సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1235వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
 
  • శ్రీసాయీశ్వరుని కృపతో తిరుమల, శ్రీశైల పుణ్యక్షేత్రాల దర్శనం

ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను సిద్దిపేట జిల్లా నివాసిని. నేను సాయికి చిన్న భక్తుడిని. నాకు ఎంతోకాలంగా తిరుపతి, శ్రీశైలం దర్శించాలని కోరిక. కాని చేతిలో డబ్బులు ఉండేవి కావు. నేను బాబా భక్తుడినయ్యాక అన్నీ బాబా చూసుకుంటారని నమ్మాను. ఆయన దయవల్ల ఒకరోజు మా చిన్నక్కవాళ్లు మాకు ఫోన్ చేసి, "బాబుకి పుట్టు వెంట్రుకలు తీసే మొక్కుంది. తిరుపతి, శ్రీశైలం వెళ్తున్నాము, మీరూ రండి" అని చెప్పి తిరుపతికి అరు సెకండ్ క్లాస్ ట్రైన్ టిక్కెట్లు బుక్ చేశారు. 2022, మే 27 సాయంత్రం సికింద్రాబాద్‌లో ట్రైన్ ఎక్కాల్సి ఉండగా ప్రయాణ సమయానికి ఇంకో మనిషి మాతోపాటు రావడానికి సిద్ధమయ్యారు. ఆ వ్యక్తికోసం మేము ఒక జనరల్ టికెట్ తీసుకున్నాము. అయితే ఒక్కరే జనరల్ ఎక్కడానికి భయపడటంతో అందరం కలిసి సెకండ్ క్లాస్ బోగి ఎక్కేసాము. నేను బాబా మీద భారమేసి, "టిసి రాకుండా, మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తిరుపతి చేర్చండి బాబా" అని వేడుకున్నాను. మిగతా భోగీలకు టిసి వెళ్ళుండొచ్చు కానీ, బాబా దయవల్ల మేమున్న భోగిలోకి అయితే రాలేదు. మేము తెల్లవారేసరికి తిరుపతి చేరుకున్నాము. అప్పుడు మన ఈ బ్లాగులో, "నీ ప్రయాణం అంతా నేను నీతోనే ఉన్నాను. ఇన్ని రోజులు నేను నిన్ను చాలా సందర్భాలలో రక్షించాను" అని మెసేజ్ వచ్చింది. అది చూసి సంతోషంగా బాబాకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 

తరువాత మేము శ్రీవారి మెట్ల మార్గం గుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కాము. ముందుగా శ్రీవారు హాతీరామ్‍తో కలిసి పాచికలు ఆడిన హాతీరామ్ బాబాజీ మఠం దర్శించాము. తరువాత తలనీలాలు సమర్పించుకున్నాము. మేము తిరుమల వెళ్ళడానికి ముందు మూసి ఉన్న స్వామివారి పుష్కరిణి, బాబా దయవల్ల మేము వెళ్లే రోజుకు తెరచి ఉంది. అమితానందంగా మహిమాన్వితం, అతి పవిత్రం అయిన శ్రీస్వామివారి పుష్కరిణిలో స్నానం చేసాము. స్నానానంతరం శ్రీఆదివరాహస్వామిని దర్శించుకుని కోరికలు చెప్పుకున్నాము. (తిరుమల వెళ్ళినప్పుడు స్నానమాచరించి ముందుగా ఆదివారాహస్వామిని దర్శించి కోరికలు చెప్పుకుని, తరువాత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించి కోరికలు చెప్పుకోవడం వల్ల ధర్మబద్ధమైన మన కోరికలు నెరవేరుతాయి. ఈ విషయం తిరుమల శ్రీవేంకటాచల మహాత్మ్యంలో చెప్పబడి ఉంది. ఈ వివరాలు మీ అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను).

ఇకపోతే మేము స్వామివారి దర్శనానికి స్పెషల్ టికెట్లు ముందుగా బుక్ చేసుకోలేదు. పైగా మే నెల చివరి వారంలో భక్తుల రద్దీ పెరిగినందున ఉచిత టికెట్లు కూడా ఇవ్వడం లేదు. ఉచిత దర్శనం తాలూకు క్యూలైన్ బయట ఎక్కడో చాలా దూరం నుండి ఉంది. దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని మైక్‍లో చెబుతున్నారు. మా చిన్నక్కవాళ్ళకి శ్రీశైలం మొక్కు కూడా ఉంది. అందువలన బయటనుండే శ్రీస్వామివారికి మ్రొక్కుకుని, మరోసారి ఎప్పుడైనా దర్శనానికి వద్దామని అన్నారు. కాని అలా చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందువలన నేను క్యూలైన్‍లోకి వెళ్లి నిల్చున్నాను. కానీ ఉదయం నుండి సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల కాళ్ళనొప్పులు వచ్చాయి. వెన్నునొప్పి కూడా ఎక్కువగా వచ్చింది. ఆ సమయానికి క్యూలైన్ కూడా ఆగిపోయింది. నొప్పి తట్టుకోలేక క్యూలైన్ నుండి బయటకి వచ్చేసాను. స్వామివారి ఆలయగోపురం ఎదురుగా నిల్చున్న నాకు 'అంత దూరం వెళ్లి కూడా శ్రీనివాసుని దర్శించుకోలేకపోతున్నాన'ని దుఃఖం తన్నుకొచ్చింది. అక్కడే ఒక పక్కగా కూర్చొని ఆలయం వైపు చూస్తూ శ్రీవారి దర్శనం కాలేదని బాధ తట్టుకోలేక చాలా చాలా ఏడ్చాను. ఆలోగా మా చిన్నక్క, బావ, చిన్నబాబు, పాపలతో సుపథం గుండా శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. వారికైనా ఆ అదృష్టం దక్కిందని సంతోషించాను.

తరువాత తిరుచానూరు వెళ్ళాము. అక్కడ మొదట శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని తరువాత శ్రీకృష్ణ, బలరాముల దర్శనం చేసుకున్నాము. తరువాత తిరుచానూరులో కూడా శ్రీవారు ఉన్నారని వారి దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అక్కడున్న అర్చకులు మాతో మాట్లాడి మాతోపాటు తీసుకెళ్లిన ఒక పసుపుపచ్చ కంకణాన్ని శ్రీవారి పాదాలకు తాకించి, నా చేతికి కట్టారు. నేను చాలా సంబరపడిపోయాను. బయటకు రాగానే పల్లకిలో అమ్మవారు కదిలి వస్తున్నారు. ఆ కమనీయ దృశ్యాన్ని చూసి చాలా ఆనందించాము. శ్రీకృష్ణ, బలరాముల ఆలయం వెనుక ఉన్నటువంటి ఆదిశేషునికి మ్రొక్కుకుని తిరుపతి రైల్వేస్టేషన్‍కి వెళ్లి కర్నూల్‍కి జనరల్ టిక్కెట్లు తీసుకున్నాము. కానీ సీట్లు దొరుకుతాయో లేదోనని కంగారుపడ్డాము. ఆ విషయమై నేను బాబాని ప్రార్థించాను. ఆయన దయవల్ల చాలా జనం ఉన్నప్పటికీ కూర్చోవటానికి మా అందరికీ సీట్లు దొరికాయి. ప్రయాణంలో మా అమ్మకి ఒక కల వచ్చింది. ఆ కలలో చాలా పెద్దపాము నా వెనుక వస్తున్నట్టు కనిపించిందంట. అమ్మ ఆ విషయం నాకు చెప్పగానే నేను స్వామివారి అనుగ్రహం లభించిందని చాలా చాలా ఆనందించాను. ఎందుకంటే, ఆ పెద్దపాము ఎవరో కాదు శ్రీవారు శయనించే ఆదిశేషువు. తిరుమలలో స్వామివారి దర్శనం కాలేదని ఏడ్చినందుకు శ్రీస్వామివారు కరుణించి అదిశేషుని మాకు రక్షగా పంపినట్టు భావించాను. 

మేము కర్నూల్ బస్టాండుకి వెళ్లేసరికి అప్పుడే ఒక బస్సు వెళ్లిపోయిందని తెలిసింది. నేను మళ్ళీ బస్సు ఎప్పుడు ఉంటుందో అని కంగారుపడి బాబాను ప్రార్థించాను. అంతే, కొద్దిసేపట్లో బస్సు వచ్చింది. మేము ఆ బస్సెక్కి 2022, మే 30, సోమవారం నాడు శ్రీశైలం చేరుకున్నాం. పాతాళగంగలో స్నానం చేసిన తరువాత శ్రీశ్రీశ్రీ మల్లిఖార్జునస్వామి దర్శనం చేసుకున్నాము. తరువాత శనగల బసవన్న, శ్రీవృద్ధ మల్లిఖార్జునస్వామిని దర్శించుకున్నాము. ఆలయం వెనుక వైపున శ్రీమల్లిఖార్జునస్వామివారిని అభిషేకించిన తీర్థజలం రావడం చూసి సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైన జ్యోతిర్లింగాన్ని అభిషేకించిన తీర్థజలం లభించటం ఎంతటి భాగ్యమని ఆ తీర్థాన్ని సేవించి, ఇంటికోసం సీసాలో పట్టుకున్నాను. అంత పెద్ద అద్భుతం జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు. ఎందుకిలా అంటున్నానంటే, చాలారోజుల నుండి నా మనసులో స్వయం భూలింగానికి అభిషేకం చేసిన తీర్థం సేవించాలని ఉంది. ఆ కోరికను బాబా ఇలా తీర్చారు.

తరువాత శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నాము. తరువాత నేను, మా అన్నయ్య వెనక్కి వెళ్లి కొన్ని ఉప ఆలయాలలోని శివ లింగాలను దర్శించుకున్నాము. ఆరోజు సోమావతి అమావాస్య కావున చండీ హోమం జరుగుతుంటే వెళ్లి దర్శించుకున్నాము. తరువాత మల్లిక గుండం దర్శించి, ఆ నీటిలో శ్రీమల్లిఖార్జునస్వామివారి ప్రధాన ఆలయ గోపురంపైన ఉన్న త్రిశూలం దర్శించాము. తరువాత శ్రీరామ ప్రతిష్టిత సహస్ర లింగ దర్శనం చేసుకున్నాము. తరువాత అతి పవిత్రమైన శక్తివంతమైన మేడి, రావి, జువ్వి వృక్షాలను దర్శించాము. అప్పటికే దర్శన సమయం ముగిసినందున అక్కడ భక్తులు ఎవ్వరూ లేరు. నేను, అన్నయ్య అక్కడున్న మహా వృక్షాలకు ప్రదక్షిణ చేసాము. ఒక చెట్టు కింద ఉన్న శ్రీదత్తాత్రేయస్వామిని చూస్తూ నేను నా మనసులో కోరికలు చెప్పుకుంటుండగా ఉన్నట్టుండి స్వామి విగ్రహం యొక్క భుజాలపై నుండి పూలమాల జారి వారి పాదాల వద్ద పడింది. నేను, మా అన్నయ్య అశ్చర్యపోయాము. మా అన్నయ్య నాతో, "నువ్వు శ్రీగురుచరిత్ర పారాయణ చేసావు కదా! అందుకే శ్రీదత్తస్వామి నిన్ను ఆశీర్వదించారు" అని అన్నాడు. నేను ఆనందంతో పొంగిపోయాను. ఈవిధంగా శ్రీసాయిదత్తుని ఆశీస్సులు లభించాయి.

చివరగా గోశాల కనిపిస్తే, వెంటనే మేము అక్కడికి పరుగెత్తుకుపోయాము. మేము అక్కడికి వెళ్తూనే నల్లని కపిల గోవు దగ్గరకి వెళ్ళాము. అది వెంటనే మాకోసమే అంతసేపు ఎదురుచూస్తున్నట్టు మూత్ర విసర్జన చేసింది. ఆ గోమూత్రాన్ని సేవించి ఆ గోమాతని ప్రార్థించాము. ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. నేను ఈ యాత్రకు రాకముందు ఆవుపంచకం కోసం ప్రయత్నించాను. కానీ లభ్యం కాలేదు. ఇంకో విషయం తిరుపతి నుండి శ్రీశైలం వస్తున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. నేను ఆ కలలో ఒక గోశాలలో గోవుల మధ్య ఉండి గోమూత్రం(ఆవు పంచకం)కోసం వెతుకుతున్నట్టు కనబడింది. ఆ కల పైన చెప్పినట్లు నిజమైంది. ఇకపోతే ఆ గోశాలలో నిత్యం పూజలందుకునే అతిపెద్ద నంది వృషభం, అతిపెద్ద గోమాతను దర్శనం చేసుకున్నాము. తరువాత మరికొన్ని ఉపాలయాల దర్శనం చేసుకున్నాము. ఈవిధంగా శ్రీశైలంలో అణువణువు దర్శించుకుని చివరిగా స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకుని ఇంటికి వెళదామని బస్టాండుకి నడుచుకుంటూ వెళ్తుంటే, ఒక కారు అతను "మీరు ఎక్కడకు వెళ్తున్నార"ని తనంతట తానే అడిగాడు. మేము, "సికింద్రాబాద్" అని చెపితే, "నేనూ అక్కడికే వెళ్తున్నాను. రండి" అని అన్నాడు. అంతా దైవలీల అనుకుని మేము కారు ఎక్కాము. నేను నా మనసులో, "అన్ని దర్శనాలు అయ్యాయి కాని, శ్రీశైల శిఖరాన్ని, శ్రీసాక్షిగణపతిని దర్శించలేద"ని అనుకుంటుండగా కొద్దిసేపట్లో శ్రీసాక్షిగణపతి ఆలయం రావడం, అక్కడ డ్రైవర్ కొంచం పని ఉందని కారు ఆపడం జరిగాయి. ఇంకేముంది శ్రీసాక్షిగణపతిని దర్శించుకున్నాము. ఇంకొంత దూరం వెళ్ళగానే శ్రీశైల ఆలయ శిఖరం కనిపించింది. దూరం నుండే దణ్ణం పెట్టుకున్నాము. మనసులో అనుకోగానే శ్రీసాయీశ్వరుడు దయతో మాకు ఆయా దర్శనాలను ప్రసాదించారు. ఆయన కృపవలన మేము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. ఇలా అత్యంత అద్భుతంగా తిరుపతి, తిరుచానూరు, శ్రీశైల క్షేత్రాలను దర్శించే భాగ్యాన్ని ఆ సాయీశ్వరుడు, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీమల్లిఖార్జునస్వామి వార్లు మాకు ప్రసాదించారు. "ధన్యవాదాలు బాబా. మా చెడుకాలం అంతరించి మంచిరోజులు వస్తాయని ఆశిస్తున్నాను సాయీశ్వరా. ఇలానే ఎల్లవేళలా మీ అనుగ్రహం మాపైన ఉండాలి సాయినాథా. మీరు ఎల్లప్పుడూ మాతో ఉండాలని, ఉంటారని భావిస్తున్నాను తండ్రి". మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సర్వేశ్వరా శ్రీసాయీశ్వరా!!
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయ!!!

2 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo