సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2062వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

    • బాబా ఇచ్చిన మోతీచూర్ లడ్డు కానుక - సానుకూల సంకేతం 


సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు నవీన్. నేను ఇప్పుడు బాబా ఇచ్చిన మధురమైన అనుభూతిని పంచుకుంటున్నాను. నేను చాలా రోజుల నుండి బాబా గుడికి వెళ్లాలని అనుకుంటున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. చివరికి బాబా అనుగ్రహంతో 2026, జనవరి 8న తిరుపతిలో ఉన్న ఒక బాబా గుడికి వెళ్లేందుకు సమయం కలిసి వచ్చింది. ఆ రోజు గురువారం కావడం వల్ల నేను చేయాల్సి ఉన్నా పారాయణం ఆ గుడిలోనే చేసి, ఆరతి చూసుకొని వద్దామనుకున్నాను. నేను కొన్నిరోజులుగా నా ఆధ్యాత్మిక జీవితం గురించి సందిగ్ధంలో ఉన్నాను. దానికి సంబంధించి ఏదైనా సానుకూల సంకేతం ఇమ్మని గుడికి వెళ్లే ముందు బాబాని కోరుకున్నాను. అలాగే 'నేను చాలా రోజుల తర్వాత గుడికి వస్తున్నాను బాబా. ఏమైనా కానుక ఇవ్వొచ్చుగా?' అని మనసులో అనుకున్నాను. కానీ అది బాబాకి చెప్పుకోకుండానే గుడికి వెళ్ళాను. గురువారం అయినందున జనాలు బాగా ఉన్నారు. నేను క్యూలో వెళ్లి బాబాని తాకి, దర్శనం చేసుకొని అక్కడ పెడుతున్న కట్టు పొంగలి ప్రసాదం తీసుకున్నాను. తర్వాత బాబాకి ఎదురుగా మధ్యలో కూర్చుని పారాయణం మొదలుపెట్టాను. అప్పటికి ఉదయం 11 గంటలు దాటింది. కాసేపటికి ఆరతి సమయం దగ్గర పడుతుండడంతో శుభ్రపరిచేందుకు కింద కూర్చున్న వాళ్ళ అందరినీ లేచి వెళ్ళమన్నారు. నేను పారాయణ చేస్తూనే లేచి బయటకు వెళ్లి అక్కడ ఒక మూలాన ఉండి పారాయణ కొనసాగిస్తున్నాను. అదే సమయంలో ప్రసాద వితరణ చేసే వైపు చూస్తే, పెద్ద పెట్టెతో మోతీచూర్ లడ్డులు పంచడం మొదలుపెట్టారు. వాటిని చూడడంతోనే వెళ్లి ఒక లడ్డు తీసుకొని తినాలనిపించింది కానీ, 'పారాయణ మధ్యలో ఉండగా వెళ్లి తీసుకోవడమెందుకు?' అని ఒక పక్క, ఇంకో పక్క 'పారాయణ పూర్తి చేసేలోపు ప్రసాదం అయిపోతుందెమో!' అని ఆలోచనలు నా మనసులో తిరిగాయి. ఆ రెండు ఆలోచనలు నా మనసున కాసేపు కొనసాగినప్పటికీ చివరికి 'నేను పారాయణ చేసిన తర్వాతే ప్రసాదం దగ్గరకి వెళ్తాను. ఒకవేళ ఆ లడ్డు ప్రసాదం అయిపోయినా బాబా ఇవ్వాలనుకుంటే ఎలాగైనా ఇస్తారు' అనే నిశ్చయించుకున్నాను. అంతలోపు లోపల శుభ్రం చేయడం అయిపోవడంతో ఆరతి దగ్గర నుంచి చూస్తే బాగుంటుందని బాబాకి దగ్గరగా వెళ్లి కూర్చొని పారాయణ కొనసాగించాను. పారాయణ అయిన వెంటనే బాబాకి దణ్ణం పెట్టుకొని ప్రసాదం ఇచ్చే దగ్గరకి వెళ్లాలని అనుకున్నాను కానీ, పారాయణ పూర్తైయ్యే సమయానికి ఆ విషయం మార్చిపోయి అక్కడే బాబాని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు ఒకామె తన చిన్నకూతురితో అక్కడ కూర్చొని ఉన్న వాళ్ళకి ప్రసాదం పంచడానికి వచ్చింది. ఆ చిన్నపాప ఇచ్చిన ప్రసాదం మరేదో కాదు, మోతీచూర్ లడ్డు. దాన్ని నా చేతిలో పెట్టడంతోనే నా ఆనందానికి అవదులు లేవు. నా పారాయణ పూర్తిచేసి కూర్చున్న చోట నుండి లేచి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళకపోయినా నేను ఉన్న చోటికే నేను కోరుకున్న ప్రసాదం పంపిన బాబా అనుగ్రహం గురించి ఏమని చెప్పగలము? బాబా అనుగ్రహం అక్కడితో ఆగలేదు.

నేను బాబా ఇచ్చిన ఆనందంలో ఆరతిని బాబాకి చాలా దగ్గరగా వీక్షించాను. ఆరతి అనంతరం బాబాకి దగ్గరగా వెళ్లి మరోసారి దణ్ణం పెట్టుకుందామని లైన్‌లో వెళ్లి బాబాను తాకి నమస్కరించుకుని వెనక్కి తిరిగి వచ్చి మరల ప్రసాదం కోసం లైన్‌లో నిల్చున్నాను. అప్పుడు ఆరతి సమయానికి భక్తులు తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి పంచుతున్నారు. నాకు ఇచ్చిన ఆ ప్రసాదంలో కొద్దిగా సాంబార్ అన్నం, పూర్తి మోతీచూర్ లడ్డు ఉన్నాయి. అన్ని రకాల ప్రసాదాలు కలిపేసినా నాకు పూర్తి లడ్డు రావడమేమిటి!! నేను ఆ లడ్డు చూసి, "నేను ఒకసారి అడిగితే మీరు రెండుసార్లు ఇచ్చారా బాబా? మీ కృపకు అంతులేదు బాబా" అని మళ్ళీ నా మనసులో ఆనందం ఉప్పొంగింది. ఆ ఆనందంలో తేలుతూ అన్నదానం లైన్‌లోకి వెళ్ళాను. కానీ నాకేం తెలుసు బాబా లీల ఇంకా పూర్తి అవ్వలేదని?

నేను పళ్లెంలో భోజనం వడ్డించుకొని చేతిలో పట్టుకొని తింటూ గుడి ఎంట్రన్స్ దగ్గరకి వెళ్ళాను. అక్కడ చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. నేను అక్కడ ఎవరున్నారు? ఏం జరుగుతుంది? అన్నది పట్టించుకోకుండా నా పాటికి నేను కొంచెం దూరంలో భోజనం చేస్తున్నాను. కొద్దిసేపటికి గుడి ఎంట్రన్స్ వైపుకి నా తల తిప్పితే, అక్కడ ఆ గుడిలో బాబా దగ్గర సేవ చేసే ఒకతను భక్తులకు ప్రసాదం పంచుతూ, 'స్వామీ! ఇటు రండి' అని నాకు సైగ చేస్తున్నారు. నేను, "ఏమిటి ఆయన నన్ను పిలుస్తున్నారు?" అని కొంచెం ఆశ్చర్యపోయి 'నన్ను కాదేమో!' అని పక్కకి వెళ్ళిపోయాను. అయినా కూడా ఆయన నాకోసమే చూస్తే, మళ్ళీ నన్ను ఇలా రమ్మని సైగ చేసారు. సరేనని వెళ్తే ఆయన తన చుట్టూ ఎంతోమంది జనాలు ఉంటే, వాళ్ళ మీద నుండి చేయి చాపి చిరునవ్వుతో నా చేతిలో ఒక మోతీచూర్ లడ్డు పెట్టారు. అంత జనంలో ఆయన నన్ను పిలవడం ఏంటి? పోనీ ఏదో ప్రసాదం ఇవ్వాలనుకుంటే, అది మోతీచూర్ లడ్డు కావడం ఏంటి? పారాయణ అయిన వెంటనే ఒకసారి ప్రసాదం ఇచ్చే దగ్గరకి వెళ్తాను, ఒకవేళ ఆ లడ్డు ప్రసాదం అయిపోయినా బాబా ఇస్తారులే అని నా మనసులో ఆలోచన రావటం ఏమిటి? దాన్ని బాబా ఒక్కసారి కాదు 3 సార్లు నెరవేర్చడం ఏమిటి? నాకు నోట మాట రాలేదు. బాబా ప్రేమకి నేను ఏమైపోతానో నాకు అర్థం కాలేదు. నేనెంత ఆనందం పొందానో మాటల్లో చెప్పలేను. ఆ ఆనందంలో నేను భోజనం ఏం తిన్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆనందానికి నా కడుపు నిండిపోయింది.

వెంటనే బాబా ప్రసాదించిన అత్యంత అద్భుతమైన ఆనందాన్ని నాకు తెలిసిన ఒక బాబా బంధువుతో పంచుకోవాలని తనకి ఫోన్ చేశాను. తనతో మాట్లాడుతుండగా కాసేపటి ముందు నాకు లడ్డు ఇచ్చిన ఆయన నా దగ్గరకి వచ్చి, "ఏ వూరు? ఎక్కడి నుంచి వచ్చారు?" అని కొంచం మాట్లాడారు. నేను ఆయనతో బాబా నాకు ఇచ్చిన ప్రేమను చెప్పాలని బాగా అనుకున్నాను. కానీ చెప్పేలోపు ఆయన వస్తానని వెళ్లిపోయారు. సరేనని నేను బాబా ప్రేమని ఫోన్లో బాబా బంధువుతో పంచుకోసాగాను. కాసేపటి తర్వాత నాకు లడ్డు ఇచ్చిన ఆ బాబా సేవకుడు మళ్ళీ నా కంటపడ్డారు. నేను ఆనందంగా బాబా ప్రేమను ఆయనకి చెప్పి, "మీ ద్వారా బాబా నా కోరిక తీర్చారు" అని అన్నాను. అందుకాయన, "బాబానే మీకు ఇచ్చారు" అని చెప్పి వెళ్ళొస్తానని వెళ్ళిపోయారు. బాబా ఇవ్వడమే కాకుండా 'నేనే నీకు ఇచ్చాను' అని తెలియజెప్పడానికే ఆయన్ని పంపించి, నాతో మాట్లాడించినట్లు ఉంది ఇదంతా. నేను బాబాను ఏదైనా కానుక, నా ఆధ్యాత్మిక జీవితంకి సంబంధించి సానుకూల సంకేతం అడిగితే, ఆయిన ఏకంగా ఒకసారి కాదు, మూడు సార్లు మోతీచూర్ లడ్డు కానుకగా నాకిచ్చి, నా ఆధ్యాత్మిక జీవితంకి డోకా ఏమీ లేదని, మధురంగా ఉంటుందని నా భుజం తట్టి చెప్పినట్టుగా నాకు ఈ అద్బుతమైన అనుభవం ప్రసాదించారు. నేను ఆ రోజంతా ఆ అనుభవాన్ని, బాబా ప్రేమని తలుచుకుంటూ అసలు ఎంత ఆనందంలో తేలానో చెప్పలేను. అసలు ఏమి చెప్పి బాబా ప్రేమని వర్ణించగలం? వర్ణించటానికి మాటలు చాలవు. ఆనందంలో ఇంకా ఏదో చెప్పాలనుకున్నా మానవ మేధస్సుకు తెలిసిన పదాలతో ఏదో చెప్పడమే తప్ప, బాబా ప్రేమని వర్ణించడానికి దేవతలకు కూడా పదాలు సరిపోవు. బాబా మీద మనకి ఎంత ప్రేమ ఉంటే, అంతలా ఆయన మనం అడిగిన దానికంటే ఎన్నోరెట్లు అధికంగా, ఎంతో మధురంగా ​​ఇస్తారనడానికి నా ఈ అనుభవం ఒక ఉదాహరణ. కాబట్టి బాబాని మనం ఏమైనా అడిగితే, ఆయన అడిగిన దానికి మించి ఇస్తారనే నమ్మకంతో ఆయన మీద ప్రేమతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

4 comments:

  1. మీ అనుభవం చాలా చాలా బాగుంది 😊
    *ఓమ్ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై*
    🕉️🌹🙏🙏🙏🌹🔯

    ReplyDelete
  2. Jaisairam bless amma for her health and bless supraja for her neck pain and shoulder pain and help her to get normal Jaisairam she is suffering with disk bulges and bless her to get normal Jaisairam she is suffering with urine infection and help her to get normal Jaisairam she is suffering with kidney disease and help her to get normal Jaisairam

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo