శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ముందు భాగం కోసం ఈ అక్షరాలపై క్లిక్ చేయండి...
నిన్నటి తరువాయి భాగం....
తరువాత అదేరోజు అంటే 3వ తేదీ సాయంత్రం ద్వారకామాయి ఎదురుగా ఉన్న లైన్ లో టీ త్రాగుతున్నాము. దానికి ఎదురుగా బ్రెడ్ బజ్జీలు అమ్మే షాప్ ఉంది. అక్కడ బ్రెడ్ బజ్జీ చాలా బాగుంటుందని, మా ఫ్రెండ్ "రేపు రాత్రికి మనమంతా టిఫిన్ చేయాలి కదా! బ్రెడ్ బజ్జీ తీసుకుందాం" అన్నాడు. మేము కూడా సరే అనుకున్నాము. మాలో ఒక ఫ్రెండ్ అంతవరకూ ఎప్పుడూ పల్లకి ఉత్సవం చూడలేదు. మరుసటిరోజు గురువారం కావడంతో పల్లకి ఉత్సవం చూద్దామని కూడా అనుకున్నాము.
తరువాత మేము ఖండోబా ఆలయానికి వెళ్ళాము. అక్కడ జరిగిన ఒక విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండగలుగుతారు. అక్కడ మేము, మాతోపాటు మరికొందరు సాయిభక్తులు ఖండోబా దర్శనం చేసుకుంటూ ఉండగా ఒకతను వచ్చి సాయిబాబా, మహల్సాపతి గురించి చెప్తానని మొదలుపెట్టాడు. సరే ఏమి చెప్తాడో చూద్దామనుకున్నాము. అతడు చాంద్ పాటిల్ పెళ్లిబృందంతో బాబా శిరిడీ వస్తే మహల్సాపతి బాబాకు 'సాయి' అని నామకరణం చేయడంతో మొదలుపెట్టాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ తరువాత చెప్పినది ఎంత అసంబద్ధమైన కథనమంటే, "బాబాకి శిరిడీ వచ్చేటప్పటికి ఏ శక్తులూ లేవని, అక్కడ ఖండోబాను మూడు సంవత్సరాలు సేవించి శక్తులు పొందార"ని కట్టుకథ అల్లుతూ పోయాడు. చివరకు సముద్రంలో దొరికిన మూలికలు, గవ్వలు, శంఖం లాంటివి ఒక చిన్న దండలా కట్టి వాటిని ఆ టెంపుల్ లో ఏదో పూజ చేసి ఇస్తామని, దానిని మీ ఇంటి ద్వారానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని, దాని వెల 500 రూపాయలని చెప్పాడు. బాబా నుండి తన భక్తులకు లభించే రక్షణ ఎటువంటిందో తెలిసిన మనం ఇటువంటి ప్రలోభాలకు లోను కావడం ఎంత అవివేకం! ఇంతేకాదు, శిరిడీ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక టెంపుల్ ఉంది. అక్కడి దేవుడు శిరిడీ క్షేత్రపాలకుడని, ముందు ఆయన్ని దర్శించుకోవాలని కథనాలు కూడా వినబడుతున్నాయి. పరిశీలిస్తే ఆ టెంపుల్ కట్టింది, అక్కడి దేవుడిని ప్రతిష్ఠించింది 2000 - 2010 మధ్యలో. ఈ చెప్పే కథలకి, బాబా చరిత్రకు ఎటువంటి పొంతన లేదు. సాయిచరిత్రపై ఏదో కొంత అవగాహన ఉన్నవాళ్లు ఇటువంటి వాటిని గ్రహిస్తారుగాని, తెలియని వాళ్ళ పరిస్థితి మీరే ఊహించండి. ఇటువంటి కట్టుకథలు నమ్మడమేల? మరికొందరు గురువులమని, శిరిడీలో అన్నదానం చేస్తున్నామని బోర్డు పెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఆ పెద్దమనిషి ఆశీస్సులు తీసుకోమని, డొనేషన్స్ కట్టమని చెప్తున్నారు. బాబా వంటి మహాత్ముని ఆశ్రయించిన మనం వేరే వాళ్ళ ముందు ఆశీస్సులకోసం శిరస్సు వంచవలసిన అగత్యమేమిటి? అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? శిరిడీ క్షేత్రంలో బాబా సమక్షంలో ఇటువంటివి జరగడం కడు శోచనీయం. నా మనసుకెంతో బాధ కలిగించిన పై వివరాలు చెప్పి ఎవరినీ నొప్పించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తెలియక ఎవరి భావాలనైనా నొప్పించి ఉంటే మన్నించండి. సాయిబంధువులు కాస్త వివేకంతో అలోచించి ఎవరికి వాళ్లే నిర్ణయించుకొని మాయలో పడకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో మాత్రమే ఇదంతా మీకు తెలియజేశాను.
బహుశా పైన చెప్పినటువంటి సంఘటనలనే ప్రస్తావిస్తూ సాయిభక్తులకు ప్రామాణికమైన 'శ్రీ సాయి సచ్చరిత్ర' గ్రంథంలో క్రింది విధంగా ఉంది.
బహుశా పైన చెప్పినటువంటి సంఘటనలనే ప్రస్తావిస్తూ సాయిభక్తులకు ప్రామాణికమైన 'శ్రీ సాయి సచ్చరిత్ర' గ్రంథంలో క్రింది విధంగా ఉంది.
ముంబాయి, పూణే, గుజరాత్, కలకత్తా, మద్రాసు మొదలగు శిరిడీ నుండి చాలా దూరంగా ఉన్న ప్రదేశాలలో శ్రీ సాయి మహారాజు యొక్క ఉత్సవాలను శోభాయమానంగా జరుపుతారు. అట్లే అనేక ప్రాంతాల నుండి అసంఖ్యాకంగా ప్రజలు సాయిబాబా సమాధిని దర్శించుకోవటానికి ప్రతిరోజు శిరిడీకి వస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన ఇవ్వాలనిపిస్తుంది. "నేను శ్రీవారి శిష్యుణ్ణి, బాబా నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతారు, మీకోసం ఫలానా సందేశాన్నిచ్చారు, మీ మాటలు నేను బాబాతో చెప్తాను, మీ పని త్వరగా అవుతుంది" మొదలగు పెత్తనందారి(దాదాగిరి) మాటలు అక్కడక్కడా చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు, ప్రత్యక్షంగా శిరిడీలో కూడా అటువంటి వారున్నారు. - ఇటువంటి ప్రచారం శిరిడీకి మొదటిసారిగా వచ్చిన గృహస్థులకు శిరిడీ గురించి విశేషంగా తెలియక పోవటంవలన ఇటువంటి పెత్తనందారుల మాటలలో చిక్కుకోవటం సంభవిస్తుంది. శ్రీ సాయిబాబా ప్రత్యక్ష పరమేశ్వరులు కనుక మనసుతో ప్రార్థన చేస్తే అది వారికి అందుతుంది. దానికోసం మధ్యవర్తుల అవసరంలేదు. శ్రీ సాయిబాబా యొక్క వేలమంది భక్తులకు ఇది అనుభవం. వారి సమాధి దర్శనం, వారి స్మరణ, మననం, ధ్యానం వగైరా చేస్తే ఈ అనుభవం ఖచ్చితంగా కలుగుతుంది. శ్రీ సాయిబాబా కాలంలో కూడా ఇటువంటి మోసగాళ్లు అక్కడికి వచ్చి బాగా అవమానపడి వెనుతిరిగి వెళ్లేవారు.
- శ్రీ సాయి స్చచరిత్ర(నాగేశ్ ఆత్మారాం సావంత్ గారు వ్రాసిన రెండు మాటలు).
- శ్రీ సాయి స్చచరిత్ర(నాగేశ్ ఆత్మారాం సావంత్ గారు వ్రాసిన రెండు మాటలు).
🕉 sai Ram
ReplyDelete