సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1148వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • బాబా ఇచ్చిన మరుజన్మ

నా పేరు రాజి. నేను బాబా భక్తురాలిని. నేనిప్పుడు నా కథను మీతో పంచుకుంటున్నాను. కథ అంటే కల్పితం కాదు. నా జీవితంలో జరిగిన బాబా లీల, ఆయనపై నేను పెట్టుకున్న నమ్మకానికి ఆయన నన్ను కాపాడిన వైనం. కాపాడారు అనడం కంటే, పోయే నా ప్రాణాన్ని వెనక్కి లాగారు అనడం సమంజసం. భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తున్న రోజులవి. 2021, ఏప్రిల్ 27, మధ్యాహ్నం నాకు కొంచెం ఒళ్ళునొప్పులుగా అనిపించడంతో కోవిడ్ ఏమోనన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని బాబా ఊదీ, సచ్చరిత్ర పుస్తకం నా దగ్గర పెట్టుకుని, "బాబా! నీవే నాకు రక్ష" అనుకుంటూ ఆయననే తలుచుకుంటూ నా గదిలోనే ఉండిపోయాను. మరుసటిరోజుకి జ్వరం కూడా మొదలై రెండు, మూడు రోజుల్లో 104 డిగ్రీలకు చేరుకుంది. విపరీతమైన తలనొప్పి వలన తలపై సుత్తితో కొడుతున్నట్టుండి భరించలేని బాధను అనుభవించాను. మరి పరిస్థితి అలా ఉంటే ఆసుపత్రికి ఎందుకు వెళ్ళలేదనే అనుమానం మీకు రావచ్చు. అందుకు కారణం, అప్పటికే నాకు తెలిసిన వాళ్ళలో చాలామందికి కరోనా రావడం, వాళ్లంతా ఇంటిలోనే చికిత్స తీసుకోవడం, వాళ్ళకి తగ్గిపోవడం జరుగుతూ ఉంది. అందుకే నేను కోవిడ్ అని అనుమానించిన మొదటిరోజు నుండే డాక్టరు సలహా మీద ఇంటిలోనే(హోం క్వారంటైన్) ఉంటూ, చికిత్స (హోం ట్రీట్మెంట్) తీసుకుంటూ జ్వరం, తలనొప్పి ఉంటున్నా తగ్గిపోతుందని బాబా మీద భారం వేసి ఇంట్లోనే ఉండిపోయాను. అయితే క్రమక్రమంగా ఒంట్లో నీరసం ఎక్కువైపోతూ మే 1 నాటికి రక్తంలో ఆక్సిజన్ స్థాయి 84కి పడిపోయింది. అదేరోజు పారాయణ మిత్రుల వాట్సాప్ గ్రూపులో  'నా ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. నా గురించి బాబాకు పూజ చేయండి' అని అడిగాను. ఈ విషయం తెలియగానే వాళ్ళు, వీళ్ళు అని కాదు అందరూ చేసిన మొట్టమొదటి పని, బాబా ముందు కూర్చుని "బాబా! మా రాజిని కాపాడు" అని వేడుకుంటూ బాబా కాళ్లను పట్టుకోవడం. ఆపై అందరూ తమకు తోచిన విధంగా నాకోసం పూజలు చేశారు.


నా స్నేహితురాలు సునీత నా మెసేజ్ చూసిన వెంటనే నాకు ఫోన్ చేసి, "మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంది. పంపించనా?" అని అడిగారు. కానీ అప్పటికే రాత్రవడం వలన మరుసటిరోజు తీసుకుందామనుకున్నాను నేను. ఆ (శనివారం) రాత్రంతా నేను బాబాని తలుచుకుంటూ పడుకున్నాను. సరిగా ఊపిరి ఆడటం లేని ఆ స్థితిలో బాబా నన్ను పట్టుకుని ఉన్నారనిపించింది. మరుసటిరోజు ఆదివారం ఉదయమే సునీతకు నేను ఫోన్ చేయడం, తను సిలిండర్ పంపించడం చకచకా జరిగిపోయాయి. 'హమ్మయ్య..' అనుకున్నాను. అ‍యితే నాకొచ్చిన ఈ పరిస్థితి బాబాకి ముందే తెలుసు. ఇలా ఎందుకు అంటున్నానంటే, ఆ ఆక్సిజన్ సిలిండర్ సునీత వాళ్ళింటికి చేరడం ఒక బాబా లీల. సునీత నాకు సిలెండర్ పంపించటానికి రెండురోజుల ముందు వాళ్లకి తెలిసినవాళ్లు హాస్పిటల్‍కి వెళుతూ, "ఎవరికైనా అవసరం రావచ్చు. ఈ సిలిండర్‌ను మీ ఇంట్లో ఉంచండి" అని తమ ఇంట్లో ఉన్న ఆ ఆక్సిజన్ సిలిండర్‌ను సునీతవాళ్లకు ఇచ్చారు. అలా బాబానే ఆ సిలిండర్‌ను నాకోసమే వాళ్ళింటికి చేర్చారని నా నమ్మకం. అయితే ఆ సిలిండర్ ఎంతోసేపు రాలేదు. దాంతో మూడురోజులకు సరిపడే సిలిండర్ కొని పంపించారు నా స్నేహితులు. కానీ ఏ కారణం వల్లో అది పెట్టడం కుదరక నాకు ఊపిరి తీసుకోవటం ఇబ్బందిగా మారింది. నా భర్త 'రాజ్' ఎంతగానో కష్టపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు స్నేహితులు మనోజ్ అనే ఎలక్ట్రిషియన్‍ను పంపారు. అతను తను ప్రాణాలు కూడా లెక్కచేయకుండా సిలిండర్ నాజిల్ బాగు చేయటానికి ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నాలు కూడా ఫలించకపోగా సిలెండర్‌లోని ఆక్సిజన్ అంతా బయటికి లీకైపోయింది. దాంతో ఏమిటి ఈ అవాంతరం అని మావారు కాస్త భయానికి లోనయ్యారు. ఆరోజు ఉదయం నుంచి నాకు తెలియకుండానే నాకేదో జరుగుతుందనిపిస్తున్నా నేను మాత్రం ఏ క్షణమూ భయపడలేదు. అందుకు కారణం బాబాపై నాకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే 'బాబా నాతో ఉన్నారు. ఆయన ఏం చేసినా అందులో ఒక మంచి ఉంటుంది. ఆ మంచి మనకు సంఘటన జరుగుతున్నప్పుడు అర్ధం కాకపోవచ్చుగానీ, తరువాత అవగతమవుతుంది' అని ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. నిజం చెప్పాలంటే, ఆ సిలిండర్ లీక్ అవ్వకపోయుంటే నేను హాస్పటల్‍కి వెళ్లకుండా ఇంట్లోనే గడిపేదాన్ని. అటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నేను ఇంట్లో ఉండటం మంచిది కాదు కాబట్టే బాబా ఆ సిలిండర్ లీక్ అయ్యేలా చేసి నేను హాస్పిటల్‍కు వెళ్లాల్సిన పరిస్థితి కల్పించుంటారు.


ఆక్సిజన్ లీకైపోవడంతో ఇక హాస్పిటల్‍కి వెళ్ళడం తప్పదని అర్ధమైంది. నా ఈ పరిస్థితి గురించి ఎక్కడెక్కడో ఉన్న స్నేహితులందరికీ తెలిసి అందరూ కలిసికట్టుగా వారి శాయశక్తులా ఆక్సిజన్ బెడ్‍ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎందుకంటే, అప్పుడున్న పరిస్థితులలో హాస్పిటల్లో బెడ్ దొరకటం అంత ఆషామాషీ కాదు. అదీకాక అప్పట్లో ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా కోవిడ్ టెస్టు రిపోర్టు తప్పనిసరి. కానీ నా టెస్టు రిపోర్టు అప్పటికింకా రాలేదు. అందువలన సీటీ స్కాన్ కోసం ఫోన్ చేస్తే మధ్యాహ్నానికిగాని అవకాశం దొరకలేదు. నిజానికి అది కూడా బాబా అనుగ్రహమేనని చెప్పాలి. ఎందుకంటే, ఆ రోజుల్లో ఎవరైనా సీటీ స్కాన్ చేయించుకోవాలంటే రెండు, మూడు రోజులు పట్టేది. అలాంటిది మేము ప్రయత్నించినంతనే ఫోన్ లిఫ్ట్ చేసి, అపాయింట్మెంట్ ఇచ్చి, స్కాన్ చేసి, ఆ మధ్యాహ్నమే రిపోర్టు కూడా ఇచ్చారు. రిపోర్టులో ఇన్ఫెక్షన్(13/25) చాలా ఎక్కువగా ఉందని వచ్చింది. అప్పటికింకా కొనసాగుతున్న స్నేహితుల ఆక్సిజన్ బెడ్ ప్రయత్నాలు ఎట్టకేలకు బాబా దయవల్ల సాయంత్రానికి ఫలించి ఒక కోవిడ్ హాస్పిటల్లో బెడ్ దొరికింది. నేను, మావారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ సాయంత్రమే హాస్పిటల్‍కి వెళ్ళాం. మా మిత్రులు వేణుగోపాల్ మరియు శ్రీనివాస్‍గార్లు  కొంచెం నగదు, కావాల్సిన అత్యవసర వస్తువులు కారు డ్రైవరుతో పంపించారు.


హాస్పిటల్‍కి వెళ్ళాక ఆక్సిజన్ ఇవ్వగానే నేను కొంత కుదుటపడ్డాను. కాని నా రిపోర్టులు చూడగానే డాక్టర్, "కష్టం, ఆలస్యం చేసారు" అంటూ నిస్సహాయంగా మాట్లాడారట. అప్పటికీ సీటీ స్కాన్ రిపోర్ట్లు తెలిసిన డాక్టర్లకి చూపించారు. అయితే  వాళ్ళు కూడా క్రిటికల్ అని తేల్చి చెప్పారు. దాంతో అప్పటివరకు తన బాధను బయటకు తెలియకుండా ధైర్యాన్ని నటించిన నా భర్త ఒక్కసారిగా కుప్పకూలిపోయి భోరున ఏడ్చేశారట. డాక్టర్లు శ్రీనివాస్‍గారితో "ఆయన్ని(రాజ్) జాగ్రత్తగా చూసుకోండి. చాలా స్ట్రెస్(ఒత్తిడి) ఫీల్ అవుతున్నార"ని చెప్పారట. స్నేహితులు కూడా చాలా ఆందోళన చెంది పిల్లలు, రాజ్ ఏమైపోతారోనని చాలా భయపడ్డారు. నేను మాత్రం 'బాబా నాతో ఉన్నారు. అంతా ఆయనే చూసుకుంటారు. నాకేం కాదనే' నమ్మకంతో ధైర్యంగానే ఉన్నాను. అదే నమ్మకాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా బాబా ప్రసాదించారేమో! ఎన్నడూ ఇంటిలో ఒంటరిగా ఉండే అలవాటు లేని పిల్లలు ఎన్నో రాత్రులు ధైర్యంగా గడిపారు. అప్పుడప్పుడు 'ఎప్పుడు వస్తావని' ప్రశ్నించినప్పటికీ, ఆందోళనపడకుండా ఎంతో సహకరించారు. అలాగే నాకు వాళ్ళపట్ల చింత లేకుండా ఉండటానికి బాబా చేసిన ఏర్పాటు నా స్నేహితురాలు మమత. ఆమె ఒకరోజు కాదు, ఒక వారం కాదు నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ తనకు తెలిసిన హోమ్ టిఫిన్ సెంటర్ నుండి మూడు పూటలా ఆహారం హోమ్ డెలివరీ చేసే ఏర్పాటు చేశారు.


డాక్టర్లు అప్పటికి మార్కెట్లో అతి అరుదుగా దొరుకుతున్న రెమిడిసివర్ ఇంజెక్షన్లు తెప్పించమన్నారు. వాటికోసం మిత్రులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్న క్రమంలో బాబానే ఆ ఇంజక్షన్ నాకోసం ఏర్పాటు చేశారు. అదెలా అంటే, ఒక ఫ్రెండ్‍కి తెలిసినవాళ్ళు 6 ఇంజక్షన్లు తెప్పించుకుని ఏ కారణం చేతనో వాటిని ఉపయోగించుకోలేకపోయారు. వాళ్ళు నాకు ఆ ఇంజక్షన్ అవసరమైనరోజే మా ఫ్రెండ్‍కి ఫోన్ చేసి, "మీకు తెలిసినవాళ్లకి అవసరమైతే ఉపయోగించుకోండి" అని అన్నారట. ఇంకేముంది, ఆ ఇంజక్షన్లు నాకు చేశారు. మనం బాబా మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు ఏది అవసరమో అది ముందే సమకూర్చిపెడతారనడానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలే ఉదాహరణలు.


నేను హాస్పిటల్లో, రాజ్ కారులో, పిల్లలు ఇంట్లో, మిత్రులు వాళ్ళవాళ్ళ ఇళ్ళల్లో ఉంటూ అది గుర్గావ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హైదరాబాదు కావచ్చు, బెంగళూరు కావచ్చు, మలేషియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవరు ఎక్కడున్నా అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ, నాకు అవసరమైనవి క్షణాల్లో సమకూర్చే విధంగా ఒక టీమ్‍లా శ్రమిస్తున్నారు. ఒకరోజు సివిల్ హాస్పిటల్లో నాకు పెట్టిన ఆక్సిజన్ పెట్టింది పెట్టినట్టే ఉంది, కానీ నాకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. విషయం తెలుసుకున్న మా మిత్రులు శ్రీనివాస్‍గారు వెంటనే తన ఫ్రెండ్ అయిన ఒక పల్మనాలజిస్ట్‌తో మాట్లాడడం, ఆయన, "ఆక్సిజన్ వాల్వ్ చెక్ చేసి ఫ్లో పెంచమ"ని సలహా ఇవ్వడం, ఆ విషయాన్ని శ్రీనివాస్‍గారు రాజ్‍కి కాల్ చేసి చెప్పడం, రాజ్ నర్స్ కి చెప్పడం, నర్స్ వెంటనే వాల్వ్ సరి చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఇందులో ఏ ఒక్కరు సమయానికి స్పందించకపోయినా ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. బాబా నాతోనే కాదు, నా స్నేహితులందరితో కూడా ఉండి సమయానికి తగిన సహాయం అందిస్తున్నారన్నది స్పష్టం కదా!


ఇకపోతే, సివిల్ హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ జరుగుతుందిగానీ, అది సరిపోవట్లేదని మిత్రులందరూ నాకోసం ఒక మంచి హాస్పిటల్లో బెడ్ కోసం ప్రయత్నాలు సాగించారు. మూడవరోజు, అంటే సోమవారం వేరే హాస్పిటల్లో బెడ్ ఖాళీగా ఉందని తెలిసింది. కానీ మావారు ఎందుకో నన్ను అక్కడికి తీసుకుని వెళ్లడానికి అంగీకరించలేకపోయారు. అది బాబా ప్రేరణే అయుండొచ్చు. ఎందుకంటే, అదేరోజు రాత్రి ఆ హాస్పిటల్లో చాలామంది ఆక్సిజన్ సరఫరా లేక ప్రాణాలు కోల్పోయారని తరువాత  తెలిసింది. అయితే, సివిల్ హాస్పిటల్లో నా మనసు, ఆరోగ్యం బాగుండేవి కాదు. కానీ, 'నా ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వెళ్తాన'ని బాబా చెప్తున్నట్లు నా మనసుకి అనిపించేది. బహుశా అందుకేనేమో నేను నా అనుకున్న వాళ్ళకి 'నేను మళ్లీ వస్తా... ఇది నాకు పునర్జన్మ' అని మెసేజ్ పెడుతుండేదాన్ని. మంగళవారం (నాలుగవరోజు) నా పరిస్థితి మరీ క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి. డాక్టర్లు నన్ను వేరే హాస్పటల్‍కి తీసుకెళ్ళమని చెప్పారు. కానీ లోకల్‍లో ఉన్న మిత్రులేకాక హైదరాబాద్ నుండి కూడా ప్రయత్నిస్తున్నా ఏ హాస్పిటల్లో బెడ్స్ దొరకడం లేదు. దాంతో అందరూ ఆందోళనలో పడి బాబాను వేడుకున్నారు. నేను కూడా ఆరోజు మధ్యాహ్నం వరకు చాలా ఆందోళనకు గురయ్యాను. అయితే అసలెవరూ ఊహించని విధంగా ఢిల్లీ అపోలో హాస్పిటల్లో ఐ.సి.యులో ఒక బెడ్ దొరికింది. దాన్ని మిత్రులు వేణుగారు, శ్రీనివాస్‍గార్ల ద్వారా సమయానికి బాబానే ఏర్పాటు చేశారు. బాబాకు తెలుసు నాకు కావాల్సిన హాస్పిటల్, ట్రీట్మెంట్ ఎప్పుడు అందుతాయో, అంతవరకు నాకు ఏ ప్రమాదమూ వాటిల్లకుండా కాపాడుకుంటూ వచ్చారు. సంపూర్ణ విశ్వాసంతో ఉన్నప్పుడు అన్నీ బాబా సమకూరుస్తారు.


నాలుగవరోజు సాయంత్రం నన్ను సివిల్ హాస్పిటల్ నుండి అపోలో హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్సు కావాల్సి ఉండగా సరిగ్గా ఆరోజే గుర్గావ్‍లో అంబులెన్స్ స్ట్రైక్ జరిగింది. అందుచేత మళ్ళీ అందరికీ ఆందోళన మొదలై ఇప్పుడెలా అని మధనపడుతుంటే బాబా ఒక డాక్టర్ రూపంలో అక్కడికి రావడం, అతని సహకారంతో ఒక అంబులెన్స్ దొరకడం జరిగాయి. అంబులెన్స్ లో వెళుతున్నప్పుడు నా ప్రాణాలు గాలిలో తేలుతున్నట్టు అనిపించింది కానీ నా నమ్మకం ఏ మాత్రమూ సడలలేదు. అపోలోకి చేరుకున్నాక నన్ను ఐ.సి.యులోకి తీసుకెళ్లారు. అప్పుడు నేను బాబాని, "బాబా! నేను మీ ద్వారకామాయికి వచ్చాను. నాయందు దయుంచి మీరే నాకు నయం చేసి ఇంటికి పంపించాలి" అని వేడుకుని ఆయన మీద ఎప్పటిలాగే అదే నమ్మకంతో ఉన్నాను. నా అదృష్టం వల్ల అక్కడ నాకు చికిత్స చేసిన డాక్టర్లిద్దరూ తెలుగువాళ్లు. వాళ్ళ పేర్లు శ్రీహరి, దేవ్. ఈ రెండు పేర్లు నాకు చాలా మంచిగా అనిపించాయి. శ్రీహరి అనగా శ్రీవెంకటేశ్వరస్వామి, దేవ్ అంటే బాబా. శ్యామా బాబాని 'దేవా' అని పిలిచేవారు కదా. వారితో మాట్లాడుతూ ఉండటం వలన నా ఆరోగ్యం చాలా తొందరగా కుదుటపడుతున్నట్లు అనిపించేది. వాళ్ళ పలకరింపు మరియు ఐ.సి.యులో ఇతర డాక్టర్ల ప్రోత్సాహం వల్ల నాకు చాలా ఊరటగా ఉండేది.


డాక్టర్లు నాకోసం ఒక టాబ్లెట్ కావాలని, అవి ఇక్కడ దొరకట్లేదు; ఎక్కడ నుండైనా తెప్పించండి అని చెప్పారు. మళ్లీ మిత్రులందరూ ఆ టాబ్లెట్ కోసం వేట మొదలుపెట్టారు. ఆ టాబ్లెట్లను మిత్రులు ట్రిన్‍గారు, హైదరాబాద్‍లోని తెలిసినవాళ్ళు(శ్రీను అన్న), మరోసారి గంగారెడ్డిగారు ఏర్పాటు చేసారు. మరుసటిరోజు ఉదయానికల్గా అవి ఢిల్లీలో ఉన్నాయి. అంత తొందరగా సమకూరాయంటే అది బాబా అనుగ్రహమే. ఐసియు.లో ఉండగా ఒకరోజు యమధర్మరాజు తాడు వేసి నన్ను లాగుతుంటే, సతీ సావిత్రిలాగా బాబా నన్ను వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. దాంతో బాబా నా పక్కనే ఉంటూ నా చేయి పట్టుకుని ఉన్నారనిపించేది. నా చేతికి పెట్టిన బి.పి. పట్టి ప్రతీ గంటకు ఒకసారి గట్టిగా గాలితో ఒత్తుతున్నప్పుడు బాబా నన్ను గట్టిగా పట్టుకుని నాలోని అనారోగ్యాన్ని పోగొట్టి నయం చేస్తున్నారని అనుకునేదాన్ని, అక్కడ నాకు ఇచ్చే ప్రతి ఇంజక్షన్‍కి బాధను ఫీలవకుండా "థాంక్యూ బాబా" అని అనుకునేదాన్ని. అలా ప్రతిక్షణం బాబాను తలుచుకుంటూ ఉండేదాన్ని. ఎనిమిది రోజుల తర్వాత నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింది. నన్ను ఐ.సి.యు నుండి పోస్ట్ కోవిడ్ ఐసియుకి మార్చారు. అక్కడ దాదాపు పదిరోజులు ఉన్నాను. అక్కడ నాకు సత్పతి గురూజీ ప్రతి డాక్టరులోనూ కనిపించేవారు. ఆ గురూజీ బాబా గుడిలో ఎలా నడుస్తూ ఉంటారో అలాగే కనిపించేవారు. కొన్నిరోజులకి నన్ను నార్మల్ రూమ్‍కి మార్చారు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ ఒక పుట్టిన పాపాయిలా నాకు నడవటం నేర్పి, మే 2న కోవిడ్‍తో ఇల్లు వదిలిన నన్ను, జూన్ 11న ఆరోగ్యవంతురాలిగా తిరిగి నా ఇంటికి, నా పిల్లల దగ్గరకు చేర్చారు బాబా. బాబా నాకు ఇచ్చిన మరుజన్మ ఇది. ఇదంతా వ్రాస్తుంటే నాకు సచ్చరిత్రలోని మైనతాయి కథ గుర్తుకొస్తుంది. ప్రసవ సమయంలో ఆమెకు బాబానే స్వయంగా సమయానికి ఊదీ ప్రసాదం అందించినట్లు నా విషయంలో కూడా సమయానికి అన్నీ సమకూరేటట్లు చేసి నాకు పునర్జన్మనిచ్చారు. మావారిలో కూడా ఎప్పుడూ చూడని ధైర్యానిచ్చారు. ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పటికీ ఆయన ఆరోగ్యం కాపాడుతూ బాబా నాతోనే కాదు, రాజ్‍తో కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నో క్షణాల్లో ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ చిక్కుముడి ఎలా వీడుతుందో అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తినా, ఎన్ని ఆకంటాలు ఎదురైనా ఎల్లప్పుడూ బాబా మాకు మనోధైర్యాన్ని ఇస్తూ వచ్చారు. మిత్రులు కూడా తమ ప్రయత్నాలలో ఎన్నో చిక్కు ముడులు వచ్చేవని,  బాబా దయవల్ల ప్రతి ముడి సునాయాసంగా విడిపోయేది అని అనేవారు.


నా ఈ పునర్జన్మకు కారకులుగా బాబాచే నియమింపబడిన షర్మిల, శ్రీనివాస్‍గార్లు, సునీత, వేణుగార్లు, వసుంధర, సురేష్ గారు, ట్రిన్‍గారు, గంగారెడ్డిగారు, ఆయుష్, సంధ్య, మమత, సాయి, కమల్, నళినీ మరియు ప్రతీ క్షణం నా మీదే ప్రాణాలు పెట్టుకున్న నా కుటుంబసభ్యులు, ఇంకా ఎంతోమంది నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇంకా నాకోసం బాబాను మ్రొక్కుకుంటూ నా రాకకోసం ఎదురుచూసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


చివరిగా ఒక మాట: కోవిడ్ సమయంలో అనారోగ్యం పాలవకుండా కావాల్సిన జాగ్రతలు తీసుకోండి. అవి తీసుకున్నప్పటికీ ఒకవేళ అనారోగ్యం పాలైతే డాక్టర్ల చికిత్సతోపాటు  అధైర్యపడకుండా మనస్ఫూర్తిగా బాబాను స్మరించండి. అలా నమ్మితే ఆయన మనలను విడిచిపెట్టరు, మన వెన్నంటే ఉండి కాపాడతారు.


- రాజి.



12 comments:

  1. Om sai ram🙏🙏

    ReplyDelete
  2. సర్వం శ్రీ సాయి దయ. ఆయన ను మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నమ్మితే... శ్రద్ధ సబూరి లతో ఉంటే మనము దేనికి చింతించవలసిన అవసరం లేదు. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమో సర్వము సాయి మాత్రమే సమకూర్చగల రు.
    ఓం శ్రీ శిరిడి సాయి నాధాయ నమః. 🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sairam!! Meeru chala Adrushtavanthulu🙏🏻 Bsba Krupa mee paina adbhutham gaa vundi !! Jai Sairam 🙏🏻

    ReplyDelete
  4. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  5. Chaalaa baagundhi ….. baba me meedha choopinna prema …..

    ReplyDelete
  6. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  7. 🙏🙏🙏🙏

    ReplyDelete
  8. 🙏🕉️✡️🙏 ఓం సాయిరాం నీవే కలవు. నీవే తప్పా మాకెవరీ భువిలో.. నీవే మమ్మల్ని దీవించే గొప్ప మహిమ గల అద్భుతమైన సాయిరాం దేవునివి.. సాయి సాయి అని స్మరించిన వెంటనే మాకు దీవెనలు అందించి ఆశీస్సులు అందించి ఆశీర్వదిస్తున్నావు సాయి దేవా హృదయ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు షిరిడీశ్వరా

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo