సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1151వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు బాబా
2. అనుక్షణం బాబా చూపుతున్న దయ
3. బాబా కృపతో MD సీటు

నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' అనే అద్భుతమైన బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలామృతాన్ని భక్తులకు అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, వారికి ఆ సాయి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. నేను నా గత అనుభవంలో డాక్టరు నా భార్యకి అనామోలీ స్కాన్ బయట చేయించమని చెప్పారని చెప్పాను. 2022, ఏప్రిల్ 4న మనస్ఫూర్తిగా బాబాకి నమస్కరించుకుని, ఆ స్కాన్ చేయించడానికి హాస్పటల్‌కి వెళ్ళాము. అప్పుడు నేను, "బాబా! రిపోర్టులు నార్మల్ అని వస్తే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను  ప్రార్థించాను. ఆ బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్ అని వచ్చాయి. నమ్ముకున్న వాళ్లపై ఎప్పుడూ బాబా దయ చూపుతారు.


2022, ఫిబ్రవరి 26న మేము హాస్పిటల్‍కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్ ఐడి కార్డు ఉపయోగించాము. డాక్టరు మళ్ళీ మార్చి 18న రమ్మంటే ఇంటికి తిరిగి వచ్చాము. తరువాత చూసుకుంటే పేషేంట్ ఐడి కార్డు కనిపించలేదు. ఎంత వెతికినా కార్డు జాడ తెలియలేదు. అప్పుడు మేము బాబాకి నమస్కరించి, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని స్మరిస్తూ మళ్ళీ వెతికాము. అయినా కార్డు దొరకలేదు. ఇక చేసేది లేక ఐడి కార్డు లేకుండానే మార్చ్ 18న హాస్పిటల్‍కి వెళ్ళాం. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ జరిగింది. తరువాత చాలా రోజులకి ఒక షర్ట్ జేబులో ఆ కార్డు దొరికింది. ఈ అనుభవం ద్వారా బాబాపై నమ్మకముంచి సబూరీతో ఉంటే ఎలాంటి పనిలోనైనా బాబా సహాయం లభిస్తుందని నేను గ్రహించాను.


ఇప్పుడు నా ఉద్యోగంలో సాయినాథుడు చూపిన దయ గురించి పంచుకుంటాను. నేను రైల్వే ఉద్యోగిని. 2022, ఫిబ్రవరిలో సరిగ్గా జి.ఎమ్. ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఒక మెషిన్ సరిగా పని చేయలేదు. ఆ కారణంగా మా మీద కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. నెల రోజుల తరువాత మా డిపార్ట్మెంట్‌కి సంబంధించిన జోనల్ అధికారి ఒకరు ఇన్స్పెక్షన్‌కి వస్తానని అన్నారు. గతంలో జరిగిన అదే పొరపాటు మళ్ళీ జరగకూడదని మేము చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ సాయినాథుని, "ఎటువంటి ఇబ్బందులు రాకుదదు" అని వేడుకున్నాం. బాబా దయవల్ల ఇన్స్పెక్షన్ బాగా జరిగింది. తరువాత మేము ఆ జోనల్ అధికారితో "మా డివిజనల్ ఆఫీసర్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నార"ని మా కష్ఠాలు చెప్పుకున్నాం. ఆ విషయం మా డివిజనల్ ఆఫీసర్లకి తెలిసి మా మీద చాలా సీరియస్ అయి మరుసటిరోజు మా మీద విచారణ జరిపి, చార్జిషీట్ కూడా ఇస్తామని భయపెట్టారు. ఆ సమయంలో నేను, "ఎటువంటి విచారణ చేయడంగాని, చార్జిషీట్ ఇవ్వడంగాని జరగకుండా ఉంటే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మొక్కుకున్నాను. ఆయన దయవల్ల ఇప్పటివరకు విచారణ వంటివేవీ జరగలేదు. భవిష్యత్‍లో కూడా అటువంటివి జరగవని, మాకు పనిష్మెంట్ రాదని నమ్ముతున్నాను. ఎందుకంటే, బాబా ఎప్పుడూ నమ్మినవాళ్ళ వెన్నంటుండి ఆదుకుంటారు. "ప్రణామాలు బాబా! ఎప్పటినుండో పెండింగ్‌లో ఉన్న నా ప్రమోషన్ త్వరగా వచ్చేలా చూడు తండ్రి. మేము తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణాకటాక్షాలు ఉండేలా అనుగ్రహించు తండ్రి".


ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


అనుక్షణం బాబా చూపుతున్న దయ


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నడుపుతున్న సాయి సోదరునికి కృతజ్ఞతలు. నా పేరు లత. నేను ఇంతకు ముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒకరోజు రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు బాబాను ప్రార్థించి, ఊదీని నీళ్ళలో వేసుకుని త్రాగాను. అంతే, కొద్దిసేపట్లో నాకు ఆ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభించింది. "థ్యాంక్యూ బాబా".


ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక మావారు బాగా వీక్ అయిపోయారు. నాకు చాలా భయమేసి, "బాబా! నీవే దిక్కు తండ్రీ" అని బాబాను ప్రార్ధించి రోజూ ఊదీ నీళ్ళు మావారి చేత త్రాగించాను. కొద్దిరోజుల్లోనే మావారిలో చాలా మార్పు వచ్చి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఇది నా తండ్రి సాయినాథుని అనుగ్రహమే. తరువాత మావారికి బైపాస్ సర్జరీ జరిగి ఒక సంవత్సరం అవుతుందని చెకప్‍కి వెళ్ళాము. బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్‍గా వచ్చాయి. "బాబా! ఏమిచ్చి  మీ ఋణం తీర్చుకోగలనయ్యా, మీ పాదాల చెంత సర్వస్య శరణాగతి చేయటం తప్ప".


ఒకసారి మా మనవడి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని డాక్టరు చెప్పారు. అప్పుడు నేను బాబాను ప్రార్ధించి, 'ఇన్ఫెక్షన్ తగ్గితే బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. కొద్దిరోజుల్లో ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. మీ దయవలన బాబు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు తండ్రీ! ఎంతని చెప్పను మీ దయాకరుణల గురించి. ఇలాగే మీ ప్రేమను ఎల్లప్పుడూ వర్షిస్తూ మమ్ము చల్లగా చూడమని కోరుతూ మీ ఈ బిడ్డ ఈ బ్లాగు ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది".


బాబా కృపతో MD సీటు


ప్రియమైన సాయి బంధువులకు నమస్కారం. నాపేరు స్వర్ణలత. మాది విజయవాడ సమీపంలోని మచిలీపట్నం. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు మా నాన్న మొదటిసారి బాబా ఫోటోను మా ఇంటికి తెచ్చారు. నేను అప్పటినుండి బాబాకు అత్యంత భక్తురాలిని. ఆ క్షణం నుండి బాబా నా పట్ల శ్రద్ధ వహిస్తూ ఎన్నో సందర్భాలలో నన్ను రక్షించారు. నేనిప్పుడు ఇటీవల బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని నా తోటి ఆత్మీయ సాయి భక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. నా కుమార్తె వైవాహిక జీవితం వైఫల్యం చెందడం వలన ప్రస్తుతం మేము, ఆమె తన జీవిత భాగస్వామితో న్యాయ పోరాటం చేస్తూ బాబా కృపతో అందులో విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉన్నాము. ఈ పరిస్థితుల నుండి బయట పడటానికి, అలాగే డాక్టర్‌గా తన విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు నా కుమార్తె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే జనరల్ కేటగిరీకి చెందిన తను దానిని సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందువలన నేను బాబాపై నా ఆశలన్నీ పెట్టుకుని, ఆయననే ప్రార్థించసాగాను. బాబా గొప్ప అద్భుతం చేసారు. నా కుమార్తెకి బెంగుళూరు ENTలో MD సీటు వచ్చింది. ఇది మూమూలుగా సాధ్యం అయ్యేది కాదు. బాబా మాత్రమే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. ఆయన దయకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.



5 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Jaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Baba after ultra sound test no cancer report must come with your blessings.please help sai.om sai ram

    ReplyDelete
  4. Om Sai Ram 🙏

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo