- బాబా సంరక్షణ
- బాబా రాకతో ఉద్యోగప్రాప్తి
బాబా రాకతో ఉద్యోగప్రాప్తి
సాయిభక్తురాలు శ్రీమతి ఉమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ఉమ. ఇటీవల బాబా మాకు ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. నేను, మావారు ఇండియాలో నివసిస్తున్నాము. మా పెద్దబ్బాయి తన కుటుంబంతో కెనడాలోని వాంకోవర్ సిటీలో నివసిస్తున్నాడు. మా చిన్నబ్బాయి కూడా తన కుటుంబంతో అదే దేశంలో టొరంటో సిటీలో నివసిస్తున్నాడు. మా చిన్నకోడలు గత సంవత్సరం డిసెంబరులో MS పూర్తిచేసింది. ఈ సంవత్సరం జనవరి నుండి తను ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించింది. ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ ఉంది. కానీ తను ఏ ఉద్యోగంలోనూ సెలెక్ట్ కాలేకపోయేది. దాంతో మా చిన్నబ్బాయి ఎంతో నిరాశకు గురయ్యాడు. ‘ఎంత ప్రయత్నించినా తన భార్యకు ఇంకా ఉద్యోగం రావట్లేద’ని దిగులుపడుతుంటే, నేను తనతో, “బాబా దయవల్ల కోడలికి మంచి ఉద్యోగం వస్తుంది. మీరిద్దరూ ఆందోళనపడవద్దు” అని చెప్తూ ఉండేదాన్ని.
ఇలా ఉండగా నేను మా పిల్లలతో కొద్దిరోజులు గడపాలనుకుని, ముందుగా వాంకోవర్లోని మా పెద్దబ్బాయి ఇంటికి వెళ్ళాను. కొద్దిరోజుల తరువాత నేను మా పెద్దబ్బాయి దగ్గరనుండి మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళాను. మా చిన్నబ్బాయి దేవుడికి మ్రొక్కడు. అందువల్ల వాళ్ళు తమ ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోలేదు. అప్పుడు నేను నా మనసులో, “మేరే బాబా! ప్రస్తుతం మీ ఫోటో ఇక్కడ లేదు. ఇక్కడ ఎవరైనా నాకు మీ ఫోటో ఇస్తే బాగుండు” అని అనుకున్నాను. మరుసటిరోజు మా అబ్బాయి స్నేహితుడు ఫోన్ చేసి, నేను అక్కడికి వచ్చిన సందర్భంగా వాళ్ళింటికి డిన్నర్కి రమ్మని ఆహ్వానించాడు. అందుకు మేము, ‘డిన్నర్కి వద్దు, జస్ట్ కలవడానికి వస్తామ’ని చెప్పాము. తను సరేనన్నాడు. మేము ఆ సాయంత్రం కారులో వాళ్ళింటికి వెళ్ళాము. నేను నా మనసులో, “వీళ్ళ దగ్గర అదనంగా ఒక బాబా విగ్రహం ఉండి దానిని నాకు ఇస్తే బాగుండు” అని అనుకుంటూ వాళ్ళింట్లో అడుగుపెట్టాను. ఎదురుగా మన బాబా పెద్ద విగ్రహం నాకు కనిపించింది. ఎంతో ఆనందంతో, “మీరు ఉండే ఇంటికే వచ్చాను బాబా!” అని మనసులోనే అనుకుని బాబాకు నమస్కరించుకున్నాను. ఆ తరువాత అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాము. మాటల మధ్యలో, ‘బాబా చాలా బాగున్నార’ని చెబుతూ, ‘మా చిన్నబ్బాయి వాళ్ళింట్లో బాబా విగ్రహం లేద’ని వాళ్ళతో చెప్పాను. అప్పుడు వాళ్ళు, “దిగులుపడకండి ఆంటీ, మా దగ్గర చిన్న బాబా విగ్రహం ఉంది, దానిని మీకు ఇస్తాము” అన్నారు. ఆ మాట వినగానే నేను కోరుకున్నది బాబా నెరవేర్చారనే ఆనందంతో నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తరువాత మేము ఇంటికి తిరిగి వచ్చాము. రెండు రోజుల తరువాత వాళ్ళు మళ్ళీ మమ్మల్ని డిన్నర్కి ఆహ్వానించారు. మేమంతా వాళ్ళింటికి వెళ్ళాము. డిన్నర్ అయ్యాక మేము ఇంటికి బయలుదేరుతుంటే, ‘ఆంటీ, ఒక్క నిమిషం!’ అని చెప్పి, వాళ్ళ దగ్గరున్న చిన్న బాబా విగ్రహాన్ని నా చేతిలో పెట్టారు. నేను ఆ క్షణంలో చాలా చాలా పాజిటివ్గా అనుభూతిచెందాను.
ఇంటికి వచ్చిన తరువాత బాబాను ఆసనంపై ఉంచి, దీపం పెట్టి, “బాబా! ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, నా కోడలి ఉద్యోగం విషయం మీరే చూసుకోవాలి” అని మ్రొక్కుకున్నాను. తనకు ఉద్యోగం వస్తే ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. నేను మా చిన్నబ్బాయి ఇంట్లో 3 వారాలు ఉండి మావారి దగ్గరకు వచ్చాను. 29-10-2020, గురువారంనాడు మా చిన్నబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారు. ఆ సమయంలో నేను బాబా పుస్తకం చదువుతున్నాను. అప్పుడు వాళ్ళకు కెనడాలో అర్థరాత్రి సమయం. ఈ అర్థరాత్రి సమయంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారా అని అనుకుని ఫోన్ తీయగానే, మా చిన్నకోడలికి అక్కడి కెనడా గవర్నమెంట్ ఉద్యోగం లభించిందని ఎంతో ఆనందంగా చెప్పారు వాళ్ళు. బాబా చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందిస్తూ బాబాకు నమస్కరించుకుని, “బాబా! మేరే బాబా! థాంక్యూ బాబా!” అని బాబాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
