1. బాబా నిండు సంరక్షణలో
2. నమ్ముకున్నవారి సమస్యలను తొలగించే బాబా
బాబా నిండు సంరక్షణలో
శ్రీసాయి భక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగును చూపించిన బాబాకి చాలా కృతజ్ఞతలు. ఈ బ్లాగు ద్వారా నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. బాబా నా పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, ఇల్లు, స్టేటస్ మొదలైన అన్ని విషయాలలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అన్నింటిలో ది బెస్ట్ ఇచ్చారు. మాది ప్రేమ పెళ్లి. నా తల్లిదండ్రులు, ముఖ్యంగా మా అమ్మ మా పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. అలాంటామె హఠాత్తుగా ఏమైందోగాని నా ప్రయత్నమేమీ లేకుండానే పెళ్ళికి ఒప్పుకుంది. నా భర్తది కూడా ప్రేమ పెళ్లి చేసుకునే మనస్తత్వం కాదు. అలాంటి ఆయనని నేను ఎలా నమ్మానో అనిపిస్తుంది. కానీ బాబా దయవల్ల నేను ఒక సురక్షితమైన వ్యక్తి చేతుల్లో ఉన్నాను. నేను మావారితో, "బాబానే ఏదో ఋణానుబంధంతో మిమ్మల్ని నాకు ఇచ్చారు" అని అంటుంటాను. ఇక అసలు విషయానికి వస్తే, నాకు మీ అందరితో చాలా అనుభవాలు పంచుకోవాలని ఉంది. కానీ అన్నీ పంచుకోవాలంటే ఈ పేజీ సరిపోదు. అందుకే తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం పులకించిపోయే రెండు అనుభవాలు పంచుకుంటాను.
మేము అమెరికాలో ఉంటాము. ఒకసారి నేను ఇండియాకి సెలవు మీద వచ్చాను. నా భర్త అమెరికాలో ఉన్నారు. మా ఇద్దరి మధ్య కొంచెం బాగానే గొడవ జరిగింది. అందువల్ల నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రాత్రి వేళ బాగా డిస్టర్బ్‌గా ఉన్నాను. మూడ్ ఛేంజ్ కోసం సినిమా చూస్తూ నిద్రపోయాను. కలలో అంతకుముందు నేను చూసిన సినిమాలోని పాత్రలు వేరే ముఖాలతో కనిపించాయి. అప్పటికి గర్భవతినైన నేను కలలో రోజూ వాకింగ్‍కి వెళ్తున్నాను. రోజూ టెన్నిస్ కోర్టులో ప్రాక్టీస్‍కి వచ్చే ఒక ప్లేయర్తో నాకు పరిచయమేర్పడింది. ఇద్దరమూ కలిసి కొద్దిసేపు వాక్ చేస్తూ ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుంటున్నాం. అయితే అతను ఎంతసేపూ నా గురించిన వివరాలు అడుగుతున్నాడేగానీ నా భర్త గురించిగాని, నా కడుపు చూసి ఎన్నో నెల అనిగాని అడగట్లేదు. అందువల్ల నాకెప్పుడూ ఒకటే ఆలోచన, 'ఇతనికి నా గురించి తప్ప నా వాళ్ళ విషయాలేమీ అవసరం లేదు, అదే నా భర్త అయితే ఎప్పుడూ నా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు, ఇంత స్వార్థంగా ఉండరు. ఎవరినీ నమ్మలేకపోతున్నాము' అని. చివరికి ఒకరోజు ఆ టెన్నిస్ ప్లేయర్ నాతో, "ఎప్పుడూ నైట్ ప్యాంటులోనే ఉంటావు. ఒకసారి వేరే ఏదైనా డ్రెస్ గాని, చీరగాని కట్టుకుని రావచ్చు కదా!" అని అన్నాడు. నేను, 'అందులో ఏముంది? చీర కట్టుకుందాం' అని అనుకున్నాను. కానీ మనసులో 'వేరే వాళ్లకోసం నేను ఎందుకు చీర కట్టుకోవాలి?' అనుకున్నాను. అయితే దాని గురించి అంతగా ఆలోచించలేదు. తర్వాత చీర తీసుకుందామని అలమారా తెరిచాను. అందులో మంచి సింహాసనం మీద కూర్చుని ఉన్న బాబా నా వైపు చూస్తూ, "ఎవరికోసం చీర కట్టుకుందామని చూస్తున్నావు?" అని కొంచెం కోపంగా అన్నారు. ఇంకా అంతే, వాకింగ్ అన్ని ఆపేసి ఇంట్లో కూర్చున్నాను. ఇవన్నీ కలలో జరిగాయి. లేచాక అంతా గుర్తుకొచ్చి నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కలలో కూడా నేను తప్పు చేయకుండా ఎంతలా కాపాడుతున్నారు బాబా అనిపించింది. అలాగే నా భర్త మీద ఎంత కోపమున్నా కలలో కూడా అయన గురించే ఆలోచిస్తున్నాను అని అర్థమై, "నా భర్త విలువ నాకు తెలియజేశారు బాబా. మీకు శతకోటి వందనాలు తండ్రి" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత నా భర్తకి నాకొచ్చిన కల గురించి చెప్పి, "మీ మీద నాకున్న ప్రేమే నన్ను ఆపింది" అని అన్నాను. కానీ నాకు తెలుసు, 'బాబా కలలో రావడం అంటే, నిజంగా రావడమే' అని. ఇప్పటికీ ఆ కల గురించి ఎప్పుడు తలుచుకున్నా నా శరీరం పులకించిపోతుంది. బాబా నిండు సంరక్షణలో ఉన్నానని చాలా సంతోషంగా ఉంటుంది. మంచిపని చేయాలన్నా, చెడుపని చేయాలన్నా బాబా ముఖకవళికలు నా కళ్ళ ముందు మెదులుతాయి. ఎవరినైనా కామెంట్ చేస్తున్నప్పుడు బాబా నన్ను కోపంగా చూస్తున్నట్లు, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు బాబా నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనా సదా ఆయన ఎఱుకలో నన్ను ఉంచుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అది నా అదృష్టం.
ఇక మా గ్రీన్ కార్డు విషయానికొస్తే... మేము గ్రీన్ కార్డుకి అప్లై చేసి, 'చాలామందికి కరెంటు అవుతుంది, మాకు కూడా తేలికగానే అవుతుంది, ఇందులో ఏముంది? దేవుని దయవల్ల ఏదైనా వచ్చేది, పోయేది ఉంటుంది. అది చిన్నదైనా పెద్దదైనా' అని అనుకున్నాను. అందువల్ల సాయిని ఎక్కువగా ప్రార్థించలేదు. కొన్నిసార్లు నా కర్మ నన్ను సాయి ధ్యాస నుండి బయటికి తీసుకొచ్చి నన్ను కష్టాలకు గురిచేస్తుంది. మా గ్రీన్ కార్డు కరెంటు అయిందికానీ మాకు క్వరీ(సందేహముతో కూడిన ప్రశ్న) పడింది. అలా అంతకు ముందు ఏ విషయంలోనూ మాకు జరగలేదు. ఈసారే క్వరీ పడి గ్రీన్ కార్డు రావడంలో జాప్యం జరుగుతూ పోయింది. అప్పుడు నాకు 'బాబాని సరిగా ప్రార్థించక పోవడం, సుళువుగా ప్రాసెస్ జరుగుతుందని తేలిగ్గా తీసుకోవడమే' ఇందుకు కారణమని అనిపించింది. ఇక అప్పటినుంచి నేను బాబాని క్షమించమని వేడుకుంటూ 'ఏదైనా బాబా దయ లేకుండా రాదు. మా డేట్స్ వెనక్కి వెళ్ళిపోయాయి' అని ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. కానీ మా తర్వాత అప్లై చేసిన వాళ్లకి గ్రీన్ కార్డు వచ్చాయి కానీ, మా గ్రీన్ కార్డు క్వరీ దగ్గర అలాగే ఆగిపోయింది. చాలాకాలం ఎదురు చూసాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. చివరికి 'ఇంతలా క్షమించమని అడుగుతున్నా బాబా నన్ను మన్నించలేకపోతున్నారా?' అని చాలా బాధపడుతూ గ్రీన్ కార్డ్ మీద ఆశ వదులుకున్నాను. అయితే నేనెప్పుడూ ఈ అనుభవం గురించి వ్రాస్తానని బాబాకి చెప్పుకోలేదు. ఎందుకంటే, బాబాతో వ్యాపారంలా ఇదైతే బ్లాగులో పంచుకుంటానని అనడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ చాలాకాలం తర్వాత ఎందుకు అనిపించిందోగాని 'ఇలా అనుకుంటేనన్నా బాబా నన్ను క్షమిస్తారేమో' అని అనిపించి వెంటనే, "బాబా! మాకు గ్రీన్ కార్డు వస్తే, నేను చేసిన తప్పుని, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాకి చెప్పుకున్నాను. ఇంకా ఇప్పట్లో రాదని మేము మా గ్రీన్ కార్డు స్టేటస్ చూడటం ఆపేసాము. తరువాత డిసెంబర్ రెండో వారంలో మాకు ఒక పోస్ట్ వచ్చింది. అందులో మా గ్రీన్ కార్డు అప్రూవ్ అయిందని ఉంది. మేము ఎంతో షాకయ్యాం. అది నిజమో, కాదో అని నమ్మలేకపోయాము. కానీ గ్రీన్ కార్డు మా ఇంటికి వచ్చినప్పుడు నిజంగా బాబా మమ్మల్ని అనుగ్రహించారని నమ్మాము. ఒక భక్తురాలి అనుభవంలోని 'బాబానే భయం, భయానికి కారణం, భయనాశకుడు కూడా ఆయనే' అన్న వ్యాఖ్యలు నాకు బాగా నచ్చాయి. నావరకు అవి అక్షరాల సత్యాలు. "థాంక్యూ సో మచ్ బాబా. మీకు నేను ఎంతగానో ఋణపడి ఉన్నాను బాబా. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయకుండా ఉండేలా నన్ను అనుగ్రహించండి తండ్రి. మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒక సాధనంగా చేసుకోండి తండ్రి. మీ దివ్య హస్తాన్ని మా అందరి మీద ఉంచి మాకు ఎప్పుడూ మంచి ఆలోచనలే వచ్చేలా, మీ మనసుకు మేమెప్పుడూ శాంతిని ఇవ్వగలిగేలా ఆశీర్వదించండి".
రక్షరక్ష సాయిరక్ష!!!
నమ్ముకున్నవారి సమస్యలను తొలగించే బాబా
సాయి బంధువులకి నమస్కారం. నా పేరు ఇందిర. బాబాతో నాకు ఎన్నో అనుభవాలున్నాయి. అవి ధైర్యంగా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. వాటిల్లో నుండి రెండు ముఖ్యమైన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. ముందుగా ఈ అవకాశమిచ్చిన బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 2022, నవంబర్ నెల చివరిలో ఒకరోజు మా మావయ్యగారు బైక్ నడుపుతుండగా ఆయనకి కళ్ళు తిరిగినట్లు అనిపించింది. దాంతో ఆయన బైక్ అపి ఒక పక్క కూర్చుండిపోయారు. అక్కడికి దగ్గరలో ఉన్న మా బంధువు ఒకరు మావయ్యగారిని దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌కి చూపించారు. డాక్టరు ఈసీజీ చేసి, "అంతా బాగానే ఉందికాని, బీపీ బాగా ఎక్కువగా చూపిస్తుంది. వరుసగా రెండు రోజులు చెక్ చేసుకుని తగ్గకపోతే టెస్టులు చేయించుకోండి" అని చెప్పారు. మావయ్యకి రెండు రోజుల్లో బీపీ అదుపులోకి రాలేదు. దాంతో ఆయన హాస్పిటల్‍కి వెళితే, అన్ని టెస్టులు చేసి మూత్రవిసర్జన చేసే చోట సమస్య ఉందని, తదుపరి టెస్టులు వ్రాసి బయాప్సీ కూడా చేసారు. ఆ రిపోర్ట్ 20 రోజుల్లో వస్తుందన్నారు. ఆ సమయంలో మేమంతా చాలా భయపడి "రిపోర్టులో ప్రమాదమేమీ లేదని రావాలి" అని భగవంతున్ని వేడుకున్నాము. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "మావయ్యగారి రిపోర్ట్ నార్మల్‍గా వచ్చేలా చూడు బాబా. నేను మీ అనుగ్రహాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్ నార్మల్ వచ్చింది. ఇప్పుడు మావయ్య ఆరోగ్యం బాగానే ఉంది. "థాంక్యూ బాబా. ఎప్పుడూ ఇలాగే మాకు తోడుగా ఉండండి".
2022, డిసెంబర్ నెల చివరిలో నాకు విపరీతమైన గొంతునొప్పి, జ్వరం వచ్చాయి. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "గురువారానికి నా ఆరోగ్యం నార్మల్ అయ్యేలా చూసి ప్రశాంతంగా మీకు పూజ చేసే అదృష్టాన్ని ఇవ్వు బాబా" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే గురువారం తమని పూజించుకునే భాగ్యాన్ని నాకిచ్చారు బాబా. "ధన్యవాదాలు బాబా".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram please cure my depression.i am suffering very much.please change my negative thoughts into positive thoughts
ReplyDeleteSri sai stavanamanjari vintu undandi sai..
DeleteOm Sairam
ReplyDeleteSai always be with me