సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు శ్రీ రావుసాహెబ్ వి.పి.అయ్యర్.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
శ్రద్ధ  -  సబూరి

శ్రీరావుసాహెబ్ వి.పి.అయ్యర్ సాయిబాబాకు గొప్పభక్తుడు. అతడు చక్కెరకి సంబంధించిన సాంకేతిక నిపుణుడు. అతనికి అనేక చక్కెర కర్మాగారాలలో పనిచేసిన అనుభవముంది. అతని భార్య శ్రీమతి హీరాబాయి అయ్యర్. తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు వారు లక్నోలో స్థిరపడ్డారు. అయ్యర్ తను చేస్తున్న పనికి సంబంధించిన ఒప్పందం ముగిసిన తరువాత మళ్ళీ ఇంకొక చక్కెర కర్మాగారంలో ఉద్యోగం వచ్చేవరకు లక్నోలో ఉంటుండేవాడు. 1943-44 చక్కెర సీజన్లో అతనికి ఉద్యోగం లేకపోవడంతో లక్నోలో ఉన్నాడు. బాబాపై అతనికి ఉన్న పూర్తి నమ్మకం కారణంగా ఉద్యోగం లేకపోయినా దిగులుపడకుండా, బాబా తనకు ఏది ఉత్తమమో అది చేస్తారని, కనుక తాను ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్తుండేవాడు. పైగా ఉద్యోగం లేని కారణంగా తనకిప్పుడు సాయిబాబాను ప్రార్థించుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం దొరికిందని చాలా సంతోషించేవాడు. అంతటి స్థిరమైన భక్తివిశ్వాసాలు గలవాడతను. భోజనం చేసేముందు ఆహారాన్ని బాబాకు సమర్పించడం అతనికి అలవాటు. వివిధరకాల వంటకాలు, పచ్చి ఉల్లిపాయలు మరియు సలాడ్‌లతో సహా అన్నీ పళ్లెంలో వడ్డించి బాబాకు నైవేద్యంగా సమర్పించి, కొన్ని నిమిషాలపాటు కళ్ళు మూసుకుని, తర్వాత తినడం ప్రారంభించేవాడు. ఒకసారి ఎవరో 'పచ్చి ఉల్లిపాయలు పెట్టకూడద'ని చెప్పినప్పుడు, "బాబాకు ఉల్లిపాయలంటే చాలా ఇష్టం. అందుకే నేను వాటిని బాబాకు సమర్పిస్తున్నాన"ని బదులిచ్చాడు.

1944 నవంబరులో అతనికి కోపర్గాఁవ్ సమీపంలో లక్ష్మీవాడి వద్ద ‘లక్ష్మీవాడి షుగర్ మిల్స్’లో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది. అతను ఆ అపాయింట్‌మెంట్ లెటర్ చూస్తూనే, "బాబా అనుగ్రహం చాలా గొప్పది, ఆయన నన్ను తన దగ్గరకు పిలుచుకున్నారు" అని ఎగిరి గంతేసాడు. తరువాత ‘లక్ష్మీవాడి’ వెళ్లి ఉద్యోగవిధులలో చేరాడు. ఖాళీసమయం దొరికినప్పుడల్లా శిరిడీ వెళ్లిరావడానికి అవకాశం ఉన్నందువల్ల అతను ఎంతో ఆనందంగా ఉండేవాడు. తరచూ సాయంత్రం వేళల్లో శిరిడీ వెళ్లి, అర్థరాత్రి సమయంలో తిరిగి వస్తుండేవాడు. అతను బాబా సమాధి వద్ద నిల్చొని బాబాను ప్రార్థిస్తూ తనను తాను మర్చిపోయి అలాగే నిలబడి ఉండిపోయేవాడు. అలాంటి సందర్భాలలో అక్కడున్న భక్తులు, “ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక ఇంటికి తిరిగి వెళ్ళండ”ని గుర్తుచేస్తే, అతికష్టంమీద అతను మందిరం వదిలి ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. నిరంతరం బాబా సన్నిధిలో ఉండిపోవాలనేదే అతని ఏకైక కోరిక.

బాబా సన్నిధిలో ఉండాలనే అతని కోరిక ఎంత బలీయంగా ఉండేదంటే, అతను తన భార్యకు వ్రాసిన లేఖలలో, తనకు శిరిడీలోనే ఉండాలని ఉందనీ, శిరిడీ విడిచిపెట్టడం తనకు ఇష్టం లేదని వ్రాస్తుండేవాడు. అతని స్నేహితులు మాత్రం అతని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, "పిల్లలు పెద్దవారై, తమ కాళ్లపై తాము నిలబడేవరకైనా కుటుంబం కొరకు పనిచేస్తుండాలి” అని అతనికి సలహా ఇస్తుండేవారు. దానికి అతని జవాబు మాత్రం ఒక్కటే - “నాకు బాబాను విడిచి వెళ్లాలని లేదు, శిరిడీలోనే ఉండిపోవాలని ఉంది” అని. 1945, మే నెలలో చక్కెర సీజన్ అయిపోవడంతో అతని కాంట్రాక్టు పని ముగిసింది. అయ్యర్ ఒక నివేదిక తయారుచేసి, మే 26న ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమర్పించి, మే 27న కోపర్గాఁవ్ విడిచి లక్నో వెళ్ళాలని అనుకున్నాడు. ఆ సమయంలో తమ తండ్రితో కలిసి వేసవి సెలవుల్లో గడపడానికి అతని ఇద్దరు కుమారులు లక్ష్మీవాడికి వచ్చి ఉన్నారు.

26వ తేదీ సాయంత్రం అతను బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్ళాడు. అప్పట్లో మందిరం అంత పెద్దది కాదు.  సమాధిమందిరంలో సాయిబాబా సమాధి మాత్రమే ఉండేది. అప్పటికి ఇంకా సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించలేదు. అతను తన కళ్ళు మూసుకుని సమాధి ఎదుట ఒక స్తంభానికి సమీపంలో నిలబడి, కళ్ళనుండి ఆనందాశ్రువులు జాలువారుతుండగా తన చుట్టూ వున్న పరిసరాలను మరచి తన్మయత్వంలో మునిగిపోయాడు. కొంతమంది భక్తులు అతనితో మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ అతను స్పందించలేదు. సుమారు 9 గంటలకు అతను బాహ్యస్మృతిలోకి వచ్చాడు. అతను మందిరం వదలి వెళ్ళలేక వెళ్ళలేక ఇంటికి బయలుదేరాడు. అతనికి ధనవంతులు, పేదవారు అనే వ్యత్యాసం ఏమాత్రం ఉండేది కాదు. అందరూ అతనికి సమానమే. అతను శిరిడీ నుండి వెళ్తూ, తెలిసిన వారందరికీ వీడ్కోలు చెప్పాడు. అలా వీడ్కోలు చెప్తున్నప్పుడు అతనితోపాటు అందరూ కన్నీళ్లపర్యంతమయ్యారు. అతను సుమారు రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుని భోజనం చేసి పడుకున్నాడు. అర్థరాత్రి సుమారు 2 గంటల సమయంలో లేచి తన కుమారులను నిద్రలేపి, తనకు అనారోగ్యంగా ఉందని చెప్పాడు. వాళ్ళు పొరుగువారికి సమాచారం అందించి, తరువాత వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు వచ్చి పరీక్షించి, కలరావ్యాధిగా నిర్ధారించి ఔషధం ఇచ్చాడు. ఉదయానికల్లా అయ్యర్ చాలా బలహీనంగా తయారయ్యాడు. మధ్యాహ్నానికి అతడు స్పృహలేకుండా కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. కానీ మధ్యమధ్యలో అతడు కళ్ళు తెరిచి, ఎదురుగా గోడపై ఉన్న బాబా ఫోటోను చూస్తున్నాడు. అతని దృష్టి అంతా కేవలం బాబా మీదనే ఉన్నది. సాయంత్రం సుమారు 4.30 ప్రాంతంలో అతను కళ్ళు తెరచి తన దగ్గర నిలబడివున్న వ్యక్తికేసి చూడగా, ఆ వ్యక్తి దగ్గరగా వెళ్ళి “ఏమి కావాల”ని అడిగితే, గోడపై ఉన్న సాయిబాబా ఫోటో తనకి ఇవ్వమన్నట్లుగా సైగ చేశాడు. బాబా ఫోటోను తన దగ్గరకు తీసుకురాగానే, అతడు తన చేతులు చాచి, బాబా ఫోటోను తన హృదయంపై ఉంచమని కనుసైగలతో సూచించాడు. అలా అతను బాబా ఫోటోను గట్టిగా కౌగిలించుకొని, చిరునవ్వుతో "బాబా, సాయిబాబా, బాబా" అని బాబా నామాన్ని స్మరిస్తూ తన తుదిశ్వాసను విడిచాడు.

అయ్యర్ హఠాన్మరణం గురించి విన్న ప్రజలు తీవ్రదిగ్భ్రాంతి చెందారు. ముందురోజు రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న అయ్యర్, ఇప్పుడు తమ మధ్య లేనందుకు ఎంతో విచారించారు. అతనిపై గల ప్రేమతో, దూరాన్ని సైతం లెక్కచెయ్యకుండా, శిరిడీ నుండి పెద్దసంఖ్యలో ప్రజలు కాలినడకన అక్కడికి వచ్చారు.

ఆ సమయంలో లక్నోలో ఉన్న అతని భార్యకు అతని మరణవార్త టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఆమె తన భర్తను చివరిసారిగా చూడాలన్న కోరికతో వెంటనే బయలుదేరి, అతను మరణించిన నాలుగవరోజుకి లక్ష్మీవాడి చేరుకున్నది. అయ్యర్ భార్య లక్ష్మీవాడికి వచ్చినట్లు తెలుసుకుని, శిరిడీ ప్రజలలో చాలామంది అయ్యర్ గురించి ఆమెతో మాట్లాడుతూ ఆమెను ఓదార్చారు. అదేరోజు రాత్రి అయ్యర్ పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

వి.పి.అయ్యర్ మరణించిన తరువాత కూడా అతని భార్యాపిల్లల యోగక్షేమాలు బాబా చూసుకున్నారు. వారంతా చక్కగా విద్యాభ్యాసం చేసి జీవితంలో స్థిరపడ్డారు. అందరికీ వివాహాలు జరిగి పిల్లలు కలిగారు. వారంతా కూడా సాయిబాబా భక్తులే.

శిరిడీ ప్రజలు సంస్థాన్‌వారిని సంప్రదించి, అయ్యర్‌కు ఒక సమాధి నిర్మించమని కోరారు. దానికి సంస్థాన్‌వారు అంగీకరించి, అయ్యర్ అస్థికలను ఖననం చేసి, సమాధి నిర్మించి, దానిపై అయ్యర్ పేరు, జనన-మరణ వివరాలను పొందుపరిచారు. బాబా తన భక్తుని యొక్క ప్రార్థన మన్నించి, అతని కోరికను నెరవేర్చి, తన ప్రియమైన భక్తుని ఎప్పటికీ శాశ్వతంగా తమ చెంతనే ఉంచుకున్నారు. వి.పి.అయ్యర్ సమాధి నానావలి సమాధికి వెనుక లెండీగార్డెన్‌లో ఉంది.


5 comments:

  1. Even i got a chance,staying shirdi for 2-3 months,I felt so peaceful when doing pradakshinas in aarti time

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. ఓం శ్రీం సాయినాథాయ నమః

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo