సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1442వ భాగం....


ఈ భాగంలో అనుభవం: 

  • ప్రేమతో అడిగితే బాబా కాదనరు

సాయి మహరాజ్‍కి శతకోటి ప్రణామాలు. సాయి బంధువులకు, బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను బాబాను నా తండ్రి అనుకుంటాను. ఒకసారి నేను బాబా తండ్రిలా నన్ను దగ్గరకు (అంటే తండ్రి బిడ్డని ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా) తీసుకోవాలని అనుకున్నాను. తరువాత రెండు, మూడుసార్లు బాబా గుడికి వెళ్ళినపుడు నాకు ఎవరూ చూడకుండా బాబాను ఒకసారి కౌగిలించుకోవాలనిపించింది. కానీ ఏ గుడిలోనూ అంతటి అవకాశం ఉండదు కదా అని వదిలేశాను. రెండు, మూడు నెలలు గడిచాక ఒకరోజు నేను ఎప్పుడూ వెళ్లే ఎటిఎం సెంటరుకి వెళ్ళాను. అక్కడ నలుగురు, ఐదుగురు క్యూలో నిలబడి ఉన్నారు. పక్కనే లోపలికి ఒక దారి ఉంది. నా మనసుకి ఎందుకో ఆ లోపలకి వెళ్లాలనిపిస్తే, వెళ్ళాను. చూస్తే, అదొక ఫంక్షన్ హాల్. అందు లోపల చిన్న బాబా విగ్రహం ఉంది. నేను సంతోషంగా బాబాకి నమస్కరించుకుని 'తాము ఇక్కడ ఉన్నామ'ని నాకు తెలిసేలా చేసారనుకుంటూ వెలుపలికి వచ్చాను. అలా బయటకు వచ్చిన నేను ఒక పక్కకి చూస్తే, నవ్వుతూ పెద్ద బాబా విగ్రహం దర్శనమిచ్చింది. అక్కడ బాబాకు, నాకు మధ్య అభ్యంతరం చెప్పడానికి ఎవరూ లేరు. నాకు తెలియకుండానే నేను బాబాను మనస్పూర్తిగా కౌగిలించుకున్నాను. అప్పుడు నేను పొందిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. మూడు సంవత్సరాల నుండి నేను అదే దారిలో ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్తున్నా అక్కడ బాబా ఉన్నారని నాకు అప్పటివరకు తెలియదు. కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు అక్కడ బాబాను దర్శించి ముట్టుకున్నానో లెక్కలేదు. ఇప్పుడు ఆ బాబాను వేరే చోట ప్రతిష్టించారు. ఆయన నాకోసమే అక్కడ కొన్నిరోజులు ఉన్నారు. కొన్నిసార్లు మనం బాబాను అడిగి మార్చిపోతాం కానీ, ఆ తండ్రి మరిచిపోరు. మనం ప్రేమతో అడిగితే ఆయన కాదనరు. అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇస్తారు. మన తండ్రితో ఎవరూ సాటిరారు ఇది నిజం. ఇప్పుడు నేను బ్లాగులో పంచుకుంటానని బాబాకు మాటిచ్చిన మరికొన్ని అనుభవాలు పంచుకుంటాను.

సాధారణంగా మా పాపకి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. కానీ ఒకసారి తను ఒక పరీక్ష వ్రాసిన తర్వాత ఈసారి ఫస్ట్ ర్యాంకు రాదేమోనని చాలా టెన్షన్ పడిపోయి బాబాకి మొక్కుకుంది. ఆయన దయవల్ల రెండు మార్కుల తేడాతో తనకి ఫస్ట్ ర్యాంకు వచ్చింది. నిజానికి మేము ఎప్పుడూ ర్యాంకు కోసం తనని ఇబ్బందిపెట్టలేదు. ”చాలా ధన్యవాదాలు బాబా"..

ఒకసారి నా భర్తకి జ్వరం, దగ్గు వచ్చాయి. మూడు రోజులు మందులు వేసుకున్నా ఆయనకి జ్వరం తగ్గలేదు. అప్పుడు నేను ఊదీ నీళ్ళలో కలిపి మావారికి ఇచ్చి, "జ్వరం, దగ్గు తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మరుసటిరోజు నుండి జ్వరం తగ్గింది. రెండు, మూడు రోజుల్లో దగ్గు కూడా తగ్గింది. "ధన్యవాదాలు బాబా".

2023, జనవరి నెల మొదటి వారంలో మా బాబుకి రాత్రి ఎక్కువగా దగ్గు వస్తుంటే, 'తగ్గిపోవాల'ని బాబాని వేడుకుని బాబుకి ఊదీ ఇచ్చి, సిరప్ కూడా ఇవ్వసాగాను. తరువాత ఒకరోజు స్కూలు లేకపోవడం వల్ల పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మేము బాబుకి దగ్గు సిరప్ వేసి ఆఫీసుకి వెళ్ళాం. కొంతసేపటికి మా పాప ఫోన్ చేసి "తమ్ముడి కాళ్ళుచేతులు వణుకుతున్నాయి" అని చెప్పింది. ఆ సిరప్ వల్ల అలా అవుతుందో లేక ఇంకే కారణం చేత అలా జరుగుతుందో తెలియదుకానీ వెంటనే నేను ఆఫీసు నుండి ఇంటికి బయలుదేరాను. ఆఫీసు నుండి ఇంటికి 40 నిమిషాల ప్రయాణం ఉంటుంది. ఆ సమయమంతా నేను 'బాబుకి ఏమీ కాకూడద'ని సాయి నామస్మరణ చేస్తూనే ఉన్నాను. వచ్చి, పోయే వాహనాల మీద బాబా ఎన్నోసార్లు దర్శనమిచ్చారు. అయినా నేను భయంతో ఏడుస్తూనే ఉన్నాను. ఎలా ఇంటికి చేరానో బాబాకే తెలుసు. వెంటనే బాబుని డాక్టరు దగ్గరకి తీసుకెళ్తే, "ఏం పర్వాలేదు. అప్పుడప్పుడు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా ఇలా అవుతుంది. ఏమీ కాదు" అని చెప్పి కొన్ని మందులిచ్చారు. అవి వేయగానే బాబా దయవల్ల బాబు మామూలుగా అయ్యాడు. "కృపతో క్షణంలో నా టెన్షన్ తొలగించిన మీకు శతకోటి నమస్కారాలు బాబా".

ఒకరోజు నా చెవి దిద్దుల శీల ఇంట్లో పడిపోయింది. నేను నిలబడిన చోటులోనే అది పడినట్టు శబ్దం వచ్చినప్పటికీ ఎంత వెతికినా దొరకలేదు. వేరే ఒక గ్రాము బంగారు రింగులు పెట్టుకుందామంటే అవి నాకు పడవు. అందువల్ల, "బాబా! ఎలాగైనా శీల దొరికేలా చేయండి, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత ఆ సమయంలో నేను చేస్తున్న దత్త స్తవనం పారాయణ చేద్దామని కూర్చున్నాను. పారాయణ పూర్తయిన తరువాత మళ్ళీ అదివరకు వెతికిన చోటే ఆ శీల కోసం వెతికాను. బాబా అనుగ్రహంలో ఆలస్యం లేదు. ఈసారి శీల దొరికింది.

5, 6 నెలల నుండి విపరీతంగా మొటిమలు వస్తూ నాముఖమంతా మచ్చలు పడ్డాయి. ఆ విషయంలో ఒకరోజు బాబాను, "బాబా! ఎలాగైనా ఈ మొటిమల సమస్యను తగ్గించు" అని అనుకున్నాను. మరుసటిరోజు యథాలాపంగా ఇంటర్నెట్‍లో ఏదో సెర్చ్ చేస్తుంటే మొటిమలు తగ్గించే ప్రోడక్టులు కనిపించాయి. ఎందుకో బాబానే వాటిని చూపిస్తున్నారని నాకనిపించింది. వెంటనే వాటిని ఆర్డర్ చేశాను. ఆ క్రీములు వాడుతుంటే మొటిమల సమస్య తగ్గిపోయింది. ఎప్పుడూ లేనిది నేను వెతకకపోయినా నా సమస్యకు సంబంధించిన ప్రోడక్టులు వాటికై అవి కనిపించటం బాబా దయకాక ఇంకేంటి?

ఒకసారి నా బ్యాంకు యాప్ ఉపయోగిస్తుంటే పాస్వర్డ్ రాలేదు. అందుకు బదులుగా ఫోన్ నెంబరు అప్డేట్ చేయమని వచ్చింది. సరేనని అప్డేట్ చేద్దామని ప్రయత్నిస్తే, అప్డేట్ అవ్వలేదు. బ్యాంకు వాళ్ళను సంప్రదిస్తే, మొబైల్ నుండే అవుతుందన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా అప్డేట్ కాలేదు. టోల్ ఫ్రీ నెంబరుకి నా నెంబరు నుండి sms పంపుదామంటే, వెళ్ళలేదు. ఇక అప్పుడు, "బాబా! ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించండి" అని వేడుకున్నాను. ఇంకోరోజు బ్యాంకుకి వెళ్లి నా సమస్య గురించి అడిగినప్పుడు ఒక బ్యాంకు ఉద్యోగి, "మన ఫోన్‍లో అన్ లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ ఉన్నా కొన్నిసార్లు smsలు పని చేయవు. ఒకసారి sms బ్యాలన్స్ రీఛార్జ్ చేసుకోండి" అని చెప్పారు. సరేనని sms రీఛార్జ్ చేస్తే ఫోన్ నెంబరు అప్డేట్ అయి సమస్య పరిష్కారమైంది. బాబానే ఆ ఉద్యోగి ద్వారా ఆ విషయం చెప్పించారు. మనకు వచ్చే ఏ సమస్యకు ఏ పరిష్కారమో ఆయనకు మాత్రమే తెలుసు. "బాబా! మా వెన్నంటి ఉండి ప్రతి బాధను తీరుస్తున్నందుకు మీకు ఏమివ్వగలం? నమస్కరించటం తప్ప ఏమి చేయగలం?"

మేము మా పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నాం(ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు లేకపోయినప్పటికి టీచర్లు అప్పుడప్పుడు వాట్సప్‍లో హోమ్ వర్క్ షేర్ చేస్తున్నారు). ఆ ఫోన్‍కు మా పిల్లలు పాస్వర్డ్ సెట్ చేసారు. ఒకసారి చాలాసార్లు పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేయడం వల్ల ఫోన్ లాక్ అయిపోయింది. లాక్ ఓపెన్ అవ్వాలంటే ఫోన్ ఫార్మాట్ చేయమని, అలా చేస్తే మునుపటి డేటా పోతుందని చూపించసాగింది. దాంతో మా పిల్లలిద్దరూ, "డేటా పోకుండా ఉంటే బ్లాగులో పంచుకుంటామ"ని బాబాకు మొక్కుకున్నారు. బాబా దయతో ఫార్మాట్ చేసినా ఫోన్లో డేటా పోలేదు. నిజంగా ఇది అద్భుతం. సాధారణంగా ఫోన్ ఫార్మాట్ చేస్తే డేటా అంతా పోతుంది. "థాంక్యూ బాబా".

ఈమధ్య నాకు, మా పిల్లలిద్దరికీ విపరీతమైన జ్వరం, జలుబు వచ్చాయి. అప్పటికి ఒక వారం ముందు నుండి బ్లాగులో "ఎటువంటి జ్వరం అయినా, గడ్డ అయినా తగ్గుతుంది", "చింతించకు. నువ్వు త్వరగా బాగవుతావు", "ఏమనుకుంటున్నావ్? ఈ ఇంటికి యాజమానిని నేనే", "ఏమి భయపడకు, నేనెప్పుడూ నీ ఇంటికి కాపలా కాస్తున్నాను" అనే సాయి వచనాలు నాకు పదేపదే కనిపిస్తుండేవి. 'అందరం బాగున్నాం కదా, ఈ వచనాలు వస్తున్నాయి ఏంటి?' అని అనుకున్నాను. అంతలోనే మా ముగ్గురికి విపరీతమైన జ్వరం, జలుబు వచ్చి 3 రోజులు చాలా ఇబ్బందిపడ్డాం. బాబాను తగ్గించమని చాలాసార్లు వేడుకున్నాను. కానీ ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. పగటిపూట విపరీతమైన జ్వరం, రాత్రి విపరీతంగా దగ్గు వస్తుండేవి. మాముూలుగా ఇంగ్లీష్ మందులు నాపై దుష్ప్రభావాలు చూపుతాయి. అందుకే నేను వాటిని అస్సలు వాడను. కానీ ఈసారి అధిక జ్వరం ఉండటం వల్ల ఆ మందులు వేసుకోక తప్పలేదు. అయినా జ్వరం తగ్గలేదు. మూడు రోజుల తరువాత ఒకరోజు రాత్రి చేతిలో ఊదీ పట్టుకుని బాబాతో, "ఓ..పెద్దాయన, వింటున్నావా? నాకు ఇంగ్లీష్ మందు పడటం లేదు. కాబట్టి నేనింకా ఆ మందులు వేసుకోను. ఈ ఊదీ తప్ప ఏమీ తీసుకోను. అయినా 'నీ ఇంటికి ఎప్పుడూ కాపలా కాస్తూ ఉంటాను' అన్నావు కదా! మరి నువ్వు కాపలా ఉండగా ఈ జ్వర మహమ్మారిని నీ ఇంటికిలోకి ఎలా రానిచ్చావు. రేపటికల్లా అందరం లేచి కూర్చోవాలి. ఏం చేస్తావో నీ ఇష్టం" అని అన్నాను. నేను బాబాతో అన్న ఆ మాటలు విన్న మావారు, "బాబాను వేడుకుంటున్నావా? లేక వార్నింగ్ ఇస్తున్నావా? ఆయనతో అలా మాట్లాడకు" అని అన్నారు. నేను కోపంగా, "వేడుకుంటే ఆయన వినటం లేదు" అని బాబాకు సారీ కూడా చెప్పలేదు. కానీ ఆయన “దయామయుడు”. ఆ రాత్రి నుండి మాకు జ్వరం తగ్గింది. మరుసటిరోజు నుండి మేము ముగ్గురం చిన్నగా మా పనులు మేము చేసుకుంటూ కొద్దిగా ఆహారం తీసుకోసాగాము. 4, 5 రోజుల్లో దగ్గు కూడా తగ్గిపోయింది. బాబా మీద నాకేదో అధికారం ఉన్నట్టు అలా మాట్లాడినందుకు నేను చాలా సిగ్గు పడుతున్నాను. 2022 ఏప్రిల్ నుండే మేము బాబాను నమ్ముతున్నాము. ఈ కొన్ని నెలల్లోనే బాబా మాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇది 4వ సారి నా అనుభవాలు ఈ బ్లాగులో పంచుకోవడం. అయినా అజ్ఞానంతో చిన్న సమస్య రాగానే బాబాతో పోట్లాడాను. కానీ బాబా అదేమీ పట్టించుకోకుండా తమ బిడ్డల మీద తముకున్న ప్రేమను చాటుకున్నారు. "ధన్యవాదాలు బాబా. నేను అలా కోపంగా మీతో మాట్లాడకుండా ఉండాల్సింది. ఈరోజు ఈ బ్లాగు ద్వారా సాయి కుటుంబం ముందు నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నన్ను క్షమించండి బాబా. తండ్రి బిడ్డకోసం ఎంత చేసినా ఒక్కోసారి బిడ్డ అజ్ఞానంతో తనకు కావాల్సిన వస్తువుకోసం పేచీ పెడుతూనే ఉంటుంది కదా! నువ్వు నా తండ్రివి కదా మరి. ప్రేమతో ఈ బిడ్డ తప్పును మన్నించు తండ్రి. ఇకపోతే మీ దయతో బాబుకి ఒంటి మీద వచ్చిన ఇన్ఫెక్షన్ తగ్గింది. కానీ తలలో మొదలైంది. పూర్తిగా తగ్గేలా దయ చూపండి బాబా. పాపకున్న ఆరోగ్య సమస్యలు క్లియర్ చేయండి బాబా. పిల్లల ఆరోగ్యం, చదువు మీరే చూడాలి బాబా. నాకు ప్రమోషన్ వచ్చేలా అనుగ్రహిచండి. బ్లాగులో తప్పకుండ పంచుకుంటాను. నాకు ఉన్న ఇంకో పెద్ద సమస్య మీకు తెలుసు. దయతో దానిని పరిశీలించండి బాబా. ఇంకా దయతో సాయి బంధువులందరినీ సంతోషంగా ఉండేలా చూడండి. మీరు మా జీవితంలోకి వచ్చి కొన్ని నెలలే అయినా ప్రతిదానికీ మీ మీద ఆధారపడటం అలవాటైంది బాబా. ఎందుకంటే మీరు ఉన్నారు చూసుకోవడానికి అనే భరోసా చాలా మనఃశాంతినిస్తుంది. మీకు శతకోటి సాష్టాంగ నమస్కారాలు బాబా".

4 comments:

  1. సాయి ఇంకా నా పరీక్ష కాలం ఎన్ని సంవత్సరాలు ఉంది సాయి నా భర్త నీ నన్ను కలుపు సాయి

    ReplyDelete
  2. సాయి నా నెగెటివ్ ఆలోచనలతో మాన్ శాంతి లేదు.పాజిటివ్ ఆలోచనలు భవిష్యత్తు కోసం కావాలి.సహాయం చేయండి తండ్రి.తప్పు నాదే సరిదిద్ది ప్రశాంత తో జీవితం గడిపేలాగ చూడు బాబా

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo