సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1448వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పుట్టినరోజున బాబా ఆశీస్సులు
2. బాబా దయతో అడిగినవి దక్కాయి
3. బిడ్డ సమస్యను తీర్చి తామేంటో తెలియజేసిన బాబా

పుట్టినరోజున బాబా ఆశీస్సులు


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గోష్టేశ్వరి. మా పాప తలపై ఒకచోట జుట్టు ఊడిపోయి బట్టతలలా కనిపిస్తుండేది. అలాగే, ముందుభాగంలో రెండు చోట్ల కూడా జుట్టు పెరగలేదు. ఈ విషయం నేను బాబాకి చెప్పుకొని, పాపని అరసవిల్లి తీసుకెళ్లి జుట్టు తీయించాను. తరువాత, "పాపకి తలపై జుట్టు ఎక్కడ పెరగట్లేదో ఆయా భాగాల్లో జుట్టు బాగా పెరగాలి" అని బాబాని, సూర్యనారాయణస్వామిని ప్రార్థించాను. బాబా దయవల్ల, సూర్యనారాయణస్వామి దయవల్ల ఇప్పుడు పాపకి జుట్టు బాగానే పెరిగింది. "ధన్యవాదాలు తండ్రీ".


ఇప్పుడు నా పుట్టినరోజునాడు బాబా నాకు ప్రసాదించిన చాలా చక్కటి అనుభవాన్ని చెప్తాను. 2022, నవంబర్ 1న నా పుట్టినరోజు. ఆ సందర్భంగా నేను, మావారు దైవదర్శనానికని బండి మీద అరసవిల్లి, శ్రీకూర్మం బయలుదేరాం. మధ్యలో, 'బాబా గుడికి కూడా వెళ్తే బాగుంటుంద'ని నాకు అనిపించింది. కానీ నేను ఆ విషయం మావారితో చెప్పలేదు. అయితే శ్రీకాకుళం రాగానే మావారు, "ఇక్కడ దగ్గరలో ఒక బాబా గుడి ఉంది. చాలా బాగుంటుంది, వెళదామా?" అని అన్నారు. నేను ఆశ్చర్యానందాలతో ‘సరే’ అన్నాను. నిజంగా ఆ గుడిలో బాబా మరియు వినాయకుడు, జగన్నాథస్వామి, రాధాకృష్ణులు, వెంకటేశ్వరస్వామి, దత్తాత్రేయుడు, శివలింగం అన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. చుట్టూ బాబా పటాలు ఉన్నాయి. ఒకచోట బాబా కూర్చొనివున్న విగ్రహమైతే నిజంగా 'బాబానే ఉన్నారా' అన్నంత సజీవంగా ఉంది. నేను బాబా పాదాలపై నా శిరస్సు ఆనించి, "నేను చెప్పకుండానే నా మనసులోని కోరికను తెలుసుకొని, ఇలా మీ గుడికి రప్పించి, మీ దర్శనభాగ్యాన్ని ప్రసాదించారా బాబా?" అని బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. 


అంతటితో అయిపోలేదు, ఇంకా గొప్ప అనుభవాన్ని బాబా ప్రసాదించారు. మేము అక్కడనుండి శ్రీకూర్మం వెళ్లి కూర్మనాథుని దర్శనం చేసుకుని, తరువాత అరసవిల్లి వెళ్ళాము. అక్కడ మేము బండి పార్క్ చేస్తుంటే, మా వెనుక ఒక వృద్ధుడు కనిపించాడు. మేము ఆయన్ని పట్టించుకోకుండా మా సెల్ ఫోన్లు, బ్యాగు తీసుకొని డిపాజిట్ కౌంటర్ వద్దకు వెళ్ళాము. అక్కడ మావారు వాటిని డిపాజిట్ చేస్తుంటే, నేను బయట నిల్చున్నాను. ఆ వృద్ధుడు నా దగ్గరకి వచ్చి చేయి చాచాడు. నా మనసుకు ఎందుకో 'ఆయన బాబానే అయివుంటారు' అనిపించి ఆయనకు పది రూపాయలు ఇచ్చాను. ఇంతలో మావారు వచ్చారు. చూస్తే, ఈ వృద్ధుడు అక్కడ లేరు! నేను ఆయన కోసం చుట్టూ చూశాను. కానీ, ఎక్కడా కనిపించలేదు. సరే, మేము సూర్యనారాయణస్వామి దర్శనం చేసుకుని, అన్నప్రసాదం తిన్నాము(ఇది కూడా నా మనసులోని కోరికే). తరువాత మేము సిఎంఆర్ షాపింగ్ మాల్‍‍కి వెళ్ళాము. అక్కడ నా డ్రెస్సులు సెలెక్ట్ చేశాక, మావారు తన డ్రెస్సులు సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేను బాబా మెసేజ్ కోసం ఫోన్ తీసి చూస్తే, ఈ క్రింది మెసేజ్ వచ్చింది.

ఆ మెసేజ్ చూస్తూనే, ‘బాబానే ఆ వృద్ధుని రూపంలో వచ్చి నా వద్ద దక్షిణ తీసుకున్నార’ని నాకు పూర్తి నిర్ధారణ అయి ఆనందం పట్టలేకపోయాను. "బాబా! పుట్టినరోజునాడు మీరే వచ్చి నన్ను ఆశీర్వదించారు. మీ బిడ్డనైనందుకు నేను చాలా అదృష్టవంతురాలిని బాబా. ఎన్ని జన్మలెత్తినా నేను మీ భక్తురాలిగానే పుట్టాలి బాబా. ధన్యవాదాలు సాయినాథా, ధన్యవాదాలు".


బాబా దయతో అడిగినవి దక్కాయి


అందరికీ నమస్తే. నేను సాయిభక్తుడిని. నా పేరు ఛత్రపతి. నేను ఇదివరకు ఒక చిన్న ఉద్యోగం చేశాను. అక్కడ యజమాని అంత మంచివారు కాదు. నేను ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కేది కాదు. జీతం కూడా చాలా తక్కువ. అయినా ‘బాబా ఎంతో దయతో ఉద్యోగం ఇప్పించారు, ఏదో ఒకటి’ అని సంతోషంగా ఉద్యోగం చేసుకుంటుండేవాడిని. కానీ మా యజమాని నాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా సంస్థలోని అందరి ప్రాజెక్ట్స్ నాతోనే చేయించేవాడు. అంతేకాదు, నాకివ్వాల్సిన సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవాడు. ఈ రెండు చిక్కుల గురించి నేను బాబాని, "ఈ రెండు సమస్యలు సవ్యంగా సమసిపోతే నీ గుడికి వస్తాను, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను" అని సదా ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా నా మొర ఆలకించి తదనుగుణంగా అనుగ్రహించారు. బాబా దయతో ప్రాజెక్ట్స్ పూర్తయ్యాయి, సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. "చాలా ధన్యవాదాలు బాబా".


తరువాత నేను ఆ ఉద్యోగం మానేసే సమయంలో ఒక ఇంపార్టెంట్ ఫైల్ కనపడకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. నేను బాబాను ఎంతగానో ప్రార్థించి, "బాబా! ఫైల్ దొరికితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో ఫైల్ దొరికింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి నాతో పనిచేసే ఒక ఆమె చేతి బ్రేస్‌లెట్ రోడ్డు మధ్యలో ఎక్కడో పడిపోయింది. అది చాలా స్లన్నగా ఉంటుంది కాబట్టి దొరికే అవకాశం అస్సలు లేదు. అందువల్ల చాలా ఖరీదైన బ్రేస్‌లెట్ పోయినందుకు ఆమె చాలా దిగులుపడుతుంటే, నేను బాబా మీద నమ్మకముంచి, 'ఆ బ్రేస్‌లెట్ దొరికితే మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను బాబా" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో వెంటనే బ్రేస్‌లెట్ నాకు దొరికింది. "ధన్యవాదాలు బాబా".


బిడ్డ సమస్యను తీర్చి తామేంటో తెలియజేసిన బాబా

 

ఓం సాయినాథాయ నమః!!! నా పేరు సురేఖ. మొదటినుంచి మా ఇంట్లో అందరి దేవుళ్ళతోపాటు సాయిబాబా ఫోటో కూడా వుండేది. అప్పుడప్పుడు బాబా గుడికి కూడా వెళ్ళేదాన్ని. కానీ బాబా గురించి తెలుసుకోవటానికి నాకు 46 సంవత్సరాలు పట్టింది. ఈమధ్య ఒకటిన్నర సంవత్సరంపాటు మా అమ్మాయికి నెలసరి సక్రమంగా వచ్చేది కాదు. ఎండోక్రైనాలజిస్ట్(endocrinologist) దగ్గర చూపించినా నయం కాలేదు. తరువాత గైనకాలజిస్ట్ అయిన మా మరదలు కొన్ని టాబ్లెట్స్ వ్రాసింది. కానీ చిన్నపిల్ల కదా, ఆయుర్వేద మందులైతే బాగుంటుందని ఇద్దరు ఫ్రెండ్స్‌కి కాల్ చేశాను. అయితే నా మనసుకెందుకు బాబాను అడగాలని అనిపించిందో తెలియదుగానీ, "నా బిడ్డ బాధ తీర్చమ"ని మనస్పూర్తిగా బాబాను వేడుకొన్నాను. అంతే, బాబా నా బిడ్డ సమస్యను తీర్చారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పటినుంచి నా ప్రపంచమంతా బాబానే. ఆయన ప్రతిరోజూ,  ప్రతిక్షణం నా ప్రక్కన ఉండి నన్ను నడిపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. పైన చెప్పిన అనుభవం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. "ధన్యవాదాలు బాబా".


2 comments:

  1. సాయి బాబా సాయి నా వంశీ అని అర్థం చేసుకునేలా చూడు సాయి తనని నన్ను మళ్ళీ కలుప్పు సాయిగా స్వీకరించి ఆ అమ్మాయి జీవితాంతం ఒంటరిగా ఉంటుంది దానికి అర్థం అయ్యేలా చూడు బాబా సాయి

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo