1. నమ్ముకున్న భక్తులను ఆదుకుంటారు బాబా2. ఆరోగ్యం చేకూర్చిన బాబా
3. అవాంతరం కలగకుండా అనుగ్రహించిన బాబా
నమ్ముకున్న భక్తులను ఆదుకుంటారు బాబా
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా ఆ సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణారవిందములకు కోటి ప్రణామాలు. తోటి సాయి భక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 'సాయీ!' అంటే 'ఓయీ' అని పలుకుతూ, మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకుంటూ, అడిగినంతనే సహాయాన్ని అందిస్తూ అడుగడుగునా తన మహిమల్ని చూపుతున్న ఆ చల్లని తండ్రి మహిమలను నేను మరలా మీతో పంచుకుంటున్నాను. నేను డి.ఎస్సి వ్రాత పరీక్ష వ్రాసి, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన రోజున నా SGT అప్లికేషన్ ఫారంలో తెలుపబడిన నా లోకల్ స్టేటస్‍కి సంబంధించిన సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ ఉన్నప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్ చూపమని ఆఫీసర్ నన్ను అడిగారు. నేను, "ఆ సర్టిఫికెట్ స్కూల్ అసిస్టెంట్(ఆ పోస్టుకి నేను సెలెక్ట్ కాలేదు) అప్లికేషన్ ఫారంతో అటాచ్ చేయబడినందున నా వద్ద లేద"ని స్క్రుటినీ ఆఫీసరుతో చెప్పాను. అప్పుడతను, "ఒరిజినల్ లేకుండా లోకల్ స్టేటస్ ఇవ్వడం అవ్వదమ్మా. పోనీ బి.ఇడి హాల్ టికెట్ ఉందా?" అని అడిగారు. నేను 'లేద'ని (తీసుకుని వెళ్లలేదు) అనడంతో అతను, 'మరెలా?' అని ఆలోచనలో పడి, 'నాన్-లోకల్' అని వ్రాసేస్తానన్నారు. నేను వెంటనే మన చల్లని తండ్రి సాయిబాబాను తలచుకుని, ఆఫీసర్ దగ్గరకు వెళ్లి, "సార్! నా దగ్గర ప్రస్తుతం బి.ఇడి హాల్ టికెట్ లేదు కానీ, నా హాల్ టికెట్ నెంబర్ నాకు గుర్తుంది(ఆ నెంబర్ గుర్తుండడం బాబా కృపే) చెప్తాను" అన్నాను. అందుకు అతను, "చెప్పమ్మా!" అని ఓపికగా నా హాల్ టికెట్ నెంబర్ నోట్ చేసుకుని, తన డ్రైవరును పిలిచి, ఆ నెంబర్ ఇచ్చి, "బి.ఇడి పోస్టుకి పెట్టుకున్న అభ్యర్థుల అప్లికేషన్లు డి.ఈ.ఓ ఆఫీసులో ఉన్నాయి. అక్కడికి వెళ్లి, ఈ నంబరుకి సంబంధించిన అప్లికేషన్ పట్టుకుని రా" అని తాళాలిచ్చి జీపులో పంపారు. అంతే! 25 నిమిషాల్లో అతను ఆ అప్లికేషన్ తేవడం, అందులో ఉన్న లోకల్ సర్టిఫికెట్ ఒరిజినల్ తీసి W.G.S.G.T అప్లికేషన్‍తో జతపరచి, లోకల్ అని వ్రాసి, స్టాంప్ వేసి ఇచ్చారు. నిజంగా ఇదొక అద్భుతం! ఎందుకంటే, అంత బిజీలో నన్ను అంతలా పట్టించుకోవలసిన అవసరం ఆ ఆఫీసర్‍కి అస్సలు లేదు. అయినా, అతను తక్షణమే స్పందించి, మనిషిని పంపించి ఒరిజినల్ సర్టిఫికెట్ తెప్పించడం బాబా అనుగ్రహంకాక మరేమిటి!! నా సాయినాథుడే అతని రూపంలో నాకు సహాయం చేసి దైవం మానుష రూపేణా అని నిరూపించారు. ఇంకా నమ్ముకున్న భక్తులను ఆదుకుంటామన్న తమ మాటను నిలుపుకున్నారు. కాబట్టే నేను ఈరోజు బంగారం లాంటి టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాను. ధన్యవాదాలు బాబా.
కొన్ని కారణాల వల్ల 2022, ఏప్రిల్ మొదటివారం లోపల మేము ఒక ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి మాకు వచ్చింది. అది జరగకుంటే వారసత్వంగా వచ్చిన ఆస్థిని అమ్మడం వల్ల వచ్చిన అమౌంట్‍లో దాదాపు 6లక్షలు రూపాయల వరకు ఇన్కమ్‍టాక్స్ రూపంలో నష్టపోతాము. అది పెద్ద మొత్తమైనందున నేను చాలా టెన్షన్ పడుతూ ఇల్లు కొనుక్కుందామని ఇల్లు వెతకడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో దూర ప్రాంతాలలో కూడా వెతికాము. కానీ సరైన ఇల్లు మాకు దొరకలేదు. ఇలా ఉండగా 5 రోజులపాటు 5 దీపాలు వెలిగించి బాబాకు పూజ చేస్తే కోరిన కోరిక నెరవేరుతుందని చదివి శివరాత్రి రోజున మొదలుపెట్టి శనివారం వరకు 5 దీపాలు పెట్టి, సాయిబాబా జీవితచరిత్ర పుస్తకం భక్తితో చదివి ఆపై, "అంతా మీ దయ" అని ఆ సాయినాథునికి దణ్ణం పెట్టుకున్నాను. తరువాత ఒక పెద్దమనిషి వాస్తు దోషమున్న ఒక ఇంటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే, మా ఫ్యామిలీ ఫ్రెండ్ రూపంలో ఆ సాయినాథుడే ఆ ఇంటి కొనుగోలు జరగకుండా ఆపించారు. ఇలా రోజులు గడుస్తున్నా అనువైన ఇల్లు మాకు దొరకడం లేదన్న తొందరలో నేను ప్రతీరోజూ బాబాను, "మేము నష్టపోకుండా దారి చూపండి బాబా" అని వేడుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు "ఆ భగవంతుడు తలచుకుంటే, ఒక్క రోజులో నీ పని జరిగేలా అనుగ్రహిస్తాడు" అని బాబా మెసేజ్ ఇచ్చారు. తరువాత ఒకరోజు చాలా మామూలుగా మేము మా ఇంటికి దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్‍కి వెళ్లడం, అది మాకు నచ్చటం, ఆ బిల్డర్‍కి మాపై నమ్మకం కలగడం, మాటలు జరగడం, అడ్వాన్స్ ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. చిత్రమేమిటంటే, ఆ అపార్ట్మెంట్‍లో ఆ ఫ్లాట్ ఒక్కటే అమ్ముడుపోకుండా ఉంది. అంటే, ఆ ఇంటిని మాకోసమే బాబా అట్టిపెట్టారనడంలో అతిశయోక్తి లేదు. ఇంకో ముఖ్య విషయం, నేను సొంతింటి కోసం సప్త శనివార వ్రతం కూడా చేశాను. ఆ వ్రతం చేయాలనే సంకల్పం చేయించి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందేలా చేసింది నా బాబాయే. ఆయన నాచేత ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించడమే కాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో ఏడవ శనివారం నాడు ఇంటికోసం అడ్వాన్స్ గా పెద్ద మొత్తం ఇచ్ఛేలా, అలాగే మరుసటి శనివారం నాడు లోన్ మాకు శాంక్షన్ అయ్యేలా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. రిజిస్ట్రేషన్ తొందరగా జరిగేలా అనుగ్రహించండి బాబా. మీ దయతో మేము కొత్త ఇంట్లో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో, సుఖ, శాంతి, సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలి. సకల శుభాలూ పొందాలి. మా బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించి మమ్ము నిరంతరమూ కాపాడండి. మీ భక్తులతో మాకు స్నేహం, బంధుత్వం కలవాలి. క్షణకాలమైన మీ స్మరణను, మీ పాదసేవను వీడకుండా ఉండేలా, అలాగే మా భక్తి మరింత పెంపొందేలా దీవించండి బాబా. నా బలహీనతలను జయించే సామర్ధ్యాన్ని నాకు అనుగ్రహించండి".
చివరిగా సాయి భక్తులకు ఒక మాట: 'ఐదు రోజులపాటు 5 దీపాలు, '5 అగరువత్తులు వెలిగించి, కాస్త నైవేద్యం పెట్టి మీ కోరికను భక్తితో సాయినాథునికి చెప్పుకుని, శరుణు బాబా అనుకోండి. తప్పక బాబా మీ సత్సంకల్పాలను నెరవేరుస్తారు'.
సర్వేజనా సుఖినోభవంతు!!!
ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ఆరోగ్యం చేకూర్చిన బాబా
నా పేరు శ్వేత. ముందుగా అందరికీ నమస్తే. ఒకరోజు మా పెద్దబ్బాయి స్కూలు నుంచి వచ్చాక కడుపులో బాగా నొప్పిగా ఉందని ఏడ్చాడు. నేను బాబా నామస్మరణ చేస్తూ నాకు తెలిసిన ఒక టాబ్లెట్ తనకి ఇచ్చాను. కానీ ఒక రెండు గంటలు వేచి చూసినా తనకి నొప్పి తగ్గలేదు. దాంతో నాకు భయమేసి మావారికి ఫోన్ చేసి విషయం చెప్పి, "మీరు ఆఫీస్ నుంచి త్వరగా రండి. హాస్పిటల్‍కి వెళ్దాం" అని చెప్పాను. ఆయన అరగంటలో ఇంటికి వచ్చారు. వెంటనే బాబుని పక్కనే ఉన్న హాస్పిటల్‍కి తీసుకుని వెళితే, ఒక ఇంజక్షన్ చేశారు. అయితే ఒక గంటైనా బాబుకి నొప్పి తగ్గలేదు. నాకేమీ అర్థంకాక, "బాబా! మీరే బాబుని కాపాడాలి" అని బాబాను వేడుకోసాగాను. తరువాత బాబుని అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాము. అక్కడ బాబుకి ఇంకో ఇంజక్షన్ చేశారు. బాబా దయవల్ల ఒక గంట తర్వాత నొప్పి తగ్గింది. కానీ డాక్టర్స్ ఏదో టెస్టు చేద్దామని అన్నారు. ఆ టెస్టు చేశాక సర్జరీ చేయాల్సి ఉంటుందన్నట్లు అన్నారు. కానీ నాకు మాత్రం, 'బాబా చూసుకుంటారు. సర్జరీ అవసరం ఉండద'ని ఏదో నమ్మకం. ఆ నమ్మకంతో, "రిపోర్టులు నార్మల్ వచ్చి బాబుకి ఏ ప్రాబ్లం లేదని అంటే ఈ అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని బాబాకి మాటిచ్చాను. నా నమ్మకం వమ్ముకాలేదు. మరో టెస్టు చేసి, "ఏం ప్రాబ్లం లేదు. సర్జరీ అక్కర్లేదు. మందులు వేసుకుంటే చాలు" అన్నారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లే నా అనుభవం అందరితో పంచుకున్నాను తండ్రి. ఎప్పుడూ ఇలాగే అందరికీ తోడుగా ఉండి చల్లగా చూడండి సాయి".
అవాంతరం కలగకుండా అనుగ్రహించిన బాబా
సాయి నాన్నకు పాద నమస్కారాలు. సాయి బంధువులకు వందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మేము ఈ మధ్య ఒక టూర్‍కి వెళ్ళాము. వెళ్ళేముందు మా చుట్టాల్లో ఒక అతనికి ఒంట్లో బాగోలేదని తెలిసి, "బాబా! మేము టూర్ నుంచి తిరిగి వచ్చేవరకు ఏ విధమైన ఆటంకాలు రాకుండా చూడు తండ్రి. యాత్ర మధ్యలో అవాంతరం కలగకుండా ఉండేలా దయ చూపండి" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల యాత్ర చాలా బాగా జరిగింది. ఈ మధ్య మా స్నేహితురాలి భర్తకి ట్రాన్స్ ఫర్ అయిందికానీ, పోస్టింగ్ ఇంకా రాలేదు. దత్త భక్తులైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే, నేను వాళ్లతో, "బాబా కృపతో తొందర్లోనే పోస్టింగ్ వస్తుంది" అని చెప్పాను. మీరంతా కూడా బాబాను ప్రార్థించండి. అందరినీ రక్షించే తండ్రి మన అందరినీ రక్షించాలని కోరుకుంటున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఏమైనా మర్చిపోతే నన్ను క్షమించు సాయి తండ్రి".
- సాయి సేవకురాలు.
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete