1. ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే బాబా
2. ఇబ్బంది లేకుండా టూరు పూర్తి చేయించి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
శ్రీసాయినాధునికి శతకోటి వందనాలు. సాయినాథుడు సజీవంగా ఉన్నప్పుడు ఎటువంటి లీలలు చేసారో ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా అలాంటి లీలలు చేస్తూ మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకుని చంటిబిడ్డల్లా కాపాడుతూ తమ ఉనికిని తెలియజేస్తున్నారు. మహాసమాధి అనంతరం ఆయన ప్రసాదిస్తున్న మన అనుభవాలను సాయి దర్బారు(సాయి మహారాజ్ సన్నిధి)లో పంచుకునేందుకు అనువుగా ఈ వేదికను ఏర్పాటు చేసి సాయి బంధువులందరినీ ఒకచోట కలుపుతున్న బ్లాగు నిర్వాహకులకు చాలా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నా పేరు చైతన్య. నేను నా గత అనుభవంలో బాబా దయతో మాకు శిరిడీ, తిరుపతి దర్శన భాగ్యం లభించిందని పంచుకున్నాను. అయితే 2022, ఆగస్టులో శిరిడీ వెళ్లినప్పుడు మేము అక్కడ ఒక్కరోజే ఉన్నాము. అప్పుడు నేను, "ఒక్కరోజు ఇక్కడ ఉంటే అసలు శిరిడీలో ఉన్నట్లే అనిపించలేదు బాబా. తొందరలో మళ్ళీ మీ దర్శనం మాకు అయ్యేటట్లు చూడు తండ్రి" అని చెప్పుకున్నాను. బాబా మూడు నెలల్లోనే నా కోరికను నెరవేర్చారు. మేము చాలా సంతోషంగా నవంబరులో మళ్ళీ శిరిడీ వెళ్లి నాలుగు రోజులు బాబా సన్నిధిలో గడిపాము. బాబా పాదాలు, సమాధి తాకి దర్శనం చేసుకున్నాము. పారాయణ హాల్లో సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ మాకు ఒకావిడ కనిపించి మందిర ప్రాంగణంలో ఉన్న ధ్యాన మందిరం చూపించి, "ధ్యానం చేసుకోండి" అని చెప్పింది. ధ్యాన మందిరంలో కొంచెం సేపు ధ్యానం చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. మేము చాలాసార్లు శిరిడీ వెళ్ళాం కానీ ఎప్పుడూ ధ్యాన మందిరం చూడలేదు. బాబానే ఆవిడ రూపంలో మాకు ధ్యాన మందిరం చూపించి, తమ ప్రసాదం కూడా మాకు లభించేలా అన్ని వివరాలు తెలియజేసారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలాగే సంవత్సరానికి ఒకసారైనా మీ దర్శన భాగ్యం మాకు ప్రసాదించండి సాయినాథ".
తరువాత ఒకరోజు హఠాత్తుగా నాకు కడుపునొప్పి, ఒళ్ళునొప్పులు వచ్చాయి. ఆరోజు దత్తజయంతి. రెండు రోజులు ముందు నుండి నేను మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడిలో దత్తజయంతి రోజున గురుపాదుక పూజ చేసుకుందామని అనుకున్నాను. కానీ అదేరోజు నా ఆరోగ్యం బాగలేకపోవడంతో, "ఇదేంటి బాబా, నేను మీ పాదపూజ చేసుకుందామనుకుంటే ఇలా జరిగింది. సాయంత్రం కల్లా నాకున్న నొప్పులు తగ్గిపోయి నేను పాదుకపూజ చేసుకుంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాను. నిద్రలేచేసరికి కడుపునొప్పి, ఒళ్లునొప్పులు తగ్గిపోయాయి. నేను సంతోషంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని సాయంత్రం గుడికి వెళ్లి గురుపాదుక పూజ చేసుకున్నాను.
రెండు రోజుల తర్వాత నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరంతోపాటు చలి, ఒళ్ళునొప్పులు ఉండేవి. టాబ్లెట్లు వేసుకున్నా జ్వరం తగ్గలేదు. హాస్పిటల్‍కి వెళ్లి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అన్ని నార్మల్‍గానే వచ్చాయి. డాక్టర్ ఐదు రోజులకి టాబ్లెట్లు ఇచ్చి పంపారు. ఆ టాబ్లెట్లు వాడినా జ్వరం తగ్గలేదు సరికదా 103, 104 డిగ్రీల జ్వరం ఉంటుండేది. అలా ఒక వారమైనా జ్వరం తగ్గలేదు. నాకు చాలా నీరసంగా ఉంటుండేది. అందుకని మేము వేరే హాస్పిటల్‍కి వెళ్ళాము. అక్కడి డాక్టరు, "జ్వరం చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి" అని అన్నారు. అప్పటికే నాకు చాలా నీరసంగా ఉంది, పైగా డాక్టర్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమనడంతో నేను అడ్మిట్ అవుదామని అనుకున్నాను. కానీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, "ప్రస్తుతం బెడ్స్ అందుబాటులో లేవు. బెడ్ అందుబాటులోకి వస్తే, కాల్ చేస్తాము. మీరు ఇంటికి వెళ్ళండి" అని అన్నారు. అప్పుడు మాకు ఏం చేయాలో తెలియలేదు. కానీ నాకు చాలా నీరసంగా, జ్వరం ఎక్కువగా ఉండడం వల్ల హాస్పిటల్ వాళ్ళు నన్ను ఎమర్జెన్సీలో చేర్చుకుని ఫ్లూయిడ్స్, జ్వరం తగ్గడానికి ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత, "మీకు బెడ్ ఇవ్వలేదు కదా! మీరు ఇక ఇంటికి వెళ్ళాలి" అని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! మాకు హాస్పిటల్లో బెడ్ దొరికేలా చూడండి, నేను ఇంటికి వెళ్ళలేను. నాకు చాలా నీరసంగా ఉంది" అని బాబాను ప్రార్థించాను. ఆపద సమయంలో మనం చేసే ప్రార్థనలకు బాబా ఏదో ఒక రూపంలో తప్పక సహాయం చేస్తారు. మా అన్నయ్యకి అదే హాస్పిటల్లో తెలిసినవాళ్ళు ఉన్నారు. బాబా దయవల్ల వాళ్ళ ద్వారా రెండు గంటల తర్వాత మాకు హాస్పిటల్లో రూము దొరికింది. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే వాళ్ళు అన్ని బ్లడ్ టెస్టులు చేశారు. ఈసారి కూడా రిపోర్టులన్నీ నార్మల్‍గా వచ్చాయి. కానీ ఫీవర్ తగ్గేది కాదు. అప్పుడు డాక్టర్, "రిపోర్టులు నార్మల్ వస్తున్నాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ లేదా లివర్ ఇన్ఫెక్షన్ అయుండొచ్చ"ని మరికొన్ని టెస్టులు చేసారు. అప్పుడు నేను, "బాబా! రిపోర్టులు నార్మల్ రావాలి. ఏ ఇన్ఫెక్షన్ లేదని చెప్పాలి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఆ రిపోర్టులు కూడా నార్మల్ వచ్చాయి. అంతేకాదు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన రెండు రోజుల తర్వాత జ్వరం కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. అప్పుడు నేను, "సాయినాథా! నాకు ఏ సమస్య లేకుండా జ్వరం పూర్తిగా తగ్గి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. మరో రెండు రోజుల తర్వాత డాక్టర్ అన్ని టెస్టులు చేసి, "రిపోర్టులు బాగానే ఉన్నాయి. కాకపోతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది, దానికి టాబ్లెట్లు రాసిస్తాను. మీరు ఇంటికి వెళ్ళవచ్చ"ని చెప్పారు. ఇప్పుడు ఆ సమయంలోనే జరిగిన మరో అనుభవం గురించి చెప్తాను. అది కూడా ఒక అద్భుతమని చెప్పవచ్చు.
మేము మాకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ ఉంది కాబట్టి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చని హైదరాబాదు వెళ్లి, ట్రీట్మెంట్ బాగుంటుందని మంచి పేరున్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. అయితే ఏదైనా వ్యాధి నిర్థారింపబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ నా రిపోర్టులన్నీ నార్మల్ గా వచ్చి ఏ వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ఇన్స్యూరెన్స్ రాలేదు. అందువల్ల మేము డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మొత్తం బిల్ చెల్లించాల్సి వచ్చింది. అప్పుడు నేను, "మాకు ఇన్స్యురెన్స్ రాలేదేంటి బాబా?" అని అనుకున్నాను. అంతలో ఇన్సూరెన్స్ వాళ్ళు, "ముందు మీరు బిల్లు పే చేయండి. తర్వాత హాస్పిటల్ బిల్స్ తెచ్చి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు" అని అన్నారు. మేము తర్వాత ఇన్సూరెన్సు ఎలా వస్తుంది అని అనుకున్నాము. "బాబా! ఎలాగోలా ఇన్సూరెన్స్ వచ్చేటట్లు చూడండి" అని నేను బాబాను ప్రార్థించాను. ఆయన అద్భుతం చేసారు. మేము హాస్పిటల్ బిల్ కట్టి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తుంటే, మధ్య దారిలో ఉండగానే ఇన్సూరెన్స్ వాళ్ళు ఫోన్ చేసి, "మీకు ఇన్సూరెన్స్ వచ్చింద"ని చెప్పారు. నేను సంతోషంతో సాయినాథునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇదంతా బాబా లీల. మేమైతే ఇన్స్యూరెన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు బాబా దయవల్ల నా ఆరోగ్యం బాగుంది. మనం చేసుకున్న కర్మల వలన మనకు కష్టాలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. బాబాని ప్రార్థించడం వల్ల ఆయన మన కష్టాన్ని అనుభవించి మనకు బాధ తెలియకుండా కొద్దిపాటి బాధతో మనల్ని రక్షిస్తారు. ఆయన నాకు టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు లేకుండా నన్ను కాపాడారు. మొత్తానికి బాబా మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ, ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ మనల్ని ఆపదలందు ఆదుకుంటారని చెప్పవచ్చు "ధన్యవాదాలు బాబా. ఎల్లవేళలా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండండి సాయినాథ".
ఇబ్బంది లేకుండా టూరు పూర్తి చేయించి క్షేమంగా ఇంటికి చేర్చిన బాబా
బాబా సాయి చరణం - సర్వదా శరణం శరణం!!!
బాబా సాయి నామస్మరణం - సర్వ పాప హరణం, సర్వ దుఃఖ నివారణం!!!
నా పేరు జగదీశ్వర్. నేను గతంలో బాబా దయవలన మా అబ్బాయి ఎమ్ఎస్ కోర్స్ చేయడానికి యుఎస్ఏ వెళ్లాడని మీతో పంచుకున్నాను. 2022, డిసెంబర్‍లో తన మొదటి సెమిస్టర్ పూర్తవడంతో తను, తన ఫ్రెండ్స్ 2022, డిసెంబర్ 20 నుండి 2023, జనవరి 3 వరకు ఇతర రాష్ట్రాల టూర్‍కి వెళ్లే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వాళ్లు ఒక కారు అద్దెకు తీసుకుని, స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ టూరుకి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో తీవ్రమైన మంచు తుఫాన్ మొదలై వాతావరణం భయంకరంగా మారిందని టీవీలో వార్తలు చూసి మేము చాలా భయపడి ఆందోళన చెందసాగాము. ఇంతలో ఇద్దరు తెలుగువాళ్ళు మంచులో కూరుకుపోయి చనిపోయినట్టు వార్త రావడంతో మేము మరింత ఆందోళన చెందాం. ఒకవైపు భయపడుతున్నా ఇంకో వైపు నేను నమ్ముకున్న బాబా ఉన్నారన్న ధైర్యం తెచ్చుకుని, మనస్ఫూర్తిగా ఆయనకి దణ్ణం పెట్టుకుని, "బాబా! నా కుమారుడు క్షేమంగా టూర్ ముగించుకుని ఆస్టిన్‍లోని తన ఇంటికి తిరిగి చేరుకోవాలి. అలా జరిగితే మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. బాబా దయవలన ఎలాంటి ఇబ్బంది లేకుండా మా అబ్బాయి తన టూర్ పూర్తిచేసుకుని జనవరి 3వ తేదీన క్షేమంగా ఆస్టిన్ చేరుకున్నాడు. అంతా బాబా అనుగ్రహం. "ధన్యవాదాలు బాబా. అన్నిటికీ మీరే శరణం శరణం".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
చాయి నన్ను నా భర్తని కలుపు సాయి
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteSai always be with me
Sai ram🙏
ReplyDelete