సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1460వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎంత కాపలా కాశారో బాబా!
2. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు ప్రమాదాల నుండి కాపాడిన బాబా

ఎంత కాపలా కాశారో బాబా!

సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు రాజేశ్వరి. 2023, జనవరి 27న బాబా మా కుటుంబంపై చూపించిన అద్భుత అనుగ్రహాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆరోజు ఉదయం నేను మా చిన్నబ్బాయిని స్కూల్లో దింపటానికి తీసుకువెళ్తూ నిద్రలో ఉన్న మా పెద్దబ్బాయితో, "తమ్ముడిని స్కూలుకి తీసుకువెళ్తున్నాను. డోర్ లాక్ చేసి వెళ్తాను" అని చెప్పాను. వాడు నిద్రలోనే 'సరే' అన్నాడు. నేను మా చిన్నబ్బాయిని స్కూలుకి తీసుకువెళ్లి, దింపేసి ఒక 20 నిమిషాల్లో ఇంటికి తిరిగి వచ్చాను. చూస్తే, ఇంటి తలుపు తీసి ఉంది. ‘మా పెద్దబ్బాయి లేచాడేమో’ అనుకుని తనను పిలిచాను. కానీ వాడు మంచి నిద్రలో ఉన్నాడు. ‘వాడు నిద్ర లేవకపోతే తలుపెలా తీసి ఉంది?' అని ఒక్క నిమిషం నాకు ఏమీ అర్థం కాలేదు. కంగారుగా గట్టిగా మా అబ్బాయిని నిద్ర లేపి, "తలుపు నువ్వేనా తీసి ఉంచావు?" అని అడిగాను. వాడు, "అసలు నేను లేస్తే కదా తలుపు తీయడానికి? నువ్వే కదా డోర్ లాక్ చేసుకుని వెళ్తున్నానని చెప్పావు" అన్నాడు. అంటే, నేను మెయిన్ డోర్ లాక్ చేయకుండానే మా చిన్నబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయానన్నమాట. అసలు అప్పటివరకు ఎప్పుడూ అలా జరగలేదు. ఎందుకంటే, నేను బయటికి వెళ్ళేటప్పుడు డోర్ లాక్ వేసి ఒకటికి పదిసార్లు డోర్‌ని చెక్ చేసుకుంటాను. మా వాళ్ళందరూ, "డోర్‌ని అన్నిసార్లు చెక్ చేసి నువ్వే విరగగొడతావు" అంటారు. ఇంకా చిత్రం ఏమిటంటే, నేను చెక్ చేశాక మా చిన్నబ్బాయి కూడా ఒక పదిసార్లు చెక్ చేస్తాడు. మా ఇద్దరికీ ఆ అలవాటు చాలా ఎక్కువ. అటువంటిది ఇద్దరమూ అలా ఎలా వదిలేసి వెళ్ళామో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సరే, ఎప్పుడైతే డోర్ వెయ్యలేదని నాకు అర్థమైందో నా బుర్ర పనిచేయడం మానేసింది. నా టెన్షన్ చూసి మా అబ్బాయి నన్ను కూర్చోబెట్టి, "అమ్మా! కంగారుపడకు. అన్నీ చెక్ చేసుకుందాం" అని అన్నాడు. అసలు విషయమేమిటంటే, డబ్బు రూపేణా, బంగారం రూపేణా 20 లక్షల రూపాయల విలువగల సొత్తు ఇంట్లో ఉంది. మరో నాలుగురోజుల్లో మా ఇంట్లో జరగబోయే ఫంక్షన్ కోసం అంతా తెచ్చిపెట్టుకున్నాను. ఇప్పుడు మీరే ఆలోచించండి, నా పరిస్థితి ఎలా ఉంటుందో! ఇదంతా వ్రాస్తుంటే, ఇప్పుడు కూడా నాకు వణుకు వస్తోంది. ఏడుస్తూనే గబగబా గదిలోకి వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటే, అన్నీ ఉన్నాయి. ఆ 20 నిమిషాల వ్యవధిలో ఇంట్లో చీపురుపుల్ల కూడా పోలేదు. అంతా బాబా దయ. ఆయనే మా ఇంటిని మాకు ప్రసాదించింది. నేను ఎప్పుడూ, "అయ్యా! ఈ ఇంటి యజమాని మీరు. ఈ ఇంటిలో ఉండడానికి మాకు మీరు అవకాశం కల్పించారు. ఈ ఇంటిని, ఈ ఇంటిలో ఉంటున్న మమ్మల్ని ఎప్పుడూ మీరే కాపాడుతూ ఉండాలి" అని రోజూ బాబాను ప్రార్థించుకుంటాను. మేము బయటికి వెళ్ళినప్పుడల్లా, "స్వామీ! ఇల్లు జాగ్రత్త" అని బాబాకి చెప్తాను. నేను ఇంటికి వచ్చేదాకా బాబా ఇంటికి ఎంత కాపలా కాశారో చూడండి. ఆ 20 నిమిషాల సమయం తలుపు పూర్తిగా తీసివుంది, అన్ని గదుల తలుపులూ తీసివున్నాయి. లాకర్ తాళాలు లాకర్ పైనే ఉన్నాయి. మీరే ఆలోచించండి - బాబా దయ లేకపోతే, ఎవరన్నా తలుపులు తీసి ఉండటం చూసి, ఇంట్లో ఏ అలికిడీ లేదని గమనించి ఇంట్లోకి చొరబడి ఉంటే? ఈరోజుల్లో చిన్న వస్తువు పోయినా తిరిగి కొనటానికి చాలా సమయం పడుతుంది. అటువంటిది అంత విలువైన వస్తువులు ఏమైనా అయివుంటే మా పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ నేను మర్చిపోయి వెళ్ళిపోయినా తిరిగి వచ్చేదాకా గుమ్మం దాటి ఎవరినీ ఇంటి లోపలికి రానివ్వలేదు ఆ సాయినాథుడు. ఆయన ప్రతి నిమిషం మా కుటుంబాన్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నారు. అందుకే ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలనిపించింది. "మమ్మల్నందరినీ సర్వకాల సర్వావస్థలలోనూ కరుణించి కాపాడుతున్నందుకు మీకు కోట్లానుకోట్ల వందనాలు సాయితండ్రీ".

ఐదు నిమిషాల వ్యవధిలో రెండు ప్రమాదాల నుండి కాపాడిన బాబా

నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా, దైనందిన జీవితంలో బాబా మమ్మల్ని ఏ విధంగా అనుగ్రహించి కాపాడి, తమ లీలలను చూపారో, ఆ లీలావైభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకొనే అవకాశాన్ని కల్పించిన సాయినాథునికి నా నమస్కారాలు. 2023, జనవరి 27, ఉదయం బాబా మమ్మల్ని రెండు ప్రమాదాల నుండి కాపాడారు. ఆరోజు ఉదయం నేను మా ఆడపడుచును తీసుకొని ఆటోలో హాస్పిటల్‌కి బయలుదేరాను. బెంగళూరులో ఎంతో రద్దీగా ఉండే రహదారిలో వెళుతుండగా ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ యూటర్న్ తీసుకొని వేగంగా కుడివైపు నుండి మా ఆటోకు చాలా దగ్గరగా వచ్చింది. ఆ ట్యాంకర్ మా ఆటోకు తగులుతుందన్న సందర్భంలో నేను, 'సాయిరామ్' అని అనుకున్నాను. అంతే, ట్యాంకర్ ఆటో ప్రక్కగా ముందుకు వెళ్ళిపోయింది. మా ముందు వెళుతున్న కారుపై స్టిక్కర్ రూపంలో బాబా నవ్వుతూ 'నేనున్నాను' అని దర్శనమిచ్చారు. మరికాస్త ముందుకు వెళ్ళాక, అదివరకటిలాగే ఒక లారీ ఎడమవైపు నుంచి వచ్చింది. సాయి స్మరణ చేయగానే లారీ ఎడమవైపు నుంచి ముందుకు వెళ్ళడం, మా ఆటో ముందు వెళుతున్న మరో కారుపై 'ద్వారకామాయి' అన్న అక్షరాలు, త్రిశూలం కనిపించాయి. ఆవిధంగా ఐదు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు వెంట్రుకవాసిలో పెద్ద ప్రమాదాల నుండి కాపాడి, 'నాతో తామున్నామ'న్న ధైర్యాన్ని ఇచ్చారు సాయి. "ధన్యవాదాలు సాయీ".

సాయిభక్తుల అనుభవమాలిక 1459వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి మహరాజ్ అనుగ్రహం
2. బాబాపై ప్రేమ చూపించడమంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడం

సాయి మహరాజ్ అనుగ్రహం

సాయి మహరాజ్‌కి నా శతకోటి నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా ధన్యవాదాలు. ఒకప్పుడు గ్రామాల్లో సాయంత్రం వేళ అందరూ రచ్చబండ దగ్గర కలుసుకొని, అన్ని విషయాలు ఒకరితో ఒకరు పంచుకొని, మనసు తేలిక చేసుకొని ఆనందంగా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లేవాళ్లు. అందుకే అప్పట్లో ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉండేవి. అలాగే ఇప్పుడు సాయిభక్తులకు ఉదయం నిద్రలేవగానే ఓపెన్ చేసి చూడటానికి 'సాయి మహరాజ్ సన్నిధి' అనే ఒక అద్భుతమైన గొప్ప వేదికను ఏర్పాటు చేసి, మా అందరి మనసులలోని భారాన్ని, బరువులను దించుకొని తేలికపడేటట్లు, అలాగే ఏదైనా సమస్య వస్తే బాబాకు చెప్పుకొనే అవకాశాన్ని కల్పించారు మీరు. మాకిప్పుడు ఎవరూ లేరనే భయం, బేలతనం లేవు. ఎందుకంటే, ఎవరితోనూ పంచుకోలేనివి కూడా ఈ బ్లాగ్ ద్వారా బాబాకు చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా, ఎలాంటి విషయమైనా గట్టి నమ్మకంతో బాబాకు చెప్పుకుంటే, అది తప్పకుండా జరుగుతుందనే భరోసా మాకు కలుగుతుంది. ఎన్ని అనుభవాలు! ఎంతమంది అనుభూతులు! మీ ద్వారా అందరికీ చేరుతున్నాయి. ఈ బ్లాగును నడిపిస్తున్న సాయి సహోదరులకు, వారి బృందానికి మేమెప్పుడూ ఋణపడి ఉంటాం.

ఇక అసలు విషయానికి వస్తే.. నా పేరు సావిత్రి. మేము హైదరాబాదులో ఉంటాము. నేను బాబా భక్తురాలిని. మట్టిముద్దలా ఉండే మా కుటుంబానికి ఒక ఆకారాన్ని తీసుకొచ్చి, ప్రాణం పోసి మాకు ఒక మార్గం చూపించారు బాబా. ఆయన నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని పంచుకుంటున్నాను. మా అబ్బాయి హైదరాబాద్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. తను చాలా కష్టపడి JAIIB CAIIB పరీక్షలకి ప్రిపేర్ అయి పరీక్షలు వ్రాశాడు. తను ఒక్క సబ్జెక్టులో తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులలోనూ పాసయ్యాడు. తరువాత ఆ ఒక్క సబ్జెక్టు కోసం చాలా శ్రమకోర్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యాడు. ఎందుకంటే, మళ్ళీ ఫెయిల్ అయితే, ఈసారి మొత్తం 5 సబ్జెక్టులూ వ్రాయాల్సి ఉంటుంది. ఆ టెన్షన్ ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు కదా! అందుకే నేను బాబాతో, "బాబు ఆ సబ్జెక్టు పాసైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. బాబా కరుణతో మా అబ్బాయి ఆ సబ్జెక్టులో పాసయ్యాడు. అయితే, ‘ఈ ఒక్క అనుభవం ఏం పంచుకుంటాలే’ అని వేచి చూశాను. ఈలోపు మా అబ్బాయి స్నేహితునికి ఉద్యోగానికి సంబంధించి సెలక్షన్ దాదాపు పూర్తైంది. ఒక్క మెడికల్ టెస్టులో పాసైతే తనకి ఉద్యోగం వచ్చినట్లే. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. కానీ ఉద్యోగం లేదు. ఇంక పరిస్థితి చెప్పక్కరలేదు కదా! అదీకాక, ఆ అబ్బాయికి గుండె సమస్య వచ్చి, తగ్గింది. అలాంటి అబ్బాయికి మెడికల్ టెస్ట్ అంటే ఏమైనా సమస్య అవుతుందేమోనన్న భయం. అప్పుడు నేను, "బాబా! అతనికి ఉద్యోగం వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆ అబ్బాయికి ఉదోగ్యం వచ్చింది. ఇంతకంటే అద్భుతం ఇంకేం కావాలి?

మా అత్తగారికి 78 సంవత్సరాలు. ఈమధ్య ఆమెకి ఆయాసం వస్తుంటే మాకు చాలా భయమేసింది. ఎందుకంటే, 11 నెలల ముందు నా భర్త చనిపోయారు. ఆ షాక్ నుండి బయటకి రాకముందే మరలా హాస్పిటల్, ఆపరేషన్ అంటే తట్టుకోవడం మా వల్ల కాలేదు. అదీకాక, మా అత్తగారికి అదివరకే గుండె సమస్య ఉంది. 7, 8 సంవత్సరాల ముందు స్టెంట్లు వేయాలని అన్నారు. రెండుసార్లు స్టెంట్ వేయించాలని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కానీ ఏవో కారణాలతో ఆపరేషన్ జరగలేదు. మరలా ఈ వయసులో ఆపరేషన్ అంటే బాగా భయమేసింది. అందుచేత నేను, "బాబా! ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఉండేటట్లు అనుగ్రహిస్తే, నేను మీ అనుగ్రహాన్ని బ్లాగులో చెప్పుకుంటాను" అని బాబాకి మొక్కుకొని మా అత్తగారిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. ఈసీజీ, ఎకో టెస్టులు చేశాక కూడా డాక్టరుకి ఏదో అనుమానమొచ్చి, ‘ఒకవేళ రిపోర్టులు తప్పేమో’ అని పాత రిపోర్టులు చూపించమని అడిగారు. అద్భుతం! అన్ని రిపోర్టులు పరిశీలించాక హార్ట్‌లో ఎటువంటి సమస్యా లేదని చెప్పారు. మరి ఆయాసం ఎందుకు వస్తుందంటే, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇచ్చారు. ఇన్ని అద్భుతమైన అద్భుతాలు చేసిన సాయి మహరాజ్‌కు మా హృదయపూర్వక నమస్కారాలు. నాకున్న ఒక సమస్య నుండి బయటపడేసి ఆ శుభవార్తతో మరలా నా అనుభవాన్ని పంచుకొనే అవకాశం బాబా ఇస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాను.

బాబాపై ప్రేమ చూపించడమంటే ఆయన చెప్పిన మార్గంలో నడవడం

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. బాబా సకల దేవతా స్వరూపుడని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే, అందుకు తగిన నిదర్శనాలను బాబా నాకు స్వప్నంలో ఇచ్చారు. నేను ఈమధ్య బాబా ప్రేరణతో, ‘దత్తాత్రేయుడే బాబా’ అన్న భావనతో శ్రీగురుచరిత్ర పారాయణ ప్రారంభించి వసంతపంచమి ముందురోజు ముగించాను. మరుసటిరోజు వసంతపంచమి, పైగా గురువారం. ఆరోజు నేను బాబాకి నైవేద్యం సమర్పిద్దామని బాబా గుడికి బయలుదేరాను. బయలుదేరేముందు నా మనసులో, 'బాబా! ఈ వారంరోజులు నేను నిన్ను మందారపూలతో పూజించాను కదా! మీరు నా పారాయణని స్వీకరించినట్లైతే, మీరు నాకు మందారపూలతో దర్శనమివ్వాలి' అని ఒక భావన కలిగింది. ఆ సర్వాంతర్యామి ముందు మనమేమైనా దాచగలమా? అక్కడ గుడిలో బాబాను ఒకే ఒక్క మందారపువ్వుతో అలంకరించి ఉన్నారు. అలా బాబాను చూసిన నా పరిస్థితి మీరు ఊహించగలరు కదా! సాయిబంధువులారా! నేను ఎంత తన్మయత్వంతో పులకరించిపోయానంటే, 'బాబా! నీకు నాపై ఇంతటి ప్రేమ ఉందా? నీ ప్రేమకు నేను అర్హురాలినా బాబా?' అని మనసంతా ఆనందడోలికలలో ఉయ్యాలలూగింది. 'ప్రతి విషయంలో బాబా తన ప్రేమను ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. కానీ నేను ఇంత ప్రేమని బాబాపై చూపించగలనా? నాకు బాబాపై ఉన్నది నిజమైన ప్రేమేనా?' అనే ప్రశ్న మొదలైంది. నా అంతరాత్మ ఇచ్చిన సమాధానం - 'బాబాపై ప్రేమ చూపించడం అంటే బాబా చెప్పిన మార్గంలో నడవడం'. తమ మార్గంలో నడవడానికి కావలసిన శక్తిని బాబా నాకు ప్రసాదిస్తారని నమ్ముతూ...

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

సాయిభక్తుల అనుభవమాలిక 1458వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా తోడుగా ఉన్నంతవరకు దేనికీ భయపడవలసిన పనిలేదు
2. సంవత్సరం తర్వాత వస్తువు దొరికేలా అనుగ్రహించిన బాబా

బాబా తోడుగా ఉన్నంతవరకు దేనికీ భయపడవలసిన పనిలేదు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. సాయే నా ప్రత్యక్ష దైవం. ఆయన పిలిచిన వెంటనే పలుకుతారు, మన బాధలను తీరుస్తారు. సాయిపట్ల నమ్మకం, విశ్వాసం ఉంటే ఆయనెప్పుడూ మన వెంటే ఉంటారు. ఆయన లీలలను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక నా అనుభవాల విషయానికి వస్తే... నాకు నాలుగు సంవత్సరాల నుంచి నెలసరి సమస్య ఉంది. దానికోసం స్కానింగులు, టెస్టులు చేయించుకుంటే సమస్య ఏమీ లేదని వచ్చేది, కానీ నా అనారోగ్య సమస్య తీరేది కాదు. ఇలా ఉండగా ఈమధ్య ఎమ్ఆర్ఐ టెస్ట్ చేయిస్తే, గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు(గర్భాశయ పొరలు) ఉన్నాయని రిపోర్టులో వచ్చింది. డాక్టరు బయాప్సీ చేయించుకోమని చెప్పారు.. బయాప్సీ టెస్ట్ అనేసరికి రిపోర్టు ఎలా వస్తుందో, ఏమో అని నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగైనా బయాప్సీ టెస్ట్ చేసే అవసరం రాకుండా చూడు" అని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నేను ఎప్పుడు 'సాయిబాబా ప్రశ్నలు-జవాబులు’ తెరిచినా 'ఆరోగ్యంగా ఉంటావ'ని సమాధానం వచ్చేది. అలా బాబా ప్రతిక్షణం నాకు అభయమిస్తూనే ఉండేవారు. కొన్ని నెలల తరువాత ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు వెళితే, ఆమె స్కానింగ్ చేసి, "ఎటువంటి సమస్యలు లేవు. అంతా బాగుంది. బయాప్సీ అవసరం లేదు" అని చెప్పింది. బాబా దయవల్లే నాకు ఇంత మంచి జరిగింది. ఇంత మంచి బాబా మనకు తోడుగా ఉన్నంతవరకు మనం దేనికి భయపడవలసిన పనిలేదు.


నాకు ప్రమోషన్ వచ్చి ముందు ఉండే ఊరికంటే దగ్గర్లో ఉండే చోటికి ట్రాన్స్‌ఫర్ అవడంతో చాలా సంతోషంగా అనిపించింది. కానీ అంతలోనే 'తదుపరి బదిలీలలో మేము అక్కడినుండి వేరే చోటుకి వెళ్లిపోవాల'న్న వార్త తెలిసింది. మళ్ళీ బదిలీలు అయితే దూరప్రాంతానికి వెళ్లే ప్రమాదముందని నాకు చాలా భయమేసి, "బాబా! ఎలాగైనా బదిలీ లిస్టులో మేముండే చోటు చూపించకుండా చూడు తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల మేము కోర్టులో కేసు గెలిచాము. ఆ కారణంగా మేము ఉన్నచోటులోనే కొనసాగుతున్నాము. "థాంక్యూ బాబా. మీ చల్లని చూపువలనే ఇదంతా జరిగింది. అడిగిన వెంటనే కోరికలు తీర్చే కల్పవృక్షం మీరు బాబా".


నేను శిరిడీ వెళ్లాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నప్పటికీ వెళ్లకపోయాను. చివరికి ఒకరోజు అనుకోకుండా శిరిడీ ప్రయాణాన్ని నిర్థారించుకున్నాము. నేను శిరిడీకి బయలుదేరేటప్పుడు ముడుపులన్నీ తీసుకొని, "బాబా! ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము శిరిడీ దర్శించి, తిరిగి క్షేమంగా ఇంటికి చేరితే 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల వారిని చాలాసేపు దర్శించుకొనే భాగ్యం, సమాధి తాకి నమస్కరించుకొనే అదృష్టం మాకు దక్కాయి. మధ్యాహ్న హారతి వీక్షించే అవకాశం కూడా బాబా ప్రసాదించారు. మేము అక్కడినుండి పండరీపూర్ వెళ్లి పాండురంగని, ఆపై కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. 


ఇటీవల మా పనిమనిషి కిందపడి కాలు నొప్పి వల్ల పనికి రాలేకపోయింది. ఆమె బాగా పని చేస్తుంది. ఆ కారణంగా ఆమె వస్తే బాగుంటుందని, "బాబా! ఎలాగైనా ఆమెకు కాలనొప్పి తగ్గించి, తిరిగి పనికి వచ్చేలా చేయి తండ్రి" అని బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల 2023, మార్చి 2న తను పనికి వస్తానని చెప్పింది. అంతా సాయి దయ.


ఈమధ్య మా అమ్మకు ఆయాసం ఎక్కువై ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో చేరింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా అమ్మకు ఆరోగ్యాన్ని ప్రసాదించి హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేర్చు తండ్రి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగుంది. కాకపోతే కొంచెం నీరసంగా ఉంటుంది. బాబా సర్వాంతర్యామి. సదా మనల్ని రక్షిస్తూ ఉంటారు. "ధన్యవాదాలు బాబా. అమ్మ రామకోటి చేస్తుంది. ఇంకా ఐదు లక్షలు చేయాల్సి ఉంది. ఆ జపం పూర్తి చేసే శక్తిని అమ్మకు ప్రసాదించు తండ్రి".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సంవత్సరం తర్వాత వస్తువు దొరికేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను సాయిభక్తురాలిని. ఈ కలియుగంలో పిలిస్తే పలికే దైవం సాయిబాబా. ఎంతో అపారమైన పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మలో సాయిభక్తులం కాలేము. సాయిని పొందడం ఒక భాగ్యం. ఆయన తమ భక్తులకు ఎన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. సంవత్సరం క్రితం నేను నా బంగారు ఆభరణం ఒకటి ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు ఆ ఆభరణం గుర్తుకు వచ్చింది. ఆరోజు గురువారం. నేను బాబా గుడికి వెళదామని తయారవుతూ ఇంట్లో ఆ నగ కోసం ఎంత వెతికినా కనిపించలేదు. నేను గుడికి వెళ్ళి, "నా వస్తువు నాకు దొరకాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల నా వస్తువు నాకు దొరికింది. ఇది నిజమా, కలా అని అందరం ఆశ్చర్యానికి లోనయ్యాము. "ధన్యవాదాలు బాబా. ఈ  అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1457వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సచ్చరిత్ర పారాయణతో వివాహం
2. బాబుకి నయమయ్యేలా దయచూపిన బాబా
3. కనపడకుండా పోయిన అన్నయ్యను తిరిగి ఇంటికి చేర్చిన బాబా

సచ్చరిత్ర పారాయణతో వివాహం


అందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నా పేరు సుమ. కొన్నేళ్ల క్రితం నాకు చాలా పెళ్లి సంబంధాలు వస్తున్నా, కట్నం తక్కువన్న కారణంతో ఏ సంబంధమూ కుదిరేది కాదు. అలాంటి సమయంలో నా స్నేహితురాలు 'సాయి సచ్చరిత్ర' పుస్తకం నాకిచ్చి, "ఇది చదువు. నీకు అంతా మంచి జరుగుతుంది" అని చెప్పింది. తను చెప్పింది నమ్మక ఒక సంవత్సరం వరకు నేనా పుస్తకం తెరిచి కూడా చూడలేదు. మామూలుగానే సంబంధాలు వస్తూ, కట్నం తక్కువని వెనక్కి వెళ్లిపోతుండేవి. అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు నాకు నా స్నేహితురాలు ఇచ్చిన పుస్తకం గురించి గుర్తుకొచ్చి, 'ఈరోజు నుంచి నేను ఈ పుస్తకం చదువుతాను. సరిగ్గా మూడు నెలల్లో నాకు పెళ్లయితే పుస్తకం మహిమ గలది, లేకుంటే లేదు' అని ఇష్టం లేకుండానే ఆ పుస్తకం చదివాను. సరిగ్గా మూడు నెలల్లో నాకు ఒక సంబంధం వచ్చింది. అన్ని సంవత్సరాల నుంచి నిశ్చయంకాని నా పెళ్లి నిశ్చయమైంది. ఆ అబ్బాయి నాన్నమ్మకి ఆరోగ్యం బాగాలేదనీ, ఆమె తన మనవడి పెళ్లి చూసి చనిపోవాలనుకుంటోందనీ, అందువల్ల పెళ్లి త్వరగా జరిపించాలని చెప్పి, నన్ను చూడటానికి వచ్చినరోజు నుంచి సరిగ్గా 14 రోజుల్లో, అది కూడా పెద్ద కల్యాణమండపంలో చాలా ఘనంగా మా పెళ్లి జరిపించారు. ఏదో గుడిలో జరుగుతుందని అనుకున్న నా పెళ్లి అంత గొప్పగా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. మా పెళ్ళై ఇప్పటికి మూడున్నర సంవత్సరాలైంది. బాబా మాకు ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చారు. అలాగే నాకు మంచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఒకప్పుడు నేను గడిపిన జీవితం వేరు. ఇప్పుడు నా జీవితంలో అంతకుముందున్న బాధలు లేవు. నిజంగా బాబా నాకు ఇంతటి మంచి జీవితాన్ని ఇస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి జీవితాన్నిచ్చిన బాబాకి జీవితాంతం ఋణపడి ఉంటాను. బాబానే నాకు తాత, అమ్మ, నాన్న, అన్నీ.


బాబుకి నయమయ్యేలా దయచూపిన బాబా


సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నకు బాబా అంతా మంచే చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సౌమ్య. 2022, డిసెంబర్ 20న నాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆ నొప్పులు భరించడం చాలా కష్టం. కొంతమందికి రెండు మూడు రోజులు, లేదంటే కనీసం 7, 8 గంటలు ఉంటాయి ఆ నొప్పులు. కానీ బాబా కృపవలన నేను కేవలం మూడున్నర గంటలే ఆ నొప్పులు భరించాను. చివరికి బాబా దయతో నాకు సుఖప్రసవమై బాబు పుట్టాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక బాబు ఎక్కువగా మూలుగుతుండేవాడు, ఒక్కోసారి ఏడ్చేవాడు కూడా. నాటువైద్యం చేయిస్తే అప్పటికి కాస్త ఉపశమనం కనిపించేది. మళ్ళీ రెండోరోజు నుండి బాబు మామూలుగానే మూలుగుతుండేవాడు. కొంతమంది 'చంటిబిడ్డకి నాటువైద్యం ఎందుకు చేయిస్తున్నారు? నీకు బుద్ధి ఉందా? హాస్పిటల్లో చూపించండి" అని అంటే బాబుని హాస్పిటల్లో చూపించాం. అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబు సమస్య నయం కాలేదు. అప్పుడు నేను బాబాను వేడుకున్నాను. అయినా బాబు పరిస్థితిలో మార్పు ఏమీ కనబడలేదు. ఒకరోజు రాత్రి బాబు మూలుగుతూ ఏడుస్తుంటే చూసి నేను తట్టుకోలేకపోయాను. కోపమొచ్చి బాబా మీద అరిచాను. "చిన్న పిల్లవాడు. వాని బాధ తగ్గించు బాబా. వాడికి తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో బాబుకి ఇప్పుడు నయమయింది. "ధన్యవాదాలు బాబా. గర్బవతినైనప్పటి నుంచి పలురకాల కారణాల వల్ల నేను మిమ్మల్ని సరిగా పూజించట్లేదు. కారణం ఏదైనా నాకు చాలా బాధగా వుంటుంది. ఎందుకంటే, మీపై నాకున్న ప్రేమ శాశ్వతమైనది. మునుపటిలా నిన్ను పూజించడం లేదని నా మీద కోపం చూపకు తండ్రీ. బాధ్యతలు పెరగడం వల్ల అంత సమయం వెచ్చించలేకపోతున్నాను. నన్ను క్షమించి, ఎల్లప్పుడూ నీ హృదయంలో నాకు కాస్త చోటు ఇవ్వు తండ్రీ. అలాగే, జీవితాంతం నీ సేవ చేసుకొనే భాగ్యాన్ని మాకు కల్పించి ఎప్పటికీ నా చేయి వదలకు తండ్రీ".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!


కనపడకుండా పోయిన అన్నయ్యను తిరిగి ఇంటికి చేర్చిన బాబా


పిలిస్తే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం శిరిడీ సాయినాథునికి పాదాభివందనం. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న, చదువుతున్న సాయిభక్తులకి నా నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. మాది హైదరాబాదు. 2023, జనవరి 17వ తేదీ, మధ్యాహ్నం మా అన్నయ్య ఇంటి నుండి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. మేము మా బంధువుల దగ్గర, మా మామయ్యవాళ్ళ దగ్గర, అక్కచెల్లెళ్ల దగ్గర, దూరపు బంధువుల దగ్గర, ఇంకా అన్నిచోట్లా అన్నయ్య కోసం వెతికాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. అయినా అన్నయ్య జాడ తెలియలేదు. చివరికి 2023, జనవరి 28, శనివారంనాడు నేను, "మా అన్నయ్య ఇంటికి తిరిగి వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా ఆశీస్సులు ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఆయన ఎటువంటి టెన్షన్లనైనా ఇట్టే తీసేస్తారు. 2023, జనవరి 30, వేకుఝామున 4:30కి అన్నయ్య తనంతట తానే ఇంటికి తిరిగి వచ్చారు. "శతకోటి పాదాభివందనాలు సాయినాథా".


సాయిభక్తుల అనుభవమాలిక 1456వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఎలాంటి పరిస్థితులనుండైనా బయటపడటం నిశ్చయం
2. ఆరోగ్యం బాగుచేసి త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా

బాబా దయతో ఎలాంటి పరిస్థితులనుండైనా బయటపడటం నిశ్చయం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు, మీ నిస్వార్థమైన సేవకు మా నమస్సుమాంజలి. నా పేరు రాంబాబు. మాది విజయనగరం. బాబా నాకు ప్రసాదించిన మరో అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సాయి ఆశీస్సులతో మా కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం సమతుల్యంగా ఉంటాయి కాబట్టి, దాదాపు నా అనుభవాలన్నీ నా వృత్తికి సంబంధించినవై ఉంటాయి. ఇప్పుడు పంచుకోబోయే అనుభవం కూడా అలాంటిదే. నేను పనిచేస్తున్న కంపెనీలో మా బ్లాకులో తయారయ్యే ప్రొడక్ట్ అవుట్‍పుట్ తక్కువ వస్తున్నా మేనేజ్‌మెంట్‌కి చెప్పకపోవడం వల్ల స్టాక్ నెగెటివ్‍లోకి వెళ్ళిపోతుండేది. అదే సమయంలో ప్రొడక్ట్ ఫెయిల్యూర్స్ కూడా అవడం మొదలైంది. వరుసగా 4 బ్యాచ్‌లు ఫెయిల్ అయ్యాయి. గోరుచుట్టుపై రోకలిపోటులా ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌లో మరింత అవుట్‍పుట్ తగ్గిపోసాగి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాంతో నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ కష్ట సమయంలో చెప్పుకోడానికి నాకు బాబా తప్ప మరి ఎవరూ లేరు. అందుచేత, "బాబా! ఈ సమస్య నుంచి బయటపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇంకా ఈ సమస్య తీరేవరకు నాకు ఇష్టమైన ఒక అలవాటు మానుకుంటాను" అని ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల ఒక నెలలో పరిస్థితి అంతా అదుపులోకి వచ్చింది. ఆయన దయవుంటే ఎలాంటి కష్టం/పరిస్థితులనుండైనా మనం బయటపడటం నిశ్చయం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఈ జన్మలో సాయి కృపకు పాత్రుడనైనాను. అందుకు నేను ఆయనకి సదా కృతజ్ఞుడిని. ఆ సాయినాథునికి నా శతకోటి నమస్కారాలు.


2022, డిసెంబరులో మా కంపెనీకి సర్ప్రైజ్ స్టాక్ చెకింగ్‌కి కార్పొరేట్ నుంచి ఒక టీమ్ వచ్చింది. ఆ సమయంలో నా పరిధిలో వున్న ఒక స్పెంట్ స్టాక్ చాలా ఎక్కువ మొత్తంలో చేరుకుంది. కానీ యదార్థంగా అంత స్టాక్ లేదు. (సింపుల్‌గా చెప్పాలంటే, స్టాక్ భౌతికంగా లేదు, కానీ డాక్యుమెంట్‌లో ఉన్నట్లు ఉంది.) దానిని నేను కొద్దిరోజుల ముందే గమనించాను. కానీ ఆ విషయంలో ఏమి చెయ్యాలో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక అలానే ఉంచేశాను. అలాంటి పరిష్టితిలో సడెన్‌గా సర్ప్రైజ్ స్టాక్ చెకింగ్ టీమ్ రావడం నన్ను చాలా తీవ్రస్థాయిలో ఆందోళనకు గురిచేసింది. "ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడేలా చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల పరిస్థితి నా పరిధిలో ఉన్న ఆ స్టాక్‌ని గమనించే స్థాయికి వెళ్ళకుండానే ఆ టీమ్ స్టాక్ చెకింగ్ పూర్తిచేసి వెళ్లిపోయింది. "ఈ నా సమస్య నుంచి బయటపడేసినందుకు చాలా కృతజ్ఞుడిని బాబా. మీకు శతకోటి నమస్కారాలు. ఇక ఆ స్టాక్ సమస్య కూడా త్వరలో క్లియర్ అయ్యేలా అనుగ్రహించండి బాబా".


శ్రీసాయినాథాయ నమః!!!

సర్వేజనాః సుఖినోభవంతు!!!


ఆరోగ్యం బాగుచేసి త్వరగా డిశ్చార్జ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా


సాయిబంధువులందరికీ, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను సాయిభక్తుడిని. నా పేరు నందకుమార్. మాది గుంటూరు. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ బ్లాగులోని సాయిబంధువులందరి అనుభవాలు చదువుతూ బాబా ప్రేమ మాధుర్యానికి సంతోషిస్తున్నాను. కొన్నిరోజుల క్రితం ఒక అనుభవాన్ని చూసి నేను కూడా నా అనుభవాన్ని పంచుకోవాలని అనుకున్నాను. ఇక ఇప్పుడు మొదటిసారిగా నా అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈమధ్య మా అమ్మగారి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి, తనకి ఆయాసంగా ఉంటుండేది. దాంతో అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. కొన్ని రిపోర్టులు సంతృప్తికరంగా వచ్చినప్పటికీ, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఇబ్బందికరంగా ఉండేది. నేను హాస్పిటల్లో కూర్చుని బాబాని తలచుకుని ఈ బ్లాగులోని కొన్ని అనుభవాలు చదివి, "బాబా! మా అమ్మ ఆరోగ్యం బాగుచేసి, త్వరగా ఆమెను డిశ్చార్జ్ చేయించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాని వేడుకొని, బాబా నామస్మరణ చేశాను. బాబా ఎంతో దయతో అమ్మను కోలుకునేలా చేసి ఇంటికి పంపించారు. "ధన్యవాదాలు బాబా. కానీ అమ్మకి నీరసంగా ఉంటోంది. అది తగ్గి అమ్మ తన పనులు తాను చేసుకునే విధంగా ఆరోగ్యాన్ని చేకూర్చు తండ్రీ. మీ దయవల్ల అన్నీ సవ్యంగా జరిగితే మరలా నా అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను. మీ దయ ఎల్లప్పుడూ మాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1455వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాకి మన మనసు తెలుసు - తలచుకుంటే చాలు ఎంత కష్టమైనా తీరుస్తారు
2. గాల్‌బ్లాడర్‌లో స్టోన్‌ని అదృశ్యం చేసిన బాబా

బాబాకి మన మనసు తెలుసు - తలచుకుంటే చాలు ఎంత కష్టమైనా తీరుస్తారు


ముందుగా సాయినాథ్ మహారాజ్ పాదపద్మములకు నా నమస్కారాలు. నా పేరు రాణి. నేను సాయి భక్తురాలిని. ఆయన నా జీవితంలోని కష్టసుఖాలన్నిటిలో ఉంటూ చాలా అద్భుతాలు చేశారు. వాటిలో ఇప్పుడు పంచుకోబోయే అనుభవాలు కొన్ని. మేము ఇటీవల (2023) సంక్రాంతి సెలవులకి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మావాళ్ళ ఊరు ఏలూరు నుంచి తిరుపతి వరకు ట్రైనులో వచ్చాము. మేము వేకువఝామున నాలుగు గంటలకు తిరుపతిలో దిగాము. అక్కడినుండి మా ఊరు వెళ్లాలంటే ఇంకో మూడు గంటల ప్రయాణం చేయాల్సి ఉండగా, బస్సులో వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ అంతలో ధర్మవరం వెళ్లే ట్రైన్ 5వ నెంబరు ప్లాట్‌ఫాం మీదకి వస్తుందని అనౌన్స్ చేశారు. అది విని 1వ నెంబర్ ప్లాట్‌ఫాం మీద ఉన్న మేము 'టికెట్ తీసుకొని 5వ నెంబర్ ప్లాట్‌ఫాంకి వెళ్లేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంద'ని భావించి టికెట్ తీసుకోకుండానే 5వ నెంబర్ ప్లాట్‌ఫాంకి వెళ్లిపోయి, హడావిడిలో రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కేశాం. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "బాబా! మేము ఏ సమస్యా లేకుండా మా ఊరు చేరుకుంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా మేము మా ఊరికి చేరుకున్నాం. తలచుకుంటే చాలు, ఎంత కష్టమైనా తీరుస్తారు బాబా. "ధన్యవాదాలు బాబా".


నేను సాయి సచ్చరిత్ర పారాయణ చేయాలని ఎప్పటినంచో అనుకుంటున్నప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయాను. సంక్రాతికి ఊరు వెళ్లొచ్చాక పారాయణ చేయాలనుకున్నాను. సరిగ్గా అదే సమయంలో మా తోడికోడలు మా ఊరు వచ్చి, "మా అక్క పారాయణ గ్రూపులో ఉంది. తను మా ఇంట్లో ఉన్నప్పుడు పారాయణ చేసింది. నేను తనని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నాను. నువ్వు కూడా ఆ గ్రూపులో జాయిన్ అవ్వొచ్చు కదరా?" అని నన్ను అడిగింది. అయితే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలుండటం వల్ల తనని, "కొన్ని నియమాలు పాటించాలి కదా అక్క, కుదరదేమో!" అని అన్నాను. అప్పుడు తను, "లేదురా, ఎలాంటి నియమాలు లేవు. నువ్వు పారాయణ చేసుకో" అని నన్ను పారాయణ గ్రూపులో జాయిన్ చేసింది. కొన్ని రోజులకి నేను మహా పారాయణ గ్రూపులో కూడా జాయిన్ అయ్యాను. బాబా లీలలు అద్భుతం. ఆయన నా మనసులో కోరిక తెలుసుకుని నాకు పారాయణ చేసే అదృష్టం కల్పించారు. "సాయినాథా! నా మనసులో ఉన్న బాధ, దిగులును తొలగించు తండ్రి".


గాల్‌బ్లాడర్‌లో స్టోన్‌ని అదృశ్యం చేసిన బాబా


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. నా పేరు పద్మ. నేను బాబా భక్తురాలిని. నేను ప్రతిరోజూ పొద్దున్నే ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదివి, ఆపై నా పనులు మొదలుపెట్టుకుంటాను. అలా చాలా రోజుల నుంచి నేను తోటి భక్తుల అనుభవాలు చదువుతున్నాను. కానీ నా అనుభవాలు ఇంతవరకు పంచుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి సాయినాథా! ఇక నా అనుభవానికి వస్తే... నాలుగు సంవత్సరాల క్రితం మా అమ్మాయికి జ్వరం వస్తుండేది. దాంతోపాటు కడుపునొప్పి కూడా ఉంటుండేది. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ స్కాన్ చేసి, "గాల్‌బ్లాడర్‌లో స్టోన్ ఉంది" అని చెప్పారు. దాంతో మేము లివర్ స్పెసలిస్ట్ డాక్టరుని సంప్రదించాము. ఆయన కూడా స్కానింగ్ చేసి, "స్టోన్ ఉంద"ని చెప్పి, అవి కరగడానికి మందులిచ్చారు. ఆ మందులు మూడు సంవత్సరాలు వాడినా రాయి కరగలేదు. ఇక డాక్టరుగారు, "రాయి కరగటం లేదు కనుక ఎప్పుడు నొప్పి వస్తే అప్పుడు ఆపరేషన్ చేస్తాను" అన్నారు. అప్పటికే నేను సాయిసచ్చరిత్ర, గురుచరిత్ర పారాయణ చేస్తూ, సదా బాబాను తలచుకుంటూ ఉంటుండేదాన్ని. రెండు నెలల తర్వాత అమ్మాయికి బాగా కడుపునొప్పి వస్తే, నేను అమ్మాయిని తీసుకొని మళ్లీ డాక్టర దగ్గరకి వెళ్ళాను. డాక్టర్ స్కాన్ చేసి, "అర్జెంటుగా ఒక వారం లోపల ఆపరేషన్ చేయాలి. లేకపోతే ఆ రాయి వేరే గ్రంధిలోకి పోయే అవకాశముంది. అదీకాక, రాయితోపాటు మట్టిలా కొంచెం రాయిపొడి కూడా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయించుకోకపోతే చాలా ప్రమాదం" అని చెప్పి, డబ్బులు కూడా చాలా ఎక్కువ అడిగి, ఆపరేషన్ కోసం వేరే డాక్టర్ దగ్గరకి పంపుతానని అన్నారు. "అలా జరగకుండా రాయి కనపడకుండా పోయేలా చూడమ"ని మేము బాబాను వేడుకొని భారం ఆయన మీద వేశాము. డాక్టరు వారం తర్వాత రమ్మంటే మూడు నెలల తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేను నాతోపాటు శ్రీసాయిసచ్చరిత్ర తీసుకొని వెళ్ళాను. ప్రయాణంలో కూడా బాబా నామం తలచుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను సచ్చరిత్ర పారాయణ చేసుకుంటుంటే, మా అమ్మాయి డాక్టర్ దగ్గరకి వెళ్ళింది. ఆయన కొంచెం కోపంగా, "ఒక వారంలో రమ్మంటే, ఇప్పుడా మీరు వచ్చేది? ఏదైనా ప్రమాదమైతే నాకు సంబంధం లేదు" అని మరలా స్కాన్ వ్రాశారు. మాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. కొద్దిసేపటికి మేము డాక్టరుగారి గదిలోకి వెళ్తుంటే, అప్పటికీ ఆయన రిపోర్ట్ చూసారు కాబోలు, "ఇదేంటమ్మా? నీ గాల్‌బ్లాడర్‌లో రాయి లేదు. ఆశ్చర్యంగా ఉంది" అని నవ్వారు. మేము పూర్తిగా లోపలికి వెళ్తే, ఎదురుగా టేబుల్ మీద బాబా ఫోటో, సచ్చరిత్ర పుస్తకము కనిపించాయి. అంటే, డాక్టరు కూడా బాబా భక్తులే. మేము కోరుకున్నట్లే రాయి కనపడకుండా చేసి మమ్మల్ని ఆ బ్రహ్మాండనాయకుడు కాపాడారని మేము మురిసిపోయాం, మైమరచిపోయాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1454వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రతి విషయంలో తోడుంటున్న బాబా 
2. లాకెట్ దొరికేలా అనుగ్రహించిన బాబా

ప్రతి విషయంలో తోడుంటున్న బాబా 


నేను ఒక సాయిభక్తురాలిని. మా తమ్ముడిది సివిల్ బ్యాక్‌గ్రౌండ్. ఈమధ్యకాలంలో సివిల్ వాళ్ళకి ఏ అవకాశాలూ లేవు. అందువల్ల, ఏదైనా సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్పుకొని ఉద్యోగానికి ప్రయత్నించమని నేను తనతో చెప్పాను. అలాగే, ఒక కోర్స్ చేయమని సూచించాను. తనది కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా చాలా కష్టపడి కోర్స్ నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే సివిల్ బ్యాక్‌గ్రౌండ్ అయ్యేసరికి ఆ బ్రాంచ్ వాళ్ళకి ఫ్రెషర్‌గా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఓపెనింగ్స్ అంతగా లేవు. దాంతో చేసేదేమీలేక అనుభవం ఉన్నట్లు పెట్టుకుని ప్రయత్నిస్తేనైనా అవకాశమిస్తారని ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని, అందుకు తగ్గట్టు తనకుతానే చాలా కష్టపడి ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు. నేను, "బాబా! ఎలా అయినా తమ్ముడికి ఉద్యోగం వచ్చేలా చేయి బాబా. ఏ దారి లేక అనుభవం పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని చూసైనా తనకి ఉద్యోగాన్ని అనుగ్రహించు" అని బాబాని వేడుకున్నాను. కొన్ని రోజులకి తమ్ముడు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ పూర్తిచేశాడు, కంపెనీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసింది, ఆ ఉద్యోగంలో జాయిన్ కూడా అయ్యాడు. ఇదంతా బాబా దయవల్ల జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఏ సమస్యా లేకుండా తన జాబ్ కన్ఫర్మ్ అయ్యేలా చేయండి బాబా ప్లీజ్".


2023, సంక్రాంతి సెలవులకి తమ్ముడు బస్సులో ఇంటికి వస్తానన్నవాడు. కానీ చివరి క్షణంలో వేరే బ్రదర్స్‌తో కలిసి కారులో బయలుదేరాడు. కారు ప్రయాణం, అదికూడా రాత్రి సమయం అవ్వడం వల్ల నాకు చాలా భయమేసి, "బాబా! తమ్ముడువాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేలా చేయి తండ్రీ. వాళ్ళు ఏ సమస్యా లేకుండా ఇంటికి చేరుకుంటే 'సాయి మహరాజ్ సన్నిది' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. "ఇలాగే ఎల్లప్పుడూ అందరికీ తోడుగా ఉండండి బాబా".


ఒకరోజు మా అమ్మ నన్ను పిలిచి, "కుడివైపు చేతి దగ్గర నొప్పి వస్తుంది. బాబా ఊదీ పెట్టి, తగ్గాలని కోరుకో" అని చెప్పింది. నాకు కొంచెం భయమేసింది, కానీ వెంటనే బాబా ఊదీ అమ్మకి పెట్టి, నొప్పి ఉన్న దగ్గర కూడా కొంచెం రాశాను. తరువాత, "ఎలాగైనా నొప్పి తగ్గి అమ్మకి నిద్రపట్టేలా చూడు బాబా. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. కాసేపటికి అమ్మ నిద్రపోయింది. ఆమె నిద్రలేచాక, "ఎలా ఉంది? నొప్పి తగ్గిపోయిందా?" అని అడిగాను. అందుకు అమ్మ, "నువ్వు బాబా ఊదీ పెట్టగానే నాకు నిద్ర వచ్చింది. నిద్రలోనే ఆ నొప్పి తగ్గిపోయింది" అని చెప్పింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా".


ఈమధ్య నేను తరచూ మా ఊరి నుంచి హైదరాబాదుకి, హైదరాబాద్ నుంచి మా ఊరికి బస్సులో ప్రయాణిస్తున్నాను. కొన్నిసార్లు బస్సు వేగానికి సురక్షితంగా చేరుకుంటానో, లేదో అని చాలా భయమేసి, "క్షేమంగా ఇంటికి చేరుకునేలా చేయి బాబా" అని ఎన్నోసార్లు కోరుకుంటున్నాను. బాబా ఎప్పుడూ నాకు తోడుగా వుండి, ఏ సమస్యా లేకుండా నన్ను ఇంటికి చేరుస్తున్నారు. అలాగే ఈమధ్య నేను ఎన్నోసార్లు షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నష్టాల్లో ఉంటే బాబాని తలచుకోగానే నష్టం లేకుండా బయటపడ్డాను. "ఇలా ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటూ ఏది మంచో, ఏది చెడో తెలిసేలా చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు బాబా. ప్రస్తుతం నేను ఒక కుటుంబ సమస్యతో బాధపడుతున్నాను. ఎందుకీ పరీక్షో తెలియదుగానీ, దీని నుండి మమ్మల్ని కాపాడేది మీరే అని నా నమ్మకం. అందుకే భారమంతా మీ మీదే వేసి, మీ మీద నమ్మకంతో ఉంటున్నాను తండ్రీ. ఎలా అయినా ధైర్యాన్నిచ్చి ఈ సమస్య నుండి బయటకి తీసుకురండి తండ్రీ. ఆ అనుభవాన్ని నా జీవితంలో మీరు చేసిన అద్భుతంగా మీ భక్తులతో పంచుకుంటాను. ఏవైనా తప్పులుంటే క్షమించండి బాబా. ఏదైనా అనుభవాన్ని, మ్రొక్కుకుని మర్చిపోయివుంటే గుర్తుచేయండి బాబా".


లాకెట్ దొరికేలా అనుగ్రహించిన బాబా


నా పేరు లక్ష్మి, నేను బెంగళూరు నివాసిని. ముందుగా సాయినాథునికి శతకోటి వందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులైన సాయి బృందానికి నా కృతజ్ఞతలు. 2022, డిసెంబర్ 18న నేను మా చిన్నబ్బాయితో కలిసి హైదరాబాదులో ఉన్న మా అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళాను. నా ఆరోగ్యం సహకరించకపోయినా మా బంధువులందరినీ కలుసుకొని, 2023, జనవరి 8న మా పెద్దబ్బాయితో కలిసి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తిరిగి బెంగళూరు వచ్చాను. అంతా బాబా దయ. ఇకపోతే, నేను హైదరాబాద్ వెళ్లేముందు నా సాయిబాబా లాకెట్ ఎక్కడో పెట్టి మరచిపోయాను. ఎక్కడ వెతికినా కనిపించలేదు. రెండు రోజుల తర్వాత 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ వెతికిన చోటనే ఇంకోసారి చూద్దామని చూస్తే లాకెట్ దొరికింది. ఆ లాకెట్‌ని నా 70వ పుట్టినరోజు సందర్భంగా నా పిల్లలు నాకు బహుమతిగా ఇచ్చారు. అదీకాక, నా బాబా రూపం ఉన్న లాకెట్ కాబట్టి దాన్ని చాలా ఆనందంగా నా మెడలో వేసుకున్నాను. "ధన్యవాదాలు బాబా. మేము తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్లాలనుకుంటున్నాము. ఏ ఇబ్బందీ లేకుండా వెళ్ళొచ్చేలా చూడు తండ్రీ. నేను కాలినొప్పితో చాలా బాధపడుతున్నాను. నొప్పి తగ్గించి, అలాగే మా ఇంట్లో సమస్యలను తొలగించి నాకు మనశ్శాంతిని ప్రసాదించమని నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సాయినాథా. నా బాధలు, సమస్యలు మీకు తెలుసు. మీ మీదే భారం వేసి, అన్నీ మీరే చూసుకుంటారన్న భరోసాతో ఉన్నాను తండ్రీ" .


ఓం సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1453వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్యాన్ని కాపాడిన బాబా
2. బయాప్సీ రిజల్ట్ నార్మల్ వచ్చేలా దయచూపిన బాబా

ఆరోగ్యాన్ని కాపాడిన బాబా


నా పేరు కోమలి. ముందుగా, సాయితండ్రికి నా సాష్టాంగ నమస్కారాలు. ఈ బ్లాగులో తోటి సాయిబంధువుల అనుభవాలను రోజూ చదువుతుండడం వల్ల నాకు సాయితండ్రి మీద విశ్వాసం ఎన్నోరెట్లు పెరిగింది. అందుకే ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా కృతజ్ఞతలు. నేను కూడా ఈ బ్లాగులో ఒక సభ్యురాలిని అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనిప్పుడు బాబా నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడారో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 2021, ఆగస్టు నెలలో నాకు అంతకుముందు ఎన్నడూ లేనటువంటి ఆయాసం, నీరసం ఉంటుండేవి. అలాగే నా కాళ్ళమీద చర్మం కమిలినట్టుగా మచ్చలు వచ్చి పోతుండేవి. ఎందుకలా ఉంటుందో మాకు అర్థం కాలేదు. మేము చాలా టెస్టులు చేయించాము. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయిగానీ, బ్లడ్ టెస్టులో ప్లేట్లెట్ల కౌంట్ 60 వేలకి పడిపోయినట్లు తెలిసింది. అప్పుడు వరుసగా 2 రోజులు పరగడుపున బొప్పాయి ఆకుతో రసం చేసుకొని తాగాను. దాంతో ఆయాసం తగ్గిపోవడం వల్ల నేనింక టెస్ట్ చేయించుకోలేదు. అయితే సంవత్సరం తర్వాత 2022, అక్టోబర్ నెల చివరిలో మళ్లీ ఆయాసం, నీరసం అనిపించాయి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే ప్లేట్లెట్ కౌంట్ 48 వేలకు పడిపోయిందని వచ్చింది. అప్పుడు ముందు సంవత్సరంలోలాగానే 2022, నవంబరులో బొప్పాయి ఆకు రసం తాగాను. కానీ ఈసారి ఆయాసం తగ్గలేదు. అయినా బొప్పాయి రసంతో పాటు మంచి ఆహారం తీసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ప్రతివారం ప్లేట్లెట్ కౌంట్ చెక్ చేసుకుంటుండేదాన్ని. అలా నెల రోజులు గడిచినా కూడా ప్లేట్లెట్ కౌంట్ పెరగలేదు. అప్పుడు మాకు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్‍కి వెళ్ళాము. అక్కడ అన్ని టెస్టులు చేసి, "మీకు ఐటిపి అనే ఒక రకమైన వ్యాధి ఉందనుకుంటున్నాము. ఆ వ్యాధి నిర్ధారణ కోసం బోన్ మ్యారో టెస్ట్ చేయాలి" అని చెప్పారు. మేము చాలా టెన్షన్ పడ్డాము. మరో డాక్టర్ సలహా తీసుకుందామని ఈసారి ఒక పెద్ద ప్రైవేటు హాస్పిటల్‌కి వెళ్ళాము. అక్కడ కూడా అదే చెప్పారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్నపాపకి మూడు సంవత్సరాల ఐదు నెలల వయసు. అందువల్ల నా భర్త చాలా టెన్షన్ పడ్డారు. నాకు మాత్రం 'బాబా ఉన్నారు. నాకు ఏమీ కాదు' అనే ధైర్యం ఉండేది. ఎందుకంటే, నా జీవితంలోకి ఏదైనా ఒక పెద్ద కష్టం రాబోతుందంటే, సాయితండ్రి ముందుగానే నాకు కలలో కనిపించి ధైర్యం చెప్పడమో లేదా ఆ పెద్ద కష్టాన్ని తమపై వేసుకొని చిన్నదిగా చేస్తున్నట్లు తెలియజేయడమో చేస్తారు. అలాంటిది ఈసారి బాబా నాకు కలలో కనిపించి నా ఆరోగ్యం గురించి ఏమీ చెప్పలేదు. కాబట్టి నేను, 'నాకు ఏమీ కాద'ని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ మేము మూడో డాక్టర్ని కలిసినప్పుడు ఆ డాక్టర్ కూడా ముందు డాక్టర్లలాగే చెప్పి, "ఒకసారి బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవండి" అని చెప్పారు. దాంతో నాకు భయమేసి ఒక గురువారంనాడు, 'బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవాలా, వద్దా?' అని బాబా దగ్గర చీటీలు వేశాను. అందులో నుండి ఒక చీటీ తీస్తే, 'బోన్ మ్యారో స్పెషలిస్ట్‌ని కలవవద్దు' అని వచ్చింది. అంటే, 'బోన్ మ్యారో టెస్టు అవసరం లేద'ని బాబా చెప్పకనే చెప్పారు. దాంతో నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. ఒక పది రోజులు, అంటే 2023, జనవరి 6వ తేదీ వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ ఆరోజు నాకు ఆయాసం ఎక్కువైంది. నా భర్తకు ఫోన్ చేస్తే స్కూల్ నుండి వచ్చారు. ఇద్దరం దగ్గరలో ఉన్న ల్యాబ్‍కి వెళ్లి, టెస్ట్ చేయిస్తే ప్లేట్లెట్ కౌంట్ 75,000 ఉంది. హిమోగ్లోబిన్ మాత్రం 19%కి పెరిగింది. మాములుగా ఆడవాళ్ళకి హిమోగ్లోబిన్ 14% ఉంటేనే చాలా ఎక్కువ ఉన్నట్లు. అలాంటిది నాకు 19% ఉంది. అది అబ్-నార్మల్ కండిషన్ అని ల్యాబ్ అతను, "మీరు ఒకసారి హైదరాబాద్ వెళ్లి స్పెసలిస్ట్‌కి చూపించుకోండి. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది" అని చెప్పాడు. దాంతో మావారు, "సంబంధిత డాక్టరుని సంప్రదిద్దాము. అన్ని అనుమానాలు క్లియర్ అయిపోతాయి" అని అన్నారు. ఇంక నేను ఐటిపి వ్యాధి గురించి యూట్యూబ్‍లో చూడసాగాను. ముఖ్యంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ కరుణకుమార్ (హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో స్పెషలిస్ట్) వీడియోలు బాగా చూశాను. చివరికి ల్యాబ్ అతను చెప్పినట్టుగా హైదరాబాద్ వెళ్లి చూపించుకోవాలని డాక్టర్ కరుణకుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అప్పటివరకు నేను చాలా టెన్షన్ పడుతూ, "బాబా! దయ చూపండి. నాకు ఏమన్నా అయితే నా పిల్లలు అనాథలైపోతారు, నా భర్త దిక్కులేనివాడు అయిపోతాడు" అని చాలా ప్రార్థిస్తుండేదాన్ని. ఆరోజు మేము మా ఊరి నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు నాకు ధైర్యంగా ఉంటుందని రోజూ మా ఇంట్లో పూజించే సాయిబాబా చిన్న ప్రతిమను నా బ్యాగులో పెట్టుకొని వెళ్ళాను. బాబాను ప్రార్థిస్తూ, "సాయితండ్రీ! బోన్ మ్యారో టెస్ట్ అవసరం లేదని డాక్టర్ చెప్పేలా చూడండి. అలా చెప్తే మీ కృపను బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతలో నర్సు నా పేరు పిలిస్తే, వెళ్లి డాక్టర్ని కలిశాము.


డాక్టర్ నా రిపోర్టులన్నీ చూసి, "ఇంకొన్ని టెస్టులు చేద్దాం" అని చెప్పి, "మీకుంది మైల్డ్ ఐటిపి కాబట్టి బోన్ మ్యారో టెస్టు మాత్రం అవసరం లేద"ని చెప్పారు. అప్పుడు బాబా కరుణకు నా కళ్ళనుండి నీళ్లు కారాయి. డాక్టర్ మరికొన్ని టెస్టులు చేసి, "బి12 విటమిన్ లోపం ఉంద"ని చెప్పి, 15 రోజులకి టాబ్లెట్లు ఇచ్చి, "మీకున్న మైల్డ్ ఐటిపికి ఒక్క టాబ్లెట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే, ఐటిపి పేషెంట్స్‌కి ప్లేట్లెట్ కౌంట్ 30,000 కంటే తక్కువ ఉంటేనే ట్రీట్మెంట్ అవసరం. కానీ మీకు 75,000 ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అంతేకాదు, మీరు ఇంకా ప్లేట్లెట్స్ కౌంట్ చెక్ చేసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోనవసరం లేదు. బి12 విటమిన్ లోపం వల్ల కూడా ఆయాసం వస్తుంది" అని చెప్పారు. మొత్తానికి లోకల్లో ఉండే ముగ్గురు జనరల్ డాక్టర్లు బోన్ మ్యారో టెస్ట్ చేయాలని చెప్పినప్పటికీ, ఆ సాయితండ్రి స్పెషలిస్ట్ డాక్టరుతో బోన్ మ్యారో అవసరం లేదని చెప్పించారు, నా కుటుంబసభ్యుల ఆందోళనను తగ్గించారు, నా ఆరోగ్యాన్ని కుదుటపరిచారు. "ధన్యవాదాలు సాయితండ్రీ. మాలో శ్రద్ధ, సబూరి ఇంకా ఇంకా పెంచండి. మీ పాదాలను విడవకుండా గట్టిగా పట్టుకునే శక్తిని మాకు ప్రసాదించండి".


బయాప్సీ రిజల్ట్ నార్మల్ వచ్చేలా దయచూపిన బాబా


బ్లాగును నిర్వహిస్తున్న సాయికి కృతఙ్ఞతలు. నా పేరు వసంతకుమార్ రెడ్డి. సుమారు 1990 ముందునుంచి నేను సాయినాథుని కొలుస్తున్నాను. నేను ఇంతకుముందు ఒకసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మా ఆత్మీయులొకరు క్యాన్సర్‌తో కొంతకాలం ఇబ్బందిపడి కోలుకున్నారు. సుమారు నాలుగేళ్ళ నుండి అతను రెగ్యులర్ చెకప్‌కి వెళుతున్నారు. 2023, జనవరి మూడవ వారంలో అతను చెకప్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ మళ్ళీ బయాప్సీ చేయాలని శ్యాంపిల్ తీసుకున్నారు. అది తెలిసి నాకు భయమేసి, "బాబా! రిజల్ట్ నార్మల్‌గా వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకొంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. 2023, జనవరి 22న రిజల్ట్ నార్మల్ అని తెలిసింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. మరో టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉంది. అది కూడా నార్మల్ వచ్చేటట్టు చూడు బాబా. అతను పూర్తి ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్షు కలిగివుండేలా అనుగ్రహించు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1452వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆపదల నుండి బయటపడేసిన బాబా
2. తోడుగా ఉండి ఇబ్బందులను తొలగిస్తున్న బాబా
3. శాంతపరచిన బాబా

ఆపదల నుండి బయటపడేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. సాయిభక్తులందరికీ వందనాలు. నా పేరు లక్ష్మి. నేను సాయిభక్తురాలిని. 'సాయీ' అని పిలిస్తే, 'ఓయీ' అని పలికే దైవం ఆ శిరిడీ సాయినాథుడు. ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంటారు. బాబా మమ్మల్ని కూడా కొన్ని ఆపదల నుండి రక్షించారు. వాటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆరు నెలల క్రితం మేము నూటికి 3 రూపాయల వడ్డీతో ఇంటి కాగితాలపై అప్పు తీసుకున్నాము. తరువాత వడ్డీ కట్టలేని పరిస్థితిలో బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజుల తరువాత ఒక వ్యక్తి నూటికి రూపాయి వడ్డీతో డబ్బులు ఇస్తామని, వాళ్ళ ఆఫీసుకి రమ్మన్నారు. అయితే మొదట అప్పు ఇచ్చిన వ్యక్తి మా ఇంటి కాగితాలు ఇవ్వడానికి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ పోయాడు. అప్పుడు నేను, "మాకేమిటి ఈ పరీక్ష బాబా?" అని బాబాకు మొరపెట్టుకున్నాను. వెంటనే మాకు సమాధానం దొరికింది. ఆ వ్యక్తి మా కాగితాలు మాకు ఇస్తానని కోర్టుకి రమ్మన్నారు. ఆ కాగితాలు తీసుకొని రూపాయి వడ్డీకి డబ్బులిచ్చే అతని ఆఫీసుకి వెళ్లి ముందుకన్నా ఎక్కువ డబ్బులు అప్పుగా తీసుకున్నాము. అలా బాబా దయవలన మేము ఆ సమస్య నుండి గట్టెక్కాము. "శతకోటి వందనాలు బాబా".


2023, జనవరి 18 మధ్యాహ్నం నేను, మా అబ్బాయి వెంకట శివప్రసాద్ బైక్ మీద బయటకి వెళ్ళాము. దారిలో మూడు కుక్కలు దెబ్బలాడుకుని బైక్‌కి అడ్డం వచ్చాయి. పెద్ద ప్రమాదం జరగాల్సి ఉండగా నేను 'సాయినాథ్ మహరాజ్ కీ జై' అని పెద్దగా అరిచాను. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే మన విరాట్ సాయి ఎంతో దయతో మమ్మల్ని ఆ ప్రమాదం నుండి బయటపడేశారు. వెంటనే మా అబ్బాయి ‘గుండె దడ దడ కొట్టుకుంటుంది’ అని అన్నాడు. నేను కాసేపు బండి మీద కూర్చొని 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అనే నామాన్ని చెప్పుకున్నాను. కాస్త స్థిమితపడ్డాక మేము నిదానంగా అక్కడినుండి వెళ్ళిపోయాము. "శతకోటి ధన్యవాదాలు బాబా".

 

2023, అక్టోబర్ 23, గురువారం మా కుటుంబసభ్యులందరం మా అమ్మ చనిపోయిన తరువాత తదుపరి కార్యక్రమాలు జరిపించడానికి రాజమండ్రి వెళ్ళాము. వెళ్లేముందు నేను బాబాకి హారతి ఇచ్చి వెళ్ళాను. అక్కడ కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకి తిరిగి మా వూరు వెళ్ళడానికి బయలుదేరాము. మా అబ్బాయి, కోడలు, మా తమ్ముడు మనవరాళ్లు, మనవడు బైక్ మీద వెళ్లిపోయారు. నేను, మా అమ్మాయి రైల్లో వెళదామని స్టేషన్‌కి వెళ్లి, వైజాగ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కాము. తోటి ప్రయాణికులు, “ఈ రైలు కాకినాడ వెళ్ళదు, సామర్లకోటలో దిగాల”ని చెప్పారు. అప్పటికే రైలు బయలుదేరింది. కంగారులో మా అమ్మాయి రైలులో నుండి కిందికి పడిపోయింది. తనకోసం నేనూ రైలులో నుండి దూకేశాను. స్టేషన్లో ఉన్నవాళ్ళు 'ఏమైంది?' అంటూ మా చుట్టూ చేరారు. కానీ ఆ ప్రమాదంలో నాకుగానీ, మా అమ్మాయికిగానీ చిన్న దెబ్బ కూడా తగలలేదు. కాకపోతే నా మొబైల్ రైలులో పడిపోయింది. ఏదేమైనా బాబా దయవలన మేము ఆ ప్రమాదం నుండి బయటపడ్డాము. "ప్రమాదాల నుండి బయటపడేసిన మీకు శతకోటి నమస్కారాలు బాబా. జన్మజన్మలకి మీకు ఋణపడి ఉంటాము తండ్రీ".


తోడుగా ఉండి ఇబ్బందులను తొలగిస్తున్న బాబా


సాయిపరివారమందరికీ నా నమస్కారాలు. నా పేరు స్వాతి. నేను గత 6 సంవత్సరాలుగా సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇప్పుడు పంచుకుంటున్నాను. ఒకరోజు నా చేతి ఉంగరాన్ని తీసి ఓ చోట పెట్టి మర్చిపోయాను. నెల రోజుల తరువాత గుర్తొచ్చి ఇల్లంతా వెతికినా ఆ ఉంగరం దొరకలేదు. నాకు చాలా భయమేసి బాబా ఫోటోని చూస్తూ, 'ఉంగరం ఎక్కడుందో చూపించమ'ని బాబాను అడిగాను. వెంటనే ఆ ఉంగరం దొరికింది. కొన్నిరోజుల తరువాత నా మెడలోని గొలుసు కనిపించలేదు. చాలా భయపడి బాబాని స్మరిస్తూ ఇల్లంతా వెతికితే దొరికింది. 2023, జనవరిలో సుమారు 20 రోజులపాటు నా ఎడమచేయి చాలా నొప్పిగా ఉండేది. నేను భయంతో బాబాని తలచుకొని ఊదీ రాస్తే కొంచెం కొంచెంగా నొప్పి తగ్గుముఖం పట్టింది. ఇంకా నేను చేసే ఉద్యోగంలో నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. బాబాని తలచుకున్న ప్రతిసారీ ఆయన నాకు తోడుగా నిలిచారు. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే ఎప్పుడూ నాకు తోడుగా ఉండండి బాబా. ఇంకా నాకు మూడు సమస్యలున్నాయి. అవి పరిష్కారమైతే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా సాయిపరివారంతో పంచుకుంటాను బాబా".


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


శాంతపరచిన బాబా


నా పేరు ఇందిర. నేను హైదరాబాద్‌ నివాసిని. నేను సాయిభక్తురాలిని. నేను ఈ బ్లాగులోని అన్ని అనుభవాలు చదువుతాను. ఆయా భక్తులందరికీ బాబాపై ఉన్న విశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2023, జనవరి 16 రాత్రి నా భర్త ఏ కారణం లేకుండానే నా మీద కోప్పడి అదుపులేకుండా నన్ను కొట్టారు. నేను ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని, 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని జపించి, "బాబా! దయచేసి మావారిని శాంతింపజేయండి" అని ప్రార్థించాను. బాబా దయవల్ల అరగంట తర్వాత మావారు శాంతించారు. అప్పుడు నేను ఈ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకోవాలని అనుకున్నాను. అనుకున్నట్లే ఇప్పుడు మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. ప్లీజ్ బాబా, మీరు ఏదైనా చేయగలరు. దయచేసి నా భర్త ప్రవర్తనను మార్చండి. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1451వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కలలా మిగిలిపోతుందనుకున్న సొంతింటిని సాకారం చేసిన బాబా
2. శ్రీశైలంలో రూము దొరికేలా దయచూపిన బాబా

కలలా మిగిలిపోతుందనుకున్న సొంతింటిని సాకారం చేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సాయి శరణం - భవభయ హరణం!!!

సాయి శరణం - సగుణ సమీరం!!!


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా శ్రీసాయినాథుని పాదపద్మములకు నా శతకోటి పాదాభివందనాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా కృతజ్ఞతలు. తోటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు విజయ. నాకు బాబాతో అనుబంధం 2006 నుండి ఉంది. బాబా చాలాసార్లు చాలా సమస్యల నుండి నాకు తెలియకుండానే నన్ను తప్పించి నా జీవితంలో నేను అనుకున్న మంచి పరిస్థితులు కల్పించారు. మా కుటుంబమంతా కూడా బాబా భక్తులం. నేను ఈ సంవత్సరంలో రెండుసార్లు నా ఉద్యోగ విషయంలో బాబా చేసిన సహాయాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో మంచి అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము 16 సంవత్సరాల నుండి ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాము. నా భర్త ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. నాది కాంట్రాక్ట్ ఉద్యోగం. అందువల్ల సొంత ఇల్లు అనేది మా జీవితాలలో ఒక కలలా మిగిలిపోతుందేమో అని అనుకునేదాన్ని. అలాంటి నేను ఈ మధ్యకాలంలో నా స్తోమతకు తగ్గట్టు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని బాబా దగ్గర సంకల్పం చేసుకున్నాను. సాయితండ్రి నా మొర ఆలకించి మా ఆర్థిక పరిస్థితికి తగినట్లు కొన్ని ఇళ్ళు చూపించారు. మేము ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటున్నప్పటికీ మా సొంత ఊరు రామచంద్రాపురంలో ఉన్న ఒక ఇల్లు మా అందరికీ బాగా నచ్చింది. ట్రాఫిక్‌కి దూరంగా పంటపొలాల మధ్యలో ఉండే ఆ ఇల్లు చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో, ప్రశాంతమైన వాతావరణం కలిగి, వాస్తుపరంగానూ బాగుంది. బాబా దయతో విజయదశమిరోజున మాటలు జరిగి అగ్రిమెంట్ చేసుకున్నాము. నా దగ్గరున్న డబ్బులు అగ్రిమెంటుకు సరిపోయాయి. ఇక మిగిలిన డబ్బుకోసం బ్యాంకు లోన్ పెడదామనుకొని బాబాను సహాయం చేయమని అర్థించాను. సత్యమైన తండ్రి నా మొర ఆలకించి మా బంధువులలో బ్యాంకు ఏజెంట్ అయిన తెలిసిన వ్యక్తిని మాకు చూపించారు. నేను తిరిగే పని లేకుండా ఆ వ్యక్తి లోన్‌కి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి బ్యాంకు లోన్ శాంక్షన్ చేయించారు. మధ్యవర్తులు కొంత సొమ్ము కాజేయాలని చూసినా బాబా నాకు ఏ ధననష్టం జరగకుండా చూశారు.


ఇలా ఉండగా ఇంటి కొనుగోలు ఒత్తిడిలో పడి నేను నా బిడ్డను సరిగా చూసుకోలేకపోయేదాన్ని. అదీకాక, ఇంట్లో నా కుటుంబసభ్యులు, అంటే నా భర్త, నా తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. నా భర్త తొందరపాటు మాటల వల్ల వాళ్ల మధ్య అపార్థాలు, వైరం పెరిగిపోయాయి. మరోవైపు నా ఉద్యోగం. వీటన్నిటి మధ్య నేను మానసికంగా నలిగిపోతూ నా చిన్నితండ్రి ఆలనాపాలనా చూసుకోలేక జీవితం మీద విరక్తి కలిగి నా బిడ్డని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో నేను, "బాబా! దయతో నా బిడ్డ ఆలనాపాలనా చూసే శక్తిని నాకు ప్రసాదించు తండ్రీ" అని వేడుకుంటుండేదాన్ని. అలా రెండు నెలలు చాలా ఇబ్బందిగా గడిచాక బాబా పరిస్థితిని చక్కదిద్దసాగారు. మధ్యలో, అంటే నవంబర్ నెలలో నేను ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇల్లు అమ్మే వ్యక్తికి యాక్సిడెంట్ అయి కాళ్లు విరిగి మంచాన పడ్డాడు. అప్పుడు నేను, "బాబా! అతను తొందరగా కోలుకునేలా చేసి ఇంటి రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. అయితే, అగ్రిమెంట్ సమయంలో నేను కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చి ఉన్నందువల్ల చాలా టెన్షన్ పడుతూ, 'అన్నీ బాగా జరుగుతున్నాయనుకుంటే బాబా నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నారు?' అని అనుకుంటుండేదాన్ని. అయితే బాబా ఎంతో దయతో నెలరోజుల్లో ఇల్లు అమ్మే వ్యక్తిని కోలుకునేలా చేసి 2023, జనవరి 4న ఇంటి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తానికి అలా మా సొంతింటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా గృహప్రవేశం చేయలేదు. శూన్యమాసం కావడం వలన మంచిరోజులు లేవు. నా సత్యమైన తండ్రి(బాబా) గృహప్రవేశం అయ్యేలోపు మా పరిస్థితులను చక్కదిద్ది మా ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నాను. "బాబా! బ్యాంకు లోన్ తొందరగా తీర్చే శక్తిని ఇవ్వండి. మా బిడ్డను మంచిగా చూసుకొనే శక్తిని ప్రసాదించండి".


పైన చెప్పినట్లు నా జీవితంలో బాబా చాలా అనుగ్రహించారు. నా ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో, ప్రయాణాలలో, చుట్టూ ఉన్న వ్యక్తులతో వచ్చే ఇబ్బందులను తొలగించి అన్నీ సానుకూలంగా మలచి అడుగడుగునా నన్ను రక్షిస్తున్నారు నా సాయితండ్రి. వివాహం, ఉద్యోగం, బిడ్డ బాబా నాకిచ్చిన వరప్రసాదాలు. అయితే జీవితంలో ఇంకా స్థిరత్వం ఏర్పడలేదు. సొంతింటిని ఇచ్చి కొంత ఊరటనిచ్చారు. అలాగే ఆర్థిక స్థిరత్వం, అంటే నాకు శాశ్వతమైన ఉద్యోగాన్ని, మావారికి  ఏదైనా మంచి జీవనోపాధిని ఇచ్చి మా బిడ్డకు అన్ని వసతులు కల్పించి తనను ప్రయోజకుడిని చేసే ఓపిక, సహనం బాబా నాకు ఇస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి అనుకూలమైన మార్పులు తీసుకొచ్చి బాబా మహిమలను తోటిభక్తులతో పంచుకొనే అదృష్టాన్ని బాబా కల్పించాలని కోరుకుంటున్నాను. బాబా నా జీవితాన్ని తమకి నచ్చినట్లు సాత్వికంగా, నిరాడంబరంగా మలుస్తారని, అలాగే నన్ను తమకి నచ్చిన మార్గంలో పయనింపజేస్తారని ఆశిస్తున్నాను.


శ్రీశైలంలో రూము దొరికేలా దయచూపిన బాబా


సాయిబాబా ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సాప్ గ్రూపు సభ్యులకి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. సాయి దయతో నేను పొందిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2023, జనవరి 12వ తేదీన మేము శ్రీశైలం వెళ్లాలని ఆన్లైన్లో రూము కోసం చూస్తే ఆరోజు నుండి 16వ తేదీ వరకు రూములు లేవని వచ్చింది. అయినా మేము బయలుదేరేముందు ఇంట్లో బాబాను తలచుకొని, "బాబా! మీ దయతో మేము సంతోషంగా శ్రీశైలం వెళ్ళాలి. అక్కడ మాకు రూము దొరకాలి, దర్శనం బాగా జరగాలి" అని అనుకున్నాము. సాయిబాబా లీలలు అద్భుతం. బాబా దయవల్ల మాకు శ్రీవిద్యాపీఠంలో రూము దొరికింది. అక్కడున్న ధ్యానమందిరంలో ధ్యానం చేసుకున్నాము. దర్శనం కూడా బాగా జరిగింది. మాకు రూము దొరికితే బాబా అనుగ్రహాన్ని అందరికీ తెలపాలని నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకోవాలనుకున్నట్లే మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపులో ఉన్నందుకు (చేర్చినందుకు) కూడా మీకు కృతజ్ఞతలు".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo