1. ఎటువంటి కష్టాన్నైనా దాటించే సాయినాథుడు
2. బాబా ఊదీతో మూడురోజుల నరకయాతన నుండి ఉపశమనం
3. శ్రీసాయి దయ
ఎటువంటి కష్టాన్నైనా దాటించే సాయినాథుడు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా నా సాయితండ్రికి నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. ఆ సాయి తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను తోటి సాయి భక్తులతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుంటున్నాను. 2022, మార్చ్ 25, ఉదయం గం. 7.30 నిమిషాలకి మా అమ్మ వంట చేస్తుండగా గ్యాస్ లీకై హఠాత్తుగా మంటలు చెలరేగాయి. కొంచెం అయితే అమ్మకు ఆ మంటలు అంటుకునేవి. బాబా దయవల్ల ఆమెకు ఏమీ కాలేదుగాని చూస్తుండగానే మంటలు ఎక్కువైపోసాగాయి. తడి బట్టలు ఎన్ని వేస్తున్నా మంటలు తగ్గట్లేదు సరికదా ఇంకా ఇంకా పెరిగిపోసాగాయి. అరగంట వరకు మంటలు అస్సలు తగ్గలేదు. ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు, అమ్మ ఉన్నారు, పక్కింట్లో వాళ్ళు, ఇంటి ఓనర్స్ అందరూ ఉన్నారు. ఎక్కడ సిలిండర్ పేలిపోతుందోనని మనసులో ఒకటే కంగారుతో నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పుడు మనస్సులో, "తండ్రీ! ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడండి. ఎలాంటీ నష్టం జరగకుండా చూడండి సాయీ" అని బాబాను గట్టిగా ప్రార్థిస్తూ ఏడ్చేసాను. మా తండ్రి సాయిబాబా మమ్మల్ని కాపాడారు. కొద్దిసేపట్లో మంటలు వాటంతటవే ఆగాయి. ఇప్పటికీ నా మనసులో నుంచి భయం పోలేదుగాని బాబా మమ్మల్ని పెద్ద గండం నుండి కాపాడారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
పై సంఘటన జరగడానికి రెండు నెలల ముందు నాలుగు సంవత్సరాల మా పెద్దబాబుకి తీవ్రంగా జలుబు చేసి దగ్గు కూడా ఎక్కువగా ఉండేది. డాక్టరుకి చూపించి మందులు వాడుతున్నా, బాబా ఊదీ పెడుతున్నా తనకి 20, 25 రోజుల వరకు అస్సలు తగ్గలేదు. తనకి తీవ్రమైన దగ్గువల్ల రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు. అంతలో చిన్నబాబుకి జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరం వచ్చాయి. ఇంకా అప్పుడు డాక్టరు టెస్టులు చేద్దామని అన్నారు. అప్పుడు నేను, "బాబా! టెస్టు రిపోర్టు నార్మల్ అని రావాలి. బాబును హాస్పిటల్లో చేర్చాల్సి రాకూడదు" అని బాబాను వేడుకున్నాను. అయితే బాబుకి టైఫాయిడ్ అని, బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని వచ్చింది. కానీ బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేయలేదు. మందుల వాడుతున్నా తనకి నయం కాలేదు. ఇద్దరు పిల్లల పరిస్థితి అలా ఉన్నా 'ప్రతిసారీ నా ప్రోబ్లేమేనా, అప్పుడప్పుడు కష్టాన్ని కూడా భరించాలి, ప్రతీ చిన్న సమస్యకి బాబాను ఇబ్బందిపెట్టడం ఎంటి?' అని నేను సరిగ్గా బాబాను ప్రార్థించలేదు, ఆయన్ని అంతగా బలవంతపెట్టలేదు. కానీ రోజురోజుకి సమస్య ఎక్కువైపోతుండేసరికి బాబాను, "ఎంతో పవిత్రమైన మీ ఊదీ పెట్టినా పిల్లలకి నయం కాకపోవడమేంటి బాబా? ఏమైనా ఉంటే నన్ను శిక్షించండి కానీ, నా పిల్లల్ని కాదు. ప్లీజ్ బాబా, మీ ఊదీ మహిమతో నా పిల్లలకి ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించండి" అని దీనంగా వేడుకున్నాను. అప్పటినుండి పిల్లల ఆరోగ్యం రోజురోజుకి మెరుగుపడింది.
ఒకసారి నేను సెలవు పెట్టి హైదరాబాదులో ఉన్న మావారి దగ్గరకి వెళ్ళాను. అప్పటినుండి ఇంకా అక్టివేషన్ కూడా చేయని కొత్త ఏ.టి.ఎమ్. కార్డు, మా చిన్నబాబు వెండి బ్రేస్లెట్ కనిపించకుండా పోయాయి. నా బ్యాగులో, ఇంట్లో అంతా వెతికానుగాని అవి దొరకలేదు. చాలారోజులు గడిచినప్పటికీ అవి కనిపించకపోయేసరికి ఆశలు వదిలేసాను. కానీ ఈమధ్య ఒకసారి "నా ఏ.టి.ఎమ్ కార్డు, బ్రేస్లెట్ దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, అన్నిరోజులూ కనిపించనవి బాబా దయవల్ల దొరికాయి. "బాబా! నా ఈ అనుభవాన్ని వెంటనే రాయాలి. కానీ ముఖ్యమైన మరో రెండు పెద్ద సమస్యలు పరిష్కారమైతే, అన్నీ అనుభవాలు కలిపి ఒకేసారి వ్రాస్తానని అనుకున్నాను. కానీ ఈరోజు (మార్చ్ 25) జరిగిన అగ్ని ప్రమాదానికి భయపడి వెంటనే నా అనుభవాలు వ్రాస్తానని మీకు మొక్కుకున్నాను బాబా. మీకిచ్చిన మాట ప్రకారం నా అనుభవాలు పంచుకున్నాను బాబా. కానీ నా ట్రాన్స్ఫర్ మరియు ప్రమోషన్ విషయాలు ఇంకా పెండింగ్‍లోనే ఉన్నాయి తండ్రి నాకున్న ప్రధాన సమస్యలవి. నా చేయి వదిలిపెట్టకండి బాబా. నేను ఎంత మానసిక ఆందోళనకు గురవుతున్నానో మీకు తెలుసు. ఈ టెన్షన్, బాధలు నాకు నరకం చూపిస్తున్నాయి. ఎక్కడ పిల్లలకి దూరం అయిపోతానోనని భయమేస్తుంది బాబా. చిన్నచిన్న పిల్లలు బాబా. వాళ్లు చాలా ఇబ్బందిపడుతున్నారు. వాళ్ళకి ఎవ్వరి ప్రేమ దొరకట్లేదు. నేను నీ భక్తురాలిని బాబా. మీ మార్గంలో నడుస్తున్నాను. ఎవరినీ ఇబ్బందిపెట్టకుండా ప్రతిదీ భయపడుతూ చేస్తాను. నాకు తెలిసి నేను ఎవ్వరి కడుపు మీద కొట్టలేదు, మంచే చేశాను. కానీ నేను ఎంత నిజాయితీగా ఉన్నా, హార్డ్ వర్క్ చేసినా ప్రతిఫలం దొరకట్లేదు. పైగా నామీదే అభియోగం మోపుతున్నారు. నా ఆత్మసాక్షి అయిన మీకు అన్నీ తెలుసు బాబా. నా నిజాయితిని గుర్తించి నాకు న్యాయం చేయండి బాబా. మీ దయతో నా రెండు సమస్యలూ పరిష్కారమైతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను సాయి".
బాబా ఊదీతో మూడురోజుల నరకయాతన నుండి ఉపశమనం
నా పేరు భాను. మాది నిజామాబాదు. నాకు 2022 మార్చి 20కి రెండు, మూడు రోజుల ముందు నుండి యూరిన్ ఎప్పటిలా రాకుండా తక్కువగా వస్తుండేది. దాంతోపాటు కడుపునొప్పి, ఆయాసం వస్తుండేవి. కడుపునొప్పి వచ్చిన ప్రతిసారీ కడుపు నుండి గుండెపై వరకు లాగేస్తున్నట్లు నొప్పిగా ఉంటుండేది. మార్చి 20, ఉదయం నుండైతే మరీ తక్కువగా యూరిన్ పాస్ అవ్వసాగింది. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వల్ల ఆయాసం, కొద్దిగా అన్నం తిన్నా, నీళ్లు త్రాగినా కడుపు బిగుసుగా అయిపోయి నొప్పిగా ఉండటం జరిగాయి. హాస్పిటల్‍కి వెళితే, "మీకు ఇంతకుముందు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది కదా(2013లో కుడివైపు కిడ్నీ వాచి నొప్పి వచ్చి బాబా దయవల్ల తగ్గింది)" అని, "స్కానింగ్ చేయించుకుని రండి" అన్నారు డాక్టరు. కానీ స్కానింగ్ చేయించుకోవడానికి వీలుపడలేదు. ఇంకా నేను ఆ రోజంతా యూరిన్ పాస్ అవ్వక ఆయాసం, కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడుతుండగా రాత్రుళ్ళు నాకు వస్తున్న కలలు గుర్తొచ్చాయి. ఆ కలల్లో 15 రోజుల ముందు చనిపోయిన వాళ్ళు కనిపించి నన్ను పిలుస్తూ బలవంతంగా పాడెమీద పడుకో అంటూ లాగుతుండేవారు. నేను పడుకోను అంటుండగా నాకు మెలుకువ వచ్చేది. ఈ కలలకి తోడు 2021, మార్చిలో కోలన్ కాన్సర్‍తో చనిపోయిన నా సొంత అక్క కూడా గుర్తొచ్చింది. అక్కకి కూడా ఇలాగే యూరిన్ పాస్ కాకుండా ఆగిపోవటం, కడుపు ఉబ్బటం జరిగాయి. ఇవన్నీ తలచుకుని నేను బాగా భయపడిపోయాను. దాంతో టెన్షన్‍కి గుండెనొప్పి కూడా వచ్చి కడుపు లోపలే యూరిన్ లీక్ అవుతున్నట్లు అనిపించి కడుపు ఉబ్బరంగా అయింది. అప్పుడు నేను, "నన్ను ఎలాగైనా కాపాడు బాబా. నాకు యూరిన్ పాస్ అవ్వాలి, గుండెనొప్పి, కడుపునొప్పి, ఆయాసం తగ్గాలి. వెంటనే నాకు నెలసరి వచ్చేలా చేయండి. అలా అయితే యూరిన్ ఫ్రీగా పాస్ అవుతుంది. మీ దయవల్ల నా ఈ కష్టం తీరితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా" అని బాబాను వేడుకుని ఊదీ నుదుటన పెట్టుకుని, పొట్టకి, గుండెకి రాసుకున్నాను. మరికొంత ఊదీ నీళ్లలో కలిపి తీసుకున్నాను. అలా నాలుగైదు సార్లు బాబా ఊదీ పెట్టుకున్నాక రాత్రి నుండి కొంచెం కొంచెం యూరిన్ పాస్ అవుతూ వచ్చింది. మరుసటిరోజు నాకు నెలసరి వచ్చింది. అంతే, బాబా దయవల్ల మూడు రోజులుగా అనుభవిస్తున్న నరకయాతన నుండి నాకు పూర్తిగా ఉపశమనం లభించింది. నాకు ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. మొదటిసారి వచ్చిన ఈ బాధ నుండి కేవలం బాబా దయవల్లే బయటపడ్డాను. తరువాత నేను ఏప్రిల్ 1 కి శిరిడీ వెళదామని అనుకుని నా ఫ్రెండ్‍ని, "శిరిడీ వెళదామె, వస్తావా?" అని అడిగాను. మరుసటిరోజు ఇన్స్టాగ్రామ్‍లో ఈ క్రింది బాబా మెసేజ్ వచ్చింది.
భావం: "డియర్, నువ్వు త్వరలో శిరిడీ వస్తావు. సిద్ధంగా ఉండు"
ఆ మెసేజ్ చూసి నాకు చాలా సంతోషమేసింది. బాబా తాము చెప్పినట్లే, ఏప్రిల్ 2, ఉగాది పండగ రోజున నేను శిరిడీలో ఉండేలా అనుగ్రహించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
శ్రీసాయి దయ
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బ్లాగు నిర్వహిస్తున్న సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుణ్ణి. బాబా నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు, ప్రసాదిస్తున్నారు. ఇటీవల మా కజిన్ ఒక అతనికి కోవిడ్ వచ్చి తగ్గింది. తర్వాత కొన్నిరోజులకు అతనికి కఫంతో రక్తం పడుతుండేది. మందులు వాడితే తగ్గి, కొద్ది రోజులకి మళ్లీ రక్తం పడుతుండేది. ఇక అప్పుడు ఒక స్పెషలిస్ట్ డాక్టరుని సంప్రదించారు. ఎండోస్కోపీ చేస్తే సమస్య ఏమీ లేదని వచ్చింది. దాంతో డాక్టరు సిటి స్కాన్ తీయించమని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! సిటి స్కాన్‌లో కూడా ఏమి లేదని వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. సాయి దయవలన అతనికి ఏ జబ్బు లేదని, మందులు వాడితే తగ్గిపోతుందని అన్నారు. అలాగే కోర్సు వాడిన తర్వాత తగ్గిపోయింది. సాయినాథునికి ధన్యవాదాలు. ఎల్లవేళలా మా కుటుంబానికి మంచి జరగాలని సాయినాథున్ని కోరుకుంటున్నాను.
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!

