సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీసాయిని సజీవంగా దర్శించిన సఖాజీ.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

1918లో మహాసమాధి చెందిన శ్రీసాయిబాబాను, వారు సజీవులై ఉండగా దర్శించుకున్న భక్తులు 1988 నాటికి ఎందరో ఉన్నారు. అప్పటికి సజీవులైవున్న ఆ తరం సాయిభక్తుల వద్ద - అందరివద్దా కాకపోయినా, కొందరివద్దనైనా - శ్రీసాయిచరిత్రకు సంబంధించి ఎన్నో అమూల్యమైన విశేషాలు లభించగలవన్న ఉద్దేశ్యంతో అత్యవసర ప్రాతిపదికపై, ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీసాయిచరిత్రను సమగ్రవంతం చేయాలన్న బృహత్తర కార్యక్రమాన్ని సాయిపథం చేపట్టింది. ఆ బృహత్తర ప్రణాళికలో భాగంగా సాయిపథం వారు చేసిన ఇంటర్వ్యూల నుండి ముందుగా సాయిపథం వాల్యూమ్-1 లో ప్రచురింపబడిన శ్రీసఖాజీ గారితో జరిపిన ఇంటర్వ్యూను ఈరోజు మీకు అందిస్తున్నాం.

శ్రీసాయిబాబా సజీవులై ఉన్నప్పుడు దర్శించిన శ్రీసఖాజీ పుణతంబాకు సుమారు 15, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సాయిఖేడ్ గంగ' అనే గ్రామంలో నివసించేవారు. ఈ పుణతంబా సమీపంలోనే బాబాను మొదటిరోజుల్లో దర్శించుకున్న మహాత్ముడు శ్రీగంగగిర్ మహరాజ్ ఆశ్రమం ఉంది. సాయిఖేడ్ గంగ చిన్న మారుమూల పల్లె. సాయిపథం బృందం ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి 1988 జనవరిలో వెళ్ళేటప్పటికి ఆయనకు సుమారు 95 సంవత్సరాల వయసుంటుంది. నిరక్షరాస్యుడు. వృత్తి వ్యవసాయం. కాయకష్టం చేసినందువల్ల కాబోలు అంత వయస్సులోనూ దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నారు. మరో రాష్ట్రంనుండి, అంతదూరం ఎంతో ప్రయాసతో శ్రీసాయిబాబా గురించి తెలుసుకోవడానికి వచ్చిన బృందాన్ని చూచి ఆయనెంతో ఆనందించారు. సుమారు రెండు గంటలసేపు అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ ఓపికగా సమాధానం చెప్పారు. ఎన్నో ప్రశ్నలకు - తనకు సమాధానం తెలియకపోతే - తెలియదనీ, గుర్తులేదనీ నిష్కపటంగా, నిజాయితీగా జవాబిచ్చారు. శ్రీసాయి చరిత్రకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాంశాలేవీ ఆ ఇంటర్వ్యూలో లభించలేదు గాని, శ్రీసఖాజీ తాము బాబాను దర్శించిన వైనాన్ని, తమ అనుభవాలను గూర్చి చెప్పిన దాని సారాంశం ఇది:

“నేను బాబాను మొదటిసారి దర్శించినప్పుడు చాలా చిన్నవాణ్ణి. 14, 15 సంవత్సరాల వయస్సుంటుందేమో! మా ఊర్లో చాలాకాలంగా వర్షాలు లేక పంటలు బొత్తిగా పాడైపోయినాయి. అప్పుడు మా ఊరినుండి కొంతమంది పెద్దలు శిరిడీ వెళ్ళారు - వర్షాలు కురవడానికి బాబా ఆశీస్సుల కోసం ప్రార్థించడానికి. నేనూ, మరికొంతమంది పిల్లలమూ వారితో పాటు శిరిడీ వెళ్ళాము. బాబాకు తమ కష్టసుఖాలు నివేదించుకుని కొంతమంది పెద్దలు తిరిగి మా ఊరు వెళ్ళారు. అక్కడ బాబా దగ్గర భోజనం వగైరాలకు ఇబ్బంది లేకపోవడంతో మాలో కొంతమందిమి అక్కడే ఉండిపోయాము. శిరిడీలో అప్పుడు రమారమి మూడునెలలపాటు ఉన్నాము. బాబా మసీదు (ద్వారకామాయి)కు ప్రక్కనే ఒక గుర్రపుశాల ఉండేది. నేను రాత్రిళ్ళు అందులోనే పడుకునేవాడిని. రోజంతా తోటి పిల్లలతో ఆటపాటలతో గడిచిపోయేది. అప్పట్లో ఆటపాటలే మా లోకంగా ఉండేది. కానీ, సాధన, వేదాంతంలాంటి విషయాలు మాకేమీ తెలియవు. బాబా చాలా గొప్పవాడనీ, ఎంతో మహిమగలవాడనీ మాత్రమే మాకు తెలుసుగానీ, ఆయన గురించి, ఆయన తత్త్వం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అప్పట్లో మా వయస్సు పిల్లలకెలా ఉంటుంది - చెప్పండి?"

"బాబాకు పిల్లలంటే భలే ఇష్టం. పిల్లలు కనిపిస్తే మిఠాయిలో, ఏదో ఒక తినుబండారమో పంచేవారు. ఒక్కోసారి జేబులో ఊరకే అలా చెయ్యిపెట్టి పిడికిళ్ళతో చిల్లర డబ్బులు మాపై విసిరేవారు. అంత చిల్లర ఆయన జేబులో ఉండే అవకాశం లేదు. బాబాకు ఆ డబ్బు దేవుడు ఇస్తాడని మేము అనుకునేవాళ్ళం. కొన్నిసార్లు అలా పేడా (పాలకోవా బిళ్ళలు) కూడా పంచేవారు".

"అలాంటి దివ్యశక్తులను చూస్తుంటే పిల్లలైన మీకు భయమేసేది కాదా?” అన్న ప్రశ్నకు సమాధానంగా, "మహారాష్ట్ర దేశంలో మహాత్ముల గురించి, వారి దివ్య మహిమల గురించి చాలా చిన్ననాటినుండి వింటుంటాము. కనుక మాకు ఎటువంటి భయము వేయదు” అన్నారు.

"ఆ తర్వాత ఏదైనా ముఖ్యమైన పండుగ రోజుల్లో జరిగే ఉత్సవాలకు శిరిడీ వెళ్తుండేవాడిని. అయితే, బాబా మహాసమాధి చెందినప్పుడు మాత్రం శిరిడీ వెళ్ళడానికి నాకు వీలుపడలేదు. నా దృష్టిలో బాబా అంటే భగవంతునితో సమానమే! ('బాబా భగవాన్ కే సమాన్ హై!')" అన్నారు సఖాజీ.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo