సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నెలసరి సమస్య - బాబా పరిష్కారం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబాభక్తురాలు దివ్య తన శారీరక సమస్యనుండి బాబా తననెలా రక్షించారో ఇప్పుడు మనతో పంచుకుంటున్నారు.

నా పేరు దివ్య. నాకు వివాహమై ఒక పాప ఉంది. నేను ఉద్యోగస్థురాలిని. నేను బాబా భక్తురాలిని. బాబా కృపతో చాలాసార్లు శిరిడీ దర్శించాను. ముందుగా బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నిజానికి మీరు చేస్తున్న ఈ మంచిపని వలన మా భక్తివిశ్వాసాలు రెట్టింపు అవడమే కాకుండా అవసరమున్న సమయంలో  ధైర్యం కూడా చేకూరుతుంది. దృఢమైన విశ్వాసంతో రోజుకు కనీసం ఒక్కసారైనా సాయి నామస్మరణ చేసిన వారికి ఖచ్చితంగా ఆయన సహాయం అందుతుంది. బాబా నాకు తల్లితో సమానం. తల్లి తన బిడ్డకి జీవితంలో సరైన మార్గం చూపుతుంది. నిజానికి తల్లిపాత్ర చాలా కష్టమైనది. కొన్నిసార్లు ఆమె ప్రవర్తన తన బిడ్డ బాధపడేలా ఉన్నా భవిష్యత్తులో ఆ బిడ్డ ఈ ప్రపంచంలో అన్ని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇది బాబా తన భక్తులపై చూపే తల్లిప్రేమకు కూడా వర్తిస్తుంది. నేను మొదటిసారి నా అనుభవాన్ని వ్రాస్తున్నాను. అది కూడా ఎలాంటి అనుభవమంటే బాబా తప్పితే ఆ పరిస్థితిలో ఎవరూ సహాయం చెయ్యలేరు. నేను చెప్పేది చాలామందికి విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ ఇది నా స్వీయ అనుభవం.

నాకు వివాహమైన తరువాత నాలుగవ సంవత్సరంలో నేనొకసారి మా అత్తవారింటికి వెళ్ళాను. అప్పటికి మాకు ఇంకా పిల్లలు లేరు. అది చాలా చిన్న గ్రామం, అక్కడి ప్రజలు ఇప్పటికీ సనాతన ఆచారాలు పాటిస్తుంటారు. అక్కడ ”గణ్‌‌గొర్"(గణ - శివ, గొర్ - పార్వతి) అనే ఒక సాంప్రదాయ పండుగని 16 రోజులపాటు ప్రతిసంవత్సరం చేసుకుంటారు. ఈ పండుగను ప్రధానంగా రాజస్థాన్ ప్రాంతంలో మార్చి నెలలో హోలీ పండుగ తరువాత చేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు మంచి భర్త రావాలని, పెళ్ళైన మహిళలు తమ భర్త ఆరోగ్యం మరియు పూర్ణాయుష్షు కోసం ఈ పండగను చేసుకుంటారు. అందరూ కలిసి ప్రాంతీయ జానపదగీతాలు పాడుకుంటూ శివపార్వతులను పూజిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు చేశాక ఉద్యాపన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనా ఉద్యాపన కోసమే మా అత్తగారింటికి వెళ్ళాను. మా ఆడపడుచు కూడా ఉద్యాపన చెయ్యడానికి తన భర్త, అత్త మామలతో ఆ సమయంలో అక్కడికి వచ్చింది. ఒకేసారి ఉద్యాపన చేసుకుంటే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని అలా ప్లాన్ చేసుకున్నాము. మేమిద్దరం ఒకేసారి ఉద్యాపన చేసుకుంటుండటంతో మా అత్తగారు చాలా సంతోషంగా ఉన్నారు.

నేను ఇప్పటివరకు చెప్పినదంతా నా సమస్యయొక్క నేపథ్యం మాత్రమే. అసలు సమస్య ఏమిటంటే, పండుగకి ఒక్కరోజు ముందు నాకు నెలసరి మొదలైంది. అలా జరుగుతుందని నేనసలు ఊహించలేదు. సాధారణంగా అటువంటి సమయంలో ఆడవాళ్ళను ఇంటిలోనికి రానివ్వకుండా బయట ఉంచుతారు. ఆ సమయంలో స్త్రీలను ఏమీ తాకనివ్వరు. రోజువారీ పనులకి దూరంగా ఉంచుతారు. వంటగది ఛాయల్లోకి కూడా రానివ్వరు. అలాంటిది ఇంక పండుగ, పూజ గురించి చెప్పాలా? చదువుతున్న ఆడవాళ్లందరికీ ఇదంతా తెలిసే ఉంటుంది. నాకు ఈ సమస్య మొదలైందని గుర్తించగానే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. దిక్కుతోచక స్నానాలగదిలోనే మౌనంగా కూర్చుండిపోయాను. రెండు భయాలు నా మనస్సును చుట్టుముట్టాయి. ఒకటి - ఇది నేను చేయాల్సిన ఉద్యాపన, ఇప్పుడు నేను కనుక చెయ్యలేకపోతే మొత్తం వృధా అయిపోతుంది. రెండు - ఇప్పుడిలా జరిగినందుకు మా అత్తగారు కోపంతో, "నెలసరి ఆలస్యమయ్యేందుకు మాత్రలు వేసుకొని ఉండొచ్చు కదా?" అని తిట్టిపోస్తూ తన ప్రవర్తనతో నన్ను చంపినంత పని చేస్తుంది. ఇది మనసులో పెట్టుకొని రాబోయే కొన్నినెలలపాటు సూటిపోటి మాటలతో నన్ను నిందిస్తూనే ఉంటుంది. ఒకవేళ నా భర్త నా తరపున మాట్లాడినా ఆయన్ని కూడా విడిచిపెట్టదు. పైగా కోపంతో నాతో మాట్లాడడం కూడా మానేస్తుంది. ఇలా జరగబోయేదంతా ఆలోచించేసరికి భయంతో నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేను. పొరపాటున ఒకవేళ మా ఆడపడుచుకి తెలిసిందా, ఇక అంతే! ఆమె నన్నింక ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ సమస్య ఒకటి, రెండు రోజుల్లో తీరిపోయేదికాదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అప్పటికి సూర్యాస్తమయ సమయం కావడంతో నేను నెమ్మదిగా స్నానాలగది నుండి బయటకొచ్చి ఎవరికీ కనపడకుండా నేరుగా మేడమీదకి వెళ్లి ఒక మూల కూర్చొని ఏడవసాగాను. "నేను ఎంత పాపాత్మురాలినో ఇటువంటి సమస్య వచ్చిపడింది. ఈ విషయాన్ని అత్తగారితో చెప్పుకోలేను. అయినా నేనేమి చేయగలను? ఇటువంటి విషయాలు మనచేతిలో ఉండవు కదా!" అని అనుకున్నాను. ఈ పరిస్థితిలో నాకున్న ఒకేఒక్క ఆశ నా బాబా. ఆయన్ను తలచుకొని ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ గుండెలోతుల్లో నుండి ఆర్తిగా ప్రార్థించడం మొదలుపెట్టాను. "బాబా! తల్లిలా మీరే నన్ను అర్థం చేసుకోగలరు. మీకంతా తెలుసు. నేను ఇది కావాలని ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. బాబా! ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు తప్ప నన్ను ఈ సమస్యనుండి ఎవరూ బయటపడవేయలేరు. దయచేసి నాకు సహాయం చెయ్యండి, టెంకాయ సమర్పించుకుంటాను" అని బాబాని వేడుకున్నాను. తరువాత మేడపై నుండి క్రిందకు వచ్చానే గాని, ఎవరికీ ఎదురుపడలేక నిద్రపోతునట్టు నటిస్తూ కొన్నిగంటలపాటు ఎవరికంటా పడకుండా ఏడుస్తూనే ఉన్నాను. అలా ఏడుస్తూ ఏ రాత్రో నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారితే పండుగ కాబట్టి నేను వేకువనే లేచాను. కానీ మనస్సులో చాలా ఆందోళన, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నేరుగా స్నానాలగదికి వెళ్ళాను. లోపలకి వెళ్ళాక నన్ను నేనే నమ్మలేకపోయాను. నెలసరి సమస్యతో వచ్చేది ఏదీ నన్ను అంటలేదు. నేను చాలా పరిశుభ్రంగా ఉన్నాను. ఒక చిన్న మచ్చకూడా లేదు. అసలు నేనా సమస్యకు గురికానట్లే ఉంది. నాకెంత సంతోషం కలిగిందంటే చెప్పలేనసలు. 'బాబా నన్ను కాపాడారు' అనే ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. నాకు కన్నీరు ఆగలేదు. ఇప్పుడు నేనెవరి దగ్గరా ఏ విషయం దాచనక్కర్లేదు. ఎవరితోనూ అబద్ధం చెప్పనక్కర్లేదు. నా ఉద్యాపనకు కూడా ఏ ఆటంకం లేదు. ఇక ఆనందంగా తలస్నానం చేసి నేను అందరితో పాటు పండుగలో పాల్గొన్నాను. అనుకున్నట్టుగా అంతా బాగా జరిగింది. ఆ రోజంతా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నాను. రాత్రి పడుకోబోయేముందు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను. అప్పుడు కూడా నేను శుభ్రంగా ఉన్నాను. "థాంక్యూ, థాంక్యూ సో మచ్ బాబా! ఒక్క తల్లి మాత్రమే తన బిడ్డల బాధని అర్థం చేసుకోగలుగుతుంది" అని బాబాకి చెప్పుకున్నాను. మరుసటిరోజు నేను మామూలుగా నిద్రలేచి టీ, టిఫిన్ అయ్యాక స్నానాలగదికి వెళ్ళినప్పుడు ఆ సమస్య కనిపించింది. నన్ను మామూలుగా చేసినందుకు మరలా బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అప్పుడు మా అత్తగారికి జరిగిన సంగతి చెప్పాను. ఏ ఆటంకం లేకుండా పండుగ అయిపోవడంతో తను సంతోషంగా స్వీకరించారు. ఇప్పుడు ఏ బాధాలేదు. చూశారా! సాయిబాబా ఎలా నా నెలసరిని ఒక్కరోజుకి ఆపి మరలా యథావిధిగా చేసారో! హృదయపూర్వకంగా చెప్తున్నాను.. "లవ్ యు సో మచ్ బాబా!"

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo