సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1218వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కృప
2. మెడనొప్పి తగ్గించిన బాబా
3. మాట పడకుండా కాపాడిన బాబా

శ్రీసాయి కృప


నేను ఒక సాయి భక్తురాలిని. కరోనా కారణంగా నేను, నా పిల్లలు చాలా రోజులుగా మా అమ్మవాళ్ళింటికి వెళ్ళలేదు. ఈమధ్య మావారు వెళ్లిరమ్మని చెప్పినప్పటికీ మా అత్తగారు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చాలా ప్రయత్నాలు చేసారు. ఎట్టకేలకు బాబా దయవల్ల ఒకరోజు మా పెద్ద కారులో బయలుదేరితే, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైకి వెళ్ళగానే కారులోంచి పొగలు వచ్చాయి. నాకు ఏం చేయడానికి తోచక అమెరికాలో ఉన్న మావారికి ఫోన్ చేస్తే, హెల్ప్ లైన్‍కి ఫోన్ చేయమని చెప్పారు. నేను మా మామయ్యవాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి, ఆపై హెల్ప్ లైన్‍కి కూడా ఫోన్ చేశాను. కొద్దిసేపట్లో మా మావయ్య మా చిన్న కారులో, మావారి స్నేహితుడు మరో కారులో మా దగ్గరకి వచ్చి కారుని రిపేరుకి ఇచ్చారు. తరువాత మేము ఊరు వెళ్లడం ఇష్టం లేని మా మామయ్య అక్కడినుండి మా పిల్లల్ని తిరిగి ఇంటి తీసుకెళ్ళిపోతానని అన్నారు.  అసలే పెద్ద కారులోనే వస్తానని మారాం చేసే మా అబ్బాయి ఆ కారు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతానని ఆయన మాటలకు వంతపాడాడు. అయినా నేను ధైర్యం చేసి, ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని వెళతానని మా చిన్న కారులో బయలుదేరాను. మండే ఎండలకి ఏసీ వేసినా తనకి సరిపోవట్లేదని మా బాబు ఒకటే గొడవ చేసాడు. ఈ స్థితిలో ఏమన్నా అయితే మా అత్తగారు గొడవ చేస్తారని నేను భయపడ్డాను. కానీ మా ఊరు చేరేవరకు ఫోటో లేదా పేరు రూపంలో బాబా అడుగడుగునా దర్శనమిస్తూ మమ్మల్ని మా అమ్మ వాళ్ళింటికి చేర్చారు. ఇదివరకు ఎన్నోసార్లు ఆ మార్గంలో నేను ప్రయాణించాను కానీ, ఇంతలా బాబా ఉనికి నాకెప్పుడూ తెలియలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 


నేను అమ్మవాళ్ళ ఊరికి వచ్చేముందు ఆన్లైన్‍లో మా పిల్లల పుస్తకాలు ఆర్డర్ చేశాను. తరువాత పొరపాటున వేరే బుక్స్ బుక్ చేసి, డబ్బులు కట్టేసాననిపించి స్కూలుకి ఫోన్ చేస్తే, వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. ఈ విషయం మావారికి చెప్తే కోప్పడతారని నాకు భయమేసింది. ఊరికి వెళ్తూ దారిలో బాబాకి నమస్కారం చేసుకుని స్కూలు హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేస్తే, 'సరైన ఆర్డర్ పెట్టాన'ని చెప్పారు. అలా బాబా నా టెన్షన్ తీసేశారు.


ఇకపోతే మా అమ్మ, నాన్న ఉండేది పల్లెటూరు. ఒకరోజు ఏసీ వేయటం వల్ల అర్థరాత్రి 1 గంటకి మీటర్ కాలి విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. మాకు ఎప్పుడూ వచ్చే ఎలక్ట్రీషియన్‌కి కాల్ చేస్తే, అతను ఫోన్ ఎత్తలేదు. వేడికి నిద్రపోలేక పిల్లలు ఒకటే గొడవ చేస్తుంటే నేను, నాన్న చాలా టెన్షన్ పడ్డాము. మర్నాడు నాన్న వెళ్లి ఎలక్ట్రీషియన్‌ని తీసుకుని వస్తే, అతను బాగు చేయడానికి చాలా సమయం పడుతుందని అన్నాడు. అప్పుడు నేను, "బాబా! త్వరగా సమస్య పరిష్కారమై విద్యుత్తు సరఫరా జరిగితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల మధ్యాహ్నానికి విద్యుత్తు వచ్చింది. "ధన్యవాదాలు బాబా. అమ్మనాన్నలకి ఆరోగ్యసమస్యలున్నాయి బాబా. వాళ్ళు వయసు పైబడిన నాయనమ్మని కూడా చూసుకోవాలి. దయచేసి వాళ్లకున్న నొప్పులు తగ్గించండి బాబా".


మెడనొప్పి తగ్గించిన బాబా


నా పేరు సత్య. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకుంటున్నందుకు క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. 10, 12 సంవత్సరాల క్రిందట నాకు మెడ పట్టేసి చాలా నొప్పి పెట్టింది. మెడను ప్రక్కకు తిప్పాలన్నా, క్రిందకు చూడాలన్నా, ఆఫీసులో కంప్యూటర్ చూడాలన్న చాలా భాధగా ఉండేది. నేను ఇద్దరు, ముగ్గురు డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళు మందులు మార్చి మార్చి వ్రాసారు, సిటి స్కాన్, ఎమ్.ఆర్.ఐలు కూడా చేసారు. కాని లాభం లేకపోయింది. ఇంతలో అనుకోకుండా మా ఇంటికి మా బంధువులు వస్తే,  "డబ్బు, కాలం వృధా అవుతుంది కానీ, నా బాధ తీరడం లేదు. కనీసం 10 శాతం నొప్పి కూడా తగ్గలేదు" అని నా బాధ చెప్పుకున్నాను. అప్పుడు ఆయన మెడకు సంబంధించిన కొన్ని సింపుల్ వ్యాయామాలు చెప్పి ప్రతిరోజూ ఉదయం చేయమన్నారు. నేను ఆయన చెప్పిన వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాను. అలా నెల, రెండు, మూడు నెలలు గడిచాయి. వ్యాయామాలు చేస్తున్నా, మందులు వేసుకుంటున్నా అస్సలు నయం కాలేదు. తరువాత ఒకరోజు ఉదయం నేను బాబా పూజ పూర్తి చేసుకున్న తరువాత రోజువారీ అలవాటు ప్రకారం ఊదీ నుదుటన పెట్టుకుని, ఆపై అనుకోకుండా ఊదీతో ఉన్న నా వ్రేలుని మెడకు వెనకవైపు రాసుకున్నాను. సాధారణంగా నేను ఆ వ్రేలుని నా కంఠానికి రాసుకుంటాను. అలాంటిది ఆరోజు నాకు తెలియకుండానే మెడకు రాసుకున్నాను. తరువాత ఆఫీసుకి బయలుదేరి వెళ్తుంటే అన్నాళ్ళుగా అనుభవిస్తున్న మెడనొప్పి నుండి కొంత ఉపశమనంగా అనిపించింది. కారు నడుపుతున్నప్పుడు ఎటువంటి నొప్పి అనిపించలేదు. నేను ఇక అదే పనిగా రోజూ పూజ అనంతరం ఊదీ నుదుటన పెట్టుకుని, తరువాత మెడకు కూడా రాసుకోసాగాను. 3 రోజులలో నొప్పి పూర్తిగా అదృశ్యమైంది. నేను బాబా కృపకు చాలా ఆనందించాను. తరువాత ఆ మెడ నొప్పి గురించి నేను పూర్తిగా మరచిపోయాను. ఇన్ని సంవత్సరాల తరువాత 2022, మే నెలలో మళ్ళీ అదే నొప్పి వచ్చింది. పనుల వత్తిడి వల్ల నా గత అనుభవం నాకు జ్ఞాపకం రాలేదు. రోజూ పూజ పూర్తయిన తరువాత ఊదీ నుదుటన పెట్టుకుంటున్నాను కానీ, మెడకు పెట్టుకోవాలన్న ధ్యాస కూడా లేకపోయింది. ఇలా ఉండగా హఠాత్తుగా ఒకరోజు గతం జ్ఞాపకం వచ్చింది. దాంతో అప్పుడు చేసినట్లే రోజూ మెడకు ఊదీ పెట్టుకోవడం మొదలుపెట్టాను. గతంలోలాగే 3 రోజులలో నొప్పి మటుమాయం అయింది. ఏమని చెప్పమంటారు సాయి కృప గురించి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృప ఎప్పుడూ మీ భక్తులపై ఇలాగే ఉండాలి తండ్రి".


శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


మాట పడకుండా కాపాడిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. 2022, ఫిబ్రవరిలో మా అక్క, తన ఇద్దరు పిల్లలు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మా అక్క పెద్దకొడుకు మెడలో ఉన్న హనుమాన్ లాకెట్ మా ఇంట్లో ఎక్కడో పడిపోయింది. అది వాళ్లు మా ఇంటి నుండి వెళ్ళిపోయాక దొరికింది. అప్పుడు మా అక్క, "దాన్ని జాగ్రత్తగా మీ దగ్గరే దాచిపెట్టండి. ఎప్పుడైనా కలిసినప్పుడు తీసుకుంటాను" అని చెప్పింది. తరువాత జూన్‍లో మేము వాళ్ళింటికి వెళ్తున్నప్పుడు, "ఆ లాకెట్ తీసుకుని రండి" అని అక్క చెప్పింది. అయితే ఆ లాకెట్ కనిపించలేదు. పోయిందని చెప్తే, మాకు మాట వస్తుందని ఎంతగానో వెతికినప్పటికీ అది దొరకలేదు. అప్పుడు మేము బాబాకి దణ్ణం పెట్టుకుని, "లాకెట్ దొరికితే, మా అనుభవం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటామ"ని వేడుకున్నాం. తరువాత నా భార్య మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఆ లాకెట్ గురించిన ప్రస్తావన వస్తే, అమ్మ, "అది నా దగ్గరే ఉంద"ని చెప్పింది. అసలు దాన్ని మేము ఎప్పుడు అమ్మకు ఇచ్చామో మాకు ఎంత మాత్రమూ గుర్తులేదు. ఏదేమైనా బాబా దయవల్ల ఆ లాకెట్ జాడ ఆ విధంగా తెలిసింది. లేదంటే, మేము మాట పడేవాళ్ళము. “ధన్యవాదాలు బాబా”.


ఓం శ్రీసాయిదేవాయ నమః!!!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ  శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


2 comments:

  1. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  2. A carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo