- శ్రీసాయి అనుగ్రహవర్షం
ఓం శ్రీసాయినాథాయ నమః!!!
‘సాయి మహరాజ్ సన్నిధి’ గ్రూప్ నిర్వాహకులకు, తోటి సాయిబంధువులకు నా నమస్కారాలు. ఈ గ్రూపులో ఇది నా నాలుగవ అనుభవం. “బాబా! నాకు ఈ సమస్య తీరితే నా అనుభవాన్ని బ్లాగులో తోటి సాయిబంధువులతో పంచుకుంటాను” అని అనుకోగానే నా సమస్యలు తీరుతున్నాయి. కానీ, కొన్నిసార్లు అనుభవాలు పంచుకునేందుకు నేను ఆలస్యం చేస్తున్నాను. “ఒక సమస్య తరువాత ఒక సమస్య వచ్చి జీవితంపై విరక్తి వస్తోంది బాబా. సమస్యను తీర్చడంలో మీరు ఆలస్యం చేయట్లేదు దేవా. నేనే సమస్య తీరాక అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేస్తున్నాను దేవా! నన్ను క్షమించండి. మీ పాదాలపై ఒక చిన్న రేణువుగా నా జీవితాన్ని పరిసమాప్తి చేయండి దేవా! మీ పాదాలపైన, మీపైన భక్తిని విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా చూడండి దేవా!”
మొదటి అనుభవం: 2021, డిసెంబరులో మావారు ‘మోపిదేవి’ అనే ఊరిలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారు. మావారు వెళ్ళి అప్పటికే 15 రోజులు అయినందువల్ల, తనకు ఇంటికి రావడం కుదరకపోవడం వల్ల ఒకసారి నేనే మోపిదేవికి వెళ్ళాను. అక్కడ వారంరోజులు ఉండి, సంతానం కోసం మావారు, నేను మోపిదేవి గుడిలో నిద్రచేసి, సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నాము. రెండు రోజుల తరువాత నేను తిరిగి ఇంటికి బయలుదేరినప్పుడు మావారు నన్ను బస్సు ఎక్కించడానికి బస్‌స్టేషన్‌కి వచ్చారు. ఇద్దరం చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో మావారు వర్క్ చేస్తున్న చోటునుండి ఒక వర్కర్ మావారికి ఫోన్ చేసి, “సార్, అర్జంటుగా రండి, సత్యనారాయణగారి (వర్కర్) పైన పైపు పడిపోయింది” అని చెప్పారు. దాంతో మావారు నన్ను బస్సు ఎక్కించకుండానే కంగారుగా వెళ్ళిపోయారు. తర్వాత కాసేపటికి నేను మా ఊరికి వెళ్ళే బస్సు ఎక్కేశాను. కానీ మావారి కంగారు గుర్తొచ్చి నాకు చాలా భయమేసింది. ఒక గంటసేపటి తర్వాత మావారు నాకు ఫోన్ చేసి, “బస్ ఎక్కావా?” అని అడిగారు. నేను బస్సెక్కానని చెప్పి, “ఏమైంది, అంత కంగారుగా వెళ్ళిపోయారు?” అని అడిగాను. మావారు, “ఏడెనిమిది కేజీల ప్లేటొకటి 40, 50 అడుగుల ఎత్తు నుండి క్రిందనున్న సత్యనారాయణ అనే వర్కర్ భుజం మీద పడిపోయింది. తనను డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నాను” అన్నారు. “ఆయనకు సీరియస్‌గా ఉందా?” అని అడిగితే, “తల, నరాలు, భుజం నరాలు లాగుతున్నాయట, కళ్ళు తిరుగుతున్నాయట” అన్నారు. నాకు కూడా ఆందోళనగా అనిపించి మనసులోనే బాబాకు నమస్కరించుకుని, “ఇలా జరిగిందేమిటి బాబా? సత్యనారాయణగారికి ఏమీ అవకుండా, రిపోర్టు నార్మల్‌గా వచ్చేలా చూడండి బాబా. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. మధ్యాహ్నం 3 గంటలకి డాక్టర్ సీటీ స్కాన్ చేయించమన్నారు. రెండు గంటల తర్వాత రిపోర్టు వచ్చింది. రిపోర్టును పరిశీలించిన డాక్టర్, “రిపోర్టు నార్మల్‌గా ఉంది, క్లాట్స్ ఏమీ లేవు” అని చెప్పి, నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చారు. రిపోర్ట్ నార్మల్‌గా ఉందని డాక్టర్ చెప్పినప్పటికీ సత్యనారాయణగారు మాత్రం, “నా తలలో రక్తం గడ్డకట్టేసి ఉంటుంద”ని గోల చేయసాగారు. డాక్టర్ ఆయనతో, “అంతా నార్మల్‌గా ఉంది. మీరు డ్రింక్ చేయడం మాని, ఈ మందులు వాడండి. రెండు రోజుల తర్వాత మళ్ళీ చూద్దాము” అన్నారు. అయినప్పటికీ సత్యనారాయణగారికి అనుమానం తీరక రెండు రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ కూడా డాక్టర్ అంతా నార్మల్ గానే ఉందని చెప్పారు. బాబా దయలేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి మావారికి ఎంతో మాట వచ్చేది. “మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడి ఎవరితోనూ మాటపడకుండా రక్షించారు దేవా. సత్యనారాయణగారు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. మీకు శతకోటి ప్రణామాలు దేవా. అలాగే, మావారికి ఆయన చేసే పనులలో తోడుగా ఉండండి బాబా. మేము ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేలా, మా అప్పులు త్వరగా తీరేలా అనుగ్రహించండి బాబా!”
రెండవ అనుభవం: ఒకసారి మా బంధువుల పెళ్ళి నుండి వచ్చాక మా అమ్మగారు జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులు, ముఖ్యంగా కాళ్ళు లాగడం, మోకాలినొప్పులతో రెండు రోజులు చాలా బాధపడ్డారు. అంతేకాక, తనకు వాసన కూడా తెలియలేదు. ఈ రోజుల్లో ఉన్న భయం కారణంగా నేను బాబాకి నమస్కరించుకుని, “బాబా! అమ్మకి కరోనా రాకుండా చూడండి దేవా. ఇంకా నాన్నగారు హార్ట్ పేషెంట్. ఇద్దరినీ రక్షించండి దేవా. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. తర్వాత 4 రోజులకి మా అమ్మగారికి ఆరోగ్యం చేకూరింది. “బాబా! ఈ వయసులో నేను అమ్మానాన్నల దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలి. కానీ నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. నన్ను, మా అమ్మానాన్నలని తొందరగా కలపండి దేవా. ఎప్పటిలాగే నేను మా అమ్మానాన్నలతో సంతోషంగా ఉండేలా చేయండి దేవా. నాన్నగారు హార్ట్ పేషెంట్, ఆయన గురించి నాకు పీడకలలు వస్తున్నాయి దేవా. మా నాన్నగారు ఎప్పుడూ ‘సాయీ, సాయీ’ అని మీ నామమే జపిస్తారు. ‘అంతా సాయిబాబానే చూసుకుంటారు’ అంటూ ఉంటారు. అలాగే, మీరు మా కుటుంబం పైన దయచూపండి దేవా. మా అమ్మానాన్నలకి తోడు ఉండండి దేవా. మీ చల్లని చూపు వారిపై ఉంచి, ఏ ప్రమాదమూ జరగకుండా వారికి ఆరోగ్యాన్ని చేకూర్చండి దేవా. ఇంకా నాకు పీడకలలు రాకుండా చూడండి దేవా!”
3వ అనుభవం: కొంతకాలం క్రితం నేను నా పన్నుకి టెంపరరీ సిమెంట్ పెట్టించుకున్నాను. అది సుమారు 2, 3 సంవత్సరాల తర్వాత ఊడిపోయింది. తరువాత మావారికి, నాకు ఉన్న అశ్రద్ధ కారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్ళటం సుమారు 6 నెలల పాటు వాయిదా వేశాము. ఎప్పుడు వెళదామన్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేవాళ్ళం. తీరా ఒకసారి పట్టుబట్టి వెళితే, డాక్టరు ‘కరోనా సమయం కారణంగా teeth filling చేయట్లేదు’ అని చెప్పి, మళ్ళీ కొన్నిరోజుల తర్వాత రమ్మని చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. తర్వాత రోజురోజుకీ నా పన్నుకి ఉన్న రంధ్రం పెద్దది కాసాగింది. అప్పుడప్పుడు దంతం క్రిందనున్న దవడ కొద్దికొద్దిగా లాగుతున్నట్లు అనిపించసాగింది. దాంతో నా పన్ను పుచ్చిపోయి వుంటుందని అనుమానం వచ్చి, ‘ఈ సమస్యకి రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చేయాల్సి వస్తుందని డాక్టర్‌గారు చెప్తారేమో’ అని భయం వేసేది. దాంతో నేను బాబాకు నమస్కరించుకుని, “రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ అవసరం లేకుండా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను దేవా” అని మ్రొక్కుకున్నాను. తర్వాత కొద్దిరోజులకి డాక్టర్‌గారు ఫిల్లింగ్ చేస్తున్నారని తెలియడంతో వారికి ఫోన్ చేసి వెళ్ళాము. డాక్టర్‌గారు పరీక్షించి, “పన్ను నొప్పిగా ఉందా?” అని అడిగారు. “అప్పుడప్పుడు లాగుతూ ఉంది” అన్నాను. “పన్ను బాగానే ఉంది, పర్మినెంట్ ఫిల్లింగ్ పెట్టేస్తే సరిపోతుంది” అన్నారు డాక్టర్‌గారు. మళ్లీ అంతలోనే, “పన్ను కొద్దిగా ఊగుతోంది. నీకు నిజంగా నొప్పి లేదా? ఉంటే ఇప్పుడే చెప్పు. లేకపోతే తర్వాత చీము పట్టి ఇంకా పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది” అన్నారు. “అప్పుడప్పుడు 10-20 శాతం లాగుతోంది డాక్టర్” అని అన్నాను. “అయితే సరే, పర్మినెంట్ ఫిల్లింగ్ పెట్టేస్తాను” అన్నారు డాక్టర్‌గారు. నిజానికి డాక్టర్‌గారు రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుందని చెప్తారేమోనని భయపడ్డాను కానీ, “అదేం అవసరం లేదు, పర్మినెంట్ ఫిల్లింగ్ పెట్టేస్తాను” అని చెప్పడంతో బాబా కరుణకి ఎంతో ఆనందించాను. తరువాత నా పన్నుకి పర్మినెంట్ ఫిల్లింగ్ పెట్టేశారు డాక్టర్‌గారు. మెటల్ పెడుతున్నంతసేపు నేను ‘ఓం సాయి రక్షక్ శరణం దేవా’ అని జపిస్తూనే ఉన్నాను. (నిజానికి నేను ముందు టెంపరరీ ఫిల్లింగ్ పెట్టించుకుని, తర్వాత నెల రోజులు పోయాక పర్మినెంట్ ఫిల్లింగ్ పెట్టించుకుందామనుకున్నాను.) బాబా దయవల్ల ఆ తరువాత నాకు ఏ సమస్యా రాలేదు. “ధన్యవాదాలు దేవా! రూట్‌కెనాల్ చేయాల్సిన అవసరం లేకుండా నన్ను రక్షించారు. శతకోటి ప్రణామాలు దేవా!”
4వ అనుభవం: మా అక్కావాళ్ళ బాబుకి 11వ నెల వచ్చేముందు ‘తిరుపతిలో పుట్టువెంట్రుకలు తీయించాల’ని మా అమ్మగారు మ్రొక్కుకున్నారు. కానీ కరోనా కారణంగా తిరుపతి వెళ్ళలేకపోయాము. తరువాత తిరుపతితో సమానమైన ‘ద్వారకాతిరుమల’కి వెళదామనుకున్నాము. ప్రయాణం పెట్టుకున్న ముందురోజు మా అక్కకి నెలసరి వచ్చింది. దాంతో మేము నిరాశపడి ప్రయాణం వాయిదా వేసుకున్నాము. తర్వాత అప్పనపల్లి అయినా వెళదామని మా అమ్మగారు అనుకున్నారు. ఎందుకంటే, మా అక్క పుట్టువెంట్రుకలు అక్కడే తీయించారట మా అమ్మగారు. కానీ, అలా అనుకున్న తర్వాత బాబుకి నీళ్ళ విరేచనాలు మొదలయ్యాయి. 4, 5 రోజుల వరకు తగ్గలేదు. నాకు ఇంక భయమేసి, “బాబా! మా అక్కావాళ్ళ బాబుకి నీళ్ళ విరేచనాలు తగ్గి మ్రొక్కు తీర్చుకునే అవకాశం ఇవ్వండి దేవా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. అంతే! వారంరోజులకల్లా బాబు ఆరోగ్యం కుదుటపడేలా చేసి, అప్పనపల్లిలో పుట్టువెంట్రుకలు తీయించే అవకాశం ఇచ్చారు నా బాబా. “బాబుకి ‘కంగన్ సాయి అభిరామ్ కార్తికేయ’ అని మీ పేరు కలిసివచ్చేలా పేరు పెట్టుకున్నారు బాబా. ఆ బాబుకి అనుక్షణం తోడుండి రక్షించండి దేవా. 10 సంవత్సరాల పైన కాంట్రాక్ట్ ఉద్యోగం చేశాక క్రొత్తగా పర్మినెంట్ ఉద్యోగులు వచ్చారని మా అక్కని ఉద్యోగం నుండి తొలగించారు బాబా. మా అక్కకి మంచి ప్రభుత్వోద్యోగం ప్రసాదించండి దేవా”.
5వ అనుభవం: 2017లో నేను పిహెచ్‌డి లో జాయినయ్యాను. అప్పటినుండి నాకు ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ చేయాలో, ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలియక ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండునని ఎన్నో కాలేజీలకి వెళ్ళి ఎంతోమంది సార్‌లని, మేడమ్‌లని కలిశాను. తర్వాత కరోనా కారణంగా నా ప్రయత్నం ఆగిపోవటంతో, ‘ఇక నా పిహెచ్‌డి ముందుకు వెళ్ళదు’ అని బాధపడేదాన్ని. తర్వాత ఒక కాలేజీని సంప్రదిస్తే అక్కడి ప్రొఫెసర్లు గైడెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ నాకు వాళ్ళపై నమ్మకం లేదు. తర్వాత కొన్నిరోజులకి మా మేడమ్ ఫోన్ చేసి, “నీకు ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఊరుకున్నాను. చేస్తే నా దగ్గర పిహెచ్‌డి చెయ్యి, లేకపోతే డ్రాప్ అయ్యి మొత్తానికి మానెయ్యి” అన్నారు. నాకు మా మేడమ్ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడం భయం. కానీ, ఇంకెవరైనా నాకు పిహెచ్‌డి చేయడంలో సహాయం చేస్తారో లేదోననీ, నాకు తెలియనివి చెప్తారో లేదోననీ, నన్ను చూసి నవ్వుతారేమోననీ భయం. కానీ మా మేడమ్ అలా అనేసరికి నేను బాబా దగ్గర కూర్చుని, “నన్ను ఏమి చేయమంటారు బాబా? ఇక నా చదువు ముందుకు సాగదేమోనని భయమేస్తోంది. నా పిహెచ్‌డి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళేలా నాకు సహాయం చేయండి బాబా” అంటూ కన్నీళ్ళతో బాబాను ఎంతగానో వేడుకున్నాను. ఆ తర్వాత, ‘చావో రేవో, కష్టమో నష్టమో, మేడమ్ దగ్గరే పిహెచ్‌డి చేయాల’ని మనసులోనే నిర్ణయించుకున్నాను. అంతలోనే మళ్ళీ సంకోచించి బాబాను అడిగితే, బాబా కూడా “మేడమ్ దగ్గరే పిహెచ్‌డి చెయ్యి” అని సమాధానమిచ్చారు. దాంతో ఇక ధైర్యంగా మేడమ్ దగ్గరే పిహెచ్‌డి చేద్దామని నిశ్చయించుకుని మా మేడమ్‌కి కాల్ చేసి, ‘నేను మీ దగ్గరకి వస్తాను మేడమ్’ అని చెప్పాను. మేడమ్ అంగీకరించి, “మీటింగులో ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ట్రీట్‌మెంట్ షెడ్యూల్ పంపించు” అన్నారు. ఇంతకుముందు చాలాసార్లు షెడ్యూల్స్ మేడమ్‌కి పంపించాను. కానీ ఆవిడ వేటినీ ఓకే చేయలేదు. ఇంక నేను నిరుత్సాహపడి చివరిగా ఒక షెడ్యూల్‌ని మేడమ్‌కి పంపించి, “బాబా! ఇది కనుక మేడమ్ ఓకే చేస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యం! 10 నిమిషాలలోపే మేడమ్ నాకు ఫోన్ చేసి, నేను పంపిన షెడ్యూల్ ఓకే చేశారు. నేను ప్రతిసారీ బ్లాగులో పంచుకుంటానని మ్రొక్కుకోగానే అన్ని పనులు, కోరికలు తీరుతున్నాయి. బాబాకు మ్రొక్కుకునేముందు, ‘బాబా చాలా కోరికలు తీర్చారు. కానీ ఇది తీరుస్తారో, లేదో?’ అని నేను సందేహపడుతున్నప్పటికీ, నా బాబా మాత్రం ఇలా మ్రొక్కుకోగానే అలా నా కోరికను తీరుస్తున్నారు. నాలాంటివారికి ఈ బ్లాగ్ కల్పవృక్షం వలె ఉన్నది. మాకు ఈ అవకాశం కల్పిస్తున్నందుకు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యావాదాలు. “బాబా! మీ ప్రేరణ వల్ల నేను మా మేడమ్ దగ్గరే ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి నిశ్చయించుకుని వెళ్ళబోతున్నాను. నిజానికి ప్రాజెక్ట్ వర్కుకి సరిపడా డబ్బులు కూడా నా దగ్గర లేవు బాబా. మీరే నాకు సహాయం చేసి, నా ప్రాజెక్ట్ వర్క్ ఏ ఇబ్బందీ లేకుండా విజయవంతంగా పూర్తిచేయించి, నాకు పిహెచ్‌డి డిగ్రీని ప్రసాదించండి బాబా”.
“నా భర్తకి ఉన్న వ్యసనాలు పోయి మేము అన్యోన్యంగా ఉండేలా చూడండి ప్రభూ. నాకు ప్రభుత్వోద్యోగాన్ని ప్రసాదించి మా ఆర్థిక ఇబ్బందులను తొలగించండి బాబా. మాకు మగబిడ్డని ప్రసాదించి నా కష్టాలన్నీ గట్టెక్కేలా చూడండి దేవా. జెఎన్‌టియు యూనివర్సిటీ ఇంటర్వ్యూకి వెళుతున్నాను బాబా. మీకు ఇష్టముంటే, మీరు రాసిన నా జీవిత ప్రణాళికలో ఉంటే నాకు ఆ ఉద్యోగాన్ని ప్రసాదించండి బాబా. మీరు ఉద్యోగం ప్రసాదిస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను బాబా. నన్ను నిరాశపరచవద్దు బాబా. 34 సంవత్సరాలు దాటినా అటు సంతానం లేకుండా, ఇటు ఉద్యోగం లేకుండా, ఎందులోనూ స్థిరత్వం లేకుండా కాలం గడుపుతున్నాను దేవా. దయచేసి నన్ను, మావారిని జీవితంలో స్థిరపరచండి దేవా. అమ్మానాన్నలకి తోడుగా ఉండి అనుక్షణం రక్షించండి దేవా. నన్ను, మా అమ్మానాన్నలను తొందరగా కలపండి దేవా. మీ పాదాల వద్ద దాసిలా పరుండే అవకాశాన్ని నాకు కల్పించండి దేవా. ఓం సాయి రక్షక్ శరణం దేవా!”. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః!!!
6వ అనుభవం: “మమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే మిమ్మల్ని, మీ లీలలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు తండ్రీ!”. మాకు ఇంటి ముందర రెండు షాపులున్నాయి. అందులో మొదటి షాపులోకి అద్దెకి ఎవరు వచ్చినా 6 నుంచి 8 నెలల్లోపు ఖాళీ చేసేస్తున్నారు. దానివల్ల షాపు మంచిది కాదని పేరు వస్తుందేమో అని మా అమ్మ చాలా బాధపడేది. ఆ షాపులోకి ఎవరు వచ్చినా, మొదటి నెల అద్దెను మా అమ్మ శిరిడీ సంస్థానానికి మనియార్డరు చేసేది. ‘అయినా ఇలా ఎందుకు జరుగుతోంది బాబా?’ అని బాధపడేవాళ్ళం. అంతవరకు అద్దెకున్న అతను షాపు ఖాళీ చేశాక దాదాపు ఒక నెలరోజుల పాటు తమకు షాపు అద్దెకి కావాలని ఎవ్వరూ మా అమ్మావాళ్ళని సంప్రదించలేదు. దీనికన్నా ముందు జరిగిన సంఘటన.. షాపులోకి ఎవరూ అద్దెకి రావటం లేదని మా అమ్మ ఒక గురువారంనాడు చాలా బాధపడింది. నేను మా అమ్మ బాధను చూడలేక, “బాబా! వచ్చే గురువారానికల్లా ఎవరో ఒకరు షాపులోకి అద్దెకి వచ్చేలా చూడు తండ్రీ” అని మొరపెట్టుకున్నాను. అనుకున్నవిధంగానే మరుసటి గురువారానికల్లా సమోసాలు అమ్ముకునే రాజస్థానీవాళ్ళు షాపుకోసం మా అమ్మావాళ్ళని సంప్రదించడం, వారంరోజులకి అడ్వాన్సు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి. వ్యాపారం ప్రారంభించాక సమోసాలు కూడా బాగా అమ్ముడయ్యి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కొద్దిరోజులకి, “రోజూ వేరొక ఊరినుండి రావటం కష్టంగా ఉంది, మీ ఇంటిపైన ఉన్న పెంట్‌హౌస్ కూడా అద్దెకి కావాలి” అని అంటే వాళ్ళ బాధ చూసి పెంట్‌హౌస్ కూడా అద్దెకి ఇచ్చాము. కానీ ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి 10, 15 రోజుల తరువాత వాళ్ళు కూడా, “మేము షాపు ఖాళీ చేసేస్తాము, నెల అద్దె తీసుకోండి” అన్నారు. దాంతో మా అమ్మ, ‘ఈ దెబ్బకి ఆ షాపు మంచిది కాదని పేరు వస్తుంది’ అని చాలా బాధపడింది. నేను కూడా, “ఈ విధంగా జరిగిందేమిటి బాబా? 15 రోజులకే ఖాళీచేసేవాళ్ళని మాకు ఎందుకు చూపించావు బాబా?” అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నెలరోజుల వరకూ ఎవ్వరూ ఆ షాపు అద్దెకి కావాలని రాలేదు. ఈ విషయంలో నేనెంతో బాధపడుతూ, “బాబా! మీకు మనసు లేదు. ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నారు? మాకు తెలిసి మేము అందరికీ మంచే చేశాముగానీ ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎందుకు మాకు ఇన్ని కష్టాలు? ఏదీ కలిసిరావడం లేదు. ప్రతి మనిషికీ ఒక గోల్టెన్ పీరియడ్ ఉంటుంది కదా బాబా. మాకు లేదా బాబా? మా నాన్నగారి మంచితనం అందరికీ అలుసుగా ఉంది బాబా. కనీసం ఎవరూ అద్దెకి రాకపోయినా, షాపుకి తగిలించిన టు-లెట్ బోర్టులోని మా ఫోన్ నెంబరుకి కూడా ఎవరూ కాల్ చేసి ‘అద్దె ఎంత అసలు?’ అని కూడా అడగడం లేదు. ఏంటి బాబా? అసలు మీరు ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? మీకు మేము కనిపించమా? మా బాధ మీకు అర్థం కావడం లేదా బాబా? అందరినీ చల్లగా చూసే మీరు మమ్మల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు?” అని బాబాను అనేక మాటలు అనేదాన్ని. ఆ తరువాత ‘షాపులోకి ఎవరినైనా అద్దెకి వచ్చేలా చూడమ’ని బాబాను ప్రార్థించి, ‘మీ దయవల్ల షాపులోకి ఎవరైనా అద్దెకి వస్తే బ్లాగులో పంచుకుంటాన’ని బాబాకు మ్రొక్కుకున్నాను. ఇలా నెలరోజులు గడిచాక మా ఊరిలోనే ఒకతను, “క్లినిక్ పెట్టుకుంటాను, మీ షాపుని అద్దెకి ఇవ్వండి” అని మా నాన్నగారిని అడిగితే, వాళ్ళ నాన్నగారితో ఉన్న స్నేహం కారణంగా మా నాన్నగారు వెంటనే అద్దె, అడ్వాన్సు చెప్పి ఫిక్స్ చేసుకోకుండానే అతనికి షాపు అద్దెకి ఇవ్వడానికి అంగీకరించారు. 2 రోజుల తర్వాత అతను వచ్చి, షాపంతా రీమోడల్ చేసుకుని, బంధువులందరినీ పిలిచి చాలా ఆనందంగా షాపులో అద్దెకి దిగారు. ఇది జరిగిన తర్వాత మా రెండవ షాపులో ఉన్న అతను మాతో, “షాపుని క్లినిక్ కోసం అద్దెకిచ్చారా? చాలామంది కిరాణా షాపుకోసం, జెరాక్స్ షాపుకోసం నన్ను అడిగారండీ, మీ ఫోన్ నెంబరుకి కాల్ చేయమని చెప్పాను” అని చెప్పాడు. “మరి, ఫలానావాళ్ళు అడుగుతున్నారని మాకు ముందే ఎందుకు చెప్పలేదు?” అని ప్రశ్నిస్తే, ‘మర్చిపోయానండీ’ అని చాలా తేలికగా చెప్పాడు. “అంటే, మా బాధ మీరు విన్నారు బాబా. కానీ ఇతను చెప్పకపోవడం వల్ల మిమ్మల్ని నానా మాటలు అని విసిగించి బాధపెట్టాను, నన్ను క్షమించండి బాబా. ఏమిటి బాబా మీ లీల! మ్రొక్కుకున్నట్లుగానే అన్నీ బ్లాగులో పంచుకున్నాను దేవా. కానీ పంచుకోవడంలో చాలా ఆలస్యం చేశాను, నన్ను క్షమించండి బాబా. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నా బద్ధకాన్ని పోగొట్టి ఎప్పటి పని అప్పుడే చేసేలా నన్ను దీవించండి బాబా. నా జీవితం ఎటుపోతుందో తెలియటంలేదు. దయచేసి నన్ను, మావారిని జీవితంలో స్థిరపరచండి దేవా. ఇప్పటివరకు నేను ఏడ్చి, మిమ్మల్ని విసిగించి, బాధపెట్టి, నానా మాటలు అని నేను కోరుకున్నవన్నీ సాధించుకున్నాను బాబా. కానీ, సాధించినవాటితో నాకు ఆనందం, తృప్తి లేవు బాబా. అందుకే ఇక నా జీవితాన్ని మీకు అర్పిస్తున్నాను బాబా. మీకు ఇష్టమైనదీ, మీ ప్రణాళిక ఏదైతే అదే చేయండి బాబా. నా ఇష్టంతో పనివద్దు బాబా. నాకు మానసిక ప్రశాంతత కల్పించండి బాబా. తెలిసీ తెలియక ఏమైనా తప్పులు చేస్తే నన్ను మన్నించండి దేవా”.
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి!!!
Om sai ram 🙏
ReplyDeleteOm Sai Ram. Sai meetho unnaru, mee samasyalanni twaraga theeraalani korukuntunnanu.
ReplyDeleteSai ram
DeleteThank you andi
Omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete