- అపూర్వం - అమోఘం - బాబా అనుగ్రహం
నేను ఒక సాయి భక్తురాలిని. బాబా దయవల్ల సాయి భక్తులందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ బ్లాగు నడపడం ద్వారా బాబా మనకి ప్రసాదించే అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అవకాశమిస్తున్న సాయి అన్నయ్యకి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరికి బాబా ఉన్నారనే ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే చాలా చిన్న విషయాల నుంచి చాలా చాలా పెద్ద విషయాల వరకు బాబా ఎప్పుడూ మనకు తోడుగా ఉండి సహాయం చేస్తారనే నమ్మకాన్ని అందరికీ ఇస్తున్నారు, పెంచుతున్నారు. ఈ ప్రపంచంలో మనకోసం పిలిచిన వెంటనే పలికేవారు ఎవరైనా ఉన్నారంటే అది మన బాబా మాత్రమే అని నాకనిపిస్తుంది. మనం చెప్పినా, చెప్పకపోయినా మన మనసులో బాధని ఆయన వింటారు. అందుకే 'నువ్వు చెప్పాలని చెప్పుకోలేకపోతున్న బాధలు కూడా నాకు తెలుసు' అని ఆయన తెలియజేస్తుంటారు. ప్రతిక్షణం నా పక్కనే ఉన్నానని ధైర్యాన్నిస్తున్న ఆయనకు నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఆయన అడుగడుగునా నా జీవితంలో ఉంటూ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వాటిలో నుంచి మీతో పంచుకుంటానని ఆయనకి మాటిచ్చిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
నా గత అనుభవంలో నేను, నా ఫ్రెండ్ ఒకే ప్రాజెక్టు మీద పనిచేయాలని పర్మినెంట్ పొజిషన్ ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నిస్తే నేను సెలెక్ట్ అయ్యానని, అలాగే నా ఫ్రెండ్‍ని బాబా ఏవిధంగా చివరి రౌండ్ వరకు తీసుకొచ్చింది చెప్పి, నా ఫ్రెండ్ ఆ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలని బాబాని కోరుకున్నాను. అయితే ఎందుకో తెలియదుగాని నా ఫ్రెండ్‍కి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. బాబా ఎందుకు నా ఫ్రెండ్‍కి ఆ కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేయలేదో నాకు తెలీదుగాని, బాబా ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే, మనం ఈరోజుని మాత్రమే చూడగలం; బాబా మన భవిష్యత్తును కూడా చూడగలరు. ఆ దృష్ట్యా ఆయన ఏం చేసినా మన మంచికే చేస్తారు. ఈలోగా మనం పడే టెన్షన్ వల్ల మన చెడు కర్మ అంతా తొలగిపోయేలా చేస్తారు. అలాగే మా విషయంలో కూడా ఏదో మంచి చేయడానికే అలా చేశారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదలా ఉంచితే, ఆ కంపెనీలో నా ఫ్రెండ్‍కి ఉద్యోగం రాలేదని నేను కూడా ఆ కంపెనీలో ఉద్యోగాన్ని వదులుకున్నాను. తరువాత బాబా మా ఇద్దరికీ ఇంకో కంపెనీలో ఉద్యోగాలిప్పించి మేము కోరుకున్నట్లే ఒకే ప్రాజెక్ట్ మీద పనిచేసేలా అనుగ్రహించారు. సంతోషంగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుని, "బాబా! మీ అనుగ్రహానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు వచ్చినవి కాంట్రాక్టు ఉద్యోగాలు, శాశ్వతం కాదు. పర్మినెంట్ కానంతవరకు ఏదో భయం ఉంటుంది కదా, అందుకే భయపడుతున్నాను తండ్రి. మీ దయవల్ల అన్ని సాధ్యమవుతాయని నా నమ్మకం. దయచేసి మా ఇద్దరికీ ఒకే కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగాలు ఇప్పించండి. నేను మీకు మాటిచ్చినట్లు శిరిడీ రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఏ సమస్యా లేకుండా వీలైనంత త్వరలో నేను మిమ్మల్ని శిరిడీలో దర్శించుకునేలా అనుగ్రహించండి తండ్రి" అని వేడుకున్నాను.
కానీ ఏదో తెలియని భయం. 'శిరిడీ వెళ్ళడానికి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి' అన్న సందిగ్ధంలో ఉండగా ఒకరోజు వాట్సాప్ గ్రూపులో, "ఏమీ భయపడకు. నా దగ్గరకి రా" అని బాబా మెసేజ్ వచ్చింది. అది చూడగానే, 'బాబానే నన్ను పిలుస్తున్నారు. ఇంకా నాకు ఏ భయమూ లేదు' అని వెంటనే నాకు, నా ఫ్రెండ్‍కి టికెట్లు బుక్ చేసి శిరిడీ ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఆ రోజు రానే వచ్చింది. రాత్రి శిరిడీ బస్సు ఎక్కుతామనగా మధ్యాహ్నం బాబా అసంభవం అనుకున్నదాన్ని సంభవం చేస్తూ ఒక అద్భుతం చూపారు. అదేమిటంటే, నా ఫ్రెండ్‍కి ఉద్యోగం రాలేదని, నాకొచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకున్న పర్మినెంట్ పొజిషన్స్ ఉన్న కంపెనీ నుండి నాకు ఫోన్ వచ్చింది. నిజానికి నేను ఆ కంపెనీలో ఉద్యోగానికి ఆశలు వదులుకుని ఆ కంపెనీవాళ్ళకి మళ్ళీ ఫోన్ చేయలేదు, ఎవరినీ ఉద్యోగం గురించి అర్థించలేదు. మాకు వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనే చేరుదామని నిర్ధారించుకున్నాము. అలాంటిది ఆ రోజు ఎన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయని నేను ఎందుకో తెలీదు, ఆ కంపెనీ కాల్ లిఫ్ట్ చేయాలనిపించి లిఫ్ట్ చేశాను. వాళ్ళు, "మేము మీకు, మీ ఫ్రెండ్‍కి ఉద్యోగం ఆఫర్ చేస్తున్నాము. ఆఫీసుకి రండి" అని చెప్పారు. మేము "శిరిడీ వెళ్లే పనిలో ఉన్నాము. అక్కడినుంచి వచ్చాక వస్తాము" అని చెప్పాను. దానికి వాళ్ళు సరేనన్నారు. ఆ క్షణం నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను.
ఆ రాత్రి నేను, నా ఫ్రెండ్ ఎంతో సంతోషంగా శిరిడీ వెళ్లే బస్సు ఎక్కి గురువారం ఉదయం శిరిడీలో దిగాము. నేను సమయం లేక ముందుగా శిరిడీలో రూమ్ బుక్ చేయలేదు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే, ఎన్ని హోటల్స్ చూసినా నాకు నచ్చలేదు. చివరిగా ఒక హోటల్‍కి వెళ్తూ, "బాబా! ఇంకా తిరిగే ఓపిక నాకు లేదు. ఈ హోటల్ నాకు నచ్చేటట్లు ఉండేలా చూడు. అంతా మంచిగా ఉంటే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నేను కోరుకున్నట్లే ఆ హోటల్ నీట్‍గా ఉండటంతో బాబాకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. గదిలోకి వెళ్ళి వాట్సప్ గ్రూప్ ఓపెన్ చేస్తే, "ఎన్నోరోజుల నుంచి నేను నీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. నా కోసం ఏం తెచ్చావు" అన్న బాబా మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ చూడగానే నాకు కలిగిన సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. నాకు, 'ఇంతమంది భక్తులున్నా నేను ఇక్కడికి వచ్చానని నా బాబాకి తెలిసింది. ఆయన నా పక్కనే, నాతోనే ఉన్నానని చెప్తున్నారు' అనిపించింది. కానీ శిరిడీలో సమాధి మందిరం లోపలికి ఏమీ తీసుకుని వెళ్లనివ్వరు. మరి నేను బాబాకోసం ఏదైనా ఎలా తీసుకు వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ తర్వాత మేము ఫ్రెష్ అయ్యి ఒక షాపులో చేంజ్ కోసం ఏదైనా తీసుకోవాలని చూస్తుంటే, బాబా నాకోసం ఏం తెచ్చావు అన్న మాట గుర్తు వచ్చింది. దాంతోపాటు 'శిరిడీ సమాధి మందిరంలో మాత్రమే నేను లేను. ఆకలితో ఉండే ప్రతి మనిషిలో నేను ఉన్నాను' అన్న బాబా చెప్పిన మరో మాట గుర్తు వచ్చి కోవా తీసుకుని. 'ఆకలితో ఉన్న వారిలో నువ్వే ఉన్నావు' అన్న భావనతో 'ఇది మీకే ఇస్తున్నాను' అని బాబాతో చెప్పుకుంటూ దారిలో కనిపించిన వారికి ఆ కోవాను పంచి పెట్టాను.
తర్వాత మేము దర్శనం కోసం క్యూ లైన్‍లోకి వెళ్ళాము. సమాధి మందిరంలోకి వెళ్ళాక బాబాను చూస్తూనే నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం ఎన్నోరోజుల నా కోరిక తీరింది. బాబా దయవల్ల సమాధికి ఎదురుగా వెళ్లే క్యూలోకి మేము వెళ్ళాము. బాబా సమాధి వద్దకు చేరుకున్నాక నేను చాలా దగ్గర నుంచి బాబాని కళ్లారా, మనసు నిండా చూసుకున్నాను. అలా బాబాకు ఎదురుగా నిలుచుని ఎంతసేపు ఆయనను చూశానో నాకు మాత్రమే తెలుసు. అందరినీ త్వరత్వరగా పంపించేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ నన్ను ఏమీ అనలేదు. బాబాను ఏదైనా కోరుకుంటే ఆయనను చూస్తుంటే కలుగుతున్న అనుభూతిని కోల్పోతానని, "బాబా! నేను మిమ్మల్ని మనసారా చూస్తున్నాను. నా మనసు మీకు తెలుసు. నా బాధ మీకు తెలుసు. నా కోరిక మీకు తెలుసు. అవన్నీ మీరు చూసుకోండి" అని మనస్ఫూర్తిగా బాబాను చూసుకున్నాను. ఇప్పటికీ ఆ మధురక్షణాలను మర్చిపోలేకపోతున్నాను. బాబాను ఎంత చూసుకున్నా తనివి తీరదు. ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది. సరే, బాబా దయవల్ల నేను రెండుసార్లు బాబా దర్శనం చేసుకున్నాను. రెండోసారి దర్శనానికి వెళ్లి, వస్తున్నప్పుడు సమాధి మందిరంలో బాబా నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే, 'ఇల్లు వదిలి హాస్టల్‍కి వెళ్ళిపోతున్నట్లుగా నా బాబా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాన'ని ఏదో తెలియని బాధ నా మనసును ఆవహించింది. అప్పుడు, "నేను శిరిడీలోనే కాదు. ప్రపంచంలో ప్రతి చోట ఉన్నాను" అన్న బాబా మాటలు గుర్తుకు వచ్చి, నా మనసుకి 'ఎప్పుడూ బాబా నీతోనే ఉంటారు. నీ పక్కనే ఉంటారు. ఏ బాధ వద్దు' అని చెప్పుకుంటూ బయటకి వచ్చాను. ఆ రోజు గురువారం అవ్వటం వలన చావడి ఉత్సవాన్ని చూసే భాగ్యం కూడా మాకు కలిగింది. మేము బాబా హారతికి కూడా వెళ్లాలని అనుకున్నాము కానీ, ఎంత ప్రయత్నించినా టికెట్లు దొరకకపోవడంతో హాజరు కాలేకపోయాము. మళ్ళీ శిరిడీ వెళ్ళినప్పుడు బాబా నాకు ఆ భాగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను.
శుక్రవారం రాత్రి శిరిడీ నుంచి మా తిరుగు ప్రయాణానికి నేను టికెట్లు బుక్ చేశాను. సరిగా బస్సు బయలుదేరే సమయానికి కొంచెం ముందు ఒకటే వర్షం మొదలైంది. దాంతో బస్టాప్‍కి ఎలా వెళ్లాలో, ఏంటోనని, "బాబా! ఎలా అయినా వర్షం తగ్గేలా చూడండి. ఏ ఇబ్బంది లేకుండా మేము బస్సు ఎక్కేలా అనుగ్రహించండి బాబా" అని అనుకున్నాను. వర్షం తగ్గకపోయినా శ్రమ పడకుండా ఒక మంచి ఆటో అతను దొరికేలా బాబా అనుగ్రహించారు. అతను వర్షంలోనే మమ్మల్ని బస్టాప్‍కి చేర్చే బస్సు ఎక్కించాడు. అయితే, చివరిక్షణంలో టికెట్లు బుక్ చేయడం వల్ల స్లీపర్ బస్సులో మాకు చివరి సీట్లు వచ్చాయి. నిజానికి నేనెప్పుడూ ఆ సీట్స్ బుక్ చేయను. నాకెందుకో భయం. కానీ ఆరోజు తప్పనిసరై బుక్ చేయాల్సి వచ్చింది. బస్సు ఇంజిన్ ఆ సీట్ కింద ఉండడం వల్ల పైకి బాగా వేడి వస్తుంది. నా మనసులో ఏదో భయం. చాలాసేపు, చాలా ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు బాబాను తలుచుకుని, "బాబా! ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని క్షేమంగా హైదరాబాద్ చేర్చండి" అని బాబాను ప్రార్థించాను. బాబా తమకోసం వచ్చిన భక్తులను కష్టపెడతారా చెప్పండి? అస్సలు పెట్టరు. కొంచెం సేపటికి నాకు చాలా సౌకర్యవంతంగా అనిపించింది. బాబా దయవల్ల క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాం. ఇలా నా శిరిడీ ప్రయాణం ముగిసింది. ఎంతో సంతోషం, ఎన్నో అనుభవాలతో మళ్ళీ త్వరలో శిరిడీ దర్శించే భాగాన్ని ఇవ్వమని బాబాను కోరుకుంటున్నాను. "బాబా! నన్ను మళ్ళీ త్వరగా శిరిడీ తీసుకుని వెళ్ళండి. మిమ్మల్ని మళ్ళీ చూడాలని ఉంది".
శిరిడీ నుంచి రాగానే ఆ కంపెనీవాళ్ళు మా ఇద్దరికీ ఆఫర్ రిలీజ్ చేశారు. శిరిడీ వెళ్లడానికి హైదరాబాద్ వచ్చిన నేను, అనుకున్న పర్మినెంట్ ఉద్యోగంతో ఇంటికి తిరిగి వెళ్లేలా చేసింది నా బాబానే. ఇది ముమ్మాటికీ బాబా మాకు ఇచ్చిన ఉద్యోగం. ఆయన మీద నమ్మకమే ఒక మనిషి మనసును మార్చి నాకు కాల్ చేసి ఉద్యోగం ఇచ్చేలా చేసింది. నేను ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నపుడు బాబా ఎప్పుడూ "శ్రద్ధ, సబూరీతో వేచి ఉండు", "నా టైమింగ్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి" అని నాకు మెసేజ్లు ఇస్తూ ఉండేవారు. అప్పుడు నాకు అర్థంకాక నేను ఎంత శ్రద్ధతో ఉన్నా మాకు ఎందుకు ఆ ఉద్యోగాలు రాలేదు అని అనుకునేదాన్ని. కానీ బాబా చెప్పినట్లు ఆయన టైమింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. బాబా తలుచుకుంటే దేన్నైనా అత్యంత సుళువుగా ఇవ్వగలరు. కానీ అలా చేస్తే మన కర్మలు ఎలా పోతాయి? అందుకే అయన తనకంటూ ఒక పద్దతిని ఏర్పాటు చేసుకుని ఆ ప్రక్రియలో మనకు శ్రద్ధ, సబూరీతో ఎలా ఉండాలో నేర్పించడంతో పాటు, మనం పడే భాద రూపంలో కర్మ నాశనం గావించి తుదకు మన కోరికలు నెరవేరుస్తారు. కాబట్టి మిత్రులారా! మీ జీవితంలో మీరు అనుకున్నది బాబా వెంటనే ఇవ్వలేదని బాధపడుతుంటే గనక ఒకటి గుర్తుంచుకోండి, 'ఆ బాధల రూపంలో బాబా మనం చేసిన పెద్ద పెద్ద పాపాలను కడిగేస్తున్నారు. మన కర్మఫలం అనుభవించాక అయన మనకు కావాల్సింది ఇస్తారు. ఆయన ఏం చేసినా మన మంచికే. మనం పడే ప్రతి బాధలో ఈ ప్రపంచంలో మనకి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మన బాబా ఉంటారు. ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటారు. మనతోపాటు ఆయన ఆ బాధను అనుభవిస్తారు. ఇది నాకు లేదని వదిలేసుకున్న సమయంలో బాబా మళ్ళీ అది నా దగ్గరకు వచ్చేలా చేశారు. దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, మనకు నమ్మకం ఉంటే బాబా చివరి క్షణంలో కూడా అంతా మార్చగలరు. ఏదైనా చేయడానికి బాబాకి రోజులు గంటలు అవసరం లేదు, ఒక్క క్షణం చాలు'. "నన్ను క్షమించు బాబా. నువ్వు నాకు ఇచ్చిన అనుభూతిని నేను సరిగా వ్రాయలేకపోయాను. కానీ ఆ క్షణాన నా మనసు ఎంత ఆనందపడిందో మీకు తెలుసు తండ్రి. నేను మీ గురించి ఏం చెప్పగలను బాబా. మీ గొప్ప లీలను వ్రాయడానికి కూడా నేను సరిపోను తండ్రి. తప్పులు ఉంటే క్షమించు. ఎలా అయినా మా ఇద్దరినీ ఒకే టీమ్‍లో వేసేలా, బాగా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకునేలా చూడు బాబా".
ఇప్పుడు బాబా నన్ను ఒక ఉపకరణంగా చేసుకుని నా ఫ్రెండ్‍ని తమ భక్తునిగా మలుచుకున్న తీరును మీతో చెప్తాను. నా ఫ్రెండ్ శివ భక్తుడు. తను ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తారు. నాకు బాబా అంటే చాలా నమ్మకం. నేను ప్రతి గురువారం బాబా పారాయణ చేసి గ్రూపులో రిపోర్ట్ చేస్తాను. నా ఫ్రెండ్‍తో బాబా గురించి నేను చేసేవి చెప్తూ ఉండేదాన్ని. ఉద్యోగ విషయంలో పైన చెప్పిన సమస్య మాకు వచ్చినప్పుడు నేను తనతో, "అందరూ దేవుళ్ళు ఒకటే. శివుడైన, బాబా అయిన ఒకటే. నువ్వు బాబాని ప్రార్థించు. అంతా మంచి జరుగుతుంది. గురువారం బాబా గుడికి వెళ్ళు" అని చెప్పాను. తను నేను చెప్పినట్లు బాబా గుడికి వెళ్లి, "నాకు ఈ ఉద్యోగం వస్తే, నేను మిమ్మల్ని సదా మ్రొక్కుతాను" అని అనుకున్నారు. కానీ ఎందుకో తెలీదు చాలా రౌండ్ల ఇంటర్వ్యూ అయ్యాక కూడా తనకి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. తరువాత వేరే కంపెనీలో మా ఇద్దరికీ కాంట్రాక్టు జాబ్ వచ్చింది. ఎక్కడైతే ఏంటి ఉద్యోగం వచ్చిందని మేము శిరిడీ వెళ్ళడానికి బయలుదేరాము. సరిగా శిరిడీ వెళ్లే రోజున బాబా మునుపు ఉద్యోగం రాలేదన్న అదే కంపెనీ నుంచి మాకు ఫోన్ వచ్చేలా చేసి, క్లోజ్ అయిపోయిన అదే పోజిషన్లో మాకు పర్మినెంట్ ఉద్యోగాలను అనుగ్రహించారు. దాంతో నా ఫ్రెండ్‍కి బాబా మీద కాస్త నమ్మకం పెరిగింది. శిరిడీ వెళ్ళాక సమాధి మందిరంలో బాబా దర్శనం చేసుకుంటుంటే తనకి బాగా తలనొప్పి వచ్చిందట. తను వెంటనే, "బాబా! తలనొప్పేస్తుంది. తగ్గించండి బాబా" అని అనుకోగానే నిప్పుల మీద నీరు పోసినట్టు వెంటనే తలనొప్పి తగ్గిందంట. అలా మూడుసార్లు తలనొప్పి రావడం, వెంటనే బాబా తగ్గించడం జరిగాక తనకి బాబాపై నమ్మకం మరింత పెరిగింది. తను జరిగినదంతా నాతో చెప్పి, "నేను ఎప్పటికీ బాబాను మర్చిపోను" అని చెప్పి ప్రతి గురువారం నేను పారాయణ చేసే గ్రూపులో జాయిన్ అయ్యి తను కూడా బాబా చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాళ్ళింట్లో ఒక చిన్నబాబుకి మాటలు స్పష్టంగా రావడం లేదు. నేను ఎన్నిసార్లు తనతో బాబా ఊదీ గురించి చెప్పినా విని వదిలేసే తను, "నేను ప్రతి గురువారం బాబా పారాయణ చేసి, ఊదీ నీళ్లలో కలిపి బాబు చేత త్రాగిస్తాను. బాబా తనకి మాటలు స్పష్టంగా వచ్చేలా చేస్తారు" అని చెప్పారు. తన నమ్మకం చూసి, 'ఒక మనిషి ఇంత త్వరగా ఇంతలా బాబాను నమ్ముతున్నారా? అందుకు నేను కారణమా?' అని నేను చాలా సంతోషించాను. నా ఫ్రెండ్ చెప్పినట్లే గురువారం పారాయణ చేసి బాబుకి ఊదీ నీళ్లు ఇచ్చి బాబా మెసేజ్ చూద్దామని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, తనకి కనిపించిన మొదట మెసేజ్, "మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నేను తొలగిస్తాను" అని ఉంది. ఇది చాలదా! బాబా తను చెప్పేది వింటున్నారని చెప్పడానికి. ఆ మెసేజ్ చూసాక నా ఫ్రెండ్‍కి బాబా మీద మరింత నమ్మకం పెరిగింది. ఇప్పుడు తను ప్రతిదానికి బాబా మెసేజ్ చూస్తూ, బాబా లీలలను అనుభూతి చెందుతున్నారు. తనలో వచ్చిన మార్పును చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తనతో, "బాబా మిమ్మల్ని తన భక్తునిగా మార్చుకోవాలని అనుకున్నారు. ఆయనే మీలో నమ్మకాన్ని ఏర్పరిచారు, శిరిడీకి తీసుకుని వెళ్లారు, మీ నమ్మకాన్ని ఇంకా పెంచారు. ఇక ఎప్పుడూ బాబా మిమ్మల్ని వదిలి పెట్టరు" అని చెప్పాను. "బాబా! ఒక వ్యక్తిని మీ భక్తునిగా మార్చుకునే ప్రక్రియలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మకి ఇది చాలేమో అనిపిస్తుంది. థాంక్యూ బాబా. ఐ లవ్ యు సో మచ్ బాబా. ఎప్పుడూ నా చేయి వదిలిపెట్టకండి. నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించు తండ్రి. నా మనసులో ఉన్న బాధ మీకు తెలుసు. మీకు మాత్రమే తెలుసు. నేను అనుకున్నది అనుగ్రహించండి బాబా"
చివరిగా మరో చిన్న అనుభవం: కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని నేను, నా ఫ్రెండ్ ఒకరోజు కారులో వెళుతుంటే హఠాత్తుగా కారుకి ఏదో సమస్య వచ్చింది. మెకానిక్ షాపులో రిపేర్ చేయించుదామంటే, ఆ రోజు ఆదివారం. అందులోనూ రాత్రి వేళ. తెలిసిన షాపు వాళ్ళకి ఫోన్ చేస్తే, "ఆదివారం కదా, షాపు తియ్యలేదు" అంటున్నారు. నేను వెంటనే, "బాబా! ఒక మంచి మెకానిక్ షాపు త్వరగా కనిపించేలా చూపించి కారు బాగయ్యేలా చేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా అనుగ్రహించండి. వెంటనే మెకానిక్ షాపు కనిపిస్తే, బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే ఒక షాపు కనిపించింది. వాళ్ళు చెక్ చేసి సమస్య చాలా చిన్నదని రిపేర్ చేశారు. డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారు. ఇలా ప్రతిక్షణం బాబా మనకి తోడుగా ఉంటారు. "థాంక్యూ బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless amma for her health and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba please a carpenter manasu marchi money maku vachela cheyi thandri please
ReplyDelete