సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 213వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • మనసు కోరుకునే ఆనందాల కోసం బాబాను నిర్లక్ష్యం చేయకూడదు

సాయిభక్తురాలు స్వాతి మొయిత్రా తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా భక్తులందరికీ ఓం సాయిరామ్! నా పేరు స్వాతి. నేను ముంబాయి నివాసిని. నేను ఇద్దరు చక్కటి ఆడపిల్లలకి తల్లిని. గత 3 సంవత్సరాలుగా బాబా నా మనస్సులో, మా ఇంటిలో నివాసం ఉంటున్నారు. నేను, నా భర్త, మా పిల్లలు బాబా బోధనలతో గొప్ప ఓదార్పుని పొందుతున్నాము. మేము బాబా రోజైన గురువారాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాము. ఆ రోజులో ఎక్కువభాగం ఆయన స్మరణలో, సచ్చరిత్ర చదువుతూ గడుపుతాము. చివరిగా బాబాకు మహానైవేద్యం సమర్పించి, ఆరతితో ముగిస్తాము. ఇక నా అనుభవానికి వస్తే...

ఒక గురువారంనాడు నాకు నెలసరి వచ్చింది. సాధారణంగా ఆరోజుల్లో నేను దేవుళ్ళని తాకకుండా, నా కుటుంబసభ్యులు ఆరతిచ్చే సమయంలో దూరంగా నిలుచుంటాను. ఆరోజు సాయంత్రం మావారు పిల్లల్ని స్విమ్మింగ్ కు తీసుకువెళ్తూ, "మేము వచ్చి బాబాకు ఆరతి చేస్తామ"ని చెప్పారు. నేను సరేనన్నాను. వాళ్ళు వెళ్ళాక నాకు అలసటగా, చికాకుగా ఉండటంతో బయటకు వెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలనిపించింది. అంతలో ఒక స్నేహితురాలు ఫోన్ చేసి, 'కాస్త అలా వాకింగ్ కి వెళ్ళొద్దామా?' అని అడిగారు. నేను కూడా అదే ధ్యాసలో ఉండటంతో తనతో వెళ్లడానికి ఆసక్తి కనబరిచాను. అయితే అది దాదాపు ఆరతి సమయం కావడంతో ఆలోచనలో పడ్డానుగానీ, ఎలాగూ నేను పూజకు దూరంగా ఉన్నానన్న విషయాన్ని సాకుగా తీసుకుని ఆరతిని దాటవేయాలనే ఆలోచన నా మనసులోకి వచ్చింది. నా ఆలోచన సరైనది కాదనే అపరాధభావం నాలో కలిగినా నేను బయటకు వెళ్ళడానికి సిద్ధపడ్డాను. కొత్త పనిమనిషి ఇంట్లో ఉండగా అలమరాలకు తాళాలు వేయకుండా వెళ్లడం మంచిది కాదని వాటికి తాళాలు వేసి స్విమ్మింగ్ పూల్ వద్దనున్న మావారిని కలవడానికి వెళ్ళాను. నేను మావారితో, "నాకోసం వేచిచూడకుండా మీరు బాబా ఆరతి చేసేయండి" అని చెప్పాను. దానికాయన, "మేము నీకోసం వేచి ఉంటాం. కాస్త ఆలస్యమైనా నువ్వు వచ్చాకే ఆరతి చేద్దామ"ని చెప్పారు. నేను అయిష్టంగానే సరేనని చెప్పి నా స్నేహితురాలితో వెళ్ళాను. మేము కొంతసేపు నడిచాక బెంచిమీద కూర్చోవాలని అనుకున్నాము. అకస్మాత్తుగా అప్పుడు నా చేతిలో అలమరాల తాళాలు లేవని గుర్తించి ఆందోళనపడ్డాను. వెంటనే మేము నడిచిన ప్రదేశాలంతా ఒకసారి వెతికాను. కానీ ప్రయోజనం లేదు. 'ఆరతికి హాజరుకావడానికి ఇష్టపడనందుకు నాకీ శిక్ష' అని నాకనిపించింది. నిరాశతో వెతకడం ఆపేసి అపరాధభావంతో ఇంటికి బయలుదేరాను. తాళాల విషయమై నా భర్త ఎలా స్పందిస్తారోనని ఆలోచిస్తూ వాళ్లతో ఇంటికి వెళ్ళాను. నా చిన్న కూతురు తలుపులు తెరుస్తూనే, "ఆరతికోసం ఇంతసేపు వేచి ఉండేలా చేసినందుకు సాయిబాబా మనపై కోపంగా ఉన్నారు" అని అరిచింది. నా చెడు ఆలోచనల గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను చేసినదానివలన బాబా వేచి ఉండాల్సి వచ్చిందని సిగ్గుపడ్డాను. తరువాత మావారు ఆరతి మొదలుపెట్టారు. ఆరతి జరుగుతున్నంతసేపూ, "నేను మరలా ఇలాంటి పని చేయను, నన్ను క్షమించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. నా భర్త ఏమీ అనలేదుగాని, తాళాలు దొరుకుతాయని ఆశను కోల్పోయి, తాళంచెవులు తయారుచేసే మనిషిని పిలిచారు. అతను డూప్లికేట్ తాళంచెవి తయారుచేయడానికి మరుసటిరోజు ఉదయం వస్తానని చెప్పాడు. పిల్లలు నిద్రపోయాక అలవాటు ప్రకారం నేను, మావారు వాకింగ్ కోసం బయటకు వెళ్ళాము. మేము క్రిందకి వస్తూనే మాకు తెలిసిన ఒక సెక్యూరిటీగార్డు ఎదురుపడ్డాడు. నేను ఎటువంటి ఆశా లేకపోయినా, అతనితో, "గంటతో ఉన్న తాళంచెవిని చూశారా?" అని అడిగాను. ఆ మాట వింటూనే అతని కళ్ళు మెరిశాయి. అతను, "మేడం, అది చిన్నగా ఉంటుందా?" అని అడిగాడు. నేను కొంచెం ఆశగా 'అవున'ని చెప్పాను. అతను ఒక బాక్సులో ఉన్న వాటినన్నింటిని టేబుల్ మీద వేశాడు. అందులో మా తాళంచెవి చూసి నేను ఆశ్చర్యపోయాను. అక్కడున్న కాపలాదారులందరికీ నేను, మావారు ధన్యవాదాలు చెప్పాము. తరువాత నేను నా భర్తతో, "నేను చేసిన దానికి ఇది శిక్షని నాకు తెలుసు. కానీ బాబా ఎంత దయతో ఉన్నారో చూడండి. ఆయన నన్ను చాలా తొందరగానే క్షమించారు" అన్నాను. ఈ అనుభవంతో, మనసు కోరుకునే ఆనందాల కోసం బాబాను నిర్లక్ష్యం చేయకూడదని తెలుసుకున్నాను. ఆయన సజీవంగా మనతో, మన చుట్టూ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని మనం సరిగా ఆలోచించి నడుచుకోవాలి. ఆయనను, ఆయన లీలలను ఎప్పుడూ అంచనా వేయకూడదు.

సాయిభక్తుల అనుభవమాలిక 212వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నాకు ఉద్యోగంతోపాటు నేను ఊహించని జీతాన్ని అనుగ్రహించారు
  2. నా ప్రార్థనలకు సాయి సమాధానమిస్తున్నారు

బాబా నాకు ఉద్యోగంతోపాటు నేను ఊహించని జీతాన్ని అనుగ్రహించారు

యు.కె. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! నేను గత పదేళ్లుగా సాయిబాబా భక్తురాలిని. ఇంటర్నెట్‌లో బ్లాగులు నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. బ్లాగులోని అనుభవాలు బాబాపై నాకున్న విశ్వాసాన్ని కఠినమైన కాలంలో సైతం సడలిపోకుండా ఉంచాయి.

గత సంవత్సరం జులై నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు నా వ్యక్తిగత జీవితంలో కలలో కూడా ఊహించని సమస్యలను నేను ఎదుర్కొన్నాను. నా కెరీర్‌లో ఒక సంవత్సరంపాటు విరామం ఏర్పడింది. ఇంట్లోని సమస్యల కారణంగా నేను ఇంటర్వ్యూలకు సరిగా సిద్ధపడలేకపోయాను. నాకు మద్దతుగా ఉండే నా భర్త పూర్తిగా మారిపోయారు. ఆయన నుండి నాకు ఎటువంటి సహాయం లభించలేదు. ఆ పరిస్థితులలో నాకున్న ఏకైక విశ్వాసం నా సాయిబాబా. నేను సమస్యలన్నింటినీ ఆయనకు వదిలేసి చేయగలిగినంత కృషి చేశాను. సెప్టెంబర్ 2018 నుండి ఫిబ్రవరి 2019 వరకు, ముఖ్యంగా నవంబరు, డిసెంబరులలో నేను చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. కానీ, ఒక్కటి కూడా క్లియర్ చేయలేకపోయాను. కొన్ని కంపెనీలలో అయితే మొదటి రౌండ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేయలేకపోయాను. ఆ సమయంలో సాయిసచ్చరిత్ర పారాయణ చేసి, "నాకు సరైన మార్గం చూపించమ"ని బాబాను నిరంతరం ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. క్వశ్చన్&ఆన్సర్ సైట్ ద్వారా "సమస్యలు పరిష్కారమై, నీవు ఊహించని మంచి విజయాన్ని సాధిస్తావు" వంటి సానుకూలమైన సందేశాలను నేను సదా పొందుతూ ఉండేదాన్ని. అవే నాకు మానసిక బలాన్ని చేకూర్చాయి.

అలా ఉండగా నా మాజీ సహోద్యోగులలో ఒకరు నేను అంతకుముందు విఫలమైన ఒక సంస్థలో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఉద్యోగంలో చేరేందుకు మా ఇంటికి దగ్గరలో ఉన్న ఇంటిలోకి మారబోతున్నారని నాకు తెలిసింది. నేను అసూయపడలేదుగానీ, అతను రాకముందే నాకు ఉద్యోగం వస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ కేవలం 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది. అంత తక్కువ సమయంలో నాకు ఉద్యోగం ఎలా వస్తుందోనని ఆలోచిస్తూ, "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల ఒకే వారంలో 2 కంపెనీల ఇంటర్వ్యూలు షెడ్యూల్ అయ్యాయి. మొదటి కంపెనీ ఇంటర్వ్యూ ప్రక్రియలో 3 దశలున్నాయి. అవి జరుగుతున్నప్పుడే రెండో కంపెనీ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయ్యింది. రెండో కంపెనీలో ప్రక్రియ చాలా సులభంగానూ, పైగా చాలా వేగవంతంగానూ ఉండటంతో నేను ఆ ఉద్యోగానికి ఎంపికయ్యాను. అది మొదటి కంపెనీలోని కఠినమైన ఇంటర్వ్యూ ప్రక్రియను ఎదుర్కోవడానికి కావాల్సినంత నమ్మకాన్ని, ధైర్యాన్ని నాకిచ్చింది. నిజానికి నాకు ఆ కంపెనీలో చేరడానికి ఇష్టంలేదు. అయినా నావంతు పూర్తి కృషిచేసి, ఆ ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తిచేశానని నేను వినాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆ ఇంటర్వ్యూను క్లియర్ చేయలేనని నా భర్త భావించినందున ఎలాగైనా ఇంటర్వ్యూను క్లియర్ చేయాలని నేను అనుకున్నాను. ఉద్యోగంలో చేరేందుకు నాకు పెద్దగా ఆశలు లేనందున ఇంటర్వ్యూ తర్వాత రిజల్ట్ తెలుసుకోవడానికి నేను కన్సల్టెంట్‌కి ఫోన్ కూడా చేయలేదు. ఇంటర్వ్యూ శుక్రవారం జరగగా, సోమవారం సాయంత్రం 'నేను ఇంటర్వ్యూను క్లియర్ చేశాన'ని కన్సల్టెంట్ నుండి కాల్ వచ్చింది. ఆ కంపెనీ మా ఇంటికి దగ్గరగా ఉన్నప్పటికీ, అక్కడ పని చేయడం సౌకర్యంగా ఉండదని భావించి నేను ఆ ఉద్యోగంలో చేరడానికి ఇష్టపడలేదు. అందువలన జీతం వంటి కొన్ని కారణాలను అడ్డుగా చెప్పి 'నో' చెప్పాలని అనుకున్నాను. నిజానికి నాకు జీతం సమస్యే కాదు. బాబా ఇవ్వదలుచుకుంటే నేను అడిగినంత జీతం పొందుతాను. ఒకవేళ అంతకన్నా తక్కువైనా నేను అంగీకరించడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ బాబా దయతో నేను అడిగినంత జీతం ఆమోదించబడింది. 2 రోజుల తరువాత మరిన్ని వివరాల కోసం నేను కన్సల్టెంట్‌ను సంప్రదిస్తే, "నా జీతం ఇంకా అదనంగా 1000పౌండ్స్(84,708.05 రూపాయలు) పెంచారని చెప్పారు. నేను అవాక్కైపోయాను. నిజంగా ఇది అద్భుతం! ఎందుకంటే, సాధారణంగా జీతం మనం అడిగినంత, లేదా అంతకన్నా తక్కువే ఇవ్వబడుతుంది. కానీ నా విషయంలో నేను కోరిన దానికంటే చాలా అదనంగా ఇవ్వబడింది. ఇదంతా నా బాబా వల్ల మాత్రమే జరిగింది.

ఇప్పుడు నా వ్యక్తిగత జీవితం కూడా రోజురోజుకూ మెరుగుపడుతోంది. నా వ్యక్తిగత జీవితంలోని సమస్యలను పరిష్కరించమని ప్రతిరోజూ నేను బాబాను ప్రార్థిస్తున్నాను. ఆయన ఖచ్చితంగా వాటి సంగతి చూసుకుంటారని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో జరిగిన అద్భుతాలన్నీ నా బాబా, నా తల్లిదండ్రుల ఆశీస్సులవల్లనే. పరిస్థితి ఏమైనప్పటికీ, బాబాపై మీ పూర్తి నమ్మకాన్ని ఉంచండి. ఆయన అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా వాటిని ఆయన పరిష్కరిస్తారని నాకు తెలుసు. "బాబా! నాకు, నా కుటుంబానికి మరియు మీ భక్తులందరికీ తోడుగా ఉండండి".

నా ప్రార్థనలకు సాయి సమాధానమిస్తున్నారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిరామ్! నాకు వివాహం అయ్యేటప్పటికి వెంకటేశ్వరస్వామి, శివుని గురించే తెలుసు. సాయిబాబా గురించి అస్సలు తెలియదు. నా భర్తకు బాబాపట్ల అపారమైన నమ్మకం. నేను ఆయనతో చాలాసార్లు అయిష్టంగానే బాబా మందిరానికి వెళ్ళాను. అయితే ఒకరోజు బాబా నాకు శ్రీరామునిగా దర్శనమిచ్చారు. అప్పటినుండి బాబా నన్ను నడిపిస్తున్నారు. ప్రతిరోజూ ఆయన నా ప్రార్థనలకు సమాధానమిస్తున్నారు, నాకు శ్రేయస్కరమైతే నిమిషాల్లో ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు(2019, అక్టోబర్ 22) కూడా నేను సెలవు అడిగే వీలులేనందున నా షెడ్యూల్‌లో మార్పు కోసం బాబాని అభ్యర్థించాను. కొన్ని గంటల్లో నా ప్రార్థనకు సమాధానం లభించింది. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మనం బాబాకు సర్వస్య శరణాగతి చెందితే, ఆయన మన సంరక్షకుడిగా ఉంటూ ముందుకు నడిపిస్తారు.

శ్రీబాలాసాహెబ్ భాటే


సాయి మహాభక్త దివంగత శ్రీబాలాసాహెబ్ భాటే అలియాస్ పురుషోత్తం సఖారాం మరియు దివంగత శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ ఇరువురూ కళాశాలలో చదువుకునేటప్పటినుండి స్నేహితులు. భాటే కాలేజీ రోజుల్లో ఒక స్వేచ్ఛాజీవి. స్వతంత్రభావాలు కలిగి ఉండేవాడు. ముఖ్యంగా సంశయవాది. ప్రతి విషయాన్నీ అనుమానించేవాడు. అతనికి మతపరమైన విషయాలపట్ల, ఆధ్యాత్మిక విషయాలపట్ల అస్సలు ఆసక్తి ఉండేది కాదు. అతనికి ధూమపానం చాలా ఇష్టం. యథేచ్ఛగా పొగత్రాగుతుండేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, “ఈరోజు తిను, త్రాగు, రేపటిరోజు మనం చనిపోతాం!" అనేది అతని సిద్ధాంతం. అతని స్నేహితుడైన శ్రీ కాశీనాథ్ ఖండేరావ్ గార్డే హాస్యాస్పదంగా ఇలా వ్యాఖ్యానిస్తుండేవాడు: “యత్ర యత్ర భాటే, తత్ర తత్ర ధూమః” అని. అంటే, ఎక్కడ భాటే ఉంటాడో అక్కడ పొగ ఉంటుంది అని.
తరువాత భాటే మామల్తదారు అయ్యాడు. మంచి సమర్థత కలిగిన వ్యక్తి అని కలెక్టర్ అతన్ని బాగా ఇష్టపడేవారు. కొంతకాలానికి భాటే సుమారు 5 సంవత్సరాలపాటు (1904-1909) కోపర్‌గాఁవ్‌లో మామల్తదారుగా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ సమయంలో విద్యావంతులైన తన స్నేహితులు ఎవరైనా బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్తూ అతన్ని కలిసినప్పుడు, సాయిపట్ల వాళ్ళు చూపించే ప్రేమను, శ్రద్ధను చూసి, 'బాబా ఒట్టి పిచ్చిఫకీరు' అనీ, 'అమాయకులు ఆయనను వెర్రిగా పూజిస్తున్నారు' అనీ అనేవాడు. అందుకు అతని స్నేహితులు బాధపడి, "సాయిబాబాను ఒక్కసారి చూసి, అప్పుడు మాట్లాడమ"ని అనేవారు. ఆ మాట కూడా అతనికి నచ్చక వారిని అపహాస్యం చేసేవాడు. ఒక మారుమూల గ్రామంలోని పేద ఫకీరును సందర్శించడం తన గౌరవానికి తక్కువగా భావించాడతను. 

తరువాత 1909వ సంవత్సరంలో అతడు శిరిడీలో క్యాంప్ నిర్వహించడానికి వెళ్లి ప్రతిరోజూ సాయిబాబాను గమనిస్తూండేవాడు. ఐదవరోజు సాయిబాబా అతనిపై ఒక కాషాయవస్త్రాన్ని కప్పారు. ఆ క్షణంనుండి భాటేలో గొప్ప మార్పు చోటుచేసుకుంది. అతను ఆదాయానికి సంబంధించిన వ్యవహారాలనుగాని, తన విధినిర్వహణను గాని పట్టించుకోలేదు. ఆరోజునుండి అతని లక్ష్యమొక్కటే - మరణించేవరకు శిరిడీలో సాయిసేవ చేసుకుంటూ ఉండాలని, బాబా సమక్షంలోనే తన జీవితాన్ని ముగించాలని. అలా అతడు శిరిడీలోనే స్థిరపడిపోయాడు. అతని భార్యాబిడ్డలు కూడా శిరిడీ వచ్చి నివసించసాగారు. 

అతడు తన నిత్యకర్మలను ఆచరిస్తూ బాబా సమక్షంలో ఉపనిషత్తులు పఠిస్తుండేవాడు. అప్పుడప్పుడు బాబా వాటిగురించి వివరించి చెప్తుండేవారు. అతనిలో వచ్చిన ఆ తీవ్రమైన మార్పుకు కారణమేమిటని గార్డే అడిగినప్పుడు భాటే, "సాయిబాబా నాపై కాషాయవస్త్రం వేసినప్పటినుండి నాకు క్రొత్త జన్మ ఎత్తినట్లయ్యింది. అప్పటివరకు ఉన్న ఆలోచనాసరళి స్థానే క్రొత్త ఆలోచనాసరళి చోటుచేసుకుంది. లౌకిక జీవితం దుర్భరమైంది. ముఖ్యంగా ఉద్యోగవిధుల గురించి ఆలోచన కూడా చేయలేకపోయాను" అని చెప్పాడు.

భాటే ఉద్యోగవిధులను వదలి శిరిడీలో ఉండిపోవడంతో అతని స్నేహితుడైన దీక్షిత్ చేత ఒక సంవత్సరంపాటు సెలవు కోరుతూ ఒక దరఖాస్తును వ్రాయించారు బాబా. దానిపై భాటేతో సంతకం చేయించి కలెక్టర్ కార్యాలయానికి పంపించారు. అతనిపై మంచి అభిప్రాయం ఉన్న కలెక్టర్ అతడు మునుపటిస్థితికి రావొచ్చేమో చూద్దామనే ఉద్దేశ్యంతో ఒక సంవత్సరం సెలవును మంజూరు చేశాడు. ఆ సమయంలో ఒకసారి అతని పైఅధికారి శిరిడీ వచ్చినప్పుడు భాటేను కలిసి ఉద్యోగవిధులలో చేరమని అడిగినప్పుడు భాటే, "తనకు శిరిడీ విడిచి ఎక్కడికీ వెళ్లాలని లేదు" అని ఖండితంగా చెప్పాడు. 

సంవత్సరకాలం సెలవు పూర్తికావచ్చినా అతని వైఖరిలో మార్పు రాలేదు. తన గురువైన బాబాయందు అమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. అతని మనో వైఖరిని గమనించిన కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ మరియు శ్యామాలు, 'ఇలా అయితే అతను తన కుటుంబాన్ని ఎలా పోషించుకోగలడ'నే ఆందోళనతో, అతనికి సహాయం చేయమని బాబాను అభ్యర్థించారు. బాబా వాళ్లతో, "ప్రత్యేకమైన కేసుగా పరిగణించి పెన్షన్ మంజారు చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఒక దరఖాస్తు వ్రాసి, భాటేతో సంతకం చేయించి పంపమ"ని చెప్పారు. నిజానికి భాటే కేవలం 13 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ విధులను నిర్వర్తించాడు. అందువల్ల పెన్షన్ పొందటానికి ఎటువంటి అర్హతా లేదు. కానీ బాబా కృపవలన అతని వైరాగ్యాన్ని గుర్తించిన కలెక్టర్ అతనిపై జాలితో నెలకు 30 రూపాయల పింఛను మంజూరు చేశాడు. ఆ కొద్దిపాటి పెన్షన్ డబ్బులతో కడు పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ అతని ముఖంలో దివ్యతేజస్సు ఉట్టిపడుతుండేది.

తరువాత కొంతకాలానికి మొదటిసారి శిరిడీ వచ్చిన హేమాడ్‌పంతుకి, భాటేకి మధ్య సాఠేవాడాలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ సమయంలో భాటే గురువు యొక్క ఆవశ్యకత గురించి, ప్రాపంచిక సమస్యలను అధిగమించడానికి, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి మనిషికి గురువు యొక్క మార్గదర్శకత్వం ఎంతైనా అవసరముందని గట్టిగా వాదించాడు. ఆ వాదనలతో అవతలివాళ్ళు సంతృప్తి చెందకపోయినప్పటికీ గురువుపట్ల అతనికున్న దృఢమైన విశ్వాసం, గురువుపట్ల అతనికున్న అవగాహన తెలుస్తుంది. బాబా కృపతో నాస్తికుడైన అతనిలో వచ్చిన గొప్ప మార్పుకు ఈ సంఘటన ఒక తార్కాణం.

అంత గొప్ప భక్తునికి కూడా ఏమారే క్షణాలుంటాయి కాబోలు! ఒకప్పుడు అతని కూతురు సాయిబాయి కోసం కాకాసాహెబ్ దీక్షిత్ మంచి పెండ్లిసంబంధం తీసుకుని వచ్చాడు. ఆ విషయం గురించి అతడు బాబాతో చెప్పగానే ఆయన, "అంతకంటే ఆమెను అప్పా అనే వంటవాడికి ఇవ్వడం మేలు!" అన్నారు. సమయం చూసుకుని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే బాబా చికాకుగా, "వాడికే ఇచ్చి చేసుకో పో, ఏడ్చుకో!" అన్నారు. తీరా ఆ వివాహం జరిపించాక, ఆరుమాసాలలో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా, "ప్రతివాడూ 'బాబా! నీకు తెలియనిది ఏమున్నది?' అంటాడేగాని, చెప్పినట్లు వినిచచ్చేవాడు ఎవడూ లేడు" అన్నారు.

1918 అక్టోబర్ 15న సాయిబాబా మహాసమాధి చెందారు. ఆయన అంత్యక్రియలలో భాటే ప్రధానపాత్ర వహించాడు. 13 రోజుల తరువాత అతడు ఉపాసనీ, బాపూసాహెబ్ జోగ్‌లతో కలిసి ప్రయాగ్ (అలహాబాద్) వెళ్లి గంగానది తీరాన మిగిలిన కార్యక్రమాలు పూర్తిచేశాడు. ఒక సంశయవాదిగా బాబా గురించి తీవ్రమైన ఆరోపణలు చేసిన బాలాసాహెబ్ భాటే చివరకు బాబావైపు ఆకర్షితుడై ఆయనకు దృఢమైన భక్తుడయ్యాడు. బాబా సేవలో జీవితాంతం గడిపి, ఆయన కృపతో ఆధ్యాత్మిక పురోగతి కూడా సాధించాడు.

శ్రీబాలాసాహెబ్ భాటే కూతురు శ్రీమతి జానకీబాయి తంబే అలియాస్ శ్రీమతి సాయిమాయి(సాయిబాయి) తండ్రివలే మంచి భక్తిపరురాలు. ఆమెకు బాబాపట్ల అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె నిండు వైరాగ్యానికి, నిస్వార్థసేవకు ప్రతిరూపంలా ఉండే మహిళ. 1943 జనవరి 2వ తేదీన ఆమె తన స్థిరచరాస్తులన్నింటినీ సాయి సంస్థాన్‌కు రాసిచ్చింది. అంతేకాదు, సాయిసంస్థాన్‌ వారి ప్రసాదాలయంలో భక్తులకు వడ్డన చేస్తూ ఆమె చాలా సేవ చేసింది. అత్యంత ఉత్సుకతతో, శ్రద్ధతో చకచకా ఆమె చేసిన సేవ అందరి ప్రశంసలను పొందింది. ఆ సేవలో ఆమె తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేసేదికాదు. ఎందుకంటే, తాను చేసే ఆ సేవ సాక్షాత్తు సాయిబాబాకే చేస్తున్నట్లుగా భావించేది. ఎన్ని అసమానతలు ఉన్నప్పటికీ, భక్తుల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన 'భోజన గృహాన్ని' సంతృప్తికరమైన రీతిన నిర్వహించిన ఘనత ఆమెకు దక్కుతుంది. ఆమెలా కృషిచేసి 'భోజన గృహాన్ని' నిర్వహించడం వేరెవరికీ సాధ్యంకాదని చెప్పవచ్చు.

దీక్షిత్, భాటే ఇరువురూ ఒకే సంవత్సరంలో శ్రీసాయి సన్నిధికి చేరుకున్నారు. ఇద్దరూ బాబాపట్ల అంకితభావంతో ఉంటూ భాగవతం వంటి గ్రంథాలు కలిసి పఠనం చేసేవారు. అన్నీ విడిచి సాయిని అంటిపెట్టుకుని ఉండిపోయిన భాటే అంటే దీక్షిత్‌కు ఎనలేని అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం భాటేతోనే ఆగలేదు, అతని కుటుంబంపై కూడా ప్రసరించింది. భాటే భార్యని 'భాభీ' అనీ, 'సాయిబా' అనీ ప్రేమగా పిలిచేవారు దీక్షిత్. పేదరికంలో అలమటిస్తున్న ఆ కుటుంబానికి అండగా నిలిచి వారి బాగోగులు చూసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే భాటే కుటుంబంపై కాకాసాహెబ్ దీక్షిత్ చూపిన ప్రేమ, కరుణ వెలకట్టలేనివి.

కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దర్శనం చేసుకున్నప్పటి నుండి ఎక్కువగా శిరిడీలోనే ఉంటూ ఉండేవాడు. ఆ కారణంగా అతని కుటుంబసభ్యులు కూడా శిరిడీ వచ్చి అతనితోపాటు ఉండేవారు. అతని పెద్దకొడుకు రామకృష్ణ(బాబు దీక్షిత్)ను శిరిడీలోని మరాఠీ పాఠశాలలో చేర్చారు. అదే పాఠశాలలో భాటే పెద్దకొడుకు(బాబు భాటే) కూడా చదువుతున్నాడు. పిల్లలిద్దరూ ఒకే వయస్సువారు, ఒకే తరగతి చదువుతుండేవారు. పాఠశాలలో ఇచ్చిన హోమ్‌వర్కును కలిసి చేసుకుంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. చావడిలో బాబా నిద్రించే రాత్రి ఈ పిల్లలిద్దరూ జరీ టోపీలు ధరించి బాబా యొక్క చోప్‌దారుల వలే చేతిలో ఒక కర్ర పట్టుకుని చావడి ప్రవేశద్వారం వద్ద నిలబడి, సెల్యూట్ చేస్తూ, "ఇక విశ్రాంతి తీసుకోండి మహారాజా" అని అనేవారు.

పిల్లలిద్దరూ శిరిడీలో విద్యను పూర్తిచేశాక ఉన్నత చదువులకోసం నగరానికి వెళ్ళవలసి వచ్చింది. దీక్షిత్, భాటేతో సంప్రదించి తన భార్యతోపాటు పిల్లలిద్దరినీ ముంబైకి పంపారు. బాబుభాటేను తమ సొంతబిడ్డలా చూసుకునేవారు దీక్షిత్. ఆహారం, దుస్తులు వంటివి ఏవి తన కొడుకు బాబుకు ఇచ్చినా, వాటిని బాబుభాటేకు కూడా ఇచ్చేవారు. విల్లేపార్లేలోని వారి ఇంటిలోకి తరచూ తేళ్లు, పాములు చొరబడేవి. అందువలన పిల్లలిద్దరికీ ఇనుప మంచాలు కొని వేయించారు. పిల్లలిద్దరూ ముంబైలో పాఠశాల విద్యను పూర్తిచేశాక బనారస్ సెంట్రల్ హిందూ కళాశాలలో చేరారు. బాబుభాటే B.A. చదువు ఎంచుకోగా, బాబుదీక్షిత్ B.Sc. లో చేరాడు. ఇద్దరూ తెలివైనవారు, కష్టపడి చదివి మంచి గ్రేడ్‌లతో ఉత్తీర్ణులయ్యారు. తరువాత బాబుబాటే M.A., లా చేయాలనుకున్నప్పటికీ తన తండ్రి మరణంతో తన తల్లిని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత అతని భుజాలపై పడింది. తనకు విద్యను అందించిన కాకాసాహెబ్ దీక్షిత్‌ పట్ల కృతజ్ఞత కలిగివున్న అతను ఇంకా ఆయనపై భారం వేయడానికి ఇష్టపడక, పైచదువులు చదువుకోవాలనే ఆలోచనను వదిలిపెట్టి బ్యాంకు ఉద్యోగంలో చేరాడు. బ్యాంక్ అతనికి రూ.100/- జీతం ఇచ్చేది. ఆ కొద్దిమొత్తంతో అతను తన తల్లిని చూసుకుంటూ తమ్ముడిని చదివించాడు. బాబుభాటే కష్టపడి పనిచేసేవాడు, నిజాయితీపరుడు, బాధ్యతాయుతమైన వ్యక్తి. అతని తమ్ముడు పాఠశాల విద్యను పూర్తిచేశాక ఉన్నతవిద్యను అభ్యసించాలనుకున్నాడు. బాబుభాటే తన తమ్ముడి ఇష్టాన్ని కాదనకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఒక కళాశాలలో చేర్పించాడు. అతడు కాలేజీ చదువుతున్న సమయంలోనే ఒకసారి బాబుభాటే ఉద్యోగరీత్యా నాసిక్ వెళ్లి, అక్కడ కలరా వ్యాధి బారినపడి మరణించాడు.

Source(Source: Devotees’ Experiences of Sri Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji,Shri Sai Satcharitra by Late Shri.Govind Raghunath Dabholkar alias Hemadpant and Shri Sai Baba of Shirdi by Late Shri.Moreshwar W. Pradhan)

సాయిభక్తుల అనుభవమాలిక 211వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు
  2. మనల్ని రక్షించడానికి సాయి ఎల్లప్పుడూ ఉన్నారు

బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు

సాయిభక్తుడు సాంబశివరావు బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరిలో. మా కుటుంబ జీవనాధారం కూలీపనులు. మా అమ్మా వాళ్ళు కూలీపనులకు వెళ్తూ, నాకు పెద్దమ్మ వరుసయ్యే మా బంధువుల ఇంట్లో నన్ను ఉంచి వెళ్ళేవారు. పెద్దమ్మకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అయినా ఆమె నన్ను సొంతబిడ్డలా చూసుకునేది. అందరూ నన్ను ఆమె దత్తపుత్రుడు అనేవాళ్ళు. అంత ఆప్యాయంగా ఆమె నన్ను చూసుకునేది. వాళ్లకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆమె పెద్దక్క వాళ్ళు శిరిడీ వెళ్ళారు. వాళ్ళు గోదావరిలో స్నానం చేసి, తరువాత బాబా దర్శనానికి వెళ్లారు. బాబా చక్కటి దర్శనాలు ఇచ్చారు. తరువాత వాళ్ళు తిరుగు ప్రయాణంలో వీళ్ళ ఇంటికి వచ్చి, శిరిడీలో వారికి జరిగిన అనుభవాలను మాతో పంచుకున్నారు. తరువాత ఒకరోజు వాళ్ళు చెప్పిన సంఘటనలను మేము టీవీలో చూసాము. వాళ్ళు గోదావరిలో స్నానం చేయడం, తరువాత దర్శనానికి వెళ్లడం, సమాధిమందిరంలో చేసిన పూజ అన్నీ దూరదర్శన్ లో ప్రసారం చేశారు. ఎందుకో తెలియదుగాని అవి చూస్తున్న సమయాన నేను నా మనసులో, "బాబాయే నా ఇష్టదైవం" అని అనుకున్నాను. 

ఆ తరువాత మరో సంఘటన:

ఒకసారి ఎర్రమట్టితో దేవుని ప్రతిమలు చేసి అమ్ముకునేవాళ్ళు మా ఊరికి వచ్చారు. మా పెద్దమ్మ రెండు బాబా ప్రతిమలు చేయమని వాళ్లకు డబ్బులు ఇచ్చింది. వాళ్ళు ఆ సాయంత్రం ఊరు విడిచి వెళ్లిపోతున్నారని పెద్దమ్మకి తెలిసి ప్రొద్దున బడికి వెళ్ళబోతున్న నన్ను ఆపి, విషయం చెప్పి, ఆ బాబా ప్రతిమలు తీసుకుని రమ్మని పంపింది. బడికి సమయమైపోతుందని హడావుడిలో నేను పరుగెత్తుకుంటూ వెళ్లి, ఆ ప్రతిమలను తీసుకుని, వాటిని నా గుండెలకు హత్తుకుని మళ్ళీ పరుగుతీసుకుంటూ ఇంటికి వచ్చాను. బాబా నా గుండెలో గూడు కట్టుకుంటారన్న సంగతి నాకు ఆ సమయంలో తెలియదు.

మరో సంఘటన ద్వారా అసలు బాబా లీల ఆవిష్కృతం అవుతుంది. బహుశా నాకప్పుడు 6 లేదా 7 ఏళ్ల వయసు ఉంటుందనుకుంటాను. టీవీలు అప్పుడప్పుడే పల్లెటూర్లలో ప్రవేశిస్తున్నాయి. ఆ సమయంలో తెలిసిన వాళ్ళింటి టీవీలో బాబాపై తెలుగులో మొట్టమొదట తీసిన అద్భుతమైన సినిమా
"శిరిడీ సాయిబాబా మహత్యం" ప్రసారమవుతోంది. ఆ సినిమా చూస్తూ నేను ఎంత తాదాత్మ్యం చెందానో, ఎంత పరవశించిపోయానో నాకే తెలియదు. నాలో కలిగిన ఆ పారవశ్యపు అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ సంఘటన గుర్తుచేసుకున్న ప్రతిసారీ 'నాకేనా అలా జరిగింది!' అని అనుకుంటూ ఉంటాను. విజయచందర్ గారు బాబా పాత్రలో ఒదిగిపోయారు. అతను మాట్లాడుతుంటే నిజంగా బాబా నోటినుండి వచ్చిన అమృతవాక్కులుగా అనిపించేవి. సాక్షాత్తూ బాబాయే మాట్లాడుతున్న అనుభూతి కలిగింది. అతని నడక చూస్తుంటే నిజంగా బాబా ఇలానే నడిచేవారేమో అని అనిపించింది. నానావలి గాడిదను తీసుకునివచ్చి డబ్బులు కావాలని అడిగే సంఘటనయితే నన్ను బాగా కదిలించేసింది. అదేకాదు, అన్ని సంఘటనలు అద్భుతంగా హృదయానికి హత్తుకునేలా చేశారు. ప్రతి పాత్రధారుడూ ఆయా పాత్రలలో బాగా ఒదిగిపోయి చేశారని చెప్పాలి. ఆరోజు నేను నిర్ణయించుకున్నాను, బాబాను తుచ్ఛమైన కోర్కెలు కోరుకోకూడదని. ఆరోజునుండి ఇప్పటివరకు నేను తుచ్ఛమైన కోరికలేవీ బాబాని కోరలేదు. ఇంకా ఎన్నో అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజుకి ఇంతే. 'బాబావారు నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం'తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

జై సాయిరాం!
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు!

మనల్ని రక్షించడానికి సాయి ఎల్లప్పుడూ ఉన్నారు

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా సోదరుడు యు.ఎస్.ఏ. లో డాక్టరుగా పనిచేస్తున్నాడు. అతని పేషెంట్లలో ఒకరైన ఒక  వృద్ధుడు హాస్పిటల్లో ఒక డాక్టర్ గురించి ఫిర్యాదు చేశాడు. అయితే అతనికి ఆ డాక్టర్ పేరు తెలియదు. హాస్పిటల్ సిబ్బంది ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులందరి ఫోటోలను అతనికి చూపించారు. అందులో ఇద్దరు డాక్టర్లకి బట్టతల వుంది. ఆ ఇద్దరిలో నా సోదరుడు కూడా ఒకడు. ఆ వృద్ధుడు నా సోదరుడి ఫోటోను చూపించి ఇతనేనని చెప్పడంతో నా సోదరుడిపై కేసు నమోదైంది. యు.ఎస్.ఏ. ప్రభుత్వపు కఠినమైన నిబంధనల వలన కేసు విచారణ జరిగేవరకు నా సోదరుడు తన వృత్తిని కొనసాగించడానికి వీలులేదు. అందువలన మేమంతా చాలా ఒత్తిడికి గురయ్యాము. అయితే, సాయి తన సహాయాన్ని అద్భుతరీతిన మాకందించారు.

ఒకరోజు నేనొక మేళాకు(జాతర) వెళ్ళాను. అక్కడ పాకలా నిర్మించబడివున్న సాయిమందిరం ఉంది. నేనప్పుడు లోపలికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నందున దూరంనుండే సాయిని ప్రార్థించుకుందామని అనుకున్నాను. నేను కళ్ళు మూసుకుని, "బాబా! తప్పుడు ఆరోపణల నుండి నా సోదరుడిని రక్షించండి" అని బాబాను ప్రార్థిస్తున్నాను. ఇంతలో ఒక స్త్రీ వెనుకనుండి నన్ను తట్టి, సాయిబాబా ఫోటో ఒకటి నాచేతికిచ్చింది. ఆ ఫోటోను చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిమీద "నేను మీతోనే ఉన్నాను, భయపడవద్దు" అని వ్రాయబడివుంది. అది చదివి నా శరీరమంతా రోమాంచితమైంది. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని నేను చవిచూడలేదు. నేను దేనిగురించైతే ప్రార్థించానో దానికి సమాధానం ఆ ఫోటో ద్వారా ఇచ్చారు బాబా. దానితో నేను ఆయన నా సోదరుడిని ఖచ్చితంగా రక్షిస్తారని దృఢంగా విశ్వసించాను. తరువాత కోర్టు విచారణ ప్రారంభించకముందే ఆ వృద్ధుడు, నా సోదరుడు దోషి కాదని, తాను పొరబడ్డానని తెలియజేస్తూ కేసును వెనక్కి తీసుకున్నాడు. మా ఆనందానికి హద్దులు లేవు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2461.html

ద్వారకానాథ్


1889వ సంవత్సరంలో పవిత్రమైన శ్రీరామనవమినాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ద్వారకానాథ్ జనార్ధన్ క్వాలి జన్మించాడు. అతడు పెరిగి పెద్దయి అహ్మద్‌నగర్ లో విద్యాశాఖలో పనిచేసేవాడు. అదే సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ అక్కడికి బదిలీ మీద వచ్చాడు. అనతికాలంలో వారిరువురూ మంచి స్నేహితులయ్యారు. అప్పట్లో దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నందున ప్రతి సంవత్సరం వారంరోజులు క్రిస్టమస్ సెలవులు ఉండేవి. తరచు ఆ సమయాన్ని చందోర్కర్ శిరిడీ సందర్శించి సద్వినియోగ పరుచుకుంటుండేవాడు. ఒకసారి ద్వారకానాథ్ చందోర్కరుతో కలిసి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు శిరిడీ చేరుకునేసరికి మిట్టమధ్యాహ్నం అయ్యింది. వాళ్ళు ద్వారకామాయి చేరుకునేసరికి భోజనాలు వడ్డించబోతున్నారు. త్వరత్వరగా భక్తులు రెండువరుసల్లో కూర్చున్నారు. ఆరోజెందుకో చందోర్కరుకు నెయ్యి తినాలని కోరిక కలిగింది. కానీ అక్కడ నెయ్యి లేదని అతడు గుర్తించి ద్వారకానాథ్ వైపు తిరిగి, "ద్వారకా! మన శిబిరానికి వెళ్ళి నెయ్యి తీసుకుని రా!" అని చెప్పాడు. ఆ మాట బాబా విని, "వెళ్ళవద్దు! నీ దగ్గర ఒక వస్తువు లేకపోతే, ఇంకొకరి వద్దనుండి అరువు తెచ్చుకోకూడదు" అని అన్నారు. బాబా మాటలలో ఉన్న అంతరార్థం ద్వారకానాథ్ పై తీవ్రమైన ప్రభావం చూపింది. అతడు తన జీవితాంతం ఆ మాటలను అనుసరించాడు. తరువాత ప్రతి ఒక్కరికీ అన్నంతో పప్పు వడ్డించారు. అప్పుడు ద్వారకామాయి ప్రాంగణమంతా తాజాగా తయారుచేసిన రుచికరమైన నెయ్యి వాసనతో నిండిపోయింది. బాబా అదృశ్యంగా దానిని అందించారు.

Ref.: Sai Prasad Magazine, Deepavali issue, 1991.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri,

సాయిభక్తుల అనుభవమాలిక 210వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  1. సాయి ఇచ్చిన మధురానుభవాలు
  2. సాయికి ప్రార్థన - లభించిన ఉపశమనం

సాయి ఇచ్చిన మధురానుభవాలు

సాయిభక్తుడు ప్రవీణ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! ఓం శ్రీ గురుభ్యోనమః!

నా పేరు ప్రవీణ్. నా నివాసం హైదరాబాదులోని షాద్‌నగర్. ఈ బ్లాగు ద్వారా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 'శిరిడీసాయి సేవారహస్యం' అనే గ్రంథాన్ని పారాయణ చేస్తున్నాను. అందులో ఒకచోట ఇలా ఉంది: "రామ రావణ యుద్ధానంతరం శ్రీరాముడు అందరికీ అనేకరకాల బహుమతులు ఇస్తూ ఉంటారు. అక్కడే ఉన్న హనుమంతుడు, "ప్రభువు నాకేమీ ఇవ్వడం లేదే!" అని అనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు హనుమను దగ్గరకు పిలిచి కౌగిలించుకుంటారు. అప్పుడు హనుమ 'తన స్థానం శ్రీరాముడి హృదయంలో' అని తెలుసుకుని చాలా ఆనందపడతాడు. అది చదివాక నేను సమర్థ సద్గురుడైన సాయితో, "మీ దగ్గర నా స్థానం ఏమిటి?" అని అనుకున్నాను. ఆరోజు రాత్రి నాకొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో సాయి దర్శనమిచ్చి, నన్ను దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. అది స్వప్నమే అయినా సాయి స్పర్శను నేను ఇప్పటికీ మరువలేను. ఆ స్వప్నం ద్వారా 'నా స్థానం సాయి హృదయంలో' అని తెలిసి నేను పొందిన ఆనందాన్ని పదాల్లో వర్ణించలేను. "అడిగినంతనే ఇంత గొప్ప అనుభవాన్నిచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయీ!"

మరో అనుభవం:

నేను విజయవాడ దగ్గర చల్లపల్లిలో ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజులలో జరిగిన అనుభవమిది. అప్పుడప్పుడే సాయి నా జీవితంలోకి వస్తున్న రోజులు. నేను మా మేనత్త వాళ్ళ ఇంటిలో ఉండి చదువుకుంటున్నాను. ఒకసారి మా మేనత్త వాళ్ళు శిరిడీ వెళ్లారు. నేను ఒక్కడినే ఇంటిలో వున్నాను. రాత్రి పడుకునేముందు కాసేపు టీవీ చూశాను. ఆ తరువాత టీవీపై ఉన్న సాయిబాబా విగ్రహాన్ని చూస్తూ నిద్రలోకి జారుకుంటున్నాను. ఇంకా ఐదు నిమిషాలు కూడ అయివుండదు. అంతలో టీవీపై ఉన్న సాయి క్రిందకు దిగివస్తున్నారు. అది కల అనుకుందామంటే నేనింకా పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు. సాయి రావటం స్పష్టంగా తెలుస్తుంది కానీ, లేద్దామంటే నేను లేవలేకపోతున్నాను. ఆయన నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని జోకొట్టారు. ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా, నిజం! ఆ స్పర్శానుభూతి నేను ఎన్నటికీ మరువలేనిది. అది సాయి ప్రేమ!

అంతటి అనుభవాలిచ్చినా సాయి నాతో వున్నారని మరచి, చేయకూడని తప్పులు చేసి సాయి ప్రేమకు నేనే దూరంగా ఉన్నాను. అందుకే ఇంకా సాయికి దూరం కాకూడదని ఇలా నా అనుభవాలను పంచుకుంటున్నాను. అమితమైన ప్రేమను కురిపించే సాయికి నన్ను అర్పితం చేసుకోవాలని, ఎప్పటికీ ఆయనకి శరణాగతుడినై ఉండాలని నా కోరిక. 

ఇటీవల ఒక పదిరోజుల క్రితం మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. ఆమెకు టైఫాయిడ్, డెంగ్యూ వచ్చి, ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఆ సమయంలో నేను, "సాయీ! అమ్మకు ప్లేట్లెట్స్ పెరగాలి. ఆమెకు త్వరగా ఆరోగ్యం చేకూరేలా చేయండి" అని ఆ సాయినాథుని వేడుకున్నాను. సాయి కరుణ వల్ల డెంగ్యూ నెగిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ వృద్ధి చెంది అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. సాయికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కానీ ఈరోజు(2019, అక్టోబర్ 24) నా భార్యకు డెంగ్యూ పాజిటివ్ అని వచ్చింది. నేను సాయిపైనే ఆధారపడివున్నాను. నా భార్యకు నయమయ్యేలా సాయి చేస్తారని నాకు నమ్మకం వుంది. 

ఓం శ్రీసాయిసమర్థ నమః
ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి.

సాయికి ప్రార్థన - లభించిన ఉపశమనం

సాయిభక్తుడు నీలేష్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిభక్తుడిని. నా సొంత ఊరు శిరిడీ సమీపంలోని కోపర్‌గాఁవ్. నేను ఒక బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాను. నా క్రింద పనిచేసే ఒకామె రాజీనామా చేసి సంస్థను విడిచిపెట్టింది. ఆమె వెళ్ళిపోయాక తను ఉపయోగించిన ఆఫీసు ల్యాప్‌టాప్ కనిపించకుండా పోయింది. సూపర్‌వైజర్‌గా తనకి ఫోన్ చేసి, ల్యాప్‌టాప్‌ గురించి అడిగి పెండింగ్‌లో ఉన్న ఫార్మాలిటీలను పూర్తిచేయమని చెప్పాను. కానీ ల్యాప్‌టాప్‌ ఆచూకీ తెలియలేదు. నేను ఆఫీసు అంతర్గత బృందాలతో ల్యాప్‌టాప్‌ను వెతికించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక నాకు టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆమె వెళ్లేముందు తన వద్దనుండి ల్యాప్‌టాప్ వంటివన్నీ హ్యాండోవర్ చేసుకున్న తరువాత క్లియరెన్స్ ఇవ్వడం నా బాధ్యత. కాబట్టి ల్యాప్‌టాప్‌ దొరక్కపోతే అందుకు నేనే బాధ్యుడనవుతాను. అందువలన సాయిని తలచుకుని, "రెండు గంటల్లో ల్యాప్‌టాప్ దొరికితే మీ మందిరంలో స్వీట్స్ పంపిణీ చేస్తాను. నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పంచుకుంటాన"ని ప్రార్థించాను. తరువాత సాయి దయవల్ల ల్యాప్‌టాప్‌ ప్రాజెక్ట్ క్యాబినెట్‌లో మా మేనేజరుకి దొరికింది. "సాయినాథా! నన్ను మానసిక ఒత్తిడి నుండి బయటపడేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు".

కొన్ని నెలల క్రితం మా కుటుంబమంతా వైరల్ ఫీవర్ మరియు దగ్గుతో బాధపడింది. అందరూ అనారోగ్యానికి గురికావడంతో ఇంట్లో పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. ఆ స్థితిలో నేను, "సాయీ! ఈ అనారోగ్యం నుండి మాకు ఉపశమనం లభిస్తే, నేను నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను" అని ప్రార్థించాను. సాయి దయవల్ల ప్రతిఒక్కరూ త్వరగా కోలుకున్నారు. శ్రీ సాయిని ప్రార్థించండి, ప్రశాంతంగా ఉండండి.

సాయిభక్తుల అనుభవమాలిక 209వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయిప్రభువు ఇచ్చిన గొప్ప అనుభవం

సాయిలీల పత్రికలో ప్రచురితమైన వాసుదేవ్ గారి అనుభవం ఈరోజు మీ ముందుంచుతున్నాము.

నేనొక మెకానికల్ ఇంజనీరుని. 1980వ సంవత్సరంలో నేను బెంగళూరులో ఒక చిన్న తరహా పరిశ్రమను నడుపుతుండేవాడిని. హఠాత్తుగా వ్యాపారంలో నా భాగస్వామితో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతడు తన అనారోగ్యాన్ని సాకుగా చెప్పి వెంటనే వ్యాపారం నుండి వైదొలగుతానని పట్టుబట్టాడు. అందుకుగాను గుడ్‌విల్ గా ఒక లక్షా పన్నెండు వేల రూపాయలను పరిహారంగా చెల్లించమని అడిగాడు. అయితే నేను ఆర్థికంగా పేద ఇంజనీరుని, పైగా నా దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని అప్పటికే వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. నేను అనుభవిస్తున్న ఏకైక సంపద సాయిపై నాకున్న శ్రద్ధ(విశ్వాసం) మాత్రమే. పైగా పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో ఉంది. భారీ ఋణాలు, బాధ్యతలు మాపై ఉన్నాయి. పరిస్థితి అలా ఉంటే నా భాగస్వామి యొక్క డిమాండును నేను అంగీకరించకపోతే, అతని నుండి నాకు సహకారం లభించదు. అది పరిశ్రమ నడవడానికి హానికరం. కాబట్టి ఆ సమస్య నాకొక సవాలు అయ్యింది. ప్రారంభంలో సమస్య పరిష్కరించలేనిదిగా అనిపించింది. నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, “అప్పే చేయి, దొంగతనమే చేయి, కానీ ఏదో ఒక విధంగా డబ్బు ఏర్పాట్లు చేసి నీ భాగస్వామికి చెల్లించు. లేకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది” అని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే నేను ఎవరిని వేడుకోవాలి? ఎక్కడ అప్పు పొందాలి? నేను ఏం చేయాలి? ఏదీ తెలియక మౌనంగా ఉండిపోయాను.

అలా ఉండగా 1980 జనవరి నెలలో నా స్నేహితుడొకడు శిరిడీ సందర్శించేందుకు ప్రణాళిక వేసుకుని, నేను మానసికంగా చాలా బాధపడుతున్నందున నన్ను, "తనతో శిరిడీ రావడానికి ఆసక్తి ఉందా?" అని అడిగాడు. మానసిక శాంతిని పునరుద్ధరించుకునే లక్ష్యంతో నేను వెంటనే అంగీకారం తెలిపాను. ఒకరాత్రికి మేము శిరిడీ నేలపై అడుగుపెట్టాము. మరుసటిరోజు బాబాకు అభిషేక సేవ చేసుకున్న తరువాత సమాధిమందిరంలో సాయి వెండిపాదాలపై రెండు చీటీలు ఉంచాను. ఒక చేతిలో 'భాగస్వామ్యాన్ని కొనసాగించమ'ని, రెండో దానిలో 'ఏదోవిధంగా భాగస్వామ్యాన్ని వదిలించుకోమ'ని వ్రాశాను. నిజానికి సాయి దివ్యపాదాలపై ఈ వెర్రి పని చేయడానికి చాలా సంశయించాను. కానీ చివరికి, 'నేను ఆయన బిడ్డనైనప్పుడు ఎందుకు భయపడాలి?' అని అనుకుని నా తండ్రి వద్దనుండి సహాయం తీసుకునేందుకు కాస్త స్వేచ్ఛ తీసుకున్నాను. ఆ తండ్రిని ప్రార్థించి ఆయన వెండిపాదాలపై ఉన్న రెండు చీటీల నుండి ఒకదాన్ని తీసుకున్నాను. తరువాత సమాధిమందిరం నుండి బయటకు వచ్చాక నేను చీటీ తెరచి చూశాను. అందులో 'ఏదో ఒకలా భాగస్వామిని వదిలించుకో' అని ఉంది. ఆ విషయాన్ని నాతో ఉన్న నా స్నేహితుడికి చెప్పాను. నేను సాయి పాదాల చెంత చేసిన వెర్రిపనికి నా స్నేహితుడు సంతోషించలేదు. తను నాతో, సాయి పాదాల వద్ద చీటీలు ఉంచకూడదని చెబుతూ, 'ఎలాగైనా నీకు భాగస్వామితో కొనసాగక తప్పదు' అని చెప్పాడు. ఆ సమయంలో నేను నా మనస్సులో, "నా భాగస్వామికి పరిహారంగా చెల్లించాల్సిన డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలో నేను ఆలోచించుకోవాలి. అందుకు తగిన కృషి చేయాలి. నా సాయి తండ్రి తన అనుమతి ఇచ్చిన తరువాత అందుకు తగిన పరిష్కారం కూడా ఆయనే చూపించగలరనే విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో సరైన దిశలో కష్టపడాలి" అని సంకల్పం చేసుకున్నాను.

బెంగళూరుకు తిరిగి వచ్చాక నేను ప్రతిరోజూ డబ్బులు ఏర్పాటు చేయగలిగే మార్గాల గురించి ఆలోచిస్తూ గడిపాను. అయితే సమస్యకు సరైన పరిష్కారం దొరకకుండానే చాలారోజులు గడిచిపోయాయి. అయినా నేను నా ఆలోచనలను పట్టువదలకుండా కొనసాగిస్తూ సమస్యను సాయి పాదాలకు అర్పించాను. ఒకరోజు నేను కొంత ఆర్థిక సహాయాన్ని అర్థిస్తూ నా సోదరుడి(వైద్యుడు)కి ఉత్తరం వ్రాశాను. తను రూ.30,000/- నాకు ఇవ్వడానికి తక్షణమే అంగీకరించాడు. ఇంకా రూ.20,000/- తక్కువగా ఉంది. దానికేమి చేయాలో తెలియలేదు. నా స్నేహితుల సహాయంతో నా భాగస్వామితో ఒక సమావేశం ఏర్పాటు చేసి, భాగస్వామ్యం రద్దుపరచుకునేందుకు దస్తావేజు రూపొందించాము. దస్తావేజు నిబంధనల ప్రకారం దస్తావేజుపై సంతకం చేసిన వెంటనే నేను అతనికి రూ.50,000 చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని 10 సమాన వాయిదాలలో చెల్లించాలి. అయితే నా దగ్గర రూ. 50,000 కు గాను రూ.20,000 తక్కువగా ఉన్నందున నేను చాలా నిరాశకు గురయ్యాను. దస్తావేజుపై సంతకం చేయాల్సిన రోజు, అనగా 21-8-1982 సమీపిస్తోంది. ఆ రోజు నా భాగస్వామి, నా స్నేహితులందరూ వస్తారు, డబ్బు ఏర్పాట్లు చేయలేని కారణంగా వాళ్ళందరి సమక్షంలో నేను అవమానం పాలవుతానని పదేపదే ఆలోచించుకుంటూ విపరీతమైన ఆందోళనతో రోజులు గడుపుతుండేవాడిని. ఆరోజు రేపనగా, అంటే 20-8-1982న ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో నేను మౌనంగా ఇంట్లో కూర్చుని ఉన్నాను. రేపటిరోజుని ఎలా ఎదుర్కొనేది అన్న ఆలోచనలతో నా మనసంతా నిండిపోయివుంది. ఇంతలో బాబా అద్భుతం చేశారు! మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను నా కుటుంబసభ్యులతో కలిసి భోజనం ముగించాను. అంతలో ఎవరో తలుపు తట్టడం వినపడింది. నేను తలుపు తెరచి చూస్తే, ఎదురుగా ఒక పాత స్నేహితుడు, తనతోపాటు ఒక పెద్దాయన ఉన్నారు. వేళకానివేళలో నా పాత స్నేహితుడి సందర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. తను ఏమైనా నా వద్దనుండి ఆర్థిక సహాయాన్ని అర్థించడానికి వచ్చాడేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకున్నానంటే, నా జీవితంలో ఎవరూ నాకు డబ్బు ఇవ్వరు, కానీ చాలామంది నా వద్దనుండి తీసుకుంటారు. అది నా జీవిత అనుభవం. అయితే ఇది నా జీవితకాలంలోనే అసాధారణ అనుభవం. ఆ స్నేహితుడు తన వద్ద ఉన్న 20,000 రూపాయలను నా వద్ద ఉంచాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడు. పైగా నాకు వీలున్నప్పుడే నామమాత్రపు వడ్డీతో తిరిగి చెల్లించమని చెప్పాడు. అలా ఎంత మొత్తమైతే నాకు అవసరమో అంతే మొత్తాన్ని చాలా సులువుగా నా ముందుకు తీసుకొచ్చారు బాబా. తరువాత నేను నా స్నేహితుడికి, పెద్దాయనకి ఆహారాన్ని అందించాను. వాళ్లిద్దరూ ఆ ఆహారాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత వెళ్లిపోయారు. సమస్యలు పరిష్కరించుకుని నా చిన్న కర్మాగారాన్ని నా సాయిప్రభువుకే అంకితం చేశాను. నా జీవితంలో జరిగిన ఆ గొప్ప క్షణాన్ని నేను ఎలా మరచిపోగలను? అంతలా కనిపెట్టుకునివుండే నా సాయి నారాయణుడిని ఒక్క క్షణమైనా ఎలా మరచిపోగలను?

-కె. వాసుదేవ్,
బెంగళూరు - 560 058.

(మూలం: శ్రీసాయిలీల పత్రిక, అక్టోబర్ 1983)

సాయిభక్తుల అనుభవమాలిక 208వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి
  2. నిందను చెరిపేసిన సాయి

కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి

ఓం శ్రీ సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహించేవారిలోనూ, ఈ మహత్యాన్ని చదువుతున్నవారిలోనూ మరియు అంతటా వ్యాపించివున్న శ్రీసాయినాథ మహారాజుకు నా సాష్టాంగ ప్రణామాలు. నా పేరు కృష్ణ. నేను మచిలీపట్నం నివాసిని. సాయినాథుడు నాకు పరాత్పర గురువు. ఆయన నా జీవితంలో ఎన్నో మహత్యాలు చూపించారు. ఆయన ప్రసాదించిన ఎన్నో అనుభవాల్లోనుంచి ఈమధ్యకాలంలో జరిగినటువంటి ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

శ్రీ సాయినాథుడు అనుమతించడంతో ఈ సంవత్సరం (2019) బాబా పుణ్యతిథికి శిరిడీ వెళ్లాలని ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. సరిగ్గా నవరాత్రులు మొదలయ్యే ముందురోజు మా అమ్మగారు దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. రోజులు గడుస్తూ పుణ్యతిథి సమీపిస్తున్నా అమ్మకి స్వస్థత చేకూరలేదు. పరిస్థితి అలా ఉన్నప్పటికీ నేను ఆ సాయినాథుడిపై ఉన్న నమ్మకంతో ఎలాగైనా శిరిడీ చేరుకుంటానని ధైర్యంగా ఉన్నాను. కేవలం ఆ సాయినాథుని కృపవలన మాత్రమే నేను ధైర్యంగా ఉన్నానని నాకు తెలుసు. ఎందుకంటే, ఇదివరకు నేను ఇలా ఉండేవాడిని కాదు. అమ్మ ఆరోగ్యం ఏ కాస్త బాగలేకపోయినా ఎంతో భయపడిపోయేవాడిని, ఆందోళనతో బాధపడుతూ ఉండేవాడిని. అలాంటిది సాయినాథుడు నాలో చాలా మార్పు తీసుకొచ్చారు. శిరిడీకి బయలుదేరటానికి ఇంకా ఒకరోజు మిగిలివుంది. మా ఇంట్లో నాతోపాటు అమ్మ, అత్త ఉంటారు. ఇద్దరూ పెద్దవారే. ఇలాంటి సమయంలో వాళ్ళని వదిలి శిరిడీ బయలుదేరాలా, వద్దా అనే మీమాంసలో పడ్డాను. ఆశ్చర్యంగా ఆ రాత్రి అమ్మకు జ్వరం తగ్గి కొద్దిగా స్వస్థత చేకూరింది. మరునాడు అమ్మ లేచికూర్చుని తన పనులు తను చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాక అమ్మ, “నువ్వు ధైర్యంగా శిరిడీ వెళ్లిరా!” అని చెప్పారు. ఇక నేను సంతోషంగా శిరిడీకి బయలుదేరాను. సరిగ్గా శిరిడీ బయలుదేరేరోజుకే అమ్మకి స్వస్థత చేకూరడం కేవలం సాయినాథుని అనుగ్రహమేనని నాకు బాగా తెలుసు. శిరిడీ చేరుకున్న తర్వాత బాబా దర్శనం చాలా బాగా అయింది. అయితే అమ్మకి మరలా కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ అమ్మ చాలా ఉత్సాహంగాను, ధైర్యంగాను నాతో ఫోనులో మాట్లాడుతూ, “నాకు ఏమీ ఫరవాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఆనందంగా బాబాను దర్శించుకో!” అని చెప్పేది. నేను శిరిడీలో ఉన్నా ఆ సాయినాథుడు నా స్నేహితుల రూపంలో అమ్మకు సేవ చేస్తూ, నేను శిరిడీ నుంచి తిరిగి వచ్చేదాకా మా అమ్మని కనిపెట్టుకుని ఉన్నారు. ఏది ఏమైనా నా బాబా దయవల్ల నేను శిరిడీలో ధైర్యంగా ఉంటూ చక్కటి దర్శనం చేసుకున్నాను. నేను శిరిడీ నుంచి తిరిగొచ్చిన వారంరోజుల్లో అమ్మకు సంపూర్ణ స్వస్థత చేకూరింది. తరువాత మెల్లగా అమ్మ, అత్త మరలా సాయినాథుని మందిరానికి వెళ్తూ, బాబా సేవ చేసుకుంటున్నారు. నిజానికి చాలా దారుణంగా ఉన్నటువంటి మా కర్మలను కేవలం చిన్న చిన్న వాటితో సాయినాథుడు పూర్తిగా తీసేస్తున్నారని నాకనిపిస్తుంది. కేవలం ఆయన దయవల్లే అమ్మ, అత్త, నేను సంతోషంగా జీవించగలుగుతున్నామన్నది పరమసత్యం. మా చెల్లెలు కూడా ఆయన దయవల్లే వివాహమై సుఖంగా ఉంటోంది. నా జీవితంలో ప్రతిదీ ఆయన నాకు పెట్టిన భిక్షే. ఈ నెలాఖరుకు నేను, అమ్మ, అత్త కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి రూపంలో ఉన్నటువంటి సాయినాథుని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాము. ఆయన మాకు చక్కటి దర్శనాన్నిచ్చి తిరుమలయాత్రను మా చేత దిగ్విజయంగా పూర్తి చేయిస్తారు.

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు!

నిందను చెరిపేసిన సాయి

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను మహాపారాయణ - 653 రాగిణి సాయి గ్రూపులో ఉన్నాను. మంచైనా, చెడైనా ప్రతి సందర్భంలో నాతో ఉన్నందుకు ముందుగా సాయికి నా ధన్యవాదాలు. "కోటి కోటి ప్రణామాలు దేవా! నేను ఎల్లప్పుడూ మీ దివ్య పాదకమలాల వద్ద ఉండాలని కోరుకుంటున్నాను".

శివరాత్రిరోజు అర్థరాత్రి 11.45కి మా అత్తగారు నాకు ఫోన్ చేసి, "నా ఆభరణాలను పర్సులో పెట్టి గోద్రేజ్ అల్మరాలో చీరల మధ్య ఉంచాను. నేను రెండుసార్లు ఆ చోట వెతికాను. కానీ అవి దొరకలేదు. ఇటీవల నువ్వు వచ్చినప్పుడు నా గోద్రేజ్ అల్మరాను ఉపయోగించుకున్నావు కదా! నువ్వేమైనా ఆ ఆభరణాలను వేరే చోట పెట్టావా?" అని అడిగారు. నేను, "వాటిని చూడను కూడా చూడలేద"ని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. పైగా నేనే వాటిని ఎక్కడో పెట్టానని నేరుగా నన్ను నిందించింది. ఆ విషయాలన్నీ ఆలోచిస్తూ ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను. "బాబా! నేను ఆ ఆభరణాలను చూడలేదని మీకు తెలుసు. నా ఆభరణాలు కూడా మా అత్తగారి వద్దనే ఉన్నాయని కూడా మీకు తెలుసు. దయచేసి నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. ఉదయం లేచాక మళ్ళీ, "బాబా! ఈరోజు సాయంత్రానికల్లా అందరిముందు దోషిలా ఉండకుండా నన్ను మీరే కాపాడాలి" అని ఏడుస్తూ బాబాను ప్రార్థించాను. తరువాత, 'అవును' లేదా 'లేదు' అని బాబా ముందు చీటీలు వేశాను. అందులో 'అవును' అని వచ్చింది. దానితో ఆభరణాలకు సంబంధించి నాకు ఖచ్చితంగా శుభవార్త వస్తుందని ధృవీకరించుకున్నాను. రోజంతా నేను ఏడుస్తూ బాబాను, "నాకు ఎందుకిలా జరిగింది? నేను చూడలేదని చెప్పినా కూడా ఆమె నన్ను ఎందుకిలా దోషిని చేసి మాట్లాడుతుంది?" అని చాలాసార్లు ప్రశ్నించాను. "సానుకూల వార్త వస్తే నా అనుభవాన్ని పంచుకుంటాన"ని నేను బాబాకు వాగ్దానం కూడా చేశాను. చివరికి ఆరోజు సాయంత్రం మా మామగారు నా భర్తకి ఫోన్ చేసి, "పర్సుతో సహా ఆభరణాలన్నీ వేరే చోట దొరికాయి. వాటిని నేనో, మీ అమ్మనో అక్కడికి మార్చి ఉండొచ్చు" అని చెప్పారు. "ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు బాబా. నాకు నోటమాట రావడం లేదు. మీకు అంతా తెలుసు". ఈరోజు బాబా దయ ఆశీర్వాదాల వల్ల మాత్రమే నేను నాపై నింద లేకుండా ఉన్నాను. 

సాయిభక్తుల అనుభవమాలిక 207వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు
  2. ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్ సమస్యను పరిష్కరించిన బాబా

ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు

నా పేరు శ్రీనివాసరావు. గతంలో నా అనుభవాలను, బాబా నాకు చేసిన మేలును ఈ బ్లాగ్ ద్వారా అందరికీ తెలియజేసినందుకు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవాన్ని అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి దీనిని కూడా బ్లాగులో పెట్టి బాబా యొక్క అద్భుత లీలను అందరికీ తెలియజేయవలసినదిగా కోరుకుంటున్నాను.

11.10.2019 వ తేదీ సాయంత్రం నేను మా చిన్నబ్బాయితో కలిసి కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి గ్రౌండుకు వెళ్లాను. చీకటిపడేవరకు డ్రైవింగ్ నేర్చుకున్నాక ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చాము. హఠాత్తుగా మా అబ్బాయి తన ఫోన్ కనబడట్లేదని అన్నాడు. కారులో ఉన్నదేమోనని వెతికాము, కానీ కనబడలేదు. నేను, నా భార్య మా అబ్బాయి ఫోనుకు 5,6 సార్లు కాల్ చేసాము. రింగ్ అవుతోంది, కానీ ఎక్కడా కనపడలేదు. నేను కారు నేర్చుకున్న గ్రౌండ్లో పడిపోయి వుంటుంది, ఇక ఫోన్ దొరకదేమో అని నాకు భయమేసింది. ఎందుకంటే ఆ ఫోను విలువ 12,000 రూపాయలు. వెంటనే నేను, “బాబా! ఎలాగైనా మా అబ్బాయి ఫోన్ మాకు దొరికేలా చేయండి. ఫోన్ దొరికితే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. తరువాత నేను, మా అబ్బాయి కలిసి బైకుపై నేను కారు నేర్చుకున్న గ్రౌండుకు వెళ్ళాము. అప్పటికి మేము ఆ గ్రౌండు వదిలివెళ్ళి 20 నిమిషాలు పైనే అయింది. అక్కడంతా చీకటిగా ఉంది. మీరు నమ్మరు గానీ, మా బైక్ సరిగ్గా ఫోన్ పడిన చోటికి వెళ్లి ఆగింది. అద్భుతమేమిటంటే, ఆ ఫోనుకి 2, 3 అడుగుల దూరంలో ఒకరు అటూ ఇటూ తిరుగుతున్నారు, కొంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు, ఫోన్ స్క్రీన్ పైకి కనపడేలా పడివుంది, అప్పటికే నేను, నా భార్య 5, 6 సార్లు ఫోన్ కూడా చేశాము, ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లైట్ వెలుగుతుంది, ఫోన్ రింగ్ అవుతుంది, కానీ అక్కడున్నవారి దృష్టి మా ఫోనుపై పడకుండా బాబా అద్భుతాన్ని చేసి, మా ఫోన్ మాకు దొరికేలా చేశారు. బాబాను నమ్ముకొని ఆర్తిగా పిలిస్తే బాబా తప్పక పలుకుతారు, మన బాధలు తీరుస్తారు అని చెప్పడానికి ఇది చాలా చిన్న ఉదాహరణ. “బాబా! ఎప్పుడూ మీ చల్లని చూపు మా అందరిపై ఉంచి, మేము మంచి మార్గంలో నడిచేలా ఆశీర్వదించండి”. 

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్ సమస్యను పరిష్కరించిన బాబా

సింగపూర్‌ నుండి సాయిభక్తుడు రాజన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నా పేరు రాజన్. నేను సింగపూరులో ఆటోమేషన్ ఇంజనీరుగా పనిచేస్తున్నాను. ఇటీవల వృత్తిపరంగా బాబా నాకు ఎలా సహాయం చేశారో నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఆటోమేషన్ నెట్‌వర్క్‌లో నాకు కేవలం ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే ఉంది, పైగా రౌటర్‌గా నాకు అనుభవం కూడా తక్కువే. అయితే ఒక బుధవారంనాడు మా కంపెనీ ఆటోమేషన్ నెట్‌వర్క్ రౌటర్‌లో ఏర్పడిన లోపం కారణంగా సర్వర్‌కు కనెక్ట్ చేయబడి ఉన్న ఒక క్రేన్ ఆటోమేటిక్ గా పనిచేయడం మానేసింది. నేను మరొక క్రేన్ రౌటర్ని పెట్టి ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. అన్నిరకాలుగా నేను ప్రయత్నించాను కానీ, సమస్యను పరిష్కరించలేకపోయాను. గురువారం నేను బాబాను ప్రార్థించి మళ్ళీ ప్రయత్నించాను. కానీ పరిస్థితిలో మార్పులేదు. స్పేర్ రౌటర్ మా వద్ద లేనందున స్థానికంగా ఎక్కడైనా దొరుకుతుందేమోనని ప్రయత్నించాము. కానీ, ఎక్కడా స్టాకు లేదు. వేరే కంపెనీ వద్దనుండి తీసుకొచ్చి ప్రయత్నించినప్పటికీ పనిచేయలేదు. మేము రౌటర్ సంబంధిత కథనాలన్నీ చదువుతూ వివిధ పద్ధతులను ప్రయత్నిస్తూ ఉన్నాము.

ఆలోగా నేను సమస్య పరిష్కారం కోసం బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. చివరికి మేము జర్మన్ సరఫరాదారు వద్ద ఆ భాగాన్ని ఆర్డర్ చేశాము. వాళ్ళు వెంటనే ఫ్లైట్ లో ఆ భాగాన్ని పంపించారు. కానీ స్థానిక సరఫరాదారు 'మా కంపెనీ నుండి పూర్తి మొత్తం చెల్లిస్తేగానీ డెలివరీ ఇవ్వన'ని పట్టుబట్టాడు. ఎన్నివిధాల ప్రయత్నిస్తున్నా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉండేది. నేను ఆ సమయమంతా బాబాను ప్రార్థిస్తూ ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. ఆ సమస్య విషయంగా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ తో నామీద చాలా ఒత్తిడి పడుతూ ఉండేది. దానివలన నాకు దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు. ప్రతిక్షణం నా మనస్సు సమస్య గురించే ఆలోచిస్తూ చాలా బాధాకరంగా ఉండేది. కానీ నేను బాబాపై విశ్వాసాన్ని కోల్పోలేదు. నెమ్మదిగా ఆయన నా సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షించదలుచుకున్నారని నేను అర్థంచేసుకుని బాబా మార్గం చూపించేవరకు సహనంతో వేచి ఉండదలచుకున్నాను. అలా ఒక వారం గడిచాక నేను చెడిపోయిన ఆ పాత యూనిట్‌ను మళ్ళీ ఒకసారి ప్రయత్నించాలని అనుకున్నాను. ఇంటివద్ద నేను, "బాబా! ఏదైనా అద్భుతం జరిగేలా చేసి ఇక్కడితో సమస్య పరిష్కారమయ్యేలా చూడండి" అని బాబాను ప్రార్థించి కంపెనీకి బయలుదేరాను. కంపెనీకి చేరుకున్న తరువాత మరోసారి నేను బాబాను ప్రార్థించి నా ప్రయత్నం మొదలుపెట్టాను. బాబా నిజంగానే అద్భుతం చూపారు. అకస్మాత్తుగా ఎర్రర్ లైట్ ఆగిపోయి రౌటర్ మామూలుగా పనిచేసింది. నేను ఆశ్చర్యపోయాను. బాబా సమస్యను పరిష్కరించారు. దాంతో పరిస్థితి అంతా సాధారణస్థితికి వచ్చింది. ఇలాంటి అనుభవాలెన్నో నేను చదివాను, ఇప్పుడు నేనే అనుభవించాను. సమస్యను పరిష్కరించేలోపు బాబా మన కర్మలను తొలగిస్తారని, అంతవరకు మనం ఆ బాధను సహిస్తూ సహనంతో ఉండాలని నేను ఈ అనుభవం ద్వారా గ్రహించాను. అందరికీ బాబా సహాయం చేస్తారు. అందుకు మనకు విశ్వాసం, సహనం అవసరం.
source: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2453.html

అబ్దుల్ బాబా


అబ్దుల్ బాబా 1871వ సంవత్సరంలో ఉత్తర మహారాష్ట్రలోని తపతీనదీ తీరంలో ఉన్న నాందేడులో జన్మించాడు. అతని తండ్రి పేరు సుల్తాన్. చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు అతన్ని నాందేడుకి చెందిన అమీరుద్దీన్ అనే సూఫీ గురువు యొక్క సంరక్షణలో ఉంచారు. 1889లో ఒకరోజు అమీరుద్దీన్‌కి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, రెండు మామిడిపండ్లు ఇచ్చి, వాటిని అబ్దుల్‌ కివ్వమని, అతన్ని శిరిడీ పంపమని ఆదేశించారు. నిద్రలేచేసరికి రెండు మామిడిపండ్లు ప్రక్కన ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. తరువాత ఆయన ఆ మామిడిపండ్లను అబ్దుల్‌ కిచ్చి వెంటనే శిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు వెళ్ళమని చెప్పి పంపించారు. 

అబ్దుల్ తన 19వ ఏట 1889లో మొట్టమొదటిసారి బాబా వద్దకు వచ్చాడు. అప్పటికింకా నానాసాహెబ్ చందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. అతన్ని చూడగానే బాబా 'మేరా కావ్లా ఆలా' అంటే, 'నా కాకి వచ్చింది' అని స్వాగతించారు. అతన్ని పూర్తిగా తమ సేవకు అంకితమవ్వమని బాబా చెప్పారు. అప్పటినుంచి అబ్దుల్ బాబా సేవ చేయడం, శిరిడీ వీధులు చిమ్మి శుభ్రం చేయడం, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు 30 సంవత్సరాలు, బాబా సమాధి చెందాక 36 సంవత్సరాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయనను సేవించుకున్నాడు. అంత సుదీర్ఘకాలం బాబాను అంటిపెట్టుకునివున్న ముస్లిం భక్తుడు ఇతనొక్కడే. తన గురువు పంపగా బాబా సన్నిధికి చేరిన అతడు బాబా సేవలో తరించాడు.

మొదట్లో అతడు మసీదు సమీపంలోనే నివసిస్తూ (కొంతకాలం తర్వాత చావడికి ఎదురుగా ఉండే ఇంటిలోకి మారాడు.) సదా బాబా సేవలో తత్పరుడై ఉండేవాడు. ద్వారకామాయి చుట్టూ ఉండే ఐదు దీపాలను నిరంతరం చమురుతో నింపటం, లెండీబాగ్‌లో బాబా చేత వెలిగించబడిన దీపాన్ని కనిపెట్టుకుని ఉండటం, ద్వారకామాయి, చావడిని ప్రతిరోజూ శుభ్రపరచడం చేసేవాడు. ఇవేకాక బాబా తిరిగే వీధులను తుడిచి, మలాలను ఎత్తి పారవేసేవాడు. ధునిలో కట్టెలు వేసేవాడు. నది నుండి నీటిని తెచ్చి బాబా బట్టలను శుభ్రపరిచేవాడు. ఈవిధంగా అతడు విసుగన్నదే లేకుండా బాబాకు చేసిన సేవ ఎనలేనిది. మొదటిరోజుల్లో బాబా అతనికి ఆహారం ఇచ్చేవారు కాదు. అందువలన అతడు భిక్ష చేసుకుని జీవించేవాడు.

బాబా అతడిని ప్రేమగా, “హలాల్ కుర్” (మా పాకీవాడు) అని పిలిచేవారు. ఆయన సాధనాపరంగా అతనికెన్నో సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని, పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారుకోకూడదని బాబా చెప్పేవారు. ఇంకా, "స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు” అని చెప్పారు. “నేను ఎవరిని?” అనే విచారణ కూడా చేసుకోమని చెప్పారు. బాబా సూచనలను అతడు శ్రద్ధగా పాటిస్తుండేవాడు.

శిరిడీలో రోడ్డు ప్రక్కన లెండీతోపు ఉంది. రోజూ రెండుపూటలా బాబా అందులో ఏకాంతంగా కొంతసేపు గడిపేవారు. అప్పుడప్పుడు అబ్దుల్‌ను తమతోపాటు తీసుకుని వెళ్లేవారు. మిట్టమధ్యాహ్నవేళ అబ్దుల్‌కు తప్ప వేరెవరికీ  లెండీ లోపలికి ప్రవేశం ఉండేది కాదు. 

అబ్దుల్ ఇలా చెప్పాడు: "ఆ తోపులో ఒకచోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండదీపం పెట్టారు బాబా. అది ఆరిపోకుండా పైన ఒక రేకు, చుట్టూ సుమారు 20 తెరలు ఉండేవి. నేనా దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి. సాయి దాని దగ్గర కూర్చునేవారు. ఆయన కూర్చున్న చోటునుంచి ఆ దీపం కనిపించేది కాదు. ఆయన దగ్గర రెండు కుండలతో నీరు పెట్టేవాణ్ణి. ఆయన ఆ నీటిని అన్నివైపులకూ చల్లి, ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు. అప్పుడాయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు".

ఇంకా అబ్దుల్ ఇలా చెప్పాడు: “నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖం ఉంచుకుని కునుకుతీశాను. అప్పుడు సాయి, “చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమి?” అన్నారు. నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్రలో తూగి ఆయనమీద పడ్డాను. ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు. నేను మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో దోసిట్లో నీళ్ళు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను. ఆ దర్శనం ప్రసాదించబోతామని ఆయన ముందుగా చెప్పారు”. "బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. బాబా నన్ను చాలా చెడ్డగా తిట్టేవారు. నన్ను, జోగ్‌ను కొట్టారు కూడా! అదీ ఆశీర్వచనమే!"

ఒకరోజు ఉదయాన్నే బాబా చావడిలో కూర్చుని నాతో, “నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. మట్టిని బంగారంగా మార్చాను. ఎంతో పెద్ద భవనాన్ని కట్టిచ్చాను!” అని నన్ను ఆశీర్వదించి మశీదుకు బయలుదేరారు. (మొదటి రెండు అతని ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. మూడవది అతని భవిష్యత్తును సూచిస్తూ ఉంది. బాబా మహాసమాధి చెందిన తరువాత అతడు బాబా సమాధికి పూజ నిర్వహిస్తూ బూటీవాడాలోని గదిలో నివసించేవాడు.) అప్పుడప్పుడు బాబా, "అబ్దుల్ అంతస్తులు గల భవనంలో నివసిస్తాడు. అతను మహిమాన్విత సమయాన్ని కలిగి ఉంటాడ"ని చెప్పేవారు. అందుకు తగ్గట్టుగానే అబ్దుల్ కొంతకాలం బూటీవాడాలో నివాసమున్నాడు.

అబ్దుల్ మసీదులో బాబా దగ్గర కూర్చుని ఖురాన్ చదివేవాడు. అప్పుడప్పుడు ఆ గ్రంథాన్ని బాబా తమ చేతులలోకి తీసుకుని, తెరచి అతనికిచ్చి ఆ పేజీలోని వాక్యాలను చదవమనేవారు, ఒక్కోసారి ఖురాన్ లోని కొన్ని వాక్యాలు చెప్పేవారు. కొన్ని సందర్భాలలో ఆయన అతనితో ఇస్లాం, సూఫీ గురించి చెప్తుండేవారు. అవి అరబిక్ లోని అనేక ఉల్లేఖనాలతో కూడిన ఇస్లాం, సూఫీ సూత్రాలకు సంబంధించినవి. దీన్నిబట్టి బాబాకు ఇస్లాం, సూఫీ సంప్రదాయాలు బాగా తెలుసునని అర్థమవుతుంది.

మహాత్ముల మాటలు ఎంతో అమూల్యమైనవి అనే భావమున్న అబ్దుల్, బాబా చెప్పిన ప్రతిమాటను పరమ పవిత్రంగా తలచి మరాఠీ లేదా మోడీ లిపిలో ఎంతో శ్రద్ధగా ఒక పుస్తకంలో వ్రాసుకుంటుండేవాడు. అదే అతడికి ఖురాన్. దానిని అతడు అంత పవిత్రమైన గ్రంథంగా భావించి భక్తిపూర్వకంగా చేత జపమాల ధరించి తన్మయత్వంతో చదివేవాడు. బాబా  పెదవులనుండి జాలువారిన పదాలు పొందుపరచబడివున్న ఆ పుస్తకాన్ని బాబా ఉచ్ఛారణల పుస్తకమని పిలిచేవారు. అంతటి అద్భుతమైన బహుమతి అతనికి శ్రీసాయి కృపతో లభించింది. ఆ పుస్తకం ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశం చేస్తుందని అతని పూర్తి విశ్వాసం. ఎవరైనా భవిష్యత్తు గురించి లేదా ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలని అతని వద్దకు వచ్చినప్పుడు అతను ఎంతో భక్తి, శ్రద్ధలతో ఆ గ్రంథం తెరచి సమాధానం చెబుతుండేవాడు. తెరచిన పేజీ నుండి వచ్చిన జవాబు ఆ సందర్భానికి సరిగా సరిపోయేదిగా ఉండి, ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికేది.

అటువంటి రెండు ఉదాహరణలు గమనిద్దాం. బాబా సమాధి చెందిన తరువాత ఒకసారి మందిర ప్రాంగణంలో బావి త్రవ్వారు. అందులో ఉప్పునీరు పడటంతో భక్తులు అబ్దుల్‌ని సంప్రదించారు. అతడు బాబా సమాధానం కోసం తాను వ్రాసుకున్న పుస్తకం తెరవగా అందులో, "ఇంకా లోతుగా త్రవ్వితే మంచినీరు వస్తుంది" అని సమాధానం వచ్చింది. దానిని అనుసరించి మరి రెండు అడుగుల లోతు త్రవ్వగా మంచినీరు పడింది.

మరొక సంఘటన: బారిస్టర్ గాడ్గిల్, 'తన కుమారుడు ఇంగ్లాండ్ నుంచి తిరిగి వస్తాడా? లేక అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంటాడా?' అని తెలుసుకోవాలనుకున్నాడు. ఈ విషయమై అబ్దుల్‌ని సంప్రదించగా, ఆ పుస్తకం ద్వారా "అతను తిరిగి వస్తాడు" అని సమాధానం వచ్చింది. అలాగే అతను తన ఇంగ్లీష్ భార్య, పిల్లలతో తిరిగి వచ్చాడు.

అలా అబ్దుల్ చెప్పిన విషయాలు సత్యమవుతుండటంతో ప్రజలు అతనిని ‘అబ్దుల్ బాబా’ అని పిలవడం మొదలుపెట్టారు. అబ్దుల్ ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, లేదా మరియు సంతానం కలుగుతుందా, లేదా వంటి విషయాలు చెప్పగలిగేవాడు. అతడలా చెప్పినవన్నీ చాలాసార్లు నిజమయ్యాయి. అదంతా బాబా కృపవలనే సంభవమైందని అతడు చెప్పేవాడు.

1997లో మరియాన్నే వారెన్ మరియు వి.బి. ఖేర్ లు అబ్దుల్ బాబా వ్రాసిన బాబా యొక్క ఉచ్ఛారణల పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వారు చేసిన ఆ ప్రయత్నంలో ఇస్లాంధర్మం గురించి, సూఫీయిజం గురించి బాబాకున్న అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నారు.

కొంతకాలం తర్వాత అబ్దుల్ మొదటి గురువు శిరిడీ వచ్చి తనతోపాటు తిరిగి రమ్మని కోరాడు. అందుకు అబ్దుల్, "బాబా అనుమతి లేకుండా నేనేమీ చేయలేన"ని సమాధానమిచ్చాడు. బాబా అనుమతినివ్వకపోవడంతో అతని గురువు శిరిడీ నుండి తిరిగి వెళ్ళిపోయాడు.

అబ్దుల్ భార్య, కొడుకు నాందేడులో ఉండేవారు. అతని కొడుకు అబ్దుల్ పఠాన్ 1901లో జన్మించాడు. ఆ అబ్బాయికి యుక్తవయస్సు రాగానే అబ్దుల్ తల్లి పెళ్లి సంబంధం చూడటం ప్రారంభించింది. ఒక సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని ఒక ఫకీరు కొడుకుకి తన కూతురినిచ్చి వివాహం చేయడం ఇష్టం లేదని చెప్పాడు. దానితో నిరాశకు గురైన ఆమె బాబా వద్దకు వచ్చి మొరపెట్టుకుని, ఆయన సహాయాన్ని అర్థించింది. అప్పుడు బాబా, "చింతించవద్దు, బాలునికి మంచి వధువు దొరుకుతుంది. సరైన సమయంలో అన్నీ సక్రమంగా జరుగుతాయి" అని ఆమెను ఓదార్చారు. కొన్నిరోజుల తరువాత అబ్బాయి, అతని నాన్నమ్మ కొంతమంది స్నేహితులను, బంధువులను కలవడానికి ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్కడొక వ్యక్తి వాళ్ళని కలిసి తన కుమార్తెను ఆ అబ్బాయికిచ్చి వివాహం చేసేందుకు ఆసక్తి కనబరిచాడు. అప్పుడు అబ్బాయి నాన్నమ్మ, "అబ్బాయి తండ్రి ఒక ఫకీరు" అని చెప్పింది. కానీ అతడా విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. పైగా తన పెద్దకూతురి వివాహం కానప్పటికీ, చిన్న కుమార్తెను ఈ అబ్బాయి చేతిలో పెట్టడానికి చాలా ఆసక్తి చూపాడు. బాబా వాక్కు ఫలించి వివాహం ఎంతో ఘనంగా, అందరికీ ఆనందదాయకంగా జరిగింది.

బాబా తమ దేహత్యాగానికి కొంత సమయం ముందు అబ్దుల్‌ను రమ్మని కబురుచేశారు. కానీ అతడు కాసేపు ఆగి వస్తానని చెప్పాడు. ఆ మాట విని బాబా చిరునవ్వు చిందించారు. అతను వచ్చేటప్పటికి బాబా దేహత్యాగం చేసివుండటం చూచి తన దురదృష్టానికి ఎంతగానో దుఃఖించాడు అబ్దుల్. బాబా సమాధి అనంతరం అబ్దుల్ బాబాపట్ల గొప్ప విశ్వాసాన్ని కనబరుస్తూ బాబా ఊదీని ఎంతోమందికి అందిస్తూ ఉండేవాడు. తద్వారా ఎంతోమంది తమ వ్యాధుల నివారణకు, ఇతర కోరికలు సాధించుకోవటానికి అతడు సహాయపడ్డాడు.

బాబా సమాధి చెందాక అబ్దుల్ 1922 వరకు సమాధి మందిరంలో ఎడమవైపున ఉన్న గదిలో ఉంటూ సమాధిమందిరం శుభ్రపరచడం, బాబా సమాధికి అభిషేకం చేసి, వస్త్రములతో మరియు పూలతో అలంకరించి, మహానైవేద్యం పెట్టడం చేసేవాడు. భక్తులు ఇచ్చిన దక్షిణ, బాబాకి సమర్పింపబడిన నైవేద్యంలోని కొంతభాగంతోనే అతడు తన జీవనం సాగించేవాడు. ఇప్పటికీ అతని వంశస్థులు ఉదయాన్నే బాబాకు పూలను సమర్పిస్తున్నారు.

1922లో బాబా పరమభక్తుడు దీక్షిత్ అహ్మద్‌నగర్ జిల్లాకోర్టును ఆశ్రయించి ఒక పబ్లిక్ ట్రస్టుని ఏర్పాటు చేయటానికి అనుమతి పొందాడు. కానీ అబ్దుల్ తనని అభిమానించే కొందరు వ్యక్తుల ప్రేరణతో, 'తాను సాయిబాబాకు చట్టబద్ధమైన వారసుడినని, అందువలన తాను సమాధిమందిర నిర్వహణకు తగిన హక్కు కలిగివున్నాన'ని ట్రస్టు ఏర్పాటును సవాలుచేస్తూ కోర్టును సంప్రదించాడు. అయితే, "సమాధిమందిరం ఒక మఠంగానీ, ఆశ్రమంగానీ కాదని, సాయిబాబాకు వారసులు ఎవరూ లేరని, అలా సాయిబాబాకు తాను వారసుడినని అబ్దుల్ చెప్పుకోవడానికి వీలులేద"ని కోర్టు పేర్కొంది. దాంతో సమాధిమందిర నిర్వహణలో అతనికెటువంటి సంబంధం లేకుండా నిరోధించారు. అంతేగాక, అతనికి రోజూ లభించే ఉచిత ఆహారాన్ని నిలిపివేసి, సమాధిమందిరంలో అతను ఉంటున్న గదిని కూడా ఖాళీ చేయమన్నారు. కొంతకాలం తర్వాత బాబా అనుగ్రహంతో సంస్థాన్ వారు ఆ తీవ్రమైన ఆంక్షలను కొంత సడలించి, సమాధిమందిర నిర్వహణకు అతన్ని అనుమతించారు. అప్పటినుండి 1954 ఏప్రిల్ 2న తాను మరణించేవరకూ సాయిబాబా సమాధిమందిర కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఎంతో భక్తిశ్రద్ధలతో బాబా సేవ చేసుకున్నాడు అబ్దుల్. అలా తన అంతిమక్షణం వరకు తన జీవితాన్ని బాబా సేవకు అంకితమిచ్చిన గొప్పభక్తుడు అబ్దుల్.

బాబా తాము సమాధి చెందాక కూడా అబ్దుల్‌కు రక్షణనిస్తూ వచ్చారు. రాధాకృష్ణమాయి మరణానంతరం ఆమె నివసించిన మట్టిఇంటిలో అబ్దుల్ నివాసముండేవాడు. ఆ ఇల్లు చాలా పురాతనమైంది కావడం వలన శిథిలావస్థలో ఉండేది. సుమారు 1927వ సంవత్సరంలో ఒకసారి అబ్దుల్ ఆ ఇంటిలో కూర్చుని ఖురాన్ చదువుకుంటూ ఉండగా అకస్మాత్తుగా ఇల్లు కూలిపోయింది. శిధిలాలలో అతను దాదాపు కూరుకుపోయాడు. అయితే బాబా దయవల్ల అతను ఏమాత్రం గాయపడలేదు.

1954 ఆగస్టు 16న అతడు మరణించాడు. అతని దేహాన్ని సమాధిమందిర ప్రాంగణంలో ఉన్న లెండీబాగ్ సమీపంలో ఖననం చేసారు. లెండీబాగ్ ప్రవేశద్వారానికి సమీపంలో కుడివైపున ఉన్న అబ్దుల్ బాబా సమాధిని భక్తులు దర్శించవచ్చు. చావడికి ఎదురుగా అతడు నివాసమున్న గృహంలోని ప్రధాన గదిని అబ్దుల్ బాబా స్మారకచిహ్నంగా మార్చి భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఆ కుటీరాన్ని సందర్శించే భక్తులు ఎడమవైపు గోడపై వ్రేలాడుతున్న బాబాయొక్క అసలు ఛాయాచిత్రాలను, బాబా వాడిన చిమ్టాను చూడవచ్చు. ఆ చిమ్టాను బాబా స్వయంగా అతనికి ఇచ్చారు. అబ్దుల్ వాటిని భద్రంగా దాచివుంచి, ప్రతిరోజు ధూపంతో పూజించేవాడు. బాబా మహాసమాధి తరువాత, భక్తుల నొప్పులను, రోగాలను నయం చేసేందుకు అబ్దుల్ ఈ చిమ్టాను ఉపయోగించేవాడు. బాబా అతనికి సటకాను, రేకుడబ్బాను కూడా ఇచ్చారు.



అబ్దుల్ భార్య పేరు ఉమ్రాన్రావు.బి. వీరి కుమారుడు అబ్దుల్ పఠాన్(ఘనీభాయ్). ఇతడు 1901లో జన్మించి, డిసెంబరు 14, 1984న మరణించాడు. అబ్దుల్‌కి ఐదుగురు మనుమళ్ళు - ఇబ్రహీం, అజీజ్, రెహ్మాన్, రహీం మరియు హమీద్; మరియు ఇద్దరు మనుమరాళ్ళు - శంషాద్.బి మరియు ఇర్షద్.బి. ప్రస్తుతం రహీం మరియు హమీద్ మాత్రమే బ్రతికి ఉన్నారు. అబ్దుల్ తరువాత అతని వారసుడు ఘనీభాయ్‌కి రోజూ ఉదయం 10 గంటలకి బాబా సమాధిని శుభ్రపరిచి, పువ్వులతో అలంకరించే గౌరవం దక్కింది. అబ్దుల్ మనుమడైన హమీద్ ఈనాడు కూడా అతని యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.

Source: Life of Sai Baba by Late Shri.B.V.Narasimha Swamiji and www.saiparichai.com)
(http://bonjanrao.blogspot.in/2012/09/abdul-baba.html

సాయిభక్తుల అనుభవమాలిక 206వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • ప్రభుత్వ ఉద్యోగిగా చేయడంలో వివిధ దశలలో బాబా చూపిన అనుగ్రహం

సాయిసోదరి మౌనిక తనకు బాబా ఇటీవల ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరామ్! ముందుగా, "బాబా! మీకు నా కృతజ్ఞతలు. మీ దయవల్లనే నవగురువార వ్రతం పూర్తయి, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. థాంక్యూ సో మచ్ బాబా! మీ బిడ్డలమైన మా అందరికీ సదా మీ ఆశీస్సులు అందజేయండి". 

నా పేరు మౌనిక. నేను నెల్లూరు నివాసిని. నేను ఒక కాలేజీలో పని చేస్తున్నాను. గతంలో నేను ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. సాయినాథుని దయతో నేనిప్పుడు ప్రభుత్వ ఉద్యోగిని అయ్యాను. పరీక్షకు దరఖాస్తు చేయడం మొదలుకుని ట్రైనింగ్ వరకు బాబా నాకు తోడుగా ఉండి నన్ను నడిపిన విధానాన్ని నేనిప్పుడు సాయిబంధువులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నేను ప్రతిక్షణం బాబా ప్రేమను, ఆశీస్సులను అనుభూతి చెందాను. ఆ ప్రేమను మీకు కూడా పంచాలని అనుకుంటున్నాను. 

1. నేను 2019, జూన్ 20న నవగురువార వ్రతం మొదలుపెట్టాను. జులై నెల చివరిలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. దానికి దరఖాస్తు చేయాలన్న ఆసక్తి నాకస్సలు లేదు. నేను దరఖాస్తు చేయనని మా HOD(హెడ్ అఫ్ ది డిపార్ట్‌మెంట్) సార్ కి చెప్పాను. కానీ సార్ ఒప్పుకోలేదు. అందువలన నేను ఆలోచనలో పడ్డాను. ఏ విషయంలో అయినా నేను బాబాని ప్రార్థించినప్పుడు ఈ సార్ ద్వారానే బాబా నాకు పరిష్కారాలు చూపిస్తూ ఉంటారు. అది నా గట్టి నమ్మకం. ఎందుకంటే, అది చాలాసార్లు ఋజువైంది. దరఖాస్తు చేయమని మా సార్, మా బ్రదర్ పలుమార్లు చెప్పడంతో కాదనడానికి వేరే కారణం లేక దరఖాస్తు చేయడానికి ఒప్పుకుని నాకు ఇష్టమైన పోస్టుకి దరఖాస్తు చేసుకుందామనుకున్నాను. కానీ నేను ఏదైతే పోస్టుకి దరఖాస్తు చేయాలనుకున్నానో దానికి నేను అర్హురాలిని కాదని తెలిసింది. ఇక ఇష్టంలేకపోయినా వేరే పోస్టుకి దరఖాస్తు చేశాను. అదంతా బాబా లీల. నేను కోరుకున్న పోస్టు నాకు సరైనదికాదని సర్వజ్ఞుడైన బాబాకి తెలిసి ఇలా నాకు వేరే మంచి అవకాశాన్నిచ్చారు.

2. తరువాత పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న సమయంలో నాపై పని ఒత్తిడి చాలా పడింది. దానితో నేను సరిగ్గా పరీక్షకు సన్నద్ధం కాలేకపోయాను. అయినప్పటికీ ఎందుకో తెలీదుగానీ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలినయ్యేలా బాబా చేయిస్తారని చాలా దృఢంగా అనిపించింది. పరీక్ష రెండురోజుల్లో వున్నదనగా నేను చేస్తున్న నవగురువార వ్రతం పూర్తయింది. బాబా దయవలన నేను పరీక్ష బాగానే వ్రాశాను. కాదు, బాబానే వ్రాయించారని చెప్పాలి.

3. తరువాత పరీక్షకు సంబంధించిన ఒక 'కీ' విడుదల చేశారు. నాకు ఎన్ని మార్కులు వస్తాయో అని పరిశీలించుకుంటే కటాఫ్ మార్కుకి కేవలం '0.1' మార్కు తక్కువగా వస్తుంది. అప్పుడు నేను, "బాబా! ఇన్ని మార్కులు ఇచ్చారు, కేవలం 0.1 మార్కుతో నేను అనర్హురాలిని కాకూడదు. దయచేసి OMR షీటులో ఒక్క సమాధానం మార్పు చెయ్యొచ్చు కదా! మీకు వీలుకానిది ఏమీ లేదు కదా!" అని కొంచెం పిచ్చిగానే అడిగాను. తరువాత ఫైనల్ 'కీ' విడుదలైంది. అద్భుతం! నిజంగానే బాబా ఒక ప్రశ్నకు నేను పెట్టిన సమాధానాన్ని మార్పు చేశారు. అది చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. నేను ఏదో మాములుగా అడిగినా బాబా నాకోసం సమాధానాన్ని మార్పు చేశారు. తీరా ఫలితాలు వచ్చేసరికి మొత్తం 4 మార్కులు అధికంగా వచ్చేలా చేసి నన్ను కటాఫ్ దాటేలా సాయి ఆశీర్వదించారు. నిజానికి నేను జనరల్ కేటగిరీ కాబట్టి కటాఫ్ మార్కు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకేనేమో నాకు ఉద్యోగం రావడానికి ఎంత అవసరమో అంత అనుగ్రహించారు.

4. నేను దరఖాస్తు చేసింది నాలుగు పోస్టులకి. కానీ వాటన్నిటికీ అదొక్కటే పరీక్ష. ఆ నాలుగు పోస్టుల్లో నేను ఏదో ఒక్కదానికే ఎంపిక కాగలను. నాకు వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టు వస్తే బాగుంటుందని నేను ఆశపడ్డాను. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ నాకు ఆ పోస్టురావటం కష్టం అన్నారు. అందుకు సంబంధించిన ఫలితాలు ఒక శుక్రవారం ఉదయం విడుదల చేస్తారనగా ఆ ముందురోజురాత్రి, అంటే గురువారం రాత్రి నేను, "బాబా!  దయచేసి నేను వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుకి ఎంపికయ్యేలా చేయండి. మీకు ఇది అసాధ్యం కాదు" అని బాబాని వేడుకున్నాను. ఆశ్చర్యం! ఉదయం వెలువడిన ఫలితాలు చూస్తే, బాబా దయవలన నేను కోరుకున్నట్లుగానే వెల్ఫేర్&ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టుకి ఎంపికయ్యాను. "థాంక్యూ సో మచ్ బాబా!"

5. తరువాత దశలో నేను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి హాజరు కావాలి. అక్కడికి వెళ్ళడానికి ముందు నేను సర్టిఫికెట్స్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసి, తిరిగి వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా చేయడం వలన నా హాల్‌టికెట్ నెంబర్ ఆ సర్టిఫికెట్స్ మీద ప్రింటయి వస్తుంది. ఆ అప్లోడ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ హాల్‌టికెట్ నెంబర్ ప్రింట్ అవుతుందనే విషయం నాకు తెలియక నేను కాలేజీలోనే అప్లోడ్ చేయించేశాను. అప్పటికీ మా HOD సార్, "ఇంటర్నెట్ సెంటరులో చేయించు" అని అన్నారు. నేను వినిపించుకోకుండా అప్లోడ్ చేసి, మళ్ళీ డౌన్లోడ్ చేస్తుంటే హాల్‌టికెట్ నెంబర్ పూర్తిగా రావడం లేదు. అయినా కూడా నేను ఏం కాదులే అని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. హఠాత్తుగా నెట్‌వర్క్ డిస్కనెక్ట్ అయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా మళ్ళీ కనెక్ట్ కాలేదు. అందరూ అనుకోవచ్చు, నెట్‌వర్క్ డిస్కనెక్ట్ అవటం మాములు విషయమే అని. కానీ కాలేజీలో డిస్కనెక్ట్ అవటం సాధారణంగా జరగదు. ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక అప్లోడింగ్, పేమెంట్స్ చేస్తుంటారు. ఒక్కరోజు ఆలస్యమైనా చాలా సమస్య ఎదుర్కోవలసివుంటుంది. కాబట్టి నెట్‌వర్క్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఈసారి ఎంత ప్రయత్నించినా, చివరికి నెట్‌వర్క్ సంబంధిత నిపుణులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. ఇక చేసేదిలేక ఇంటర్నెట్ సెంటరుకి వెళ్ళాను. అప్పుడు తెలిసింది, నేను అప్లోడ్ చేసిన పద్ధతి సరైంది కాదని. మళ్ళీ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి చూసుకుంటే హాల్‌టికెట్ నెంబర్ సరిగా ప్రింట్ అయింది. నెట్‌వర్క్ డిస్కనెక్ట్ కాకపోతే నేను హాల్‌టికెట్ నెంబర్ ప్రింట్ అవని సర్టిఫికెట్లనే వెరిఫికేషన్‌కి తీసుకెళ్ళేదాన్ని. అప్పుడు నేను ఖచ్చితంగా తిరస్కరింపబడేదాన్ని. బాబానే సమయానికి పరిస్థితులను నియంత్రిస్తూ నేను ఏ ఇబ్బందీ ఎదుర్కోకుండా చేశారు. "థాంక్యూ సాయీ!"

6. ఇప్పుడు నేను చెప్పబోయేది జీవితంలో నేనెప్పుడూ మర్చిపోలేని సంఘటన. నేను సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కి వెళ్ళాను. తీరా అక్కడకి వెళ్ళాక ఇంకా ఇతర సర్టిఫికెట్లు కూడా జతపరచాలని అన్నారు. సమయానికి నా దగ్గర జిరాక్సులు కూడా లేకపోవడంతో నాకు ఏమి చేయాలో తోచలేదు. హెల్ప్ డెస్క్ వాళ్ళని అడిగితే, "జిరాక్స్ మీరే ఏర్పాటు చేసుకోండి, మాకు ఏ సంబంధం లేదు" అన్నారు. ఒక్కదాన్నే బయటకి వెళ్లి జిరాక్స్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలియలేదు. దిక్కుతోచక ఆలోచిస్తూ ఉన్నాను. హఠాత్తుగా నాకు తెలియని ఒక వ్యక్తి నేను ఉన్నచోటుకి వచ్చి, "ఇక్కడ ఎవరో జిరాక్స్ గురించి అడిగారు, ఎవరది?" అని అడుగుతున్నారు. 'నేనే' అని చెప్పాను. అతను వెంటనే తన మొబైల్‌లో నా సర్టిఫికెట్లు ఫోటో తీసుకుని అఫీషియల్ మెయిల్ కి పంపించి, తరువాత ప్రింట్ తీసి ఇచ్చారు. నేను 'ఇతను ఎంతో మంచి వ్యక్తిలా ఉన్నారు' అనుకుంటూ ఒక వైపుకు చూస్తే చాలా పెద్ద బాబా ఫోటో మరియు వెంకయ్యస్వామి ఫోటో ఉన్నాయి. నేను, "బాబా! మీరెప్పుడూ నాతోనే ఉన్నారు. థాంక్యూ బాబా!" అని అనుకుని నాకు సహాయం చేసిన వ్యక్తి వైపు చూశాను. అతను రెండుసార్లు అటు ఇటు తిరిగి, ఎవరినీ ఏమీ అడగకుండా ఒక ప్రక్కనుంచి వెళ్లిపోయారు. ఆ రూపంలో వచ్చింది బాబానే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, అతనెవరో నాకు తెలియదు, నేను అతనిని సహాయం అడగలేదు, మరి నాకు జిరాక్స్ కావాలని అతనికెలా తెలుసు? ఒకవేళ హెల్ప్ డెస్కుకి సంబంధించిన వ్యక్తి అనుకుందామంటే, అందరికీ సహాయం చేయాలి కదా?! అతను ఎవరినీ ఏమీ అడగలేదు, కేవలం నాకు మాత్రమే సహాయం చేసి వెళ్లిపోయారు. "థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా!"

7. ఇక పోస్టింగ్ ఎక్కడ ఇస్తారన్న విషయంలో నేను ఒక చోటు అనుకుని, దాదాపు అక్కడే నాకు పోస్టింగ్ వస్తుందని ఊహించాను. కానీ అనుకోకుండా నా ముందున్న వాళ్ళకి ఆ చోట పోస్టింగ్ ఇచ్చారు. మా HOD సార్ కి కాల్ చేసి, "ఇప్పుడేమి చేయాలి?" అని అడిగి మిగిలివున్న ఊర్ల పేర్లు చెప్తుంటే, వాళ్ళ సొంత ఊరు కూడా అందులో ఉండటంతో దాన్ని ఎంపిక చేసుకోమని చెప్పారు. చివరినిమిషం వరకు ఎవరూ ఊహించలేదు, మా సార్ వాళ్ళ ఊరికే నేను పోస్టింగ్ అవుతానని. అసలు నాకు అప్పటివరకు మా సార్ సొంత ఊరు అది అని కూడా తెలియదు. అందుకే మేమంతా ఇప్పటికీ ఆ విషయంలో ఆశ్చర్యపోతుంటాము. ఒక విషయం చెప్పాలి - ఆరోజు ఉదయం నేను, "బాబా! నన్ను మీ సంరక్షణలో ఉంచుకోండి. అది నాకు తెలిసేలా చేయండి" అని బాబాను ప్రార్థించాను. మొదట్లోనే చెప్పాను కదా, నాకు బాబా నుంచి వచ్చే సమాధానాలు మా HOD సార్ ద్వారా వస్తాయని. బాబా మా సార్ ఊరిలోనే పోస్టింగ్ ఇచ్చి నన్ను ఆయన సంరక్షణలోనే ఉంచానని తెలియజేశారు. "థాంక్యూ సో మచ్ సాయీ! దయచేసి ఎప్పుడూ నా చేయి విడువకండి".

8. నేను ట్రైనింగులో ఉన్నప్పుడు అంటే 2019, అక్టోబర్ 16న నేనొక ప్రెజెంటేషన్(ఒక విషయంపై వివరణ) ఇచ్చాను. అది ఇవ్వడానికి ముందు భయంతో నేను, "బాబా! నాకంతా క్రొత్తగా ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆయన కృపతో వీలైనంతవరకు బాగా ప్రెజెంట్ చేయగలిగాను. తరువాత రోజు మా టీం మెంబర్ ఒకరు, "నువ్వు చాలా బాగా ప్రెజెంట్ చేశావు" అని చెప్పారు. "థాంక్యూ సో మచ్ బాబా!".

మొన్న సోమవారంనాడు(2019, అక్టోబర్ 21) నేను క్రొత్త ఉద్యోగంలో చేరాను. ఈ ఉద్యోగ విషయంలో ఇంకా ఎన్నో అనుభవాలిచ్చారు సాయి. ఎక్కువవుతుందని కొన్ని వదిలేశాను. "క్షమించండి సాయీ! దయచేసి ఎప్పుడూ ఇలానే నాకు సహాయం చేస్తూ, అంతా ప్రశాంతంగా సాగేలా చూడండి. సాయీ! మీరు మాకు చేస్తున్న సహాయానికి, మాపై కురిపిస్తున్న ప్రేమకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మీ వల్లనే అమ్మానాన్నకి ఒక గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మీరు లేకుండా నేను లేను బాబా. మీ ప్రేమతోనే నేను జీవించగలను".

సాయిభక్తుల అనుభవమాలిక 205వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!
  2. ఉద్యోగంలో బాబా సహాయం

బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!

నా పేరు తులసీరావు. మాది అనంతపురం. ఈరోజు, “బాబా అనుగ్రహం ఉంటే, అన్ని గ్రహాలూ అనుకూలిస్తాయి” అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ బ్లాగును నాకు పరిచయం చేసిన జ్యోతి అక్కకు మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. 

మా అమ్మాయి విషయంలో బాబా చేసిన అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మాయి బి.ఇ. ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆఖరి సంవత్సరంలో కాలేజీలో క్యాంపస్ నియామకాలు జరుగుతాయి కదా! అలానే మా అమ్మాయి చదువుతున్న కాలేజీలో కూడా మే, 2019 నుండి క్యాంపస్ నియామకాలు మొదలయ్యాయి. తను ఎంత ప్రయత్నించినా ఏ కంపెనీలోనూ ఎంపిక కాలేదు. రోజులు గడిచేకొద్దీ తను మానసికంగా బాగా కృంగిపోయింది. నేను మాత్రం మా అమ్మాయితో, “మనకు సమయం వచ్చేవరకు ధైర్యంగా ఉండాలి. ఇలా నిరుత్సాహపడిపోతే ఎలా?” అని ఓదారుస్తుండేదానిని. కానీ తను మాత్రం నా మాటలు వినిపించుకోకుండా, "నా జాతకంలో అసలు ఉద్యోగయోగం ఉందా? ఉంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో పంతుల్ని కనుక్కో!” అని అన్నది. నాకు అవసరం లేదని అనిపిస్తున్నా, తనను నిరాశపరచడం ఇష్టంలేక ఇద్దరు, ముగ్గురు జ్యోతిష్కుల దగ్గర తన జాతకం చూపిస్తే, వాళ్ళు ఆమెకు నవంబరు లేదా డిసెంబరులో ఉద్యోగయోగం ఉందని చెప్పారు. నాకు మాత్రం ఎందుకో తనకు సెప్టెంబరులోనే ఉద్యోగం వస్తుందని దృఢంగా అనిపించింది. నేను, “బాబా! మా అమ్మాయి పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. తను త్వరగా మంచి ఉద్యోగంలో ఎంపిక అయ్యేలాగా అనుగ్రహించండి బాబా! తనకు ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో అందరితో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో మా అమ్మాయి సెప్టెంబర్ 10, 2019 ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యింది. మా అమ్మాయికి ఉద్యోగాన్ని ప్రసాదించటం ద్వారా, తమ అనుగ్రహం ఉంటే ఏ గ్రహాలూ ఏమీ చేయలేవు అని శ్రీసాయిబాబా మరొకసారి నిరూపించారు. 

త్వరలో మరో అనుభవంతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ... 
జై సాయిరామ్!!!!

ఉద్యోగంలో బాబా సహాయం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

40 సంవత్సరాల వయసున్న నేను 20 సంవత్సరాలకు పైగా బాబా భక్తురాలిని. నేనొక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్ రంగంలో సుమారు 17 సంవత్సరాల అనుభవం ఉంది. నేను చాలా టీమ్స్ కు లీడ్ గా వ్యవహరిస్తూ మంచి నెట్‌వర్క్ కలిగి ఉన్నాను. ఇక నా అనుభవానికి వస్తే...

పదినెలల క్రితం నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టమని బాబా నాకు సూచనలిచ్చారు. కానీ సంస్థలో మేనేజరు వైపునుండి నాకు మంచి సహకారం ఉండటం వలన, అక్కడి వాతావరణం కూడా నాకు అనుకూలంగా ఉండటం వలన నేను ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయితే, ఆరునెలలపాటు బాబా నుండి నాకు అలాగే సూచనలు వస్తూ ఉండేవి. నాకేమీ అర్థమయ్యేది కాదు. అయితే కాలం గడుస్తున్నకొద్దీ మా మేనేజరు, నా తోటివారిలో ఒకరు కలిసి ఇతరుల వృత్తిజీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సరైన కారణం లేకుండా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నారని నాకు తెలిసింది. ఆ విషయాలు తెలిసి అటువంటి అనైతిక వ్యక్తుల మధ్య ఉండటాన్ని నేను సహించలేకపోయాను. బహుశా అందువలనే ఉద్యోగం వదిలిపెట్టమని బాబా నాకు సూచిస్తున్నారని అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను, "ఇప్పుడేమి చేయమంటారో చెప్పండి బాబా" అని సాయిని ప్రార్థించాను. ఆయన నుండి చాలా స్పష్టంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టమని సూచనలు వచ్చాయి. వెంటనే నేను బాబా సూచనలు అనుసరించి ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నా చేతిలో వేరే ఉద్యోగం లేదు. ఇద్దరు పిల్లలతో నా పరిస్థితి చాలా కఠినంగా మారుతుందని తెలిసినా బాబానే నమ్ముకున్నాను. బాబా కూడా ఎప్పుడూ నా చేతిని విడిచిపెట్టలేదు. నా నోటీసు వ్యవధి పూర్తయ్యేలోపు ఆయన నాకు మంచి జీతంతో ఉద్యోగాన్నిచ్చి సహాయం చేశారు. నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తోటిభక్తులకు చెప్పమని బాబా నాకు సూచించారు. అందరినీ ఆశీర్వదించి, వారికి మార్గనిర్దేశం చేస్తూ, సదా వారికి అండగా ఉండాలని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తున్నాను. 

శ్రీ బల్వంత్ హరికార్నిక్


సాయిభక్తుడు శ్రీ బల్వంత్ హరికార్నిక్ బొంబాయిలో (ఘోడ్ బందర్ రోడ్డు, బాంద్రా) నివాసముండేవాడు. అతను కస్టమ్స్ శాఖలో పనిచేసేవాడు. అతడు 1936 సెప్టెంబర్ 19న, శ్రీసాయిబాబాతో తనకున్న అనుభవాలను దివంగత శ్రీ బి.వి.నరసింహ స్వామిగారితో ఈక్రింది విధంగా వివరించాడు.

నేను సాయిభక్తుడిని. ప్రతిరోజూ నేను ఇంట్లో సాయిబాబాను ఆరాధిస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం క్రమంతప్పకుండా నేను శిరిడీ సందర్శిస్తుండేవాడిని. దాసగణు మహారాజ్ కీర్తనలను వినటం ద్వారా  సాయిబాబాపట్ల నాకు భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. నేను 1911వ సంవత్సరంలో మొదటిసారి శిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్నాను. ఆయన శక్తివంతమైన కళ్ళు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి, ఆయనపై నాకున్న విశ్వాసాన్ని ఎన్నోరెట్లు అధికం చేశాయి. నేను ఆయనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రతి సంవత్సరం వారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాను. 

బాబా నావద్దనుండి రూ.10/- దక్షిణ తీసుకున్నారు. దాంతో నావద్ద తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకుండా పోయాయి. కానీ అదే సమయంలో నా స్నేహితుడు మిస్టర్ ఠోసర్ (వాయ్ కి చెందిన సన్యాసి  నారాయణాశ్రమ్) కలిసి నాకు కావలసినంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. నేను శిరిడీ నుండి తిరిగి వచ్చిన తరువాత నా తల్లిదండ్రులు కూడా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు. అప్పటినుండి మేమంతా నిత్యం ఇంటిలో సాయిబాబాను పూజించడం మొదలుపెట్టాము.

సాయిబాబాతో నాకు ప్రత్యేకమైన అనుభవాలు ఏమీలేవు. నేను ఏదీ ఆశించి బాబా దర్శనం కోసం వెళ్ళేవాడిని కాదు. కానీ, 1918వ సంవత్సరం, గురుపూర్ణిమనాడు మాత్రం ప్రత్యేకంగా నా ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి బాబాని అడగాలని అనుకున్నాను. కానీ, ఆరోజు బాబా చాలా కోపంగా ఉన్నందువల్ల నేను అసంతృప్తితో వెనుదిరిగాను. బయటకు వచ్చి నేను టాంగా ఎక్కబోతుండగా నానావళి నా వద్దకు వచ్చి, నన్ను కౌగిలించుకుని, "అల్లాహ్ తేరా అచ్చా కరేగా" (భగవంతుడు నీకు మేలు చేస్తాడు) అని అన్నాడు.

నా భార్య సాయిబాబాను దర్శించిన తరువాత ఆయనపట్ల ప్రత్యేకమైన భక్తి ఏర్పరుచుకుంది. 1928వ సంవత్సరంలో ఆమె మరణించింది. ఆమె మరణించడానికి ముందు ప్రసవానంతరం వచ్చే సమస్యలతో 9 నెలలపాటు బాధపడింది. ఆమె తన చివరి 6, 7 రోజులు పూర్తి అపస్మారక స్థితిలో ఉంది. అప్పుడు నేను సాయిబాబా ఫోటో ఆమె ముందు ఉంచాను. చివరి ఘడియల్లో ఆమెకు స్పృహ వచ్చి, తన రెండుచేతులు జోడించి, ముందు సాయిబాబాకు తరువాత నాకు నమస్కరించింది. తరువాత తన పెద్దకొడుకును దగ్గరకు పిలిచి, చిన్నవారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ప్రశాంతంగా కన్నుమూసింది. ఆవిధంగా బాబా ఆమెను ఆశీర్వదించి సద్గతి ప్రసాదించారు.

ఒకసారి, నేను, నా భార్య పండరీపురం, అక్కడికి సమీపంలో ఉన్న ఇతర పవిత్రక్షేత్రాలను సందర్శించాలనుకుని, రూ.100/- లు తీసుకుని ప్రయాణమయ్యాము. ఆ ప్రదేశాలకు వెళ్ళేముందు మేము శిరిడీ వెళ్ళాము. అక్కడ మేము రెండురోజులు ఉన్నాము. ఆ రెండు రోజుల్లో సాయిబాబా మావద్దనుండి రూ.100/- లను దక్షిణగా తీసుకున్నారు. అందువల్ల ఇతర ప్రదేశాలను దర్శించుకోవాలనుకున్న మా ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఆవిధంగా పండరీపురం మరియు ఇతర క్షేత్రాలన్నీ శిరిడీలోనే ఉన్నాయని బాబా మాకు తెలియజేయాలనుకున్నట్లుగా నేను గుర్తించాను. "సకల తీర్థాలు సద్గురు(మహాత్ముల) చరణాలలో ఉంటాయ"ని గ్రంథాలన్నీ చెపుతాయి. బాబా మావద్ద ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకున్న తరువాత శిరిడీ విడిచివెళ్ళడానికి మాకు అనుమతి ఇచ్చారు. అప్పుడు నేను శిరిడీలో ఉన్న నా స్నేహితులతో నావద్దనున్న ధనమంతా అయిపోయినందున నేను ఇంటికి తిరిగి వెళ్ళలేనని చెప్పాను. వాళ్ళు నాతో, "బాబా అనుమతించిన తరువాత శిరిడీలో ఉండటం తప్ప"ని చెప్పారు. అకస్మాత్తుగా మిస్టర్ ఠోసర్ శిరిడీ వచ్చాడు. అతను నాకు కావలసినంత డబ్భు ఒకతని వద్దనుండి అప్పుగా ఇప్పించాడు.

బాబా ఫకీర్లకు, పేదవారికి అన్నం పెట్టి ఆదరిస్తుండేవారు. అందువలన నేను బాబాకు సమర్పించిన దక్షిణ గొప్ప దానంతో సమానమని నా అభిప్రాయం. నేను సాయిబాబాను ఆశ్రయించిన తరువాత నాకు భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించిన సూచనలు ముందుగానే అందేవి. వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన ధైర్యాన్ని కూడా బాబా ద్వారా పొందుతున్నాను.

సమాప్తం.

Source: Devotees' Experiences of Sri Sai Baba Part III by Sri.B.V.Narasimha Swamiji

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo