సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

పల్లకి సేవనిచ్చి నా మనసులోని బాధను తీసేసారు బాబా.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు నిరుపమ గారు తన అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

సాయిబంధువులందరికీ నమస్కారం.

2018 డిసెంబర్ 13 గురువారంనాడు పల్లకీ సేవ చేసుకునే అవకాశం బాబా నాకు ఇచ్చారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

ఆరోజు నేను నా స్వంతపనిమీద ఒక నగరానికి వెళ్ళాల్సి వచ్చింది. నా పని పూర్తైన తరువాత ఆ ఊరిలోని నాకెంతో ఇష్టమైన బాబా మందిరాలన్నీ చూసి, బెంగుళూరు తిరిగి వద్దామనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక సమస్య రావడంతో, అదేరోజు అక్కడినుండి బళ్ళారి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆ ఊరిలోని నాకిష్టమైన బాబా మందిరాలకు వెళ్ళలేక చాలా బాధపడి, కనీసం బళ్ళారిలోనైనా సాయంత్రం ఆరతి సమయానికి బాబా మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

నేనెప్పుడు బళ్ళారి వెళ్ళినా అక్కడ MG బాబా మందిరానికి వెళ్తూ ఉంటాను. కొన్ని కారణాలరీత్యా నేను ఆరతి సమయానికి మందిరం చేరుకోలేకపోయాను. కాస్త ఆలస్యంగా మందిరం చేరుకుని, దర్శనానికి క్యూలో నిలుచున్నాను. అక్కడ కొందరు భక్తులు పల్లకీని అందంగా అలంకరిస్తూ ఉన్నారు. అక్కడ పూజారిగారు నాకు తెలుసు. అయన నన్ను చూసి, "15 నిముషాల సమయం ఉంటే, పల్లకీ దగ్గర వేచి ఉండమ"ని చెప్పారు. నేను కనుక వేచి ఉంటే ఆయన నా పేరు మీద అర్చన చేయాలనుకుంటున్నారని నాకనిపించి, నాకు కూడా వేరే పనులేమీ లేనందువల్ల 'సరే, ఉంటాన'ని చెప్పి పల్లకీ ప్రక్కగా వెళ్లి కూర్చున్నాను. కొద్దిసేపటికి ఆయన నా దగ్గరకి వచ్చి కొన్ని గులాబీపువ్వులు, ఒక అరటిపండు నా చేతిలో పెట్టి, "బాబాతో మాట్లాడుతూ ఉండమ్మా, నేను కొద్దిసేపట్లో వస్తాన"ని చెప్పి వెళ్ళిపోయారు. కొన్నినిమిషాల తరువాత ఆయన వచ్చి పల్లకీలో బాబాకి పూజ చేసి, ఆరతి ఇచ్చారు. తరువాత కొద్దిమంది భక్తులు పల్లకీని తమ భుజాలపైకి ఎత్తుకుని పల్లకీసేవ మొదలుపెట్టారు. నేను కూడా వాళ్లతో కలిసి బయలుదేరాను. నేను పల్లకీ చివరికొన పట్టుకుని, భక్తులందరితో భజన పాటలు పాడుతూ ముందుకుసాగుతూ ఉన్నాను. కొంతసేపటికి హఠాత్తుగా నా ముందు పల్లకీ మోస్తున్న వ్యక్తి నన్ను "పల్లకీ మోయాలనుకుంటున్నారా?" అని అడిగారు. ఆ మాట వింటూనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే 'అవున'ని చెప్పి అతని వద్దనుండి పల్లకీ అందుకున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావట్లేదు. నేను కొంచెంసేపు పల్లకీ మోసి తరువాత వేరే మహిళకి అవకాశమిచ్చి, నేను మళ్ళీ పల్లకీ చివరికొన పట్టుకుని నడిచాను. పల్లకీసేవ పూర్తయ్యేవరకు ఉండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఇష్టమైన బాబా మందిరాలకి వెళ్ళలేకపోయానని మనసులోనే నేను పడ్డ బాధను బాబా తమ పల్లకీసేవతో తీసేసారు. ఆ ఆనందాన్ని ఎప్పటికీ మరువలేను. తరువాత డిసెంబర్ 16న ఆరోజు పూజారిగారు ఇచ్చిన రోజాపువ్వు రెక్కలని చూస్తుంటే అందులో బాబా దర్శనం ఇచ్చారు. బాబా రూపాన్ని చూసి ఆనందాన్ని పట్టలేకపోయాను.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo