1. సాయి మీద భారమేస్తే ఏ సమస్య అయిన సమసిపోతుంది
2. పిలవగానే బాబా వచ్చారు!!
3. ఊదీతో ఆగిపోయిన నొప్పులు మొదలు - బిడ్డ జననం
సాయి మీద భారమేస్తే ఏ సమస్య అయిన సమసిపోతుంది
సాయి భక్తులకు నమస్కారం. ఎంతో శ్రద్ధ, ఓపికలతో ఈ బ్లాగు నిర్వహిస్తున్న అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలు. నా పేరు గీత. 2022, డిసెంబర్ నెల చివరిలో మా ఇంటికి నలుగురు ఆడపడుచుల కుటుంబాలు వచ్చాయి. అందరం సరదాగా గడుపుతున్న సమయంలో ఒకరోజు ఉదయం నేను అల్పాహారం తయారు చేస్తుండగా మా బాబాయ్ గారు వచ్చి, "అమ్మా! చెత్త బుట్ట బయటపడేసావా?" అని అడిగారు. నేను, "ఇప్పుడే పంచాయతీవాళ్ళు వచ్చి తీసుకు వెళ్లారు" అని చెప్పాను. "అయ్యో! మీ పిన్ని పొరపాటున తన నల్లపూసల గొలుసు వాడిపోయిన పువ్వులతో కలిపి చెత్తబుట్టలో పడేసిందట" అని అన్నారాయన. అది విని నేను చాలా షాకయ్యాను. మంచైనా, చెడైనా బాబాకే చెప్పుకునేదాన్ని కావడం వల్ల, "బాబా! ఇలా జరిగిందేమిటి? మీ దయతో ఆ గొలుసు దొరకాలి తండ్రి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ఆయనను వేడుకున్నాను. తరువాత మావారికి, మా తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పి, "పంచాయతీ బండి ఎక్కడుందో చూడండి. అలాగే మన ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ తల్లిని వేడుకోండి" అని చెప్పాను. తరువాత ఎందుకైనా మంచిదని అందరం కూడా వెళ్లి దిండ్లు, దుప్పట్లు తదితర అన్నీ వెతికి చూసాము, కానీ ఆ గొలుసు కనపడలేదు. తరువాత పిన్నిగారు మరోసారి దిండు కవరు తీసి విదిలిస్తే ఆ గొలుసు కింద పడింది. దాంతో అందరం 'హమ్మయ్య' అని ఊపిరి తీసుకున్నాము. అలా పెద్ద ఉపద్రవం నుండి మమ్మల్ని రక్షించారు సాయితండ్రి. "దయగల తండ్రీ! మీకు చాలా చాలా ధన్యవాదాలు".
ఇప్పుడు ఇంకొక అద్భుతమైన అనుభవం కూడా మీతో పంచుకుంటాను. నేను ఇదివరకు మా అబ్బాయికి ఆ సాయితండ్రి దయవల్ల ఆర్బిఐలో మంచి ఉద్యోగం వచ్చిందని పంచుకున్నాను. ఉద్యోగం వచ్చినందుకు మా అబ్బాయి తన మొక్కులన్నీ చెల్లించుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగా తను తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాల్సి ఉంది. అందుకోసం టికెట్ బుక్ చేయాలని చూస్తే 2023, జనవరి 10కి టికెట్ దొరికింది. వాళ్ళ నాన్న వ్యాపార విషయంగా తీరిక లేకుండా ఉన్నందున నేను బాబుతో వెళ్ళాలని అనుకున్నాను. అయితే ముందురోజు రాత్రి ఉన్నట్టుండి నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. నా నెలసరికి ఇంకా వారం రోజులున్నా అవే లక్షణాలు కనిపిస్తుండేసరికి తిరుమలకు వెళ్ళలేనేమోననిపించి దయగల సాయితండ్రికి చెప్పుకుని, "మీ ఊదీ తీర్థంలా తీసుకుంటాను. స్వామి దర్శనం చక్కగా అయ్యేట్లు చూడండి" అని వేడుకున్నాను. మన సాయి మీద భారమేస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన దయవల్ల నాకు ఏ ప్రకృతి ఇబ్బందిలేకుండా తిరుమల వెళ్లి తెల్లవారుఝామునే స్వామి దర్శనం చేసుకుని, త్వరగా తిరిగి ఇల్లు చేరుకున్నాము. ప్రకృతిని శాసించే శక్తి ఆయనకు ఉందని మరోసారి తేటతెల్లమైంది. "ధన్యవాదాలు సాయి".
పిలవగానే బాబా వచ్చారు!!
సాయి భక్తులకు నమస్తే. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి బంధువులకు నమస్కారాలు. నా తల్లి, తండ్రి అన్ని తానే అయినటువంటి ఆ సాయితండ్రికి సాష్టాంగ ప్రణామాలు. నా పేరు కోమలి. మాది నాగార్జునసాగర్ దగ్గర హాలియా. నేను మామూలుగా మా ఇంటి నుండి అరకిలోమీటరు దూరంలో ఉన్న బాబా గుడికి ఆటోలో వెళ్లి, వస్తుంటాను. కానీ ఒక గురువారంనాడు ఎందుకనో నడుచుకుంటూ వెళ్ళాను. బాబాను దర్శించుకున్నాక ప్రసాదం తీసుకుని కాసేపు అక్కడే కూర్చున్నాను. నా మనసుకి ఎందుకో బాబా(విగ్రహం) కాళ్లు ఒత్తాలని అనిపించి భక్తులు ఎవరూలేని సమయం కోసం కాసేపు వేచి చూసాను. చివరికి భక్తులు లేని సమయంలో వెళ్లి బాబా పాదాల దగ్గర కూర్చుని కాసేపు బాబా కాళ్లు పట్టాను. అప్పుడు ఎందుకో తెలీదుకానీ నాకు బాగా ఏడుపొచ్చింది. కాళ్లు ఒత్తుతూ బాబాతో, "బాబా! నాతో మాట్లాడండి. నావైపు చూడండి బాబా" అని వేడుకున్నాను. నేను మామూలుగా గుడికి వెళ్లిన ప్రతిసారీ అష్టోత్తరం పుస్తకం తీసుకుని ఐదు లేదా తొమ్మిదిసార్లు చదివి ఇంటికి తిరిగి వస్తాను. అయితే ఈసారి గుడిలో అష్టోత్తరం పుస్తకాలు దొరకలేదు. గుడిలో వాళ్ళని అడిగితే, "ఎక్కడో పడ్డాయమ్మా, మాకు కూడా కనిపించట్లేదు" అన్నారు. సరేనని మొబైల్ ఫోన్‌లో సెర్చ్ చేద్దామని చూస్తే, సిగ్నల్స్ లేక నెట్ రాలేదు. ఇక చేసేదిలేక 'ఓం శ్రీసాయినాథాయ నమః' అని 108 సార్లు జపించి వచ్చేసాను. ఇంటికి రాగానే బాబా ఊదీ దేవుడి దగ్గర పెట్టాను. ఆరోజు పూజ పనులు ఉంటాయని ఉదయం మూడు గంటలకే నిద్ర లేచినందువల్ల కొంచెం అలసటగా అనిపించి కాసేపు నిద్రపోవాలనిపించింది. అయితే 'ప్రతిరోజూ బాబాకి కాకడ హారతి మాత్రమే ఇస్తున్నాను, ఈరోజు గురువారం కదా! అన్ని హారతులు ఇద్దాము' అనిపించింది. దాంతో మధ్యాహ్న హారతి కోసం 11:57 నిమిషాలకి అలారం పెట్టి పడుకున్నాను. పడుకునేముందు కూడా, "బాబా! ఒక్కసారి నావైపు చూడండి" అని అనుకుంటూ పడుకున్నాను. కొంతసేపటికి బాబా స్వప్న దర్శనమిచ్చారు. ఆయన శరీరంపై చాలా చోట్ల గంధంతో మూడు నామాలు, కుంకుమ బొట్టు ఉన్నాయి. ఆయన నా దగ్గరకి వచ్చి, "లే ..లే.. ఇక్కడ పడుకున్నావు ఏంటి?" అని అన్నారు. నేను, "మధ్యాహ్నం హారతికి అలారం పెట్టుకున్నాను అలారం వచ్చేవరకే పడుకుంటాను. కాసేపు నన్ను పడుకోనివ్వండి" అని అన్నాను. అప్పుడు బాబా, "మధ్యాహ్న హారతి సమయం అయింది. లే.. లేచి అష్టోత్తరం చదువు" అని చెప్పి తమ చేతిని నా మంచం పక్కగా కిందికి చూపించారు. నేను నా మనసులో 'అష్టోత్తరం బుక్స్ లేవన్నారు కదా!' అని అనుకుంటూనే 'ఆయన చూపించారు కదా!' అని లేచి, కింద కూర్చుని చూస్తే, అష్టోత్తరంపై గంధం రాసి తడిగా ఉంది. నేను, "నాకు స్పష్టంగా అర్థం కావట్లేదు" అని అన్నాను. అందుకు బాబా, "చేతితో ఇలా ఇలా తుడిచినట్లు అను" అని గోడ మీద చేసి చూపించారు. అప్పుడు నేను ఆ గంధంతో రాసి ఉన్న అష్టోత్తరాన్ని నా చేయితో తుడిచినట్లు అన్నాను. పెన్నుతో వ్రాసి ఉన్న అష్టోత్తరం వరుసక్రమంలో స్పష్టంగా కనిపించింది. మరుక్షణం నా మనసుకి 'వచ్చింది బాబానే' అని అర్థమై 'గుడిలో అష్టోత్తరం చదవలేకపోయానని బాధపడుతూ ఇంటికి వచ్చాను. అందుకని బాబా ఇలా వచ్చి అష్టోత్తరం చూపించారా' అని అనుకున్నాను. ఎప్పుడైతే 'వచ్చింది ఆ సాయితండ్రి' అని నా మనసుకు అనిపించిందో ఇక అప్పటినుండి నేను నేరుగా బాబా ముఖము చూడలేకపోయాను. కేవలం ఆయన నడుము నుండి పాదాల వరకు మాత్రమే నాకు కనిపిస్తుంది. తక్షణమే నా కుడిపక్క అష్టోత్తరం రాసి ఉంది. బాబా వచ్చి నా ఎడమ పక్కన కూర్చున్నారు. ఆయన కుడికాలు పైకి లేపి, ఎడమకాలుపైకి మడిచి, కుడికాలు మీద కుడిచేయి పెట్టి నా వైపు చూస్తూ కూర్చున్నారు. నేను ఆ సమయంలో అష్టోత్తరం వైపు చూస్తున్నాను. కానీ బాబా నా పక్కనే కూర్చోవడం వలన ఆయన ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. వెంటనే నా మనసుకి 'బాబా వచ్చారు. ఆయన ఆశీస్సుల కోసం వారి పాదాలు పట్టుకుందాము' అనిపించి నా ఎడమ చేతితో దగ్గరగా ఉన్న బాబా ఎడమకాలు పట్టుకున్నాను. వెంటనే బాబా అదృశ్యమయ్యారు. అది చూసిన నేను ఒక్కసారిగా షాకయ్యాను. బాబానే వచ్చారు అని ఇంకా స్పష్టంగా నా మనసుకి అర్థమై ఊపిరి గట్టిగా బిగబట్టినట్లయింది. వెంటనే మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి టైం 11:48 నిమిషాలు అయింది. కళ్ళు తెరిచిన తర్వాత కూడా బాబాని నా కళ్ళతో చూశాను అన్న సంతోషమైన భావనను ఫీల్ అవుతూ 'పిలవగానే బాబా వచ్చార'ని నా కళ్ళ వెంట నీళ్లు కారాయి. వెంటనే లేచి బాబాకి మధ్యాహ్న హారతి ఇచ్చి, "సాయినాథా! మిమ్మల్ని నమ్ముకున్న పిల్లల్ని మీరు ఎల్లప్పుడూ కాపు కాస్తారు" అని మనసులో అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా".
ఊదీతో ఆగిపోయిన నొప్పులు మొదలు - బిడ్డ జననం
సాయి భక్తులకు నమస్కారం. నా పేరు అరుణలక్ష్మి. బాబా తమను నమ్ముకున్న భక్తులను ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతారని మరోసారి నిరూపించారు. ఆ అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. గర్భవతిగా ఉన్న మా అక్కవాళ్ళ పాపకి 2023, జనవరి 1న నొప్పులు రావడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే తన బీపీ బాగా పెరిగి నొప్పులు ఆగిపోయాయి. మూడు రోజులు ఐసియులో ఉన్నా తనకి బీపీ తగ్గలేదు. ఆ మూడు రోజులు మా కుటుంబమంతా బాబాను వేడుకుంటూనే ఉన్నాం. "బాబా! మీరు తప్ప మమ్మల్ని ఆదుకునేవారు లేరు తండ్రి. పిల్లకి నొప్పులు రావడం లేదు. మీరే మాకు దిక్కు, ఆదుకో సాయి" అని నిరంతరం ప్రార్థించాము. బాబా ఊదీ నీటిలో కలిపి తాగించాం. ఇక చూడండి చమత్కారం! పాపకి నొప్పులు మెుదలై పండంటి బాబును ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మాకొచ్చిన సమస్యను పరిష్కరించి మమ్మల్ని ఆదుకున్న నా సాయితండ్రికి అనేక నమస్కారాలు. ఈ కలియుగంలో కూడా పిలిస్తే పలికే దైవం నా సాయితండ్రి అని సగర్వంగా నా ఈ అనుభవం సాయి కుటుంబంతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన సాయికి ధన్యవాదాలు.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sai Ram
ReplyDeleteSai always be with me