సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

విఠల్ ఎన్ వైద్య


విఠల్ ఎన్ వైద్య సాయిబాబాకి గొప్ప భక్తుడు. అతను రైల్వే శాఖలో ఉద్యోగం చేసాడు. కరాచీలో నివాసముండేవాడు. అతను 1911వ సంవత్సరంలో మొదటిసారిగా షిర్డీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. షిర్డీ వెళ్ళడానికి బయలుదేరిన రోజున అతని కూతురు ఛబూకు తీవ్రంగా జ్వరం వచ్చింది. బంధువులంతా ఆ స్థితిలో ఉన్న పసిబిడ్డతో ప్రయాణం మంచిది కాదని సలహా ఇచ్చారు కానీ, అతను వారి మాటలు పట్టించుకోకుండా, బాబాపై నమ్మకముంచి కుటుంబంతో బయలుదేరాడు. వాళ్ళు కళ్యాణ్ చేరేసరికి ఛబూకు జ్వరం తగ్గిపోయింది. దానితో అతనికి బాబాపై నమ్మకం బలపడింది. కుటుంబమంతా మశీదుకు వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. కాసేపటి తరువాత అతను బాబా వద్దకు వెళ్లి, ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి అడుగగా బాబా నిరాకరించారు. సరైన సమయంలో తిరిగి వెళ్లి మరుసటిరోజు ఉద్యోగ విధులకు హాజరు కావాల్సి ఉన్నందున అతడు ఆందోళన పడ్డాడు. దాదాపు 4 గంటలు గడిచిన తరువాత షిర్డీ వదిలి వెళ్ళడానికి బాబా అతనికి అనుమతి ఇచ్చారు. కానీ "ఇప్పుడు వెళ్లి ఏం ప్రయోజనం? కోపర్గాఁవ్ స్టేషన్ లో ఈ సమయంలో ఏ ట్రైనూ అందుబాటులో ఉండద"ని అతడు భావించాడు. కానీ బాబా సెలవు ఇచ్చిన తరువాత కూడా షిరిడీలో ఉండడం తగదని అతను బయలుదేరాడు. అతను స్టేషన్ చేరుకునేసరికి అతను ఎక్కవలసిన బొంబాయి రైలు 5 గంటలు ఆలస్యంగా వస్తోందని, ఇంకా అప్పటికి రాలేదని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటిలో రైలు రావడంతో అతను రైలు ఎక్కి సరైన సమయానికి బొంబాయి చేరుకున్నాడు.

1933 - 34 సంవత్సరంలో వైద్య ఆరోగ్యం బాగా క్షీణించింది. 21 రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. డాక్టర్లు పరీక్షించి అతని అనారోగ్యాన్ని నిమోనియాగా నిర్ధారించారు. డాక్టర్ చిప్కర్ అతనిని పర్యవేక్షిస్తూ దగ్గుకు సంబంధించిన అన్ని రకాల ఇంజక్షన్లు, మందులు ఇచ్చినా కూడా అతని ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాలేదు. 

ఇదిలా ఉండగా 21వ రోజు రాత్రి తొమ్మిది గంటల సమయంలో వైద్యకి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఆరోజు కుటుంబసభ్యులందరూ అతని బాగోగులు చూసుకుంటూ ఆ గదిలోనే వున్నారు. హఠాత్తుగా అతను, “బాబా వచ్చారు, ఆయనకు జొన్న రొట్టెలు, ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇవ్వండి” అని కేక వేశాడు. కుటుంబసభ్యులకు అక్కడ ఎవరూ కనిపించకపోవడం చేత అతను చెప్పేది నమ్మక, ఏదో అనారోగ్యం వలన అపస్మారక స్థితిలో అతనావిధంగా మాట్లాడుతున్నాడని అనుకున్నారు. కానీ నిజంగానే బాబా వైద్యకు దర్శనమిచ్చారు, కానీ అతను తప్ప మిగతా వారెవరూ బాబాను చూడలేకపోయారు. తన మాట విననందున అతను కోపం తెచ్చుకొని, గది నుండి వారందరినీ బయటకు వెళ్లిపొమ్మని కేకలు వేసి, బయటకు తరిమేశాడు. వారందరూ గది బయటికి వచ్చి, బయటనుండే అతనిని కనిపెట్టుకుని ఉన్నారు. ఆశ్చర్యంగా కాసేపటికి గదిలో నుండి బాబా అతనితో మాట్లాడుతున్నట్లు వారికి వినిపించింది. అంతలో మళ్ళీ బాబా ఎవరో ఇద్దరు వ్యక్తులను సంబోధిస్తూ వారిని అక్కణ్ణించి వెళ్లిపొమ్మని ఆదేశిస్తున్నట్లుగా మాటలు వినిపించాయి. కానీ వాళ్ళు అందుకు నిరసించి, తాము అతనిని తీసుకెళ్లడానికి వచ్చామని చెప్పారు. బాబా వారిని వారిస్తూ తమ సటకాతో బలంగా నేలపై కొట్టారు. దానితో వాళ్ళు వెళ్ళిపోయినట్లున్నారు, ఆ తరువాత గదిలోనుంచి ఆ ఇద్దరు వ్యక్తుల మాటలు వినపడలేదు. ఆ ఇరువురు వ్యక్తులు బాబాకు భయపడి వెళ్ళిపోయినట్టుగా కుటుంబసభ్యులకు అవగతమయ్యింది. తరువాత బాబా వైద్యను ఒక పెద్ద లోటా నిండా చల్లటి నీటిని త్రాగమని చెప్పి అదృశ్యమయ్యారు.

గది బయట వున్న తన కుమారుడు దత్తాత్రేయ విఠల్ వైద్యను పిలిచి తనకి తన పెద్ద లోటా నిండా చల్లటి నీటిని తెమ్మని వైద్య చెప్పాడు. బాబా చెబుతున్నప్పుడే గది బయటనుంచి విన్న అతని కుమారుడు మారు మాట్లాడకుండా చల్లటి నీటిని తీసుకొచ్చి అతనికి అందించాడు. అతను ఆ మొత్తం నీటిని త్రాగిన వెంటనే చెమటలు పట్టి, జ్వరం తగ్గుముఖం పట్టింది. కుమారుడు వెంటనే డాక్టర్ చిప్కర్ కు కబురుపంపగా డాక్టర్ వచ్చి వైద్యను పరీక్షించారు. చల్లటి నీటిని త్రాగడంతో జ్వరం తగ్గిపోయిందని తెలిసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. మరునాడు డాక్టరు వైద్యకి ఒక ఇంజక్షన్ ఇచ్చి, అతను ప్రాణాపాయస్థితి నుండి బయటపడ్డాడని కుటుంబసభ్యులకి చెప్పాడు. ఈ సంఘటనలో బాబా తన భక్తుని కాపాడటానికి యమదూతలను తరిమివేశారని అర్థం అవుతుంది. మృత్యుముఖంలో ఉన్న తన భక్తులను బాబా ఎలా కాపాడతారో చూశారా! సాయిరామ్!! అంతకుముందు కూడా అతను కష్ట సమయాలలో ఉన్నపుడు బాబా అతనికి దర్శనం ఇచ్చి రొట్టెలు, ఉల్లిపాయలు అడిగేవారు.

1935వ సంవత్సరంలో వైద్య కూతురు ఛబూకు వివాహం చేయ సంకల్పించాడు. సరైన సంబంధం కోసం వెతుకుతూ చాలా ఆతురపడ్డాడు. ఒక సంబంధం దాదాపుగా నిశ్చయం అనుకున్న సమయంలో హఠాత్తుగా తప్పిపోయింది. దానితో అతను ఇంకా ఆందోళనపడ్డాడు. ఆ స్థితిలో అతను తనకు సహాయం చేయమని బాబాను ప్రార్ధించాడు. ఒకరోజు రాత్రి అతనికొక కల వచ్చింది. కలలో బాబా "పండరీపురం వైపు నుండి ఒక లేఖ వస్తుంది, దానితో విషయం చక్కబడుతుంది, ఆందోళన పడనవసరం లేదు" అని చెప్పారు. అలాగే పదిహేను రోజులలో పండరీపురం నుండి డిగ్రి అనునతడు పండరీపురానికి చెందిన మిస్టర్ దీక్షిత్ తో ఛబూ వివాహం జరిపించమని అడుగుతూ వైద్యకి ఒక లేఖ రాశాడు. దానితో సమస్య పరిష్కారమై అతిత్వరలో వైద్య తన కూతురి వివాహం ఘనంగా జరిపించాడు.
Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/vitthal_n_vaidya.html
Life of Sai Baba, Volume 3 by Sri.B.V.Narasimha Swamiji

3 comments:

  1. Sarvam sai mayam,

    OM Sree sai Rajaram

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo