1. బాబా దయామయుడు
2. బాబా కృప
3. అమ్మకి ప్రాణభిక్ష పెట్టిన బాబా
బాబా దయామయుడు
ఓం శ్రీసాయినాథాయ నమ:!!! నా పేరు రవీంద్ర. బాబా నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. 2022, మార్చి మూడో వారంలో మా పాపకి జలుబు, గొంతునొప్పి సమస్యలు వచ్చాయి. అప్పుడు నేను, "బాబా! పాపకి జలుబు, గొంతునొప్పి తగ్గేలా చూడండి" అని బాబాను ప్రార్ధించాను. బాబా దయామయుడు. రెండు రోజులలో పాపకి నయమైంది. సంతోషంగా బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను.
తరువాత నాకు గొంతునొప్పి, ఆస్త్మా సమస్యలు వచ్చాయి. నేను బాబాను తలుచుకుని, "బాబా! ఈ రెండు సమస్యలు తగ్గిపోవాలి" అని బాబాకు చెప్పుకుని 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. తరువాత భోజనానికి కూర్చునే ముందు గ్యాస్ట్రిక్ నొప్పి మొదలైంది. మళ్ళీ నేను, "బాబా! ఈ గ్యాస్ట్రిక్ నొప్పి కూడా తగ్గిపోవాలి" అని బాబాకి చెప్పుకుని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను. దయామయుడైన బాబా నా సమస్యలను తీర్చారు. "ధన్యవాదాలు బాబా. నాకున్న గ్యాస్ట్రిక్, ఆస్త్మా సమస్యలను శాశ్వతంగా తగ్గేలా అనుగ్రహించండి తండ్రి".
ఈమధ్య నేను 500 రూపాయలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా ఆ 500 రూపాయలు కనపడలేదు. నాకు చాలా బాధేసి, "బాబా! ఆ 500 రూపాయలు దొరికేలా దయ చూపండి" అని బాబాకి చెప్పుకుని 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే నామాన్ని జపించాను. అంతే, బాబా దయవలన డబ్బులు దొరికాయి. ఇది చాలా చిన్న అనుభవమే కానీ, అప్పటివరకు దొరకని డబ్బులు దొరికాయంటే అది కేవలం బాబా వల్లే సాధ్యమైంది. "ధన్యవాదాలు బాబా. వీలైనంత త్వరగా నాకు ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించండి తండ్రి. ఇంకా ఏవైనా తప్పులు చేసుంటే నన్ను క్షమించండి బాబా".
బాబా కృప
ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయి భక్తుడిని. నా భార్య మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు ఒకసారి తనని చెకప్‌కు తీసుకుని వెళితే డాక్టరు ఆమెకు ట్రిప్లెట్ టెస్టు చేసి 'ఆల్ఫా-బీటా వాల్యూస్ మారుతున్నాయని, మరోసారి చెకప్‌కి వచ్చినప్పుడు చూద్దామ'ని చెప్పారు. మేము అప్పటినుండి ఎలాగైనా తరువాత చెకప్‌లో టెస్టు రిపోర్టు బాగా రావాలని సాయిబాబాని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. ఇంతలో మేము మళ్ళీ చెకప్‌కి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ దయామయుడ్ని ప్రార్థిస్తూ హాస్పిటల్‌కి వెళ్ళాము. బాబా దయవల్ల డాక్టరు స్కాన్ చేసి, "బిడ్డ ఆరోగ్యంగానే ఉంది. మీరు ఏం కంగారు పడొద్దు" అని చెప్పి బ్లడ్ టెస్టు చేయించమన్నారు. మేము బ్లడ్ టెస్టుకి ఇచ్చి, "బాబా! బ్లడ్ టెస్టు నార్మల్ రావాలి" అని బాబాను ప్రార్థించి రిపోర్టుకోసం ఎదురుచూసాము. తరువాత రోజు రిపోర్టుకోసం హాస్పిటల్‌కి వెళ్తే, బాబా దయవల్ల రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కాకపోతే తెల్ల రక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. ఆ బాబా దయవల్ల వచ్చే చెకప్‌లో ఆ సంఖ్య నార్మల్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఇకపోతే డాక్టరు, "వచ్చే నెలలో అనామోలీ స్కాన్ చేయించమ"ని సూచించారు. బాబా దయవల్ల ఆ స్కాన్ రిపోర్ట్ కూడా బాగా వచ్చి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా. తెలియక ఏమైనా తప్పులు చేసుంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించు తండ్రి. మీ బిడ్డలందరిపై మీ కరుణాకటాక్షాలు సదా ఉండేలా అనుగ్రహించండి బాబా".
ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
అమ్మకి ప్రాణభిక్ష పెట్టిన బాబా
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సాయి భక్తులకు నా నమస్కారాలు. నా పేరు జయశ్రీ. ఒకసారి మా అమ్మ జ్వరంతో చాలా అనారోగ్యం పాలైంది. డాక్టరు మందులిచ్చినా జ్వరం తగ్గక అమ్మ వారం రోజులపాటు ఎంతో బాధను అనుభవించింది. ఇక అమ్మ మాకు దక్కదు అనుకున్నాము. ఆ స్థితిలో అమ్మను మరోసారి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళితే, అమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. అప్పుడు నేను మనసులో, "బాబా! మా అమ్మకు జ్వరం తగ్గి, తను హాస్పిటల్ నుండి ఆరోగ్యంగా ఇంటికి రావాలి" అని సాయిబాబాను వేడుకున్నాను. బాబా దయచూపారు. మరుసటిరోజే అమ్మకి జ్వరం తగ్గి ఇంటికి వచ్చింది. "ధన్యవాదాలు బాబా. నేను ఎప్పుడూ ఇలాగే భక్తి మార్గంలో ఉండేలా అనుగ్రహించండి."
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!

