సాయి వచనం:-
'నీ ప్రారబ్ధంలో నీకు సంతానమెక్కడిది? నా దేహాన్ని చీల్చి నీకు కుమారుణ్ణి ప్రసాదించాను.'

'సాయిపథం అంటే - శ్రీసాయిబాబా చూపిన మార్గం, బాబా నడిచిన బాట, 'సాయి' అనే గమ్యానికి రహదారి. ఏ ఒక్క మతసాంప్రదాయానికీ చెందక, ప్రపంచంలోని అందరు మహాత్ములు ఆచరించి బోధించిన విశ్వజనీన ఆధ్యాత్మిక సాంప్రదాయమే ఈ సాయిమార్గం. మరో మాటలో, సాయిపథం అంటే సద్గురు పథం' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1129వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగినంతనే 100% మార్కులను అనుగ్రహించి నమ్మకాన్ని పెంచిన బాబా
2. అంతా బాబా దయ
3. బాబా దయతో ఆరోగ్యం

అడిగినంతనే 100% మార్కులను అనుగ్రహించి నమ్మకాన్ని పెంచిన బాబా

శ్రీసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
 ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సాయి మహరాజుకు నా అనంతకోటి వందనాలు. ఈ బ్లాగు కుటుంబసభ్యులందరికీ నా నమస్కారాలు. నేనొక చిన్న సాయిభక్తురాలిని. నాకు చిన్నప్పటినుండి సాయితండ్రితో అనుబంధం ఉంది. అది ఎలా మొదలైందో నాకే తెలియదు. కానీ, బడికి వెళ్లే రోజుల నుండి నేను సాయిలీలామృతం గ్రంథపారాయణ చేస్తూ గురువారాలు ఉపవాసం చేసేదాన్ని. నాకు గుర్తున్నంతవరకూ చిన్నవయస్సులో ఎప్పుడూ పూజ చెయ్యటంకానీ, గుడికి వెళ్ళటంకానీ చేయలేదు. అయినా ఆ కరుణామయుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నన్ను కాపాడుతూ, నడిపిస్తూ వస్తున్నారు. నా చదువు, ఉద్యోగం మరియు పెళ్ళి ఇలా అన్నిటిలోనూ ఆయన దయ ఎప్పుడూ నాకు కనబడుతూనే ఉండేది. అయినా నేను ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞత తెలుపలేదు. ఎలా అయితే నాన్న నాకోసం ఏమన్నా చేస్తే/తెస్తే ('taken for granted'గా) తీసుకుంటానో అలా తీసుకునేదాన్ని అన్నమాట. అందుకు నన్ను క్షమించమని నా సాయితండ్రిని వేడుకుంటూ, ఆలస్యంగా అయినా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పెళ్ళైన తరువాత నేను మావారితోగానీ, నా స్నేహితురాలితోగానీ అప్పుడప్పుడు బాబా గుడికి వెళ్లేదాన్ని. నా తండ్రి అనుగ్రహం వల్ల మూడుసార్లు శిరిడీ కూడా దర్శించుకున్నాను. మొదటిసారి శిరిడీ వెళ్ళినప్పుడు నేను గురువారం ఉపవాసం ఉండటం మానేశాను. "మళ్ళీ త్వరలోనే శిరిడీ దర్శించుకునే భాగ్యం నాకు ప్రసాదించు తండ్రీ". ఇకపోతే, ఈమధ్యనే మూడు నెలల క్రితం (2021 చివరిలో) నా స్నేహితురాలు నాకు ఈ బ్లాగును పరిచయం చేసింది. అప్పటినుండి రోజూ రాత్రి పడుకోబోయే ముందు సాయిభక్తుల అనుభవాలు చదివి పడుకోవటం నాకు అలవాటైంది. అనుకోకుండా ఇవాళ (2022, మార్చి 12) నేను కూడా నా అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను.

మా అబ్బాయి బాగా కష్టపడి చదువుతాడు. కానీ లెక్కల పరీక్ష సమయానికి బాగా టెన్షన్ పడి చదివినవేవీ గుర్తురాక పరీక్ష సరిగా వ్రాయలేక చాలా బాధపడుతుంటాడు. అలాగే ఒకరోజు తను పరీక్షకి బాగా చదివినప్పటికీ భయపడుతుంటే నేను నా సాయితండ్రికి నమస్కరించుకుని, "బాబా! ఈరోజు పరీక్షలో మా బాబుకి 90% మార్కులొచ్చేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. నా తండ్రి అద్భుతం చేశారు. మా అబ్బాయికి ఆ పరీక్షలో 100% మార్కులు వచ్చాయి. దాంతో మా బాబుకి తనపై తనకి నమ్మకం కలిగింది. "మీకు అనంతకోటి కృతజ్ఞతలు తండ్రీ. మా పిల్లలకి ఎప్పుడూ తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపించండి తండ్రీ. ఎల్లప్పుడూ మాతోనూ, మా పిల్లలతోనూ ఉండి అడుగడుగునా చేయూతనిచ్చి ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక పురోగతి ప్రసాదించండి తండ్రీ. మీ ఉనికి భక్తులందరికీ ఎల్లప్పుడూ అనుభవమవుతూ ఉండేలా అనుగ్రహించండి తండ్రీ".

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!

అంతా బాబా దయ

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మా ఇంటి దైవం శ్రీమల్లన్నస్వామికి, శ్రీసాయినాథునికి నమస్కరిస్తూ బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మేము ఈ సంవత్సరం(2022) మా ఇంటిదగ్గర శ్రీమల్లన్నస్వామివారి పట్నాల పండుగ, కళ్యాణం జరిపించాలని నిశ్చయించుకున్నాము. మాకు అది చాలా పెద్ద పండుగ. ఇంతకుముందు 2012లో ఈ పండుగను జరుపుకున్నాము. "బాబా! మల్లన్న పట్నాల పండుగ ఎలాంటి ఇబ్బందీ లేకుండా అంతా మంచిగా జరిగేలా దయచూపండి" అని నేను బాబాను వేడుకున్నాను. పండుగలో భాగంగా మొదటిరోజు పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేసి, అఖండజ్యోతి వెలిగించి, రాత్రి సమయంలో పుట్టబంగారం(పుట్టమట్టి) తీసుకురావడం వంటివి ఉంటాయి. అయితే, ఆరోజు గాలి చాలా విపరీతంగా వీస్తుండటం వలన అఖండజ్యోతికి ఆటంకం కలుగుతుందేమోనని చాలా భయమేసింది. అప్పుడు నేను, "ఈ గాలి తీవ్రత తగ్గుముఖమయ్యేలా చేయండి బాబా" అని బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యంగా, కొద్దిసేపటి తరువాత గాలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాత్రి పుట్టబంగారం తేవడానికి బయలుదేరే సమయానికి గాలి నెమ్మదిగా వీస్తోంది. పుట్ట దగ్గరికి వెళ్లి చూస్తే, పుట్టలో అఖండజ్యోతి యథాప్రకారం వెలుగుతూ ఉంది. మేము అఖండజ్యోతిని, పుట్టబంగారాన్ని ఇంటికి తీసుకుని వచ్చాము. తరువాత చెరువు దగ్గరికి వెళ్లాము. మల్లన్నస్వామికి గంగాస్నానం ఒగ్గు పూజారుల సాధనా విన్యాసాలతో చాలా బాగా జరిగింది. మరుసటిరోజు 2022, ఫిబ్రవరి 27, ఆదివారంనాడు ఒగ్గు పూజారుల మల్లన్న ఒగ్గుకథ, మల్లన్నస్వామి పట్నాలతో, శ్రీశ్రీశ్రీ మల్లన్నస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బాబా దయవలన ఏ ఇబ్బందులూ లేకుండా మేము ఊహించినదానికంటే గొప్పగా మల్లన్నస్వామి కళ్యాణం జరిగింది. అంతా బాబా దయ.

ఒకసారి నేను కొత్తగా కొన్న మొబైల్ ఫోన్ కొన్నిరోజుల తరువాత ఛార్జింగ్ 90 శాతం ఉన్నప్పటికీ, ఉన్నట్టుండి దానంతటదే స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా, మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఉంచినా కానీ మొబైల్ ఆన్ కాలేదు. అప్పుడు నేను, "బాబా! మొబైల్ ఆన్ అవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. అలా బాబాకి చెప్పుకున్న కొద్దిసేపట్లోనే మొబైల్ ఆన్ అయింది. "ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

బాబా దయతో ఆరోగ్యం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అంజలి. ఈమధ్య మా తమ్ముడు ప్రసాద్ భార్య భవాని అనారోగ్యం పాలైంది. ఎందువల్ల అలా అయిందో అర్థం కాలేదు. వాళ్లకి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. పాపం మా తమ్ముడు చాలా బాధపడుతుండేవాడు. నేను భవాని కోసం రెండుసార్లు సంకల్ప ప్రార్థన చేయించాను. ఇంకా, "తనకి పూర్తిగా తగ్గి, తొందరగా కోలుకోవాల"ని రోజూ బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. బాబా దయవల్ల కొన్నిరోజులకి భవాని ఆరోగ్యం బాగై నార్మల్ అయింది. తమ్ముడు కూడా టెన్షన్ ఫ్రీ అయ్యాడు. "బాబా! మీ దయ తమ్ముడు ప్రసాద్ మీద, అలాగే అతని కుటుంబంపై, ఇంకా మా అందరిమీదా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా. మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాం బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sai Ram 🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  5. Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house construction complete chaindi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo