1. మూడు అంకెతో ముడిపడి మూడు అంకెతో సుఖాంతమైన శిరిడీయాత్ర2. సాయి దయతో సమస్య పరిష్కారం
మూడు అంకెతో ముడిపడి మూడు అంకెతో సుఖాంతమైన శిరిడీయాత్ర
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు అంజునాగుప్తా. నేను మీ అందరికీ సుపరిచితురాలిని. బాబాకు తమ భక్తులపై ఉండే ప్రేమ అమోఘం, అద్భుతం. మనం కోరుకోవాలేగాని సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. న్యాయమైన కోరికలు తప్పకుండా తీరుస్తారు బాబా. నేను ఇంతకుముందు కార్తీకమాసంలో చివరిసారి నా అనుభవం పంచుకున్నానని అనటం కంటే, శిరిడీ అనుభూతులు పంచుకున్నానని చెప్పడం సమంజసం అనుకుంటాను. తరువాత 2022, ఫిబ్రవరిలో నేను మళ్ళీ శిరిడీ వెళ్లొచ్చాను. ఆ అనుభవాలను/అనుభూతులను అంటే మూడు అంకెతో ముడిపడి మూడు అంకెతో సుఖాంతమైన నా శిరిడీయాత్ర గురించి నేనిప్పుడు మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
శ్రీసాయినాథుని అనుగ్రహంతో శ్రీలక్ష్మి, నరసింహారావు అనే పుణ్యదంపతులు 108 మంది భక్తుల అనుభవాల సమాహారంగా గతంలో 'అష్టోత్తరశత అనుభవమాలిక' అన్న పేరుతో ఒక గ్రంథాన్ని ముద్రించారు. ఇప్పుడు మరో 108 మంది భక్తుల అనుభవాలను సేకరించి అదే పేరుతో మరో గ్రంథాన్ని ముద్రించారు. అందులో నా అనుభవాలు కూడా ఉండటం నా భాగ్యం. 2022, ఫిబ్రవరి 22న శిరిడీలో బాబా పాదాల వద్ద ఆ పుస్తకావిష్కరణ చేయాలని ఆ దంపతులు సంకల్పించి ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. దాంతో ఎలాగైనా శిరిడీ వెళ్లాలన్న బలమైన కోరిక నాలో కలిగి మావారిని అడిగితే, "నాకు మేడారం జాతరకి డ్యూటీ పడుతుంది. కాబట్టి నాకు రావడానికి కుదరదు. ఎవరైనా తోడు వస్తే వెళ్ళు" అని ఆయన అన్నారు. సరేనని, నేను నా స్నేహితులతో కలిసి వెళ్దామని నిర్ణయించుకుని "శిరిడీ వెళ్లడానికి ఎవరైనా తోడు వస్తారా?" అని ఒక పదిమందిదాకా స్నేహితులను అడిగాను. వాళ్లలో చాలామంది వస్తామన్నారుకానీ, టికెట్ బుక్ చేస్తామనే సమయానికి ఎవరూ రాలేమన్నారు. నేను చాలా బాధపడ్డాను. అయితే ఆఖరి నిమిషంలో నాతోపాటు వస్తానని, టిక్కెట్లు బుక్ చేయమని నా స్నేహితురాలు సౌజన్య చెప్పడంతో నేను చాలా ఆనందించాను. ఫిబ్రవరి 19న శిరిడీ ప్రయాణమయ్యేందుకుగానూ ఫిబ్రవరి 4వ తేదీన నాకు, సౌజన్యకి టికెట్లు బుక్ చేసాము. అయితే అక్కడికి మూడోరోజు సౌజన్యవాళ్ళ అన్నయ్య తాము సొంతింటిని నిర్మించ తలపెట్టి ముగ్గు పోసుకున్నామని చెప్పారు. వారం రోజులకి ఫిబ్రవరి 20వ తేదీన ద్వారబంధం ఎత్తడానికి ముహూర్తం కూడా నిర్ణయించారు. సౌజన్యకు ఐదుగురు అన్నదమ్ములు. తాను ఒక్కతే వాళ్లకు ఆడపడుచు. అందువల్ల తన అవసరం వాళ్లకు చాలా ఉంది. మేము 19న శిరిడీ వెళ్తే 20న ద్వారబంధం ఎత్తే కార్యక్రమానికి సౌజన్య హాజరు కాలేదు. ఇటువంటి పరిస్థితిలో మేము సందిగ్ధంలో పడిపోయాము. సౌజన్య మాత్రం "నేను తప్పకుండా శిరిడీ వస్తాను. నేను శిరిడీకి టిక్కెట్లు ముందు బుక్ చేసుకున్నాను. అన్నయ్యవాళ్ళు ముగ్గు పోసుకోవడం, ద్వారబంధం పెట్టడానికి 20వ తేదీని నిర్ణయయించడం ఇవన్నీ తర్వాత జరిగాయి. కాబట్టి నేను శిరిడీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోను, నేను అస్సలు మిస్ అవ్వను" అని మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. నేను ఎంతగా నచ్చచెప్పినా తను వినకపోగా "నాకే అన్ని ఎందుకిలా జరుగుతాయి?" అని బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నేను, "ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకే బాబా నీ ప్రయాణాన్ని ఆపేశారు. బాబాతత్వం అర్థం చేసుకోకుండా మొండిగా వాదించడం తప్పు. ఆ తర్వాత ఏమైనా జరగరానిది జరిగితే, నింద నీపై పడుతుంది. 'ఆడపడుచు ఉండమంటే ఉండలేదు, బాబా దర్శనమే ముఖ్యమని వెళ్ళిపోయింది, అందుకే మాకు ఇలా జరిగింద'ని అంటారు" అని అన్నాను. అప్పుడు తను, "అయితే 20వ తారీకు ద్వారబంధం ఎత్తిన తర్వాత మనం బయల్దేరుదాం ఆంటీ. మనం 19వ తేదీ టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుని 20వ తేదికి బుక్ చేసుకుందాం" అని అంది. కానీ నేను ఆ అమ్మాయి మాట వినకుండా, "ఇక అవేమీ వద్ద"ని గట్టిగా చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేయించాను. అప్పటికి మేడారం జాతరకి వెళ్లాల్సిన వాళ్ళ మొదటి ఫేజ్ డ్యూటీలు పడిపోయాయి. ఆ జాబితాలో మావారికి డ్యూటీ పడలేదు. ఆ కారణంగా నేను, మావారు అదే ఫిబ్రవరి 19న శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అక్కడికి రెండో రోజు వచ్చిన రెండో ఫేజ్ డ్యూటీ జాబితాలో మావారికి మేడారం జాతర డ్యూటీ పడింది. మొదటి ఫేజ్‌లో డ్యూటీ పడి ఉంటే ఏదో ఒక కారణం చెప్పి డ్యూటీ క్యాన్సిల్ చేసుకుని తప్పించుకునే వీలుంటుందిగానీ రెండో ఫేజ్‌లో డ్యూటీ పడినందువల్ల క్యాన్సిల్‌గానీ, ఏదైనా కారణం చెప్పి డ్యూటీ చేయను అనడానికిగానీ వీలు లేకుండా పోయింది. అందుకని మళ్ళీ శిరిడీ టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకున్నాము.
అలా రెండుసార్లు శిరిడీ ప్రోగ్రాం క్యాన్సిల్ అయిన తరువాత మావారు డ్యూటీ మీద మేడారం జాతరకి వెళ్లారు. ఆయన 21వ తారీఖున తిరిగి రావాల్సి ఉండగా అనుకోకుండా 20వ తారీఖునే డ్యూటీ ముగించుకుని ఇంటికి క్షేమంగా వచ్చారు. వస్తూనే, "మనం శిరిడీ వెళదాం" అన్నారు. అప్పడు నేను, "మనం ఇప్పటికే రెండుసార్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బాబా ఎందుకు ఆపుతున్నారో మనకి తెలియదు. కాబట్టి ఈసారికి శిరిడీయాత్ర వద్దులెండి" అని అన్నాను. మావారు, "ఏమీ కాదు. రేపటికి టిక్కెట్లు బుక్ చేసుకుంటే 22 ఉదయానికి శిరిడీ చేరుకుంటాం. అప్పటికి అక్కడ కార్యక్రమం మొదలైనా ఒక గంట ఆలస్యంగానైనా మనం అందులో పాల్గొనవచ్చు" అని అన్నారు. అయినా నేను ఒప్పుకోక, "మీరు వారం రోజులు మేడారం జాతరలో డ్యూటీ చేసి వచ్చారు. మీకు విశ్రాంతి కావాలి. శిరిడీకి వెళ్లాల్సిన సమయమొస్తే ఆ బాబానే తీసుకెళ్తారు. రెండుసార్లు టికెట్లు బుక్ చేసుకుంటే వెళ్ళలేకపోయాము. ఇప్పుడు రావడం కరెక్ట్ కాదని బాబా ఆపుతున్నట్లున్నారు" అని అన్నాను. మావారు నేను చెప్పేది పట్టించుకోకుండా, నాకు చెప్తే ఇలాగే వద్దంటుంటానని ఆరోజు రాత్రి మా పిల్లలతో కలిసి బయటకి వెళ్లి టికెట్లు బుక్ చేసేసారు. ఈసారి బాబా దయవల్ల ఏ ఆటంకమూ లేకుండా మేము శిరిడీ చేరుకున్నాము. సరిగ్గా అప్పుడే చావడి దగ్గరనుండి పుస్తకావిష్కరణకు సంబంధించి పల్లకి సేవ మొదటి ప్రదక్షిణ మొదలైంది. అది చూసి మేము రూమ్‌కి వెళ్లి చకచకా స్నానాలు చేసుకుని కిందికి దిగేసరికి చావడి దగ్గర మూడో ప్రదక్షిణ మొదలవుతుంది. నేను, మావారు ఆనందంగా ఆ పల్లకి సేవలో పాల్గొన్నాము. ఆ కార్యక్రమానికి వచ్చిన 'సాయి జ్ఞానయజ్ఞం' గ్రూపుకి చెందిన కృష్ణచైతన్యగారు, 'సాయి నిలయం' గ్రూపు సభ్యలు ఎడ్లపల్లి రవితేజగారు, 'శ్రీసాయి సన్నిధి' గ్రూపు అడ్మిన్ ప్రసాద్ గారు అనే ముగ్గురితో మాకు పరిచయమైంది. ఇరవైరెండో తారీఖు వాళ్లందరితో చాలా సంతోషంగా గడిచిపోయింది. 23వ తేదీన బాబా నడయాడిన స్థలంగా చెప్పబడే తపోభూమి కోపర్గావ్ వెళ్లి అక్కడ బాబా దర్శనం చేసుకున్నాం. అక్కడనుండి కృష్ణచైతన్యగారు చెప్పిన కొకగావ్‌లోని గోదావరి నది ఒడ్డున ఉన్న 800 సంవత్సరాల నాటి పురాతన శివాలయం దర్శించాము. అక్కడనుండి ఇండియాలో నెంబర్ వన్ టెంపుల్ అయినా శుక్రాచార్య టెంపుల్ దర్శించుకున్నాము. విచిత్రమేమిటంటే, మూడోసారి టిక్కెట్లు బుక్ చేసి శిరిడీ చేరుకున్న మేము అక్కడ మూడుసార్లు బాబా దర్శనం చేసుకున్నాము. అదికాక మేము దర్శించిన ప్రదేశాలు మూడు. మేము శిరిడీకి వచ్చేటప్పుడు తెచ్చుకున్న లగేజీలు మూడు. శిరిడీ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మా లగేజీలు ఆరు. అంటే అదనంగా 3 పెరిగాయి.
ఇకపోతే, తిరుగు ప్రయాణంలో బాబా ఒక చిన్న టెన్షన్ పెట్టినా చివరికి అద్భుతంగా అనుగ్రహించారు. అదేమిటో చూడండి, రైలులో మా ప్రయాణం మొదలయ్యాక సెల్ ఫోన్‌లో చార్జింగ్ లేదని చార్జింగ్ పెడదామని చూస్తే, మావారి చార్జర్, నా చార్జర్, పవర్ బ్యాంక్ ఉన్న కవర్ కనిపించలేదు. మొత్తం బ్యాగులన్నీ వెతికాము. కానీ ఎక్కడా కనపడలేదు. నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా ఏదో పెద్దగా పోయేది ఈ చిన్న వాటితో పోయేలా చేసినట్టు ఉన్నావు. సరే బాధలేదు. కానీ మీ భక్తులందరూ చెప్తుంటారు, 'ఏదైనా మనం బాబాను కోరుకుంటే, మన ప్రాప్తంలో లేకపోయినప్పటికీ దాన్ని మీరు ఖచ్చితంగా ఇస్తారు' అని. కాబట్టి ఒకవేళ మేము వాటిని శిరిడీలో మేమున్న గదిలోనే మర్చిపోయి ఉన్నాసరే ఉదయానికల్లా మా చార్జర్లు, పవర్ బ్యాంకు ఉన్న కవర్ మాకు కనిపించాలి" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత మా పిల్లలతో చాటింగ్ చేస్తూ 'మొబైల్ ఛార్జర్లు కనపడట్లేదు, మేము వచ్చేసరికి కొనిపెట్టండి' అని చెప్పాము. వాళ్ళు సరేనన్నారు. ఆ రాత్రి పడుకుని తెల్లారి లేచేసరికి మొబైల్ చార్జర్ల విషయం నేను, మావారు పూర్తిగా మర్చిపోయాము. కొంతసేపటికి బ్యాగులో ఏదో కావాలని బ్యాగు తెరిస్తే మా చెల్లి చేతికి మొట్టమొదటగా తగిలిన వస్తువు చార్జర్లు, పవర్ బ్యాంక్ ఉన్న కవరే. ఎంత విచిత్రమంటే, ఆ బ్యాగులోని ప్రతి కవరు బయటకి తీసి ఎన్నోసార్లు వెతికాము. అప్పుడెప్పుడూ ఆ కవర్ అందులో లేదు. అప్పుడు అంతలా వెతికితే దొరకని కవరు, ఉదయం బ్యాగులో పైనే ఉండడం బాబా మిరాకిల్‌కాక ఏమంటారు? ఆ విధంగా బాబా "నేనున్నాన"ని నిరూపించారు. మొత్తానికి అలా 3 సంఖ్యతో(రెండు చార్జర్లు, ఒక పవర్ బ్యాంకు) మా శిరిడీయాత్ర సుఖాంతమైంది. మొదటి రెండుసార్లు మా శిరిడీయాత్ర క్యాన్సిల్ అయినందువల్ల మూడోసారి నా మాట వినకుండా మావారు టిక్కెట్లు బుక్ చేసినప్పుడు 'ఎలా వెళ్లి, వస్తామోన'ని నా మనసులో చిన్న టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ కాస్త మేము ఇల్లు చేరుకోవడంతో పోయింది. మేము ఇంతకముందు 2021, నవంబర్‌లో శిరిడీ వెళ్లొచ్చాక మళ్లీ ఫిబ్రవరి 21న శిరిడీ వెళ్ళేనాటికి సరిగ్గా మూడు నెలల, మూడు రోజులు వ్యవధి ఉంది. అందుకే ముందు రెండుసార్లు మేము 19వ తేదీకి టిక్కెట్లు బుక్ చేసుకుంటే, బాబా మా యాత్రను క్యాన్సిల్ చేయించారేమో అనిపిస్తుంది.
చివరిగా ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మొదట సౌజన్యతో కలిసి శిరిడీ ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాం కదా! పాపం ఆ అమ్మాయి రెండురోజులు బాగా ఏడ్చి, తరువాత ఊరుకుంది. ఆపై మేము 21వ తేదీన శిరిడీకి ప్రయాణమవుతున్నామని తెలిసి తను చాలా బాధపడింది. అయితే ఆ అమ్మాయి శిరిడీయాత్ర బాబా సంకల్పంతోనే రద్దయిందని తరువాత నిరూపణ అయింది. అసలు ఏం జరిగిదంటే, ద్వారబంధం నిలబెట్టాక ఒకరోజు సౌజన్యవాళ్ళ అన్నయ్య నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలపైకి ఎక్కి, ఇంటికి నీళ్లు పెడుతుంటే అనుకోకుండా అతని కాలు జారి స్లాబ్ ఎత్తుకు వచ్చిన గోడ మీద నుండి కిందకి పడిపోయాడు. అతను పడుతూనే కింద ఉన్న రేకులు మీద పడి రేకులన్నీ చిన్న చిన్న ముక్కలైపోయాయి. అంతపెద్ద ప్రమాదం జరిగినా బాబా దయవల్ల అతనికి చిన్న గాయం కూడా కాలేదు. నిజానికి బాబా కృప లేకుంటే మనిషి కూడా మిగలడు. కనీసం ఏ కాలో, చెయ్యో విరిగేది. ఏమి కాకుండా బాబానే కాపాడారు. బాబా మనకు సంకేతాలు ఇస్తుంటారు. మనం అర్ధం చేసుకోగలగాలి.
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు!!!
🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete