సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1248వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. 'పిలిస్తే పలుకుతాన'ని ప్రతీసారి నిరూపిస్తూ విశ్వాసాన్ని దృఢపరుస్తున్న బాబా
2. శ్రీసాయినాథుని కరుణ
3. ఉద్యోగం ప్రసాదించిన బాబా

'పిలిస్తే పలుకుతాన'ని ప్రతీసారి నిరూపిస్తూ విశ్వాసాన్ని దృఢపరుస్తున్న బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి భక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. జీవితంలో మనం ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదురుకుంటూ ఉంటాము. సాయి భక్తులమైన మనం ఆ సాయినాథుని ప్రార్థించినంతనే ఆయన ఆ కష్టాలను గట్టెక్కిస్తున్నారు. సాయినాథుని దయతో మన కష్టాలు తొలిగిన క్షణాన మనకి ఆనందానుభూతి కలుగుతుంది. అలాంటి అనుభవాలను పంచుకోవడం వల్ల ఆ సాయినాథుడు సదా తమను స్మరించేవారి వెంట ఉంటారనే విశ్వాసం భక్తులలో దృఢమవుతుంది. అలాగే బాబా అనుగ్రహం మన మీద ఎంతలా ఉందో తలుచుకుంటూ ఆయన భోదించిన రీతిలో మన జీవితాలను చక్కదిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది.  అనుభవాలను పంచుకునే అవకాశమిస్తున్న 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు వారికి కృతజ్ఞతలు. నేను ఇదివరకు ఈ బ్లాగులో మూడు సార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇపుడు మరో మూడు అనుభవాలను పంచుకోబోతున్నాను.


ఈ మధ్యకాలంలో మేము మా కుటుంబమంతా కలిసి తిరుమల దర్శనానికి బయలుదేరాము. పెళ్లి అయిన తరువాత మేము మొదటిసారి తిరుమలకి వెళ్తున్నందువల్ల ఏ చింతా లేకుండా దర్శనం చేసుకోవాలని నేను ఆశపడ్డాను. కానీ సరిగా అదే సమయానికి మాకు తెలిసిన దూరపు బంధువులు కూడా తిరుమలకి వస్తున్నారని మాకు తెలిసింది. ఆ విషయం తెలియగానే నాకు మనస్తాపం కలిగింది. ఎందుకంటే, మావారికి వాళ్లని కలవడం పెద్దగా ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు ఎదురుపడితే మాటామాటా వచ్చి ఏదైన గొడవ జరుగుతుందేమోనని నేను భయపడి  బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మేము, వాళ్ళు కలిసే సందర్భం రాకూడదు. మేము ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి. మీ దయతో మా యాత్ర సజావుగా జరిగితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల వాళ్ళు, మేము కలుసుకోలేదు. చక్కగా స్వామి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. బాబా కరుణతో మా యాత్ర హాయిగా జరిగింది.


నా తమ్ముడు L.L.B ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. సరిగా వాడు తన రికార్డులు వ్రాసుకోవాల్సిన సమయానికి వాడికి జలుబు, జ్వరం తీవ్రంగా వచ్చాయి. ఒకరోజు వాడు నాకు ఫోన్ చేసి, "నేను రికార్డులు వ్రాయలేకున్నాను. ఆఖరి తేదీ దగ్గరకి వచ్చేసింది. ఏమి చెయ్యాలో తోచట్లేదు" అని చెప్పాడు. నాకు వాడి విషయంలో ఆందోళనగా అనిపించి, "బాబా! వాడికి ఏదో విధంగా సహాయం చేయండి. వాడు గనక ఆఖరి తేదీలోగా రికార్డులు వ్రాసి కాలేజీలో సబ్మిట్ చేస్తే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా అనుగ్రహం వల్ల తమ్ముడు తన రికార్డులు వ్రాసి సరిగ్గా ఆఖరి తేదీన కాలేజీలో సమర్పించాడు. ఆ పక్క రోజుకి వాడి జలుబు, జ్వరం తగ్గిపోయాయి. అనారోగ్యంతో అవస్థ పడుతున్న తమ్ముడికి రికార్డులు పూర్తి చేసే శక్తిని బాబానే ప్రసాదించారు. "థాంక్యూ సో మచ్ బాబా".


నేను ఈమధ్య మావారికి సంబంధించిన ఒక పని మీద ఒక ఆఫీసుకి వెళ్ళాను. నిజానికి ఆ పనికి మావారే స్వయంగా వెళ్ళాలి. ఆయన లేకుంటే పని జరగదు. ఆ పని సమయానికి జరగకపోతే మాకు సమస్య అవుతుంది. కాని కొన్ని కారణాలు వల్ల మావారు వెళ్లలేని పరిస్థితి. అందువలన నేను మావారు లేకపోయినా పని జరిగేలా ఆఫీసువాళ్లని సహాయం అడుగుదామని అనుకున్నాను. ఆఫీసుకి వెళ్లే ముందు బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నాకు సహాయం అందేలా ఆశీర్వదించండి. మీ దయతో ఆ పనైతే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను అని మ్రొక్కుకున్నాను. మొదట ఆఫీసువాళ్ళు కుదరదని చెప్పినప్పటికీ కాసేపటి తర్వాత సహాయం చేసి మావారు లేకుండానే పని పూర్తి చేసారు. ఇదంతా ఆ బాబా అనుగ్రహం. 'పిలిస్తే పలుకుతాను' అని ఆయన ప్రతీసారి నిరూపిస్తూ అంతకంతకు నా విశ్వాసాన్ని దృఢపరుస్తున్నారు. "ధన్యవాదాలు బాబా"


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


శ్రీసాయినాథుని కరుణ


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు ఉష. మాది హైదరాబాద్. నేను ఇంతకుముందు సాయి చూపిన కరుణను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇపుడు సాయి ప్రసాదించిన మరికొన్ని  అనుభవాలను మీతో ఆనందంగా పంచుకుంటున్నాను. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులు జరుగుతుండటం వల్ల మా పాప అసైన్మెంట్స్, వర్క్ అంటూ ఎప్పుడూ లాప్టాప్ ముందరే కూర్చుని ఉంటుంటే తను ఏమి చేస్తుందో నాకు అర్థం అయ్యేది కాదు. ఏమైనా తప్పుదోవలో వెళుతుందేమో అని ఒక్కోసారి సందేహం కలుగుతుండేది. అడిగితే, తన ఇంజనీరింగ్ వర్క్ అని చెబుతుండేది. ఏమైనా అంటే అసలు చదవటం అవ్వటం లేదు, మానేస్తాను అని ఏడుస్తుండేది. ఇటువంటి పరిస్థితుల్లో నేను బాబాతో పాప పరిస్ఠితి, నా భయం గురించి చెప్పుకుని ఆయన కృపకోసం ఎదురుచూసాను. ఆయన దయతో పాపలో మార్పు తీసుకొచ్చి, తన దృష్టి చదువు మీదనే ఉండేలా చేశారు. "థాంక్యూ బాబా".


కోవిడ్ వల్ల ప్రతి సంవత్సరం చేసుకునే ఇయర్లీ హెల్త్ చెకప్ మూడు సంవత్సరాలుగా మేము చేసుకోలేదు. చివరికి 2022, జూన్ 2న హాస్పిటల్‌కి వెళ్ళి, టెస్టులు చేయించుకుంటే షుగర్, బిపి లేవు కానీ, కొన్ని అబ్‍నార్మల్ రిపోర్టులు వచ్చాయి. వాటి గురించి మరలా మరలా టెస్టులు చేయించుకుంటూ నెలంతా హాస్పిటల్ చుట్టూ తిరగటంతోనే సరిపోయింది. చివరికి ఏమి అవుతుందో అని ఒకటే టెన్షన్‍గా ఉంటుంటే బాబాకి చెప్పుకుని,  "రిపోర్టులు నార్మల్‌గా వచ్చి, మందులతో తగ్గితే, బ్లాగులో నా అనుభవాలను పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల టెస్టులు, బయాప్సీ, స్కానింగ్‌లు అన్నీ అయ్యాక, "క్యాన్సర్ కాదు, నార్మల్ ఇన్ఫెక్షన్. కానీ కొద్దిగా ఎక్కువ మోతాదులో మందులు వాడాలి" అని అన్నారు. ఏదేమైనా బాబా దయవలన నా మనసుకి శాంతి కలిగింది. ఏదో పాపం వల్ల కొద్దిరోజులు ఈ శారీరక బాధను అనుభవించి ఆ పాపాన్ని పోగొట్టుకుంటాను. ఇది బాబా నాకిచ్చిన ఒక సదవకాశంగా భావిస్తాను. "థాంక్యూ బాబా. ఎల్లపుడూ ఇలాగే మాపై దయ, కరుణ చూపించండి. అలాగే అందరిపై కరుణతో, వాత్సల్యంతో ఉంటారని ఆశిస్తున్నాను బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఉద్యోగం ప్రసాదించిన బాబా


సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు ప్రతిమ. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తన పేరు సంపత్. తను బీటెక్ పూర్తి చేశాడు. నేను తనకి మంచి ఉద్యోగం వస్తే, ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. బాబా దయ చూపారు. అన్నయ్యకి ఉద్యోగం వచ్చి మొదటి నెల జీతం కూడా అందింది. "ధన్యవాదాలు బాబా. నా అనుభవం పంచుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1247వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ అవసరమైనది చేస్తుంటారు
2. బాబా చేసిన అద్భుతంతో బి.ఇ.డి సీట్

బాబా తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ అవసరమైనది చేస్తుంటారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నాపేరు మహేష్. నేను సిద్ధిపేట జిల్లా వాసిని. నాకు ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు అంటే చాలా చాలా చాలా ఇష్టం. మన ఈ బ్లాగు ద్వారా నేను శ్రీసాయిబాబాకు చాలా దగ్గర అవుతున్నాను. ఇందులో పంచుకుంటానని మ్రొక్కుకుంటే నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇదివరకు నేను చాలా అనుభవాలు బ్లాగులో పంచుకున్నాను. చివరిగా పంచుకున్న అనుభవంలో బాబా దయవలన జరిగిన శ్రీశైలం, తిరుపతి యాత్రల గురించి పంచుకున్నాను. అందులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వలన నాకు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కాలేదని, నేను చాలా ఏడ్చానని చెప్పాను. ఆ తరువాత నా మనసుకి, 'ఇక్కడ నాకు శ్రీవారి దర్శన భాగ్యం దక్కనందుకు స్వప్నంలోనైనా వారి దర్శనం లభించాలి' అని అనుకున్నాను. అందుకోసం శ్రీవేంకటాచల మహత్మ్యం చదవాలని నాకు అనిపించింది. కాని ఆ రాత్రి నేను ఆ బుక్ తీసుకుందామని వెళ్లేసరికి టీటీడి వారి బుక్ స్టాల్ మూసేసి ఉంది. అందువల్ల నాకు ఆ బుక్ లభ్యం కాలేదు. యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక కనీసం శ్రీవేంకటాచల మహత్మ్యం శ్రవణం(వినటం) చేద్దామని శ్రీచాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన శ్రీవేంకటాచల మహత్మ్యం రోజుకి రెండు గంటలు చొప్పున 4 రోజులు విన్నాను. సోమవారంనాడు చివరిరోజు శ్రవణం పూర్తయింది. నేను శ్రీవారి దర్శనం గురించి మర్చిపోయాను. ఐదు రోజుల తరువాత 2022, జూన్ 18, శనివారం రోజున నేను మామూలుగానే పూజ చేసుకుని, రోజూ మాదిరిగానే శ్రీసాయిబాబాను స్మరించుకుని రాత్రి నిద్రపోయాను. తెల్లవారుఝామున 3 గంటలకు నాకు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనమైంది. శ్రీవారి నిలువెత్తు మూల విరాట్ యొక్క ముఖం చాలా చక్కగా కనిపించింది. నేను గోవింద నామస్మరణ పెద్దగా చేస్తున్నాను. తోటి భక్తులు కూడా నాకు కోరస్‍గా గోవింద నామస్మరణ చేస్తున్నారు. అర్చకులు స్వామికి హారతి ఇచ్చి, ఆ హారతి మాకు చూపించిగా మేము గోవింద నామస్మరణ చేస్తూ హారతికి దండం పెట్టుకున్నాము. ఆలయ ప్రాంగణం భక్తులతో క్రిక్కిరిసిపోయింది. త్రోపులాట జరిగి నేను ఒక్కసారిగా స్వామివారి గర్భగుడి గడప దగ్గరకి తోసివేయబడ్డాను. వెంటనే నేను ఆ గడపకి చేతులు ఆనించి నమస్కారం చేసుకున్నాను. వెంటనే నేను వెనక్కు లాగబడ్డాను. అంత దగ్గరగా స్వామిని దర్శించాక నాకు ఒక లాకెట్ కనిపించింది. ఆ లాకెట్‍లో సగం వరకు శ్రీసాయిబాబా, మరో సగం శ్రీవేంకటేశ్వరస్వామి ఉన్నారు. అంతటితో నాకు మెలకువ వచ్చింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్రీసాయిబాబా దయవలననే నాకు శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం అయ్యిందని నా నమ్మకం. ఆ వెంకటేశ్వరుడు మన సాయి ఒక్కరే.


ఈమధ్య మా పొలం దగ్గర జెసిబి వర్క్ ఉండి పని ప్రారంభించాము. కొద్దిసేపటికి వర్షం కురవడంతో పని మధ్యలో ఆగిపోయింది. మరుసటిరోజు జెసిబి అతన్ని రమ్మని ఫోన్ చేస్తే, వస్తానన్నాడు కాని రాలేదు. ఆ మరుసటిరోజు అలాగే చెప్పి రాలేదు. మళ్ళీ ఇంకోరోజు రమ్మంటే, "డీజిల్ లేదు, రాను. ముందే డబ్బులిస్తే వస్తాన"ని చెప్పి ఫోన్ కట్ చేసాడు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు కూడా. మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను అప్పుడు, "బాబా! జేసీబీ అతన్ని రప్పించి పని మొత్తం పూర్తి చేయించినట్లైతే నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తెల్లవారితే గురువారం(2022, జూన్ 23). ఈరోజు ఖచ్చితంగా బాబా పని పూర్తి చేయిస్తారని నమ్మకంతో ఉన్నాను. కొద్దిసేపు తరువాత ఆ జేసీబీ అతనికి ఫోన్ చేస్తే, వచ్చి పని పూర్తి చేశాడు. కాదు కాదు బాబానే పని పూర్తి చేయించారు. "చాలా చాలా ధన్యవాదాలు సాయినాథా".


మా అన్నయ్య మా గ్రామంలోని ఒక వ్యక్తి దగ్గర నెల నెల చీటీలు వేస్తున్నాడు. అతను అన్నయ్యకి ఇవ్వవలసిన చిట్టీ డబ్బులు 'ఇస్తా, ఇస్తా' అంటూ జనవరి నుండి మే వరకు  వాయిదా వేస్తూ వచ్చాడు. జూన్‍లో ఒకరోజు అడిగితే, "రేపు ఇస్తాను" అన్నాడు. సరేనని, మరుసటిరోజు ఫోన్ చేస్తే, ఆ టైమ్‍కి ఇస్తా, ఈ టైమ్‍కి ఇస్తా అంటూ ఫోన్ కట్ చేస్తూ వచ్చాడు. దాంతో అన్నయ్య, నేను చాలా బాధపడ్డాము. అప్పటివరకు నేను బాబాతో చెప్పుకోలేదు. ఇంకా అప్పుడు అన్నయ్యతో, "సాయిబాబాకి మ్రొక్కుకో" అని చెప్పాను. నేను కూడా, "చిట్టీ డబ్బులు వస్తే, ఈ అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత నేను, "అన్నయ్యా! రేపు గురువారం కదా, రేపే డబ్బులు వస్తాయి కావొచ్చు" అని అన్నయ్యతో చెప్పాను. మరుసటిరోజు 2022, జూన్ 23, గురువారం సాయంత్రం ఆ చిట్టీ వ్యాపారి అన్నయ్యకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. బాబానే అతను డబ్బులు ఇచ్చేలా చేశారు. అన్నయ్య నాకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పగానే నేను చాలా ఆనందించి బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.


నేను ఈమధ్య ఒకరోజు మా అమ్మ పొలం దగ్గరకి వెళ్లి చీకటిపడ్డాక ఇంటికి తిరిగి నడుచుకుంటూ వస్తున్నాను. నా దగ్గర మొబైల్ ఉంది, కాని టార్చ్ లైట్ ఆన్ చెయ్యలేదు. కొద్ది దూరం వచ్చాక నా పాదం వెనుక భాగంలో ఏదో తాకినట్టు అనిపించింది. నేను అది కప్ప కావొచ్చు అనుకుని, 'అయ్యో పాపం చూసుకోకుండా కప్పను తొక్కేసినట్లున్నాను' అనుకున్నాను. ఇంకా దానికి ఏమైందోనని మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే, అది కప్ప కాదు, పెద్ద నల్ల తేలు. నేను ఒక్కసారిగా చాలా భయపడిపోయాను. అది నన్ను కరిచిందేమో అని ఆందోళన చెందాను. ఎందుకంటే, తేలు దగ్గరకి వెళ్ళగానే అది కరుస్తుంది, అది దాని సహజ స్వభావం. అయితే ఆ తేలు నా పాదానికి తగిలినప్పటికీ అది నన్ను కరువలేదు. ఇంకో విషయం, ఆ తేలు నా పాదానికి తాకిన సమయంలో నేను బాబా పాటలు వింటూ, వారి గురించే ఆలోచిస్తూ నడుస్తున్నాను. బాబానే ఆ తేలు నన్ను కరవకుండా కాపాడారు. నేను ఇంటికి వచ్చిన వెంటనే వాట్సాప్‍లో మన 'సాయి మహారాజ్ సన్నిధి' గ్రూపు ఓపెన్ చేస్తే ఈ క్రింది మెసేజ్ చూసి ఆశ్చర్యపోయాను.


ఈవిధంగా నా సాయినాథుడు సమస్య వస్తే, వెంటనే పరిష్కరించి మనల్ని రక్షిస్తున్నారు. ఆయన తమ భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటారనడానికి నిదర్శనమే ఈ అనుభవం. మనం ఒక్కసారి బాబా పాదాలను ఆశ్రయిస్తే, మన పనులన్నీ సూత్రధారియై బాబానే నడిపిస్తారు. మనం బాబా చెప్పిన విధంగా శ్రద్ద, సబూరీలతో వారి నామస్మరణ చేస్తుంటే, ఆయన మన జీవిత నౌకను గమ్యానికి చేర్చి, మనల్ని తమ ఒడిలోకి చేర్చుకుంటారు. అంతా సాయిమయం.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


బాబా చేసిన అద్భుతంతో బి.ఇ.డి సీట్


నా పేరు ఇందిర. నేను హైదరాబాద్ నివాసిని. నేను 1994లో బి.ఇ.డి కౌన్సిలింగ్‍కి వెళ్ళాను. కానీ సీట్లన్నీ నిండిపోయిన కారణంగా నాకు సీటు రాలేదు. తరువాత నేను అనుకోకుండా దిల్‌షుఖ్‌నగర్‌లోని బాబా గుడికి వెళ్లి, బాబాను దర్శించి, "నాకు తెలీదు బాబా, ఎలాగైనా నాకు బి.ఇ.డి సీటు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. అద్భుతం! వారం రోజుల తర్వాత నాకు బి.ఇ.డి కౌన్సిలింగ్‍కి మళ్ళీ కాల్ లెటర్ వచ్చింది. విషయమేమిటంటే, అన్ని కళాశాలల్లో బి.ఇ.డి సీట్లు పెంచారు. ఇదెలా  సాధ్యమని నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. బాబా దయతో నాకు సీటు వచ్చింది. బి.ఇ.డి శిక్షణ పూర్తయిన తర్వాత డి.ఎస్.సి నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ పరీక్ష వ్రాసాను. 1997లో బాబా కరుణ వల్ల నాకు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ నేను ఆ ఉద్యోగం సంతోషంగా చేసుకుంటున్నాను. బాబా దయవల్ల నా ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ నా వ్యక్తిగత జీవితంలో కొన్ని పరిస్థితులు బాగా లేకుండా పోయాయి. ఆ సమయంలో నేను మాయ వల్ల బాబాకి దూరమయ్యాను. తరువాత నేను నా తప్పులు తెలుసుకుని మళ్ళీ బాబాను ఆశ్రయించాను. "క్షమించండి బాబా. ఇక మీదట నేను ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టను. నాకు కొన్ని ఆశలు ఉన్నాయి బాబా. దయచేసి వాటిని నెరవేర్చండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1246వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కరుణ
2. బాబా కృప అపారం

శ్రీసాయి కరుణ


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. గర్భవతిగా ఉన్న నా భార్యని ఏడవ నెలలో తన పుట్టింటికి పంపాలని నిర్ణయించాము. అందుకుగానూ విజయనగరం నుండి హైదరాబాద్‍కి ఎన్నిసార్లు రిజర్వేషన్ చేసే ప్రయత్నం చేసినా లోయర్ బెర్త్ రాలేదు. నేను 'బుక్ ఓన్లీ ఇఫ్ లోయర్ బర్త్ అవైలబుల్' అని పెడుతున్నప్పటికీ అప్పర్ లేదా మిడిల్ బెర్త్ మాత్రమే వస్తుండేవి. గర్భవతిగా ఉన్న నా భార్యగాని, వయసుపైబడిన మా అత్తయ్యగారుగాని పై బెర్తులు ఎక్కే పరిస్థితి లేదు. అందువలన నేను చివరికి రిజర్వేషన్ కౌంటరుకి వెళ్లి మెడికల్ సర్టిఫికెట్ చూపించి బుక్ చేద్దామనుకున్నాను. అనుకున్నదే తడువుగా రిజర్వేషన్ కౌంటరుకి వెళ్లి, మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ చూపిస్తే, వాళ్ళు ఒరిజినల్ కావాలన్నారు. కానీ ఒరిజినల్ మా దగ్గర లేదు. దాన్ని నా భార్య మెటర్నిటీ లీవ్ కోసం తన ఆఫీసులో ఇచ్చింది. అందువల్ల నేను చేసేదేమీ లేక రిజర్వేషన్ కౌంటరులో ఉన్న వాళ్ళని ప్రాధేయపడ్డాను. చివరికి ఎలాగో బాబా దయవల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. కాని లోయర్ బెర్త్ వస్తుందో, రాదో అన్న భయంతో నేను, "బాబా! మీ దయతో లోయర్ బెర్త్ వస్తే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆ బాబా దయవల్ల నా భార్యకి, తనకి తోడుగా వెళ్తున్న మా అత్తగారికి ఇద్దరికీ లోయర్ బెర్తులు వచ్చాయి. అంతా ఆ బాబా దయ.


ఇకపోతే, నా భార్య తన పుట్టింటికి వెళ్లేముందు చివరిసారిగా మేము ఉన్న చోట తనని చెకప్ కోసం డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాను. డాక్టర్ స్కానింగ్ చేసి, "అంతా బాగానే ఉంది కాని, ప్లాసెంటా(మాయ)లో చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వొచ్చు. ఇంకా ఉమ్ము నీరు చాలా తక్కువగా ఉంది" అని చెప్పి, "హైదరాబాద్ వెళ్లేముందు మరోసారి రండి" అని అన్నారు. నేను, "బాబా! మీ దయవల్ల ఈ రెండు సమస్యలు సమసిపోయి ఎటువంటి కష్టం లేకుండా నా భార్యకు సుఖ ప్రసవం అవ్వాలి తండ్రి. అలా జరిగితే, వెంటనే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నా భార్య హైదరాబాద్ వెళ్ళడానికి 2 రోజుల ముందు హాస్పిటల్‍కి వెళ్ళాం. అప్పుడు డాక్టరు చెక్ చేసి, "ఇప్పుడు అంతా బాగానే ఉంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది" అని అన్నారు. ఆ మాట విని మేము ఊపిరి పీల్చుకుని ఆనందంతో బాబాకి కృతఙ్ఞతలు చెప్పుకున్నాము.


నా భార్య జూన్ 21న బయలుదేరి విజయనగరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా సరిగా అదే సమయంలో అగ్నిపథ్ స్కీం వల్ల దేశమంతట ఆందోళనకర వాతావరణం నెలకొంది. అన్ని రైల్వేస్టేషన్లలో పూర్తి భద్రత ఏర్పాటు చేసారు. కానీ ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుంతో తెలియని పరిస్థితి. ఏ ట్రైన్‍ని కాల్చేస్తారో, ఎక్కడ ట్రైన్ ఆగిపోతుందో అని భయపడ్డాము. అట్టి స్థితిలో నేను ఆ సాయినాథుడిని తలుచుకుని, "ఏ సమస్య లేకుండా గర్భవతి అయిన నా భార్య క్షేమంగా గమ్యం చేరుకుంటే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆ దయామయుని కృపవల్ల నా భార్య ఏ సమస్య లేకుండా క్షేమంగా హైదరాబాద్ చేరుకుంది. "ధన్యవాదాలు బాబా. వారంలో ఇంకో చెకప్ ఉంది. అంతా బాగుండేలా చూసి చక్కని బిడ్డని ప్రసవించేలా చూడు తండ్రి. ఎప్పటినుండో పెండింగ్‍లో ఉన్న నా ప్రమోషన్ ఈ నెలలో వచ్చేలా అనుగ్రహించు తండ్రి. అలాగే నేను చేస్తున్న వేరే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేలా కరుణించు తండ్రి. తెలిసీతెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి. చివరిగా మీ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మీ బిడ్డలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


ఓం శ్రీసాయిదేవాయ నమః!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా కృప అపారం


నా పేరు సురేష్. 2022, జూన్ 17, శుక్రవారం రాత్రి ఓ దుర్మార్గుడి కారణంగా కలుషిత ఆహారం నాకు లభించింది. దాన్ని తిన్నాక నాకు రాత్రింబవళ్ళు విపరీతమైన వాంతులు, విరేచనాలు అవుతూ శరీరంలోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్‍కి గురయ్యాను. అస్సలు నిద్రలేక నాకొచ్చిన భయంకర సమస్యతో పోరాడుతూ దేవున్ని ప్రార్థించాను. అంతలో శరీరమంతా చల్లబడిపోయింది. నేను నా మనసులో, 'నన్ను కాపాడే వారెవరూ లేరు. నేను పోయినా బాధపడేవారు కూడా లేరు. ఇంతవరకు సాధించిన విజయాలు లేవు' అని అనుకున్నాను. ఇంకా అత్యంత పేదరికంలో ఉన్న నాకు ఆఖరి క్షణాలు దాపురించాయని అర్ధమైంది. కానీ చివరి క్షణంలో శ్రీ శిరిడీ సాయిబాబా గుర్తుకు వచ్చారు. వెంటనే కొంచెం ఊదీ నాలుకపై రాసుకుని, "బాబా! నాకొచ్చిన ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించి, బ్లాగులో ఈ అనుభవం  పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి" అని బాబాను అర్థించాను. అంతే కేవలం కొద్ది వ్యవధిలో అంతా సర్దుకుంది.


ఇంకో అనుభవం: గత సంవత్సరం మా కుటుంబ అవసరాల కోసం ఒక ఆవు కొన్నాము. ఇంట్లో వాళ్ళు ఆ ఆవుకి మూడుపూటలా గడ్డి మేపుతూ, అది ఇచ్చే పాలలో ఇంటి అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగిలిన పాలు విక్రయిస్తుండేవాళ్ళు. ఇలా ఉండగా 2022, జూన్ 27 సాయంత్రం ఆవు ఉన్నట్లుండి కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనపడలేదు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా వాళ్ళనుండి చూసామన్న సమాధానం రాలేదు. ఒక పక్క పాపం దూడ పాలకోసం అరుస్తుంది. మరోపక్క చీకటి పడి, వర్షం కూడా కురుస్తుంది. ఇంట్లో అందరూ ఆందోళన చెందుతూ, ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి ఆవుని వెతకసాగాను. కానీ దొరకలేదు. అప్పుడు నాకు 'బాబాని ప్రార్థించి వెతకాల'నిపించి, ముందుగా 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని అనుకుని, "బాబా! నాడు తప్పిపోయిన చాంద్‍పాటిల్ గుఱ్ఱాన్ని తిరిగి ఏ విధంగా దొరికేలా చేశారో, అలాగే ఈ గోమాతను దొరికేలా చేయండి సాయి" అని బాబాను ప్రార్ధిస్తూ బయటకు వెళ్లి ఆశ్చర్యపోయాను. చీకటిలో ఆవు వడివడిగా నడుచుకుంటూ వచ్చి శాలలోకి వెళ్ళిపోయింది. "ధన్యోస్మి బాబా. మీరు పిలిస్తే పలికే దైవం. నన్ను ఆదుకోండి. అస్తవ్యస్తంగా, చితికిపోయి ఉన్న నా బ్రతుకుని సరిదిద్దండి, నన్ను ఉద్ధరించి తరింపజేయండి. మీరే నా దైవం, మీరే నా తండ్రి, మీరే నా తల్లి, మీరే నాకు దిక్కు బాబా. ధర్మార్థ, కామ, మోక్షాలు నాకు ప్రాప్తింపజేయండి. మా ప్రాంతంలో మీ ఆలయ నిర్మాణం చేసే శక్తిని నాకు ప్రసాదించండి. మీ అనుగ్రహం ఈ బ్లాగులో పంచుకుంటాను. మీ చరణములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి".


సాయిభక్తుల అనుభవమాలిక 1245వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కావలసింది బాబాపై పూర్తి నమ్మకం
2. అమ్మనాన్న అయి చూసుకుంటున్న బాబా
3. బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత

కావలసింది బాబాపై పూర్తి నమ్మకం


నేను గత 20 సంవత్సరాలుగా సాయిని నమ్ముకున్న సాయి భక్తురాలిని. నేను ముందుగా సాయినాథునికి నమస్కరించి ఆయన మాకు ప్రసాదించిన రెండు అనుభవాలను ఈ బ్లాగులోని 'సాయిభక్త అనుభవమాలిక' ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. బాబాని నమ్ముకున్న తొలిరోజుల్లో ఊదీతో బాబా నాకు నయం చేసిన ఒక జబ్బు గురించి ముందుగా చెప్తాను. నేను ఒకప్పుడు తెలియక నా తలకి హెన్నా పెట్టుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని పడుకునేదాన్ని. దాని మూలంగా కొన్నిరోజులకు నాకు ఆస్తమా సమస్య బాగా వచ్చింది. దానితో నేను చాలా బాధపడ్డాను. మందులు వాడినప్పుడు ఉపశమించి మళ్ళీ మళ్ళీ వస్తుండేది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఆస్తమా వచ్చి ఆయాసం వల్ల నాకు ఊపిరి తీసుకోవటం కష్టమైంది. చాలా బాధను అనుభవించాను. అప్పుడు బాబాపై నమ్మకముంచి, "బాబా! మీ ఊదీని మందుగా తీసుకుంటున్నాను. ఈ బాధను తగ్గించండి బాబా" అని బాబాను వేడుకుని ఊదీ నీళ్లలో కలిపి త్రాగాను. ఒక్క అయిదు నిమిషాలు అయ్యేటప్పటికి అంతటి బాధ తగ్గిపోయి గాఢంగా నిద్రపట్టేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆస్తమా అనేదే మళ్లీ రాలేదు. ఈ అద్భుతాన్ని తలుచుకుంటే ఇప్పటికీ బాబా చూపిన దయకు నా కళ్ళవెంట నీరు కారుతోంది. "బాబా! మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు సాయి".


ఇక రెండవ అనుభవం విషయానికి వస్తే, ఇది ఇటీవల 2022, జూన్ మూడో వారంలో జరిగింది. నేను ఎప్పటినుంచో మా పాప విషయంలో ఒక సమస్యతో బాధపడుతున్నాను. ఆ విషయమై మా పాప ఎప్పుడూ, "అమ్మా! నువ్వు పిలిస్తే బాబా పలుకుతాడు. మరి నేను పిలిస్తే ఎందుకు రావడం లేదు. నువ్వు చెప్పినట్లే బాబా సేవ చేస్తున్నాను కదా! నా మొర ఎందుకు అలకించడం లేదు" అని అంటూ ఉండేది. నేను తనతో, "లేదమ్మా, ఎవరు పిలిచినా బాబా పలుకుతారు. కావలసింది ఆయనపై పూర్తి నమ్మకం" అని చెప్పేదాన్ని. తను అలాగే బాబాపై పూర్తి నమ్మకముంచడం వల్ల తన కోరిక నెరవేరింది. అసలు విషయమేమిటంటే, తను తన భర్త వల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల తను ఎమ్మెస్ చేయడానికి యు.ఎస్ వెళ్ళడానికి అప్లై చేసుకుంది. తనకి వీసా వచ్చింది. కానీ కొన్ని సమస్యల వల్ల యు.ఎస్ వెళ్లడం పోస్టుపోన్ చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వెళ్లడానికి i20 వీసాకోసం ఎదురు చూస్తున్న సమయంలో నేను ఈ బ్లాగులోని సాయిభక్త అనుభవమాలికలో భక్తులు పంచుకున్న అనుభవాలు చదివాను. వెంటనే నేను, "బాబా! మీ దయతో అమ్మాయికి i20 వస్తే, నేను కూడా నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా వెంటనే అనుగ్రహించారు. మర్నాడే i20 వీసా వచ్చింది. నా ఆనందాన్ని మాటల్లో రాయలేను. "బాబా! మీ పాదాలను నా ఆనందభాష్పాలతో కడగటం తప్ప నేనేమి చేయగలను. ఎన్నో సమస్యలను తప్పిస్తూ నా బిడ్డని ఇంతవరకు తీసుకొచ్చావు బాబా. ఇకపై కూడా ఏ సమస్యలు అడ్డుపడకుండా నా బిడ్డని తన పిల్లలతో అమెరికా వెళ్ళేటట్లు అనుగ్రహించు సాయిదేవా. రెప్పపాటు కాలం కూడా మీ పాదసేవ నుంచి, మీ అనుగ్రహం నుంచి మమ్మల్ని దూరం చేయకు తండ్రి సాయిదేవా".


అమ్మనాన్న అయి చూసుకుంటున్న బాబా


సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సాయి శ్వేత. మా కుటుంబం మొత్తం సాయి భక్తులం. మేము ప్రతిదినం, ప్రతిక్షణం బాబా దయతో బతుకుతున్నాము. ఆర్ధికంగా, మానసికంగా ఎన్ని బాధలున్నా బాబానే నా పుట్టింటి మరియు మెట్టినింటి కుటుంబాలను ముందుకి నడిపిస్తున్నారు. బాబా లేనిదే నా జీవితంలో ఏదీ లేదు. నా బాబా నా ప్రాణం. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిని పంచుకోవాలంటే రోజులు సరిపోవు. అబ్బాయిని ఎన్నుకోవడం దగ్గర నుండి నా పెళ్లి అయ్యేంతవరకు అంతా బాబా ఆశీస్సులతోనే జరిగింది. పెళ్లి జరుగుతున్నంతసేపూ నేను నా బాబా ప్రతిమను చేతిలో పట్టుకుని కూర్చున్నాను. పెళ్లయ్యాక  అరుంధతి నక్షత్రం చూపించేటప్పుడు ఒక వృద్ధుడైన ఒక ముస్లిం వ్యక్తి వచ్చి, "అల్లా అచ్చా కరేగా, బాబా అచ్చా కరేగా" అని మమ్మల్ని దీవించి వెళ్లారు. ఆ వృద్ధుని రూపంలో వచ్చింది నా బాబానే అని నాకు తెలుసు. ఆయన ఆశీస్సులతో నేను ఇప్పుడు అయిదు నెలల గర్భవతిని. మొదటి మూడు నెలలు వాంతులు ఎక్కువగా అవుతుండడంతో నాకు నీరసంగా ఉండేది. ఒకరోజు రాత్రి ఒంటిగంట సమయంలో నాకు వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. మొదటి గర్భం కావడంతో నాకు ఏమీ అర్థంకాక చాలా భయపడ్డాను. రాత్రంతా బాబాని తలచుకుంటూ, ఆయన నామజపం చేసుకుంటూ, "ఉదయానికల్లా వాంతులు తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని మొక్కుకున్నాను. ఆయన దయవల్ల ఉదయానికి వాంతులు, విరోచనాలు తగ్గాయి. ఇలాగే నా ఆరోగ్య విషయంలో బాబా చాలాసార్లు నన్ను కాపాడారు. ఉద్యోగరీత్యా భర్తతో ఒంటరిగా అమ్మనాన్నలకు, అత్తమామలకు దూరంగా ఉంటున్న నాకు ఈ సమయంలో నా బాబానే అమ్మనాన్న అయ్యి నా భర్త రూపంలో నన్ను చూసుకుంటున్నారు. ఎన్నని చెప్పను, ఎంతని చెప్పను నా తండ్రి బాబా గురించి. ఎంత చెప్పినా తక్కువే. బాబాకి చెప్పినట్టుగా నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. 


"బాబా! మూడు సంవత్సరాలుగా రావాల్సిన డబ్బులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాను. తిండికి, బట్టకి కూడా లోటు వచ్చే పరిస్థితి అని మీకు తెలుసు. కానీ ఎంత ఏడ్చి వేడుకున్నా మీరెందుకు ఇంకా కరుణించట్లేదు తండ్రి. మీ ప్రణాళికలు మీకు ఉంటాయని తెలిసినా, ఆర్ధిక ఇబ్బందులు చాలా ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పేరు, ఉద్యోగం ఉన్నా దానివలన ఏముందో, ఎమిలేదో మీకే తెలుసు సాయి. జీతాలు సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. నెలనెల కరెక్టుగా జీతాలు వచ్చేలా చూడు బాబా తండ్రి సాయి, ఆపద్బాంధవా! రావాల్సిన డబ్బు త్వరలో వచ్చేలా అనుగ్రహించు. త్వరలో మాకు శుభవార్త ఇస్తావని, మా జీవితాల్లో సంతోషాన్ని నింపుతావని ఆశిస్తున్నాను. మా సమస్య, కోరిక నెరవేరాక మీ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రి".


ఓం శ్రీసాయి రక్షక శరణం దేవా|

సర్వం శ్రీసాయి పరబ్రహ్మర్పణ మస్తు!!!


బాబా కృపతో పరీక్షలో ఉత్తీర్ణత


ముందుగా ఈ ఆధునిక సచ్చరిత్ర చదువుతున్న భక్తులకి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా జీవితమంతా ఒక బాబా మిరాకిల్. నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం మా అక్క కూతురుకి సంబంధించినది. తను ఒక ఏవరేజ్ స్టూడెంట్. కరోనా కారణంగా తను టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ అయింది. కానీ తన ఇంటర్ రెండో సంవత్సరం విషయంలో మేము భయపడ్డాము. ఎందుకంటే, తను లెక్కల్లో బాగా వీక్. తను ఈ సంవత్సరం ఫెయిల్ అయితే సప్లిమెంట్‍లో కూడా పాస్ అవుతుందో, లేదో చెప్పలేం. అదే జరిగితే ఒక సంవత్సరం గ్యాప్ వస్తుంది. కాబట్టి మేము 'ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయగలిగేది బాబా ఒక్కరే' అని ఆయన మీద పూర్తి నమ్మకముంచాము. ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు వచ్చేరోజు ఇన్స్టాగ్రామ్‍లో "సానుకూల ఫలితం రానుంది"  అన్న బాబా సందేశం నా కంటపడింది. దాంతో నేను 'మనకింక భయమెందుకు?' అని అనుకున్నాను. తరువాత వచ్చిన రిజల్ట్స్ లో అక్క కూతురు పాస్ అయింది. "థాంక్యూ బాబా. ఇలాగే EAMCETలో కూడా తనకి మంచి ర్యాంకు వచ్చి, ఇంజనీరింగ్‌లో అనుకున్న బ్రాంచ్‌లో సీట్ వస్తే మరల సాయిభక్త అనుభవమాలికలో పంచుకుంటాను. ప్లీజ్ బాబా... మంచి ర్యాంకును అనుగ్రహించండి. జీవితాంతం తనకి ఇలాగే అండగా ఉండండి. థాంక్యూ సో మచ్ బాబా. నా మనసులో ఏమి జరుగుతుందో మీకు తెలుసు. ఆ బాధ నుంచి నన్ను విముక్తురాలిని చేయండి. థాంక్యూ బాబా. మీకు ఎన్ని సార్లు థాంక్యూ చెప్పినా తక్కువే బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1244వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపతో 7 నెలల తరువాత దొరికిన చెవికమ్మలు
2. బాబా అద్భుత వరం
3. తల్లిదండ్రులను కాపాడిన బాబా

బాబా కృపతో 7 నెలల తరువాత దొరికిన చెవికమ్మలు 


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అంజునాగుప్తా. నేను మీ అందరికీ సుపరిచితురాలినే. నేను మూడు అంకెతో ముడిపడి, మూడు అంకెతో సుఖాంతమైన నా శిరిడీయాత్ర గురించి ఈమధ్యనే మీతో పంచుకున్నాను. 2021, నవంబరులో మేము శిరిడీ వెళ్లొచ్చిన అనుభవం కూడా మీ అందరితో పంచుకున్నాను. శిరిడీ నుండి వచ్చిన తరువాత 2021, నవంబర్ 11 నుండి 2022, జూన్ 13 వరకు నేను చాలా టెన్షన్ అనుభవించాను. అది చిన్న విషయం అనుకోవాలో, పెద్ద విషయం అనుకోవాలో నాకేం అర్థం కావడంలేదు గానీ, బాబా నా టెన్షన్‌ని ఎలా తీసేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను మామూలుగా నాలుగు గ్రాముల బంగారు చెవికమ్మలు పెట్టుకుంటూ ఉంటాను. వాటితోటే నేను శిరిడీ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని తీసి రూములో ఉన్న ఒక అలమారలో పెట్టి, కట్టుకున్న చీరకి మ్యాచింగ్ అని ఒక గ్రాము బంగారుదిద్దులు చెవులకి పెట్టుకున్నాను. వాటితోనే శిరిడీలో ఉన్న మూడు రోజులు గడిపి నాలుగవరోజు తిరుగు ప్రయాణమవుతూ రూము ఖాళీ చేసేటప్పుడు ఒకటికి, రెండుసార్లు నేను, మావారు రూమంతా చెక్ చేశాము. మా వస్తువులు ఏవీ రూములో లేవు అనిపించాకే శిరిడీ నుండి వచ్చేశాము. ఇంటికొచ్చిన తర్వాత శిరిడీకి తీసుకెళ్లిన లగేజ్ అంతా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ సర్దాను. కానీ నా బంగారు కమ్మలు ఎక్కడా కనిపించలేదు. వాటిని ఎక్కడైనా పెట్టినట్టు గుర్తు నాకు అస్సలు లేదు. అలాగని శిరిడీలో మర్చిపోలేదు. వాటిని తీసుకొచ్చాను అనే ఒక నమ్మకమైతే నాకు ఉంది. అయితే ఇంటిలో వాటిని ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఆ విషయమే మా వాళ్ళతో చెపితే, "తెచ్చినట్లు గుర్తుందని అంటున్నావు కదా, ఇంట్లో ఉంటే ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడో ఓ చోట ఉంటాయి వెతుక్కో" అని అన్నారు. అప్పటినుంచి ఇంట్లో మామూలుగా బంగారు వస్తువులు ఎక్కడైతే పెడతానో అక్కడంతా వాటికోసం వెతికాను. ఆయా చోట్లు క్లీన్ అయిపోయాయి కానీ అవి దొరకలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, వాటికోసం వెతికీ వెతికీ చివరికి, 'ఆ చెవికమ్మలను శిరిడీ నుండి తీసుకొచ్చానని అనుకుంటున్నాను కానీ, వాటిని అక్కడే వదిలేసి ఉంటాను, హ్యాండ్ బ్యాగులో పెట్టుకోలేదేమో' అని వాటి గురించి ఆశ వదిలేసుకున్నాను.


తరువాత మే నెలలో నేను బాబాకు దణ్ణం పెట్టుకుని, "బాబా! నా బంగారు కమ్మలు గనక నాకు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. రెండు మూడు వారాలు గడిచాయి. కానీ ఆ చెవికమ్మలు దొరకలేదు. 'ఇక అంతేలే, అవి ఇంకేం దొరుకుతాయి?' అని అనుకున్నాను. సరిగ్గా నాలుగో వారంలో సోమవారంనాడు మావారు బీరువాలో తనకి సంబంధించిన పేపర్లు ఏవో వెతుకుతుంటే, ఆయన చేతికి ఏ బాక్సులో అయితే ఆ బంగారు కమ్మలు ఉండేవో ఆ బాక్స్ తగిలింది. 'ఇది ఎందుకు ఇక్కడుందబ్బా? ఇది కళ్యాణ్ జ్యువెల్స్ బాక్స్ కదా!' అని ఆ బాక్స్ తీసి చూశారు. అందులో నా చెవికమ్మలు ఉన్నాయి. వెంటనే ఆయన, "నువ్వు ఒకసారి నీ చెవికమ్మలు కనిపించలేదని అన్నావు కదా, దొరికాయా?" అని అడిగారు. నేను, "లేదు" అంటే, "ఇవేనేమో చూడు" అంటూ వాటిని నా చేతికిచ్చారు. నా సంతోషానికి అవధులు లేవు. ఆనందంతో నాకు కన్నీళ్లొచ్చాయి. ఇంక బాబాకు కృతజ్ఞతలు చెప్పుకోవడం, వాటిని తీసిపెట్టుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఎంతోమంది భక్తులు 'తమ అనుభవాలను, బాధలను ఈ బ్లాగుకి వ్రాసుకుంటే బాబాతో చెప్పుకున్నట్లే' అని అంటున్న విషయం నాకు ఈ చిన్న అనుభవం నిరూపించిందని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క సాయిబంధువు తమ అనుభవాలను తప్పకుండా పంచుకుంటారని, తద్వారా బాబా అనుగ్రహాన్ని, ప్రేమను అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను.


ఈ బ్లాగును నడిపిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. అప్పుడు బాబాకి చెప్పుకున్నట్లు నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటే, ఖచ్చితంగా మనం కోరుకున్నది నెరవేరుతుంది. కానీ కొన్నికొన్ని కష్టాలుంటాయి. ఎందుకంటే, కొన్ని కర్మఫలాలు బలంగా ఉన్నప్పుడు వాటిని మనం అనుభవించక తప్పదు. అలాంటి విషయం ఒకటి నా విషయంలో జరుగుతోంది. అది ఎనిమిది సంవత్సరాల నిరీక్షణ. ఇప్పటికీ కొనసాగుతోంది. ఆ నిరీక్షణ ముగిసి నా కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని మీ అందరూ నాకోసం కోరుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆ కష్టం గనక తొలగిపోతే, ఈ బ్లాగులో పంచుకుంటాను.


బాబా అద్భుత వరం


బాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు జాహ్నవి. నేను 10 సంవత్సరాలుగా బాబాకు భక్తురాలిని. 2019లో నాకు పెళ్లి అయింది. ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల 'నాకు పిల్లలు పుట్టడం చాలా కష్టమ'ని చెప్పారు. 2021, జనవరిలో నేను ఒక బాబా గుడికి వెళ్ళినప్పుడు నాకు ధ్యానంలో 'దత్తసాయి' అన్న పేరు, 'దత్తాత్రేయుని విగ్రహం' కనిపించాయి. అప్పటివరకు నేను ఎప్పుడూ దత్తాత్రేయుని పూజించలేదు, ఆయన ఫోటో కూడా మా ఇంట్లో లేదు. 'అలాంటిది ఆయన ఎందుకు కనిపించారో'నని నేను ఆశ్చర్యపోయాను. 'సరే, ఈ విషయంలో బాబా నాకు ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనే మళ్లీ నాకు తెలియజేస్తారు' అని అనుకున్నాను. తరువాత మేము 2022, సంక్రాంతికి వైజాగ్ వెళ్లి, తిరిగి రాజమండ్రి మీదుగా హైదరాబాద్ వస్తుంటే ఒక చోట కారు ఆపవలసి వచ్చింది. అక్కడ 'దత్తసాయి' మందిరం అని ఒక గుడి కనిపించింది. ఆ గుడిలో నాకు అదివరకు ధ్యానంలో కనిపించినటువంటి దత్తవిగ్రహం ఉంది. ఒక చిన్న సాయిబాబా విగ్రహం ఉయ్యాలలో వేసి ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, ఊదీని నుదుటన పెట్టుకున్నాను. ఎందుకు అలా చేయాలనిపించిందో తెలియదుగానీ కొంచెం ఊదీ నా పొట్టపై కూడా పెట్టుకున్నాను. ఆ నెల నాకు నెలసరి రాలేదు. జనవరి 20న ప్రెగ్నెన్సీ టెస్టు చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇది బాబా నా జీవితంలో చేసిన ఒక అద్భుత వరం


బాబా దయవల్ల 20 వారాల వరకు అంతా బాగానే నడిచింది. కానీ 20వ వారంలో స్కానింగ్ తీస్తే, రిపోర్టులో బేబీ కిందకి వచ్చేసిందని వచ్చింది. దాంతో కుట్లు వేసి, బెడ్ రెస్ట్‌లో ఉండమని డాక్టర్ చెప్పారు. అమ్మావాళ్ళు నన్ను పుట్టింటికి తీసుకుని వచ్చారు. ఇక్కడకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను 'ఎన్ని ఇబ్బందులు వచ్చినా బాబా కాపాడుతార'నే నమ్మకంతో ఉండసాగాను. 25వ వారంలో నొప్పులు వచ్చి హాస్పిటల్లో  అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నేను చాలా భయపడి బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నన్ను ఈ గండం నుండి బయటపడేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. డాక్టరు, "28వ వారం స్కానింగ్ రిపోర్టు చూసి, ఏ విషయమూ చెప్తాన"ని అన్నారు. బాబా దయవల్ల స్కానింగ్ రిపోర్టులు నార్మల్‌గా వచ్చాయి. బాబానే నన్ను, నా బిడ్డను దీవించారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయిన శ్రీసాయికి కోటి కోటి నమస్కారాలు.


తల్లిదండ్రులను కాపాడిన బాబా


సాయిబాబాకి ప్రణామాలు. సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు బిందు. మా  కుటుంబమంతా సాయిభక్తులం. మాకు ఎప్పుడు ఏ బాధ కలిగినా బాబా మాకు తోడుగా నిలుస్తారు. నాకు చాలాసార్లు మా ఇంటి పూజగది ప్రాంగణంలో గోడ మీద బాబా రూపం దర్శనమైంది. ఒకసారి మా ఇంట్లో కుటుంబ సమస్యల వలన గొడవ జరిగి మా అమ్మానాన్నల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అమ్మ ఇంట్లో గొడవలకి తట్టుకోలేక ట్రైన్ కింద పడాలని వెళ్ళింది. ఇంకొక్క క్షణంలో ఆమెను ట్రైన్ ఢీకొట్టబోతుందనగా బాబా మానవాకారంలో ప్రత్యక్షమై అమ్మని కాపాడారు. కేవలం ఆయన దయవల్లే అమ్మ తీవ్రగాయాలతో బయటపడింది. మేము బాబాను, "అమ్మని జాగ్రత్తగా చూసుకుని, త్వరగా కోలుకునేలా అనుగ్రహించు బాబా" అని వేడుకున్నాము. బాబా దయవల్ల వారంరోజుల్లో అమ్మ గాయాలు మానిపోయాయి. ఇక నాన్న విషయానికి వస్తే, కుటుంబ గొడవల్లో నాన్నకి చాలా గాయాలయ్యాయి. ఆయన మనస్తాపం చెంది ఇంట్లో చెప్పాపెట్టకుండా ఎటో వెళ్ళిపోయారు. మేము ఆయనకోసం చాలా వెతికాము. కానీ ఎంతకీ నాన్న ఆచూకీ తెలియలేదు. నేను చాలా బాధపడి బాబానే శరణువేడాను. రెండు రోజుల్లో బాబా నాన్నని ఇంటికి తిరిగి రప్పించారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


సాయిభక్తుల అనుభవమాలిక 1243వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీరామనవమి సమయంలో బాబా అనుగ్రహం
2. బాబా కరుణ
3. బాబా అనుగ్రహంతో బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్

శ్రీరామనవమి సమయంలో బాబా అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః:!!!

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


'సాయి మహారాజ్ సన్నిధి' బాగు నిర్వహిస్తున్న సాయికి, మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సంధ్య. శ్రీ సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాలు పంచుకోబోతున్నాను. ముందుగా నా అనుభవాలను పంచుకోవడం ఆలస్యమైనందుకు సాయీశుడిని క్షమాపణలు వేడుతున్నాను. 2022, శ్రీరామనవమి రోజున మావారు బాబా దర్శనం చేసుకుని వద్దామంటే, సరేనని వెళ్ళాము. దర్శనమయ్యేసరికి మధ్యాహ్న హారతి సమయం కావడంతో నేను, "బాబా! మధ్యాహ్న ఆరతికి నేను, నాభర్త మందిరంలోనే ఉండేలా చూడు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఇంతలో ప్రక్కనే ఉన్న ఒక సాయి భక్తురాలు శ్రీసీతారాములను చక్కగా అలంకరిస్తూ, "బాబాకి ఆరతి  పూర్తికాగానే  శ్రీసీతారాముల కళ్యాణం జరుగుతుంది" అని చెప్పింది. నేను మళ్ళీ, "సాయీ! నేను, నా భర్త శ్రీసీతారాముల కళ్యాణం చూడాలి. ఇంటికి వెళదామని మావారు తొందర పెట్టకుండా ఉండేలా చూడు తండ్రి" అని మనసులోనే బాబాను ప్రార్థించాను. బాబా దయవలన మేము ఆరతిలో పాల్గొని, శ్రీసీతారాముల కళ్యాణం కనులారా వీక్షించాము. కళ్యాణం జరుగుతున్నప్పుడు ఒక భక్తురాలు నాతో, "కళ్యాణం తరువాత ముత్యాల తలంబ్రాలు ఇస్తార"ని అన్నారు. మళ్ళీ అంతలోనే, "అందరికీ ఇస్తారో, లేదో తెలీదు, తెలిసినవాళ్ళకైతే ఇస్తారు" అన్నారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! మేము మొదటిసారి మీ దయవలన శ్రీసీతారాముల కళ్యాణం చూసాము. దయతో ముత్యాల తలంబ్రాలు నాకు కూడా అందేలా మీ ప్రేమను చూపండి సాయి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల నాకు ఐదు ముత్యాల తలంబ్రాలు ఇచ్చారు. ఇంకా శ్రీసీతారాముల కళ్యాణం సమాప్తం కాగానే అన్నప్రసాదం ఉంటుందని అనౌన్స్ చేసారు. అప్పుడు నేను నా మనసులో, "బాబా! కరోనా వల్ల లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి నేను మీ మందిరంలో ప్రసాదం తినలేదు(మేము శిరిడీ వెళ్లినప్పటికీ అక్కడ అన్న ప్రసాదాలయం ఓపెన్ చేసి లేదు). ఈరోజు మీ దయవలన నేను, నాభర్త అన్నప్రసాదం తినాలి. ఆ అదృష్టాన్ని మాకు ప్రసాదించండి. నా భర్త ఇప్పుడే నన్ను ఇంటికి తీసుకెళ్లొద్దు. మీ ప్రసాదం తిన్నాకే మేము ఇంటికి పోవాలి" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా అనుగ్రహించారు. మధ్యాహ్న ఆరతి, శ్రీసీతారాముల కళ్యాణం, తలంబ్రాలు, అన్నప్రసాదం ఇలా నా మనసులోని కోరికలన్నీ తీర్చి సంతోషంగా మమ్మల్ని ఇంటికి పంపారు. నిజానికి మేము శ్రీరామనవమికి శిరిడీలో ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాము. అలా అనుకున్న మమ్మల్ని బాబా తమ మందిరానికి రప్పించుకుని అన్న ప్రసాదం పెట్టి ఎంత గొప్పగా అనుగ్రహించారో అని మేము ఇంటికి వచ్చాక చాలా ఆనందించాము. బాబా మన ప్రతి మాటను వింటారు - ప్రతికోరికను తీరుస్తారు. "శ్రీరామనవమి రోజున మీ సన్నిధిలో చాలా సమయం గడిపేలా అనుగ్రహించిన సాయితండ్రి, మీకు కోటి కోటి ప్రణామాలు,ధన్యవాదాలు".


నేను శ్రీరామనవమి సమయంలో శ్రీసాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయాలనుకున్నాను. కాని కొంచెం ఆలస్యమై బాబా దయవల్ల శ్రీరామనవమి పోయిన 4వ రోజు పారాయణ పూర్తి చేసాను. నిజానికి ఆ సమయంలో నాకున్న పనుల ఒత్తిడివల్ల ఏడురోజుల్లో పారాయణ పూర్తి చేయలేను అనుకుని బాబాను, "ఏడురోజుల్లో పారాయణ పూర్తిచేసే శక్తినివ్వమ"ని అడిగాను. ఆయన అనుగ్రహం వల్లే నేను పారాయణ పూర్తి చేయగలిగాను. ఇకపోతే, పారాయణ పూర్తవుతూనే తమను దత్త రూపంలో దర్శించే భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఆరోజు మావారు శ్రీక్షేత్ర గాణుగాపురం వెళదామన్నారు. నేను సరేనని, "బాబా! తోడుగా ఉండి గాణుగాపురంలో దత్త దర్శనం జయప్రదమయ్యేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్ధించాను. ఆ పై 2022, ఏప్రిల్ 25, గురువారం ఉదయం మేము బయలుదేరి ఆరోజు సాయంత్రం 4 గంటలకి గాణుగాపురం చేరుకుని రూమ్ తీసుకుని సంగమనేరు వెళ్లి అక్కడున్న భీమా నదిలో స్నానమాచరించి, ప్రదక్షణలు చేసి, దత్తావతారాల దర్శనం చేసుకున్నాము. తరువాత దత్త నిర్గుణ పాదుక దర్శనం చేసుకుని, కల్లేశ్వరుని, శనీశ్వరుని కూడా దర్శించుకున్నాము. అప్పటికీ సాయంత్రం 7 గంటలవుతుంది. మరోసారి దత్త నిర్గుణ పాదుకా దర్శనం చేసుకుందామని వెళ్లి, ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాము. ఒక భక్తుడు రాత్రి 8 గంటలకి ఆరతి ఉంటుందని చెప్పారు. సరేనని వేచి ఉండగా మేము ఊహించని విధంగా ఆరతితోపాటు పల్లకి సేవను కూడా కనులారా తిలకించే భాగ్యం మాకు దక్కింది. పల్లకి సేవ అనంతరం రూమ్‍కి వెళ్ళాము. మరుసటిరోజు శుక్రవారం మళ్ళీ పాదుకలు దర్శించుకుని ఇంటికి బయలుదేరేముందు నేను మావారితో, "ఒకసారి 'సాయి మహారాజ్ సన్నిధి' ఓపెన్ చేయండి" అని అన్నాను. ఆయన ఓపెన్ చేయగానే అందులో, "నేను నీకోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాను. నీవు నాకోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావా?" అన్న సాయి సందేశం ఉంది. అది చూసి ఆనందంతో కోవా తీసుకుని వెళ్లి, సాయి దత్తునికి నివేదించి అందరికీ ప్రసాదం పంచాము. ఇక్కడొక విషయం చెప్పాలి, ముందురోజు మేము దర్శనానికి వెళ్ళినప్పుడు లడ్డూలు తీసుకెళ్ళి స్వామికి నివేదించి బయటకు వస్తుంటే ఒక అతను, "ప్రసాదం ఇవ్వు" అని అడిగి మరీ తీసుకున్నాడు. అ రూపంలో బాబానే ప్రసాదం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించారని మేము భావించాము. ఆ విధంగా నేను కోరుకున్నట్లే తోడుగా ఉండి గాణుగాపురంలోని దత్త దర్శనాన్ని జయప్రదం చేసారు నా సాయితండ్రి.


చివరిగా ఇంకో విషయం, నేను 2022, ఫిబ్రవరి నుండి శ్రీ గురుచరిత్ర ఒకసారి పారాయణ చేయాలని అనుకుంటూ ఉండేదాన్ని. కాని "సాయి భక్తులకు సాయిచరిత్రే గురుచరిత్ర" అని శ్రీబాబూజీ చెప్పిన మాటను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో చదివాను. దాంతో శ్రీగురుచరిత్రకి బదులు సాయి చరిత్రనే శ్రీరామనవమి సందర్భంగా చదవాలనుకున్నాను. తరువాత ఒకరోజు రాత్రి నేను బాబా అపార ప్రేమను మననం చేసుకుంటూ నిద్రపోయాను. నిద్రలో 'దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా' అనే దత్త మంత్రం మృదువైన స్వరంలో వినిపించింది. శ్రీగురుచరిత్ర పారాయణ సంకల్పం రావడం, కలలో బాబా దత్తమంత్రం ఉపదేశించడం, శ్రీరామనవమికి సాయి సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయించడం, అంతలోనే శ్రీదత్త క్షేత్రమైన గాణుగాపురం దర్శించే భాగ్యం కల్పించడం బాబా ప్రేమకు నిదర్శనం. "బాబా! మీ అపార ప్రేమకు నేను దాసురాలిని తండ్రి. మీ పాదాలకు శరణం సాయీ!".


సద్గురు చరణం భవభయ హరణం శ్రీసాయినాథ శరణం.

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా కరుణ


నా పేరు లక్ష్మి. నేను బెంగుళూరు నివాసిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. ముందుగా సాయినాథునికి నమస్కారాలు. బ్లాగు నిర్వహిస్తున్న సాయి బృందానికి  కృతజ్ఞతలు. 2022, జూన్ మొదటివారంలో మా అబ్బాయివాళ్ళు విజయవాడ వెళ్లొచ్చారు. తరువాత మా మనవరాలికి జలుబు, దగ్గు, జ్వరం ఉంటే కరోనా టెస్టు చేయించాము. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. ఇంక మనవరాలిని గృహ నిర్బంధంలో ఉంచి మందులు వాడాము. తనకి బదులు నేను బాబా ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ ఉండేదాన్ని. పాపకి దగ్గు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాకు చాలా భయమేసేది. అప్పుడు కూడా నేను బాబాను స్మరించుకుంటూ ఉండేదాన్ని. వారం రోజులు తరువాత టెస్టు చేయిస్తే బాబా దయవల్ల తనకి నెగిటివ్ వచ్చింది. అయితే పాపకి ఇంకా దగ్గు ఉంది. అది కూడా బాబా దయవల్ల త్వరలో తగ్గిపోతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొక  చిన్న అనుభవం, 2022, జూన్ 27, ఉదయం ఫోన్ ఛార్జింగ్ పెడితే, ఛార్జ్ కాలేదు. చాలాసేపు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు గుర్తొచ్చి బాబా ఊదీ ఛార్జర్‍కి, ఫోన్‍కి పెట్టి ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అయింది. తలచినంతనే పలుకుతారు బాబా. "ధన్యవాదాలు బాబా. మీ కరుణ మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి తండ్రి".


శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహరాజ్ కు జై!!!


బాబా అనుగ్రహంతో బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నేను ఒక సాయి భక్తురాలిని. చిన్నతనం నుండి విషయం చిన్నదైనా, పెద్దదైనా నేను బాబా మీద ఆధారపడతాను. నేను పోయిన ఎడాది ఎల్.ఎల్.బి పూర్తి చేసాను. నా తోటి వాళ్ళందరూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో ఎన్ రోల్మెంట్ చేసుకున్నా, కొన్ని ఇబ్బందుల వల్ల నేను చేసుకోలేకపోయాను. తరువాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు క్లోజ్ చేసారు. నాకు ఏమి చెయ్యాలో తోచక బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ వచ్చింది. అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకుని నమోదు చేసుకోడానికి బయలుదేరాను. కానీ మనసులో అక్కడ వాళ్ళు ఇంకేమైనా పత్రాలు అడుగుతారేమోనని కొంచం భయపడి,."బాబా! ఎన్ రోల్మెంట్ కి ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకోగలిగితే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. బాబా అనుగ్రహం వల్ల చాలా సులభంగా దరఖాస్తు చేసుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నా కాండక్ట్ సర్టిఫికెట్ లో ఎవరైనా ఇద్దరు సీనియర్ లాయర్లు సంతకాలు చేయాల్సి ఉండగా నాకు అక్కడ ఎవరూ పరిచయం లేదు, మరెలా అనుకుంటుంటే, సరిగా అప్పుడే వయసుపైబడిన ఒక సీనియర్ లాయర్ అక్కడికి వచ్చి, "ఎవరికైనా సంతకాలు కావాలంటే నేను చేస్తాను. ఫలానా చోటుకి రండి" అని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆయన నా అప్లికేషన్ లో అన్నీ వెరిఫై చేసి, సంతకం చేసి, ఇంకో లాయర్ చేత కూడా చేయించారు. ఇదంతా బాబా అనుగ్రహం కాక మరేమిటి!!

  

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!

సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!




సాయిభక్తుల అనుభవమాలిక 1242వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి సమస్య విషయంలో బాబా అనుగ్రహం
2. శ్రీసాయినాథుని ఆశీర్వాదం
3. కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా

ప్రతి సమస్య విషయంలో బాబా అనుగ్రహం


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు రవీంద్ర. నేను హైదరాబాద్ నివాసిని. నేను చాలా సంవత్సరాల నుండి సాయి భక్తుడిని. బాబా ఆశీస్సులతో నాకు చాలా అనుభవాలు జరిగాయి. ఇదివరకు చాలా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకప్పుడు నేను ఒక ఆఫీసులో టైపింగ్ వర్క్ చేశాను. ఆ పనికి గానూ నాకు రావాల్సిన డబ్బులు చాలా రోజులు గడిచినా ఇవ్వలేదు. ఆ విషయంలో నేను, "బాబా! నాకు రావాల్సిన డబ్బు వచ్చేటట్లు చేయండి. మీ అనుగ్రహంతో నా డబ్బులు నాకు వస్తే, ఆ అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన నా డబ్బులు నాకు వచ్చాయి. "బాబా! ఆఫీస్ నుండి నాకు రావాల్సిన డబ్బులు వచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు". 


2022, జూన్ 2 రాత్రి నా ఛాతి పైభాగంలో నొప్పి వస్తే, "బాబా! మీ దయవలన నొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకుని నొప్పి ఉన్న చోట బాబా ఊదీ రాసుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి పడుకున్నాను. బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. మర్నాడు ఉదయం కొద్దిగా కండరం నొప్పిగా అనిపించినప్పటికీ బాబా దయతో తగ్గిపోయింది. నాకు తరచు గ్యాస్ట్రిక్ నొప్పి వస్తుంటుంది. ఒకసారి అలా వచ్చినప్పుడు ఎంతకీ తగ్గలేదు. అప్పుడు బాబా ఊదీ రాసుకుని, కొద్దిగా ఊదీ నోట్లో వేసుకున్నాను. తెల్లారేసరికి నొప్పి తగ్గింది. అలాగే మరోసారి అకస్మాత్తుగా గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చి, అప్పుడు కూడా ఎంతకీ తగ్గలేదు. "బాబా! ఈ నొప్పి తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను అని" బాబాను ప్రార్థించాను. అలా ప్రార్థించినంతనే నొప్పి తగ్గింది. "థాంక్యూ సో మచ్ బాబా".


మా పాపకి పరీక్షల సమయంలో హఠాత్తుగా దగ్గు, జలుబు, చేయినొప్పి వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! పాపకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడండి. తను మంచి మార్కులతో పాస్ అయినట్లయితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన పాప మంచి మార్కులతో పాస్ అయింది.


నాకు ఒక కిరాణా షాపు ఉంది. అది సరిగా నడవడం లేదని, ఆ షాపు మూసేద్దామని నిర్ణయించుకున్నాను. ఆ షాపులో ఉండే ర్యాక్స్, కౌంటర్స్ అమ్మేద్దామనుకుని, "బాబా!  మీ దయతో షాపులోని రాక్స్, కౌంటర్స్ అమ్ముడైపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అవి అమ్ముడైపోయాయి. "ధన్యవాదాలు బాబా. మూడు సంవత్సరాలుగా నేను ఉదోగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. మీ దయవలన ఉదోగ్యం వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. దయచేసి నాకు ఈ నెలలో ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి. భక్తులందరికీ మీ ఆశీస్సులు ఉండాలి తండ్రి".


శ్రీసాయినాథుని ఆశీర్వాదం


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! ముందుగా ఈ బ్లాగును అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, సాయి బంధువులకు నమస్సుమాంజలి. నా పేరు లక్ష్మి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు ఈమధ్య జరిగిన మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. ఈమధ్య మావారు ఒకసారి కళ్ళు టెస్టు చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్లారు. అక్కడ అన్ని రకాల టెస్టులు చేసి, "కుడికంటిలో నరాలు బలహీనంగా ఉన్నాయి. గ్లూకోమా కూడా మొదటి స్టేజిలో ఉంది" అని చెప్పారు. రెండు రోజుల తరువాత మరొక టెస్టు చేసి, "జాగ్రత్తగా ఉండమ"ని చెప్పారు. ఆ విషయం విని నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. సెకండ్ ఒపీనియన్ కోసం ఒకసారి ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి మరోసారి టెస్టు చేయించుకోమని మావారితో చెప్పి, మనసులోనే, "బాబా!  మావారి రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించండి. అదే జరిగితే, ఈ అనుభవం బ్లాగులో  పంచుకుంటాను" అని సాయినాథుని ప్రార్థించాను. వారం రోజుల తరువాత మాకు ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో అపాయింట్మెంట్ దొరికితే, చెకప్ కోసం అక్కడికి వెళ్ళాము. అక్కడి డాక్టర్లు మరలా టెస్టులు అన్ని రాసారు. నేను బాబా నామస్మరణ చేసుకుంటూ, "రిపోర్టులు నార్మల్‌గా రావాల"ని దయగల తండ్రి సాయినాథుని ప్రార్ధించాను. ఆయన ఆశీర్వాదబలం వల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. డాక్టరు, "మీరు చెప్పినట్లుగా ఏమీ లేదు. నరాలన్నీ బాగానే ఉన్నాయి. అంత వీక్‌గా ఏమీ లేవు. గ్లూకోమా ఉన్నట్లు కూడా ఏమీ కనిపించట్లేదు" అని చెప్పారు. అంతా ఆ సమర్ధ సద్గురు సాయినాథుని ఆశీర్వాదామని మాకు అనిపించింది.


ఈ మధ్య మేము మా బంధువుల ఇంట్లో పెళ్లికని విజయవాడ వెళ్ళాము. పెళ్ళైన తరువాత మేము శ్రీకనకదుర్గ మరియు శ్రీ మంగళగిరి పానకాల నరసింహస్వామి వార్ల దర్శనానికి వెళ్లాలని అనుకున్నాము. అయితే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నా ఆరోగ్యం చెడి విరోచనాలతో ఇబ్బందిపడ్డాను. అప్పుడు సాయినాథున్ని తలుచుకుని ఊదీ మంచినీళ్లలో కలుపుకుని త్రాగి, "బాబా! నాకు ప్రయాణంలో ఏవిధమైన ఇబ్బంది లేకుండా చేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్ధించాను. అపూర్వమైన ఆయన ఆశీర్వాద బలం వల్ల ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దర్శనాలు బాగా జరిగాయి. ప్రయాణం కూడా సాఫీగా జరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. "సాయినాథా! మీకు నా హృదయపూర్వక వందనాలు తండ్రి. నిన్ను కొలుచుట మా పూర్వజన్మ సుకృతం. ఎప్పటికీ మీ కరుణ మాపై, సాయి భక్తులందరిపై ఇలాగే వర్షించాలి తండ్రి".


కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చేలా అనుగ్రహించిన బాబా


సాయి భక్తులకు నమస్కారం. నా పేరు అరుణ లక్ష్మి. ఇప్పుడు నేను బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటున్నాను. 2022, జూన్ నెలలో మేము మా బంధువుల గృహప్రవేశానికి వెళ్ళాము. తిరుగు ప్రయాణంలో మేము ఎక్కవలసిన ట్రైన్ ఆలస్యంగా నడుస్తుంది. రాత్రి సమయం కావడం వలన బాబు నిద్రకి తాళలేక ఏడుస్తూ ఉన్నాడు. కానీ ట్రైన్ ఎంతకీ రావడం లేదు. అది రానురాను ఆలస్యమవుతూ రాత్రి 2 గంటల అయింది. అప్పుడు ఇంకా నేను, "బాబా! చిన్నపిల్లాడితో ఇబ్బంది పడుతున్నాము. దయ చూపి ట్రైన్ వేగంగా వచ్చేలా చూడు స్వామి. నా ఈ అనుభవం బాబా భక్తుల బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అంతే, కొద్ది నిమిషాలలోనే ట్రైన్ వచ్చింది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి! 'బాబా పిలిస్తే పలికే దైవం' అనడానికి. "ధన్యవాదాలు బాబా". నాకీ అవకాశం ఇచ్చిన బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు.


బోలో సమర్ధ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



సాయిభక్తుల అనుభవమాలిక 1241వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుని నమ్ముకుంటే - మన కష్టాలు గట్టెక్కినట్లే!
2. సాయితండ్రి చూపుతున్న కరుణ
3. క్రెడిట్ కార్డులు కనిపించేలా చేసిన బాబా

సాయినాథుని నమ్ముకుంటే - మన కష్టాలు గట్టెక్కినట్లే!


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. 2022, జూన్ 17 ఉదయం బాబా నాపై చూపిన దయ నేను ఎప్పటికీ మరిచిపోలేనిది. అప్పటికి నెల రోజుల ముందు నుండి మేము ఆర్థిక సమస్యలతో అధిక ఒత్తిడికి గురవుతూ ఉండేవాళ్ళం. నిజానికి నా కూతురుని, కుమారుడిని హైదరాబాదులో చదివించే ఆర్థిక స్తోమత నాకు ఉన్నప్పటికీ ఆ సమయంలో వాళ్లిద్దరికి ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది అయింది. సుమారు పదిహేను రోజుల పాటు నేను నమ్మిన బాబాను తలుచుకుని, "ఎలాగైనా సరే ఆర్థిక ఇబ్బందుల నుండి నన్ను గట్టెక్కించి, నా కొడుకు, కూతుర్లకు ఎలాంటి సమస్య లేకుండా కాపాడు తండ్రి" అని మనసులో వేడుకుంటూ ఉండేవాడిని. ఇలా ఉండగా 2022, జూన్ 17, గురువారం సాయంత్రం దగ్గలో ఉన్న బాబా మందిరానికి వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, "బాబా! శనివారం నాడు నా కొడుకుని హైదరాబాదులోని స్కూలులో విడిచి రావలసి ఉంది. కానీ అక్కడ కట్టడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు. ఎలాగైనా నీవే కాపాడు తండ్రి" అని సాయిని ప్రాధేయపడి ఇంటికి వచ్చాను. ఆ రాత్రి సరిగా నాకు నిద్రపట్టలేదు. ఉదయం లేచి యధావిధిగా ఫోను చేతిలో పట్టుకుని 'బ్యాంకు అకౌంటులో ఎన్ని డబ్బులున్నాయో, ఇంకా ఎంత డబ్బు అవసరం అవుతుందో' అని నా ఫోన్‍లో ఉన్న బ్యాంకు యాప్ ఓపెన్ చేశాను. అక్కడున్నది చూసి రెండు నిమిషాల వరకు నాకు ఏమీ తోచలేదు. చాలా ఆశ్చర్యకరమైన సందర్భమది. ఒక లక్ష నలభైఏడువేల రూపాయలు నా బ్యాంకు అకౌంటులో జమ అయి ఉండటం చూసి నా నోట మాట రాలేదు. వెంటనే నా భార్య దగ్గరకు వెళ్లి బాబా కృపాకటాక్షాల వలన డబ్బులు వచ్చాయి అని ఆనందంగా చెప్పాను. ఆమె కూడా చాలా ఆనందించింది. అసలు విషయమేమిటంటే, రెండు సంవత్సరాల క్రితం నేను ఒక లోన్ కోసం దరఖాస్తు చేసి ఉన్నాను. నాతోపాటు చాలామంది అప్లై చేసారు. అందరమూ ఆ విషయం గురించి మర్చిపోయాము. అలాంటిది సాయిని నమ్ముకున్నందుకు ఆ లోన్ ఇన్నాళ్ల తర్వాత నా ఒక్కడికి మంజూరైంది. సద్గురు శ్రీసాయినాథుని నమ్ముకుంటే చాలు, మన కష్టాలు గట్టెక్కుతాయి అనడానికి నిదర్శనం ఈ అనుభవం. నేను, నా కుటుంబం ఆ సాయినాథునికి ఎల్లవేళలా ఋణపడి ఉంటాము. ఆయన ఆశీర్వాదంగా వచ్చిన డబ్బుతో నా పిల్లలు మంచి విద్యాభ్యాసాన్ని, మంచి ప్రవర్తనను పొందాలని బాబాను కోరుకుంటున్నాను.


తరువాత నా కొడుకుని తీసుకుని హైదరాబాద్ వెళ్లి అక్కడ నారాయణ స్కూలు హాస్టల్లో చేర్పించి వచ్చాను. మరుసటిరోజే నా కొడుకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, "నాకు బాగా గొంతునొప్పిగా ఉంది. ఏమీ తినడానికి కూడా రావడం లేదు" అని ఏడుస్తూ చెప్పాడు. అప్పటికే 'చిన్నప్పటినుండి ఇంటి దగ్గర తప్ప హాస్టల్లో ఉండే అలవాటు లేని బాబు ఇప్పుడు హాస్టల్లో ఎలా ఉంటాడో?' అని దిగులు పడుతున్న నా భార్య బాబు చెప్పింది విని తీవ్ర ఆందోళనకు గురైంది. వెంటనే నేను, నా భార్య ఆ సాయినాథునికి దణ్ణం పెట్టకుని, "బాబా! బాబుని జాగ్రత్తగా చూసుకోండి. వాడి గొంతునొప్పిని తగ్గించండి" అని వేడుకున్నాము. ఆ సాయినాథుని కృపవలన మరుసటిరోజే బాబు గొంతునొప్పి తగ్గిపోయింది. "సాయినాథా! మీకు సాష్టాంగ నమస్కారాలు. నా కొడుకు హాస్టల్లో ఉండే ఇబ్బందులను అధిగమించి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచిగా విద్యాభ్యాసం చేసుకునేలా చూడు తండ్రి".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయితండ్రి చూపుతున్న కరుణ


ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు నీలిమ. మాది విజయనగరం. నేను బాబా భక్తురాలిని.  ప్రతి విషయంలో బాబా 'నేనున్నాన'ని నన్ను కాపాడుతున్నారు. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగు ద్వారా మీకు తెలియపరిచాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నాను. ఒకసారి నాకు తీవ్రమైన పన్ను నొప్పి వచ్చింది. ఆ కారణంగా నా ముఖమంతా వాచిపోయి, భరించలేని నొప్పికి నా కళ్ళ నుండి కన్నీళ్లు వాటంతటవే వచేస్తుండేవి. డాక్టరుకి చూపిస్తే, "జ్ఞానదంతంకి ఇన్ఫెక్షన్ అయింది. దాన్ని తీసేయాలి. కాకపోతే ఆ దంతం పూర్తిగా పైకి రాలేదు కాబట్టి చిన్న సర్జరీ చేసి ఆ దంతాన్ని తొలగించాలి" అని చెప్పి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మూడు రోజులకు మందులు రాసిచ్చారు. నాకు చాలా భయమేసి, "బాబా! నన్ను నువ్వే కాపాడాలి. ఆపరేషన్ అవసరం లేకుండా నాకు నయమయ్యేలా చేస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్ధించాను. బాబా దయవలన ఆపరేషన్ అవసరం లేకుండా మందులతోనే నాకు నయమైంది.


ఒకసారి మా చిన్నపాప సింక్ దగ్గర పని చేసుకుంటూ దాని మీద తన బలమంతా పెట్టింది. దాంతో సింకు అమాంతం తన కాలివేళ్ళ మీద పడిపోయింది. చాలా బరువైన పింగాణీ సింక్ ఒక్కసారిగా పాప కాలు మీద పడేసరికి నాకు చాలా భయమేసింది. పాప కాళ్ళు వణికిపోతున్నాయి, వేళ్ళు వాచిపోయాయి, బోటన వేలు నల్లగా అయిపోయింది. నేను చాలా కంగారు పడిపోయినప్పటికీ వెంటనే తేరుకుని బాబా ఊదీ పాపకి పెట్టి, నోటిలో కొంచెం వేసి తినిపించాను. నొప్పి తగ్గడం కోసం మందు కూడా వేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా బాబాని తలుచుకుంటూ ఆర్థోపెడిక్ డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళాను. ఆ క్లినిక్ పేరు 'సాయి ఆర్థోపెడిక్ క్లినిక్'. నేను బాబాని తలుచుకుని, "తండ్రీ! ఎటువంటి స్కానింగ్ అవసరం లేకుండా కేవలం మందులతో పాపకి త్వరితగతిన తగ్గిపోయేటట్టు చేయండి. నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. డాక్టరు మందులు రాసిచ్చారు. బాబా దయవలన ఆ మందులతో పాపకి నయమైంది. ఇలా తలచుకోగానే వెనువెంటే ఉంటూ, ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు బాబా. నాపై ఇంత కరుణ చూపుతున్నందుకు కృతజ్ఞతగా నేను ఈ బ్లాగు ద్వారా నా తండ్రి సాయిబాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


క్రెడిట్ కార్డులు కనిపించేలా చేసిన బాబా


సోదరభావంతో తోటి సాయిభక్తులకు బాబా తమకు ప్రసాదించిన అనుభవాలను సోదర సాయిభక్తులతో పంచుకునే అద్భుత అవకాశాన్నిస్తున్న బ్లాగు నిర్వాహకులైన సాయికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వక ప్రణామాలు. నాపేరు బాలాజీ. నేను సాయిభక్తుడిని. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవం పంచుకుంటున్నాను. ఈమధ్య నేను ఒక తీర్థయాత్రకు వెళ్లాను. అందులో భాగంగా ఒక దేవాలయానికి వెళ్ళాము. అక్కడ ధోవతి ధరించనిదే దర్శనానికి అనుమతించరని, మా పర్సులు, క్రెడిట్ కార్డులు, ఐడెంటిటీ కార్డులు మొదలైనవన్నీ లగేజీ బ్యాగ్‌లలో ఉంచి బస్సులోనే వదిలేయమని బలవంతం చేసారు. దాంతో మేము ధోవతీలు ధరించి మా లగేజీ బస్సులో ఉంచి దర్శనానికి వెళ్ళాము. దర్శనానంతరం మేము తిరిగొచ్చి బస్సులో బట్టలు మార్చుకున్నాం. తరువాత నేను నా బ్యాగులో పెట్టిన పర్సు, క్రెడిట్ మరియు ఐడి కార్దులు మొదలైన వాటికోసం వెతికితే క్రెడిట్ కార్డులున్న కవర్ కనిపించలేదు. దాంతో నేను చాలా నిరాశ చెంది వాటిని బస్సు క్లీనర్ తీసాడేమోనని అనుమానించాను. ఏదేమైనా నేను సహాయం కోసం నా తల్లి శ్రీశిరిడీ సాయిబాబాను అర్థించి, "నా క్రెడిట్ కార్డులు దొరికితే, నా అనుభవాన్ని ప్రియ సోదర సాయి భక్తులతో పంచుకుంటాన"ని ఆయనకి మాటిచ్చాను. బాబా దయవలన 5 నిమిషాల తర్వాత నా బ్యాగులోనే క్రెడిట్ కార్దులున్న కవర్ నాకు దొరికింది. సాయి మహరాజ్ నా ప్రార్థనను ఆలకించి నా క్రెడిట్ కార్డులను నాకు ఇచ్చారని చాలా సంతోషించాను. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నేను ఈ అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి".


శ్రీసమర్థ సద్గురు సచ్చిదానంద సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo