సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1451వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కలలా మిగిలిపోతుందనుకున్న సొంతింటిని సాకారం చేసిన బాబా
2. శ్రీశైలంలో రూము దొరికేలా దయచూపిన బాబా

కలలా మిగిలిపోతుందనుకున్న సొంతింటిని సాకారం చేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సాయి శరణం - భవభయ హరణం!!!

సాయి శరణం - సగుణ సమీరం!!!


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా శ్రీసాయినాథుని పాదపద్మములకు నా శతకోటి పాదాభివందనాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా కృతజ్ఞతలు. తోటి సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు విజయ. నాకు బాబాతో అనుబంధం 2006 నుండి ఉంది. బాబా చాలాసార్లు చాలా సమస్యల నుండి నాకు తెలియకుండానే నన్ను తప్పించి నా జీవితంలో నేను అనుకున్న మంచి పరిస్థితులు కల్పించారు. మా కుటుంబమంతా కూడా బాబా భక్తులం. నేను ఈ సంవత్సరంలో రెండుసార్లు నా ఉద్యోగ విషయంలో బాబా చేసిన సహాయాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో మంచి అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము 16 సంవత్సరాల నుండి ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాము. నా భర్త ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. నాది కాంట్రాక్ట్ ఉద్యోగం. అందువల్ల సొంత ఇల్లు అనేది మా జీవితాలలో ఒక కలలా మిగిలిపోతుందేమో అని అనుకునేదాన్ని. అలాంటి నేను ఈ మధ్యకాలంలో నా స్తోమతకు తగ్గట్టు ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని బాబా దగ్గర సంకల్పం చేసుకున్నాను. సాయితండ్రి నా మొర ఆలకించి మా ఆర్థిక పరిస్థితికి తగినట్లు కొన్ని ఇళ్ళు చూపించారు. మేము ఉద్యోగరీత్యా కాకినాడలో ఉంటున్నప్పటికీ మా సొంత ఊరు రామచంద్రాపురంలో ఉన్న ఒక ఇల్లు మా అందరికీ బాగా నచ్చింది. ట్రాఫిక్‌కి దూరంగా పంటపొలాల మధ్యలో ఉండే ఆ ఇల్లు చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో, ప్రశాంతమైన వాతావరణం కలిగి, వాస్తుపరంగానూ బాగుంది. బాబా దయతో విజయదశమిరోజున మాటలు జరిగి అగ్రిమెంట్ చేసుకున్నాము. నా దగ్గరున్న డబ్బులు అగ్రిమెంటుకు సరిపోయాయి. ఇక మిగిలిన డబ్బుకోసం బ్యాంకు లోన్ పెడదామనుకొని బాబాను సహాయం చేయమని అర్థించాను. సత్యమైన తండ్రి నా మొర ఆలకించి మా బంధువులలో బ్యాంకు ఏజెంట్ అయిన తెలిసిన వ్యక్తిని మాకు చూపించారు. నేను తిరిగే పని లేకుండా ఆ వ్యక్తి లోన్‌కి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసి బ్యాంకు లోన్ శాంక్షన్ చేయించారు. మధ్యవర్తులు కొంత సొమ్ము కాజేయాలని చూసినా బాబా నాకు ఏ ధననష్టం జరగకుండా చూశారు.


ఇలా ఉండగా ఇంటి కొనుగోలు ఒత్తిడిలో పడి నేను నా బిడ్డను సరిగా చూసుకోలేకపోయేదాన్ని. అదీకాక, ఇంట్లో నా కుటుంబసభ్యులు, అంటే నా భర్త, నా తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. నా భర్త తొందరపాటు మాటల వల్ల వాళ్ల మధ్య అపార్థాలు, వైరం పెరిగిపోయాయి. మరోవైపు నా ఉద్యోగం. వీటన్నిటి మధ్య నేను మానసికంగా నలిగిపోతూ నా చిన్నితండ్రి ఆలనాపాలనా చూసుకోలేక జీవితం మీద విరక్తి కలిగి నా బిడ్డని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో నేను, "బాబా! దయతో నా బిడ్డ ఆలనాపాలనా చూసే శక్తిని నాకు ప్రసాదించు తండ్రీ" అని వేడుకుంటుండేదాన్ని. అలా రెండు నెలలు చాలా ఇబ్బందిగా గడిచాక బాబా పరిస్థితిని చక్కదిద్దసాగారు. మధ్యలో, అంటే నవంబర్ నెలలో నేను ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇల్లు అమ్మే వ్యక్తికి యాక్సిడెంట్ అయి కాళ్లు విరిగి మంచాన పడ్డాడు. అప్పుడు నేను, "బాబా! అతను తొందరగా కోలుకునేలా చేసి ఇంటి రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. అయితే, అగ్రిమెంట్ సమయంలో నేను కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చి ఉన్నందువల్ల చాలా టెన్షన్ పడుతూ, 'అన్నీ బాగా జరుగుతున్నాయనుకుంటే బాబా నన్ను ఎందుకిలా పరీక్షిస్తున్నారు?' అని అనుకుంటుండేదాన్ని. అయితే బాబా ఎంతో దయతో నెలరోజుల్లో ఇల్లు అమ్మే వ్యక్తిని కోలుకునేలా చేసి 2023, జనవరి 4న ఇంటి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తానికి అలా మా సొంతింటి రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా గృహప్రవేశం చేయలేదు. శూన్యమాసం కావడం వలన మంచిరోజులు లేవు. నా సత్యమైన తండ్రి(బాబా) గృహప్రవేశం అయ్యేలోపు మా పరిస్థితులను చక్కదిద్ది మా ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారని నమ్ముతున్నాను. "బాబా! బ్యాంకు లోన్ తొందరగా తీర్చే శక్తిని ఇవ్వండి. మా బిడ్డను మంచిగా చూసుకొనే శక్తిని ప్రసాదించండి".


పైన చెప్పినట్లు నా జీవితంలో బాబా చాలా అనుగ్రహించారు. నా ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో, ప్రయాణాలలో, చుట్టూ ఉన్న వ్యక్తులతో వచ్చే ఇబ్బందులను తొలగించి అన్నీ సానుకూలంగా మలచి అడుగడుగునా నన్ను రక్షిస్తున్నారు నా సాయితండ్రి. వివాహం, ఉద్యోగం, బిడ్డ బాబా నాకిచ్చిన వరప్రసాదాలు. అయితే జీవితంలో ఇంకా స్థిరత్వం ఏర్పడలేదు. సొంతింటిని ఇచ్చి కొంత ఊరటనిచ్చారు. అలాగే ఆర్థిక స్థిరత్వం, అంటే నాకు శాశ్వతమైన ఉద్యోగాన్ని, మావారికి  ఏదైనా మంచి జీవనోపాధిని ఇచ్చి మా బిడ్డకు అన్ని వసతులు కల్పించి తనను ప్రయోజకుడిని చేసే ఓపిక, సహనం బాబా నాకు ఇస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మంచి అనుకూలమైన మార్పులు తీసుకొచ్చి బాబా మహిమలను తోటిభక్తులతో పంచుకొనే అదృష్టాన్ని బాబా కల్పించాలని కోరుకుంటున్నాను. బాబా నా జీవితాన్ని తమకి నచ్చినట్లు సాత్వికంగా, నిరాడంబరంగా మలుస్తారని, అలాగే నన్ను తమకి నచ్చిన మార్గంలో పయనింపజేస్తారని ఆశిస్తున్నాను.


శ్రీశైలంలో రూము దొరికేలా దయచూపిన బాబా


సాయిబాబా ఆశీస్సులతో 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి, ఈ బ్లాగుకి సంబంధించిన వాట్సాప్ గ్రూపు సభ్యులకి నా నమస్కారాలు. నేను సాయిభక్తురాలిని. సాయి దయతో నేను పొందిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2023, జనవరి 12వ తేదీన మేము శ్రీశైలం వెళ్లాలని ఆన్లైన్లో రూము కోసం చూస్తే ఆరోజు నుండి 16వ తేదీ వరకు రూములు లేవని వచ్చింది. అయినా మేము బయలుదేరేముందు ఇంట్లో బాబాను తలచుకొని, "బాబా! మీ దయతో మేము సంతోషంగా శ్రీశైలం వెళ్ళాలి. అక్కడ మాకు రూము దొరకాలి, దర్శనం బాగా జరగాలి" అని అనుకున్నాము. సాయిబాబా లీలలు అద్భుతం. బాబా దయవల్ల మాకు శ్రీవిద్యాపీఠంలో రూము దొరికింది. అక్కడున్న ధ్యానమందిరంలో ధ్యానం చేసుకున్నాము. దర్శనం కూడా బాగా జరిగింది. మాకు రూము దొరికితే బాబా అనుగ్రహాన్ని అందరికీ తెలపాలని నా అనుభవాన్ని సాయిభక్తులతో పంచుకోవాలనుకున్నట్లే మీతో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా. 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపులో ఉన్నందుకు (చేర్చినందుకు) కూడా మీకు కృతజ్ఞతలు".


4 comments:

  1. Today is my birthday.sai please bless my desires.Be with us.om Sai Ram

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  4. Sri samardha sadguru sai nath maharaj ki jai🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo