సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

వినాయక్ సీతారాం ముల్హేర్కర్


సాయిభక్తుడు వినాయక్ సీతారాం ముల్హేర్కర్ గారు తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు.

బాంద్రాలో ఉన్న థానే ఫారెస్ట్ డివిజన్ ఆఫీసులో నేను హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాను. ప్రతిరోజూ ఆఫీసుకు నేను ప్యాసెంజర్ రైలులో లోయర్ పరేల్ నుండి బాంద్రాకు వెళ్తుంటాను. బాంద్రాలోని నా స్నేహితులలో చాలామంది శిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకుంటూ ఉండేవారు. శిరిడీ నుండి వచ్చేటప్పుడు వారు 'ఊదీ ప్రసాదం', ఇంకా ఇతర వస్తువులూ తెస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు నాకు ఊదీ, ప్రసాదం యిస్తూ ఉండేవారు. కొంతమంది నా నుదిటి మీద ఊదీ రాస్తూ ఉండేవారు. నేను దానికి అభ్యంతరం చెప్పకపోయినా, కొంత అజ్ఞానం వల్ల, నా ఉద్దేశ్యం ప్రకారం నాకు వాటిలో నమ్మకం లేదని చెప్పేవాడిని. బాబా నుంచి పిలుపు వస్తే తప్ప నేను శిరిడీ వెళ్లదలచుకోలేదు. ఈవిధంగా చాలారోజులు గడిచాయి. అనేకమంది భక్తులు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని వర్ణించ శక్యంకాని ఆయన లీలలను చెప్పసాగారు. తత్ఫలితంగా ముంబై, బాంద్రా, వాషీ, విరార్, ఆగాషి, దహను, ఉంబర్గావ్ నుంచి కూడా ప్రజలు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవడం ప్రారంభించారు. కాని నేను మాత్రం బాబా ప్రేరణ ఇస్తే తప్ప శిరిడీ వెళ్ళకూడదనే నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను.

ఇలా కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు నా పనులన్నీ పూర్తయిన తరువాత నిద్రకు ఉపక్రమించాను. మరుసటిరోజు గురువారం. ఆరోజు వేకువఝామున నాకొక చెప్పనలవికాని దివ్యదర్శనం కలిగింది. బాబాను దర్శించుకోవాలనే భావం కలిగి నిద్ర నుండి మేలుకొన్నాను. ఉదయాన్నే టీ త్రాగి 8గంటలకల్లా ఆఫీసుకు బయలుదేరాను. కొన్ని ముఖ్యమైన కాగితాల మీద బాస్ సంతకాలు తీసుకొన్నాను. తరువాత నేనాయనని, శిరిడీ వెడుతున్నాననీ, సెలవు కావాలని అడిగాను. వెంటనే ఆయన అందుకు ఒప్పుకొని, "సరే! శిరిడీ వెళ్ళడానికి కాబట్టి నీకు 3,4 రోజులు సెలవు ఇస్తాను. నేను కూడా నాసిక్ లో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. మనిద్దరం ఒకే రైలులో వెళదాము" అన్నారు.

నేను 11 గంటలకల్లా ఇంటికి వచ్చి నా భార్యతో, "ఈరోజు బాబా నుంచి శిరిడీకి రమ్మనమని పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం రైలుకు బయలుదేరుతున్నాన"ని చెప్పాను. ఆమె వెంటనే ఒప్పుకొంది, కానీ కాస్త భయపడింది. కారణం శిరిడీ చాలా దూరం, పైగా అది కొత్త ప్రదేశం, తెలిసిన వాళ్ళెవరూ ఉండరు. అందుచేత ఎవరినైనా తోడు తీసుకొని వెళితే మంచిదని, పైగా చలికాలమని చెప్పింది. తను చెప్పిన కారణాలన్నీ సరైనవే. అయినప్పటికీ శిరిడీ వెళ్ళాలనే నా కోరికముందు ఈ విషయాలేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. గురువారం ఉపవాసం ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, స్టేషనుకి బయలుదేరాను. ఉదయానికల్లా కోపర్గాఁవ్ చేరుకొన్నాను. రైలు దిగగానే శిరిడీ వెళ్ళడానికి టాంగా కోసం చూస్తూ ఉండగా నా చిన్ననాటి మిత్రుడు డా.ఆర్.ఆర్.చౌబాల్ కనిపించారు. ఆయన కూడా అదే రైలులో వచ్చారు. నాలాగే ఆయన కూడా బాబాని దర్శించుకుందామని శిరిడీ వస్తున్నారు. మా యిద్దరి కోరికలు ఒకటే అవడంతో మా యిద్దరికీ ఎంతో సంతోషం కలిగింది. మేమెక్కిన టాంగా గోదావరి ఒడ్డుకు చేరగానే, నా బాల్యమిత్రుడు శ్రీగజానన్ కనేకర్ కి మా రాక తెలిసి, మమ్మల్ని అతిథులుగా తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపించాడు. టాంగా ఇంటికి చేరగానే ఎంతో సంతోషించి మా సామానంతా దింపించి తన యింటిలో ఉండమని మాకు ఆతిథ్యం ఇచ్చాడు. కాస్త ఫలహారాలు కానిచ్చి, టీ త్రాగి, ఇక ఎక్కువసేపు ఉండలేమనీ, హారతి సమయానికి బాబా దర్శనం చేసుకోవాలని చెప్పి బయలుదేరాము.

మేమిద్దరమూ కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో బస చేసి కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కలుసుకొన్నాము. ఆయన మాకు అన్ని ఏర్పాట్లు చేశారు. తరువాత మేము హారతికి వెళ్ళాము. బాబా దర్శనమవ్వగానే నాకెంతో బ్రహ్మానందం కలిగింది. వర్ణించనలవికాని ఉద్వేగభరితమైన ఆనందమది. అటువంటి ఆనందం అంతకుముందెప్పుడూ నాకనుభవం కాలేదు. బాబా పాదాలను స్పృశించడానికి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాను. "నువ్వు శిరిడీ రావడానికి నా ప్రేరణ కావలసి వచ్చింది, అవునా?" అని బాబా అనగానే నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నా మనసులో అదే ఆలోచన తిరుగుతూ ఉంది. ఆయన సర్వాంతర్యామి. ఆయన సర్వశక్తిమత్వాన్ని తెలుసుకొని మరొకసారి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా తన కన్నులతోనే నన్ను దీవించి దగ్గరకు తీసుకొని లాలనగా బుజ్జగించి నన్ను పైకి లెమ్మన్నారు. డా.చౌబాల్ కూడా అప్పుడే బాబా దర్శనం చేసుకొన్నారు.

తరువాత మేమిద్దరమూ ఇక పూనా వెళ్ళబోయే ముందు బాబా వద్ద సెలవు తీసుకోవడానికి ఆయన దర్శనానికి వెళ్ళాము. బాబా, "నా భక్తుడొకడు బాంద్రాలో నీ దగ్గర వైద్యం చేయించుకొంటున్నాడు. అతని జ్వరం తగ్గి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడా?" అని డాక్టర్ ని అడిగారు. బాబాకు చౌబాల్ గురించి తెలియదు. ఆయన డాక్టర్ అని గాని, ఆయన బాంద్రాలో ప్రాక్టీస్ చేస్తున్నారని గాని ఎవరూ పరిచయం చేయలేదు. అయినా గాని బాబా తన భక్తుడికెలా ఉందని ఆయనను అడిగారు. డా.చౌబాల్ చాలా ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో బాబా భగవంతుని అవతారమేనని మా నమ్మకం ఇంకా బలపడింది.

బాబాతో మాకదే మొదటి పరిచయం. ఇది కేవలం బాబా తన భక్తుల క్షేమం కోసం ఎంతగా కనిపెట్టుకొని ఉంటారన్నదానికి ఋజువు. బాబా ఎదుటివారి మనసులలోని భావాలను చదువగలరు. వారి మనసులో ఉన్నది తాను గ్రహించగలననే సూచనలు కూడా చేసేవారు. నా శిరిడీ యాత్రకు నా భార్య వెలిబుచ్చిన సందేహాలు సహేతుకమే అయినప్పటికీ, బాబా దర్శనానికి నా యాత్రలో ఎటువంటి చిక్కులూ ఏర్పడలేదు.

రెండవ అనుభవం:

నేను శిరిడీ చాలాసార్లు వెళ్ళడం వల్ల, కుటుంబమంతా ఒక్కసారైనా శిరిడీ వెళదామని నా భార్య అనడం మొదలుపెట్టింది. ఒకసారి నా కుటుంబంతో సహా శిరిడీ వెళ్లి, మేమందరమూ బాబా దర్శనానికి వెళ్ళాము. భక్తులందరూ బాబా సమక్షంలో కూర్చొని ఉన్నారు. నా భార్య కూడా అక్కడ ఉన్న ఆడవారి మధ్యలో కూర్చుంది. కుటుంబ జీవితంలో జరిగే విషయాలన్నీ బాబా వివరించి చెపుతున్నప్పుడు, బాబా వివరించేదంతా తన జీవితం గురించేనన్న విషయం నా భార్యకు అర్ధమై చెప్పలేని ఆనందాన్ననుభవించింది. ప్రతీవారు ఎలా నడచుకోవాలో బాబా అందరికీ వివరించి చెప్పారు. తరువాత నా భార్య బాబాకు ఎంత భక్తురాలిగా మారిందంటే, "బాబాని అడగండి, ఆయన ఎలా చెపితే అలా చేయండి" అని అనడం ప్రారంభించింది. అందుచేత ఒకసారి నేను నా కుమార్తె వివాహం గురించి బాబాని అడిగాను. "నీ నిర్ణయం సరియైనదే. అనుకున్న ప్రకారమే వివాహం జరుగుతుంది. అమ్మాయి కలకాలం సుఖంగా ఉంటుంది" అన్నారు బాబా. అనుకున్న ప్రకారమే అమ్మాయి వివాహం అనుకున్న అబ్బాయితోనే జరిగి సుఖంగా సంసారం చేసుకొంటోంది. బాబా, నా భార్య శిరసుపై చేయి ఉంచి ఆశీర్వదించారు. నా భార్య ఆ సంఘటనని స్పష్టంగా ఎప్పుడూ గుర్తుచేసుకొంటూ ఉంటుంది.

మూడవ అనుభవం:

నేనొకసారి పండరీపూర్ లో పాండురంగని దర్శించుకొని అక్కడి నుండి శిరిడీ వెళ్ళాను. పండరీపూర్ లో మహాద్వారం వద్ద ఒక మిఠాయి దుకాణం ఉంది. "నేను శిరిడీ సాయి దర్శనానికి వెళుతున్నాను, నీ దగ్గర మంచిరకం పాలకోవా పావుసేరు ఇమ్మ"ని షాపతనిని అడిగాను. అతను నాకు మంచి పాలకోవా ప్యాక్ చేసి యిచ్చాడు. మరునాడు నేను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నాను. అప్పుడు బాబా, "ఈ పేడాలు పండరీపూర్ నించి నాకోసం తెచ్చావు కదా?" అన్నారు. "అవును బాబా, ఈ పాలకోవా మీకోసమే తెచ్చాను. మీరు వీటిని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండ"ని ప్రార్థించాను. "మంచిది, వీటిని నాకోసం తెచ్చావు" అని అంటూ రెండు పేడాలు తీసుకొన్నారు. మిగిలినవి నాకు తిరిగి యిస్తూ "శ్రీపాండురంగని ప్రసాదం" అన్నారు. ఆ పేడాలు పండరీపూర్ నుండి తెచ్చానని బాబా చెప్పడంతో ఆయన సర్వాంతర్యామి అని, ఆయన భక్తుల మదిలోని కోరికలను తీరుస్తారని నాకనుభవమయింది. ఈ అనుభవంతో బాబా దివ్యస్వరూపం, ఆయన గురించిన ఆలోచనలు నాలో భక్తి భావాన్ని రోజురోజుకీ పెంచసాగాయి.

నాల్గవ అనుభవం:

బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంది. 2-4 నెలలకు ఒకసారి నేను శిరిడీ వెడుతున్నా నా ప్రయాణంలో ఎప్పుడూ ఎటువంటి అడ్దంకులూ ఎదురవలేదు. ఒకసారి నేను కీ.శే. శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ తో కలసి శిరిడీ వెళ్ళాను. కోపర్గాఁవ్ లో దిగి గోదావరి నదిలో స్నానాదికాలు కానిచ్చాము. అక్కడ మేము నానాసాహెబ్ గారి బ్రాహ్మణుడు తయారుచేసి యిచ్చిన టీ త్రాగాము. నానాసాహెబ్ తనతో 5 శేర్ల పాలు తీసుకొని వచ్చారు. అక్కడ ముంబాయి నుండి వచ్చిన యాత్రికులు చాలామంది ఉన్నారు. వారు కూడా గోదావరిలో స్నానాలు చేసి తమ వారందరికీ టీ యిప్పించే పనిలో మునిగిపోయారు. ఈలోగా నానాసాహెబ్ అక్కడ వున్న పిల్లలందరికీ పాలు ఇప్పించడం ప్రారంభించగానే అక్కడున్న స్త్రీలు, పిల్లలు అందరూ కలసి చేసే హడావిడితో అంతా ఒక రణరంగంగా తయారయింది. నేను నానాసాహెబ్ గారి టాంగాలో కూర్చొని, ఆయన కూడా వచ్చి కూర్చోగానే బయలుదేరడానికి వేచి చూస్తున్నాను. నేను అక్కడ ఉన్న వారితో, "ఆయనకు యిబ్బంది కలిగించకండి. ఆయన సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన శిరిడీ సాయిబాబాకు పక్కా భక్తుడు" అన్నాను.

తరువాత మేమిద్దరమూ ఆరతి సమయానికి టాంగాలో శిరిడీ చేరుకొన్నాము. ఆరతి పూర్తయిన తరువాత మేము బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాము. బాబా నావైపు చూసి, "అయితే నానాసాహెబ్ పక్కా భక్తుడన్నమాట. మరి నీ సంగతేమిటి? నువ్వు కచ్చా భక్తుడివా?" అన్నారు. గోదావరి నది ఒడ్దున అక్కడి యాత్రికులతో నేనన్న మాటలు గుర్తుకువచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి విషయంలోనూ బాబా తాను సర్వాంతర్యామినని, అందరి హృదయాలలోనూ తాను నివసిస్తున్నాననే అనుభవాలను కలిగిస్తూ వుంటారు. బాబా సర్వవ్యాపకత్వాన్ని స్పష్టంగా తెలియచేసింది ఈ సంఘటన. తన భక్తులందరూ అహంకారరహితులుగా, ఎటువంటి దర్పం లేకుండా జీవితాన్ని గడిపేలా ఉండటంకోసం తనలోని అపారమయిన జ్ఞానాన్ని తన భక్తులకు పంచిపెట్టారు బాబా. సంత్ రామదేవ్ విష్ణుమూర్తిని ఆయన భక్తులందరూ అహంకారరహితులుగా ఉండేలా అనుగ్రహించమని ఏవిధంగా ప్రార్ధించాడో, అదేవిధంగా న్యాయబధ్ధమయిన జీవితం గడిపేలాగా బాబా తన భక్తులకు ప్రేమతో కథలను చెప్పేవారు.

ఈరోజు వరకు నేను శ్రీసాయిబాబా దీవెనలను అనుభవిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సంత్ తుకారాం చెప్పినట్లు "సాధుపుంగవుల చరణాలను ఒక్కసారి తాకితే చాలు, అహంకారమనే బీజం మాడిమసయిపోతుంది. సాధువుల పాదాల వద్ద మనం నమ్మకముంచాలి". సంత్ తుకారాం రచించిన అభంగాలలో ఈవిధంగా చెప్పారు: "చేతులు, పాదాలు, గంధపుచెక్కతో తయారుకాబడినా శరీరంలోని ఏ భాగమూ కూడా వానికంటే తక్కువ కాదు. దీపానికి లోపల, బయట చీకటనేది ఉండదు. చక్కెరకు లోపల బయటా కూడా తియ్యదనమే ఉంటుంది. ఆవిధంగానే ఒక మంచివ్యక్తిలో ఎటువంటి లోపాలు ఉండవు" అని.

- వినాయక్ సీతారాం ముల్హేర్కర్,
8/A, కాకడ్ ఎస్టేట్,
106, సీ ఫేస్ రోడ్,
వర్లీ, ముంబాయి - 400018.

ఆంగ్లానువాదం : జ్యోతిరాజా రౌత్.

source: 'సాయిలీల' పత్రిక నవంబరు - డిసెంబరు 2007

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo