సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1136వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయుంటే అంతా బాగుంటుంది
2. బాబా దయతో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్
3. నీళ్లు వచ్చేలా చేయడమేగాక సమస్యేమీ లేదని తెలియజేసిన బాబా

బాబా దయుంటే అంతా బాగుంటుంది

 

ఓం శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథాయ నమః!!!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ స్వరూపులైన శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథునికి కోటి పాదాభివందనాలు. నా పేరు సుభాషిణి. నేను బాబా భక్తురాలిని. బాబా గురించి చెప్పాలి అంటే ఒక జన్మ చాలదు, ఎన్నో జన్మలు కావాలి. ఆయన నాకు చాలా సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. మా చిన్నపాపకి దివ్యపూజ చేసిన వారం రోజుల్లోనే పెళ్ళి కుదిరింది. పెద్దపాపకు రెండుసార్లు అబార్షన్ అయి మళ్ళీ గర్భిణిగా ఉన్నప్పుడు 2022, మార్చి 13న తనకి కొంచెం బాగోలేకుంటే డాక్టరు దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాము. కానీ ఆరోజు ఆదివారం అయినందున సాధారణంగా డాక్టరు ఉండరు. అయినా బాబాను తలుచుకుని ఫోన్ చేస్తే, "డాక్టరుగారు ఉన్నారు, రండి" అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది. అయినా డాక్టరు ఏమి చెప్తారోనని నాకు చాలా భయమేసి, "బాబా! నీవే దిక్కు" అనుకుంటూ హాస్పిటల్‍కి పాపను తీసుకుని వెళ్ళాను. బాబా దయవల్ల డాక్టరు, "అంతా బాగానే ఉంది" అన్నారు. అది విని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలా ఇప్పటివరకు బాబా దయవల్ల పాపకి బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. మరల తనకి అబార్షన్ జరగకుండా చూడండి సాయి. మీరే మాకు దిక్కు. రోజూ 'బాబా బాబా' అని మిమ్మల్నే తలుచుకుంటూ మీ ఊదీ తీసుకుంటాము తండ్రి". 


ఒకరోజు రాత్రి నా కాళ్ళు చాలా నొప్పి పెట్టాయి. నేను నా యందు బాబాకున్న దయను తలుచుకుని, "బాబా! నీవే నాకు దిక్కు" అని చెప్పుకుని ఊదీ కాళ్ళకి రాసుకుని పడుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయానికల్లా కాళ్ళ నొప్పులు తగ్గాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే, ఆ నొప్పి తగ్గి, నేను లేచి పని చేస్తానని అస్సలు అనుకోలేదు. అంతటి నొప్పి తగ్గింది. అది బాబా చలవే. "తండ్రీ! నన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉండు".


మా చిన్నల్లుడువాళ్ళు హైదరాబాదులో ఉంటారు. ఒకరోజు మా అమ్మాయి ఫోన్ చేసి, "మీ అల్లుడి ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ దగ్గరకి వెళితే స్కానింగు చేయించారు. ఆ రిపోర్టు చూసి, 'ఈ స్కానింగ్ బట్టి సరిగా అర్థం కావట్లేదు', అని పెద్ద స్కాన్ వ్రాసారు" అని చెప్పింది. నాకు చాలా భయమేసి, "బాబా! నీవే దిక్కు" అని బాబాను తలుచుకుని, "అల్లుడికి ఊదీ ఇవ్వు" అని చెప్పాను. వాళ్ళు అలాగే చేసి మరుసటిరోజు పెద్ద ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ స్కానింగులో బాబా దయవలన సమస్య ఏమీ లేదని వచ్చింది. డాక్టరు "అంతా బాగానే ఉంది" అని చెప్పి ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. విషయం తెలిసి నేను చాలా సంతోషించి బాబాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "ధన్యవాదాలు బాబా. అందరినీ కాపాడేది మీరే తండ్రి. మీరే మాకు దిక్కు. అందరినీ చల్లగా చూడు తండ్రి".


ఓం సాయిబాబా!!!


బాబా దయతో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్


నేను ఒక సాయి భక్తురాలిని. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. నేను బి.ఫార్మసీ పూర్తి చేశాను. కానీ పి.సి.ఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో బాగా ఆలస్యమైంది. చాలారోజుల తర్వాత నేను నా సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకుని రిజిస్ట్రేషన్‍కి అప్లై చేద్దామని అనుకున్నాను. కానీ చాలా ఆలస్యమైనందువల్ల ఏమైనా సమస్య అవుతుందేమోనని టెన్షన్ పడ్డాను. అప్పుడు, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయ్యేలా చూడు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. తరువాత టెన్షన్ పడుతూనే పి.సి.ఐ ఆఫీసుకు వెళ్ళాను. అయితే నేను కొన్ని సర్టిఫికెట్లు తీసుకు వెళ్ళడం మర్చిపోయాను. అవికాక వేరే సర్టిఫికెట్లలో కొన్ని మార్పులు కూడా చేయించాలని కార్యాలయ సిబ్బంది చెప్పారు. దాంతో నేను కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లో సంవత్సరం మార్పించుకుని మళ్లీ పి.సి.ఐ ఆఫీసుకి వెళ్ళాను. అప్పుడు కూడా ఏదో ప్రాబ్లెమ్ చూపించారు. అలా మూడుసార్లు ఆఫీసుకి వెళ్లడం, రావడం జరిగాక నాలుగవసారి వెళ్ళినప్పుడు బాబా దయతో నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు ఉంటే ఏ పనైనా ఖచ్చితంగా పూర్తవుతుందని స్పష్టం చేశారు సాయి. అమ్మ ఆరోగ్యం బాగుండేలా చూడండి బాబా. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎప్పటికీ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను బాబా. ఇంకా ప్రతి ఒక్కరూ సదా మీ నామస్మరణ చేసుకునేలా ఆశీర్వదించండి బాబా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి సాయి". 


ఓం సాయి రక్షక శరణం దేవా!!!


నీళ్లు వచ్చేలా చేయడమేగాక సమస్యేమీ లేదని తెలియజేసిన బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను సాయి భక్తురాలిని. సాధారణంగా మా ప్రాంతంలో నీళ్లు అర్థరాత్రి వస్తుంటాయి. మా అమ్మగారు మధ్య రాత్రిలో నిద్రలేచి మోటారు స్విచ్ ఆన్ చేసి నీళ్లు వస్తున్నాయో, లేదో చెక్ చేసి, నీళ్ళు వస్తుంటే గనక పైన ట్యాంకులోకి నీళ్లు ఎక్కించి మళ్ళీ నిద్రపోయేవారు. 2020 నుండి రెండు సంవత్సరాలు మా మోటార్ నీళ్లు నెమ్మదిగా వస్తుండటం, కాసేపు మోటారు ఆన్ చేయకుండా ఉంచితే డ్రై అయిపోయి నీళ్లు రాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పెడుతుండేది. ఇలా ఉండగా 2022, మార్చి 10, గురువారం నుండి అయితే రాత్రి వేళ నీళ్ళకి చాలా ఇబ్బందిగా అయింది. ఒకరోజు రాత్రి నిద్రపోకుండా దాదాపు తెల్లవారుఝామున 3, 4 గంటల వరకు నీళ్లు వస్తున్నాయేమోనని చూస్తూనే ఉన్నాగాని ఉపయోగం లేకపోయింది. దాంతో మోటారు ప్రాబ్లమేమో అని అనుకున్నాం. తరువాత రోజు మామూలుగానే అమ్మ రాత్రి 12 గంటలకి నీళ్లు వస్తున్నాయేమోనని చూస్తే, రావట్లేదు. అప్పుడు నేను 3 గంటలకి మళ్ళీ చూద్దాం, రాకుంటే మోటారు రిపేరే అనుకుని పడుకోవటానికి సిద్దమై బ్లాగు ఓపెన్ చేసి ఆరోజు అనుభవాలు చదువుదామనుకున్నాను. వెంటనే బాబాకి చెప్పుకోవాలని గుర్తొచ్చి, "బాబా! 3 గంటలకి ఏ సమస్య లేకుండా నీళ్లు వచ్చేలా అనుగ్రహించండి" అని బాబాకి చెప్పుకున్నాను. అయితే 3 గంటలకి స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు రాలేదు. కానీ మళ్ళీ 5 గంటలకి అమ్మ చూస్తే, బాబా దయవల్ల నీళ్లు వచ్చాయి. ఇంకా మా మోటారుకి ఏ రిపేర్ లేదని బాబా తెలియజేసారు. "థాంక్యూ బాబా. లవ్ యు బాబా".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo