సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1150వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా చల్లని దృష్టి
  2. సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు.
  3. బాబా దయవలన దొరికిన స్టోన్(జాతిరత్నం)
  4. ముందస్తు సూచననిచ్చిన బాబా

బాబా చల్లని దృష్టి


సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేనిప్పుడు మూడోసారి ఈ బ్లాగులో నా అనుభవాలు పంచుకుంటున్నాను. నేను నా గత అనుభవంలో బాబా దయవల్ల పోయిన డాక్యుమెంట్స్ దొరికి కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మేము ఆ ఇంటి గృహప్రవేశం 2022,  ఫిబ్రవరి 10న చేసుకున్నాము. ఆరోజు గురువారమే అయింది. మేము బాబాకు బట్టలు పెట్టుకున్నాం. నేను బాబాను మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. సరిగ్గా భోజన సమయానికి మాసిన బట్టలు ధరించి, గడ్డం, కాలికి కట్టు ఉన్న ఒక 60 సంవత్సరాలు వృద్ధుడు మా కొత్త ఇంటి వద్దకు వచ్చారు. మావారు ఆయనని "భోజనం చేస్తారా?" అని అడిగితే, ఆయన "చేస్తాను" అన్నారు. వెంటనే మావారు ఆకువేసి అన్నీ వడ్డిస్తే, ఆయన తిని వెళ్లిపోయారు. నాకు తెలును ఆయన బాబాయేనని. ఆయన దయవల్లే మాకు ఆ ఇల్లు ప్రాప్తించింది. నేను గతంలో పంచుకున్న రెండు అనుభవాలను కొన్ని కారణాల వలన బాధతో పంచుకుని, "ఏ ఆటంకం లేకుండా గృహప్రవేశం జరిగేలా అనుగ్రహించమ"ని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే ఏ ఆటంకమూ లేకుండా గృహప్రవేశం బాగా జరిగింది. ఆ సాయి కృపవల్ల మేము ఇప్పుడు మా కొత్త ఇంటిలో ఉన్నాము. "తండ్రీ సాయి! మీకు శతకోటి నమస్కారాలు. ఇలాగే మా కుటుంబంపై మీ చల్లని దృష్టి సదా ఉంచండి బాబా".


మేము ప్రతి గురువారం సాయంత్రం బాబా గుడికి వెళ్తాము. 2022, మార్చి 17, గురువారం నాడు నా మనసెందుకో అస్సలు బాగాలేదు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి మా అబ్బాయి వస్తాడు, గుడికి వెళదామని అనుకుంటున్నాము. అయితే, వచ్చేదారిలో మా అబ్బాయి యాక్సిడెంట్‍కి గురయ్యాడు. తన చేయి గుత్తి దగ్గర వాచిపోయింది. బాబుని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాము. నేను బాబా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది. దాంతో నాకు చాలా భయమేసి, "బాబా! మా అబ్బాయికి ఏమీ కాకూడద"ని బాబాను వేడుకున్నాను. తరువాత బాబుకి ఎక్స్-రే తీశారు. నేను 'ఎక్స్ రే నార్మల్‍గా వస్తే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. బాబా దయవల్ల ఎక్స్ రే నార్మల్‍గానే వచ్చింది. చేతికి పిండికట్టు కాకుండా చిన్న బ్యాండేజ్ మాత్రమే వేశారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు ఏదో పెద్ద దెబ్బే తగిలే విధంగా కర్మ ఉండి ఉండాలి. కానీ బాబా దయవల్ల చిన్నదానితో పోయింది. "బాబా! మీకు శతకోటి వందనాలు. మీ చల్లని దృష్టి ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంచండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు


సాయి బంధువులందరికీ మరియు ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు 'సాయి కిరణ్'. నేను మొదటిసారి నా అనుభవం మీతో పంచుకుంటున్నాను. రెండు నెలల క్రితం అంటే 2022, జనవరిలో నేను ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో పాత కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేసాను. అయితే పాత కంపెనీలో నోటీసు పీరియడ్ అయిపోవస్తున్నా కొత్త కంపెనీ నుండి నాకు అఫర్ లెటర్ రాలేదు. నాకు ఏమి చేయాలో తోచలేదు. ఆ సమయంలో మా అమ్మ నాతో, "సాయిని వేడుకో అంతా బాబా చూసుకుంటారు. నీ కోరిక నెరవేరితే బ్లాగులో పంచుకుంటానని అనుకో, నీ పని అయిపోతుంది" అని చెప్పింది. నేను అమ్మ చెప్పినట్లే బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల 2022, ఫిబ్రవరి 28న నాకు ఆఫర్ లెటర్ వచ్చి, కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాను. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


బాబా దయవలన దొరికిన స్టోన్(జాతిరత్నం)


సాయికి, సాయిబంధువులకు నా నమస్కారాలు. సాయి లీలలను భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దివ్య సాయికుమారి. సాయి ఆశీస్సులతోనే నాకు ఆ నామకరణం జరిగింది. నేనిప్పుడు బాబా నాపై చూపిన కరుణను మీతో చెప్పబోతున్నాను. 2022, మార్చ్ నెలలో మావాళ్లు త్వరలో నాకు పెళ్లి జరగాలని పూజ చేయించి జాతిరత్నమైన కనకపుష్యరాగం పొదగబడిన ఉంగరం నా చేతికి పెట్టారు. సాయి దయవలన ఆరోజు పూజ, సత్యనారాయణ వ్రతం బాగా జరిగాయి. కానీ ఉంగరం సైజు సరిగాలేదు, టైట్ అయింది. అందుచేత ఒకరోజు నేను నా ఆఫీసు నుంచి షాపుకి వెళ్లి ఉంగరం కొంచెం లూజు చేయించాను. తరువాత ఆ ఉంగరం నా చేతికి పెట్టుకుని ఆఫీసుకి బయలుదేరి దారిలో ఓ చోట ఫ్రూట్ జ్యూస్ త్రాగి ఆఫీసుకి వెళ్ళాను. ఆఫీసులో నా పని చేసుకుంటూ కొంతసేపటికి చేతికున్న ఉంగరం చూస్తే, దానికి ఉండాల్సిన స్టోన్ లేదు. దాంతో చాలా టెన్షన్ పడి నా హ్యాండ్ బ్యాగులో వెతికాను. కానీ స్టోన్ కనపడలేదు. వెంటనే బాబాని తలుచుకుని, "బాబా! స్టోన్ కనబడితే, నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ జ్యూస్ షాపు దగ్గరికి వెళ్లి వెతికాను. కానీ స్టోన్ దొరకలేదు. తిరిగి ఆఫీసుకి వచ్చి, అక్కడంతా వెతికానుగాని స్టోన్ కనపడలేదు. ఇంకా ఏడుచుకుంటూ అందరికీ విషయం చెప్పి, మనసులో 'సాయికి చెప్పుకున్నాను కదా, అయినా ఎందుకు దొరకలేదు' అని అనుకున్నాను. అంతలో ఆఫీసులో వేరేచోట కిందపడి ఉన్న ఆ స్టోన్ ఒక అంకుల్ కంటపడింది. ఆయనకి ఆ స్టోన్ ఏంటో అర్థంకాక వేరే వాళ్లకు చూపించారు. వాళ్ళు ఆ స్టోన్ నాకు చూపించి, "ఇది మీదేనా?" అని అడిగితే, "అవును" అని చెప్పాను. అలా బాబా దయవలన స్టోన్ దొరికింది. "మీ పాదాలకు శతకోటి వందనాలు సాయి. అమ్మ నా పెళ్లి గురించి చాలా బాధపడుతుంది తండ్రి. ఒక మంచి సంబంధం వచ్చి, నాకు వివాహం అయ్యేలా అనుగ్రహించండి. చాలా రోజులు నుండి శ్రద్ధ, సబూరీలతో ఎదురుచూస్తున్నాను సాయి".


ముందస్తు సూచననిచ్చిన బాబా


సాయి భక్తులందరికీ నమస్తే. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి చాలా ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఈమధ్య నేను నా పాసుపోర్టు వెరిఫికేషన్‍కి వెళ్లాల్సిన రోజున నా వాట్సప్ గ్రూపు ఓపెన్ చేస్తే, పాసుపోర్టు వెరిఫికేషన్‍కి సంబంధించిన అనుభవమే వచ్చింది. అది చదివాక ఈరోజు నా పాసుపోర్టు విషయంలో బాబా సహాయం చేస్తారని నాకు అర్థమై, "బాబా! మీ దయతో పాసుపోర్టు వెరిఫికేషన్ ఏ ఇబ్బంది లేకుండా పూర్తయితే, నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నేను అనుకున్నట్టుగానే బాబా దయవలన అంతా సజావుగా జరిగింది. ఇలా బాబా నాకు చాలా విషయాలలో సహాయం చేస్తున్నారు. "థాంక్యూ సో మచ్ బాబా".


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!



5 comments:

  1. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Today's. Sai Leela's are very nice.i am thinking negative in my husband live.please baba bless him.be with him.i want to die sumangaliga

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo