ఈ భాగంలో అనుభవాలు:
1. సొంతింటి కలను నెరవేర్చిన బాబా2. అమ్మ ఆరోగ్య విషయంలో సాయి చూపిన ప్రేమ3. సాయిని నమ్ముకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి
సొంతింటి కలను నెరవేర్చిన బాబా
సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
నా పేరు కె.లక్ష్మీనారాయణ. నేను విశాఖపట్నం నివాసిని. అశేష బాబా భక్తులను ఈ బ్లాగు ద్వారా కలుపుతూ మాకొచ్చే సందేహాలను భక్తులు అనుభవాల ద్వారా తీరుస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా వందనాలు. నేను ఇదివరకు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవంతో మీ ముందుకు వచ్చాను. సంవత్సరం క్రితం మేము విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుని మా ఈ కోరికను నెరవేరుస్తారని బాబా మీద భారం వేసాము. ఆ సంవత్సర కాలంలో మేము ఏవో కొన్ని ప్రయత్నాలు చేసాముకానీ, అవేవీ ఫలించలేదు. ఈ లోపు అందరమూ కరోనా బారిన పడటం, నేను పదవీ విరమణ చేయడం జరిగాయి. పదవీ విరమణ చేసినందున నాకు బ్యాంకు లోన్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా అబ్బాయి పేరు మీద లోన్ తీసుకోవాలనుకున్నాము. కానీ, అది కూడా కుదరలేదు. దాంతో ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనను దాదాపు విరమించుకున్నాము. అయితే 2021, డిసెంబరులో మా అబ్బాయి చివరిసారిగా మరోసారి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఒక ఇల్లు మాకు నచ్చింది. మా బడ్జెట్‍కి కొంచెం ఎక్కువైనా సరే ఆ ఇంటిని కొనాలని నిర్ణయం తీసుకున్నాo. కానీ మా అబ్బాయి ఉద్యోగంలో చేరి సంవత్సరం కూడా అవ్వకపోవడంతో మేము అడిగినంత బ్యాంకు లోన్ ఇవ్వలేమన్నారు బ్యాంకువాళ్ళు. అయితే మేము అప్పటికే బిల్డర్‍కి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. మాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. రెండు రోజులు ఒకటే టెన్షన్. ఆ స్థితిలో బిల్డర్, "ఆ బ్యాంకు కాకపోతే మరో బ్యాంకులో చూద్దాం" అన్నారు. అయితే సర్వీస్ లేకపోవడం వల్ల ఏ బ్యాంకువాళ్ళు మా అబ్బాయికి ఇవ్వకపోవచ్చు. అయినా బాబా మీద భారం వేసి మరొక బ్యాంకుని సంప్రదించాం. వాళ్ళు ఒకసారి లోన్ వస్తుందని, మరోసారి రాదని మమ్మల్ని టెన్షన్ పెట్టారు. అప్పుడు నేను, "బాబా! లోన్ కనుక వస్తే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. శిరిడీ వచ్చి మీ దర్సనం చేసుకుంటాన"ని అనుకున్నాను. ఇలా అనుకున్న తర్వాత ఈ బ్లాగు ద్వారా, "నువ్వు వీలయినంత త్వరగా ఇంటిని నిర్మించు. అందులోకి నేను రావాలనుకుంటున్నాను" అన్న బాబా సందేశం వచ్చింది. అది చూసి నా కళ్ళ వెంట ఆనందభాష్పాలు ధార కట్టాయి, నన్ను నేను నియింత్రించుకోలేకపోయాను. ఎట్టకేలకు బాబా దయవల్ల డిసెంబర్ 21న బ్యాంకువాళ్ళు లోన్ మంజూరు చేసారు. అయితే మేము అనుకున్న దానికన్నా కొంత తక్కువ. కావాల్సిన ఆ మిగతా సొమ్మును నాకు అత్యంత ఆప్తుడైన కాళీపట్నం ఉమ ఇచ్చారు. వెనువెంటనే అంటే అదేరోజు ఇల్లు రిజిస్ట్రేషన్ కేవలం ఒక అరగంటలో అయిపోగా ఆ డాకుమెంట్లు మా చేతికి ఇచ్చి బిల్డర్ వెళ్లిపోయారు. నిజంగా ఇది నేను నమ్మలేకున్నాను. కేవలం ఇదంతా బాబా కృపవల్ల మాత్రమే జరిగింది. అడుగడుగునా నన్ను నడిపిస్తూ నాకు వచ్చిన ప్రతీ సమస్యకు ఈ బ్లాగు ద్వారా సరైన సమాధానాలను ఇస్తున్న ఆ శిరిడీ సాయినాథునికి నేను ఏ విధంగా సేవ చేయగలను? ఏదేమైనా విశాఖపట్నంలో నా సొంతింటి కలను నెరవేర్చిన బాబాకు శతకోటి వందనాలు. కరోనా సమయంలో మా కుటుంబమంతటిని 'నేనున్నాను' అంటూ అనుక్షణం కాపాడిన బాబాకు సర్వదా కృతజ్ఞతలు. వీలైనంత త్వరగా తమ దర్శనభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బాబాను కోరుకుంటున్నాను. చివరిగా నన్ను సకాలంలో ఆదుకున్న నా ఆప్తమిత్రుడు ఉమకి ధన్యవాదాలు.
అమ్మ ఆరోగ్య విషయంలో సాయి చూపిన ప్రేమ
ముందుగా నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సద్గురు శ్రీసాయినాథునికి నా సాష్టాంగ ప్రణామాలు. అలాగే ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి స్వరూపమైన సాయికి నా కృతజ్ఞతలు, అలాగే ఆ సద్గురు సాయి ఆశీస్సులు. నా పేరు కె. నాగార్జున. నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు నా తల్లి విషయంలో ఆ సాయి చూపిన ప్రేమ గురించి పంచుకుంటున్నాను. మా అమ్మగారి పేరు పాప మహాలక్ష్మి. కొంతకాలంగా ఆమెకు అనారోగ్యంగా ఉంటుంది. ఆమెకు పొత్తి కడుపులో నొప్పి వస్తూండేదంట. ఆ విషయం రెండు సంవత్సరాల వరకు మాకు చెప్పలేదు. కరోనా వ్యాక్సిన్ వేసినప్పుడు ఒక్కసారిగా ఆమె ప్రాణాల మీదకి వచ్చింది. దాంతో అమ్మ తన పొత్తికడుపు నొప్పి గురించి మాకు చెప్పింది. అప్పటికి 20 రోజుల ముందే మా పెద్దమ్మగారు క్యాన్సర్‍తో కాలం చెంది ఉండటం వలన మాకు చాలా భయమేసింది. మా భయానికి కారణమేమిటంటే, మా పెద్దమ్మకు నొప్పి వచ్చిన చోటే తనకీ నొప్పి వస్తుందని మా అమ్మ చెప్పింది. శనివారం మధ్యాహ్నం మాకు ఈ విషయం తెలిసింది. మరుసటిరోజు ఆదివారం కావడం వల్ల రాజమండ్రిలో హాస్పిటల్స్ సెలవు ఉంటాయి. కాబట్టి విషయం తెలిసినప్పటినుండి మేము బాబానే శరణువేడి ఊదీ నీటిలో కలిపి అమ్మకి ఇవ్వసాగాము. 2021, సెప్టెంబర్ 20, సోమవారం ఉదయం నేను, మా బంధువులు కలిసి అమ్మని హాస్పిటల్‍కి తీసుకుని వెళ్తూ దారిలో బాబా మందిరం దగ్గర బయట నుండే నమస్కరించుకుంటుండగా "నేనుండుగా భయమేలా?" అనే మాటలు నాకు వినిపించి ఏదో తెలియని తన్మయత్వం, ఆనందం కలిగాయి. హాస్పిటల్‍కి వెళ్ళాక టెస్టులు చేసి, రిపోర్టులు ఇచ్చారు. డాక్టరు ఆ రిపోర్టులు చూసి, "వెంటనే సర్జరీ చేయాలి. లేకపోత ప్రమాదం" అన్నారు. "ఇంతకీ సమస్య ఏమిట"ని అడిగితే, "ప్రేగు మడత పడింది. యూరిన్ సంబంధిత ప్రేగు అయినందున నొప్పి వస్తుంది. వెంటనే సర్జరీ ద్వారా ఆ మడతను తొలగించాలి. సుమారు 50,000 రూపాయల వరకు అవుతుంది" అని అన్నారు. ఇంకా మాది వ్యవసాయ కుటుంబమైనందున "ఆరోగ్యశ్రీ ద్వారా సర్జరీ చేద్దామ"ని అన్నారు. అక్కడున్నది లేడీ డాక్టరే కాబట్టి ఇబ్బంది ఉండదని నాకనిపించి, రెండు రోజులకు మందులిమ్మని అడిగి, ఆ మందులు తీసుకుని ఆరోజుకి ఇంటికి వెళ్లి మళ్ళీ మరుసటిరోజు సాయంత్రం అదే హాస్పటల్‍కి వెళ్ళి అమ్మని అడ్మిట్ చేసాము. 2021, సెప్టెంబర్ 23, తెల్లవారుఝామున 4 గంటలకు అమ్మకి సర్జరీ చేయడానికి నిర్ణయించారు. సర్జరీ చేయించుకోవడానికి వెళ్లేముందు అమ్మ సచ్చరిత్ర పుస్తకానికి దణ్ణం పెట్టుకుని, కొద్దిగా బాబా ఊదీ నోటిలో వేసుకుంది. కానీ భయంతో నా బంధువులను పట్టుకుని ఏడుస్తుంటే నేను తనతో, "బాబా ఉండగా భయమెందుకు? ఆయనని తలుచుకుని ధైర్యంగా వెళ్ళమ్మా" అని చెప్పాను. ఆపరేషన్ థియేటర్‍లో బాబా ప్రతిమ ఉందట. అమ్మకి మత్తుమందు ఇచ్చే డాక్టరు అమ్మతో, "నేనుండగా భయమేలా?" అని అన్నారట. ఇంకో విషయం, ఆ డాక్టరు ముఖం గడ్డంతో బాబాని పోలినట్లే ఉందట. దాంతో అప్పటివరకు భయపడిన అమ్మకు ఏదో తెలియని ధైర్యం వచ్చి సర్జరీ చేయించుకుందట. బాబా దయవలన సర్జరీ విజయవంతమై అమ్మ కోలుకుంటూ ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. "బాబా! ఇలా నా జీవితంలో చాలా ఆనందాలు మీవల్లే కలిగాయి తండ్రి. అన్నిటికి ధన్యవాదాలు బాబా. అమ్మకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడు తండ్రి. అలాగే నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు తండ్రి. ఇంకా నాకు ఎప్పుడు ఏమి కావాల్సి ఉన్నా మీరే ఇవ్వాలి తండ్రి. సద్గురుమూర్తి, సాయినాథా! ఈ అనుభవాన్ని ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించు తండ్రి". మరొక అద్భుతమైన అనుభవంతో మళ్ళీ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!
సాయిని నమ్ముకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి
సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నడుపుతున్న సాయికి వందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. ఇప్పుడు నేను ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఈ మధ్య ఒక ఫంక్షన్ విషయంగా మా అమ్మ మా ఇంటికొచ్చింది. ఫంక్షన్ అయిపోయాక అమ్మ ఊరెళ్ళే సమయానికి తన పర్సు కనిపించలేదు. అందులో కొంచెం డబ్బులు ఉన్నాయి. నేను ఇల్లంతా చాలాసేపు వెతికాను. అయినా లాభం లేకపోయింది. ఫంక్షన్ సమయంలో ఆ పర్సు ఎక్కడో పడిపోయి ఉంటుందని అనుకున్నాం. అయినా నేను బాబాపై నమ్మకంతో 'పర్సు దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. అలా అనుకున్న 10 నిమిషాలకి ఇంట్లోనే పర్సు కనపడింది. సాయిని నమ్ముకుంటే అన్నీ సవ్యంగా జరుగుతాయి. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవం పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైంది దయచేసి నన్ను క్షమించండి బాబా. మేము తిరుమల దర్శనానికి వెళ్తున్నాం. మా ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగేలా చూడండి సాయి".
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయిరాం
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm Sai Ram
ReplyDelete