సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1128వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. విషపురుగు తాకినందువల్ల ప్రమాదం జరగకుండా కాపాడిన బాబా
2. తల్లీ, తండ్రై నా పెళ్లి జరిపించిన సాయి
3. తలుచుకోగానే వెంట ఉంటామని నిరూపించిన బాబా

విషపురుగు తాకినందువల్ల ప్రమాదం జరగకుండా కాపాడిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును అనుగ్రహించిన సాయినాథునికి, భక్తుల అనుభవాలను ప్రచురిస్తున్న బ్లాగ్ నిర్వాహకులకు, సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు మల్లీశ్వరి. నేను సాయిభక్తురాలిని. కన్నతల్లి ఎప్పుడైనా తన బిడ్డ గురించి మర్చిపోతుందేమోగానీ మన తండ్రి సమర్థ సద్గురు సాయినాథుడు అడుగడుగునా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఆయన నిత్యం ఎన్నో లీలలు చేస్తుంటారు. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేను ఇంతకుముందు చాలాసార్లు పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. మాది వ్యవసాయ కుటుంబమనీ, వ్యవసాయం చేస్తుంటామనీ నేను నా గత అనుభవంలో చెప్పాను. ఈమధ్య ఒకరోజు మా అక్కావాళ్ళ చేనులో కూలీలు మిరపకాయలు కోస్తున్నారు. నేను మా అక్కతో ఫోన్లో మాట్లాడుతున్నాను. అంతలో చేనులో పనిచేస్తున్న ఒక అమ్మాయిని విషపురుగు(పాము) తాకింది. ఆ విషయం అక్క నాతో చెప్పి ఫోన్ పెట్టేసింది. మేము కూడా పొలం పనులు చేస్తుంటాము కాబట్టి నాకు పరిస్థితి అర్థమైంది. నేను వెంటనే మన తండ్రి అయిన బాబాను తలచుకుని, "తండ్రీ సాయినాథా! నాడు శ్యామాని పాము కాటేసినప్పుడు విషాన్ని ఎక్కవద్దని ఆజ్ఞాపించి అతన్ని కాపాడావు. ఇప్పుడు కూడా అలానే చేసి ఆ అమ్మాయిని మీరే కాపాడాలి తండ్రీ" అని చెప్పుకుని 'సాయి వచనం' కోసం చూశాను. అప్పుడు, "చింతపడవద్దు. నేను నా భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉంటాను" అని బాబా చెప్పారు. అది చూసి నా మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. పొలంలో ఊదీ అందుబాటులో ఉండదు కాబట్టి బాబాని తలచుకుని, పొలంలోని మట్టిని కొద్దిగా తీసుకుని, దాన్నే ఊదీగా తలచి ఆ అమ్మాయికి పెడుతున్నట్లు భావించి నేనే పెట్టుకున్నాను. ఇంకా, బ్లాగులో పంచుకుంటానంటే ఆ తండ్రి సాయినాథునితోనే చెప్పుకున్నట్లేననిపించి, "బాబా! ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేనట్లయితే, వెంటనే ఈ అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ తండ్రి దయవల్ల ఆ అమ్మాయికి ఏమీ కాలేదు, క్షేమంగా ఉందని తెలిసింది. ఆ క్షణంలోనే నేను నా ఆనందాన్ని ఇలా బ్లాగుకి పంపి సాయికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాను. "ధన్యవాదాలు సాయినాథా! మీ బిడ్డలమైన మేము మిమ్మల్ని అతిగా కోరుకుంటున్నాము నాయనా. కానీ మామూలు మానవులమైన మా పరిస్థితులు అలా ఉంటాయి. తప్పైతే క్షమించు తండ్రీ ".

ఓం శ్రీసాయినాథాయ నమః!!!

తల్లీ, తండ్రై నా పెళ్లి జరిపించిన సాయి

ఓం శ్రీసాయి! సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయి అన్నయ్యకు నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను చాలా సంవత్సరాల క్రితమే నాకు పెళ్లి సంబంధాలు చూసే బాధ్యతను బాబాకు అప్పగించి, ఆయన ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అది బాబా మీద నాకున్న నమ్మకం. నేను డి.ఎస్.సికి ప్రిపేర్ అవుతున్న రోజుల్లో నాకు ఒక సంబంధం వచ్చింది. ఆ సమయంలో నాకు ఉద్యోగంపై తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. కానీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట కాదనలేక పెళ్ళిచూపులకి సరేనన్నాను. కాని బాబాతో, "బాబా! నాకు సహాయం చేయండి. ఒకవేళ ఇది మీరు చూసిన సంబంధమైతే నాకు ఏదైనా నిదర్శనం ఇవ్వండి" అని చెప్పుకున్నాను. నన్ను చూసుకోవడానికి వస్తున్న అబ్బాయి గురువారం రోజున పుట్టాడని ఇంట్లోవాళ్ళు అన్నారు. నేను కూడా గురువారమే పుట్టాను. అది నాకు కొంచం పాజిటివ్‍గా అనిపించి, 'సరే, ఆ అబ్బాయి డేట్ అఫ్ బర్త్ చూద్దామని అనుకున్నాను. నేను నిత్యపారాయణం, మహాపారాయణం గ్రూపుల్లో ఉన్నాను. ఇంకో నాలుగు రోజుల్లో అబ్బాయివాళ్లు మా ఇంటికి వస్తారనగా నిత్యపారాయణ గ్రూపులో నా రోల్ నెంబర్ మారింది. అది సరిగ్గా అబ్బాయి పుట్టిన నెలకి మ్యాచ్ అయింది. అలాగే నా మహాపారాయణ రోల్ నెంబర్ అతని పుట్టిన తేదికి మ్యాచ్‌ అయింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. 99% ఈ సంబంధమే నిశ్చయమవుతుందని నేను విశ్వసించాను. అదే నిజమైంది. తరువాత నేను, "నా నిశ్చితార్థానికి మీరు తప్పకుండా రావాలి బాబా" అని బాబాను ఆహ్వానించాను. ఫంక్షన్ హాళ్లలో నిశ్చితార్థం పూర్తయ్యాక ఇంటికి వచ్చి, నా నిశ్చితార్థానికి వచ్చిన ఒకేఒక గిఫ్ట్ బాక్సు ఓపెన్ చేస్తే, ఫోటో రూపంలో బాబా దర్శనమిచ్చారు. విషయమేమిటంటే, నేను ఫంక్షన్ హాల్‍కి వెళ్ళడానికి ముందే నా తమ్ముని ఫ్రెండ్ ఆ బాబా ఫోటోను అక్కడ ఉంచి వెళ్ళిపోయాడట. అది తెలిసి ఆ ఫోటో రూపంలో బాబా నాకంటే ముందే నా నిశ్చితార్థానికి వచ్చి నన్ను ఆశీర్వదించారని నాకు చాలా ఆనందమేసింది. తరువాత ఏవో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా 'నేను ఉన్నాను' అంటూ బాబా నాకు తల్లితండ్రై దగ్గరుండి నా పెళ్లి జరిపించారు. నా జీవిత భాగస్వామి చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటున్నారు. నేను ఆయనలోనే మా అమ్మానాన్నలను చూసుకుంటున్నాను. ఆయన మా పెళ్ళైన వారంలోనే నన్ను శిరిడీకి తీసుకెళ్లారు. ఏం చేసినా నా తండ్రి(బాబా) ఋణం తీర్చుకోలేను. "ధన్యవాదాలు బాబా. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని తండ్రి. మీ బిడ్డలమైన మాకు మీ పాదాల దగ్గర కాస్త చోటు దొరికితే చాలు తండ్రి".
 
శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

తలుచుకోగానే వెంట ఉంటామని నిరూపించిన బాబా

నా పేరు ప్రియాంక. ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి కృతజ్ఞతలు. బాబా మన వెంట ఉంటే అనుకున్నవి జరిగిపోతాయని మరోసారి నిరూపణ అయింది. ఈ మధ్య ఒకసారి అత్యవసరంగా నాకు డబ్బులు అవసరం వచ్చింది. ఎవరిని అడిగినా 'లేదు', 'లేవు' అన్న మాటలే వినిపించాయి. చివరికి నేను సహాయం కోసం బాబాను ప్రార్థించాను. ఆయన దయవల్ల నాకు వెంటనే డబ్బులు సమకూరాయి. అంతేకాదు బాబా కృపతో నాకు డబ్బిచ్చిన వాళ్ళకి తొందరలోనే డబ్బు తిరిగి ఇచ్చేసాను.

నేను పి.సి.ఓ.డి సమస్యతో బాధపడుతున్నాను. దానివల్ల నాకు ఈ మధ్య రెండు నెలల వరకు పీరియడ్స్ రాలేదు. "బాబా! నా ఈ సమస్యను తగ్గించండి" అని బాబాను ప్రార్థించాను. రెండురోజుల్లో బాబా నా సమస్యను పరిష్కరించి తలుచుకోగానే మన వెంట ఉంటామని మళ్ళీ నిరూపించారు బాబా. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు తండ్రి".


4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om SaiRam Jai Sai Master

    ReplyDelete
  3. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo