సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1246వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కరుణ
2. బాబా కృప అపారం

శ్రీసాయి కరుణ


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. గర్భవతిగా ఉన్న నా భార్యని ఏడవ నెలలో తన పుట్టింటికి పంపాలని నిర్ణయించాము. అందుకుగానూ విజయనగరం నుండి హైదరాబాద్‍కి ఎన్నిసార్లు రిజర్వేషన్ చేసే ప్రయత్నం చేసినా లోయర్ బెర్త్ రాలేదు. నేను 'బుక్ ఓన్లీ ఇఫ్ లోయర్ బర్త్ అవైలబుల్' అని పెడుతున్నప్పటికీ అప్పర్ లేదా మిడిల్ బెర్త్ మాత్రమే వస్తుండేవి. గర్భవతిగా ఉన్న నా భార్యగాని, వయసుపైబడిన మా అత్తయ్యగారుగాని పై బెర్తులు ఎక్కే పరిస్థితి లేదు. అందువలన నేను చివరికి రిజర్వేషన్ కౌంటరుకి వెళ్లి మెడికల్ సర్టిఫికెట్ చూపించి బుక్ చేద్దామనుకున్నాను. అనుకున్నదే తడువుగా రిజర్వేషన్ కౌంటరుకి వెళ్లి, మెడికల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ చూపిస్తే, వాళ్ళు ఒరిజినల్ కావాలన్నారు. కానీ ఒరిజినల్ మా దగ్గర లేదు. దాన్ని నా భార్య మెటర్నిటీ లీవ్ కోసం తన ఆఫీసులో ఇచ్చింది. అందువల్ల నేను చేసేదేమీ లేక రిజర్వేషన్ కౌంటరులో ఉన్న వాళ్ళని ప్రాధేయపడ్డాను. చివరికి ఎలాగో బాబా దయవల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. కాని లోయర్ బెర్త్ వస్తుందో, రాదో అన్న భయంతో నేను, "బాబా! మీ దయతో లోయర్ బెర్త్ వస్తే, నా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. ఆ బాబా దయవల్ల నా భార్యకి, తనకి తోడుగా వెళ్తున్న మా అత్తగారికి ఇద్దరికీ లోయర్ బెర్తులు వచ్చాయి. అంతా ఆ బాబా దయ.


ఇకపోతే, నా భార్య తన పుట్టింటికి వెళ్లేముందు చివరిసారిగా మేము ఉన్న చోట తనని చెకప్ కోసం డాక్టరు దగ్గరకి తీసుకుని వెళ్ళాను. డాక్టర్ స్కానింగ్ చేసి, "అంతా బాగానే ఉంది కాని, ప్లాసెంటా(మాయ)లో చిన్న బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వొచ్చు. ఇంకా ఉమ్ము నీరు చాలా తక్కువగా ఉంది" అని చెప్పి, "హైదరాబాద్ వెళ్లేముందు మరోసారి రండి" అని అన్నారు. నేను, "బాబా! మీ దయవల్ల ఈ రెండు సమస్యలు సమసిపోయి ఎటువంటి కష్టం లేకుండా నా భార్యకు సుఖ ప్రసవం అవ్వాలి తండ్రి. అలా జరిగితే, వెంటనే నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను తండ్రి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత నా భార్య హైదరాబాద్ వెళ్ళడానికి 2 రోజుల ముందు హాస్పిటల్‍కి వెళ్ళాం. అప్పుడు డాక్టరు చెక్ చేసి, "ఇప్పుడు అంతా బాగానే ఉంది. బిడ్డ ఆరోగ్యంగా ఉంది" అని అన్నారు. ఆ మాట విని మేము ఊపిరి పీల్చుకుని ఆనందంతో బాబాకి కృతఙ్ఞతలు చెప్పుకున్నాము.


నా భార్య జూన్ 21న బయలుదేరి విజయనగరం నుండి హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా సరిగా అదే సమయంలో అగ్నిపథ్ స్కీం వల్ల దేశమంతట ఆందోళనకర వాతావరణం నెలకొంది. అన్ని రైల్వేస్టేషన్లలో పూర్తి భద్రత ఏర్పాటు చేసారు. కానీ ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుంతో తెలియని పరిస్థితి. ఏ ట్రైన్‍ని కాల్చేస్తారో, ఎక్కడ ట్రైన్ ఆగిపోతుందో అని భయపడ్డాము. అట్టి స్థితిలో నేను ఆ సాయినాథుడిని తలుచుకుని, "ఏ సమస్య లేకుండా గర్భవతి అయిన నా భార్య క్షేమంగా గమ్యం చేరుకుంటే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. ఆ దయామయుని కృపవల్ల నా భార్య ఏ సమస్య లేకుండా క్షేమంగా హైదరాబాద్ చేరుకుంది. "ధన్యవాదాలు బాబా. వారంలో ఇంకో చెకప్ ఉంది. అంతా బాగుండేలా చూసి చక్కని బిడ్డని ప్రసవించేలా చూడు తండ్రి. ఎప్పటినుండో పెండింగ్‍లో ఉన్న నా ప్రమోషన్ ఈ నెలలో వచ్చేలా అనుగ్రహించు తండ్రి. అలాగే నేను చేస్తున్న వేరే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించేలా కరుణించు తండ్రి. తెలిసీతెలియక తప్పులు చేసి ఉంటే క్షమించు తండ్రి. చివరిగా మీ కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మీ బిడ్డలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


ఓం శ్రీసాయిదేవాయ నమః!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా కృప అపారం


నా పేరు సురేష్. 2022, జూన్ 17, శుక్రవారం రాత్రి ఓ దుర్మార్గుడి కారణంగా కలుషిత ఆహారం నాకు లభించింది. దాన్ని తిన్నాక నాకు రాత్రింబవళ్ళు విపరీతమైన వాంతులు, విరేచనాలు అవుతూ శరీరంలోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్‍కి గురయ్యాను. అస్సలు నిద్రలేక నాకొచ్చిన భయంకర సమస్యతో పోరాడుతూ దేవున్ని ప్రార్థించాను. అంతలో శరీరమంతా చల్లబడిపోయింది. నేను నా మనసులో, 'నన్ను కాపాడే వారెవరూ లేరు. నేను పోయినా బాధపడేవారు కూడా లేరు. ఇంతవరకు సాధించిన విజయాలు లేవు' అని అనుకున్నాను. ఇంకా అత్యంత పేదరికంలో ఉన్న నాకు ఆఖరి క్షణాలు దాపురించాయని అర్ధమైంది. కానీ చివరి క్షణంలో శ్రీ శిరిడీ సాయిబాబా గుర్తుకు వచ్చారు. వెంటనే కొంచెం ఊదీ నాలుకపై రాసుకుని, "బాబా! నాకొచ్చిన ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించి, బ్లాగులో ఈ అనుభవం  పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి" అని బాబాను అర్థించాను. అంతే కేవలం కొద్ది వ్యవధిలో అంతా సర్దుకుంది.


ఇంకో అనుభవం: గత సంవత్సరం మా కుటుంబ అవసరాల కోసం ఒక ఆవు కొన్నాము. ఇంట్లో వాళ్ళు ఆ ఆవుకి మూడుపూటలా గడ్డి మేపుతూ, అది ఇచ్చే పాలలో ఇంటి అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగిలిన పాలు విక్రయిస్తుండేవాళ్ళు. ఇలా ఉండగా 2022, జూన్ 27 సాయంత్రం ఆవు ఉన్నట్లుండి కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనపడలేదు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా వాళ్ళనుండి చూసామన్న సమాధానం రాలేదు. ఒక పక్క పాపం దూడ పాలకోసం అరుస్తుంది. మరోపక్క చీకటి పడి, వర్షం కూడా కురుస్తుంది. ఇంట్లో అందరూ ఆందోళన చెందుతూ, ఏం చేయాలో తెలియక బాధపడుతుంటే నేను కూడా వాళ్లతో కలిసి ఆవుని వెతకసాగాను. కానీ దొరకలేదు. అప్పుడు నాకు 'బాబాని ప్రార్థించి వెతకాల'నిపించి, ముందుగా 'ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి' అని అనుకుని, "బాబా! నాడు తప్పిపోయిన చాంద్‍పాటిల్ గుఱ్ఱాన్ని తిరిగి ఏ విధంగా దొరికేలా చేశారో, అలాగే ఈ గోమాతను దొరికేలా చేయండి సాయి" అని బాబాను ప్రార్ధిస్తూ బయటకు వెళ్లి ఆశ్చర్యపోయాను. చీకటిలో ఆవు వడివడిగా నడుచుకుంటూ వచ్చి శాలలోకి వెళ్ళిపోయింది. "ధన్యోస్మి బాబా. మీరు పిలిస్తే పలికే దైవం. నన్ను ఆదుకోండి. అస్తవ్యస్తంగా, చితికిపోయి ఉన్న నా బ్రతుకుని సరిదిద్దండి, నన్ను ఉద్ధరించి తరింపజేయండి. మీరే నా దైవం, మీరే నా తండ్రి, మీరే నా తల్లి, మీరే నాకు దిక్కు బాబా. ధర్మార్థ, కామ, మోక్షాలు నాకు ప్రాప్తింపజేయండి. మా ప్రాంతంలో మీ ఆలయ నిర్మాణం చేసే శక్తిని నాకు ప్రసాదించండి. మీ అనుగ్రహం ఈ బ్లాగులో పంచుకుంటాను. మీ చరణములకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి".


5 comments:

  1. Ome sri sai ram 🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం సాయి బాబా నీ కరుణ తో భా దలు పోయేలాగ ఆశీర్వదించు.ఆవు అనుభవం చాలా బాగా వుంది. నీకు అన్ని జరిపే శక్తి సామర్ధ్యాలు వున్నాయి

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo