సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 211వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు
  2. మనల్ని రక్షించడానికి సాయి ఎల్లప్పుడూ ఉన్నారు

బాబా నా జీవితంలోకి ప్రవేశించిన తీరు

నా పేరు సాంబశివరావు. నేను పుట్టింది ఒక చిన్న పల్లెటూరిలో. మా కుటుంబ జీవనాధారం కూలీపనులు. మా అమ్మా వాళ్ళు కూలీపనులకు వెళ్తూ, నాకు పెద్దమ్మ వరుసయ్యే మా బంధువుల ఇంట్లో నన్ను ఉంచి వెళ్ళేవారు. పెద్దమ్మకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అయినా ఆమె నన్ను సొంతబిడ్డలా చూసుకునేది. అందరూ నన్ను ఆమె దత్తపుత్రుడు అనేవాళ్ళు. అంత ఆప్యాయంగా ఆమె నన్ను చూసుకునేది. వాళ్లకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఒకసారి ఆమె పెద్దక్క వాళ్ళు శిరిడీ వెళ్ళారు. వాళ్ళు గోదావరిలో స్నానం చేసి, తరువాత బాబా దర్శనానికి వెళ్లారు. బాబా చక్కటి దర్శనాలు ఇచ్చారు. తరువాత వాళ్ళు తిరుగు ప్రయాణంలో వీళ్ళ ఇంటికి వచ్చి, శిరిడీలో వారికి జరిగిన అనుభవాలను మాతో పంచుకున్నారు. తరువాత ఒకరోజు వాళ్ళు చెప్పిన సంఘటనలను మేము టీవీలో చూసాము. వాళ్ళు గోదావరిలో స్నానం చేయడం, తరువాత దర్శనానికి వెళ్లడం, సమాధిమందిరంలో చేసిన పూజ అన్నీ దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. ఎందుకో తెలియదుగాని అవి చూస్తున్న సమయాన నేను నా మనసులో, "బాబాయే నా ఇష్టదైవం" అని అనుకున్నాను. 

ఆ తరువాత ఒకసారి ఎర్రమట్టితో దేవుని ప్రతిమలు చేసి అమ్ముకునేవాళ్ళు మా ఊరికి వచ్చారు. మా పెద్దమ్మ రెండు బాబా ప్రతిమలు చేయమని వాళ్లకు డబ్బులు ఇచ్చింది. వాళ్ళు ఆ సాయంత్రం ఊరు విడిచి వెళ్లిపోతున్నారని పెద్దమ్మకి తెలిసి ప్రొద్దున బడికి వెళ్ళబోతున్న నన్ను ఆపి, విషయం చెప్పి, ఆ బాబా ప్రతిమలు తీసుకుని రమ్మని పంపింది. బడికి సమయమైపోతుందని హడావుడిలో నేను పరుగెత్తుకుంటూ వెళ్లి, ఆ ప్రతిమలను తీసుకుని, వాటిని నా గుండెలకు హత్తుకుని మళ్ళీ పరుగుతీసుకుంటూ ఇంటికి వచ్చాను. బాబా నా గుండెలో గూడు కట్టుకుంటారన్న సంగతి నాకు ఆ సమయంలో తెలియదు.

మరో సంఘటన ద్వారా అసలు బాబా లీల ఆవిష్కృతం అయింది. బహుశా నాకప్పుడు 6 లేదా 7 ఏళ్ల వయసు ఉంటుందనుకుంటాను. టీవీలు అప్పుడప్పుడే పల్లెటూర్లలో ప్రవేశిస్తున్నాయి. ఆ సమయంలో తెలిసిన వాళ్ళింటి టీవీలో బాబాపై తెలుగులో మొట్టమొదట తీసిన అద్భుతమైన సినిమా 'శిరిడీ సాయిబాబా మహత్యం' ప్రసారమైంది. ఆ సినిమా చూస్తూ నేను ఎంత తాదాత్మ్యం చెందానో, ఎంత పరవశించిపోయానో నాకే తెలియదు. నాలో కలిగిన ఆ పారవశ్యపు అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఆ సంఘటన గుర్తుచేసుకున్న ప్రతిసారీ 'నాకేనా అలా జరిగింది!' అని అనుకుంటూ ఉంటాను. విజయచందర్‌గారు బాబా పాత్రలో ఒదిగిపోయారు. అతను మాట్లాడుతుంటే నిజంగా బాబా నోటినుండి వచ్చిన అమృతవాక్కులుగా అనిపించేవి. సాక్షాత్తూ బాబాయే మాట్లాడుతున్న అనుభూతి కలిగింది. అతని నడక చూస్తుంటే నిజంగా బాబా ఇలానే నడిచేవారేమో అని అనిపించింది. నానావలి గాడిదను తీసుకునివచ్చి డబ్బులు కావాలని అడిగే సంఘటనయితే నన్ను బాగా కదిలించేసింది. అదేకాదు, అన్ని సంఘటనలు అద్భుతంగా హృదయానికి హత్తుకునేలా చేశారు. ప్రతి పాత్రధారుడూ ఆయా పాత్రలలో బాగా ఒదిగిపోయి చేశారని చెప్పాలి. ఆరోజు నేను నిర్ణయించుకున్నాను, బాబాను తుచ్ఛమైన కోర్కెలు కోరుకోకూడదని. ఆరోజునుండి ఇప్పటివరకు నేను తుచ్ఛమైన కోరికలేవీ బాబాని కోరలేదు. ఇంకా ఎన్నో అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజుకి ఇంతే. 'బాబావారు నాకు ప్రసాదించిన మొట్టమొదటి అనుభవం'తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.

సర్వం శ్రీసాయినాథ పాదారవిందార్పణమస్తు!

మనల్ని రక్షించడానికి సాయి ఎల్లప్పుడూ ఉన్నారు

నేను యు.ఎస్.ఏ.లో నివాసముంటున్న ఒక సాయిభక్తురాలిని. నా సోదరుడు యు.ఎస్.ఏ.లో డాక్టరుగా పనిచేస్తున్నాడు. అతని పేషెంట్లలో ఒకరైన ఒక  వృద్ధుడు హాస్పిటల్లో ఒక డాక్టర్ గురించి ఫిర్యాదు చేశాడు. అయితే అతనికి ఆ డాక్టర్ పేరు తెలియదు. హాస్పిటల్ సిబ్బంది ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులందరి ఫోటోలను అతనికి చూపించారు. అందులో ఇద్దరు డాక్టర్లకి బట్టతల వుంది. ఆ ఇద్దరిలో నా సోదరుడు కూడా ఒకడు. ఆ వృద్ధుడు నా సోదరుడి ఫోటోను చూపించి ఇతనేనని చెప్పడంతో నా సోదరుడిపై కేసు నమోదైంది. యు.ఎస్.ఏ. ప్రభుత్వపు కఠినమైన నిబంధనల వలన కేసు విచారణ జరిగేవరకు నా సోదరుడు తన వృత్తిని కొనసాగించడానికి వీలులేదు. అందువలన మేమంతా చాలా ఒత్తిడికి గురయ్యాము. అయితే, సాయి తన సహాయాన్ని అద్భుతరీతిన మాకందించారు.

ఒకరోజు నేనొక మేళాకు(జాతర) వెళ్ళాను. అక్కడ పాకలా నిర్మించబడివున్న సాయిమందిరం ఉంది. నేనప్పుడు లోపలికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నందున దూరంనుండే సాయిని ప్రార్థించుకుందామని అనుకున్నాను. నేను కళ్ళు మూసుకుని, "బాబా! తప్పుడు ఆరోపణల నుండి నా సోదరుడిని రక్షించండి" అని బాబాను ప్రార్థిస్తున్నాను. ఇంతలో ఒక స్త్రీ వెనుకనుండి నన్ను తట్టి, సాయిబాబా ఫోటో ఒకటి నాచేతికిచ్చింది. ఆ ఫోటోను చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిమీద "నేను మీతోనే ఉన్నాను, భయపడవద్దు" అని వ్రాసుంది. అది చదివి నా శరీరమంతా రోమాంచితమైంది. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి అనుభవాన్ని నేను చవిచూడలేదు. నేను దేనిగురించైతే ప్రార్థించానో దానికి సమాధానం ఆ ఫోటో ద్వారా ఇచ్చారు బాబా. దానితో నేను ఆయన నా సోదరుడిని ఖచ్చితంగా రక్షిస్తారని దృఢంగా విశ్వసించాను. తరువాత కోర్టు విచారణ ప్రారంభించకముందే ఆ వృద్ధుడు, నా సోదరుడు దోషి కాదని, తాను పొరబడ్డానని తెలియజేస్తూ కేసును వెనక్కి తీసుకున్నాడు. మా ఆనందానికి హద్దులు లేవు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/08/shirdi-sai-baba-miracles-part-2461.html

5 comments:

  1. Sri samartha sadgurusainath maharajuki jai

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏🌼❤😊

    ReplyDelete
  3. ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏
    ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo