితోపాటు సాయిబాబా మరియు దత్తాత్రేయుని మూర్తులు దర్శనమిస్తాయి. తన ఇష్టదైవాలైన సాయిబాబా, దత్తాత్రేయులను అభిషేకించిన జలాలు తన సమాధి మీదుగా జాలువారాలని కుశాభావు కోరిక. ఆ కోరికను ‘సద్గురు దాస్ కీ సేన్ సాయిబాబా' మండలిని ఏర్పాటు చేసిన అతని శిష్యులు నెరవేర్చారు. రెండు కారణాల వలన కుశాభావు సమాధి ఉన్న మందిరం పూణేలో ప్రసిద్ధి గాంచింది. మొదటిది, ఇక్కడ సేవ చేసిన వారి కోరికలు నెరవేరుతాయన్న విశ్వాసం. అత్యంత విశిష్టమైన మరో కారణం ఏమిటంటే, ఇక్కడి సమాధిపై ఉన్న పాలరాతి మీద సాయిబాబా మానవాకృతిలో దర్శమిస్తుంటారు.

source: Baba's Runanaubandha by vinny chitluri.
(Ref: Sbri Krishnanath Mabaraj Yacha Parichay. Published by VR Kulkarni, at Shri Krishnanath Dutt Mandir) 

3 comments:

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo