శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ సాయిరామ్. నేను భువనేశ్వర్ నుండి మాధవి. బాబా చేసిన మరో లీలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. "అన్ని లీలలూ ఈమెకే జరుగుతాయా?" అని అనుకోకండి. ఆయన భక్తులందరికీ ఎన్నెన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మనమంతా ఆయన బిడ్డలం. ఆయనకు మనం అందరం సమానమే. సాయి గాయత్రి మంత్ర మహత్యం గురించి ప్రజలకి తెలియజేయడానికి నేనున్న సంబల్పూరుకు దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళినప్పుడు జరిగిన అనుభవమిది. ఆ గ్రామంలో అందరూ తెలుగువాళ్లే. ఒక అయిదు, ఆరు గ్రామాల వాళ్ళు కలిసి ఒక పెద్ద సాయిబాబా మందిరం కట్టించుకొని భక్తిశ్రద్ధలతో బాబాను ఆరాధించుకుంటున్నారు. ఆ మందిరంలో ఉన్న బాబాకి చాలా మహిమలు ఉన్నాయని ఇక్కడ ప్రసిద్ధి. అక్టోబర్ 7వ తేదీన సంజయ్ సత్పతి అనే ఒక ప్రొఫెసర్ 'గురుభాగవతం' గురించి చెప్పడానికి ఆ మందిరానికి వచ్చారు. అది వినడానికి మన తెలుగువాళ్ళందరూ వచ్చారు. చాలామంది భక్తులు ఒకచోట చేరడంతో సాయి గాయత్రి గురించి చెప్పడానికి అది మంచి సమయమని నన్ను కూడా ఆహ్వానించడంతో నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ సంజయ్ సత్పతి గారిని కలిశాను. మేము 15 సంవత్సరాల క్రిందట భువనేశ్వర్ దూరదర్శన్ లో కలిసి ఒక ప్రోగ్రాం చేసాము. బాబా సమక్షంలో మా ఇరువురి మధ్య కుశల సమాచారాలు అయినాక అతను నాకొక తెలుగు పుస్తకం బహుమతిగా ఇచ్చారు. "ఈయన ఒరియా అతను కదా! తెలుగు పుస్తకం ఇవ్వడమేమిటి?" అని నాకు సందేహం వచ్చి, అదేమాట అతనిని అడిగాను. అప్పుడు అతను, "ఇది తెలుగు పుస్తకమని కూడా నాకు తెలీదు. చాలారోజుల క్రిందట ఎవరో నాకు బహుమతిగా ఇచ్చారు. అప్పటినుండి ఇది నా దగ్గరే ఉంది. ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వాలనిపించలేదు. ఇప్పుడు ఎందుకో నీకు ఇవ్వాలనిపించింది" అన్నారు. చూడండి! అక్కడ అందరూ తెలుగువాళ్లే. ఆ పుస్తకం నాకే ఇవ్వాలనిపించింది అతనికి. ఆ పుస్తకం అతని దగ్గర పదినెలల నుంచి ఉందంట. ఈ పదినెలలలో ఆయన ఎంతోమంది తెలుగువాళ్ళను కలిసారట కానీ, ఎవ్వరికీ ఇవ్వాలని అనిపించలేదు. అసలు ఆ పుస్తకం గుర్తు కూడా రాలేదంట. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఆ పుస్తకం "చింతపల్లి శ్రీసాయి సన్నిధి"కి సంబంధించినది. నాకు ఆ చింతపల్లి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఈ బాబానే 'శిరిడీసాయి' సినిమాలో "అమరారామ సుమారామ చరీ" అనే అభిషేకం పాటలో చూపించారు. చాలా చక్కటి పాట అది. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆ పాట. నేను మా ఇంట్లో నవగురువార వ్రతం చేసుకుంటూ ఆ పాట పెట్టుకొనే బాబాకు అభిషేకం చేస్తూ ఉంటాను. 108 వారాలు వ్రతం చేయాలన్న సంకల్పంతో గత 103 వారాలుగా వ్రతం చేస్తున్నాను. ఆ మందిరం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉండేది కానీ, అంతదూరం వెళ్లలేక నాకది సాధ్యపడలేదు. అలాంటిదిప్పుడు అనూహ్యమైన రీతిలో చింతపల్లి బాబాకు సంబంధించిన పుస్తకం నా చేతికే అందేలా చేసారు బాబా. భక్తుల మనస్సులో ఉండే కోరికలు తీర్చడానికి బాబా ఎంతటి లీలనైనా చేస్తుంటారు. అది ఆయనకు తన భక్తులపై ఉండే ప్రేమ. అసలు ఆ ఒరియా ఆయన రావడం, నేను ఆ మందిరానికి అదే సమయంలో వెళ్లడం, ఆయన చేతుల మీదుగా నాకు ఇష్టమైన పుస్తకం నాకు చేరడం - ఇదంతా బాబా లీల కాక మరేమిటి? ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరిలో ఉన్న మందిరంలో బాబా ఎంత లీల చేశారో చూడండి. తరువాత నేను సాయి గాయత్రి మహామంత్రం గురించి అక్కడి వాళ్లందరికీ తెలియజేశాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. అక్కడ ఎవరిని పలకరించినా బాబా లీలల గురించే చెప్తున్నారు. అంతలా బాబా ప్రేమలో తడిసి ముద్దవుతున్నారు అక్కడి ప్రజలు. ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది, "సాధన" అనే పరమపదసోపానంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళాను అని. మీరు కూడా ఈ సాయి గాయత్రి జపయజ్ఞంలో భాగస్వాములు కండి. ఆ సాయినాథుని కృపాకటాక్షాలను పొందండి.
ఓం సాయిరాం!
🕉 sai Ram
ReplyDelete