సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1443వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. కష్టసుఖాల్లో తోడు నిలిచే బాబా
  2. రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన శ్రీసాయినాథుడు

కష్టసుఖాల్లో తోడు నిలిచే బాబా


అందరికీ నమస్కారం. నేను సాయిభక్తుడిని. నా రెండో కొడుకు గురువారంరోజున పుట్టాడు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు. వాడు చాలా అల్లరివాడు. వాడితో వేగటం నాకు చాలా కష్టమే. అయినా వాడి నోటినుంచి వచ్చే ఒక మాట నాకు చాలా ఆనందాన్నిస్తుంది. అదేమిటంటే, 'నేను సాయిబాబా గుడికి వెళ్ళాలి' అని. వాడు సదా తనను బాబా గుడికి తీసుకువెళ్ళమని నన్ను అడుగుతుంటాడు. అదీకాక, గురువారం తను నాన్‌వెజ్ తినడు. అసలు వాడికి ఏమి తెలుసని ఇవన్నీ పాటిస్తున్నాడో నాకు అర్థంకాని విషయం. ఆ వయసులో నేనైతే ఏమీ పాటించలేదు. అసలు అప్పట్లో మా బంధువుల్లో కానీ, మా కుటుంబంలో కానీ సాయిబాబా గురించి, సాయిభక్తుల గురించి చెప్పేవారు ఎవరూ లేరు. అయినా మేము ఎలా సాయిభక్తులమయ్యామో నాకే తెలియదు. కానీ ఏ జన్మలోనో అనుబంధమని నాకనిపిస్తుంది. ఏదేమైనా సాయిబాబా దయ నా కొడుకు మీద, అలాగే నా కుటుంబం మీద ఉందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక నా అనుభవాల విషయానికి వస్తే.. 


నేను నా గత అనుభవంలో నా సమస్య ఒకటి పరిష్కారమైతే బ్లాగులో పంచుకుంటానని చెప్పాను. అయితే ఆ సమస్య నేననుకున్న విధంగా కాకుండా వేరేలా పరిష్కారమైంది. దాని గురించి ముందుగా చెప్తాను. గత సంవత్సరం నాకు మా ఇంట్లోవాళ్ళతో విపరీతంగా గొడవలు జరిగాయి. ఆ కారణంగా నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. తట్టుకోలేక ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశాను. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. ఒకరోజు నాకు చాలా కోపం వచ్చింది. మామూలుగా నేను డ్రింక్ చేయను, చేయలేను కూడా. కానీ బాగా కోపం వచ్చినప్పుడు త్రాగుతాను. ఆరోజు కూడా కోపంలో మా పక్క ఊరికి వెళ్లి బాధలో మందు ఎక్కువగా త్రాగేశాను. అసలే గొడవల వల్ల ఇంట్లో అన్నం సరిగా తినలేదు. దానికితోడు ఎక్కువగా తాగటం వల్ల నన్ను నేను నియంత్రించుకోలేక పడిపోయాను. నేను అలా పడిపోయివుంటే నా జేబులోని డబ్బులు, నా మొబైల్ ఎవరో తీసేశారు. అలా సమాజం నాపట్ల వ్యవహరించిన తీరు నా జీవితంలో మరిచిపోలేనిది. సమాజం సమస్యల్లో మనకు తోడు నిలవదు సరికదా, మనలను పీక్కుతింటుంది; సహాయం చేయదు కానీ వేలెత్తి చూపుతుంది. సరే, అసలు విషయానికి వస్తే… కనీసం ఇంటికి వెళ్లేందుకు ఛార్జీ డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఎప్పటికో నా ఫ్రెండ్ చూసి నన్ను మా ఊరికి చేర్చాడు. పరిస్థితి అంతవరకు వెళ్లడంతో ఇంట్లో గొడవలు అంతటితో ఆగిపోయాయి. మా అమ్మ 'ఇక మీదట త్రాగవద్ద'ని బాబా ఫోటో మీద నాచేత ప్రమాణం తీసుకుంది. అందువల్ల అప్పుడప్పుడు తాగాలనిపిస్తున్నప్పటికీ నేను త్రాగడం లేదు. నాకు సాయి మీద గురి ఎక్కువ. కష్టసుఖాల్లో బాబా నాకు తోడుగా నిలవడం నా ప్రత్యక్ష అనుభవం. అలాంటి ఆయన మీద ప్రమాణం చేసి ఎలా తాగగలమని నన్ను నేను అదుపు చేసుకుంటున్నాను .


జరిగిందంతా మంచే అయినా నేను నా మొబైల్ గురించి చాలా బాధపడ్డాను. ఎందుకంటే, దాన్ని కొని అప్పటికి రెండు నెలలే అయింది. పోలీసు కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇక అప్పుడు నేను, "నా మొబైల్ నాకు కావాలి. దయచేసి నాకు సహాయం చేయండి" అని సాయిని ప్రార్థించాను. కానీ సాయి నా కోరిక తీర్చలేదు. నేను కోరిన దానికి సాయి స్పందించకపోవడం అదే మొదటిసారి. అయితే వేరేవిధంగా ఆయన నన్ను అనుగ్రహించారు. మా అమ్మ, "డబ్బులు ఇస్తాను. కొత్త మొబైల్ కొనుక్కో" అంది. కానీ నాకు మనస్కరించలేదు. ఎందుకంటే, ఒక తప్పు చేశాక ఫలితం కూడా అనుభవించాలన్నది నా సిద్ధాంతం. అందువల్ల ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని సెకండ్ హ్యాండ్ మొబైల్ కొన్నాను. నిజానికి నాకు సెకండ్ హ్యాండ్ కలిసిరాదు. అదివరకు ఎన్నోసార్లు సెకండ్ హ్యాండ్ మొబైల్ వల్ల నాకు సమస్యలు ఎదురయ్యాయి. నెలకో, వారానికో, ఒక్కోసారి ఒక్కరోజుకే మొబైల్ పోయిన అనుభవాలెన్నో! మొత్తానికి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నా చేతిలో ఎప్పుడూ నిలబడింది లేదు. అందుకే సెకండ్ హ్యాండ్ తీసుకోవాలంటే నాకు చాలా భయం. అయినా ఏదైతే అది అయిందని ఆ మొబైల్ కొన్నాను. అది చాలా పాతది, పాత మోడల్. అయినా ఆ మొబైల్ నా చేతిలో ఏ సమస్యా లేకుండా పనిచేసింది.‌ మీకు ఇది మామూలు విషయంగా అనిపించవచ్చు కానీ నాకు మాత్రం అద్భుతమే. ఎందుకంటే, మొట్టమొదటిసారి నా చేతిలో సెకండ్ హ్యాండ్ మొబైల్ నిలబడింది.  "ధన్యవాదాలు సాయీ".


నేను కొత్త సంవత్సరం నాడు మొట్టమొదటగా సాయిబాబాకు, వెంకటేశ్వరస్వామికి శుభాకాంక్షలు చెబుతాను. ఆ తరువాతే ఎవరికైనా. ఈ సంవత్సరం కూడా అలాగే చేశాను. ఆరోజు ఆదివారం. అదేరోజు నేను ఒక ప్రయాణం పెట్టుకున్నాను. నేను వెళ్లాల్సిన చోటుకి బస్సు అయితే నేరుగా వెళుతుంది. అదే ఆటోలో వెళితే రెండుచోట్ల ఆటో మారాల్సి ఉంటుంది. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అందువల్ల బస్సుకే వెళదామని చాలాసేపు వేచివున్నా బస్సు రాలేదు. దాంతో నా మనసులో, 'ఇన్ని సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాను. ఇలాంటి సమయంలో బాబా నాకు సహాయం చేయలేదే!' అని అనుకున్నాను. తరువాత వెంకటేశ్వరస్వామి పాటలు వింటూ కూర్చున్నాను. అరగంట గడిచాక నా ఫ్రెండ్ ఒకతను బైక్ మీద ఆ దారిగుండా వెళుతూ నన్ను పిలిచి పక్క స్టాప్‌లో దింపాడు. అక్కడ వేరొక ఫ్రెండ్ ఆటోలో వెళుతూ నన్ను వేరొక స్టాప్‌కి చేర్చాడు. అప్పుడు నేను, 'ఇప్పుడే కదా, బాబా గురించి అనుకున్నాను. ఆయన ఎంత వేగంగా స్పందించారు!' అని అనుకొని, "కొత్త సంవత్సరం రోజున అంత చక్కని అనుభూతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు సాయీ" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


ఇంకా రాయగలను, మీకు విసుగనిపించవచ్చు. మనం  బాబాకు నమస్కరించవచ్చు, కానీ వారి అడుగుజాడలు పాటించటం ఇంకా ఉత్తమం. నమస్కారం అందరూ చేస్తారు, అడుగు జాడలు పాటించేవారు ఇంకా ఎక్కువ శక్తివంతం అవుతారు.


రిపోర్టులన్నీ నార్మల్ వచ్చేలా అనుగ్రహించిన శ్రీసాయినాథుడు


ముందుగా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యనారాయణమూర్తి. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. సుమారు మూడు సంవత్సరాల నుండి నా గొంతు వద్ద ఒక గడ్డ ఉంది. దానివల్ల నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుండేది. నేను ఈ మూడు సంవత్సరాలుగా భయంతో, "బాబా! ఈ గడ్డ క్యాన్సర్ గడ్డ కాకుండా మామూలు గడ్డే అయుండి నాకు ఏ విధమైన ఇబ్బందీ లేకుండా, అలాగే ఏ ప్రమాదమూ జరగకుండా కాపాడు తండ్రీ" అని రోజూ బాబాను ప్రార్థిస్తూ ఆ గడ్డపై బాబా ఊదీ రాస్తూండేవాణ్ణి. 2023, జనవరి మొదటి వారాంతంలో డాక్టర్ వద్దకు వెళితే, స్కానింగ్ చేసి, సూది పరీక్ష కూడా చేయించమని చెప్పారు. నాకు, నా భార్యకు చాలా భయమేసి ఆందోళనతో బాబాకు నమస్కరించుకుని రోజంతా సాయినాథుని స్మరణలోనే గడుపుతూ, "రిపోర్టు నార్మల్‌గా వస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో వెంటనే పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాము. మరుసటిరోజు సూది పరీక్ష చేయించుకుంటే, 'రిపోర్టు ఇవ్వడానికి రెండు రోజులు పడుతుంద'ని అన్నారు. కానీ సాయినాథుని దయవల్ల మూడు గంటల్లోనే నార్మల్ అని రిపోర్టు వచ్చింది. తరువాత బ్లడ్ టెస్టులు, కిడ్నీ, లివర్, కొలెస్ట్రాల్ టెస్టులు కూడా నార్మల్ వచ్చేలా అనుగ్రహించారు సాయినాథుడు. "ధన్యవాదాలు సాయినాథా! ఇలాగే మమ్మల్ని, మా కుటుంబాన్ని దయతో కాపాడు తండ్రీ. ఈ ప్రపంచాన్ని కరోనా బారినుండి రక్షించు తండ్రీ. అలాగే మీ భక్తులందరినీ ఆయురారోగ్యాలతో ఉండేట్టు అనుగ్రహించు తండ్రీ".


2023, జనవరి నెల చివరి వారంలో మా అబ్బాయికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి జలుబు, తుమ్ములతో ఇబ్బందిపడ్డాడు. నేను వెంటనే బాబా ఊదీని తన నుదుటన పెట్టి, ''బాబుకి జ్వరం తొందరగా తగ్గేటట్లు అనుగ్రహించు బాబా" అని బాబాను ప్రార్థించి బాబుని డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళాను. డాక్టరు మామూలు జ్వరమే అయుండొచ్చని మందులిచ్చారు. కానీ జ్వరం ఎక్కువై రాత్రంతా అస్సలు తగ్గకుండా అలాగే ఉండిపోయింది. మర్నాడు సాయంత్రం వరకు కూడా 103 డిగ్రీలకు పైగా జ్వరం ఉండింది. మళ్ళీ డాక్టర్ వద్దకు తీసుకెళ్తే బ్లడ్ టెస్టులు చేయించి, రిపోర్టులు తీసుకుని రమ్మన్నారు. అప్పుడు నేను, "సాయినాథా! రిపోర్టులన్నీ నార్మల్‌గా వచ్చి, జ్వరం, దగ్గు పూర్తిగా తగ్గినట్లైతే వెంటనే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని సాయినాథునికి నమస్కరించుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ వచ్చి, మర్నాటికి జ్వరం తగ్గుముఖం పట్టి, తరువాత పూర్తిగా తగ్గిపోయింది. నమస్కరించుకున్నంతనే సాయినాథుడు మా బాబుకి స్వస్థత చేకూర్చారు. "ధన్యవాదాలు సాయినాథా! ఇంకా కొద్దిగా ఉన్న దగ్గుని కూడా పూర్తిగా తగ్గిపోయేటట్లు అనుగ్రహించు స్వామీ".


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!


3 comments:

  1. సాయి నాకు నా భర్త చూడాలని ఉంది సాయి తనతో మాట్లాడాలని ఉంది సాయి నవంశీని నన్ను కలపండి సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo