సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1432వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఇల్లు అమ్మకం విషయంలో బాబా అనుగ్రహం
2. శ్రీసాయినాథుని కృప
3. శ్రీసాయిబాబా కృపాకటాక్షవీక్షణాలతో కరోనా బారినుండి బయటపడ్డ కుటుంబం 

ఇల్లు అమ్మకం విషయంలో బాబా అనుగ్రహం


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ సాయినాథునికి నా శత సహస్ర వందనాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు కాళీపట్నం లక్ష్మీనారాయణ. మా నివాసం విశాఖపట్నంలో చినముషిడివాడ. ముందుగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. సాయి భక్తుల అనుభవమాలిక 1289వ భాగంలో 'అనుభవాలలో లుప్తమైపోతున్న బాబా ప్రేమ కొరకు ఆవేదన - సాయిభక్తులందరికీ మా హృదయ నివేదన' అన్న టైటిల్‍తో బ్లాగు వారు 'ఈ బ్లాగు చివరికి మ్రొక్కుబడులు తీర్చికునే వేదికగా మారుతున్నందుకు మా ప్రాణాలు విలవిలలాడుతున్నాయని, బాబా అనుగ్రహించిన తీరు, పొందిన అనుభూతి, బాబా చేసిన లీల వ్రాయమని' విన్నవించుకున్నారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. బాబాకి మ్రొక్కుకుంటే సమస్యలు తీరాయని కొంతమంది భక్తులు అనుభవాలను క్లుప్తంగా వ్రాస్తున్నారు. అలా కాకుండా మీరు చెప్పినట్టు అనుభవం జరిగే క్రమంలోని ప్రతి విషయాన్ని వివరంగా వ్రాస్తే బాబా ప్రేమను ఆస్వాదించడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. అయితే నేను ఇప్పుడు పంచుకోబోయే అనుభవం కూడా పైన చెప్పుకున్నటువంటి అనుభవాల కోవకే వస్తుందేమో నాకు తెలియదుగాని దీన్ని వ్రాసి పంపుతున్నాను. బాబా ప్రసాదించిన ఈ అనుభవం వివరంగా ఉంటేనే ప్రచురించండి. లేకుంటే ప్రచురించలేమని తిరస్కరించండి. ఇక నా అనుభవానికి వస్తే..


నేను ఇదివరకు బాబా సొంతింటి కల నెరవేర్చిన వైనాన్ని పంచుకున్నాను. సొంతింటి కలను నెరవేర్చిన బాబా మా పాత ఇంటిని అమ్మడంలో కూడా మాకు ఎంతగానో సహాయపడ్డారు. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మేము కొత్త ఇల్లు తీసుకున్నాక మా పాత ఇంటిని అమ్మి, ఆ వచ్చిన డబ్బుతో కొత్త ఇంటి ఋణం కొంత తీర్చుకుందామని అనుకున్నాము. బాబా దయవల్ల ఒక పార్టీ మా ఇల్లు తీసుకుంటామని ముందుకొచ్చి కొంత డబ్బు అడ్వాన్సు ఇచ్చి, అగ్రిమెంట్ వ్రాయించుకున్నారు. అయితే మా ఇంటి డాక్యుమెంట్స్ లో ఉన్న కొన్ని సాంకేతిక కారణాల వలన వాళ్ళకి బ్యాంకు ఋణం మంజూరు కాలేదు. ఈలోగా అగ్రిమెంట్ గడువు పూర్తి కావడంతో వాళ్ళు మరికొంత గడువు కావాలని మరి కొంత డబ్బు ఇచ్చి మరో అగ్రిమెంట్ వ్రాయించుకున్నారు. అయితే ఈసారి కూడా వాళ్ళకి బ్యాంకు ఋణం మంజూరు కాలేదు. ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి. బ్యాంకు వాళ్ళు డాక్యుమెంట్స్ లో సరిహద్దు విషయంలో లోపాలు ఉన్నాయని, వాటిని ఆ ఇంటిని మాకు ఇదివరకు అమ్మిన వాళ్లతో సంతకం చేయించి సరిచేసుకోవాలని చెప్పారు. అయితే మేము సుమారు పన్నెండు సంవత్సరాల క్రితం ఆ ఇల్లు కొన్నాం. దాన్ని మాకు అమ్మినవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళని ఎక్కడని వెతకడం? అదీకాక ఆ రోజుల్లో ఇంటి చదరపు అడుగులు ఎక్కువగా ఉన్నా రిజిస్ట్రేషన్ తక్కువ అవుతుందని తగ్గించి వ్రాసారు. అది కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఈ కారణాల వల్ల మా ఇల్లు అమ్మే విషయంలో మా ఆశలు ఆవిరైపోగా ఇల్లు అమ్మడం విరమించుకున్నాము. కానీ పై సాంకేతిక కారణాల వలన భవిష్యత్తులో ఆ ఇల్లు అమ్మడం మరింత కష్టమవుతుంది. అదలా ఉంచితే, మా ఇల్లు కొనుక్కుందామనుకున్న వాళ్ళు అప్పటికే మా ఇంటి మీద కొంత ఖర్చు కూడా పెట్టారు. ఆ డబ్బు, వాళ్ళు మాకు ఇచ్చిన అడ్వాన్సు డబ్బులు మేము తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ వాళ్ళు చాలా మంచివాళ్ళు కావడం వల్ల మా ఇల్లు కొనడం విరమించుకునప్పటికీ తాము ఇచ్చిన సొమ్ము తాపీగా ఇవ్వండని మాతో చెప్పారు. మేము బాబా మీద భారం వేశాం. ప్రతిరోజూ బాబా సూక్తులు చూడటం నాకలవాటు. ఎన్నిసార్లు ప్రశ్నలు-జవాబులలో బాబాని అడిగినా "నీ పని మీదనే ఉన్నాను. త్వరలోనే పని అవుతుంది" అని జవాబులు వచ్చేవి. అలాగే ఆయన దయవల్ల మాకు ఆ ఇంటిని అమ్మినతను మాకు దొరికాడు. అతనితో అన్ని విషయాలు వివరంగా చెప్పిన మీదట అతను రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చి సంతకం పెడతానన్నాడు. అలా అతని ద్వారా సరిహద్దులు మార్చుకున్నాం. కానీ మరికొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని బ్యాంకువాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగనివ్వలేదు. దాంతో రిజిస్ట్రేషన్ ఎప్పటికి అవుతుందో తెలియక ఇంట్లో అందరికీ ఒకటే టెన్షన్. మేము పూర్తిగా సహనం కోల్పోయి బాబా తప్ప మా సమస్యని ఎవరూ తీర్చలేరని అనుకున్నాము. అటువంటి సమయంలో మా ఇల్లు కొనబోయే వ్యక్తి ఫోన్ చేసి "సమస్యలు పరిష్కారమయ్యాయి. లక్ష్మీవారంనాడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందామ"ని చెప్పారు. మాకు కూడా లక్ష్మివారం సెంటిమెంట్ అవ్వడం వల్ల మేము కూడా అతని ప్రతిపాదనకు సరే అన్నాం. బాబా దయవల్ల ఆ రోజు రిజిస్ట్రేషన్ పూర్తయింది. బ్యాంకువాళ్ళు మాకు చెక్కు అందజేసి, "వెంటనే బ్యాంకులో చెక్కు జమ చేయండి. ఎందుకంటే, చెక్కు డ్రా చేసుకోవడానికి మూడు రోజులే పరిమిత కాలం" అని చెప్పారు. దాంతో వెంటనే మేము బ్యాంకుకు పరుగున వెళ్లి చెక్కు డిపాజిట్ చెయ్యడానికి ఇచ్చాము. కానీ అంతటితో మా కష్టాలు తీరలేదు. బ్యాంకువాళ్ళు రెండో శనివారం, ఆదివారం బ్యాంకు సెలవు దినాలని, చెక్కు కాలపరిమితి అయిపోయిందని చెక్కు తిరిగి పంపించేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయి ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళ చేతికి వెళ్లిపోయినా, మాకు చెక్కు క్యాష్ అవకపోవడంతో ఏమి చేయాలో అర్థంకాక బాబా మీద భారమేసి మాకు చెక్కు ఇచ్చిన ప్రైవేటు బ్యాంకుకి పరుగుపెట్టాము. వాళ్ళకి పరిస్థితి తెలుసు కాబట్టి "రెండు రోజుల్లో చెక్కు తీసుకుని రండి" అని చెప్పారు. అయితే పది రోజులు బ్యాంకు చుట్టూ తిరిగినా చెక్కు మా చేతికి రాలేదు. బాబాని అడిగితే "నీ సొమ్ములు ఎక్కడికీ పోవు. నీ దగ్గరకి నడుచుకుంటూ వస్తాయ"ని సమాధానం వచ్చింది. అలాగే ఆయన దయవలన మరో ఐదురోజులకు చెక్కు మా చేతికి రావడంతో వెంటనే బ్యాంకుకి వెళ్లి జమ చేసాం. ఒక్కరోజులోనే మా సొమ్ము మాకు జమ అయ్యింది. మా అమ్మాయి పెళ్లి, కొత్త ఇల్లు కొనడం మొదలైన ప్రతీ విషయంలో బాబా మాకు ఇలానే టెన్షన్ పెట్టినా కానీ, సరైన సమయంలో మధుర ఫలాలను అందించి మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తున్నారు. "బాబా! మీ పాదాలకు నా శిరస్సు వంచి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను కోరే కోర్కెలు న్యాయబద్దంగా, ధర్మబద్దంగా ఉంటేనే తీర్చండి. ఎల్లప్పుడూ మీ పాదాల మీదనే నా మనస్సు కేంద్రీకృతమై ఉండేలా అనుగ్రహించండి.


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


శ్రీసాయినాథుని కృప


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. సాయి బంధువులకు నమస్కారాలు. నా పేరు శివప్రసాద్. మాది విజయవాడ. ఇది నేను ఈ బ్లాగులో పంచుకుంటున్న తొలి అనుభవం. మా అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుషన్ చదవటానికి సెంట్రల్ యూనివర్సిటీ పరీక్షలు వ్రాసి నాలుగైదు రాష్ట్రాలలో అప్లై చేసుకుంది. ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో సీటు వచ్చింది. మేము మా అమ్మాయిని అక్కడ చేర్పించదలచి ఫీజ్ చెల్లించి హాస్టల్ అలాట్మెంట్ కొరకు వేచి చూసాము. వారం రోజుల తర్వాత హాస్టల్ అలాట్మెంట్ అయింది. ఆ రోజు ఫీజ్ చెల్లిద్దామని అనుకున్నప్పటికీ 'తాను ఒకటి తెలిస్తే, దైవం ఒకటి తలచినట్లు' అదేరోజు మా అమ్మాయికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది. అప్పుడు మా పాప "నేను బెనారస్ యూనివర్సిటీకి వెళ్తాను. నా క్లాస్మేట్‍కి కూడా అదే యూనివర్సిటీలో సీటు వచ్చింది. మేము ఒకరికొకరం తోడుగా ఉంటాము" అని చెప్పింది. ముందు మేము మా అమ్మాయిని అంత దూరం పంపడానికి సంశయించినప్పటికీ తరువాత తనని ఆ యూనివర్సిటీలో చేర్పించడానికి నిశ్చయించుకుని ఫీజు చెల్లించాము. అయితే అంత దూరం వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు. ఆ విషయమై శ్రీసాయినాథుని ప్రార్థించి యూనివర్సిటీ వాళ్ళకు విషయం చెప్పి, "ఎప్పుడు రిపోర్టు అవ్వాల"ని అడిగితే, "నవంబర్ 28న రిపోర్ట్ అవ్వమ"ని చెప్పారు. శ్రీసాయినాథుని దయతో మేము నవంబర్ 25న బయలుదేరి నవంబర్ 26 సాయంత్రం నాలుగున్నరకి యూనివర్సిటీకి చేరుకుని మా పాపతోపాటు తన స్నేహితురాలిని కూడా జాయిన్ చేసాము. అయితే మా పాప స్నేహితురాలికి హాస్టల్ అలాట్మెంట్ అయిందికానీ, మా పాపకు రాలేదు. అప్పుడు సాయిని, "మా పాపకు కూడా హాస్టల్ అలాట్మెంట్ అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. ఆ సాయినాథుని కృపతో డిసెంబర్ 5న మా పాపకి హాస్టల్ అలాట్మెంట్ అయింది. "ధన్యవాదాలు బాబా". ఆ సాయినాథుని చల్లని కృప అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


శ్రీసాయిబాబా కృపాకటాక్షవీక్షణాలతో కరోనా బారినుండి బయటపడ్డ కుటుంబం 


నా పేరు గరిమెళ్ల శ్రీనివాసరావు. మేము ఉండేది ఛత్తీస్‍గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‍లో. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి సాయి ప్రసన్నకి 18 సంవత్సరాలు, చిన్నమ్మాయి సాయి శ్రీనిధికి 11 సంవత్సరాలు. మా కుటుంబసభ్యులందరమూ 2018 నుండి శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాం. నేను ఇప్పుడు శ్రీసాయి మా కుటుంబసభ్యులందరినీ కరోనా బారి నుండి ఎలా రక్షించారో పంచుకునే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 2020, దసరా పండుగనాడు నాకు కొద్దిగా జలుబు, దగ్గు వచ్చాయి. ఎప్పుడూ వాడే మాత్రలు రెండు రోజులు వేసుకున్నాను. కానీ ఆ జలుబు, దగ్గు తగ్గకపోగా కొంచెం జ్వరం కూడా వచ్చింది. నేను చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే, వెంటనే క్వారంటైన్‍లోకి వెళ్ళకపోవడం. నాతో కలిసి ఉంటున్నందువల్ల ముందుగా మా చిన్నమ్మాయికి జ్వరం వచ్చింది. దాంతో నేను జాగ్రత్త పడి ల్యాబ్ టెక్నీషియన్‍ని మా ఇంటికి పిలిపించి నేను, నా భార్య, మా ఇద్దరు పిల్లలు యాంటిజెన్ టెస్ట్ చేయించుకుంటే నా భార్యకి తప్ప నాకు, మా ఇద్దరు పిల్లలికి కరోనా పాజిటివ్ వచ్చింది. మేము ఆ శిరిడీ శ్రీసాయినాథుని ప్రార్థిస్తూ మందులు వేసుకున్నాం. ఆ తండ్రి మహత్మ్యం వలన మా ముగ్గురికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిదు రోజుల్లో తగ్గిపోయింది. కానీ మూడు రోజులు మాకు సపర్యలు చేసిన నా భార్యకు విపరీతమైన జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు వచ్చాయి. నా భార్య శ్రీసాయిబాబాను బాగా నమ్ముతుంది. తనకి ఎంత భాధ ఉన్నా శ్రీసాయినాథుని ఆశీస్సులతో తాను కూడా కరోనా నుండి బయటపడింది. మేము నమ్ముకున్న బాబా మమ్మల్ని మందులతో కరోనా బారి నుండి రక్షించారు. ఈరోజు మా కుటంబం ఇలా ఉండడానికి శ్రీసాయిబాబా కృపాకటాక్షవీక్షణాలే కారణమని నేను ధృఢంగా చెప్పగలను. ఆయన మా కుటుంబసభ్యులందరితో ఉంటారు. ఎందుకిలా చెప్తున్నానంటే,  మేము కరోనాతో బాధపడిన ఆ వారం రోజుల్లో నా భార్యకు ఈ క్రింది శ్రీసాయి మెసేజ్ వచ్చింది. 

భావం:- నీ చేయి అందివ్వు. నేను నీతో నీ జీవితమంతా కలిసి నడుస్తాను, నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను నేను ఎదుర్కొంటాను. నీ విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను. ఆందోళన వద్దు.


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


7 comments:

  1. Please Baba bless my daughter with health. Reduce fever to normal. Give long life and aaush to her. To my children and hubby. Om sai ram. Please help us. Om sai ram

    ReplyDelete
  2. సాయి బాబా సాయి నా భర్త నన్ను అర్థం చేసుకునేలా చూడు సాయి తను నన్ను మళ్ళీ భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకుపోయేలా చూడు సాయి మల్లి మేమిద్దరం కలిసేలా ఆశీర్వదించు సాయి నేను నా అనుభవాన్ని బ్లాక్లో పంచుకుంటాను సాయి. మీరు ఎన్నో జన్మలైనా నేను తీర్చుకోలేను బాబాసాయి ఓం సాయిరాం

    ReplyDelete
  3. Sai baba please bless my daughter avoid coronavirus.be with her.bless her.om Sai ram

    ReplyDelete
  4. Not to attack coronavirus.please bless her Be with her.om sai ram

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo