1. కరోనా నుండి కాపాడిన సాయి
2. దయతో క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచిన బాబా
3. సాయిని తలచుకుంటే జరగనిది ఏముంటుంది?
కరోనా నుండి కాపాడిన సాయి
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న బృందానికి, సాటి సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను సాయికి చిన్న సేవకురాలిని. 2021, మే నెల మొదటి వారంలో నాకు, మావారికి, మా అత్తయ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని డాక్టరు చెప్పారు. అప్పుడు నేను బాబాను, "బాబా! నాకు కరోనా తగ్గిపోతే, పిల్లలతో ఉంటాను. తగ్గలేదంటే, మీ దగ్గరికి వస్తాను. కానీ, మీరు ఈ కరోనాని అంతమొందించండి బాబా" అని వేడుకున్నాను. ఒకరోజు తెల్లవారుఝామున కలలో ఒక పెద్దపులి నా మీద నుండి దూకబోతుండగా బాబా దాన్ని ఆపి, "అవతలకి పో" అని తమ చేతితో సైగ చేశారు. తరువాత బాబా నాకు దగ్గరగా వచ్చి తమలోని సూర్యకాంతిని పోలిన ప్రకాశాన్ని నాలో ప్రసరింపజేశారు. ఆ తర్వాత రిపోర్టులో ఇన్ఫెక్షన్ తగ్గిందని వచ్చింది. అయినా నేను ప్రతిరోజూ బాబా స్మరణ చేస్తూ, ఊదీ తీసుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల కరోనా తగ్గింది. కానీ సుమారు ఆరునెలలపాటు నా నోరంతా చేదుగా ఉండేది. అప్పుడు మళ్ళీ అన్ని టెస్టులు చేయించుకున్నాను. కానీ రిపోర్టులు నార్మల్‍గానే వచ్చాయి. అప్పుడు నేను బాబాను, "బాబా! రిపోర్టులు నార్మల్‍గానే ఉన్నా నా నోరు చేదు పోవడం లేదు. నేను మిమ్మల్నే నమ్ముకుని మీ ఊదీ రోజూ నోటిలో వేసుకుంటాను. నోరు చేదు పోయేలా అనుగ్రహించండి బాబా" అని వేడుకుని రోజూ నోరంతా ఊదీ రాసుకుంటూండేదాన్ని. బాబా అనుగ్రహంతో ఒక వారంలో నోరు చేదు తగ్గింది. "బాబా! మీకు నా హృదయపూర్వక వందనాలు. నా అంతరంగంలో ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించే శక్తినివ్వండి బాబా. నాకు సర్వం మీరే బాబా".
ఇకపోతే, ఈమధ్య మా మనవడికి కరోనా సోకింది. దగ్గుతో బాబు బాగా సతమతమవుతున్నాడని నాకు తెలిసి, "బాబా! బాబుకు దగ్గు తగ్గి, ఆరోగ్యం బాగుండాలి" అని బాబాను ప్రార్థించి సాయిసచ్చరిత్ర వారంరోజులు పారాయణ చేశాను. ఆ సమయంలో ఊదీని బాబుకి పెడుతున్న భావనతో నేను పెట్టుకోవడం, బాబు నోట్లో వేస్తున్న భావనతో నా నోట్లో వేసుకోవడం, బాబు ఛాతీకి రాస్తున్నట్లు నేను రాసుకోవడం వంటివి చేస్తుండేదాన్ని. బాబా దయతో బాబు ఆరోగ్యం కుదుటపడింది, దగ్గు కూడా తగ్గింది. ఆ తండ్రి ప్రేమకు కోటానుకోట్ల వందనాలు సమర్పించడం, ఆయన మార్గంలో నడవడం తప్ప మనం ఏమి ఇవ్వగలం?
"బాబా! హృదయపూర్వకంగా మీకు శరణాగతి చేస్తూ..."
- మీ సేవకురాలు(మీ బిడ్డ).
దయతో క్షేమంగా, ఆరోగ్యంగా ఉంచిన బాబా
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నా పేరు హరిత. నేనొక సాయిభక్తురాలిని. నాకు చిన్నప్పటినుండి బాబా తెలుసు. ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదువుతున్నప్పుడు మనసుకి చాలా ధైర్యంగానూ, సంతోషంగానూ ఉంటుంది. మన జీవితంలోనూ బాబా ప్రసాదించే అనుభవాలు జరిగితే బాగుంటుందని అనిపిస్తుంది. నేను ఇదివరకు ఒకసారి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు రెండవసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇటీవల 2022, ఫిబ్రవరి 5, వసంతపంచమి రోజున మేము మా పాపకి అక్షరాభ్యాసం చేయించదలచి, ఆ కార్యక్రమాన్ని వర్గల్‍లోని విద్యాసరస్వతి ఆలయంలో చేయిస్తే మంచిదని అనుకున్నాము. అయితే ఆ సమయంలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నేను, "బాబా! మేమంతా క్షేమంగా ఉండాలి. వర్గల్ నుండి వచ్చిన తర్వాత మాలో ఎవ్వరమూ కరోనా బారిన పడకుండా ఉంటే మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మేము వర్గల్ వెళ్ళినరోజు మేము ఊహించనంత జనం అక్కడికి వచ్చారు. మాకు చాలా భయమేసింది. కానీ బాబా దయవలన మేమందరమూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నాము. "చాలా థ్యాంక్స్ బాబా. నేను ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకున్నందుకు క్షమించండి. నాకు ఇంకొక పెద్ద సమస్య ఉంది తండ్రీ. బ్రెయిన్ ట్యూమర్ అని సర్జరీ జరిగిన నా భర్తకు 5 నెలలైనా పూర్తికాకముందే, మళ్లీ సమస్య మొదలైంది. మా దురదృష్టం కొద్దీ అది క్యాన్సర్ ట్యూమరట. డాక్టర్లు ఇప్పుడు సరైన చికిత్స, సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మాకు చాలా బాధగా ఉంది బాబా. దిక్కులేనివాళ్లలాగా, దారం తెగిన గాలిపటంలా ఉన్నాము. దయచేసి ఈ విషయంలో మీరే ఒక మంచి మార్గదర్శిగా ఉండి, మాకు ఒక దారి చూపించి మావారిని రోగవిముక్తులను చేసి మంచి ఆరోగ్యాన్నిచ్చి, సంపూర్ణమైన ఆయుష్షును ప్రసాదంచండి. ప్లీజ్ బాబా, (నాకు) నా భర్తకు ప్రాణభిక్ష పెట్టండి. అదే జరిగితే, నేను సంతోషంగా నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను".
సాయిని తలచుకుంటే జరగనిది ఏముంటుంది?
నా పేరు రాధాకృష్ణ. మాది రాజమండ్రి. ఆ సాయినాథుని లీలలు ఎన్నని చెప్పేది? ప్రతిదీ ఆ సాయి అనుగ్రహంతో జరిగేవే! అందులో కొన్నింటిని నేను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఆ సాయి కృపవలన ఇప్పుడు మరికొన్ని అనుభవాలను తెలియజేస్తున్నాను. కాకినాడలోని మా అల్లుడుగారి ఇంట్లో వీరభద్రుని సంబరం నిర్వహించినప్పుడు మా పాప, ఏడాది వయసు గల మా మనవడు, ఇంకా మేమందరమూ ఆ కార్యక్రమానికి హాజరయ్యాము. మా వియ్యంకుడు సంబరం చాలా బాగా జరిపించారు. ఆ సమయంలో మా మనవడికి బంగారు ఆభరణాలు వేశాము. సంబరం పూర్తయిన తర్వాత మనవడి చేతి ఉంగరం కనిపించలేదు. అంతా వెతికినా ఉంగరం జాడ తెలియలేదు. అప్పుడు నేను, "ఉంగరం దొరికితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని శ్రీసాయితో చెప్పుకుని నిద్రపోయాను. ఉదయాన్నే పనమ్మాయి చుట్టూ శుభ్రం చేస్తున్నప్పుడు ఆ ఉంగరం దొరికితే మాకు అందజేసింది. సాయిని తలచుకుంటే జరగనిది ఏముంటుంది?
2022, మార్చి మొదటివారంలో మా అమ్మ తన నడుము పట్టేసినట్లుగా ఉంటుందని నాలుగురోజులుగా అంటుంటే హోమియో మందు వేశాము. కానీ అమ్మ బాధ తగ్గలేదు. మార్చి 7న బాధ ఎక్కువై అమ్మ ఏడుస్తుంటే, నేను శ్రీసాయిని మదిలో తలచుకుని, "ఉదయానికల్లా అమ్మకి నడుము బాధ తగ్గితే, మీ బ్లాగులో ఈ అనుభవాన్ని తెలియపరుస్తాను బాబా" అని అనుకుని హోమియోమందు కంటిన్యూ చేశాను. నిజంగా అద్భుతం! మరుసటిరోజు ఉదయం అమ్మ మామూలుగా అన్ని పనులు చేసుకుంది. సాయికి చెప్పుకున్నంతనే ఉదయానికల్లా నొప్పి తగ్గడం ఆ సాయినాథుని లీలకాక ఇంకేమిటి? "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om🕉️🕉️ sai 🙏 Sri 🙏 sai 🙏 jai jai sai 🙏🌹🙏🥀
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete