సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు శిరిడీ వెళితే మేలు జరుగుతుంది




నేను ఒక సాయిభక్తురాలిని నేనిప్పుడు 2018లో బాబా నాకు ప్రసాదించిన గొప్ప అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఈరోజు వరకు బాబా నాకు ఇచ్చిన అతి పెద్ద అనుభవం ఇదే. గత ఏడాది(2017) నుండి మేం ఒక తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నాము. మా 4 సంవత్సరాల పాప ఆరోగ్యం స్థిరంగా ఉండేది కాదు. పుట్టుకతో తనకున్న జన్యు సమస్య తన ఉదరభాగంపై తీవ్రమైన ప్రభావం చూపింది. పుట్టిన ఏడాదిలోపే తనకి రెండు పెద్ద ఆపరేషన్స్ జరగడంతో తను మామూలుస్థితికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వయస్సుతోపాటు పెరగాల్సిన తన బరువు పెరగలేదు. చాలా సమస్యలతో పోరాడి ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కొంచెంగా స్థిరపడుతూ ఉంది.

2017 ఏప్రిల్ నుండి మా జీవితం అంధకారంలోకి తోసి వేయబడింది. మేము సాధారణ చెకప్ కోసం పాపని డాక్టరు వద్దకు తీసుకుని వెళితే పాపకి శరీరంలో రక్తం శాతం చాలా తక్కువగా ఉందని, అందువలన తనకి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని తెలిసింది. మేము రక్తమార్పిడి ఒక్కసారి చేస్తే సరిపోతుందేమో అనుకున్నాం. కానీ ప్రతి రెండు మూడునెలలకు ఒకసారి రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మాట వింటూనే నా గుండె పగిలినంత పనైంది. తీరా తనకి రక్తమార్పిడి చేశాక అధికంగా విరోచనాలై తన బరువు తగ్గిపోయి, బాగా నీరసించిపోయింది. చాలా సన్నగా, పాలిపోయినట్టుగా అయిపోయింది. ఆ స్థితిలో తనను చూడలేక విలవిలలాడిపోయాను. అసలు సమస్య అర్థమయ్యేది కాదు. అంత చిన్నవయసులో తనకి మేము ఎండోస్కోపీ మొదలైన అన్నిరకాల పరీక్షలు చేయించాం. మా అదృష్టం ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా వచ్చేవి. పెద్దగా ఆందోళన చెందే సమస్యలేవీ తనకి లేవు. కానీ తను మాత్రం ఆరోగ్యరీత్యా చాలా గడ్డుకాలం అనుభవించింది.

రక్తమార్పిడి, ఆ తరువాత వచ్చే ఇబ్బందులతో తను ఆటలు ఆడుకోవడం మానేసి, పూర్తిగా సంతోషాన్ని మరచిపోయింది. ఆ స్థితిలో తనని చూడలేక రోజూ ఎంత ఏడ్చేవాళ్ళమో మాకు, ఆ బాబాకే తెలుసు. ఇప్పుడిదంతా వ్రాస్తుంటే ఆనాడు మా ఇంట్లో నిశ్శబ్దం తాండవించిన ఆ దారుణమైన పరిస్థితి మదిలో మెదులుతూనే ఉంది. అప్పటికీ మేము చేయగలిగినదంతా చేసాము. ఎవరు ఏ డాక్టరు పేరు చెప్తే ఆ డాక్టరుని సంప్రదించేవాళ్ళం. వాళ్ళు చెప్పిన అన్ని పరీక్షలు చేయించి, వాళ్ళు చెప్పే అన్ని సూచనలు పాటించేవాళ్ళం. కానీ పాప పరిస్థితిలో ఏ మార్పూ వచ్చేది కాదు. చివరిగా డిసెంబర్ నెలలో ఒకరోజు హఠాత్తుగా మావారు, "రేపు మనం శిరిడీ వెళ్తున్నామ"ని చెప్పారు. ఆమాట విని నేను ముందు షాక్ అయ్యాను. ఎందుకంటే పాపని మేమున్న ఫ్లోర్ నుండి క్రిందకి తీసుకుపోడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాము. అలాంటిది తనని తీసుకుని శిరిడీవరకు వెళ్లడమంటే అది పెద్ద సాహసమే అనిపించింది నాకు. కానీ ఎలాగైనా పాపని శిరిడీ తీసుకుని వెళ్లడం చాలా అవసరం అనిపించింది. బాబా దర్శనంతో అయినా తన ఆరోగ్యం కుదుటపడుతుందని మా ఆశ. ఇంటినుండి బయలుదేరేటప్పుడు మేము ఒక్కటే అనుకున్నాం - శిరిడీ నేలపై అడుగుపెడితే చాలు అని. మేము ఎల్లప్పుడూ బాబా నామాన్ని స్మరిస్తూనే ఉంటాం. కానీ, మేమేదో పెద్ద పాపం చేసి ఉంటాం, ఆ కర్మనిలా అనుభవిస్తున్నాం. అంతకంటే ఎక్కువే మేము బాబాకి చేయవలసిన సమయం వచ్చిందని ప్రయాణానికి సిద్ధమయ్యాం. మేము పాప ఉన్న పరిస్థితిలో తనకి ట్రైన్‌లో ప్రయాణం అనుకూలం కాదని హైదరాబాదునుండి శిరిడీకి కారులోనే వెళ్ళాం. బాబా దర్శనం ఒకసారి చేసుకోగలిగాం. కానీ రద్దీ ఎక్కువగా ఉండటంవలన ద్వారకామాయిలోకి అడుగుపెట్టలేక భారమైన మనస్సుతో తిరిగి వచ్చేసాము. ఎందుకో తెలియదుగాని శిరిడీనుండి ఇంటికి చేరేసరికి నామీదనుండి పెద్ద భారం దిగిపోయినట్టు అనిపించింది.

బాబా దర్శనం చేసుకోవడం చాలా అవసరమనుకుని మేము శిరిడీ వెళ్లిరావడం మంచిదైంది. క్రమంగా పరిస్థితులలో మార్పు మొదలైంది. 2018, జనవరి 14న మేము పాపని వేరే డాక్టరుకి చూపించాం. ఆ డాక్టరు ఇచ్చిన మందులతో నిదానంగా పాప బరువు పెరగడం మొదలైంది. కానీ ఇంకా రక్తమార్పిడి మాత్రం జరుగుతూనే ఉంది. తనకి 'బోన్ మారో' పరీక్షలు, బయాప్సీ కూడా చేసారు. చివరిగా రిపోర్టుల్లో తనకి 'ఐరన్ లోపం' ఉందని తెలిసింది. అందువలనే తను అన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అది నయం చేయవచ్చని తెలిసి మేము అన్నాళ్ళు పడ్డ బాధనుండి విముక్తి పొందినట్లు అనిపించింది. కానీ అప్పుడు మేము అనుభవించిన బాధ మాత్రం వర్ణనాతీతం. మన తలరాతనెవరూ మార్చలేరు. కానీ బాబా మాతో ఉన్నారని ఈ అనుభవం ద్వారా మాకు తెలియజేసారు. బాబాకి సదా కృతజ్ఞులమై ఉంటాం. మా సమస్య ఇంకా పూర్తిగా తీరిపోలేదని నాకు తెలుసు, తన ఐరన్ లెవెల్స్ పెరిగేవరకు మేము ఈ బాధని అనుభవించాలి. అయినా గాని బాబా మాతో ఉన్నారు, ఆయన మాకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారు. బాబాకి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకైతే తెలియటంలేదు. మనస్ఫూర్తిగా ఆయనకి నా ప్రణామాలు.

సరైన సమయంలో సహాయం అందక సమస్యల వలయంలో చిక్కుకుని నలిగిపోయే నాలాంటివారు చాలామందే ఉంటారని నాకు తెలుసు. అందుకే నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నా బాధను మీకు చాలా తక్కువగానే చెప్పాను. నిజానికి మేము అనుభవించిన ఆవేదన మాటల్లో చెప్పలేను. నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, సహాయాన్ని అందించటానికి బాబా ఉన్నారు. కానీ మనమున్న స్థితిలో ఎలా అనిపిస్తుందంటే, బాబా మన మాటలు వినట్లేదని. కానీ అలా అనుకోవడం మన పొరపాటే. నిజానికి ఆయన చెప్పేది మనమే వినలేకపోతున్నాం. నేను చెప్పేది ఒక్కటే, మీరు ఏ స్థితిలో ఉన్నా, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు, వాటినుండి బయటపడటం సాధ్యంకానిపక్షంలో ఒక్కసారి శిరిడీ వెళ్ళిరండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. కళ్ళముందే మన బిడ్డపడే బాధ చూడడం కంటే దారుణం ఇంకోటి ఉండదు. మేము ఒక సమస్య తరువాత ఇంకో సమస్య అలా మాకు తెలియకుండానే ఒక వలయంలో చిక్కుకునిపోయి ఉన్నాం. కానీ మాకు పట్టిన పీడలన్నీ మేము శిరిడీ వెళ్ళగానే మమ్మల్ని విడిచి పెట్టాయి.

4 comments:

  1. Jai sairam ! Jai guru ramananandha!

    ReplyDelete
  2. Sadhguru sainatha...leelamaya...andarni challaga chudu thandri🙏🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo