సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1135వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ప్రేమతో కాపాడే సాయితండ్రి
2. జరగనున్నది నా నోటే పలికించిన బాబా

ప్రేమతో కాపాడే సాయితండ్రి


ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు లక్ష్మి. మేము హైదరాబాదులో ఉంటాము. నేను ఇంతకుముందు రెండుసార్లు బాబా ప్రేమను మీతో పంచుకున్నాను. మరలా ఇప్పుడు బాబా ప్రేమకు చిహ్నాలైన మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. 2021, సెప్టెంబరు నెలలో ఒకరోజు నేను బాబా గుడికి వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు మెట్లు దిగుతుండగా చూసుకోకుండా అక్కడున్న తడి మీద అడుగువేయడంతో నా కాలుజారి మెలితిరిగి పడిపోబోయాను. ప్రక్కనున్న గోడను పట్టుకుని కూర్చుండిపోయాను కానీ, కాలు ఫ్రాక్చర్ అయిందేమోనని నాకు చాలా భయమేసింది. నాతోపాటు ఉన్న ఆంటీ, ఫ్రెండ్ నన్ను వెంటనే హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లారు. డాక్టరు చూసి, "ఫ్రాక్చర్ అయ్యింది. కానీ డిస్‌ప్లేస్ అవలేదు, అదృష్టం"  అని చెప్పి, కట్టుకట్టి, "నెల పదిహేను రోజులు బెడ్ రెస్టు తీసుకోండి" అని చెప్పారు. అయినా, 'నాకెందుకు ఇలా జరిగింద'న్న బాధ మాత్రం నాకు కలగలేదు. ఎందుకంటే, ఆ సమయంలో నేను అక్కడ పడకుండా, బండి మీద వెళుతూ రోడ్డు మీద పడితే చాలా పెద్ద ప్రమాదం జరిగేదేమో, సహాయం అందించడానికి నా ప్రక్కన ఎవరూ ఉండేవాళ్ళు కాదేమో!. ప్రారబ్ధరీత్యా జరిగేది జరగక మానదు కదా! కానీ బాబా పెద్దదాన్ని చిన్నదానితో పోగొడతారు. ఆయన నన్ను తర్వగా బయలుదేరనివ్వకుండా చేసి, చిన్న ఫ్రాక్చర్‌తో నన్ను ఇంటికి చేర్చారు. నేను బెడ్ రెస్టులో ఉన్నప్పుడు ఇంట్లోవాళ్ళు పనుల మీద బయటకి వెళ్లి వస్తుండేవాళ్లు. ఒకసారి చిన్నగా నా గొంతు పట్టేసినట్లు అనిపించి నాకు చాలా భయమేసింది. వెంటనే నేను, "బాబా! ఏ ఇబ్బందీ లేకుండా త్వరగా ఈ గొంతు బాధ తగ్గేటట్లు అనుగ్రహించండి" అని సాయిని వేడుకుని ఊదీని నీళ్లలో వేసుకుని త్రాగడం చేశాను. బాబా దయవల్ల రెండురోజుల్లో గొంతు సమస్య తగ్గిపోయింది. "సాయీ! మీ ప్రేమకు చాలా చాలా కృతజ్ఞురాలిని".


కరోనా కేసులు తక్కువగా ఉన్న సమయంలో మా బంధువులొకరికి కరోనా(డెల్టా వేరియంట్) సోకి చాలా ఇబ్బంది కలిగింది. ఒక నెలరోజులపాటు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆ సమయంలో నేను, "తను త్వరగా కోలుకునేలా చేయండి సాయీ. తనకి ఏమైనా అయితే తన కుటుంబం దిక్కులేనిదైపోతుంది. దయచేసి తనని కాపాడండి" అని సాయిని పరిపరివిధాల వేడుకుంటూ, "తను కోలుకుంటే, మీ ప్రేమను తోటి భక్తులతో పంచుకుంటాన"ని సాయికి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన తను కొంతకాలానికి కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇప్పుడు తను తన కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. ఎంతటి కష్టంలో ఉన్నా దయతో బాబా మనల్ని బయటపడేస్తారు.


ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్న సమయంలో మా బాబుకి ఒకరోజు జ్వరం వచ్చింది. అసలే తనకి అలర్జీ, ఆయాసం కూడా ఉన్నాయి. అందువల్ల నాకు చాలా భయమేసి బాబాని వేడుకుని కొద్దిగా ఊదీని నీళ్లలో కలిపి బాబు చేత త్రాగించి, డోలో టాబ్లెట్ వేసి పడుకోబెట్టాను. కాసేపటికి బాబుకి జ్వరం తగ్గింది. అయితే మరుసటిరోజు పొద్దున్న మరల కాస్త జ్వరం వచ్చేసరికి నాకు వణుకు మొదలయింది. బాబా వద్దకి వెళ్ళి, "బిడ్డని కాపాడండి బాబా" అని పరిపరివిధాల వేడుకున్నాను. అంతే, బాబుకి మళ్ళీ జ్వరం రాలేదు. అయితే దగ్గు మొదలైంది. బాబా దయవల్ల యాంటీబయాటిక్ వేస్తే అది కూడా తగ్గిపోయింది. డాక్టరు మామూలు జ్వరమని అన్నారు. తరువాత వారంలో నాకు జ్వరం వచ్చింది. నాకు వణుకు కూడా ఉండేది. డాక్టరు స్టమక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయోటిక్స్ ఇచ్చారు. నేను బాబా ఊదీ నీళ్ళు త్రాగుతూ మందులు వేసుకున్నాను. బాబా దయవలన 3 రోజుల్లో తగ్గింది. తరువాత నాకు కూడా దగ్గు వచ్చింది. అదలా ఉంచితే బాబా దయవల్ల మావారికి, పనిమనిషికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు.


ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబానికి, మా మరిదిగారి కుటుంబానికి మధ్య ఆస్తి పంపకాలు జరగక మేము చాలు బాధపడ్డాము. ఆ విషయంలో నేను, "బాబా! ఎటువంటి గొడవలు జరుగకుండా అస్తిపంపకాలు అయ్యేలా చేయండి. న్యాయంగా మాకు రావలసింది వచ్చేలా అనుగ్రహించండి" అని సాయిని వేడుకుంటుండేదాన్ని. సాయి దివ్యపూజ కూడా చేస్తుండేదాన్ని. చివరికి ఈ మధ్యనే బాబా మా కోరిక మన్నించారు. "ధన్యవాదాలు బాబా. కానీ ఇంకా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. కొంత పొలం చుక్కల భూమిలో పడి మా మరిదిగారి రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. ఆ స్థలంలో ఉన్న సమస్యలను తొలిగించి వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యేలా చేయండి సాయి. అప్పుడే నాకు సంతోషం, ప్రశాంతత సాయి. ఈ అనుభవాలన్నీ ఆలస్యంగా పంచుకున్నందుకు క్షమించండి బాబా".


2022, మార్చి 15న మావారు హెల్త్ చెక్ అప్ చేయించుకుంటే, థ్రెడ్ మిల్ మరియు 2డి ఎకోలో కాస్త ఇబ్బంది ఉందని సిటి, ఆంజియోగ్రామ్ చేయాలని మరుసటిరోజు చేస్తామన్నారు. నాకు బాబా మీద నమ్మకం. మరుసటిరోజు పొద్దుటి నుండి నేను బాబాను, "తండ్రీ! మావారికి ఎటువంటి పెద్ద సమస్య లేకుండా, కాస్త చిన్న సమస్యతో బయటపడేయండి. అదే జరిగితే ఈ అనుభవాన్ని ఈరోజే బ్లాగుకి పంపుతాను" అని వేడుకుండేదాన్ని. బాబా నా మొర ఆలకించారు. డాక్టరు మావారికి 60 టు 60% బ్లాక్ ఒకటి, 25% బ్లాక్ ఒకటి ఉన్నాయని చెప్పి, "రెండునెలలు మందులు వాడండి. అవసరం అయితే అప్పుడు తదుపరి చికిత్స గురించి చూద్దాం" అన్నారు. "ధన్యవాదాలు బాబా! ఈరోజు మావారి పుట్టినరోజు. మీ దయవలన ఆయన నిండునూరేళ్ళు చల్లగా ఉండాలి. మమ్మల్ని, మీ బిడ్డలందరినీ ప్రేమతో కాపాడండి సాయి. అందరికీ విద్యను, ఆరోగ్యాన్ని, నిండు నూరేళ్ళ జీవితాన్ని, మీ పాదాల యందు పరిపూర్ణ భక్తి, విశ్వాసాలను అనుగ్రహించండి సాయి. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి అందరినీ రక్షించండి".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


జరగనున్నది నా నోటే పలికించిన బాబా


నా పేరు శ్రీలత. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవం పంచుకుంటున్నాను. 2020, ఫిబ్రవరిలో మా పిన్ని హిరణ్మయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. డాక్టర్లు స్పష్టంగా ఏమీ చెప్పలేదు. ఈ విషయం నాకు కొద్దిగా ఆలస్యంగా తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఆమె ఆరోగ్యంకోసం సచ్చరిత్ర పారాయణ చేద్దామని, అది కూడా ఒకేరోజు పూర్తి చేద్దామనుకున్నాను. అనుకున్నట్లుగానే మరుసటిరోజు ఏడుగురం కలిసి ఒక్కొక్కరం ఒక్కోరోజు పారాయణ చొప్పున సచ్చరిత్ర మొత్తం పారాయణ చేసాము. అయితే నేను 42వ అధ్యాయం పారాయణ చేసినంతసేపు '7 సప్తాహ్' అని నాకు వినపడింది. నాకు 'బాబా సప్తాహం చేయమ'ని చెప్తున్నారనిపించిందికానీ అప్పటికే రాత్రి 10గంటలు అయినందున, 'ఈ విషయమై ఈ సమయంలో ఎవరినీ సంప్రదించలేను. ప్రొద్దున్నే కనుక్కోవచ్చు' అనుకున్నాను. తరువాత పిన్ని ఎలా ఉందో కనుక్కుందామని తమ్ముడికి ఫోన్ చేసాను. తనతో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్లో "అమ్మ రేపు పొద్దున్నే లేస్తుంది. ఏమీ బాధపడకు" అని నేను తనకి ధైర్యం చెప్పి, ఫోన్ పెట్టేసాను. మరుసటిరోజు ఉదయం నేను అందరికీ ఫోన్ చేసి, "బాబా సప్తాహ్ అంటున్నారు. అందుకే సప్తాహ పారాయణ చేద్దామనుకుంటున్నాను. మరి మీరు ఏమంటారు?" అని అడిగి, నేను పనిచేస్తున్న పాఠశాలకి ఉదయం 8.00 గంటలకు బయలుదేరి 9.30కు పాఠశాలకు చేరే లోపల గ్రూపు రెడీ చేద్దామని చూసానుకానీ సాధ్యపడలేదు. 11.00 గంటలకు గ్రూపు తయారు అయ్యింది. అందరినీ ఆరోజుకు సంబంధించి ఎవరి పారాయణను వారిని చేయమని చెప్పాను. ఈలోగా మా తమ్ముడు ఫోన్ చేసి, "అక్కా! ఈరోజు తెల్లవారు ఝామున 4.00 గంటల సమయంలో అమ్మకు స్పృహ వచ్చింది" అని చెప్పాడు. నాకు చాలా సంతోషం కలిగింది. ముందురోజు నా నోట ఆ మాటను బాబా ఎలా చెప్పించారో కానీ, సప్తాహ పారాయణ చేస్తామని మొదలుపెట్టగానే పిన్నికి స్పృహ వచ్చిందన్న వార్త తెలియటం, అసలు ఇది ఎట్లా సాధ్యమని నా ఒళ్ళు గగుర్పాటు చెంది కొద్దిసేపటివరకూ నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఈ అనుభవం నేను ఎప్పటికీ మరువలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


6 comments:

  1. Om sai ram 🙏

    ReplyDelete
  2. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  4. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo