సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మనసులో ఉన్న నెలసరి 'అడ్డంకి'ని తొలగించిన బాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిబాబా తమ లీలల ద్వారా, ఆచరణ రూపంలో, చిన్న చిన్న కథల రూపంలో, సూత్రప్రాయమైన అలతి అలతి మాటలతో మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలు ప్రబోధించారు. అది వారి పద్దతి. అలా బాబా సూక్తులు రూపంలో సంక్షిప్తంగా చెప్పిన ఆధ్యాత్మిక సూత్రాలను, భగవాన్ శ్రీరమణమహర్షి వంటి పరిపూర్ణ జ్ఞానుల వివరణత్మకమైన బోధనల వెలుగులో వ్యాఖ్యానించుకొని సమన్వయం చేసుకుంటే - శ్రీసాయి బోధ ఇంకా సుబోధకమవుతుంది(సాయిపథం ప్రధమ సంపుటం).

ఈరోజు భక్తురాలి అనుభవం చదివేముందు ఈక్రింది భగవాన్ స్మృతులు పుస్తకంలోని సంపూర్ణమ్మ గారి అనుభవం చదవండి. ఆమె ఇలా చెప్తున్నారు.

ఆ రోజుల్లో ఆశ్రమంలో పనిచేసే ఆడవాళ్లం బైట వున్నప్పుడు ఆశ్రమంలో భోజనం చెయ్యం. ఆ వంటని అసలు తినం. ఎక్కడో ఎవరింట్లోనో ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఒకసారి నాకెక్కడా ఏర్పాటు కాలేదు. అందుకని ఆశ్రమం ముందున్న ముష్టివాళ్ళ మంటపంలో కూచున్నాను. తిండిలేదు. ఆశ్రమంనుంచి భోజనం పెట్టరు.

భగవాన్(రమణ మహర్షి) ఆవాళ ఎందుకు అడిగారో - ‘సంపూర్నం ఏది?' అని అడిగారట. వాళ్ళు విషయం చెప్పారు. ఆమెకి భోజనం పెట్టండి అన్నారట భగవాన్.
ఎదురు చెప్పలేక, “ఆ మండపంలో కూచుని వుంది. అన్నం తీసుకుపోయి పెడతాం" అన్నారు.
“ఆ మండపంలో ఏం ఖర్మ! రమ్మనండి” అన్నారు భగవాన్.
“మరి భగవాన్, బైటవుంది అది.”
“వుంటేనే? అంతా బ్రహ్మం! ముట్టేమిటి? రమ్మనండి.”
అట్లా భగవాన్ చెప్పినా, వాళ్ళకి మనసొప్పదు. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పినా, ఆచారాల్ని వొదులుకోరు. ఇంక గతిలేక నన్ను లోపలికి పిలిచారు. భగవాన్ వంటింటి వేపు వెడుతున్నారు.
"అక్కర్లేదు భగవాన్! మేము వడ్డిస్తాం.”
సరిగా వాళ్ళు పెడతారో లేదో అని భగవాన్ అక్కడే నుంచున్నారు, తనకి పట్టింపు లేకపోతే వాళ్ళకీ పట్టింపు ఉండనక్కర్లేదని వాళ్ళు తెలుసుకోవాలని. కాని, ఏం లాభం? ఆయన వీపు తిప్పగానే నా వల్ల అంత అనాచారం జరిగిందని పెద్దలందరికీ కోపాలు వొచ్చాయి నా మీద.

అంతే మనుషులు!

మనసులో ఉన్న నెలసరి 'అడ్డంకి'ని తొలగించిన బాబా

ఇక ఈరోజు అనుభవానికి వస్తే, పేరు వెల్లడించని ఒక సాయిబంధువు తనకుండే దిగులుకు బాబా ఎలా పరిష్కారం చూపారో ఇలా తెలియజేస్తున్నారు..

నాకెప్పుడూ ఒక దిగులుండేది, "ఆడవారికి నెలసరి ఉండకుండా ఉంటే బాబాని ప్రతిరోజూ పూజించుకోవచ్చు కదా!" అని. ఎప్పుడైనా బాబా ప్రత్యక్షమై, "నీకేం వరం కావాలి?" అని నన్నడిగితే, "నెలసరి అడ్డంకులు లేకుండా ప్రతిరోజూ మనసారా మీ పూజ చేసుకునే వరమివ్వండి బాబా!" అని అడగాలని అప్పుడప్పుడు అనుకునేదాన్ని. మన హృదయవాసి అయిన సాయికి మన మనసులోని అలోచనలన్నీ తెలుసుకదా! నా దిగులుకి ఆయనెలా పరిష్కారం చూపారో ఇప్పుడు నా అనుభవం ద్వారా పంచుకుంటాను.

2017 క్రిస్మస్ సెలవుల్లో శిరిడీ వెళదామని మా కుటుంబసభ్యులందరికీ మా తమ్ముడు టికెట్స్ బుక్ చేసాడు. కానీ ఆ సమయానికి శిరిడీలో రూమ్స్ దొరకని కారణంగా ఆ టికెట్స్ కాన్సిల్ చేసి మళ్ళీ 2018 జనవరి 26కి టికెట్స్ బుక్ చేసాడు. ఎంతో సంతోషంగా అందరం శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకున్నాము. ఆ దర్శనానందంలో కాసేపైనా గడపకముందే హఠాత్తుగా నాకు నెలసరి వచ్చేసింది! నిజానికి అది నా నెలసరి సమయం కాకపోయినప్పటికీ నన్ను ఆ సమస్య చుట్టుముట్టింది. ఇక నా బాధ చెప్పనలవి కాదు. మాములుగానే ఆ సమయంలో పూజ చేయలేకపోతున్నందుకు బాధపడే నేను, ఇక శిరిడీ క్షేత్రంలో, బాబా సన్నిధిలో అలా జరగడంతో ఇంకా క్రుంగిపోయాను. ఈ విషయం చెపితే మా వాళ్లు కూడా ఇబ్బందిపడతారు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడక వాళ్ళ టైం కూడా శిరిడీలో వృధా చేసుకుంటారు. నావలన అలా జరగడం నాకిష్టం లేదు. అందువలన ఎవరికీ చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో చెప్పమని నాకు తెలిసిన ఇద్దరు సాయిబంధువులని అడగాలనిపించింది కానీ, ఆడవారి సమస్య గురించి ఎలా వాళ్లతో మాట్లాడాలో అర్థంకాక ఊరుకున్నాను. నేను ఒకటే అనుకున్నాను, "బాబా! దీనిలో నా తప్పేముంది? నేనేదీ కావాలని చేయలేదు. నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించండి. భారం మీ మీదే వేస్తున్నాను. ఈ పరిస్థితిలో మీరే నాకు దారి చూపండి" అని. కానీ మనస్సు స్థిమితంగా ఉంటుందా? అదే ఆలోచనతో నాలో నేను బాధపడుతూనే ఉన్నాను. మరుసటిరోజు కాకడఆరతికి మేము టికెట్స్ బుక్ చేసి ఉన్నాము. తెల్లవారి 3.30కి లేవాలంటూ మా వాళ్ళందరూ నిద్రపోయారు. నేను మాత్రం ఏమి చేయాలో అర్థంకాక దిగులుపడుతూనే ఉన్నాను. ఈలోగా నాకు తెలిసిన పెద్దాయన ఫోన్ చేసారు. అసలు నేనే ఆయన్ని అడుగుదామని ఊరకుండిపోయాను. అలాంటిది నాకు సమాధానం చెప్పించడానికా అన్నట్లు బాబాయే ఆయనతో ఫోన్ చేయించారేమో! నేను ఆయనతో కాసేపు మాట్లాడిన తరువాత నాకొచ్చిన సమస్య గురించి చెప్పి, "ఇప్పుడేమి చేయమంటారు? నాకేమీ అర్థం కావడంలేదు" అని అడిగాను. అందుకు ఆయన, "అమ్మా! బాబా వంటి మహాత్ముల విషయంలో ఇలాంటి శంక అవసరంలేదు. మహాత్ములు వీటిని పట్టించుకోరు. వాళ్ళు చూసేది మన మనో పవిత్రతనే. నీవు నిర్భయంగా ఆయన దర్శనానికి వెళ్లొచ్చు" అని చెప్పారు. "బాబాయే తన మార్గంలో ఉన్న అంతటి పెద్దాయనతో చెప్పించారేమో!" అని నా మనసుకు అనిపించినా, నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను. అందరూ పడుకున్నా, మనసునిండా దిగులుతో నాకు మాత్రం నిద్రపట్టలేదు. 12 దాటింది, ఒంటిగంట దాటింది, రెండు కూడా దాటింది, ఐనా కూడా నాకు నిద్ర రాలేదు. చివరికి గం.2:50 నిమిషాలు కూడా దాటింది. ఆ తరువాత నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. సరిగ్గా గం.3:30ని. సమయంలో అనుకుంటా నాకొక కల వచ్చింది. కలలో మా పెదనాన్నగారు, "ఆరతికి సమయం అవుతుంది చూడు.. చూడు.." అంటూ నన్ను లేపుతున్నారు. వెంటనే నాకు మెలకువ వచ్చి చూస్తే సమయం గం. 3.40ని. అవుతోంది. బాబాయే ఆరతికి రమ్మని పిలుస్తున్నారని నాకు అనిపించింది. వెంటనే అందరినీ లేపితే అందరూ స్నానాలు చేసారు. నేను కూడా తలంటుస్నానం చేసి వాళ్లతోపాటు కాకడఆరతికి వెళ్ళి ప్రశాంతంగా, తృప్తిగా బాబా దర్శనం చేసుకున్నాను.

తరువాతరోజు మధ్యాహ్నఆరతి సమయానికి ద్వారకామాయి వద్దకు నేను, మా చెల్లి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. మా చెల్లి లోపలకి వెళదామని అంది. నాకేమో మళ్ళీ మనస్సులో అలజడి మొదలైంది. సమాధిమందిరంలోకి బాబా పిలిచారు గాని, ద్వారకామాయిలోకి ఎలా వెళ్ళేది? "నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మశీదుతల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి" అని బాబా ఒక సందర్భంలో ద్వారకామాయిని తల్లితో పోల్చుతారు. మరి అంతటి పవిత్రమైన ప్రదేశంలోకి నా ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళాలి? - అన్నది నా సంశయం. ఈ సంశయం వలన "అంత పెద్ద క్యూ ఉంది. లోపలికి వద్దులే, ఈ షాప్స్ దగ్గరే ఉండి టివిలో ఆరతి చూస్తూ ఉందాం" అన్నాను. ఇక్కడ కూడా బాబా, 'నాకటువంటి పట్టింపులు లేవు' అన్నట్లుగా అంతలోనే అంత పెద్ద క్యూలో పది, పదిహేనుమంది మాత్రమే మిగిలారు. ఇంతలోనే అంత క్యూ ఎలా తరిగిపోయిందని నేను ఆశ్చర్యపోయాను. ఇక మా చెల్లి 'పద అక్కా' అంటూ నన్ను బలవంతంగా లాక్కుపోయింది. నేనింక చేసేదేమీ లేక తనతో పాటు లైన్‌లోకి వెళ్ళాను. అప్పటికే ఆరతి ప్రారంభమైంది. లైన్‌లో ఉన్నానే గానీ మనసులో 'వెళ్ళొచ్చా' అని ఇబ్బంది పడుతూనే ఉన్నాను. లైన్ కదులుతూ సరిగ్గా ఇటు ధునికి అటు బాబా పటానికి మధ్యలోకి నేను చేరుకునేసరికి దాదాపు పది నిమిషాలపాటు లైన్ నిలిపేసారు. అక్కడే నిలుచుని బాబాను చూస్తూ ఆరతి పాడుకున్నాను. "తల్లిలాంటి ద్వారకామాయిలోకి పోవాలా, వద్దా?" అని సంశయపడ్డ నన్ను పరమపవిత్రమైన ధునికి, తమకి మధ్య నిల్చోబెట్టి నా సంశయాన్ని తీర్చేసారు బాబా. "బాబా! ఇంతకంటే మీ బిడ్డలమైన మాకు ఏమి కావాలి? ఎన్నాళ్ళనుండో ఉన్న నా బాధని తీర్చేసారు. ధన్యవాదాలు బాబా!" అనుకున్నాను.

తరువాత జరిగిన ఈ  సంఘటనలన్నీ ఆ రాత్రి నాకు ఫోన్ చేసిన పెద్దాయనకు చెప్పి, "బాబా అనుమతి లేకుండా ఏమీ జరగదు కదా! నేను చేసింది కరెక్టే అంటారా సార్?" అని అడిగాను. ఆయన "మంచి అనుభవం, చాలా బాగుందమ్మా! మీ పెద్దనాన్నగారి రూపంలో బాబాయే మిమ్మల్ని లేపి, ఆరతికి అనుమతి ప్రసాదించారు. కారణం, బాబాకు అటువంటి పట్టింపులు లేవు" అని చెప్పి, "మీ పెద్దనాన్నగారు ఎక్కడుంటారు?" అని అడిగారు. నేను, "వారు చనిపోయి సంవత్సరం అయింది సార్" అని చెప్పాను. అప్పుడాయన, "ఇంక సందేహమే లేదు, ఆయన రూపంలోనే బాబా వచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఆరతికి రప్పించుకున్నారమ్మా" అన్నారు.

అయితే మనం మామూలు మనుషులం కదా! మనసు అంత త్వరగా సమాధానపడుతుందా? నాకున్న దిగులుకు, అవకాశమే లేని సమయంలో నాకా సమస్యను సృష్టించి, నా సంశయాలు తొలగించి, అంతగొప్ప అనుభవమిస్తే, ఇంటికి వచ్చాక మళ్ళీ అదే ఆందోళనలో పడ్డాను. ఆ సమయంలో పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ చెప్పిన దిగువ వాక్యాల ద్వారా బాబా మళ్ళీ నా దిగులును కూకటివ్రేళ్ళతో సహా తీసేసారు.

"బాబా మన కోరికలను నెరవేరుస్తూ, ఆ అనుభవంవలన మన స్వభావం సరైన పంథాలో ప్రభావమయ్యేలా చేసి మనలో కావలసిన పరివర్తన తీసుకువస్తారు". 

"ఒకసారి తన కోరిక తీరి భక్తునికి ఆ అనుభవం తన సద్గురువు ద్వారా వచ్చిందని తెలిసాక వారిద్దరి మధ్యనుండే ప్రేమానుబంధం భక్తునిలో పరివర్తనకు దారితీస్తుంది. ఇక్కడ లక్ష్యం ఆ కోరిక తీరడం కాదు, పరివర్తన". 
- శ్రీబాబూజీ (శరశ్చంద్రికలు)

ఆ వాక్యాలు చదివాక, గురువుగారు చెప్పినట్లు నాలో పరివర్తన రాకపోతే బాబా ఇచ్చిన అనుభవానికే అర్థం లేకుండా పోతుంది. అలా జరగకూడదని ఆ క్షణంనుండి నేను ఏ సందేహమూ లేకుండా ఆ సమయంలో కూడా ప్రశాంతంగా, సంతోషంగా బాబా పూజ చేసుకుంటున్నాను. ఇలా నాకు బాబా గొప్ప అనుభవాన్నిచ్చి నా బాధను తీర్చేసారు. "ఇన్నాళ్ల నా బాధను తీర్చి మానసిక ప్రశాంతతనిచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా!"

8 comments:

  1. Baba enthala prema choopistavayya mameeda inta prema evaru choopistaru

    ReplyDelete
  2. ఇలాంటిదె నాకు ఒక అనుభవం .అంటే బష్టి గురించి కాదు .నేను శిరిడీ లో ఉన్నప్పుడు ఒకసారి మా గురువుగారి ఆశ్రమంలో భోజనశాలలో భోంచేసి చేతులు కడుకోవడానికి వెళ్ళను .అక్కడే ఒక ప్రక్క కొంత మంది తిన ఎంగిలి ప్లెట్లు కడుగుతుంటారు . సాయిపథం లో అకేష్నస్ అప్పుడు గురుబందువులు అందరు మాట్లాడు కొని ఒక్కో ఊరి వాలు ఒక్కో వర్క లో పేర్లు ఇస్తారు లేదా ఎవరికి ఇష్టమైనది వాలు ఇన్ డివ్యుజవల్ గా కూడా పేర్లు ఇచ్చి వల్ల పన్ని వాలు చేస్తారు అలా వాలు ప్లెట్స కడుగుతుంటె నా మనస్సులో ఇలాంటివి మనం చెయగలమా అనిప్పించింది .నేను ఇంతకు ముందు సాయిపథంలో కొని సేవలు అంటె భోజనాలు వడించడం ఇంకా patients ki medicines ఇవ్వడం ఇలాంటివి చేసాను కాని ప్లెట్స ఎప్పుడు కడగలేదు ఇది చెయగలమా అనిప్పించింది .మల్లి నెక్ట టైమ్ గురుపౌర్ణమికి శిరిడీ వెళ్ళను అప్పుడు నేను అడగకుండానే ఒక ఆంటి నను పిలిచి మనం భోజన హాలో చిపురుతో ఊడుదాం అంది నేను అలాగే ఆంటి అన్నాను ఉడ్చాము తరువాత బాబా హారతి ఇచ్చారు భోజనాలు మొదలయాయి వురికె నిలుచొని వున్నాను సరె ఎందుకులే అని నా ఫ్రండ్ ప్లెట్స క్లిన్ చెస్తుంది సరె చేదం అని నా ఫ్రండ్ ను అడిగాను చెయమనింది .అక్కడ ప్లెట్స క్లిన్ చెస్తుంటె అసలు ఎంత హ్యపినో తెలియదు ఎంగిలి ప్లెట్స క్లిన్ చెస్తునాన్ననే పిలింగే లేదు మనసంతా ఆనందం ఎంత సంతోషంచానో మాటలో చెపలేను గురువుగారు నాకు బాబా సేవను చెసుకునె బాగ్యనిచారు అని ఎంత ఆనందించానో మాటలో చెపలేను సాయి .అప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు.

    ReplyDelete
    Replies
    1. వెరీ నైస్ మీ అనుభవం చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. బాబా గురువుగారి ప్రేమ అద్భుతం.

      Delete
    2. మీరు చాలా అదష్టవంతురాలు

      Delete
  3. చాలా అద్బుతం గా ఉంది. జై సాయి రామ్

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo