సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1237వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి కరుణాతరంగాలు
2. స్నేహితునికి బాబాపట్ల భక్తివిశ్వాసాలు కుదిర్చిన అనుభవం
3. 'సాయి' అన్న పేరుతోనే సహాయం అందించిన బాబా

శ్రీసాయి కరుణాతరంగాలు


అనంతకోటి బ్రహ్మాండనాయకుడైన మన సాయినాథునికి అనంతకోటి నమస్కారాలు. సాయిబంధువులకు ప్రణామాలు. బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. నేనొక సాయిబిడ్డను. మాది ఏలూరు. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. గత 20 సంవత్సరాలుగా బాబాతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అందులో నుండి మూడు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 45 సంవత్సరాల వయసులో నాకు ఆడవాళ్ళ సమస్య మొదలైంది. నేను సంప్రదించిన ప్రతి డాక్టరూ, "ఆపరేషన్ చేయాల"ని అన్నారు. నాకు హాస్పిటల్ అన్నా, డాక్టర్లన్నా, ఇంజెక్షన్ అన్నా భయం. గత 25 సంవత్సరాల కాలంలో కేవలం 4, 5 సార్లే నేను ఇంజెక్షన్ చేయించుకున్నాను. అలాంటిది ఏకంగా ఆపరేషన్ అనేసరికి నేను చాలా భయపడిపోయి హోమియో వైద్యాన్ని ఆశ్రయించాను. డాక్టర్ పంకజాక్షన్ నాకు ధైర్యం కలగజేసి, ఆపరేషన్ అవసరం లేదని, మందులిచ్చారు. ఆ మందులు వాడుతుండగా ఒకసారి నాకు నెలసరి వచ్చిన తర్వాత మూడు నెలల వరకు డిశ్చార్జ్ అవుతూనే ఉండింది. అప్పుడు నాకు 'నా కూతురు పెళ్లి చేయకుండానే నేను చనిపోతాన'ని భయమేసి, "బాబా! నా సమస్యకు పరిష్కారం చూపించండి" అని బాబా వద్ద బాగా ఏడ్చి సచ్చరిత్ర తీస్తే, బాలాషింపీకి వచ్చిన మలేరియా జ్వరం విషయంలో, "నల్లకుక్కకి పెరుగన్నం పెట్టమ"ని బాబా అతనితో చెప్పడం గురించి వచ్చింది. బాబా మాటలపై ఎంతో నమ్మకముంచి నేను, నా భర్త వెళ్లి నల్లకుక్కకి పెరుగన్నం పెట్టి, నమస్కరించుకుని వచ్చాము. అంతే, నా నెలసరి ఆగిపోయి మళ్ళీ రాలేదు. డాక్టరు, "ఇంక మందులు అవసరం లేద"ని చెప్పారు. ఇది జరిగి 5 సంవత్సరాలు అయింది. బాబా ఆశీస్సులతో మా పాపకి, బాబుకి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ అనుభవాలను బాబా అనుగ్రహంతో మరోసారి పంచుకుంటాను.


ఇదివరకు మా అబ్బాయి అరుణ్ రాహుల్ 'serive now' అనే ప్రోడక్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తను ఆ కంపెనీ మారాలని ఉద్యోగాలకి అప్లై చేస్తే, 'అడోబ్' అనే కంపెనీ నుండి కాల్ వచ్చింది. ఆ కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నానని బాబు నాతో చెప్పినప్పుడు నేను 'అడోబ్'('Adobe') అనే పదంలో 'A' అంటే అక్కలకోటస్వామి అని, 'D' అంటే దత్తాత్రేయుడు అని, 'B' అంటే బాబా అని భావించి, "బాబా! బాబుకి ఆ కంపెనీలో ఉద్యోగం రావాలి" అని బాబాని వేడుకుని దణ్ణం పెట్టుకున్నాను. 5 రౌండ్ల ఇంటర్వ్యూ అయిన తర్వాత, రెండు గంటల్లో 6వ రౌండ్ ఇంటర్వ్యూ ఉందనగా మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, "అమ్మా! తాతగారు(నాకు బాబాయి) మన ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశారు. వెళ్ళి తాతగారిని తీసుకుని రావాలి" అని చెప్పాడు. నాకెందుకో బాబానే ఆ రూపంలో వస్తున్నారనిపించి, "వెళ్లి, తీసుకుని రా" అని బాబుతో చెప్పాను. వెంటనే బాబు వెళ్లి మా బాబాయిగారిని ఇంటికి తీసుకొచ్చి, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. కానీ ఇంటర్వ్యూ అయిన తరువాత బాబు, "ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంది, జాబ్ రాదేమో!" అని అన్నాడు. నేను తనతో, "ఆఫర్ వస్తే బాబా ఇచ్చారని, లేకపోతే బాబాకి ఇష్టం లేదని అనుకో" అని చెప్పాను. వారం తర్వాత కంపెనీవాళ్లు ఫోన్ చేసి, "నువ్వు జాబ్‍కి సెలెక్ట్ అయ్యావు" అని చెప్పారు. మునపటికంటే రెట్టింపు జీతంతో బాబు 2022, జనవరి 4న కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అనుకోకుండా ఆరోజు శ్రీనృసింహసరస్వతిస్వామి పుట్టినరోజు కావడం మా పూర్వజన్మ సుకృతమని, ఇది బాబా నిర్ణయించిన కంపెనీ అని నేను ఆనందించాను.


మా మామగారు ఆస్తి పంపకాలు చేయకుండానే చనిపోయారు. తరువాత 8 సంవత్సరాల పాటు ఆస్తి పంపకాలు చేయకుండా మమ్మల్ని చాలా బాధపెట్టారు. ఆ స్థితిలో నేను, "బాబా! మా ఇంటి పెద్దదిక్కు మీరు. ఇప్పటివరకు మీరే అన్ని చేశారు. ఆస్తి విషయంలో మేము ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. న్యాయంగా, ధర్మంగా మాకు రావాల్సింది మీరే ఇప్పించండి బాబా" అని వేడుకున్నాను. అలా బాబాను వేడుకున్న తరువాత వారి దయవలన 2022, మే 22న ఆస్తి పంపకాలు జరిగాయి. "బాబా! మీకు కృతజ్ఞతలు తండ్రీ. ఇకపోతే, మనశ్శాంతి లేకుండా నన్ను మనోవేదనతో క్రుంగదీస్తూ మీ స్మరణకి దూరం చేస్తున్న రెండు సమస్యల గురించి మీకు తెలుసు. ఆ సమస్యలు పరిష్కారం అయితే నా ఆనందాన్ని ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకుంటాను. మీ బిడ్డల్ని మీరు కాకపోతే ఎవరు కాపాడతారు తండ్రీ?".


స్నేహితునికి బాబాపట్ల భక్తివిశ్వాసాలు కుదిర్చిన అనుభవం


అందరికీ నమస్కారం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు అరుణ. నేను సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నా ఫ్రెండ్‍ని ఎలా ఆశీర్వదించారో మీతో పంచుకుంటాను. నా ఫ్రెండ్ పేరు లక్ష్మీనారాయణ. ఆర్థిక ఇబ్బందుల వలన అతను తనకున్న పొలం అమ్మి, అప్పులు తీర్చాలని సంవత్సరం క్రితం పొలం అమ్మకానికి పెట్టారు. అప్పటినుండి ఎవరెవరో వస్తున్నారు, పొలం చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ, కొనడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆ విషయం అతను రెండు నెలల క్రితం (2022, ఏప్రిల్ నెల మధ్యలో) నాతో చెప్పి చాలా బాధపడుతూ, "బాధలు భరించలేకపోతున్నాను,  చచ్చిపోవాలనిపిస్తుంది" అని ఏడ్చారు. నేను అప్పుడు, "ఒక  పని చెప్తాను. చేస్తావా?" అని అడిగాను. అందుకతను, "చేస్తాను" అని అన్నారు. "అయితే, నువ్వు ప్రతిరోజూ బాబా మందిరానికి వెళ్లి, నీ బాధ బాబాతో చెప్పుకుని భారం ఆయనపై వెయ్యి. బాబా ఖచ్చితంగా నీకు సహాయం చేస్తారు" అని చెప్పాను. నేను చెప్పినట్లే అతను రోజూ బాబా దగ్గరకి వెళ్ళి, తన బాధ చెప్పుకుని వస్తుండేవారు. మునుపటిలాగే పొలం చూసుకోవడానికి వస్తున్నారు, 'ఫోన్ చేసి చెప్తామ'ని చెప్పి వెళ్తున్నారు, కానీ ఏమీ చెప్పడం లేదు. అప్పులవాళ్ళు తమ అప్పు తీర్చమని నా ఫ్రెండ్‍కి గడువు ఇవ్వసాగారు. దాంతో నా ఫ్రెండ్, "ఈ పొలం అమ్ముడుపోదు, నాకు నమ్మకం లేదు" అని మళ్ళీ ఏడ్చారు. అప్పుడు నేను, "నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీ పొలం అమ్ముడుపోతుంది. మీరే చూడండి" అని అన్నాను. తరువాత నేను, "బాబా! నా ఫ్రెండ్ పొలం అమ్ముడైపోయి, వాళ్ళ బాధలు తీరేలా వాళ్ళకి సహాయం చేయండి. మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటి గురువారం నా ఫ్రెండ్, "పొలం చూడటానికి ఒకరు వచ్చారు" అని నాతో  చెప్పారు. "అయితే, వాళ్ళకే ఖాయం అయిపోతుందిలే" అని నేను అన్నాను. అతను, "చూద్దాం" అని అన్నారు. కానీ వాళ్ళు వెళ్లిన తరువాత ఫోన్ చేయలేదు. మా ఫ్రెండ్ ఆ విషయం నాతో చెప్పి, "నేనే వాళ్ళకి ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను" అని అన్నారు. నేను, "మీరు ఇప్పుడే చేయకండి. గురువారం బాబా గుడికి వెళ్ళి, చీటీలు వేసి, బాబా అనుమతి తీసుకుని అప్పుడు కాల్ చేయండి" అని చెప్పాను. అయితే అతను గురువారం గుడికి వెళ్లారు, కానీ నేను చెప్పినట్లు చీటీలు వేయలేదు. బాబా దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు. తర్వాత వీళ్ళ పొలం చూసుకుని వెళ్లినవాళ్ళు వాళ్ళంతట వాళ్లే వీళ్ళకి ఫోన్ చేసి రమ్మని పిలిచి, మా ఫ్రెండ్ వాళ్ళు అనుకున్న అమౌంట్ కంటే కొద్దిగా ఎక్కువకే బేరం కుదుర్చుకుని కొద్దిగా అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వెంటనే నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నిజానికి నేను ముందే అతనితో, "గురువారం రోజున, అదికూడా మీరు అనుకున్న దానికంటే అధిక మొత్తం బాబా మీకు వచ్చేలా చేస్తారు. బాబా మీద నమ్మకం ఉంచండి" అని చెప్పాను. అదే నిజమైంది. ఇప్పుడు అతనికి బాబా మీద భక్తివిశ్వాసాలు కుదిరాయి. ఎంతో ఆనందంగా ఉన్నారు. "బాబా! నా ప్రార్థనను మన్నించి వాళ్లకు సహాయం చేసినందుకు సహస్రకోటి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. బాధల్లో, కష్టాల్లో ఉన్న మీ బిడ్డలకు సహాయం చేసి, వాళ్ళను కష్టాల నుండి విముక్తుల్ని చేయండి సాయీ. నాకున్న సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తారని నమ్ముతున్నాను తండ్రీ. చివరిగా నా తప్పులు ఏవైనా ఉంటే క్షమించండి సాయీ". 


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


'సాయి' అన్న పేరుతోనే సహాయం అందించిన బాబా


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! నేనొక సాయిభక్తురాలిని.  నా సాయితండ్రి నన్ను ఎల్లవేళలా ఎలాంటి టెన్షన్ లేకుండా కాపాడుతున్నారు. నేను ఇదివరకు ఎన్నో అనుభవాలను ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. ఇటీవల మా బాబుకి ప్రమోషన్ (ప్రమోషన్ గురించి ఇదివరకు బ్లాగులో పంచుకున్నాను) వచ్చి ట్రాన్స్‌ఫర్ అయింది. మా బాబు ఫైనాన్స్ మేనేజర్ కావడం వలన కొత్తచోట తన కొలీగ్స్ ఒక రూమ్ చూశారు. 2022, జూన్ 18, శనివారం మా బాబు తన సామాను తీసుకుని ఆ రూమ్‍కి వెళ్ళాడు. అయితే మా బాబుకి ఆ రూమ్ నచ్చలేదు. దాంతో తన కొలీగ్ రూమ్‍లో సామాను పెట్టాడు. నేను ఫోన్ చేసి, "షిఫ్ట్ అయ్యావా?" అని అడిగితే, "రూమ్ ఆఫీసుకి చాలా దూరంలో ఉంది. నాకు ఏమి కావాలన్నా చాలా దూరం వెళ్ళాలి. నేను ఎల్లుండి సోమవారం డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఆలోగా రూమ్ కావాలని నాకు తెలిసినవాళ్లందరికీ ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ, బాచిలర్స్‌కి రూమ్ ఇవ్వనంటున్నారు" అని చెప్పాడు. తరువాత తను ఆ రాత్రికి అక్కడ ఉండకుండా మునుపు ఉన్న చోటుకే వచ్చేశాడు. నేను బాబాను, "బాబా! నాకు నీవే దిక్కు. ఉదయానికల్లా బాబుకి ఒక రూమ్ దొరకాలి. అలా జరిగితే, నేను బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు ఆదివారం సాయంత్రం బాబు మళ్ళీ ఆ ఊరికి వెళ్లి లాడ్జిలో దిగాడు. నేను ఇక్కడ 'బాబా, బాబా' అని అనుకుంటున్నాను. మా బాబు ఏదో మామూలుగా తన ఫ్రెండ్ సాయికృష్ణకి ఫోన్ చేసి మాటల్లో, 'నాకిలా రూమ్ ప్రాబ్లెమ్ అయింది' అని చెప్పాడు. నిజం చెపితే నమ్మరేమో కానీ, ఆ అబ్బాయి కూడా మా బాబు వెళ్లిన ఊర్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను వెంటనే వస్తే, తను, మా బాబు కలిసి ఆ రాత్రి కొన్ని రూములు చూశారు. మళ్ళీ ఉదయం మరికొన్ని రూములు చూశారు. బాబా దయవల్ల బాబుకి తన ఆఫీసుకి దగ్గరగా ఒక మంచి రూమ్ దొరికింది. నేను బాబుకి ఫోన్ చేస్తే, ఆ రూమ్ ఫొటోలు పెట్టి, జరిగినదంతా చెప్పాడు. నాకు నా సాయితండ్రి గుర్తొచ్చి, ఆయన బాబుకి 'సాయి' అన్న పేరుతోనే సహాయం చేశారనిపించి నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నా సాయితండ్రి ఎల్లప్పుడూ తమ బిడ్డలా బాగోగులు చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ ఇలాగే మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడు సాయీ".


5 comments:

  1. ఓం సాయి బాబా

    ReplyDelete
  2. Om sai ram we have problems in joint property.my father-in-law didn't write veelunama .Two brothers are there.younger one is not agreeing to sell that house.He says i don't sign on papers.we are facing many problems.Recesently they built new house with my in laws money.They cheated us.if they like younger son they give money,gold,silver many things.is this jucstie can't they give half half property to both sons.we decided to give property.half to both of children.we must do justice to our children.

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. a carpenter manasu marchi money maku vachela cheyi thandri please baba

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo